Wednesday, 15 April 2015

యుధ్ధము ముగియలేదు ప్రభూ!;ఇప్పుడే ఆరంభము అయినది !!

యుధ్ధము ముగియలేదు ప్రభూ!;ఇప్పుడే ఆరంభము అయినది !!

ఉషా యస్ డానీ

వానపాముని చూపించి అనకొండ అనిపించడానికీ, ఎలుకను చూపించి డైనోజార్ అనిపించడానికీ, కూలీల్ని చూపించి అంతర్జాతీయ స్మగ్లర్లు  అనిపించడానికీ, ఒక వాస్తవాన్నీ అబద్దం చేయడానికీ, ఒక అబధ్ధాన్ని నిజం అనిపించడానికీ సమస్త అధికారగణాలన్నీ ఇప్పుడు ఏకం అవుతున్నాయి.

అందరికీ తెలుసు వాళ్ళు చెట్లు నరికే కూలీలని. అందరికీ  తెలుసు స్మగ్లర్లు ఎండాకాలం అడవిలో గోచి చుట్టుకుని,  గొడ్డళ్ళుపట్టి, చెమట కక్కుకుంటూ  చెట్లు నరికే శ్రమజీవులు కారనీ.  వాళ్ళు కాళ్లకు చెప్పులు, ఒంటి మీద చొక్కాలు లేని కడుపేదరికంలో వుండరనీ.  అందరికీ  తెలుసు ఎర్రచందనం  స్మగ్లర్లు  చెన్నైలోనో, బెంగళూరులోనో నక్షత్రాల హోటళ్లలో విలాసాలు చేస్తుంటారని. వాళ్ళు దొరికితే మారిషస్ లోనో, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో  రాజభోగాలు అనుభవిస్తూ వుంటారని.

ఎర్రచందనం వృక్షాలు ప్రపంచంలో  నల్లమల అడవులు విస్తరించిన నాలుగు జిల్లాలకే ప్రత్యేకం అయినా వాటి ఉపయోగాలు గురించి పదేళ్ల క్రితం వరకు మన రాష్ట్రంలో ఎవరికీ తెలీదు. ఎర్రచందనానికి సంబంధించి ఇటీవల బయటపడిన రెండు ప్రధాన ఉపయోగాల్లో మొదటిది దీని పొడిని అణువిద్యుత్ కేంద్రాల్లో వినియోగిస్తున్నారనేది. రెండో ప్రయోజనం అంతకన్నా ఆసక్తికరమైనది. ఎర్రచందనం పొడికి లైంగిక పటుత్వాన్ని పెంచే గుణం (Aphrodisiac) వుందనేది. దీనికి శాస్త్రీయ ప్రతిపత్తి వుందో లేదోగానీ, జపాన్ లో మాత్రం ఈ నమ్మకం బలంగావుంది. లైంగిక ఆసక్తి అతితక్కువగల దేశంగా జపాన్ ను పేర్కొంటూ ద గార్డీయన్, వాషింగ్ టన్ పోస్ట్ పత్రికలు రెండేళ్లక్రితం  రెండు సంచలన కథనాలు ప్రచురించాయి. ఎర్రచందనం కోసం జపాన్ చూపుతున్న ఆసక్తిని  గమనిస్తే ఈ కథనాలు నిజమే అనిపిస్తాయి. స్మగ్లర్ల ద్వార దొంగమార్గంలోకొన్నా, ప్రభుత్వం ద్వార రాజమార్గంలో కొన్నా ఎర్రచందనం ప్రధాన దిగుమతిదారుడు మాత్రం  జపానే.

ఇప్పుడు ఎర్రచందనం నిల్వలకు మరో ప్రాధాన్యం వచ్చింది. రాష్ట్రంలో  హైదరాబాద్ ను మించిన రాజధాని నగరాన్ని కట్టాలని చంద్రబాబు కన్న కలల మీద  నరేంద్ర మోదీ చల్లటి మంచునీళ్ళు చల్లారు. చంద్రబాబు ఇప్పుడు రాజధాని ఆశలన్నీ ఎర్రచందనం మీదే పెట్టుకున్నారు! జపాన్, చైనాలకు ఎర్రచందనాన్నీ అమ్మి రాజధాని నిర్మాణానికి  నిధుల్ని సమీకరించుకునే పనిలో వారున్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో తమకూ అవకాశం ఇవ్వాలని జపాన్ కూడా సింగపూర్ తో పోటీ పడుతోంది. అలా నల్లమల టూ జపాన్, జపాన్ టూ అమరావతి అంటూ ఒక రక్తచందనపు దారి ఏర్పడింది.  గిరాకీ పెరగడంతో,  ఏపీ రాజధాని నిర్మాణం ఎర్రచందనం కూలీల చావుకు వచ్చింది. అమరావతిలో భూమిపూజ జరగడానికి ముందే శేషాచలంలో ‘నరబలి’ జరిగిపోయింది!.

