Monday, 19 October 2026

గతం తెలిస్తే చాలదు; భవిష్యత్తును నిర్మించాలి!

 గతం తెలిస్తే చాలదు; భవిష్యత్తును నిర్మించాలి!

 

డానీ

సమాజ విశ్లేషకులు

 

‘వందేళ్ల భారత కమ్యూనిస్టు ఉద్యమం: గతం, వర్తమానం, భవిష్యత్తు’ అనే అంశంపై సోషల్ సైన్సెస్ ట్రస్టు, ప్రోగ్రెసివ్ ఫోరం సంయుక్తంగా అక్టోబరు 17, 18 తేదీల్లో విజయవాడలో ఒక సదస్సు నిర్వహించాయి. నాలుగు సెషన్లలో పన్నెండుమంది ప్రసంగించారు. విస్తృతంగా చర్చలు కూడ జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమం సాధించిన విజయాలు, ఎదుర్కొన్న పరాజయాలను వక్తలు సమర్థంగా వివరించారు. అయితే, భారతదేశంలో కమ్యూనిస్టుల భవిష్యత్తు కాడ్యక్రమం ఏమిటి? అనే ప్రశ్నకు మాత్రం ఆశించినంత స్పష్టమైన సమాధానాలు లభించలేదు.

 

అది వక్తల తప్పు కాదు. మనం ఒక చారిత్రక కూడలిలో ఉన్నాం. ఓడిపోయి నిలబడ్డాం. రాజ్యాంగబద్ధంగా, ఎన్నికల ద్వారా అధికారాన్ని చేపట్టిన పాలక వ్యవస్థ మతతత్త్వ రాజకీయాలు నడుపుతూ, కార్పొరేట్ ప్రయోజనాలు  నెరవేరుస్తూ అధికార కేంద్రీకరణను సాగిస్తొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎటు వెళ్లాలో తేల్చిచెప్పడం అంత సులభం కాదు. కానీ ఆ ప్రశ్నను వాయిదా వేయడమూ సాధ్యం కాదు.

 

ఉత్పత్తి నైపుణ్యం పెరిగినప్పుడు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పుడు, తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతుంది. మానవాళికి సుఖసౌకర్యాలు పెరగాలి. పని గంటలు తగ్గాలి. మనుషులకు విశ్రాంతి, సృజనాత్మకత, సామాజిక జీవితానికి ఎక్కువ సమయం లభించాలి. కానీ వాస్తవంలో అలా జరుగుతున్నదా?

 

ఉత్పత్తి ప్రక్రియలో శ్రమ విభజన అనివార్యం. అయితే శ్రమ విభజన అనివార్యంగా వర్గ విభజనకు దారితీయాలని నియమం ఏదీలేదు. ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఉత్పత్తి ఫలితాలను ఎవరు స్వాధీనం చేసుకుంటున్నారు? నిర్ణయాధికారం ఎవరికి ఉంది? నిర్ణయాధికారాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారూ? ఈ ప్రశ్నలే వర్గ సంబంధాలను అర్థం చేసుకోవడానికి కీలకం.

 

 

యూరప్‌లో, ముఖ్యంగా ఇంగ్లండ్‌లో, భూస్వామ్య సంబంధాల నుంచి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి జరిగిన పరివర్తనను కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ లోతుగా అధ్యయనం చేశారు. పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు, వేతన శ్రామికుల మధ్య వైరుధ్యాలను విశ్లేషించారు.

 

మార్క్స్ భవిష్యత్ సమాజాన్ని కేవలం ఊహించలేదు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోని అంతర్గత వైరుధ్యాలను విశ్లేషించి, దాని స్థానంలో వర్గాధిపత్యం లేని సమాజం ఏర్పడే అవకాశాలను పరిశీలించాడు. అయితే ఆ కొత్త సమాజాన్ని నిర్మించడానికి అవసరమైన ఒక సంపూర్ణ కార్యక్రమాన్ని ఆయన రూపొందించలేదు.

 

1875లో రాసిన *Critique of the Gotha Programme*లో కమ్యూనిస్టు సమాజపు తొలి దశలో శ్రమకు అనుగుణంగా పంపిణీ జరుగుతుందని, మలి దశలో అవసరాలకు అనుగుణంగా పంపిణీ సాధ్యమవుతుందని వివరించాడు. “ ప్రతి ఒక్కరి నుంచి వారి సామర్థ్యం మేరకు; ప్రతి ఒక్కరికీ వారి శ్రమకు అనుగుణంగా.”“ప్రతి ఒక్కరి నుంచి వారి సామర్థ్యం మేరకు; ప్రతి ఒక్కరికీ వారి అవసరాల మేరకు.” అన్నాడు.

