Saturday, 17 October 2026

కపట మార్క్సిస్టులు విప్లవాలకు నాయకత్వం వహించలేరు

కపట మార్క్సిస్టులు విప్లవాలకు నాయకత్వం వహించలేరు

 

డానీ

సమాజ విశ్లేషకులు

 

 ‘విప్లవోద్యమం :  కామ్రేడ్ కేఎస్ తదుపరి నాయకత్వం’ శీర్షికతో ఎన్ రవి  రాసిన వ్యాసాన్ని అరుణతార 2026 అక్టోబరు సంచికలో  ప్రచురించింది. నక్సలైటు ఉద్యమం ముగియడం మీద ఇటీవల నేను వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్ని ఖండించడానికి రాసిన వ్యాసం ఇది. నా రచనల మీద వచ్చే కామెంట్లు, వ్యాసాలను సాధారణంగా పట్టించుకోను. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి స్పందించినపుడు మాత్రం ఒకసారి ప్రతిస్పందించాను. జంతర్ మంతర్ వద్ద జెన్ –జీ నిరసనల్నివిజయవంతంగా  నిర్వహించి, సింహాసనాన్ని వణికించి  దేశప్రజల్లో నియంతల పట్ల  భయాన్ని పోగొట్టినపుడు దళిత అభిజిత్ దీప్కే నేటి హీరో అని ప్రకటించాను.  దాన్ని ఖండిస్తూ ఓ కిరాయి కోటిగారు; సింహాసనం వణకలేదు; ప్రజాస్వామ్య విలువలతో ప్రతిస్పందించిందని ఓ వ్యాసం రాశారు. దాన్నీ పట్టించుకోలేదు. 


నక్సలైట్ ఉద్యమంలో ఎన్ రవి ఏ కీలక బాధ్యతలు నిర్వహించారో నాకు  తెలీదు. అలాంటివాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాను. వారి వ్యాసం అరుణతారలో వచ్చింది కనుక పట్టించుకోవాల్సివచ్చింది. ఇది నేను అరుణతారకు ఇస్తున్న గౌరవం; రవికి ఏమాత్రం కాదు.

 

కేఎస్, టిఎన్, సిపి, వీరన్న, లింపియావో, ఎంఎం, రవూఫ్ తదితర నాయకుల పేర్లతో నక్సలైట్ గ్రూపుల్ని సంభోదించే సాంప్రదాయం మనకు మొదటి నుండీ వుంది.  ఇంతకు  ముందు పీపుల్స్ వార్ ను కేఎస్ వర్గం అనేవారు; ఆ తరువాత గణపతి వర్గం అంటున్నారు. వర్గం అన్నప్పుడు ఒక్కడు అనికాదు ఒక బృందం అనే అర్ధం. అది ఏకవచనం కాదు; బహువచనం. ఇంత చిన్న వివరణ ఇవ్వడానికి ఒక వ్యాసం రాయాల్సిన పనిలేదు.

 

దాదాపు కాలి బూడిద అయిపోయిన విప్లవోద్యమాన్ని ఫీనిక్స్  పక్షిలా ప్రాణం పోసి ఏపుగా పెంచిన ఘనత కొండపల్లి సీతారామయ్యది. ఈ మాటను నాకన్నా ముందే చాలామంది చాలాసార్లు అన్నారు. నాకూ అదే అభిప్రాయం వుంది. దానికి కొనసాగింపుగా, “ఏపుగా పెరిగిన విప్లవోద్యమాన్ని కాల్చి బూడిద చేసిన ఘనత గణపతిది” అన్నాను. ఆ పని చేసింది గణపతి ఒక్కరేకాదు; నల్లా ఆదిరెడ్డి, చెరుకూరి రాజ్ కుమార్, మల్లోజుల కోటేశ్వరరావు, నంబాళ కేశవరావు, మల్లా రాజిరెడ్డిలతో కూడిన సమిష్టి నాయకత్వం ఈ పనిచేసింది అని జాబితాను పెంచారు ఎన్ రవి. ఒక్కరు చేసినా అరడజను మంది చేసినా జరిగింది ఒక్కటే. మల్లోజుల వేణుగోపాల్ తదితరులు నిర్వహించిన లొంగుబాటు జాతరకు ఈ నాయకత్వ బృందానికి సంబంధం లేదందామా? ఈ ప్రపంచంలో సంబంధం లేకుండా ఏదైనా వుంటుందా? ఆంటాలజీ!

