Tuesday 13 June 2023

Muslim Social Project Concept & DPR

 

*ముస్లిం సోషల్ మీడియా ప్రాజెక్టు*


            ముస్లిం వ్యతిరేకత అనేది దాదాపుగా  నేటి సమస్త ప్రచార సాధనాల స్వభావంగా మారిపోయింది. భారత ప్రభుత్వం, దానితో ఆర్ధిక  ప్రయోజనాలున్న కార్పొరేట్లు, అధికార పార్టి అనుబంధ సంస్థలు, ప్రభుత్వ అండదండలున్న కొన్ని అరాచక బృందాలు ఇస్లామో ఫోబియాను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యవస్థీకృతంగా సంస్థాగతంగానూ, వ్యక్తిగత స్థాయిలోనూ సాగుతున్నది. 


            హిందువుల మనస్సులలో ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టుల  మీద ద్వేషాన్ని నింపడం ఈ ప్రచారానికి తక్ష్గణ లక్ష్యం. ముస్లిం, క్రైస్తవ, కమ్యూనిస్టు సమూహాల నుండి తమకు ముప్పు ఉందని భావించే స్థితికి హిందూసమాజాన్ని భయపెట్టడం దీని రెండవ లక్షణం. 2014 నుండి కేంద్రంలోవున్న ప్రభుత్వం హిందువుల రక్షకురాలు అని నమ్మించడం దీని మూడవ లక్ష్యం.   మధ్యయుగాల్లో సాంస్కృతికంగా, ధార్మికంగా హిందువుల మీద ముస్లిం పరిపాలకులు సాగించారనే ప్రచారంలోవున్న  దౌర్జన్యాలకు  ప్రతీకారం తీర్చుకుని హిందూరాజ్యాన్ని పునరుధ్ధరించే చారిత్రక కర్తవ్యాలను నరేంద్ర మోదీ-అమిత్ షాల ప్రభుత్వం నిర్వర్తిస్తున్నదని నమ్మించడం దీని నాలుగవ లక్ష్యం. ప్రజల్లో ఇలాంటి నమ్మకాలు ప్రబలితే  ఒకవైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను సులువుగా కప్పిపుచ్చవచ్చు. మరోవైపు, దేశసంపదను ప్రభుత్వం తనకు ఇష్టమయిన  కార్పొరేట్లకు కట్టబెట్టినా ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా వాళ్లను నిర్లిప్తంగా వుంచడానికి రక్షణ కవచంగా ఈ ప్రచారం పనికి వస్తుంది.  


            దేశంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా ముందు ముస్లింలనే దోషులుగా ప్రచారం చేస్తున్నారు. ఒక ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే దాన్నిమనుషుల మధ్య సహజంగా ఏర్పడే ప్రేమగా పరిగణించే రోజులు పోయాయి. మొత్తం ముస్లిం సమాజం ఏకమై ‘లవ్ జిహాద్’ కుట్రలతో హిందూ స్త్రీలను వలలో వేసుకుని వాళ్ళతో పిల్లల్ని కని ముస్లిం జనాభాను పెంచేసి దేశంలో హిందువులను మైనారిటీలుగా మార్చేయబోతున్నారు అనే స్తాయిలో భయోత్పాతాన్ని సృస్ఠిస్తున్నారు.   


            ముస్లింలు అంటే పరాయివాళ్ళు, ఆక్రమణదారులు, చొరబాటుదార్లు,  ఉద్రవాదులు, దేశద్రోహులు, పిల్లల్నికనడమే పనిగా పెట్టుకున్నవారు వగయిరా నేరేటివ్స్ ఇప్పుడు చాలా బలంగా ప్రచారంలో వున్నాయి. దీని ప్రభావం సమాజం మీద చాలా బలంగా వున్నది.  