 

మార్క్స్ చెప్పిన సోషలిజం ఆదర్శం ప్రపంచమంతటా కష్టజీవుల్నీ, శ్రామికుల్నీ, అణగారిన సమూహాలనీ, సమస్యల్లోవున్న వారిని  విపరీతంగా ఆకర్షించింది. వీళ్లందరూ తాము ఎదుర్కొంటున్న సమస్యలకు విముక్తి దొరుకుతుందని మార్క్సు అభిమానులుగా మారారు.  అలా కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. వాళ్ల నాయకత్వంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు  జరిగాయి. తక్షణ సమస్యలకు తక్షణ పరిష్కారాలేతప్ప సోషలిస్టు సమాజాన్ని ఎలా నిర్మించాలో ఏ కమ్యూనిస్టు పార్టీకీ ఇప్పటి వరకు అర్ధం కాలేదు. ఎవరికి వాళ్ళు తమకు తెలిసిన ప్రపంచం నుండి, తమకు తెలిసి సమస్యల నుండి  తమకు తెలిసిన విముక్తి మార్గాల నుండి తమతమ పార్టీ కార్యక్రమాల్ని రూపొందించుకున్నారే తప్ప అవి సోషలిస్తు సమాజాన్ని నిర్మిస్తాయనే నమ్మకం లేదు.

 

మొదటి ప్రపంచ యుధ్ధం తరువాత రష్యాలో సోషలిస్టు విప్లవం విజయవంతం అయిందని ప్రచారం సాగింది. రెండవ ప్రపంచ యుధ్ధంలో  ఫాసిజం, నాజిజాలను అంతం చేయడంలో రష్యా చాలా కీలక పాత్ర పోషించింది.  భారత కమ్యూనిస్టు పార్టి  ప్రతినిధి బృందం రష్యా వెళ్ళి  తమకు మార్గదర్శనం చేయమని స్టాలిన్ ను కోరింది. నిజానికి తమది సోషలిస్టు సమాజమో కాదో స్టాలిన్ కే నమ్మకంగా తెలీదు. అయితే ఆయన నిజాయితీపరుడు. తమను అనుసరించవద్దనీ, భారతదేశ వాస్తవ స్థితిగతుల్ని లోతుగా అధ్యయనం చేసి ఆ ప్రకారం స్వంత కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని సలహా ఇచ్చి పంపించేశాడు.

 

ఇదే సన్నివేశం నక్సలైట్ ఉద్యమంలోనూ 1967లో పునరావృతమైంది. చారు మజుందార్ కూడ ఒక ప్రతినిధివర్గాన్ని మావోను సంప్రదించడానికి చైనా పంపించాడు. సరిగ్గా స్టాలిన్ చెప్పిన మాటల్నే మావో కూడ నక్సలైట్ ప్రతినిధివర్గానికి  చెప్పి పంపించాడు.

 

1926 నాటి చైనా సమాజాన్ని మావో అర్ధవలస - అర్ధ భూస్వామ్య సమాజంగా అంచనా వేశాడు.  దాన్ని అంతం చేయడానికి ఓ పదమూడేళ్ళు శ్రమించి 1940లో నూతన ప్రజాస్వామిక విప్లవం అనే పరిష్కారాన్ని సూచించాడు.  1949లో అది విజయవంతం అయిందనికూడ ప్రకటించాడు. తరువాతి పరిణామాలు చైనాలో మరో పెట్టుబడీదారీ వ్యవస్థను సృష్టించాయి.

 

అయితే మేలేమి జరగలేదా అంటే చాలా మేలు జరిగింది. అటు రష్యాలోనూ, ఇటు చైనాలోనూ అందరికీ క్వాలిటీ విద్య అవకాశాలు వచ్చాయి. వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులోనికి తెచ్చారు. స్త్రీలకు సమానత్వం లభించింది. సమాజంలో మానవీయ విలువలు పెరిగాయి. జీవనస్థాయి మెరుగుపడింది.  

 

విచిత్రం ఏమంటే; స్టాలిన్ వారించినా సరే రష్యామార్గమే తమ మార్గమని నాటి సిపిఐ నిర్ణయించుకున్నట్టు,  మావో వద్దన్నా సరే చైనా మార్గాన్నే తమ మార్గంగా సిపిఐ ఎంఎల్  ఎంచుకుంది. అది అంతటితో ఆగలేదు; చైనా ఛైర్మనే తమ ఛైర్మన్ అని కూడ  ప్రకటించింది. దానికి కొనసాగింపే సిపిఐ మావోయిస్టు పార్టి. చరిత్రలో కొన్ని ఫన్నీ సీన్స్ ఇలా చాలా సీరియస్ గా జరుగుతుంటాయి. అవి తమ సహజమైన ముగింపుకు చేరుకోక తప్పదు.

 

సమాజాల్లో పనిచేసేవారు, పని చేయించుకునేవారు; పాలితులు, పాలకులు అనే విభజనలు వివిధ రూపాల్లో కనిపిస్తాయి. కొన్ని సమాజాల్లో సామాజిక చలనశీలతకు అవకాశం ఉంటుంది. మరికొన్ని సమాజాల్లో జన్మ ఆధారిత స్థానం, వారసత్వ హక్కులు, సామాజిక నిషేధాలు అసమానతలను స్థిరపరుస్తాయి. భారతీయ మత వ్యవస్థ, కుల వ్యవస్థ ఈ రెండో లక్షణాన్ని చారిత్రకంగా బలంగా ప్రదర్శించింది.