ఉత్తర తమిళనాడులోని  వేలూరు, ధర్మపురం, విల్లుపురం, సేలం, తిరువణ్ణామలై జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలు. ఎర్రచందనం స్మగ్లర్లు సాధారణంగా ఈ జిల్లాల కూలీలనే నల్లమల అడవుల్లో చెట్లు  నరకడానికి  తీసుకుని వస్తుంటారు.  సేలం జిల్లాలో కొండప్రాంతమైన యేర్కాడ్ వుడ్ కట్టర్లు కాఫీతోటల్లో  సిల్వర్ ఓక్ చెట్లను నరకే వృత్తిని శతాబ్దాలుగా కొనసాగిస్తున్నారు.  వేగంగా చెట్లు నరకడం,  వాటి బెరడు తొలగించడం,  బరువైన దుంగల్ని భజాలకు ఎత్తుకుని కొండలు, గుట్టలు ఎక్కడం వగయిరా పనుల్లో  వీరు నిపుణులు. ఈ పనుల్లో మాలవైమక్కళ్ అనే గిరిజన తెగ వాళ్లది అగ్రస్థానం. యేర్కాడ్ లో వాళ్లకు  ఘనపు అడుక్కి 30 రూపాయల కూలీ వస్తుంది. ఎర్రచందనం చెట్లు నరకడానికి కూలీ పది రెట్లు ఇస్తామని స్మగ్లర్ల బ్రోకర్లు వాళ్లకు ఆశ చూపుతారు. పది రోజులు కష్టపడితే ఓ 30 వేల రూపాయలు చేతికి వస్తాయనీ, దానితో కొన్ని అప్పుల బాధలు తీరుతాయని వీళ్లలో కొందరు ఆశపడతారు.
"వాళ్ళు ఎర్రచందనం దొంగలు కాకుంటే  గడ్డి కోసుకోవటానికి ఏమైనా తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు వచ్చారా?"  అని అటవిశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎగతాళి చేశారు.  వాళ్ళు కూలీ డబ్బులకోసం ఎర్రచందనం చెట్లు నరకడానికే వస్తారు. అనుమతి లేకుండా అడవిలో  ఏ చెట్టును నరికినా నేరమే. ఎర్రచందనం చెట్టును నరికినా నేరమే. ఆ విషయం ఆ కూలీలకు కూడా తెలుసు.  అయినా, బ్రోకర్లు చూపించే ఆశను కాదనలేని పేదరికం వాళ్లది. నేరంలో  వాళ్ళు నిస్సందేహంగా పాత్ర ధారులు. అయితే ఆ నేరానికి వాళ్ళు సూత్రధారులు మాత్రం  కాదు. ప్రధాన లబ్దిదారులు అంతకన్నా కాదు.  సూత్రధారులు, ప్రధాన లబ్దిదారులు నిజానికీ అధికారవర్గం నీడలోనే వుంటారు. లేదా అధికారవర్గమే ప్రధాన లబ్దిదారులు, సూత్రధారుల నీడల్లో వుంటుంది. 

గత ఎన్నికల్లో గెలవడానికి  ఏపి శాసనసభ అభ్యర్ధులు 15 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చెసినట్టు సాక్షాత్తు ప్రధాన ఎన్నికల అధికారి బ్రహ్మ  చెప్పి పది రోజులు కూడా కాలేదు. యంఎల్ ఏ అభ్యర్ధులే ఈ మేరకు ఖర్చుపెట్టి వుంటే యంపీ అభ్యర్ధులు ఏ మేరకు ఖర్చుపెట్టి వుంటారో ఊహించుకోమని సిఇసి సెలవిచ్చారు. అభ్యర్ధులకు ఆ డబ్బులన్నీ ఇసక క్వారీల్లోంచో, కాంట్రాక్టుల్లోంచో, గనుల్లోంచో, ఎర్రచందనం దుంగల్లోంచో వచ్చి వుండాలిగా.

