Books
పుస్తకాలు
ఇరవై అరలున్న నా పుస్తకాల గది నుండి ఆరు అరలున్న గదిలోనికి
మారాల్సి వచ్చింది. ఆర్ధికంగా ఇది అనివార్యం.
నా పుస్తకాల కలెక్షన్లలో 70 శాతం తీసివేయాలి. తప్పదు. వేటిని వుంచుకోవాలీ? వేటిని
వదులుకోవాలీ? అనేది చాలా పెద్ద సవాలు.
బెడ్ టైమ్ కథలతో నాకు సాహిత్యంతో
ఒక అనుబంధం ఏర్పడింది. మా అమ్మమ్మ ప్రతిరాత్రి అరేబియన్ నైట్స్ తదితర కథలు చెప్పేది.
అప్పట్లోనే మా ఇంటికి షయా ఉర్దు పత్రిక వచ్చేది. అందులో గాడిద కథ వుండేది. వారంవారం
మా అమ్మమ్మ దాన్ని చదివి వినిపించేది. అది ఏక్ గసర్గుజిస్ట్’ అనీ దాని రచయిత కిషన్
చందర్ అనీ నాకు ఓ ఇరవై ఏళ్ల తరువాత తెలిసింది.
మిడిల్ స్కూలులో పుష్పలత టీచర్,
యూసుఫ్ మాస్టారు కూడ క్లాసులో చాలా ఆసక్తి కలిగించేలా జాపద కథలు చెప్పేవాళ్ళు వాళ్ల
ప్రభావంతోనే అనుకుంటాను నేను లైబ్రరీకి వెళ్ళి చందమామ మాస పత్రికతోపాటు పిల్లల బొమ్మల
కథలు అనేకం చదివేవాడిని. వాటి పబ్లిషర్లు రాజమండ్రివారు అని గుర్తుంది.
ఆరేళ్ళు ఉర్దూ-అరబ్బి వాతావరణంలో
పెరిగి తెలుగు స్కూలుకు వచ్చినవాడిని. పైగా నాకు భీకర ఉబ్బసం వుండేది. నా ఉఛ్ఛారణను
తోటి విద్యార్ఢులు ఆట పట్టించేవాళ్ళు. నేను టెక్ట్స్ పుస్తకాలతో పాటు లైబ్రరీ పుస్తకాలు
కూడ చదవడమేగాక, ఎనిమిదో తరగతిలోనే ఒక చిన స్కిట్ రాసి ప్రదర్శించాక నాకో చిన్న గుర్తింపు
వచ్చింది. అవమానాలు తగ్గాయి. పుస్తకాలు నాకు చేసిన తొలి మేలు ఇది.
పుస్తకాలు నాకు ఇంకో మేలు కూడ చేశాయి.
నేను అప్పడు హాఫ్ ఆర్ఫన్ ని. అప్పుల బాధ భరించలేక మానాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు.
మా అమ్మీ కుటుంబ భారాన్నీ తన భుజాలకు ఎత్తుకుంది. మమ్మల్ని సాకింది. చదివించింది. కొన్నిరాత్రుళ్ళు అన్నం వుండేది కాదు. ఆ విషయం మాకు
చెప్పలేక మా అమ్మ హజ్రత్ ఉమర్ కాలపు ఒక కథ చెప్పేది. వారు ప్రతిరాత్రి దేశప్రజల స్థితిగతుల్ని
తెలుసుకోవడానికి నగరంలో సంచరిస్తుంటారు. ఉరి చివర ఒక చెట్టు కింద ఒకామె పొయ్యి మీద
కుండపెట్టి వంట చేస్తుంటుంది. పిల్లలు ఆతృతగా ఆకలితో ఎదురుచూస్తుంటారు. ఎప్పటికీ వంట
పూర్తికాదు. వాళ్ళు అలిసి నిద్రపోతారు. పిల్లలు నిద్రపోయాక తల్లి పొయ్యి ఆర్పి తనుకూడా
వాళ్ల పక్కన నిద్రపోతుంది. ఇదంతా చూస్తున్న హజ్రత్ ఉమార్ దగ్గరకు వెళ్ళి ఆ కుండ మీదున్న
మూత తీసి చూస్తారు. అందులో నీళ్ళు మాత్రమే వుంటాయి.
