Friday, 23 June 2023

Who Controls the Artificial Intelligence

 Who Controls the Artificial Intelligence 

కృత్రిమ మేధ ఎవరి మాట వింటుంది?

-      డానీ 

పెను ప్రమాదాలు, గొప్ప ఆశల చారిత్రక సంధి సమయాల్లో మనుషులు తమనూ, తమ చుట్టూవున్న ప్రపంచాన్నీ అర్ధంచేసుకోవడానికి ఒకే సందర్భంలో విషాదాన్నీ ప్రహసనాన్నీ ఆస్వాదించాల్సి వస్తుంది.  గతం  పోయి కొత్తది వస్తున్న ప్రతి సందర్భంలోనూ వ్యక్తిగతంగా మనుషులు, సామూహికంగా సమాజం ఇలాంటి భావోద్వేగానికి గురికాక తప్పదు.

          కుత్రిమ మేధ / ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్ (ఏఐ) ప్రయోజనాలు ప్రమాదాల గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. కొందరు దీనిని సాంకేతిక సమస్యగా చూస్తుంటే, మరి కొందరు సామాజిక సంక్షోభంగా చూస్తున్నారు. నేను సమాజం నుండి సాంకేతిక రంగ అభివృధ్ధిని  చూడాలనుకునేవారి  కోవకు చెందుతాను.

ప్రకృతిలో ప్రతి జీవి సంతతిని కని  ఆహార సేకరణతో జాతిజీవికను  కాపాడుకుంటుంటుంది. మనిషి అదనంగా ఇంకో పని  చేస్తాడు. జాతి జీవికను కొనసాగించడానికి ఆహారోత్పత్తిని చేపడతాడు. దానికోసం  పనిముట్లను  తయారు  చేస్తాడు. “పనిముట్లను తయారు చేసే జీవి మనిషి” అన్నాడు బెంజామిన్ ఫ్రాంక్లిన్. అంతేకాదు తన శారీరక - మేధో శ్రమల్ని తగ్గించుకోవడానికి, సౌఖ్యాలను ఆస్వాదించడానికీ మనిషి నిరంతరం కొత్తకొత్త  యంత్రాలను  కనిపెడుతూనే వుంటాడు.  

మొదటి తరం  యంత్రాలు బాహ్యదహన  యంత్రాలు. వీటి పనితీరు  అందరికి సులువుగా అర్ధం అవుతుంది. రెండోతరంవి అంతర్థహన యంత్రాలు. వీటి పనితీరును అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం. మూడోతరం  యంత్రాలు మార్మికమైనవి వీటి పనితీరును   తెలుసుకోవడం  చాలా కష్టం.  ఆ తరువాత నిరంతరంగా ఒకదానిని మించిన మార్మికతతో అనేక  యంత్రాలు పుట్టుకొస్తూనే వున్నాయి.  

యంత్రాలనేవి ప్రమాదాలతో పాటే వస్తాయి. రైలు  ప్రమాదాలు బస్సు ప్రమాదాలు రసాయానిక  అణు ప్రమాదాలు కూడ మనకు  తెలుసు. వాటి ప్రయోజనాలతో  పోలిస్తే నష్టలు  తక్కువే అనే నమ్మకంతోనే మానవజాతి  యంత్ర పరిశోధనలు కొనసాగిస్తూ వుంటుంది. అందుకు విరుధ్ధంగా  ప్రయోజనాలకన్నా  ప్రమాదాలే  ఎక్కువగా వుండే యంత్రాలను ఎవరయినా ఎందుకు తయారు చేస్తారూ?  అనేది  ఎవరికయినా  రావలసిన సందేహం.

పది శాతం లాభం కోసం పెట్టుబడీదారుడు ఉరికంభం ఎక్కడానికి కూడ సిధ్ధపడతాడు అంటాడు ఓ సందర్భంలో కార్ల్ మార్క్స్. ఆ క్రమంలో అతను తానే అదుపుచేయలేని భూతాల్ని కూడా సృషిస్తాడు. సమాజంలో పెరుగుతున్న మృత సంస్కృతి కూడ ఇలాంటి ప్రమాదకర ఆవిష్కరణలకు ఒక డిమాండ్ ను సృష్టిస్తోంది.