నిజానికి శేషాచలం అడవుల్లో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఆ 20 మంది అలా నేరం చేయడానికి వచ్చినవాళ్ళు కూడా కాదు. బస్సులో ప్రయాణిస్తున్నవాళ్ళను పోలీసులు  దారిలో  ఆపి ఎత్తుకుపోతుండగా చూసినవాళ్ళున్నారు. అంటే నేరం చేసినందుకుకాక నేరం చేయబోతున్నారనే అనుమానంతోనే వాళ్లను పోలీసులు చంపేశారు అనుకోవాలి.

పేదలను బుజ్జగిస్తూ  ధనికుల ఉమ్మడి ప్రయోజనాలను కాపాడడమే ప్రభుత్వాల పని. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సామాన్య ప్రజలకు చేసే వాగ్దానాలన్నీ ఎలాగైనా గెలవాలనే ఆతృతలో చేసేవేతప్ప ఆచరించడానికి చేసేవికావు.   మరోవైపు  ఆశించిన మేరకు పనిచేయని ప్రభుత్వాల మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. దాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వాధినేతలు సహజంగానే పోలీసులతో ఒక రక్షణా కవచాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కొందరైతే  అధికారాన్ని చేపట్టగానే ముందుచూపుతో పోలీసులకు భారీ ప్రోత్సాహకాలు అందిస్తారు.  కాలం గడిచేకొద్దీ, ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేకొద్దీ, ప్రభుత్వాధినేతలు  పోలీసుల మీద ఆధారపడడం కూడా అంతకు రెట్టింపు  స్థాయిలో పెరుగుతూ వుంటుంది.  

గత ఎన్నికల్లో జయాపజయాలను నిర్ణయించిన అంశం రైతు రుణమాఫి. తొలిసంతకం  పెడతానంటూ అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ఏడాది గడుస్తున్నా ఆ పని మాత్రం పూర్తిచేయలేదు. రుణమాఫీ పొందని రైతులు వందల సంఖ్యలో  హైదరాబాద్ చేరుకుని సచివాలయంలో ప్రణాళీకా సంఘం ఉపాధ్యక్షుని ఛాంబరును ముట్టడించినంత పని చేశారు.  ఇది జరిగిన రెండు రోజుల్లోనే శేషాచలం ఎన్ కౌంటర్ జరగడం ఒక యాధృఛ్ఛికం కావచ్చు; కాకపోనూవచ్చు.

గీత దాటిన పేదవాళ్ళను అక్కడికక్కడే అధికారికంగా చంపవచ్చు అనే మధ్యయుగాల  శిక్షాస్మృతిని రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా ప్రవేశపెట్టింది.   శేషాచలం ఎన్ కౌంటర్ " అంతం కాదు ఆరంభమే" అని  అటవీ మంత్రి అంటున్నారు. నిజానికి చంద్రబాబు తొలివిడత పాలన అనగానే రైతులకు కాల్దారి కాల్పులు, వామపక్షాలకు బషీర్ బాగ్ కాల్పులు, విప్లవకారులకు కొయ్యూరు ఎన్ కౌంటర్ గుర్తుకు వస్తాయి.  వారి మలివిడత పాలనలో  పోలీసు కాల్పులు శేషాచలం తో మొదలయ్యాయి. కాల్దారీలో ఇద్దరు రైతులు చనిపోతే, శేషాచలంలో  చెట్లు నరికే కూలీలు ఇరవైమంది చనిపోయారు.  మలివిడత  ఆరంభమే ఈ స్థాయిలో వుంటే ముగింపు ఏ స్థాయిలో వుంటుందో వూహించడానికే భయంగా వుంది. పోలీసు కాల్పులు, ఎదురుకాల్పులు ప్రభుత్వ కార్యక్రమంగా మారినపుడు  ప్రజలు కూడా వాళ్ళ కార్యక్రమాన్ని రూపొందించుకుంటారు. యుధ్ధము ముగియలేదు; ఇప్పుడే ఆరంభము అయినది !!

(రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకుడు)

మొబైల్ నెం. 9010757776
10 April 2015

ప్రచురణ : సాక్షి దినపత్రిక
16-4-2015
http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/16042015/Details.aspx?id=2727698&boxid=25589940



Monday, 13 April 2015

From 2000 To 2007 (YSR)

Slug : FIRING

కొంచెంతీపి కొంచెంచేదు

2000 నుండి 2007 వరకు

ఏ. యం. ఖాన్ యజ్దాని (డానీ)


పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో; అంతర్గతంగానే; ఒక విషాదం వుంటుంది. ప్రజలు ప్రభుత్వాధినేతను ఎన్నుకుంటే, ప్రభుత్వాధినేతలు పోలీసుల్ని నమ్ముకుంటారు. ఫలితంగా; ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాధినేతలు మారుతారేగానీ, పోలీసులు స్థిరంగా వుంటారు.

