Abortion Case in Gujarat High Court & Manu Smriti
నడవాల్సింది మన ధర్మమా? మనుధర్మమా?
గర్భస్రావం చట్టబధ్ధమో కాదో న్యాయస్థానాలు తేల్చి
చెప్పెస్తే చాలు. దానికి మనుస్మృతిని, జ్యోతిష్యాన్నీ ఆశ్రయించడం అంటే ప్రజాస్వామిక
రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే! గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సమీర్ దావె ఒక
విడ్డూరానికి పాల్పడితే అలహాబాద్ హైకోర్టు ఇంకో విడ్డూరానికి పాల్పడింది. రెండు కేసుల్లోనూ
పిర్యాదిదారులు అత్యాచారానికి గురైన బాధితులు కావడం విశేషం.
భారత రాజ్యాంగపు 1949 నాటి మూల ప్రతి ప్రవేశికలో
సర్వమతసామరస్యం, సామ్యవాదం అనే ఆదర్శాలు స్పష్టంగా లేని మాట వాస్తవం. ప్రజాస్వామ్యం అనే ఆదర్శం మాత్రమే
స్పష్టంగా వుంది. దానికి వివరణ ఇస్తూ న్యాయం, స్వేఛ్ఛా సమానత్వం, సోదరభావం అనే నాలుగు
ఉప ఆదర్శాలున్నాయి. సోదరభావంలో సర్వమతసామరస్యం, సమానత్వంలో సామ్యవాదం ఎలాగూ వున్నాయి.
1977లో మరింత స్పష్టత కోసం మతసామరస్యం, సామ్యవాదంలను
చేర్చారు.
భారతీయ జనతా పార్టికి, దానికి పూర్వికులయిన జనసంఘ్,
హిందూమహాసభలకు వీటికి తాత్విక గురువు అయిన రాష్ట్రీయ స్వయం సంఘ్ కు ప్రాధమికంగా ప్రజాస్వామ్యం
అంటే పడదు.
రాజ్యాంగ సభ 1949 నవంబరు 26 భారత రాజ్యాంగాన్ని
ఆమోదించిన రోజు నుండే దానిమీద మనువాదులు దాడిని ఆరంభించారు. ఆరెస్సెస్ అధికార పత్రిక
‘ఆర్గనైజర్’ నవంబరు 30, 1949 నాటి సంచికలో
మనుస్మృతిని కొనియాడుతూ, రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ప్రధాన వ్యాసాన్ని ప్రచురించింది.
“పురాతన కాలంలోనే భారత గడ్డ మీద పుట్టిన ఒక గొప్ప దార్శినికునిగా, న్యాయవేత్తగా మనువును
ప్రపంచం మొత్తం కొనియాడుతోంది. ఆయన రూపొందించిన స్మృతి సూత్రాలు అందరి మన్ననలు పొందుతున్నాయి.
ఇవేవీ మన రాజ్యాంగ పండితులకు పట్టలేదు” అంటూ అక్కసు వెళ్ళ గక్కింది.
1950 జనవరి 26నుండి కొత్త రాజ్యాంగం అమల్లోనికి
వచ్చాక రాజ్యాంగ రచనా విభాగం అధ్యక్షుడు బిఆర్ అంబేడ్కర్ బొంబాయిలో ఓ సభలో మాట్లాడుతూ
భారత సమాజంలో మనువుయుగం అంతరించి ఒక ప్రజాస్వామికయుగం అరంభమయింది అన్నారు. అంబేడ్కర్
ను తీవ్రంగా ఖండిస్తూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి శంకర్ సుబ్బ అయ్యర్ 1950 ఫిబ్రవరి 6 నాటి ఆర్గనైజర్ సంచికలో ‘మనువు మన
హృదయాలను ఏలుతునే వుంటాడు’ శీర్షికతో ఒక వ్యాసం
రాశారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హిందూ సమాజం మనుస్మృతినే అనుసరిస్తుందని అందులో
ఘనంగా ప్రకటించారు.
సంఘపరివారం గురూజీగా భావించే ఎంఎస్ గోల్వార్కర్
1966 నాటి తన గ్రంధం ‘బంచ్ ఆఫ్ థాట్స్‘ లో నాలుగు అంతస్తుల చాతుర్వర్ణ వ్యవస్థే ఈ ప్రపంచంలో
మహత్తర సామాజిక ఏర్పాటు అంటారు. ప్రతి అంతస్తులోని వారికి నిర్దిష్ట బాధ్యతలు హక్కుల్ని
మనువు చాలా స్పష్టంగా నిర్వచించాడు అంటారు. ఎవరి హక్కుల్ని వారు ఆస్వాదిస్తూ, ఎవరి బాధ్యతల్ని
వారు నిర్వర్తిస్తుంటే సమాజశాంతి కొనసాగుతుందంటారు.
అప్పటి నుండి సంఘపరివారం ప్రముఖులు వీలు దొరికినప్పుడెల్లా
ఇప్పటి రాజ్యాంగాన్ని తొలగించి మనుస్మృతిని కొత్త రాజ్యాంగంగా ప్రకటిస్తాము అంటుంటారు.
నరేంద్ర మోదీజీ ప్రధానమంత్రి అయ్యాక ఇలాంటి ప్రకటనలు పెరిగాయి. ఎన్నికల్లో సాంప్రదాయ
హిందువుల్ని ఆకర్షించడానికి దాన్నొక అనధికార
ఎన్నికల వాగ్దానంగా కూడ ప్రయోగిస్తున్నారు. ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మనుస్మృతి
కూడ ఒక అంశం అయింది.