 

‍ అతిశయోక్తులతో కేఎస్ ను నేను ఎన్నడూ పొగడలేదు. ఆయన్ను రాతలో విమర్శించిన సందర్భాలూ వున్నాయి.  ప్రతి ఒక్కరికీ ఒక చారిత్రక పరిమితి వుంటుంది. స్వయంగా కార్ల్ మార్క్స్ కు సామ్రాజ్యవాదం గురించి తెలీదు. ఆ విషయాన్ని లెనిన్ మాత్రమే చెప్పగలడు. ఇద్దరి కాలాలు వేరుకనుక. నా అంచనా మేరకు 1990ల ఆరంభం వరకే కేఎస్ పరిమితి. ఒకవేళ 1990 తరువాత కూడ ఆయన ఉద్యమ నాయకత్వంలో కొనసాగి వుంటే కొత్త ప్రపంచాన్ని అర్ధం చేసుకుని కొత్త సవాళ్లను అధిగమించేవారేమో  అన్నది ఒక ఊహాగానం మాత్రమే. హైపోథీసిస్.

 

1990ల ముందు కాలాన్ని కేఎస్ స్థూలంగా సరిగ్గానే విశ్లేషించారు. గణపతి బృందానికి వుండాల్సింది 1990ల తరువాతి కాలానికి సంబంధించిన లోతైన అవగాహన. అది వారికి లేదు. రవి వ్యాసంలోనే ఈ విమర్శలకు అనేక రుజువులున్నాయి.. “దేశంలో ఎన్నో ఆర్ధిక, సామాజిక మార్పులు సంభవిస్తున్నాయని గుర్తిస్తూ వాటిని అధ్యయనం చేయడానికి ప్రయత్నం జరిగిందిగానీ ఆ అధ్యయనంగానీ, దానికి అనుగుణంగా సాగాల్సిన ఆచరణగానీ మారిన పరిస్థితులకు సరిపోలలేదు”. “పార్టి నాయకత్వం సమిష్టిగానే విఫ్లలం అయ్యింది” .  “గత దశాబ్దకాలంలో ఓటమి తరువాత ఓటమిని ఎదుర్కొంటూ చివరకు సాయుధ ఉద్యమమే లేకుండా పోయింది” వంటి నిర్ధారణలు రవి వ్యాసంలో అనేకం కనిపిస్తాయి.

 

ఇంతకూ ఈ వ్యాసకర్త నాతో ఎక్కడ విభేదిస్తున్నట్టూ?  గణపతి ఒక్కరే కాదు; నాయకత్వంలో అందరూ విఫలం అయ్యారు అని చెప్పాడానికి మాత్రమే రవి ఈ వ్యాసం రాసినట్టున్నారు. రవి చేస్తున్న సవరణతో నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నేను ఆమోదిస్తున్నాను. నా విమర్శల్ని ఆయన మరో మాటల్లో బలపరుస్తున్నారు. ధన్యవాదాలు రవి గారు!

 

ఇన్నాళ్ళూ నేను ఉద్యమానికి గర్భస్రావం జరిగిందనే భావనలో వున్నాను. ఈమధ్య తెలిసిన వివరాలు ఏమంటే మల్లోజుల బృందం ఉద్యమ గర్భసంచిని సహితం తొలగించి వచ్చిందట. దీనికి రవి చెప్పే సమిష్టి నాయకత్వం సమిష్టిగా బాధ్యత వహించదా?  

 

వ్యవస్థ భరించలేనంతగా కుళ్ళిపోయినప్పుడెల్లా యువతరం తిరగబడడం కొత్తదేమీకాదు. 1960-70లల్లో చెలరేగిన నక్సల్బరీ ఉద్యమాన్ని నడిపింది బేబీ బూమర్సే. (నేను ఆ తరానికి చెందినవాడిని) 2026లో బేబి బూమర్స్ ల సాయుధ ఉద్యమం ముగియడం జెన్ జీలు నిరసనోద్యమాన్ని చేపట్టడం యాధ్డిఛ్ఛికం కాదు. అదొక చరిత్ర క్రమం. మళ్ళీ ఆంటాలజీ! ఒకటి ముగిసి మరొకటి మొదలవుతుంది.

 

సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక రంగాల్లో 1990లలో ఏర్పడిన కొత్త పరిణామాల సిండ్రోమ్ ను పీపుల్స్ వార్, / మావోయిస్టు పార్టిలు అధ్యయనం చేసి రూపొందించిన కొత్త సిధ్ధాంతాల డొల్లతనాన్ని అర్ధం చేసుకోవడానికి కూడ రవి వ్యాసంలో అనేక ఆధారాలున్నాయి.