ఇంగ్లీషులో; కాన్ స్టాంట్, స్టేబుల్ అనే రెండు ధాతువుల సంకరంగా కాన్ స్టేబులరీ అనే పదం పుట్టిందని ఎన్నడో ఒక కవి అనంగా విన్నట్టు గుర్తు. సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి ఆర్పీ సింగ్ ఒక సందర్భంలో పోలీసింగ్  అంటే యధాస్థితిని కాపాడడం అని ప్రవచించారు. విచిత్రం ఏమంటే; ప్రజలు మార్పుని కోరుకుంటారు. వాళ్ళు యధాస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అంచేత; ప్రకృతిసిధ్ధంగా పాముకూ కప్పకూ, గ్రద్దకు పిచ్చుక్కి పడనట్టు, సామాజికంగా పోలీసులకూ ప్రజలకూ పడదంటే పడదు.

జనం మార్పుని కోరుకోవడంవల్లే; వలసపాలనకు వ్యతిరేకంగా సాగిన  జాతీయోద్యమాన్ని విజయవంతంచేశారనీ,   కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని గద్దె ఎక్కించారనీ,   నారా చంద్రబాబునాయుడి హైటెక్కు పోకడల్ని  వ్యతిరేకించి వై.యస్. రాజశేఖర రెడ్డికి  అధికారాన్ని కట్టబెట్టారనీ ఇప్పుడు కొత్తగా చెప్పాల్సినపనిలేదు.

ప్రజలు మార్పును కోరుకున్నప్పుడెల్లా పోలీసులు అధికారపక్షాన్నే నిలిచారు; ప్రజల్ని పిట్టల్లా కాల్చిచంపారు. చరిత్ర గమనానికి ఇదొక పార్శ్వం మాత్రమే!. రెండో పార్శ్వం అంతకన్నా ముఖ్యమైనది. అదేమంటే; ప్రజలపై ఉక్కుపాదాన్నిమోపిన ప్రభుత్వాలన్ని అనతికాలంలోనే పతనమైపోయాయి.

ప్రజాందోళనల్ని అందరూ అన్ని సమయాల్లో ఒక్కలాగే చూడరు. ప్రతిపక్షంలో వున్నపుడు, రాజకీయనేతలకు, ప్రజాందోళనలు, అధికార పీఠానికి  చేరవేసే నిచ్చెనలుగా కనిపిస్తాయి. అధికారంలో వున్నప్పుడు, ఆ ప్రజాందోళనలే కాళ్ల కింది భూమిని లాగేస్తున్నట్టు కనిపిస్తాయి.

విద్యుత్ టారిఫ్ కు వ్యతిరేకంగా, 2000లో సాగిన ఆందోళనపై, పోలీసులు తుపాకులు పేల్చినపుడు; తాను  అధికారాన్ని కోల్పోతున్నట్టు చంద్రబాబు గ్రహించారో లేదో తెలీదుగానీ; వై.యస్. త్వరలోనే అధికారాన్ని చేపట్టబోతున్నట్టు ఆనాడే తేలిపోయింది. ఇప్పుడూ అంతే! ముదిగొండ కాల్పులతో తెలుగు దేశం శిబిరంలో మళ్ళీ అధికారాన్ని చేపడతామనే ఆశలు చిగురించాయి. 2004 ఎన్నికల్లో ఓటమి తరువాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇంత ఉత్సాహంగా ఎన్నడూలేదు. ముదిగొండ కాల్పులు; ఒకవైపు; వామపక్షాల మధ్య ఐక్యతను పెంచగా, మరోవైపు వాళ్లను టీడీపీకి మరింత దగ్గర చేసింది. అమేరకు; రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు రూపుదిద్దుకుంటున్నట్టు అప్పుడే తొలి సూచనలు వెలువడ్డాయి.

