Sunday, 4 October 2026

సార్వత్రిక పౌరస్మృతి* *రాజ్యాంగ బహుళత్వాన్ని రద్దు చేద్దామా?*

 

UCC Controversy

 

*సార్వత్రిక పౌరస్మృతి* 
*రాజ్యాంగ బహుళత్వాన్ని రద్దు చేద్దామా?*

 

*డానీ*

*సమాజ విశ్లేషకులు*

 

బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్న 21 రాష్ట్రాల్లో 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే సార్వత్రిక పౌరస్మృతిని (యూసిసి) అమలు చేస్తామన్న నమ్మకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు.  సార్వత్రిక పౌరస్మృతి అంటే వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, సంరక్షణ వంటి కుటుంబ–వ్యక్తిగత చట్టాలను మతభేదం లేకుండా ఒకే న్యాయవ్యవస్థలోకి తీసుకుని రావడం. “అందరికీ ఒకే చట్టం”, “చట్టం ముందు అందరూ సమానం” అనే మాటలు వినడానికి ఎంతో ఆకర్షణీయంగా ఆదర్శంగా ఉంటాయి. కానీ అసలు ప్రశ్న అక్కడితో ఆగదు. ఆ చట్టాన్ని ఎవరు రూపొందిస్తారు? ఏ సామాజికవర్గాల  సాంప్రదాయాన్ని ప్రమాణికంగా తీసుకుంటారు? ఇతర సమాజాలపై దాన్ని ఎలా ప్రయోగిస్తారు? అనేవే యూసిసిలో ప్రధాన వివాదం.

 

వ్యక్తిగత చట్టం ఎక్కడి నుంచి వచ్చింది?

 

ప్రతి మతసమూహం తనదైన ప్రత్యేక  సంస్కృతిని కలిగివుంటుంది. ఇది బాహ్య వైవిధ్యం. అలాగే, అంతర్గతంగానూ అనేక సమూహాల మధ్య భిన్నత్వం వుంటుంది. ఇది అంతర్గత వైవిధ్యం. సమాజంలో సాంస్కృతికంగా ఇంతటి వైవిధ్యం వున్నప్పుడు సార్వత్రిక నేరస్మృతిని విధించినట్టు  సార్వత్రిక పౌరస్మృతిని విధించడం సాధ్యం కాదు.

 

 మనదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొదలయిన కొత్తలోనే ఫకీర్లు-సన్యాసుల ఉద్యమం చెలరేగింది. స్థానిక సాంస్కృతిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని కంపెనీ పాలకులకు అర్ధం అయింది. మతం ఆధారంగా కుటుంబ వ్యవహారాలను నియంత్రించే చట్టపరమైన పద్ధతి రూపొందింది. కంపెనీ బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ 1772లో జుడీషీయల్ ప్లాన్ రూపొందించాడు.  సాంప్రదాయాలు ఆచారాల విషయంలో హిందువులకు “శాస్త్రాల్ని, ముస్లింలకు ఖురాన్ ను,  వర్తింపచేయాలని న్యాయస్థానాలను ఆదేశించాడు. హిందూ ధర్మశాస్త్రాలు అనేకం వున్నప్పటికీ మనుధర్మశాస్త్రాన్ని ప్రమాణికంగా భావించేవారు.  ఆ క్రమంలో ఆంగ్లో-హిందూ లా, ఆంగ్లో-ముహమ్మడన్ లా రూపొందాయి. బ్రిటీష్ భాషాశాస్త్రవేత్త విలియం జోన్స్ 1794లో Institutes of Hindu Law; or the Ordinances of Manu

పేరుతో మనుస్మృతిని ఇంగ్లీషులోనికి అనువదించాడు.

 

 

హిందూ సమాజాన్ని ఒక వృత్తంలో ఏడు వృత్తాలుగా సమాంతరంగానూ  చూపించవచ్చు. పిరమిడ్ ఆకారంలో నిలువుగానూ చూపించవచ్చు. శిఖరభాగంలో బ్రాహ్మణులు, ఆ కింద క్షత్రీయులు, దాని కింద  వైశ్యులు, దాని కింద ఎగువ శూద్రులు, దాని కింద దిగున శూద్రులు. ఈ ఐదు అంతస్తులనే చాలామంది వర్ణవ్యవస్థ అంటున్నారు. ఆ కింద దళితులు వుంటున్నారు.. కొంతకాలం క్రితం వరకు ఆదివాసులు హిందూ వ్యవస్థకు భిన్నంగావుండేవారు. ఇటీవల జనాభా లెఖ్ఖల్లో ఆరుమతాల్ని మాత్రమే గుర్తిస్తూ ఆదివాసుల్ని హిందూ సమూహపు  గ్రౌండ్ ఫ్లోర్ లో చేర్చారు. దీన్ని  కాగితాల మీద చూస్తే పెద్ద విశేషంగా  అనిపించదు.  కానీ సమాజంలో ఆ రెండు సమూహాలను కలిపినపుడు కొన్ని వివాదాలు చెలరేగుతాయి. ఉదాహరణకు మణిపూర్ లో మెయితీలు, కుకీ జోలు ఒకే సామాజికవర్గం అంటే కుకీ జోలు అంగీకరించకపోవచ్చు.

