*సింగిల్ పాయింట్ ఎజెండా : లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి*
వర్తమాన రాజకీయాలు మన కర్తవ్యాలు అనే అంశం మీద ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్న ఎంసిపిఐ (యు) ఏపి రాష్ట్ర కమిటికి అభినందనలు. ఈ కార్యక్రమంలో నన్ను కూడ భాగస్వామిని చేసినందుకు ఎంసిపిఐ (యు) ఏపి రాష్ట్ర కమిటి కార్యదర్శి కాటం నాగభూషణం గారికి ధన్యవాదాలు.
వర్తమాన రాజకీయాలు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోవున్న బిజెపి పరిపాలన సాగిస్తున్న తీరు, అది అనుసరిస్తున్న విద్వేష రాజకీయాల గురించి ఇక్కడ చాలామంది మాట్లాడారు. ఒక్క మాటలో సమీక్షించాలంటే, బిజేపి పాలన అధ్వాన్నంగా మాత్రమేలేదు; అది సమాజ శాంతికి చాలా ప్రమాదకంరంగా వుంది.
కార్ల్ మార్క్స్ బోధనల్లో ఒక మహత్తర వాక్యం వుంది. “ఆలోచనాపరులు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు; ఇప్పుడు చేయాల్సింది ప్రపంచాన్ని మార్చడం”
బిజేపి పాలన ఎంత అధ్వాన్నంగా వుంది, అది సమాజశాంతికి ఎంత ప్రమాదకరంగా మారింది అనే అంశం మీద మనం రోజుల తరబడి మాట్లాడుకోవచ్చు. సమస్య అది కాదు; కేంద్రంలో బిజేపిని అధికారం నుండి తప్పించడానికి మనం ఏం చేయాలీ? అన్నది ముఖ్యం.
జాతీయ హోంమంత్రి, కేంద్ర ప్రభుత్వంలో నెంబర్-టూగా భావించే అమిత్ షా ఇటీవల విశాఖపట్నం వచ్చి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో బిజెపికి 20 స్థానాలు ఇవ్వాలని కోరారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది అంకెల వ్యవహారమనీ, లోక్ సభలో సీట్ల పోరు అని అమిత్ షాకు స్పష్టంగా తెలుసు. నిజం చెప్పాలంటే మనకు అలాంటి అవగాహన లేదు. మనలో కొందరు శాసనసభ ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. అలాంటి సంకుచిత ఆలోచనా విధానం తప్పు. మనం ఆలోచించాల్సింది లోక్ సభ ఎన్నికల గురించి.
లోక్ సభలో ప్రస్తుతం 545 స్థానాలున్నాయి. 273 స్థానాలను మేజిక్ ఫిగర్ అంటారు. అంతకన్నా ఎక్కువ స్థానాలను దక్కించుకున్న వారికే కేంద్రంలో అధికారం వస్తుంది. ఒక్కో లోక్ సభా నియోజక వర్గంలో 15 నుండి 16 లక్షల మంది ఓటర్లు వుంటారు. వీటిల్లో 51 శాతానికి మించి ఓట్లు వచ్చిన వారే గెలుస్తారు. పోల్ మేనేజ్మెంట్ చాలా పెద్ద ప్రాసెస్. అది ఓ ఏడాది రెండేళ్ళలో జరిగేదికాదు. ఇక డబ్బు అంటారా ఒక్కో ఎంపి అభ్యర్ధి 50 నుండి వంద కోట్ల రూపాయలు వరకు ఖర్చు పెడతారు.
డబ్బుల విషయాన్ని పక్కన పెట్టండి. ఈనాటి సమావేశంలో 18 రాజకీయ పార్టీలు, 14 ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. ఈ పార్టీలన్నింటికీ కలిపి గత లోక్ సభ ఎన్నికల్లో ఎంత శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికల రంగంలో మన సామర్ధ్యం ఎంత? వాస్తవాలు మాట్లాడుకోవాలంటే మనందరం కలిసి మహా అయితే ఓ 3 శాతం ఓటర్లను మాత్రమే ప్రభావితం చేయగలము. గెలడానికి అవసరమైన మరో 48 శాతం ఓట్లను ఎక్కడి నుండి తెద్దామూ?