ఇక కోర్టు కేసుల విషయానికి వస్తే, ఉత్తర ప్రదేశ్
అలహాబాద్ లో ఒక మ్యారేజ్ బ్యూరో ద్వార ఓ అబ్బాయి అమ్మాయి పరిచయం అయ్యారు. పెళ్ళి సాకుతో
అతను ఆమె మీద అత్యాచారం చేశాడు. ఆమె తక్షణం పెళ్ళి చేసుకోమంది. అతను కుదరదన్నాడు. ఆమె
కేసు వేసింది. అత్యాచారం
నేరం కింద అరెస్టు చేశారు. హైకోర్టులో బెయిల్ విచారణ సందర్భంగా మంగళదోషం వున్నామెను
పెళ్లాడితే తనకు తీవ్ర అనారోగ్యం, ఆర్థిక సమస్యలు వచ్చిపడతాయని వాదించాడు. అత్యాచారం బాధితురాలికి మంగళదోషం వుందో లేదో
15 రోజుల్లో తేల్చాలంటూ లక్నో విశ్వవిద్యాలయంలోని జ్యోతిషశాస్త్ర విభాగాన్ని కోరుతూ
అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
అలహాబాద్ హైకోర్టు నిర్వాకాన్ని మీడియాలో చూసి
సుప్రీంకోర్టు నివ్వెర పోయింది. జస్టిస్ సుధాన్షు
ధులియా, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన సుప్రీకోర్టు వెకేషన్ బెంచ్ జూన్ 3న తనంతట తాను (సుమోటో)గా కేసును స్వీకరించి విచారించింది.
అలహాబాద్ హైకోర్టు ఆర్డర్ “పూర్తిగా అసందర్భంగా” ఉందని గమనించింది. సొలిసిటర్ జనరల్
తుషార్ మెహతా కూడ హైకోర్టు ఆదేశాలు తనను కలవర పెడుతున్నాయి అనడం విశేషం. నిందితుల తరఫు
న్యాయవాది అజయ్ కుమార్ సింగ్ మాత్రం “జ్యోతిష్యం ఒక విజ్ఞానశాస్త్రం; అనేక విశ్వవిద్యాలయాలలో దీనిని ఒక శాస్త్రంగా బోధిస్తున్న
విషయాన్ని న్యాయస్థానం గమనించాలని కోరారు. అంతిమంగా, లక్నో విశ్వవిద్యాలయంలోని జ్యోతిషశాస్త్ర
విభాగానికి అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మీద సుప్రీంకోర్టు స్టే విధించింది.
అహ్మదాబాద్ హైకోర్టులో ఇంకో విచిత్రం జరిగింది.
ఇది కూడ అత్యాచారం బాధితురాలి కేసే. ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. గర్భం ఆరునెలలు దాటితే గర్భస్రావానికి డాక్టర్లు
కోర్టు అనుమతి తీసుకోవాలి. బాధితురాలి తండ్రి గర్భస్రావానికి అనుమతి ఇమ్మంటూ హైకోర్టును
ఆశ్రయించాడు.
బాధితురాలి పక్షాన వాదిస్తున్న అడ్వకేట్ సికందర్
సయ్యద్ అమెకు ఇంకా 17 సంవత్సరాలు కూడా నిండలేదనీ, ప్రసవించి బిడ్డను సాకే శారీరక మానసిక
ఆరోగ్యం లేదనీ, సమాజం కూడ సానుకూలంగా లేదని
కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ సమీర్ దావె గర్భస్రావానికి
ససేమిర అన్నారు. తల్లీ, గర్భశిశువుల అరోగ్యస్థితి మీద ఒక నివేదికను సమర్పించాలని ఆసుపత్రి
నిర్వాహకులను ఆదేశించారు. అలాగే గర్భిణి మానసిక
స్థితి మీద కూడ ప్రత్యేక వైద్య నివేదికను సమర్పించాలన్నారు.
జస్టిస్ సమీర్ దావె అక్కడితో సరిపుచ్చితే బాగుండేది. కానీ, కోర్టులో వారొక ప్రవచనకర్తగా మారిపోయారు. “పురుషులకన్నా స్త్రీలు ఇలాంటివి సులువుగా తట్టుకోగలరు.
స్త్రీలు పధ్నాలుగేళ్లకే పెళ్ళిచేసుకోవాలనీ 17 ఏళ్ళు రాకముందే తల్లి కావాలని మనుస్మృతిలో
చెప్పారు. మనదేశంలో ఇది సాంప్రదాయం. ఇది 21వ శతాబ్దం కనుక మనం ఇలాంటివి చదవం. తెలుసుకోం.
మీరు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మనో, అమ్మమ్మనో అడగండి వాళ్ళకు పెళ్ళి ఏ వయసులో అయిందో
చెపుతారు” అన్నారు. ఈ మొత్తం ప్రొసీడింగ్స్ ని బార్ అండ్ బెంచ్ నమోదు చేసింది.
దాదాపు అన్ని మత సమూహాల్లోనూ మధ్యయుగాల్లో, అంతకు
పూర్వ కాలాల్లో పిన్న వయస్సులోనే వివాహాలు జరిగేవి. బాధితురాలి పక్షాన అడ్వకేట్ గా
వున్న సికందర్ సయ్యద్ కూడ గతంలో ముస్లిం సమాజంలోనూ
13 సంవత్సరాల వయసులోనే వివాహాలు చేసేవారని చెప్పడం ఈ కేసులో కొస మెరుపు. ఆధునిక అవసరాలను
బట్టి ఆధునిక విలువలు చట్టాలు వస్తాయి. వాటిని పాటించక తప్పదు.
ఏయం ఖాన్ యజ్దానీ (ఉషా
ఎస్ డానీ)
రచయిత
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు)
9010757776
https://epaper.sakshi.com/Home/FullPage?eid=99&edate=13/06/2023&pgid=180150
No comments:
Post a Comment