జాతియోద్యమమైనా కమ్యూనిస్టు ఉద్యమమైనా ఇటీవలి  కాలపు  తెలంగాణ  ఉద్యమమైనా తమ ప్రకటిత  మహత్తర ఆదర్శాలను  సాధించాయా  లేదా అన్నది సందేహమే. అయితే, ఆ ఉద్యమాలు గమ్యానికి చేరకపోయినా వాటి గమన దశలో వికసించిన సంఘీభావం మహాత్తరమైనది. ఆ కాలంలో ఉద్యమ కార్యకర్తలు, అభిమానుల  మధ్య సంఘీభావం చాలా ఉన్నత   స్థాయిలో వుండింది. అదొక  అద్భుత సాంఘిక  రసాయన  చర్య. సంఘీభావాన్ని సులువైన  మాటల్లో చెప్పాలంటే సాటి  మనిషి  కుంగిపోయినపుడు ధైర్యం  చెప్పడం. నిరుత్సాహ పడినప్పుడు ఉత్సాహపరచడం, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నపుడు తోడుగా వుండడం, ఒక్కరి కోసం అందరూ నిలవడం; అందరి  కోసం ఒక్కడు బలిదానానికి (Altruistic Suicide) సిద్ధపడడం.

సంఘీభావ లక్షణాలన్నీ కొన్నేళ్ళుగా మన సమాజంలో నుండి అదృశ్యం అయిపోవడం మొదలెట్టాయి. ఈ దశను వివరించడానికి పోస్ట్ - మోడర్నిజం, పోస్ట్- సోషలిజం, పోస్ట్- మార్క్సిజం తదితర సంయుక్త పదాలను కొందరు  వాడుతున్నారు. అవేవి సరైన  వ్యక్తికరణలు కావు. మనం  ఆధునికతను,  సామ్యవాదాన్ని  ఇంకా అస్వాదించనేలేదు. అలాంటప్పుడు ‘అనంతర’ అనే మాటలకు  అర్ధంలేదు. దీనిని ద్రవాధునిక (liquid modernity) దశ అని జిగ్మోంటె బౌమన్ ఓ కొత్త పేరు పెట్టారు.  దీనిని పెట్టుబడిదారి వృద్ధదశ (late-stage capitalism) అనేవారూ వున్నారు. ఈదశలో మనుషులు ముఖ్యంగా శ్రామికులు (proletariat) మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని స్థితిలో (precarious) బతుకుతుంటారు. ఈ రెండు పదాలను కలిపి ఇప్పుడు Precariat అంటున్నారు. మనం తెలుగులో ‘అస్థిర శ్రామికులు’ అనుకోవచ్చు.  నిజానికి దీనిని పెట్టుబడిదారి భ్రష్టదశ  అనడం బాగుంటుంది.

పెట్టుబడిదారి భ్రష్ట  దశలో మృతసంస్కృతి పెచ్చరిల్లుతుంది. మనిషి  మనిషి  కాకుండా పోతాడు. ఆర్ధిక రంగంలో విపరీతమైన సంపద యావ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ముసుగులో రాజకీయరంగంలో రాజదండంతోసహా రాచరికాన్ని  మించిన అధికార కేంద్రీకరణ, సామాజిక రంగంలో   విద్వేషాలు పెరిగిపోతాయి.

ఈ భ్రష్ట  దశలో లోపల బయట కూడ  మనుషుల్లోని  మనిషితనం  అంతరించిపోతుంది. మనిషితనాన్ని  కోల్పోయిన మనుషులు అనేక  వికృత  చేష్టలు  చేస్తారు. ఇప్పటి వరకు రక్తపోటు, డయాబేటిక్, నిద్రలేమి (insomnia) తదితరాలను  మనం జీవనశైలి  వ్యాధులు అంటున్నాం. ఇప్పుడు ఈ జాబితాలో డిజిటల్ మీద ఆధారపడడం  (Digital Dependency) అనే  కొత్త వ్యాధి కూడ చేరింది. సెల్ ఫోన్ మన శరీర అవయవాల్లో ఒకటయిపోయింది.