ఈ కథ మా అమ్మ చెప్పిందంటే అన్నం
వండలేదని అర్ధం. ఆ మాట నేరుగా చెప్పలేక కథ చెప్పేది. మరునాడు నేను వెళ్ళి పనిలో చేరాను.
నేను చదువుకోవాలని, ఇంగ్లీషు మాట్లాడాలని మా
అమ్మ గట్టిగా చెప్పేది కనుక చదువు మానకుండ పార్ట్ టైమ్ బాల కార్మికుడిగా మారాను. ఆకలంత
సహజంగా, అన్నమంత అవసరంగా, జీవించే మార్గాన్ని చూపించే మార్గదర్శిగా నా జీవితంలోనికి
అలా సాహిత్యం ప్రవేశించింది.
మా అమ్మను సంతోషపెట్టాలని నేను కూడ
సాహిత్యాన్నే వాడాను. లైబ్రరీలో చదివిన లవకుశలు,
బాల చంద్రుడు, బాలవర్ధిరాజు, అభిమన్యుడి కథల్ని మా అమ్మకు వినిపించే వాడిని. ఈ కథలు
అన్నింటిలోనూ ప్రధాన పాత్రలకు తండ్రులు దూరంగా వుంటారు. తల్లి దగ్గరే పెరుగుతుంటారు.
నేను ఆ కథల్ని ఎందుకు చెపుతున్నానో మా అమ్మకు
తెలుసు. “మనకు కూడ మంచిరోజులు వస్తాయి. అప్పటి వరకు మనం ఆరోగ్యంతో బతికి వుండాలి” అనేది.
ఈ ఆరోగ్య పాలన కూడ మా ఇద్దరి జీవన విధానంలో
భాగం అయ్యింది. అలా సాహిత్యం వినియోగ వస్తువు అయిపోయియింది.
యుక్తవయస్సు వచ్చాక మా తరం అంతా డిటెక్టివ్ నవలలు, సెక్స్ పుస్తకాలు
అద్దెకు తీసుకుని చదివేవారు. నేనూ చదివానుగానీ చాలా తక్కువ కాలం. మా ప్రాంతంలో ఒక్క
రూపాయికి సెక్స్ దొరికేది. దానికోసం అద్దె కట్టి పుస్తకాలు చదవడం దండగ అనిపించేది.
నరసాపురం, పాలకొల్లులో సాంఘీక నాటకాల
బృందాలు చాలా వుండేవి. కాలేజీ నాటికల్లోనేగాక బయట పరిషత్తు నాటికల్లోనూ నటించాను. మేము
భమిడిపాటి రాధాకృష్ట వంటి పెద్ద రచయితల నాటకాలు వేసేవాళ్ళం. కొన్ని బృందాలు స్వంతంగానే రాసి ప్రదర్శించేవి. మా మధ్య పోటీ వచ్చి
మేమే స్వంతంగా ఒక నాటిక రాయాల్సి వచ్చింది. మా టీమ్ ఆ బాధ్యతను నాకే అప్పచెప్పింది.
నాకు అప్పటికే ఇంగ్లీషు సాహిత్యంతో కొంత పరిచయం వుంది. అకడమిక్ గా ఛార్లెస్ డికెన్స్
ను ఎలాగూ చదివాను. పెర్ల్ ఎస్. బక్, సోమర్ సెట్ మామ్ నవలలు కొన్ని చదివాను. అలా ఒక కొత్త ప్లాట్ తో ‘ప్రగతి’
నాటిక రాశాను. దానికి ధవళా సత్యంగారు దర్శకత్వం వహించారు. సాహిత్యరంగంలో వారు నాకు
తొలిగురువు. వారి గురువు ఎం.జీ. రామారావుగారు. వారు నా నాటికకు అవసరమైన పాట రాసిచ్చారు. ఆ నాటిక చాలా పెద్ద హిట్టు అయ్యింది.
