Friday 9 June 2023

Game play of Economic Policies of Babu and Jagan In AP Politics

 Game play of Economic Policies of Babu and Jagan In AP Politics

ఏపీలో జగన్ చంద్రబాబు ఆర్ధిక విధానాల దోబూచులాటలు

- ఖాన్ యజ్దానీ (డానీ) 

 

ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ (అప్పట్లో గ్యాట్)ల ప్రభావంతో మనదేశంలో 1990ల ఆరంభంలో పివి నరసింహారావు హయాంలో సరళీకృత ఆర్ధిక విధానం ప్రవేశించింది. అప్పటి ఆర్ధికమంత్రి మన్మోహన్ సింగ్ దీని రూపశిల్పి. కార్పొరేట్లను ఉదారంగా ప్రొత్సహిస్తే ఆర్ధిక వ్యవస్థ కాంతి వేగంతో పరుగులు తీస్తుందని ఈ సిధ్ధాంతం చెపుతుంది. మరి సామాన్యుల సంగతి ఏమిటీ? అని అడిగితే కార్పొరేట్లు సామాజిక బాధ్యత  (Corporate Social Responsibility CSR)తో వ్యవహరించి తమ లాభాల  నుండి కొంత మొత్తాన్ని పేదలకు కేటాయించి సమాజంలో  ఆర్దిక వ్యత్యాసాలను  తగ్గిస్తారని నమ్మబలుకుతుంది.  

 

కార్పొరేట్ల సామాజిక బాధ్యత  అనేది నేరుగా కమ్యూనిజాన్నీ ఎదుర్కోవడానికి రూపొందించిన కార్యక్రమం. కార్పొరేట్లు పివి-మన్మోహన్ సింగ్ చెప్పినంత వితరణశీలురు, ఉదారులు కాదు. దానితో ఆర్ధికరంగంలో  వ్యత్యాసాలు పెరిగిపోయాయి. ఆర్ధికరంగ సంక్షోభం అక్కడికే పరిమితంకాదు. దాని ప్రభావం సామాజిక రంగం మీద పడుతుంది. అది సామాజిక అశాంతి, విద్వేషాలకు దారితీస్తుంది.   

 

            ఈ నేపథ్యంలోనే ఆర్ధికరంగంలో ఆర్థిక వృద్ధి (Growth), ఆర్ధిక అభివృద్ధి (Development) అనే రెండు విభాగాలు  ఏర్పడ్డాయి. ఆర్థిక వృద్ధి సంపద పరిమాణాత్మక పెరుగుదలపై  మాత్రమే దృష్టి పెడుతుంది. ఆర్ధిక అభివృద్ధి అనేది ఆర్థిక వృద్ధికి మించి అనేక సూచికల్ని కలిగివుంటుంది.  జీవన ప్రమాణాలు, ఆదాయ పంపిణీ, పేదరికం తగ్గింపు, విద్య ఆరోగ్య సంరక్షణ సామాజిక పురోగతిలో మెరుగుదలలను పట్టించుకుంటుంది.

 

            ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఆర్థిక వృద్ధి, ఆర్ధిక అభివృద్ధి ధోరణుల్ని సులువుగా చూడవచ్చు. తెలుగుదేశం పార్టి అధినేత  నారా చంద్రబాబు నాయుడుది ప్రధానంగా ఆర్థిక వృద్ధి విధానం. వైయస్ జగన్ మోహన రెడ్డిది ప్రధానంగా ఆర్ధిక అభివృధ్ధి విధానం. ప్రధానంగా అంటే అదొక్కటే వుంటుందని కాదు. రెండోది కూడ వుంటుందిగానీ తక్కువ ప్రాధాన్యంలో వుంటుంది.

 

            1990ల రెండవ భాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఐటి పరిశ్రమకు భారీగా గిరాకీ వచ్చింది. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో పట్టభద్రులు కాకపోయినా  సి, సి -ప్లస్ వంటి ఎలక్ట్రానిక్స్ భాషలు వచ్చినా ఉద్యోగం ఇచ్చేసేవారు.  బెంగలూరు, హైదరాబాద్, పూనా, ముంబాయి, నోయిడ, చెన్నై, కోల్ కటా నగరాలు ఐటి హబ్ లుగా మారాయి. ఆ సమయంలో ఏపి ముఖ్యమంత్రిగావున్న చంద్రబాబుకు ఈ పరిణామాలు గొప్పగా  కలిసివచ్చాయి. ఆయన నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో పరిస్థితి తారుమారయింది. ఇప్పుడు మన నిరుద్యోగుల్లో అత్యధికులు ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్!

 

            హైదరాబాద్ ను తాను అభివృధ్ధి చేసినట్టు చంద్రబాబు తరచూ చెపుతుంటారు. ఇందులో కొంత వాస్తవంలేకపోలేదు; కానీ బోలెడు అతిశయోక్తి కూడ వుంది. హైదరాబాద్ శతాబ్దాలుగానే ప్రపంచ మహానగరాల్లో ఒకటి. హైదరాబాద్ లో హైటెక్ సిటి ఒక చిన్న భాగం.

