suicide Note
నేను 1951 ఆగస్టు 27న నరసాపురం జిడిఎం హాస్పిటల్ లో
పుట్టాను.
నన్ను నా తల్లి దండ్రులు పదో ఏట వరకు మంచిగా పెంచారు.
తరువాత వాళ్లకు తట్టుకోలేని ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి.
నా పదవ ఏటా మానాన్న నన్ను మావూరి బస్ స్టాండ్ లో
వదిలి వెళ్ళిపోయారు.
నేను బాలా కార్మికునిగా మారాను.
నాపోషణ నేను చేసుకుంటూ నా కుటుంబ సభ్యుల పోషణలోనూ
కొంత బాధ్యత వహించగలిగాను.
నన్నొక అమ్మాయి ప్రేమిస్తూన్నానన్నప్పుడు చాలా ఆనందం
వేసింది.
ఆమె అడిగినప్పుడు పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చాను. ఆ
మాట ప్రకారం పెళ్ళి చేసుకున్నాను.
ఆమె హిందువు. నేను ముస్లిం.
ఆమె నన్ను పెళ్ళిచేసుకోవడం వాళ్ల కుటుంబానికినచ్చలేదు.
మమ్మల్ని విడదీయడానికి చాలా ప్రయత్నించారు. ఆ వత్తిడి తట్టుకోలేక ఆమె గోదావరిలో
దూకి చనిపోయింది.
అప్పుడు నాకు కూడ చనిపోవాలనిపించింది. అయితే, బతికి సమాజంలో మార్పు తీసుకుని రావాలని మిత్రులు
సలహా ఇచ్చాడు. .
మతసామరస్య సామ్యవాద వ్యవస్థ సాకారం అవుతుందని గట్టిగా
నమ్మి నేను నక్సలైటుగా మారాను.
కొంతకాలం తరువాత నాకు కమ్యూనిస్టు పార్టీల నాయకుల మీద
నమ్మకం సడలింది. పాతికేళ్ల తరువాత నేను వాటి నుండి బయటికి వచ్చేశాను.
కమ్యూనిజం ఎప్పటికీ నా ప్రేయసే.
కార్ల్ మార్క్స్ అన్నా, ముహమ్మద్ ప్రవక్త అన్నా నాకు
చాలా అభిమానం.
నక్సలైట్ గా వున్నరోజుల్లో పార్టి నాకు ఏలూరి అజితను
ప్రపోజ్ చేసింది.
సామాజికంగా, ఆర్ధికంగా మెరుగైన నేపథ్యం నుండి
వచ్చింది. ఆమె చాలా ధైర్యవంతురాలు. కుటుంబ
బాధ్యతను తనే ఎక్కువగా మోసింది.
నా దుందుడుకు స్వభావం వల్ల కొంత, ఆర్ధిక ఒడిదుడుకులవల్ల
కొంత, మానసిక వత్తిడివల్ల కొంత నేనామెకు చాలా
దుఖ్ఖం కలిగించాను.
ఇవి నాకు ఇష్టమై చేయలేదుగానీ నేను కాలానికి బాధితుడ్ని.
కోవిడ్ సోకి నేను చనిపోతానని వైద్యులు అన్నప్పుడు ఆమె
ఒక పంతంతో నన్ను బతికించుకుంది. తల్లి రుణంలా నా భార్య రుణం తీర్చుకోలేనిది.
నేను ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తాను. ఎప్పుడూ
హాస్పిటల్ లో చేరలేదు. 70వ ఏట కోవిడ్ సందర్భంగా కొన్ని రోజులు హాస్పిటల్ లో వుండక
తప్పలేదు. ఆ తరువాత కూడ నేను పూర్తిగా కోలుకోలేదు.
ఇప్పుడు సమాజంలో సోషలిస్టు వాతావరణం లేదు; సంఘీభావమూ
లేదు. ఈ పరిణామాలు నన్ను నిరాశ కలిగించడమేగాక నా ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా మారుతోంది.
తొలి పదేళ్ళు మినహాయిస్తే నేనెన్నడూ ఎవరి మీదా ఆధారపడలేదు.
కొంతకాలం నా శారీరక శ్రమ మీద, మరి కొంతకాలం నా అలోచనల శక్తి మీద నేను బతికాను. నచ్చిన
ఉద్యోగాలు చేశాను నచ్చని ఉద్యోగాలు మానేశాను.
ఓ పదిహేనేళ్ళుగా కంటి చూపు సమస్య వున్నది. కొన్నేళ్ల
క్రితం తుంటి కీలు మార్చాలన్నారు. మరి కొన్ని రోజులు గడిస్తే నేను అనేక విధాలా మరొకరి
మీద ఆధారపడాల్సి వస్తుందని భయమేస్తున్నది.
మరొకరి మీద ఆధారపడడం నా మనసుకు నచ్చే విషయం కాదు.
కష్టాల్లో వున్న చాలామందిని ఓదార్చాను. నన్ను మరొకరు
ఓదార్చే
పరిస్థితి రాకముందే జీవితాన్ని ముగించాలనుకున్నాను.
ప్రేమించాల్సిన వాళ్లను ప్రేమించాను; ద్వేషించాల్సిన
వాళ్లను ద్వేషించాను.
నామీద ఎవరయినా పావలా ప్రేమాభిమానాల్ని కురిపిస్తే
వారికి రూపాయి ప్రేమాభిమానాలను తిరిగి ఇచ్చాను.
నా జీవితంలో తారసపడిన ప్రత్యర్ధుల్ని ఇప్పుడు నేను
గుర్తు చేసుకోదలచలేదు.
నన్నెంతో గారబంగా పెంచిన తల్లిదండ్రులకు,
నన్నెంతో ఆప్యాయంగా చూసుకున్న నా గురువులకు, నా
యజమానులకు, నా స్నేహితులకు,
నా రచనల పబ్లిషర్లకు, నా పాఠకులకు, నా శ్రోతలకు, అభిమానులకు,
నన్నొక ఆలోచనాపరునిగా గౌరవించిన ప్రతి
ఒక్కరికీ
నన్నెంతగానో ప్రేమించిన నా ఇద్దరు భార్యలకు, నా ఇద్దరు కొడుకులకు
అందరికీ ధన్యవాదాలు.
నా రచనలవల్ల కొందరి మనసు బాధపడి వుండవచ్చు.
కావాలని ఎవర్నీ అన్యాయం చేయలేదు; ఎవర్నీ గాయపరచలేదు.
ఈ సృష్టిలో ప్రతిదానికీ ఒక ముగింపు వుంటుంది. ఇప్పుడు
నా ముగింపు వచ్చింది.
చాలామందిని నవ్వించాను. ఇప్పుడు ఎవ్వర్నీ ఏడిపించదలచలేదు.
.
ఇక్కడ నా జీవితాన్ని ముగిస్తున్నాను.
Inna lillahi wa inna ilayhi raji'un
We belong to Allah, and to Him we return.
విజయవాడ గవర్నర్ పేట శ్మశానంలో నా తల్లిదండ్రుల్ని ఖననం చేశారు. నన్నూ అక్కడ ఖననం
చేస్తే అదొక ఆనందం.
లేదా నా భౌతిక కాయాన్ని నరసాపురం దగ్గర గోదావరిలో
చేపలకు ఆహారంగా పడేయండి. Ecological
Life Cycle కొనసాగుతుంది.
నేను గొదావరి నీళ్ళు తాగి, ఆ చేపల్ని తిని పెరిగాను.
అందరికీ సెలవు
ఏఎం ఖాన్ యజ్దానీ (ఉషా ఎస్ డానీ)
No comments:
Post a Comment