            కొన్నేళ్ల క్రితం బొంబే డైయింగ్  అధినేత నస్లీవాడియా మీద హత్యాయత్నం జరిగింది. నస్లీవాడియా  స్వయాన మొహమ్మదాలీ జిన్నాకు మనవడు.  ఈ కుట్ర వెనుక హిందూ సామాజికవర్గానికి చెందినవారున్నారని వెలుగులోనికి వచ్చింది. దాన్ని ముస్లిం సమాజం వాణిజ్య వివాదంగానే చూసిందేతప్ప హిందూ సమాజం కూడబలుక్కుని చేసిన ధార్మిక దాడి అనుకోలేదు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో అలాంటి ఒక వాణిజ్య వివాదంలో ఓ హిందూ వ్యాపారీ చనిపోయాడు. దానితో ముస్లింలు ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోవాలని గ్రామ పెద్దలు తీర్మానించారు. మెజారిటి సమూహానికీ మైనారిటీ సమూహానికి తేడా అది. 


            సిఎఎ, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ ఒక ముస్లిం మహిళ ఢిల్లీ  షాహీన్ బాగ్ లో శాంతియుతంగా నిరసన  సాగిస్తుంటే ప్రభుత్వం సహించలేకపోయింది. జిహాద్ మొదలు అనేక నిందల్ని ఆమె మీద వేశారు. ఆమెకు మద్దతుగా నిలిచిన విశ్వవిద్యాలయ విద్యార్ధుల మీద  తీవ్ర నేరాలు మోపి కేసులు పెట్టారు.  


            ఇప్పుడు అన్యులు అనేమాట ముస్లింలకే పరిమితమైలేదు. కేంద్రప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకంగాని, పాలకుల వైఫల్యాల మీదగానీ  ఎవరు మాట్లాడినా వారంతా హిందూరాజ్య స్థాపనకు వ్యతిరేకుల కింద లెఖ్ఖ, రెండేళ్ల క్రితం రైతులు ఉద్యమిస్తే వాళ్లను ఖలిస్తానీలు అన్నారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళా పహిల్వాన్లు ఉద్యమిస్తుంటే వారి మీద వేయని నిందలు లేవు. నిరుద్యోగం పెరుగుతున్నదంటే వెనుక అర్బన్ నక్సలైట్లు వున్నారంటారు. ప్రభుత్వం మీద పల్లెత్తు మాట అన్నా ఒక నింద, ఒక కేసు ఖాయంలావుంది.  


            ఈ ప్రచారంలో అనేక విచిత్రాలు విడ్డూరాలు జరుగుతున్నాయి.  మన దేశంలో కొన్ని సమూహాలు ఆవుమాసం తినవు; కొన్ని సమూహాలు తింటాయి. ఇదొక చారిత్రక దశ. వ్యవసాయరంగంలో యంత్రాల ప్రవేశంతో  గిరాకీ పడిపోవడంతో ఆవుల రక్షణ కోసం కొన్ని జీవకారుణ్య సంఘాలు ఏర్పడడం మరో దశ.  గోరక్షణ మూకలు ఏర్పడి ఆవుమాసం తినేవారి మీద దాడులు చేయడం ఇంకో దశ.   గోరక్షణ మూకలు  ఆవుమాసం తినని వాళ్ల మీద కూడ దాడి చేయడం మరోదశ. ఇప్పుడు గోరక్షణ మూకలే ఆవుల్ని వధించి ఆ నేరాన్ని ముస్లింల మీద నెట్టడం కొత్త దశ.   


            ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ లో ముస్లింలు 2020 మార్చి నెలలో   సమావేశమై కోవిడ్ ను వ్యాప్తి చేయడానికి కుట్రపన్నారు అనే తీవ్ర ఆరోపణలతో భారీ ప్రచారం సాగింది. ఫేక్ వీడియోలతో సంఘ్ పరివార మీడియా చెలరేగిపోయింది. ముస్లింలను ‘సూపర్ స్ప్రెడర్స్’  అని నిందించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు  మర్కజ్  లో సమావేశమయిన వారందరినీ అరెస్టు చేశారు. కేసు నెలల తరబడి నడిచింది. “మర్కజ్ లో అరెస్టయిన వారికి చేయించిన వైద్యపరీక్షల్లో ఎంతమందికి కోవిడ్ సోకినట్టు తేలిందీ?” అని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అడిగారు.   “ఒక్కరూ లేరు? “  అని పోలీసులు సమాధానం ఇచ్చారు. కోవిడ్ సోకనివాళ్ళు ఇతరులకు ఎలా వ్యాప్తి చేస్తారూ? వాళ్లను సూపర్ స్ప్రెడర్లు అని ఎలా అంటారూ?” అంటూ న్యాయమూర్తి పోలీసులను మందలించి. నిందితుల్ని నిర్దోషులుగా తేల్చారు.  ఈ తీర్పుకు పెద్దగా ప్రచారం రాలేదు.  