పోలీసుల్ని నమ్మని ప్రభుత్వాధినేతలు కూడా కొందరు వుండొచ్చు. అలాంటి నేతల మనసు దోచుకోవడం పోలీసులకు  తుపాకులతో పెట్టిన విద్య. "మీ ప్రాణలు విలువైనవి" అని  ఎవరైనా చెపితే మురిసిపోని మనిషి ఉండడు.  "విలువైన ప్రాణం" మంత్రానికి రాష్ట్రాధినేతలైతే మరీ పరశించిపోతారు. ఈ మంత్రంతో ఎంతటి ప్రజానాయకులనయినాసరే పోలీసులు ప్రజాకంటకులుగా మార్చేయగలరు.

ముఖ్యమంత్రి మెప్పు పొందాలనిపించినప్పుడెల్లా గుజరాత్ పోలీసులు ఒక ఎన్ కౌంటర్ చేసేస్తుంటారు. సదరు మృతుడు; నరేంద్రమోడీని హత్యచేయడానికి కుట్రపన్నాడని ఒక కధనాన్ని ప్రచారంలో పెడతారు. దానితో; పోలీసుల అధికారాలూ పెరుగుతాయి; పోలీసుశాఖకు  తనిఖీలులేని నిధుల కేటాయింపులూ పెరుగుతాయి. గుజరాత్ పోలీసులతో ఆంధప్రదేశ్ పోలీసులకు రక్తసంబంధాలున్నాయని సొహరాబుద్దీన్, అతని భార్య ఎన్ కౌంటర్ సంఘటనలు నిరూపించాయి.

ప్రభుత్వాధినేత ప్రజల మనిషిగా ఎక్కువకాలం వుండడం పోలీసులకు ఇష్టంగా వుండదు. ప్రజల మనిషిని పోలీసుల మనిషిగా మార్చడంలో వాళ్ళు బహునేర్పరులు. నిజానికి చంద్రబాబుకు ప్రజల మనిషిగా ఎన్నడూ పెద్ద పేరులేదు; వై.యస్. ఇమేజ్ అందుకు భిన్నమైనది.  వర్తమాన రాజకీయాల్లో దాదాపు యన్టీ రామారావు అంతటి జనాకర్షణవున్న నాయకుడు వై.యస్సే. ఆయన  అధికారాన్ని చేపట్టడానికి ముందు దాదాపు రెండువేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ కాలంలో వై.యస్. రాజకీయ ప్రత్యర్థులే అధికారంలో వున్నారు. అయినా, ఆయన నడక, పడక కూడా జనం మధ్యే వుండేది. పాదయాత్ర అనుభవంవల్లనో ఏమోగానీ, ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కొత్తలో, వై.యస్., బంజారాహిల్స్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సెక్రటేరియట్ల మధ్య పెద్ద హడావిడీ లేకుండానే  రాకపోకల్ని సాగించేవారు. ముఖ్యమంత్రి కాన్వాయి వెళ్ళే సమయంలో ట్రాఫిక్ ను ఆపవద్దని  ఆయన అధికార్లను అదేశించిన సందర్భాలూ ఉన్నాయి.

నక్సల్స్ తో చర్చలనాడే వై.యస్.పై పోలీసుల ప్రభావం పనిచేయడం ఆరంభించింది.  చర్చలకు నాయకత్వం వహించిన కోనేరు రంగారావు అభిప్రాయంలోనైతే; శాంతిచర్చలకు వై.యస్. సుముఖంగావున్నా, పోలీసు ఉన్నతాధికారులే పడనివ్వలేదట. పోలీసుల ప్రయత్నాలు ఫలించి,  "విలువైన ప్రాణం" మంత్రం వై.యస్.పై క్రమంగా పనిచేయడం ఆరంభించింది.  రాష్ట్రంలో; ఒక్కొక్క ఎన్ కౌంటరుకూ, ముఖ్యమంత్రి సెక్యూరిటి ఒక్కొక్కమెట్టు పెరిగింది. ఇల్లైనా, ఆఫీసైనా, మీటింగైనా, ప్రయాణమైనా పోలీసులు తొలుత ముఖ్యమంత్రికి నీడలా మారారు; ఆ పిదప ముఖ్యమంత్రే పోలీసుల నీడన చేరిపోయారు. ఇప్పుడు; ఇళ్ళకు, కార్లకేకాక, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ జామర్లు వస్తున్నాయి. సచివాలయానికీ, క్యాంపు కార్యాలయానికీ కరెంటు ఫెన్సింగు వచ్చింది. రాష్ట్ర రాజధానితో మొదలైన ముఖ్యమంత్రి రక్షణ ఏర్పాట్లు, ఆయన పర్యటనలకూ వ్యాపించింది. ఆయన తరచుగా సందర్శించే కడపజిల్లాలో ప్రత్యేక సెక్యూరిటీ ఎర్పాట్ల కోసం;  పోలీసులు ఆ మధ్య కోట్ల రూపాయల వ్యయంతో ఒక వినూత్న పథకాన్నీ రూపొందించారు. వెరసి ముఖ్యమంత్రి సెక్యూరిటీ బడ్జెట్టూ భారీగా పెరుగుతోంది. 