 

సాంస్కృతిక అంశాల మీద నక్సలైట్ నాయకుల నిర్లిప్త వైఖరికి ప్రతిస్పందనగా అస్తిత్వ/ఉనికివాద ఉద్యమాలు వచ్చాయి. అస్తిత్వ ఉద్యమాల వ్యవస్థాపకులు నక్సలైట్/కమ్యూనిస్టు ఉద్యమాల నుండి వచ్చినవారే.  “మేమెంతో మాకంతా”, “జిస్కీ జిత్ని సంఖ్యాభారీ; ఉస్కి ఉత్ని హిస్సెదారి” నినాదాలు ఇచ్చారు వాళ్ళు.  “ప్రతి ఒక్కరికీ వారి శ్రమకు  తగినట్లుగా”అలాగే  “ప్రతి ఒక్కరి నుండి వారి సామర్థ్యానికి తగినట్లుగా, ప్రతి ఒక్కరికీ వారి అవసరాలకు తగినట్లుగా!” అనే సామ్యవాద సమాజపు నియమాలకు వర్తమాన  పరావర్తనాలే ఆ నినాదాలు. ఆ మాత్రం ఇంగితం పీపుల్స్ వార్ సమిష్టి నాయకులకు లేదు. బేబీ బూమర్స్ చాలా పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమాల్లో చేరారు. వీటిని అడ్డుకోవడానికి  చాలా బలహీనమైన సిధ్ధాంతాలని పీపుల్స్ వార్ రూపొందించింది..

 

“(అస్తిత్వవాద)  పోరాటాలను బ్రాహ్మణీయ ఫ్యూడల్ భావజాలంతోపాటూ, సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా, దానితోపాటు ఆ సంస్కృతికి పునాదిగా నిలచిన వ్యవస్థను కూలదోసే వర్గపోరాటంగా మలచినపుడు మాత్రమే అది సాధ్యపడుతుందనే సైధ్ధాంతిక పోరాటం చేయవలసివస్తున్నది”.

 

పెద్ద పెద్ద గంభీర పదాలు తప్ప ఇందులో ఏ సిధ్ధాంతమూ లేదు. పోనీ ఆ సిధ్ధాంతాన్ని వాళ్లు ఆచరించిన దాఖలాలూ లేవు. ఇంగ్లీషువాళ్ళు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి మధ్యమధ్యలో లాటిన్ పదాలు వాడుతారు. ఈ ఆస్థాన మార్క్సిస్టు సిధ్ధాంతవేత్తలు సంస్కృత పదాలను తెగ వాడుతారు. నేల మీదికి తీసుకునివస్తే ఈ సిధ్ధాంతం బలం ఏమిటో తేలిపోతుంది.

 

“కోటాలు కాదు; ఎర్రకోట కావాలి” అంటూ మహత్తర నినాదాన్ని రంగంల్లోనికి దించారు. “ఇప్పుడు కోటాలు కావాలి; అంతిమంగా ఎర్రకోట కూడ కావాలి” అనవచ్చుగా. ఎర్రకోటను స్వాధీనం చేసుకోవడానికి మీకు ఎన్నేళ్ళు కావాలీ? వందేళ్ళు సరిపోతాయా? ఇది జరిగి నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయి. ఎర్రకోట కాదుకదా వున్న అబూజ్ మడ్ కూడ వదులుకుని సమూహంగా లొంగిపోయారు. మీరు చెప్పింది సాకారం చేసే దమ్ము మీకు లేనపుడు కోటాలు వద్దనే బూటకపు ప్రగల్భాలు దేనికీ? పైగా “ఇవన్నీ ఈ కాలంలో జరిగిన ప్రధాన సైధ్ధాంతిక పురోగతులలో కొన్ని మాత్రమే” అని ఘనంగా ముక్తాయింపు. ఇదా ప్రధాన సైధ్ధాంతిక పురోగతి!

 

అస్తిత్వవాద సమూహాల సామాజిక న్యాయం అంశం ముందుకు వచ్చినపుడు బేబీ బూమర్స్ సాయుధ ఉద్యమం నుండి బయటికి వచ్చి  వారి పక్షం వహించారు. 1984 ఢిల్లీ అల్లర్లు, 1985 కారంచెడు  హత్యాకాండ సమయంలోనే ఈ పరిణామాల్లో భాగం అయ్యాను. ఆపిదప బిఎస్ రాములు, గుంటూరు లక్షీ నరసయ్య, ఖాదర్ మొహియుద్దీన్, ఉసా  తదితరులు 1990లకు ముందే అస్థిత్వవాదులుగా ముందుకు వచ్చారు.