 

            ఆర్ధిక వృధ్ధి విధానాలకు ప్రజలు ముగ్దులవుతున్నారని చంద్రబాబు. భావించేవారు. నూతన ఆర్ధిక విధానాలకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునేవారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార సారధి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఇస్తానని వాగ్దానం చేశారు. చార్జీలను పెంచినా నాణ్యమైన విద్యుత్ ను ఇస్తున్నందుకు ప్రజలు తనను బలపరుస్తారని చంద్రబాబు చాలా గట్టిగా నమ్మేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఇవ్వడం కుదరదని ఖరాఖండిగా చెప్పేవారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడమేగాక, హైదరాబాద్ నగర పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో చంద్రబాబు టిడిపి ఘోరంగా ఓడిపోయింది. హైటెక్ సిటీవున్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో పట్టణాభివృధ్ధి శాఖామంత్రి కూడ ఓడిపోయారు.

 

            2009 ఎన్నికల్లో చంద్రబాబు ఆర్ధిక వృధ్ధి విధానాలను వదిలిపెట్టి అన్నింటినీ ఉచితంగా ఇస్తానంటూ కొత్త పాట మొదలెట్టారు. అప్పుడు ఆయన్ని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవగా ‘ఆల్ ఫ్రీ బాబు’ అనేవారు. ఆ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలతో టిడిపి పొత్తు పెట్టుకుంది. అయినా ఓటమి తప్పలేదు. జనం వారిని నమ్మలేదు.    

 

            ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక రైతు రుణ మాఫి వాగ్దానం చాలాబాగా పనిచేసింది.  ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గు చూపారు. వారు మాత్రం బిజెపి, జనసేనలతో పొత్తు కారణంగా తాను గెలిచినట్టు భావించారు. రైతు రుణ మాఫి వాగ్దానాన్ని సగం నెరవేర్చి సగం పక్కన పెట్టేశారు. సంపద పెంచుతాను, అమరావతి, పోలవరం అంటూ  మళ్ళీ ఆర్ధిక వృధ్ధి పాట అందుకున్నారు. చంద్రబాబు ఆర్ధిక వృధ్ధి విధానాల మీద ప్రజలు తమ తీర్పు చెప్పారు. 175 సీట్లలో 23 స్థానాలకు పరిమితం చేశారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో, అమరావతి గ్రామాల్లో, నవ్యాంధ్రా హైటెక్ సిటీగా భావించిన మంగళగిరిలో టిడిపి  ఓడిపోయింది. వృధ్ధి ఆర్ధిక విధానాలకు ఇదొక సంకేతం.

 

            జగన్ కత వేరు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అనుకూలమే అయినా రాష్ట్రంలో పొత్తులకు ఆయన వ్యతిరేకం. నవరత్నాలు సంక్షేమ పథకాల  లబ్దిదారులు తనను మళ్ళీ గెలిపిస్తారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఒకవిధంగా ఈ లెఖ్ఖ కరెక్టే. అది ఆర్ధిక అభివృధ్ధి విధానం కూడ. అయితే ఇందులో కూడ ఇబ్బందులున్నాయి. బయోమెట్రిక్ సమస్యలున్నాయి. కంప్యూటర్లు మొరాయిస్తున్నాయి. సర్వర్లు డౌన్ అవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో డిజిటల్ అసెస్టెంట్లు లేరు. కొన్ని చోట్ల  పాతవాళ్ల పాస్ వర్డులు కొత్తవాళ్లకు తెలీవు. వీటికి తోడు గ్రామ/వార్డు సచీవాలయాల్లో రాజకీయ పక్షపాతం కూడా పొడ చూపుతోంది.  ఒక సమస్య తలెత్తితే దాన్ని మాన్యువల్ గా పరిష్కరించే యంత్రాంగంలేదు.

 