 

నాడు వారెన్ హేస్టింగ్స్ అనుసరించిన విధానాన్నే రాజ్యాంగ సభ కూడా అనుసరించింది. ఎవరి మతం వారిదీ, ఎవరి ఆరాధనారూపాలు వారివి, ఎవరి సాంస్కృతిక వ్యవహారాలు వారివి అనే అనే నిర్ధారణకు వచ్చింది. మత స్వేఛ్ఛను రాజ్యాంగ బధ్ధం చేసింది. ఉమ్మడి పౌరస్మృతి అంశం కూడ  రాజ్యాంగసభలో చర్చకు వచ్చింది. ఆ తేనెతుట్టెను కదపడం ఇష్టంలేక దాన్ని ఆదేశిక సూత్రాల్లో   44వ అధీకరణంగా పెట్టేశారు.

 

రాజ్యాంగం నాలుగవ షెడ్యూలు లోని  ఆదేశిక సూత్రాల్లో 36 నుండి 51 వరకు 16 అధీకరణలున్నాయి.  ఆర్టికల్ 38 సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం గురించి చెబుతుంది. ఆర్టికల్ 39 సంపద, ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణను నిరోధించడం, సామాజిక వనరులను సామాన్య మేలు కోసం వినియోగించడం గురించి చెబుతుంది. ఆర్టికల్ 41 పని, విద్య, ప్రజా సహాయం వంటి అంశాలపై దృష్టి పెడుతుంది. ఈ ఆదేశాలను పాటిస్తున్నారా? వాటిని పాటించకుండా నేరుగా ఆర్టికల్ 44 చెప్పిందని ఆచరిస్తామనడం సబబేనా?

 

కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370) రద్దు, ఉమ్మడి పౌరస్మృతి (ఆర్టికల్ 44) అమలు అనే డిమాండు  బిజెపి మాతృసంస్థ అయిన జనసంఘ్ కాలం నుండే వున్నాయి. 1980లలొ బాబ్రీమసీదు కూల్చివేత అంశాన్ని కూడా చేర్చుకున్నారు. కాస్త గమనించి చూస్తే ఇవి మూడూ సారాంశంలో ముస్లిం వేధింపు విధానాలని ఎవరికయినా అర్ధం అవుతుంది. లోక్ సభ ఎన్నికలప్పుడు ఈ డిమాండ్లను బిజెపి ముందుకు తెస్తుంటుంది. వీటిల్లో రెండు నెరవేరాయి. 2029 ఎన్నికలకు ఉమ్మడి పౌరస్మృతిని ముందుకు తెచ్చారు.

 

ఉమ్మడి పౌరస్మృతిని తేవడానికి బిజెపి చేస్తున్న వాదన ఒక్కటే.   ముస్లిం స్త్రీల మీద సాగుతున్న అణిచివేతను  అడ్డుకుంటామని. ఇస్లామిక్ పౌరస్మృతిలో తండ్రి ఆస్తిలో కుమార్తెకు ఒకవాటా, కుమారుడికి రెండు వాటాలు ఇస్తారు. ఆ ఒక్క అంశాన్నే విడిగా చూస్తే ఇది  అన్యాయంగానే కనిపిస్తుంది. దీనికో సమర్ధన కూడ వుంది. కుమార్తె పెళ్లి చేసుకుని భర్తతో వెళ్ళిపోతుంది. వృధ్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చూడాల్సిన నైతిక బాధ్యత కొడుకులది.  అంతేకాదు,  కుమార్తె వివాహ సందర్భంలో కట్నకానుకలు  కూడ ఇవ్వాల్సి వుంటుంది. కనుక కొడుకులకు రెట్టింపు వాటా ఇవ్వాలనే సమర్ధన వుంది. ఇది అసమంజసం ఏమీకాదు. చట్త ప్రకారం వరకట్న నిషేధం వుంది. అది ఆచరణలో వుందని ఏ ఒక్కరయినా నమ్ముతారా?