 

గణపతికి మద్దతుగా రవి ఒక హాస్యాస్పద అంశాన్ని ముందుకు తెచ్చారు. 1970లలో ప్రజాసంఘాలలో సభ్యత్వానికి కూడ మార్కిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానాన్ని ఆమోదించాలనే నియమం వుండేది. ఇలాంటి “అతివాద” విధానాన్ని తొలగించి గణపతి ప్రజాసంఘాల్లో సభ్యత్వాన్ని సరళీకృతం చేశారని రవి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక్కడ కీలక ప్రశ్న ఏమంటే, సభ్యత్వాన్ని  సరళీకృతం చేసిన తరువాత ప్రజలు గుంపులు గుంపులుగా  వచ్చి చేరారా? లేక వున్నవాళ్ళే గుంపులు గుంపులుగా  దూరమైపోయారా?  రెండవదే జరిగింది అని చరిత్ర చెపుతోంది. ఈ మాత్రం దానికి గేట్లు ఎత్తేశామని గొప్పలు చెప్పుకోవడం దేనికీ?  రవి మీద వ్యక్తిగతంగా సాఫ్ట్ కార్నర్ వుంది. వారు ఇంత అమాయకులని తెలీదు. అమాయకులు ఇతరులకు సిధ్ధాంతాలను బోధించే దుస్సహసాలకు పాల్పడ కూడదు!

 

ముస్లిం, శిక్కు సమూహాలకు దృశ్యమానత (vigibility) ఎక్కువ. వంద మందిలో పది మంది వున్నాసరే వాళ్ళే ప్రముఖంగా కనిపిస్తారు. హిందూ-ముస్లిం బైనరీ మీద దేశ రాజకీయాలు నడుస్తున్నప్పుడు తాము ఏం చేస్తే ఏ నిందవస్తుందోననే సెల్ఫ్ సెన్సారింగ్, సెల్ఫ్ రిస్ట్రైనింగ్ మోడ్ లో ముస్లిం సమాజం దాదాపు పుష్కర కాలంగా మసులుకుంటున్నది. “జబ్ జబ్ మోదీ డరేగా – తబ్ తబ్ హిందూ ముస్లిం కరేగా” అంటూ ఢిల్లీ జంతర్ మంతర్ లో జెన్-జీ బొద్దింకలు ముందుకు తెచ్చిన నినాదం ఇప్పుడు దేశమంతా మార్మోగుతోంది.  

హిందూ - ముస్లీం బైనరీ మీద దేశ రాజకీయాలు నడుస్తున్నప్పుడు దాన్ని ఎప్పుడయినా పీపుల్స్ వార్ / మావోయిస్టు పార్టి లోతుగా విశ్లేషించాయా?  కేవి రమణా రెడ్డి, కే బాలగోపాల్ వంటి కొందరు ఆలోచనాపరులు  ఆ మేధోమధనం గావించారు. పార్టీ లైన్ ఏమిటీ? అది ముఖ్యమైన ప్రశ్న.

మార్క్స్ ఏంగిల్స్ కమ్యూనిస్టు మానిఫెస్టో రాసే కాలంలో భార్యాభర్తలతో తొలి శ్రమ విభజన మొదలయిందని అన్నారు. ఓ 35 యేళ్ళ తరువాత ఏంగిల్స్ ‘కుటుంబము – వ్యక్తిగత ఆస్తి – రాజ్యాల పుట్టుక’ పుస్తకంలో దాంపత్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేశాడు. భర్త పెట్టుబడీదారీ వర్గం, భార్య శామికవర్గం అని నిర్ధారించాడు. వాళ్ల మధ్య వర్గ శతృత్వం కూడ వుంటుంది అన్నాడు.

వర్తమాన ఇండియాలో హిందూ సమాజం పెట్టుబడీదారీవర్గం; ముస్లిం సమాజం శ్రామికవర్గం, శిక్కులు శ్రామిక వర్గం, క్రైస్తవులు శ్రామికవర్గం బౌధ్ధులు శ్రామికవర్గం అని ఈ మహా మార్క్సిస్టు సిధ్ధాంతవేత్తలు  ఎప్పుడయినా తేల్చి చెప్పగలిగారా?  అలాగే మైదానవాసులు పెట్టుబడీదారీవర్గం; అడవివాసులు శ్రామికవర్గం అనాలి. పెత్తందారీకులాలు పెట్టుబడీదారీవర్గం; ఎస్సి, బీసిలను శ్రామిక వర్గం అనాలి. వీళ్ళు అనలేరు. కానీ, వీరికి అపర మార్క్సిస్టులుగా కీర్తి మాత్రం కావాలి. ఒక విధంగా వీళ్ళే మార్క్సిజంలో పోరాట స్వభావాన్ని నీరుగార్చి అందమైన మాటల గారడీగా మారుస్తున్నారు.