            ఒక నిర్దిష్ట కేసును చర్చిద్దాము. పేదరైతులకు ఉచిత బోర్లు వేయించాలని జలకళ పథకాన్ని రూపొందించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఓ చిన్న గ్రామానికి చెందిన ఒక మహిళా రైతు ఉచిత బోరు కోసం 2021లో దరఖాస్తు చేసుకుంది. అప్లికేషన్ అప్ లోడు కాలేదు. ఆమె ఆధార్ కార్డులో తెలంగాణ చిరునామ వుంది కనుక సిస్టమ్ స్వీకరించడం లేదన్నారు. ముఖ్యమంత్రి ‘స్పందన’కు పిర్యాదు చేస్తే ఇతర రాష్ట్రాల్లో ఆధార్ కార్డు వుంటే ఈ రాష్ట్రంలో రాయితీ ఎలా అడుగుతారని గడుసుగా ఎదురు ప్రశ్న వేశారు. అలా చట్టంలో వుండే అవకాషంలేదు.  టోల్ ఫ్రీ కాల్ సెంటర్ లో ఫోన్ ఎత్తిన వారే చట్టాలకు తమ ఇష్టం వచ్చినట్టు సవరణలు చేసేస్తుంటారు. వాళ్లు చెప్పినట్టు. ఆమె ఆధార్ కార్డును విజయవాడ అడ్రసుకు మార్చుకుంది. అప్పుడూ  అప్ లోడ్ కాలేదు. పొలం వున్న గ్రామంలోని చిరునామాతో ఆధార్ కార్డు వుండాలని కొత్త షరతు పెట్టారు. ఈ వ్యవహారం ఎంఆర్ వో, ఎంపిడివో, విజయవాడలోని విలేజ్/ వార్డు సెక్రటేరియట్ల కేంద్ర కార్యాలం వరకు వెళ్ళింది. ఇలా రెండేళ్ళు గడిచిపోయాయి. చివరకు డిఆర్వో తేల్చి చెప్పిందేమంటే జలకళ పథకంలొ బోరు పొందాలంటే కనీసం 2 ఎకరాల 50 సెంట్ల భూమి వుండాలి.  ఆమెకు 2 ఎకరాల 49 సెంట్ల భూమి వుంది. ఒక్క సెంటుకాదుకదా ఒక్క గజం తగ్గినా వెబ్ సైట్లు ఒప్పుకోవు అని ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చారు.  

 

            ఒక్క సెంటు భూమికి మినహాయింపు ఇవ్వలేరా? అంటే ఈ విషయంలో గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్, స్థానిక ఎమ్మెల్వే, జిల్లామంత్రి, వ్యవవసాయశాఖామంత్రి కూడ ఏమీచేయలేరు. ఈ ముక్క ముందే చెప్పేస్తే రెండేళ్ళ ఆతృత తగ్గేది. కుత్రిమ మేధ (ఏఐ)  ఏపిలో అప్పుడే పనిచేస్తోంది. అప్పుడు ప్రాతినిధ్య  ప్రజాస్వామిక ప్రక్రియకు అర్ధం లేదు. అన్నీ కంప్యూటర్లు తేల్చేస్తాయి. వృధ్ధాప్యం కారణంగా వేలి ముద్రలు అరిగిపొతే పెన్షన్లు రద్దు చేసేస్తాయి. రాష్ట్రంలో బయోమెట్రిక్  బాధితుల సంఖ్య తక్కుగా ఏమీలేదు. ఇదొక యంత్రస్వామ్యం.  దీని అర్ధం ఏమంటే జగన్ విపరీతంగా ఆసక్తి చూపుతున్న  నవరత్నాలు ఓటు బ్యాంకులో కూడ  అసంతృప్తి మొలకెత్తింది. జగన్ కు అంతగా ఆసక్తిలేని నవరత్నాలేతర విభాగాల్లో ఎలాగూ అసంతృప్తి వుంటుంది. ఆ విషయం జగన్ కూ తెలుసు.

 

            ఏపిలో చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశం ఏమంటే మార్కెట్ చాలా మందకొడిగా మారిపోయింది. ప్రజల్లో కొనుగోలు ఉత్సాహం తగ్గిపోవడమేకాక రూపాయి ఖర్చుపెట్టాలంటే భయం వేస్తున్నది. ప్రజల్లో అత్మస్థైర్యాన్ని కొలవడానికి ఆర్ధికవేత్తలు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక సూచికగా పరిగణిస్తారు. ఏపిలో భవన నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. భవన నిర్మాణరంగం అంటే అందులో ఓ 20 వృత్తులుంటాయి, ఇంకో 20 వ్యాపారాలుంటాయి.

 

            ఎన్నికల సంవత్సరంలో ప్రవేశించడంతో ఇటు జగన్ అటు చంద్రబాబు కూడ గెలుపు అవకాశాల సమీక్షల్లో పడ్డారు. మొత్తం రెవెన్యూను జగన్ నవరత్నాల మీద ఖర్చుపెట్టి రాష్ట్ర వృధ్ధిని అటక ఎక్కించారని ఇన్నాళ్ళూ విమర్శిస్తూవచ్చిన చంద్రబాబు రాజమండ్రి మహానాడులో పేదలు, మహిళలకు అనేక ఉచితాలు ప్రకటించారు. ఇవి ఇప్పటి  నవరత్నాలుకు అదనం అన్నమాట.

 

            నవరత్నాలు ఓటు బ్యాంకులో ఏర్పడుతున్న లోటును పూరించుకోవడానికి జగన్ కూడ ఇప్పుడు ఆర్ధిక వృధ్ధి మీద దృష్టి పెట్టాల్సి వుంటుంది. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని నిర్మాణం, రోడ్ల మరమ్మతులు చేపట్టడం వీటిలో తొలి ప్రాధాన్యతలు కావచ్చు.

 

            చివరి పాదంలో  వచ్చిన ఈ మార్పులు ఇంత తక్కువ కాలంలో ఎలాంటి ఫలితాలు  ఇస్తాయో చూడాలి.

 

(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు.)

9010757776

 హైదరాబాద్

8 జూన్ 2023

ప్రచురణ :

No comments:

Post a Comment