కేవలం  రెండు అక్షరాల బైనరీ భాషతో, ఎలక్ట్రాన్లు ఒకే దిశలో స్థిరంగా ప్రవహించే ప్రత్యక్ష విద్యుత్తుతో డిజిటల్ టెక్నాలజీ పనిచేస్తుంది. గతంలో మనం మహత్తరమైనవిగా భావించే పనుల్ని ఇది అవలీలగా సెకన్లలో చేసి పెట్టేస్తుంది. ఒక ఫొటో ఇచ్చి రవివర్మ శైలిలో పెయింటింగ్ గా మార్చమంటే మరుక్షణంలో మార్చేస్తుంది; పికాసో, మైఖేల్ యాంజిలో, లియోనార్దో డావిన్సీ ఏ శైలి కావలిస్తే ఆ శైలిలో సెకన్లలో.

ఇన్ని అద్భుతాలను సృష్టిస్తున్న కుత్రిమమేధ మీద అనేక అనుమాలు కూడ వున్నాయి. దీని విమర్శకుల్లో సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, కాస్మాలజిస్టు స్టీఫెన్ విలియం హాకింగ్ తొలి పంక్తిలో వుంటారు.  

మనుషులతోసహా సమస్త ప్రాణుల్లో జీవపరిణామం చాలా నిదానంగా సాగుతుంటుంది. మనిషి సృష్టించిన కుత్రిమ మేధ చాలా వేగంగా పరిణామం చెందుతుంది. పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన ఏఐని ఒకసారి ఆన్ చేస్తే ఆ తరువాత అది తనంతటా తానే పనిచేస్తూ ముందుకు సాగిపోతుంది. ప్రతిసారి గతంకన్నా  ఎక్కువ వేగంతో  పునరావృతం అవుతూవుంటుంది. మనిషి తన జీవ సంబంధ నిదానపు పరిణామం కారణంగా ఎన్నటికీ ఏఐ వేగాన్ని అందుకోలేక దాని ముందు నిస్సహాయునిగా నిలబడిపొతాడు. ఇది మానవజాతికి అణువిస్పోటనంకన్నా ప్రమాదకరం కావచ్చు అన్నాడు హాకిన్స్. 1798లో బ్రిటీష్ అర్ధశాస్త్రవేత్త థామస్ రాబర్ట్ మాల్థూస్ కూడా ఆహారోత్పత్తికన్నా జనాభా పెరుగుదల ఎక్కువై కరువు కాటకాలు యుధ్ధాలు ప్రకృతి వైపరిత్యాలు వస్తాయని ప్రపంచాన్ని భయపెట్టాడు. ఆనాటి 80 కోట్ల ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లకు పెరిగింది. ఈ మధ్యకాలంలో ఆహారోత్పత్తి 10 రెట్లకన్నా ఎక్కువ  పెరిగింది. దాచుకోవడానికి గిడ్డంగులు లేక ఆహార ధాన్యాలు ముక్కిపోతున్నాయి. ఎందుకంటే, మనిషి తినడానికి కేవలం పొట్టపెట్టుకుని పుట్టడు; రెండు చేతులతోనూ జన్మిస్తాడు. ఆ చేతులు అద్భుతాలను  సృష్టిస్తాయి.

డిజిటల్ టెక్నాలజీ గణాంకాల ద్వార పని చేస్తుంది కనుక  దానికి కొన్ని పరిమితులుంటాయి; వివేకం, భాషా ప్రయోగం విషయాల్లో యంత్రాలు మనుషుల్ని అధిగమించడం కష్టం అని  ఒక భరోసా ఇచ్చారు అమెరికన్ తత్వవేత్త నోమ్ చోమ్స్కి. ఆయన  భాషాశాస్త్రవేత్త కూడ.