హిందూ- ముస్లిం బైనరీని గుర్తింపచేయడానికే కమ్యూనిస్టు పార్టీల మీద నేను తరచూ విమర్శల్ని ఎక్కుపెడుతున్నానని తెలియని వారు ఇప్పుడు ఎవరూ వుండరు. ఆ విషయం మిగిలినవారికన్నా రవికి ఇంకా బాగా తెలుసు.  విప్లవ విద్యార్ధి సంఘం యాభై యేళ్ళ సదస్సు సందర్భంగా వేదిక మీద ఆదివాసులు, ముస్లింలకు దక్కిన ప్రాతినిధ్యం ఎంత అని అడిగినపుడు చాలా రచ్చ జరిగింది. దాని నిర్వాహకుల్లో రవి ఒకరు. వారు చాలా తెలివైనవారు. ఆ సంఘటనను మరచిపోలేదు. మొత్తం వ్యాసంలో ముస్లిం అనే పదం మనకు ఎక్కడా కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మైనారిటీలు, అల్పసంఖ్యాక వర్గాలు, శిక్కులు, క్రైస్తవులు, బౌధ్ధులు  అనే పదాలూ కూడ వారి వ్యాసంలో మనకు కనిపించవు. ఇంకా తరచిచూస్తే ఎక్కడా ఆదివాసులు అనే పదం కూడ కనిపించదు. జాతులు అంటారేతప్ప వాళ్లెవరో చెప్పరు. వెరసి వీరొక కపట మార్క్సిస్టు! కపట మార్క్సిస్టులు విప్లవాభిమానులు, ఉద్యమ నాయకులు, ఉద్యమ అధికార ప్రతినిధులు అయిపోతే నాకో గట్టినమ్మకం కలుగుతోంది. వెయ్యేళ్లకు కూడ వీరు ఏమీ సాధించలేరు. ఐ యామ్ ష్యూర్ !  

15-10-2026


నా మీద ఎన్ రవి వ్యాసాన్ని అరుణతార ప్రచురించింది కనుక 

దానికి నా ఖండననూ అరుణతార  ప్రచురిస్తే అదొక మంచి సాంప్రదాయం అవుతుంది. 

గతంలో బిఎస్ రాములు వ్యాసాన్ని నేను చాలా తీవ్ర పదజాలంతో  ఖండించినపుడు కూడ అరుణతార ప్రచురించింది. 

రవి మీద నాకు సాప్ట్ కార్నర్ వుంది. ఎక్కడా తీవ్ర పదజాలాన్ని వాడలేదు.  చర్చనీయాంశానికి కట్టుబడే వ్యాసం రాశాను.

నా విమర్శ ఒక్కటే  -

1990 వరకు మాత్రమే సమాజాన్ని కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు అర్ధం చేసుకోగలిగాయి. దాన్ని సమర్ధంగా ఉద్యమ విజయంగా మార్చుకున్నాయా లేదా అన్నది వేరే అంశం. 

1990 తరువాత మారిపోయిన ప్రపంచాన్ని పీపుల్స్ వార్/ మావోయిస్టు పార్టీ మాత్రమే కాదు దేశంలోని ఏ కమ్యూనిస్టు పార్టి నాయకుడు కూడ అర్ధం చేసుకోలేకపోయారు. దానికి గణపతి మినహాయింపుకాదు. 

గణపతి చాలా ప్రయత్నించారు అని నాలుగు ఉదాహరణలు ఇచ్చిన ఎన్ రవి అంతిమంగా అవేవీ ఫలించలేదని ఆ వ్యాసంలో నాలుగుసార్లు అన్నారు. 

ఆ విఫలయత్న  వివరణ ప్రపంచానికి కావాలి. 

1990 తరువాత భారత రాజకీయార్ధిక, సాంస్కృతిక రంగాల్లో బలంగా రూపుదిద్దుకున్న హిందూ-ముస్లిం బైనరీనీ పీపుల్స్ వార్/ మావోయిస్టు పార్టి కప్పిపుచ్చిందనే అభిప్రాయం నాకు బలంగా వుంది. 

ఒకవేళ నా వ్యాసాన్ని ప్రచురించరాదని అరుణతార సంపాదకవర్గం భావిస్తే ఆ విషయాన్ని వెంటనే నాకు తెలియపరచండి. 

నేను మరో పబ్లిషర్ కు పంపిస్తాను. 

అరుణతార కాకపోతే మరో మార్గంలో అయినా నా రచన పాఠకుల దగ్గరికి వెళ్ళాలి.

-డానీ 

No comments:

Post a Comment