ఈ సమావేశ నిర్వాహకులు ముందుగానే ఒక ప్రతిపాదన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదేమంటే “పాలకవర్గ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజా రాజకీయ ఐక్య సంఘటన ఏర్పాటు చేయడం”. ఇక్కడ విభజన పాలకవర్గ పార్టీనా? కాదా? అన్నది కాదు; ఇక్కడ విభజన ప్రమాదకర బిజేపీ పక్షమా? కాదా? అనేదే. ఈ తీర్మానాన్ని, ‘బిజెపికి ప్రత్యామ్నాయంగా ప్రజా రాజకీయ ఐక్యసంఘటన ఏర్పాటు చేయడం’ అని సవరించాలని నేను కోరుతున్నాను.
వంద కోట్ల ఓటర్లున్న దేశం మనది. బిజెపిని గద్దె దించాలంటే 50 కోట్ల ఓటర్ల మద్దతు కావాలి. దానికి జాతీయ స్థాయిలో ఒక రాజకీయ మహాసంఘటన నిర్మించాలి. బిజెపిని తప్ప ఇంకే పార్టి వచ్చినా ఇందులో చేర్చుకోనేంత సువిశాల వేదిక కావాలి.
కమ్యూనిస్టు పార్టీల మీద ఒక జోక్ వున్నది. వాళ్ళు ఎన్నికల ముందు ఎన్నికల తరువాత వామపక్షాల ఐక్యత అంటుంటారు. ఎన్నికల్లో మాత్రం ఎవరిదారి వాళ్లు చూసుకుంటారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చే ప్రాధాన్యతను లోక్ సభ ఎన్నికలకు ఇవ్వరు. ముందు ఈ తీరు మారాలి.
బిజెపిని గద్దె దించాలని మనం స్థిరంగా అనుకుంటున్నామా? లేక సరదాగా అనుకుంటున్నామా? బిజెపిని గద్దె దించాలని మనం గట్టిగా అనుకుంటుంటే జాతీయ ఐక్య సంఘటనలో తప్పనిసరిగా కాంగ్రెస్ వుండాలి. కాంగ్రెస్ లేకుండ ఎంత పెద్ద ఐక్య సంఘటన అయినా బిజెపిని గద్దె దించలేదు.
కాంగ్రెస్ ప్రస్తావన రాగానే మనలో కొందరికి 1970ల నాటి ఎమర్జెన్సీ మాత్రమే గుర్తుకు వస్తుందిగానీ, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ద్వారానే ఆనాటి ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించామన్న విషయం గుర్తుకు రాదు. సమిష్టి ప్రయోజనాలను నెరవేర్చాల్సిన సమయంలో పార్టి ప్రయోజనాలను, వ్యష్టి ప్రయోజనాలను ముందుకు పెట్టడం తప్పు. లోక్ సభ మైదానంలో బిజెపి తరువాత అతి పెద్ద పార్టి కాంగ్రెస్. దానిని పక్కన పెట్టడం అంటే మనం ఎన్నికలకు ముందే బిజెపిని గెలిపిస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి.
రెండు తెలుగు రాష్రాకాల్లో అసెంబ్లీ ఎన్నికలను మీరు మరచిపొండి. జగన్, టిడిపి, జనసేన, టిఆర్ ఎస్ / బిఆర్ ఎస్ లను మరచిపొండి. మనది సింగిల్ పాయింట్ ఎజెండా కావాలి. లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి. అంతే. బాఖీ సబ్ బక్వాస్!
( 2023 జూన్ 14న ఎంసిపిఐ (యు) విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన ప్రసంగం ఆధారంగా)
No comments:
Post a Comment