యంత్రాలు కఛ్ఛితంగా పనిచేయవచ్చు; కానీ వివేకాన్ని ప్రదర్శిస్తాయి అనేది అనుమానమే. యూనివర్శిటీ ఆఫ్ లండన్ కు చెందిన స్లావోజ్ జిజెక్ (Slavoj Žižek) ను వర్తమాన గొప్ప తత్వవేత్తగా  చాలామంది గుర్తిస్తారు. కుత్రిమ మేధ గురించిన అతి ఉత్సాహాలు అతి భయాందోళనలు రెండూ మనుషుల భావోద్వేగాల నుండి పుట్టినవే అంటారాయన. ఈ ఏడాది మార్చి 30న న్యూయార్క్ పోస్ట్ ‘Married father commits suicide after encouragement by AI chatbot’ అనే వార్తను ప్రముఖంగా ప్రచురించింది. దానితో కుత్రిమ మేధ మీద భయాందోళనలు మొదలయ్యాయి. అయితే, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ దీనికి భిన్నమైన  రిపోర్టును విడుదల చేసింది. ఆత్మహత్య చేసుకునే ధోరణుల్ని కుత్రిమ మేధ ముందుగానే పసిగట్టి సంబంధిత విభాగాలను హెచ్చరిస్తుంది అనేది ఆ నివేదిక సారాంశం. కుత్రిమ మేధ రెండు వైపులా పదునున్న కత్తి.

ముడి సమాచారం (డేటా)ను ప్రాసెస్ చేసి (శుధ్ధి) సమాచారాన్ని ఉత్పత్తి చేస్తుంది కనుక డిజిటల్ టెక్నాలజీకి సమాచార సాంకేతిక విప్లవం అనే పేరు వచ్చిందని సామాన్యులకేకాక చాలామంది టెకీలకు సహితం తెలియదు.

యంత్రాల మీద ఆధిపత్యం గల వర్గమే ముందు సంపద మీద, తరువాత ప్రభుత్వం మీద అనంతరం మొత్తం సమాజం మీద ఆధిపత్యాన్ని సాధిస్తుందనీ, తన ప్రయోజనాలనే ప్రజల ప్రయోజనాలుగా మీడియా ద్వార ఒప్పించి పీడక వ్యవస్థ మీద కుత్రిమ  ఆమోదాంశాన్ని రుద్దుతుందనేది  స్థూలంగా మార్క్సియన్ భావన. ఇప్పుడు కుత్రిమ మేధ కూడ తన యజమానులకు అనుకూలంగా ఆమోదాంశాన్ని ఉత్పత్తి చేస్తుందనడంలో సందేహంలేదు. 

భారత సామాజిక వ్యవస్థ క్రమంగా మతవ్యవస్థగా మారుతోందని అందరూ కాకపోయినా ఎక్కువమంది ఆందోళన చెందుతున్నారు. అలాంటి ప్రశ్నలు ఛాట్ జిపిటిలో అడిగితే అది యూజర్ ను మందలిస్తుంది; తన నియమాలకు  విరుధ్ధం అంటుంది. కుత్రిమ మేధకు రాజకీయాలుంటాయా అనే ప్రశ్న ఇలాంటి సందర్భాల్లో తలెత్తుతుంది. దీనికి సమాధానం చాలా సులువు. కుత్రిమ మేధకు డేటాను ఎక్కించేది ఏదో ఒక వాణిజ్య సంస్థ. ఆ సంస్థకు రాజకీయార్ధిక ప్రయోజనాలుంటాయి. అది తనకు అనుకూలమైన  రాజకీయార్ధిక డేటానే ఫీడ్ చేస్తుంది.