 

ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనం 7వ శతాబ్దం గురించి మాట్లాడుతున్నాము.  ఆ సమయంలో, స్త్రీలకు ఆస్తిహక్కు, నిర్బంధ విద్య, విడాకులు ఇచ్చే సదుపాయం, వితంతు పునర్వివాహం వంటి సంస్కరణల్ని ఇస్లాం చేపట్టింది. ఈ మహిళా సంస్కరణలు అనేక ఇతర సమూహాల్లో వెయ్యేళ్ళ తరువాతకు గానీ చర్చకు రాలేదు.

 

ఇస్లాంలో ఒక వ్యక్తి చనిపోతే అతని ఆస్తి మీద సంతానానికేకాక, భార్య, తల్లిదండ్రులు, సోదరులు, ఇతరులకు కూడ భిన్నమైన నిష్పత్తుల్లో  వారసత్వ హక్కు వస్తుంది. ఈ వాటాల్ని లెక్కగట్టి పంపకాలు జరపడం చాలా చాలా సంక్లిష్ట వ్యవహారం.. 9వ శతాబ్దంలో   పర్షియన్, ఇస్లామిక్, భారతీయ, గ్రీకు, బాబిలోనియన్ గణితశాస్త్రాల నుండి ఆల్ జీబ్రా విభాగాన్ని అభివృధ్ధి చేసిన అల్-ఖ్వారిజ్మీ  ఇస్లామిక్   ఆస్తి పంపకాల  సమస్యను పరిష్కరించాడు. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో విరివిగా వాడుతున్న అల్గారిథమ్స్ అతని పేరు నుండే పుట్టింది.

 

         

          ముస్లిం సమాజాన్ని అదుపు చేయడానికి ఈ చట్టాన్ని తెస్తున్నట్టు బిజెపి పెద్దలు చెపుతున్నప్పటికీ ఇది ఆదివాసుల మీద తీవ్ర ప్రభావాన్ని వేసే ప్రమాదం వుంది. బయటి ప్రపంచానికి అర్ధంకానంత తీవ్ర వైవిధ్యం ఆదివాసుల్లో వుంటుంది. అసలు వాళ్లను పితృస్వామిక సమాజం అనడం కూడ కుదరదు. అది దాదాపుగా మాతృస్వామిక సమాజం. వాళ్ల మీద ఏకీకృత పౌరస్మృతిని రుద్దడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.  భారత రాజ్యాంగంలోని 5,6 షెడ్యూళ్ళలో ప్రత్యేక గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా రక్షణలను కల్పిస్తున్నాయి. అంతేకాదు, నాగాలాండ్‌కు 371ఏ అధీకరణం ద్వార, మిజోరాంకు 371జి ద్వార ప్రత్యేక నిబంధనలు మత, సామాజిక ఆచారాలు, కొన్ని న్యాయపద్ధతులు, భూమి యాజమాన్యం వంటి అంశాల్లో ప్రత్యేక రక్షణలు వున్నాయి. వీటన్నింటినీ రద్దుచేయడానికే ఉమ్మడి పౌడస్మృతిని తెస్తున్నట్టు ఆదివాసి సమాహాలు ఐదారేళ్ల క్రితమే గుర్తించాయి. ఝార్కండ్ లో చాలా పెద్ద సభ నిర్వహించి ఉమ్మడి పౌరస్మృతిని తిరస్కరిస్తున్నట్టు తీర్మానాలు చేశాయి.  ఈ కారణంగానే, తొలిసారిగా ఉత్తరాఖండ్ లో తీసుకునివచ్చిన ఉమ్మడి పౌరస్మృతి చట్టంలో మాదివాసులు, మరికొన్ని సమూహాలకు మినహాయింపునిచ్చారు. కొన్ని సమూహాలను మినహాయిస్తే దానిని ఉమ్మడి పౌరస్మృతి అని ఎలా అంటారో అమిత్ షా చెప్పాలి.