అలా కమ్యూనిస్టు సమూహాలతో పరిచయం ఏర్పడింది. ఒకసారి ఎంజీ రామారావుగారు నాకు గోర్కి
అమ్మ పుస్తకాన్ని బహూకరించారు. అది నా సాహిత్య దృక్పథాన్నే మార్చేసింది. మా అమ్మమ్మలా
పాఠకుడ్ని ఒళ్ళో పెట్టుకుని కథ చెపుతాడు గోర్కి. ఈ సామర్ధ్యం ఇతరుల్లో మనకు చాలా అరుదుగా
కనిపిస్తుంది.
రాడికల్ గా మారాక నాకు తెగ నచ్చిన
రచయిత జాక్ లండన్. మా ఇద్దరి జీవితాల్లోనూ చాలా పోలికలున్నాయి. పగలంతా కొట్లాటలు తన్నుకోవడాలు.
గాయాలు. రాత్రంతా సాహిత్య సృజన. ఈ విషయాన్ని ఆశ్చర్యకరంగా కాళీ పట్నం రామారావుగారు
గుర్తించారు. వారొకసారి నన్నూ కలవడానికి ప్రత్యేకించి వచ్చి “మీలో ఒక జాక్ లండన్ వున్నాడండి’ అన్నారు. చాలా ఆనందం వేసింది. రాసే సమయంలో
రచయిత ఒక యుధ్ధానికి సిధ్ధపడాలి. పురాణ కవుల్లో నాకు తిక్కన శైలి ఇష్టం.
యువ రచయితలు తొలి రోజుల్లో గుర్తింపు
సమస్యను ఎదుర్కొంటుంటారు. నేను చాలా అదృష్టవంతుడ్ని నాకు ఆ సంక్షోభం ఎప్పుడూ రాలేదు.
మొదట్లోనే ధవళా సత్యం, ఎంజి రామారావు వంటి వారి సాంగత్యం లభించింది. కాళోజీ వంటి ఉద్దండులు నా ‘ప్రహ్లాదుడు’ కథను ఆకాశానికి
ఎత్తేశారు. కాళీపట్నం రామారావు విషయం ఇంతకు ముందే చెప్పాను. రావి శాస్త్రిగారు ‘కృపాణ్’
కథను చదివి చలసాని ప్రసాద్ తో “ఇలా రేసే వారు విరసంలో ఇంకా వున్నారా?” అన్నారట. నా
పుస్తకావిష్కరణ సభలో వరవరరావు “డానీ ఒక హీరో” అని ప్రకటించారు. అంతకన్నా గుర్తింపేమిటీ?
అభిమానంతో నా గురించి కొన్ని మంచి వాక్యాలు రాసిన వారున్నారు. రావులపాటి సీతారామ్ నా
‘మదరసా మేకపిల్ల’ ముందు మాటలో చాలా గొప్ప మాటలు
చెప్పాడు. అలాగే, గుంటూరు లక్ష్మీ నరసయ్య నా
పుట్టిన రోజు రైటప్ లో చాలా మంచి మాటలు రాశాడు. ఖాదర్ కూడ ‘పుట్టుమచ్చ’ ముందు మాటలో
నా గురించి విలువైన మాటలు అన్నాడు. అందరికీ ధన్యవాదాలు.
ఒకటి రెండు కవితలు రాసినప్పటికీ
కవిత్వం నా కప్ ఆఫ్ టీ కాదు. పైగా పద్యం అంతరించిపోయినట్టు కవిత్వం ప్రక్రియ కూడ సమీప
భవిష్యత్తులో అంతరించిపోతుందనే అభిప్రాయం నాకెక్కడో వుంది. కథల్ని కూడ రొటీన్ గా మార్చేస్తున్నారు.
ఓ గైడీ మాపాసా, ఓ సాదత్ హసన్ మంటోలా మన కథలు ఈ తరం వాళ్లకే ఎందుకు గుర్తుండడంలేదు?.
చెఖోవ్, లూసన్ అంతటి తెలివిని మన తరం ఎందుకు ప్రదర్శించలేకపోతున్నదీ?
No comments:
Post a Comment