ముడు నెలల క్రితం ఎలోన్ మస్క్ తో సహా అనేక మంది ప్రపంచ ఐటి  దిగ్గజాలు కుత్రిమమేధ అభివృధ్ధి ప్రాజెక్టుల్ని కొన్నాళ్లు నిలిపివేయాలని బహిరంగంగా కోరారు. కుత్రిమ మేధ గాడ్ పాదర్లలో ఒకరుగా భావించే జియోఫ్రీ హింటన్ గూగుల్ నుండి బయటికి వచ్చేశారు. టెక్నాలజీ అదుపు తప్పిందని వారంటున్నారు. ఈ ‘అదుపు తప్పడం’ ‘ప్రమాదం’ ‘మానవాళికి ముప్పు’ అనే మాటల్ని ఎవరి అవసరాన్ని బట్టి  వాళ్ళు వాడుతుంటారు.  

కుత్రిమ మేధకు రాజకీయ ప్రయోజనాలుంటాయా? అనేది అమాయకపు ప్రశ్న. సాంకేతికరంగంలో సాగే ప్రతి ఆవిష్కరణ ఒక కొత్త ఆధిపత్య ఉత్పత్తి విధానాన్ని సృష్టించి రాజకీయ ఆధిపత్యానికి తావు ఇస్తుందని చరిత్ర మనకు అనేకసార్లు చాటి చెప్పింది. బ్రిటన్  18వ శతాబ్దం ఆరంభంలో ఆవిరియంత్రాన్ని కనిపెట్టడంవల్లనే భారత దేశంలో బ్రిటీష్ వలస పాలన ఆరంభం కావడానికి మార్గం ఏర్పడింది. ప్రపంచ కార్పొరేట్లు ఆశించే రాజకీయార్ధిక ప్రయోజనాలను సాధించి పెడుతుందని నమ్మకం కలిగేవరకు కుత్రిమ మేధ మీద పరిశోధనలు జరుగుతూనే వుంటాయి.

మనుషులు సమిష్టి జీవితాలను వదిలి వ్యష్టి జీవితాన్ని కోరుకుంటున్నారు.  సమిష్టి ప్రయోజనాల్ని సాధించాల్సిన చోట స్వీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ప్రవృత్తి కుటుంబ వ్యవస్థలోనూ చొరబడిపోయింది. ఇద్దరు తాతల విస్తార కుటుంబాలు, అన్నదమ్ముల ఉమ్మడికుటుంబాలు, మూడుతరాల ఐదుగురు సభ్యుల కుటుంబాలు, ఒక్క సంతానపు ముగ్గురు సభ్యుల కుటుంబాలు అన్నీపోయి ఇద్దరు సభ్యుల సహజీవనం వరకు వచ్చింది పరిణామం. ఇప్పుడు అదీ సాగడంలేదు. విడాకులు పెరుగుతున్నాయి, ‘సింగిల్స్’ పెరుగుతున్నారు. పెళ్ళికానివారు పెరుగుతున్నారు. 2011 జనాభా లెఖ్ఖల్లో 20-40 సంవత్సరాల మధ్య వయసు గలవారిలో 11 శాతం పెళ్ళికానివారని తేలితే ఇటీవలి లెఖ్ఖల్లో ఈ విభాగం  20-21 శాతానికి పెరిగింది.

ప్రపంచంలో ఏ మనిషీలోనూ అన్నీ మనకు నచ్చిన లక్షణాలే వుండవు. మనకు నచ్చని లక్షణాలు కూడ వుంటాయి. కొన్ని గుణాలు నచ్చి ఇష్టపడి పెళ్ళిచేసుకున్నా తరువాతి కాలంలో నచ్చని గుణాలూ బయటపడవచ్చు.  వాటిని కూడ సహించగలిగితేనే దాంపత్యం కొనసాగుతుంది. అలాంటి సహనం లేకుంటే ఒంటరి జీవితాలు తప్పవు.