 

వర్గ సమస్యను ఆర్ధిక సంబంధాల ప్రాతిపదికగా అధ్యయనం చేస్తే భారత సమాజం పూర్తిగా అర్థం కాదు. మతం, కులం, సంపద మీద అధికారం  సామాజిక గౌరవం, రాజకీయ అధికారం మధ్య సంబంధాలను కూడా పరిశీలించాలి.

 

హిందూసమాజం విస్తృత సేవక సమూహాలను ఏర్పరచుకుని అనాదిగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. రాజ్యాంగం ఈ సేవక సమూహాలకు పూర్తి స్వేచ్చను ఇవ్వలేదుగానీ,  ఏదో ఒక స్థాయిలో సర్దుబాటు చేసుకుంది. అలా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి *హిందూ సమాజానికి వెలుపలవున్న   ముస్లింలు, ఆదివాసుల్ని కొత్త సేవక సమూహంగా మార్చే ప్రక్రియ అరంభం అయింది. ఇది ఇటీవలి కాలంలో వేగాన్ని పుంజుకుంది. దీనివల్ల పాలకులకు ఆర్ధిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, సాంస్కృతిక ప్రయోజనాలు మూడూ వున్నాయి. వర్తమాన భారత సమాజంలో ముస్లింలను ప్రధాన బాధితులుగా గుర్తించని మార్క్సిస్టులు ఎన్నటికీ భారత సమాజానికి విముక్తి మార్గాన్ని సూచించలేరు*.

 

భారత రాజకీయార్ధిక సామాజిక  సాంస్కృతిక రంగాల్లో మూడు బలమైన ధోరణులు కన్పిస్తున్నాయి. మొదటిది; దామోదర్ వినాయక్ సావర్కర్ ప్రతిపాదించిన హిందూత్వ సిధ్ధాంతం. భారతదేశంలోని సమస్తరంగాల్లో హిందువులు పాలకులుగా వుండాలి; ఇతరులు పాలితులుగా వుండాలి లేదా దేశం విడిచి వెళ్ళిపోవాలి అనేది దీని సులభ తాత్పర్యం. అయితే హిందూ సమాజంలో భాగమైనవారిలోనూ ఈ సిధ్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే వుంది. రెండవది; హిందూ సమాజనికి దూరంగా అడవుల్లో తమదైన సమాజాన్ని కొనసాగించుకోవాలని ఆదివాసులు భావిస్తున్నారు. మూడవది; నూతన ఆర్ధిక విధానాలు వచ్చాక కార్మికుల స్వభావ స్వరూపాలు మారిపోయాయి. గిగ్ వర్కర్లు, అస్థిర కార్మికులు (ప్రికారియేట్) పెరుగుతున్నారు.

 

నాలుగవది;  మత సామరస్యమే ప్రామాణికం కావాలనే వాదన కూడ ఒకటి ఇప్పుడు బలంగా వినిపిస్తున్నది. దీనిని ప్రధానంగా భారత ముస్లిం సమాజం కోరుకుంటున్నది. హిందూ సమాజంలోని ఉదారవాద సమూహాలు సహితం దీన్ని సమర్ధిస్తున్నాయి. అలాంటి వారు ఎంత  బలంగా వున్నారు అనేది  వేరే చర్చ.

 

కుల సమస్యను హిందూ సమాజపు అంతర్గత వ్యవహారంగా పరిమితం చేసి. హిందూ- ముస్లిం బైనరీతో రాజ్యాధికారాన్ని కొనసాగించాలనే తలంపులతో నేటి పాలకవర్గాలు వున్నాయి. ప్రజలు కులం, మతం  వివాదాల్లో మునిగి వున్నప్పుడు సహజవనరులన్నింటినీ తమ ఖాతాల్లో వేసుకునే పనిలో కార్పొరేట్ సంస్థలున్నాయి. వీటిల్లో మెగా కార్పొరేట్లు ప్రభుత్వ ఆశిస్సులతో మరీ చురుగ్గా వున్నాయి.  మెగా కార్పొరేట్ల ఆశిస్సులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయనే వాదన కూడ బలంగానే వుంది.  

 

హిందూ సమాజం లోపల  ఎస్సీలు, బిసిలు, హిందూ సమాజం వెలుపల ఆదివాసులు, మత మైనారిటీలు, గిగ్ వర్కర్లు నేటి అణగారిన సమూహాలు. వీరి విముక్తికి ఏవైనా ఆచరణాత్మక కార్యక్రమాన్ని  కమ్యూనిస్టు పార్టీలు రూపొందించాలి. లేకుంటే …. ???  

 

20-10-2026

No comments:

Post a Comment