ముదిగొండ నేపథ్యంలో; నిన్నరాత్రి చినగంజాం ఫైరింగ్ ఫైలును తిరగేశాను.  ఆధునిక ఉప్పు ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా అప్పట్లో ఆంధప్రదేశ్ బలహీనవర్గాల సమాఖ్య పెద్ద ఎత్తున ఆందోళన సాగించింది. అందోళనకారులపై 2000 ఫిబ్రవరి 11 రాత్రి చంద్రబాబు ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. కాల్పులు జరిగిన రాత్రే;  ఆందోళనకారుల డిమాండ్లను, బలహీనవర్గాల సమాఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకూ, హోంమంత్రి దేవేందర్ గౌడ్ కూ   ఫ్యాక్స్ ద్వార పంపించింది. ప్రభుత్వం నుండి ప్రతికూల స్పందన వచ్చింది. ఆ రాత్రి అప్పటి ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇద్దరూ పోలీసు భాషనే మాట్లాడారు.

అప్పట్లో పీసిసి అధ్యక్షునిగావున్న వై.యస్. మరునాడు ఉదయానికల్లా ఇంటర్ సీటీ ఎక్స్ ప్రెస్ లో గుంటూరువచ్చి,  అక్కడ నుండి శవాల్ని చూడడానికి చీరాల చేరుకున్నారు. ప్రొటోకాల్స్ ను పట్టించుకోకుండా ఎంతో చొరవతో ముందుకువచ్చిన వై.యస్.; చీరాల ప్రభుత్వాసుపత్రి ఆవరణలో; సమాఖ్య ఏర్పాటుచేసిన వేదిక నుండే  ప్రసంగించారు. వేదిక ఎక్కుతూ, సమాఖ్య అధ్యక్షుని వద్ద డిమాండ్ల కాపీని అడిగి మరీ తీసుకున్నారు. "(ఉప్పు ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటం పేరిట) తెలుగుదేశం పార్టీకీ, పేదలకూ మధ్యన జరుగుతున్న ధర్మపోరాటంలో పేదలకు న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ ముందుండి పోరాడుతుంది" అన్నారు. "ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన పోలీసు అధికారులపై హత్యానేరం కింద కేసు నమోదుచేసి, జైలు శిక్ష విధించాల"ని డిమాండుచేశారు.

చినగంజాం కాల్పుల వ్యవహారం శాసనసభలో చర్చకు వచ్చినపుడూ వై.యస్. ఎంతో ఉద్వేగంతో వ్యవహరించారు. గాదె వెంకట రెడ్డితోపాటూ; బలహీనవర్గాల సమాఖ్య ప్రతినిధులు; వై.యస్.ను బంజారాహిల్స్ లోని  శ్రీభాగ్  భవనంలో  రెండుసార్లు కలుసుకున్నారు. సభలో ప్రసంగించడానికి ఆయన రెండు రోజులపాటు నోట్సు తయారుచేసుకున్నారు. పోలీసు కాల్పుల కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బాలగోపాల్ దగ్గర వున్నాయంటే, వాటి కోసం, ఒకదశలో, ఆయనింటికి వెళ్ళడానికి కూడా వై.యస్. సిధ్ధపడ్డారు.

చివరకు; చినగంజాం మృతులకు న్యాయాన్నికోరుతూ; ఉద్వేగంతో చలించిపోతూ, అవేశంతో ఉగిపోతూ, శాసనసభలో   ఆయన ప్రసంగించిన తీరును చూసిన వాళ్ళకు ఆ దృశ్యం  చాలాకాలం వెంటాడింది. చంద్రబాబు వ్యవహారశైలికి భిన్నంగా, సరైన ప్రత్యామ్నాయంగా, అప్పటి నుండే వై.యస్. ఒక కొత్త ఇమేజ్ ను సంతరించుకున్నారంటే  అతిశయోక్తికాదు!