 

 

ముస్లింలు ఎక్కువమందిని పెళ్ళిచేసుకుని, ఎక్కువ మంది పిల్లల్ని కనేస్తున్నారనే ఆరోపణలతో ఒక ప్రచారం సాగుతోంది. “హమ్ పాంచ్, హమారే పచ్చీస్” నిందను నరేందర్ మోదీ స్వయంగా ప్రచారంలో పెట్టారు. జనాభా లెఖ్ఖలు దీన్ని సమర్ధిస్తున్నాయా? ప్రస్తుతం మనదేశంలో చనిపోతున్నవాళ్లకన్నా పుడుతున్నవాళ్ళు తక్కువ. టోటల్ ఫెర్టిలిటీ రేటు  రుణంగా మారిపోతున్న దశలో  ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్లను సన్మానించాలి. ఇలా నిందలేస్తారా? ఇస్లాంలో బహుభార్యత్వానికి ఆమోదంవున్న విషయం వాస్తవం. కానీ, దాన్ని ఆచరిస్తున్నదెంతమందీ? దాదాపుగా అది ఆచరణలో లేదు.   అధికారికంగా బహు భార్యలు వున్నవారిని మనం ఎంతమందిని చూశాం అని ప్రశ్నించుకుంటే ఈ వాదనలోని డొల్లతనం అర్ధం అవుతుంది.

 

జె4న్ జీ ఉద్యమం ఒక నినాదాన్ని ముందుకు తెచ్చింది. – “జబ్ నరేంద్ర మోదీ డర్తా హై; హిందూ ముస్లిం కర్తాహై”. ఈ వ్యూహం  ఎన్నికల్లో తమకు లాభిస్తుందని బిజెపి నమ్ముతోంది. అది ఉమ్మడి పౌరస్మృతికి కూడ వర్తిస్తుంది.  ఉమ్మడి పౌరస్మృతిని తెస్తామంటే అది రాజ్యాంగం కోరుకున్న సామాజిక బహుళత్వాన్ని నిరాకరించడమే అవుతుంది.

05-10-2026

 

 

 

ఇక్కడో చిక్కు వుంది.  మొత్తం హిందూ సమాజం మనుస్మృతిని సివిల్ కోడ్ గా ఏకగ్రీవంగా అంగీకరిస్తుందని చెప్పగలమా?  ఇంతకన్నా పెద్ద చిక్కు ప్రశ్న  ఏమంటే అసలు ‘హిందూ సమాజం’ పరిధి, పరిమితి ఏమిటీ అనేది.

 

శ్రీధర్ వెంకటేశ్ కేట్కర్ 1909లో రాసిన *History of Caste in India*లో కుల వర్గీకరణను విశ్లేషిస్తూ బ్రాహ్మణులను కేంద్ర బిందువుగా తీసుకుని వివిధ వర్ణాలు, కులాలతో హిందూసమాజనిర్మాణం జరిగిందని వివరించారు. అంబేడ్కర్ కూడా హిందూ సమాజాన్ని ఏకశిలా సమూహంగా చూడలేదు, కులం అనేది “దడికట్టిన వర్గం”, “నిచ్చెనమెట్ల వ్యవస్థ” అన్నాడు.

 

 

 

మను పౌరస్మృతిని  బీఆర్ అంబేడ్కర్ మొదటి నుండీ తీవ్రంగా విమర్శించేవాడు. మహాద్  చెరువు నీటి ఉద్యమ కాలంలో 19127 డిసెంబరు 25న ఆయన  మనుస్మృతి ప్రతిని ప్రతీకాత్మకంగా దహనం చేశాడు. స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాలతో మనుస్మృతిని ఎదుర్కోవాలని ఆయన భావించేవాడు. కాలక్రమంలో అవే భారత రాజ్యాంగ ప్రధాన ఆదర్శాలుగా మారాయి. ఈ పరిణామం మనువాదులకు కూడ తెలుసు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినపుడు  ఆరెస్సెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దాని పత్రిక ఆర్గనైజర్ 1950 ఫిబ్రవరి 6 నాటి సంచికలో మనువు తమ తమ హృదయాలను పాలిస్తుంటాడు అని ప్రకటించింది.

 

 

భారత ముస్లిం సమాజంలోనూ అంతస్తులున్నాయి. అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్ అనే  వర్గ విభజన వుంది. అజ్లాఫ్, అర్జాల్ సమూహాలను ఉత్తరాదిన పాస్మందా ముస్లింలు అంటున్నారు. దక్షణాదిన చాలా పేర్లున్నాయి.  నూర్ బాషా, దూదేకుల, లద్దాఫ్ వంటివి.  వాళ్ళు సామాజికంగా హిందూ ఓబిసిలతో సమానం. అయితే,. ఇక్కడ ఒక తేడావుంది. హిందూ సమూహంలో వర్ణ వర్గీకరణకు ధార్మిక సమర్ధన వున్నట్టు,  ఇస్లాంలో ధార్మిక సమర్ధనలేదు. కానీ, ఆచరణ వుంది. ఆ మేరకు సాంస్కృతిక వైవిధ్యం కూడ వుంది.

No comments:

Post a Comment