            ఇటీవల జూన్ 2న ఒడిశా రాష్ట్రం బాలాసూర్ దగ్గర రైలు ప్రమాదం జరగినపుడు ప్రభుత్వం మూడు పనులు చేయాలి. ముందు; తక్షణ సహాయక, వైద్య చర్యలు మొదలెట్టాలి. మృతులు, క్షతగాత్రులకు నష్టపరిగారం ప్రకటించాలి. ఆ శాఖమంత్రిని నైతిక బాధ్యుడ్ని చేస్తూ పదవి నుండి తప్పించాలి. స్థానిక అధికారుల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. సాంకేతిక నిపుణుల బృందాల్ని పంపించి ప్రమాదానికి కారణాలను గుర్తించి శాశ్విత నివారణ చర్యలు చేపట్టాలి.  


            `కేంద్ర ప్రభుత్వం ఈ పనుల్ని చేపట్టడానికి ముందే మోడీ మీడియా మేల్కొంది. ముస్లిం కుట్ర కోణాన్ని ప్రచారంలో పెట్టేసింది. ప్రమాద స్థలికి సమీపంలోనే మసీదు వుందనీ, ఆ రోజు శుక్రవారం కనుక చాలామంది ముస్లింలు గుమిగూడి వున్నారనీ, ఆ పరిసరాల్లో మయన్మార్ నుండి శరణార్ధులుగా (చొరబాటుదార్లుగా) వచ్చిన రోహింగ్యాలు వుంటున్నారనీ. ఆ స్టేషన్ మాస్టారు ముస్లిం అనీ అతనిప్పుడు పరారీలో వున్నాడనీ ఇలా సాగింది ప్రచారం. కొందరు దీనికి ‘ట్రైన్ జిహాద్’ అనే పేరు పెట్టారు.  వీటితోపాటూ కోన్ని ఫేక్ వీడియోలు, ఫొటోలు రంగప్రవేశం చేశాయి. వీటిల్లో ఏ ఒక్కటీ నిజం కాదు అని తరువాత తేలినా ముస్లిం సమాజాన్ని చాలా విజయవంతంగా బోనెక్కించేశారు.   


            ఇటీవలి కాలంలో రైళ్ల సంఖ్య భారీగా  పెరిగింది. ట్రాక్ లనే కాక, సిగ్నలింగ్ వ్యవస్థను, సిబ్బందిని అతిగా వాడాల్సి వస్తున్నది. రైళ్ళు పెరిగినట్టుగా టెక్నాలజీ సిబ్బంది పెరగలేదు. సురక్షిత చర్యల కోసం కేటాయించిన నిధుల్ని కూడ ఖర్చుచేయడం లేదు.  


            నిజానికి ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కమీషనర్ ఆఫ్ రైల్వే సేప్టి (CRS)ని రంగంలో దించాలి. అది ప్రమాద కారణాలను గుర్తించడమేగాక, ప్రమాద నివారణ చర్యల్ని కూడ సూచిస్తుంది. అలా కాకుండ కేంద్ర  ప్రభుత్వం సిబిఐని రంగంలో దించింది. అంతకు ముందు ఇంకో ప్రమాదం జరిగినపుడు ఎన్ ఐ ఏ ను పంపించారు. ఇవి రెండూ సాంకేతిక సంస్థలు కాదు; నేర పరిశోధనా సంస్థలు. వీటిని రంగంలో దించడం ద్వారా కుట్ర సిధ్ధాంతానికి  పుకార్లకు వీలు కల్పించే  తీరుతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.    