2000 నాటి వై.యస్. ఆర్తి, చొరవ, ప్రజాపక్షపాతం గుర్తున్నవాళ్ళు; ముదిగొండ కాల్పుల వార్త వినగానే ఆయన బాధితుల్ని పరామర్శించడానికి హుటాహుటీన వెళ్ళిపోయి వుంటారని సహజంగానే భావిస్తారు. చీరాలలో చనిపోయింది ఇద్దరే; ముదిగొండలో చనిపోయింది ఆరుగురు. పైగా, ఇప్పుడు వై.యస్. కార్లలోనూ, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లలోనూ కష్టించి  ప్రయాణం చేయాల్సినపనిలేదు. ఏ క్షణాన కావాలనుకుంటే ఆ క్షణాన, ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి, చిటికెల్లో ఆకాశమార్గాన వెళ్లిరాగల అత్యాధునిక హెలీకాప్టర్ సౌకర్యాలు సహితం ఆయనకున్నాయి. కానీ ఆయన వెళ్ళలేదు. వెళ్లలేదు అనడంకన్నా  వెళ్లలేకపోయారు అనడం సబబుగా వుంటుందేమో!. దానికి కారణం అందరూ ఊహించగలిగిందే; సెక్యూరిటీ సమస్య. 

వై.యస్. అప్పట్లో చినగంజాంలో తానే డిమాండు చేసినట్టు ఇప్పుడు ముదిగొండ కాల్పులకు బాధ్యులైన పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదుచేయలేరు!. వాళ్లకు జైలు శిక్షలు విధించలేరు!. సరిగ్గా; చంద్రబాబు చేసినట్టే కొందరు పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేసి, మరి కొందర్ని బదిలీ చేస్తారు.  జరిగిన సంఘటనని అందరూ మరిచిపోయిన తరువాత; ఆ పోలీసు అధికారుల సర్వీసులన్నీ ఎలాగూ క్రమబధ్ధమైపోతాయి! చినగంజాంలో పోలీసు అధికారి పృధ్వీనారాయణ విషయంలో  జరిగిందే రేపు ముదిగొండ 'డయ్యర్ల'కూ  జరుగుతుంది. నాలుగేళ్లయ్యక, ఖమ్మం ఏసీపీ రమేష్ బాబును హీరోచేస్తూ రెండు సినీమాలు వచ్చినారావచ్చు! పృధ్వీనారాయణ అనే టైటిల్ తో ఒక సినీమా తీసిన ఘనత మన టాలీవుడ్ కు ఎలాగూవుంది!

పాదయాత్ర నాటి ఫొటో ఆల్బంను పరిశీలిస్తేచాలు; ముఖ్యమంత్రి క్రమంగా పోలీసులపై ఎంతగా ఆధారపడిపోతున్నారో తెలుస్తుంది. మూడేళ్లలో ప్రభుత్వాధినేత వ్యవహార శైలిలో  ఎంత తేడా వచ్చేసిందో అర్థం అవుతుంది.

రాజకీయ సంఘటనలు పునరావృతం కావడం కొత్తేమీకాదు. కానీ, ప్రజా రాజ్యశేఖరుడనిపించుకున్న వై.యస్.ను సహితం పోలీసులు వశీకరణ చేసుకోవడం కొంచెం విచిత్రంగానూ, కొంచెం విషాదంగానూ వుంటుంది.

(రచయిత సీనియర్ పాత్రికేయుడు)
khanyazdani@rvrmail.com

హైదరాబాద్

29-7-2007

Saturday, 11 April 2015

చాలాసార్లు చెప్పాను. మళ్ళీ చెపుతున్నాను.

చాలాసార్లు చెప్పాను. మళ్ళీ చెపుతున్నాను.

నాకు పార్లమెంటరీ రాజకీయాల మీద నమ్మకంలేదు. నేను ఏ  రాజకీయ పార్టీలోనూ సభ్యుడ్నికాను. బీజేపీతోసహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలలోనూ నాకు స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు వున్నారు. ఉద్యోగపరమైన  పరిమితులు అనేకం వున్నప్పటికీ, ఏ సందర్భంలో అయినా సరే, ఏ మాత్రం వీలున్నా నేను ప్రజల పక్షం వహించాలనుకుంటాను. ఆ మేరకు అధికారవర్గాలతో తలపడుతుంటాను.  ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వున్నాయి. చేసిన వాగ్దానాల్ని నెరవేర్చనపుడు వాటిని విమర్శించక తప్పదు. ఇలాంటి  విమర్శలు కొన్ని సందర్భాలలో  విపక్ష రాజకీయ పార్టీలతో  భావసారూప్యం కలిగివున్నా వుండవచ్చు.  నా రచనల్ని అధికారపక్ష మీడియా ప్రచురించదు కనుక అవి అపధ్ధర్మంగా విపక్ష మీడియాలో  వస్తూ వుండవచ్చు.  అదేమీ విపరీతంకాదు.  అయితే, కొందరు ముఖపుస్తక మిత్రులు  నాకు విపక్షాలతో అపవిత్ర కలయికను  కుదిర్చే పనిలో పడ్డారు.