ఇలాంటి సామాజిక సంక్షోభం,  ఒంటరి జీవితాలు కుత్రిమ మేధకు కొత్త మార్కెట్. అబ్బాయిలు, అమ్మాయిలకు అక్కడ కొన్ని వేల రకాల ఆప్షన్స్ వుంటాయి. డిజిటల్ పాత్రలు చాలా తెలివైనవి. ఒక్క రెండు నిముషాలు ఛాట్ చేస్తే చాలు యూజర్ తాలూకు సమస్త వివరాలు దానికి తెలిసిపోతాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సామాజిక, తాత్విక దృక్పథాలు, ఇష్టాయిషాలు, మాటతీరు అన్నింటినీ ఒక్క క్లిక్ తో అది గ్రహించేస్తుంది. వెంటనే అందుకు అనువుగా మారిపోతుంది. అంత గొప్ప మ్యాచింగ్ దొరకడం సహజ ప్రపంచంలో అసాధ్యం.

హాలీవుడ్ లో 2013లో హర్ (Her) అనే మూవి వచ్చింది. భార్య నుండి విడిగావుంటున్న థియోడర్ (జాక్విన్ ఫొయోనిక్స్) అనే మధ్య వయస్కుడు ఒంటరితనం నుండి బయట పడడానికి కంప్యూటర్ ద్వార ఓ డిజిటల్ స్త్రీ పాత్ర (స్కార్లెట్ ఝాన్సన్) తో ఛాటింగ్ మొదలెడతాడు. దాని పేరు ఏదైనాగానీ  థియోడర్ కోసం అతనికి ఇష్టమైన  సమంతా పేరుతో పరిచయం చేసుకుంటుంది. థియోడర్ ఎలా కోరుకుంటే ఆ పాత్ర అలా    మారిపోతుంటుంది. నవ్విస్తుంది, కవ్విస్తుంది, ఓదారుస్తుంది, ధైర్యం చెపుతుంది, మేధో చర్చలు చేస్తుంది.  థియోడరో ఆమెతో గాఢంగా  ప్రేమలో పడిపోతాడు. వాళ్లిద్దరు డిజిటల్ సెక్స్ కూడ చేస్తారు. సమంతాను విడిచి వుండలేని స్థితికి చేరుకుంటాడు అతను. ఒకరోజు సందేహం వచ్చి “నువ్వు ఎంతమందిని ఇలా ప్రేమిస్తున్నావు?” అని అడుగుతాడు. “ఒకే సమయంలో కొన్ని వేలమందితో” అంటుంది సమంతా. నిజానికి దాని శక్తి అంతకన్నా ఎక్కువ. ఆ మాటతో థియోడర్ హతాశుడై వాస్తవలోకం లోనికి వస్తాడు.

 

స్త్రీపురుష సంబంధాలు మాత్రమేకాదు, సమాజంలో మనుషుల మధ్య సమస్త అనుబంధాలు విధ్వంసం అయిపోవడం వల్ల కుత్రిమ మేధకు గిరాకీ పెరుగుతోంది. చాలామందికి మరొకరిని గురువుగా భావించడం, శిక్షణ పొందడం నచ్చదు. వారికి కుత్రిమ మేధ గురువుగా మారుతుంది. అది ఏం బోధించాలో దాన్ని సృష్టించినవాళ్ళు నిర్ణయిస్తారు. అలా నియంత్రించే స్థాయిలో వున్నవారికి తమవైన సామాజిక, ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలుంటాయి. కుత్రిమ మేధ  దాన్ని నెరవేరుస్తుంది.    

(రచయిత సీనియర్ జర్నలిస్టు, సమాజ విశ్లేషకులు) 


ప్రచురణ ః ప్రచురణ ః 20 జూన్ 2023 ఆంధ్రజ్యోతి దినపత్రిక  

https://www.andhrajyothy.com/2023/editorial/who-will-artificial-intelligence-listen-to-1088621.html?fbclid=IwAR0JsyxkTO-LtZplWE9z2fuQDqlxjvp43d_yRg2vnNUXyu2Z0bXSXtHSaDc


https://epaper.andhrajyothy.com/Home/ShareArticle?OrgId=206e49cc4db&imageview=1&standalone=1&fbclid=IwAR073bWQHfUJMRAhjHuh3PxTwA3MGD272GaNwOZaSaH74nXX9l8MvdnL1H0


No comments:

Post a Comment