             అంతే కాదు ముస్లింల మీద కొంచెం సహానుభూతితో వ్యవహరించే రాజకీయ పార్టీల మీదా ఇలాంటి దుష్ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యూయార్క్ పర్యటనలో వుండగా ఈ దుర్ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని ఒక బిజెపి నేత చర్చను దారి మళ్ళించారు. 


            ఇలాంటి సందర్భాలలోనే ముస్లింల గుడ్ విల్ ను పెంచి, ఫాసిస్టు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రత్యేక మీడియా కావాల్సిన అవసరం ముందుకు వస్తోంది. మీడియా అనగానే మనలో చాలా మందికి పెద్దపెద్ద కలలు వచ్చేస్తాయి. శాటిలైట్ న్యూస్ ఛానళ్ళు, కనీసం కేబుల్ టీవీలు వుండాలి అనుకుంటారు. పాపులర్ శాటిలైట్ ఛానల్ అంటే వందకోట్ల వ్యవహారం. అంత పెద్ద పెట్టుబడిని సమీకరించడమూ కష్టం; నిర్వహణ వ్యయాన్ని తట్టుకోవడమూ కష్టం. శాటిలైట్ న్యూస్ ఛానళ్ళు, కేబుల్ టీవీల్లో ఫిక్సిడ్ పాయింట్ ఛార్ట్ (FPC) ను సరిగ్గా అమలు చేయాలంటే రోజుకు కనీసం 16 గంటల కంటెట్ ను ఉత్పత్తి చేయాలి. ఆ కంటెంట్ డైన మిక్ గా వుండాలంటే సిబ్బంది, ఎక్యూప్ మెంట్ చాలాపెద్ద స్థాయిలో కావాలి. ఆ ఖర్చుల్ని తిరిగి రాబట్టుకోవడానికి అనేక తప్పుడు, అనైతిక విధానాలను చేపట్టాలి. శాటిలైట్ ఛానల్ తో పోలిస్తే కేబుల్ టీవీలో పెట్టుబడి తక్కువేగానీ అదీ పెద్దగా సామాజిక ఫలితాలను ఇవ్వదు. పైగా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్ల  డౌన్ లోడ్ వేగం పెరిగాక  కేబుల్ టీవిలు కనుమరుగైపోతున్నాయి. 


            సాంకేతిక అభివృధ్ధి అపారంగా పెరుగుతున్న రోజుల్లో. మనకు అనువైనది ఒక మంచి యూ-ట్యూబ్ ఛానల్.  ఆ కంటెంట్ ను ట్విట్టర్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, వాట్స్ యాప్ వగయిరా  సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిలోనూ వాడవచ్చు.


             హేట్-ముస్లిం, ఇస్లామో ఫోబియాలు కేవలం ముస్లింల సమస్య కాదు. ఇప్పుడది కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చనివారందరి సమస్య. దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలి. దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ మీడియా కావాలి. పిల్లి మెడలో గంట కట్టాల్సిన బాధ్యత ముస్లింలదే; భారతీయ ఫాసిజానికి ప్రధాన బాధితులు వారే గాబట్టి.


            ఇది అచ్చంగా ముస్లింల ఛానల్ కాదు.  ముస్లింలతోపాటూ, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులు, పౌరహక్కులవాళ్ళు తదితరులందరూ పెట్టుబడిలో కాకపోయినా వ్యూవర్స్ సంఖ్యను పెంచడంలో తప్పక సహకరిస్తారు. సామాజిక ప్రయోజనం కోసం నడిపిస్తున్న ఛానల్ కనుక దీని  నుండి సాధారణంగా రెవెన్యూను ఆశించరాదు. ఎప్పుడైనా కమ్మర్షియల్ ప్రమోషనల్ యాడ్ వస్తే వస్తే దాన్ని బోనస్ గా భావించాలి. 


అహ్మద్ మొహిద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)

కన్వీనర్,  ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)  

12 జూన్ 2023









No comments:

Post a Comment