శేషాచలం కాల్పుల మీద నేను పెడుతున్న పోస్టులు సహజంగానే అధికార పార్టి అభిమానులకు ఇబ్బంది కలిగించి వుంటాయి. వాళ్ళు నా పోస్టుల మీద  స్పందించడానికి బదులు  ముదిగొండ కాల్పుల సందర్భంగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని నేను విమర్శించానా? లేదా? అనే పరిశోధనలో పడ్డారు.  ఇలాంటి మెసేజులు నాకు చాలా వస్తున్నాయి. ఫోన్లూ వస్తున్నాయి. విడివిడిగా కాకుండా అందరికీ ఒకేసారి వివరణ ఇవ్వాలని ఈ పోస్టు పెడుతున్నాను.

2007లో ముదిగొండ కాల్పులు జరిగినపుడు నేను సీ-టీవీలో సీనియర్ రిపోర్టరుగా పనిచేస్తున్నాను. సాక్షాత్తు ముఖ్యమంత్రి పేషీ బీటు చూస్తున్నాను. పైగా , అప్పట్లో రాష్ట  ప్రభుత్వం చేపట్టిన బ్రాడ్ బ్యాండ్‍ ప్రాజెక్టు కాంట్రాక్టు సీ-టీవీ చేతుల్లోనే వుంది. అంటే, వైయస్ కు సీ-టీవీ మీద అసహనం  రాకుండా చూసుకోవడం కూడా నా విధి నిర్వహణలో భాగం. అన్నింటికన్నా ముఖ్యమైనది సి-టీవి అధినేత ఆర్వీఆర్ చౌదరి గారితో నాకున్న సెంటిమెంటల్  అనుబంధం. ఇన్ని పరిమితులు వున్నప్పటికీ ముదిగొండ కాల్పుల మీద నేను స్పందించకుండా వుండలేకపోయాను.  జలయజ్ఞం విషయంలోనూ నేను వైయస్ ను, ఆయన నీడిపారుదలా సలహాదారుల్ని వదలలేదు. మీడియా సమావేశాల్లో వైయస్ ను నా అంతగా ఇరుకున పెట్టినవాళ్ళు కూడా వుండరు.

కాల్పులు జులై 28న జరిగాయి, ఆ మరునాడే నేను స్పందించాను. అప్పట్లో  హైదరాబాద్ మిర్రర్ దినపత్రికలో నేను రాస్తున్న'కొంచెం తీపి - కొంచెం చేదు'  కాలమ్  లో "2000 నుండి 2007 వరకు" శీర్షికతో వ్యాసం రాశాను. అందులో ఏకంగా వైయస్ పాలన  అంతమయ్యి చంద్రబాబు పాలన వస్తుందనే సంచలన సంకేతాలు కూడా ఇచ్చాను. అవి :

1. ప్రజలు ప్రభుత్వాధినేతను ఎన్నుకుంటే, ప్రభుత్వాధినేతలు పోలీసుల్ని నమ్ముకుంటారు.
2. ప్రజలపై ఉక్కుపాదాన్ని మోపిన ప్రభుత్వాలన్నీ అనతికాలంలోనే పతనమైపోయాయి.
3. ముదిగొండ కాల్పుల తరువాత తెలుగుదేశం శిబిరంలో మళ్ళీ అధికారాన్ని చేపడతామనే ఆశలు చిగురించాయి.  .... రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు రూపుదిద్దుకుంటున్నట్టు అప్పుడే తొలి సూచనలు వెలువడ్డాయి.
4. పోలీసులు తొలుత ముఖ్యమంత్రికి నీడలా మారారు. ఆ పిదప ముఖ్యమంత్రే పోలీసుల నీడన చేరిపోయారు.

పూర్తి వ్యాసం చదవాలనుకునేవాళ్ల సౌకర్యార్ధం  దాన్ని  నా బ్లాగులో పెట్టాను.