Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Tuesday, 14 May 2019
ప్రచారంవల్ల ఎవరూ గొప్ప కవులుకారు!
Mere propaganda will never produce a great poet.
ప్రచారంవల్ల ఎవరూ
గొప్ప కవులుకారు!
ఉషా యస్ డానీ
కులవర్గ సమాజంలో ఏ చారిత్రక దశల్లో అయినా అందరికీ ప్రాతినిధ్యం వహించే కవులు వుండరు. అందరూ మెచ్చుకునే ఆలోచనాపరులు కూడ వుండరు. ఎవరి కవులు వారికి, ఎవరి ఆలోచనాపరులు వారికి వుంటారు. రాష్ట్రంలోని ప్రతి సామాజికవర్గానికీ సాహిత్యంలో ప్రాతినిధ్యం వహించిన కవులు అనే అర్ధంలో గురజాడ, శ్రీశ్రీ,లను మహాకవులు అనడం ఒక అతివ్యాప్తి దోషం. వాళ్ళను ప్రముఖ తెలుగు కవులు అని గౌరవించుకుంటే సరిపోతుంది.
గురజాడ కార్మికుల గురించి రాయలేదు. విజయనగం సంస్థానంలో లక్ష్మీపురం వద్ద చెరకు ఫ్యాక్టరీ వచ్చినప్పటికీ ఆ కార్మికుల్ని గుర్తించలేదు. ఆయన మన్యంలో పుట్టి పెరిగాడు. 1879లోనే మన్యం పితూరి మొదలయ్యింది. మద్రాసు నుండి బ్రిటీష్ అశ్వికదళం, హైదబాద్ నుండి నిజాం సైన్యం వచ్చి ఆ పితూరిని అణుచివేసింది. తిరుగుబాటుదార్లను అండమాన్ జైలుకు పంపించారు. ఇంత జరిగినా కన్యాశుల్కం నాటకంలో ఆదివాసుల ప్రస్తావన చేయలేదు. సామాజికంగా ఈ పరిమితులున్నప్పటికీ తెలుగు భాషకు కన్యాశుల్కం గొప్ప మేలు చేసింది. సాంఘీక అనాచారాల్ని సాహిత్యం పట్టించుకోవాలనే ఒక సాంప్రదాయాన్ని ముందుకు తెచ్చింది. తెలుగు భాషకు ఒక సౌలభ్యాన్నీ, వేగాన్నీ అందించింది.
సాహిత్యంలో గురజాడను అధిగమించి శ్రీశ్రీ కార్మికుల గురించి రాశాడు. 1940-1960ల మధ్య కాలంలో శ్రామికవర్గానికి గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చాడు. 1970వ దశకంలో కమ్యూనిస్టు విప్లవకారులకు సాహిత్య బాసటగా నిలిచాడు. వాళ్ల పౌరహక్కుల కోసం పోరాడాడు. అయితే శ్రామికుల పరిథికి మించి ఆయన రాయలేదు. అలాగే, కొన్ని సమూహాల మీద శ్రీశ్రీకి తేలికభావం కూడా వుండేది. “కసాయి ప్లస్ సాయిబు ఈజీక్వల్ టు కసాయిబు” వంటి పిచ్చి పద ప్రయోగాలని కూడ ఆయన చేసివున్నాడు.
1970ల తరువాత తెలుగు కవిత్వంలో శివసాగర్ శకం మొదలైంది. . “నర్రెంగ సెట్టుకింద నరుడో భాస్కరుడా!” పాటతో శ్రీశ్రీని శివసాగర్ రీప్లేస్ చేశాడు. ఆ విషయం శ్రీశ్రీకి కూడా తెలుసు. తెలుసుగాబట్టే విరసం ఆవిర్భావ సభల్లో “నర్రెంగ సెటుకింద నరుడో భాస్కరుడ!” పాటని నెత్తిన పెట్టుకుని అనేకసార్లు పాడాడు. శ్రీశ్రీ చనిపోయే వరకు పుష్కర కాలానికి పైగా వాళ్ళిద్దరు ఒకే సంస్థలో కొనసాగారు. 1983లో శ్రీశ్రీ చనిపోయినపుడు నల్గొండలోని ఒక రహాస్య డెన్ లో జరిగిన సంస్మరణ సభలో శివసాగర్ తన ముందుతరం కవి మీద అభిమానంతో 8 గంటలు విరామం లేకుండా గొప్ప భావోద్వేగంతో ప్రసంగించాడు. టెక్ జాగ్రత్తలవల్ల కుదరలేదుగానీ ఆ సభ బహిరంగంగా జరిగుంటే అదొక గిన్నీస్ రికార్డు నివాళిగా నమోదై వుండేదే!
కారంచేడు ఉద్యమం తరువాత, తెలుగునాట దళితవాదం బలపడుతున్న దశలోనూ 1988లో శివసాగర్ ‘శ్రీశ్రీ’ నే కవిత రాశాడు. “కాలానికి ఒక కవి కావాలి / ఒక కవిత కావాలి/ అందుకనే/ కాలం కడుపుతో వుండి శ్రీశ్రీని కన్నది
/ …… “శ్రీశ్రీ చనిపోయాడని అనకండి! / ఒక మహాకవి అమరత్వం అతనిది/ అని రాసేడు. లెనిన్ చనిపోయినపుడు 1924లో రష్యన్ కవి యమకోవిస్కీ రాసిన కవితా పంక్తుల్ని (అప్పుడు కాలం కడుపుతో వుంది / కార్ల్ మార్క్స్ ను కనింది) తలపిస్తాయి ఈ కవితలో శివసాగర్ భావోద్వేగాలు.
గురజాడకు తాను సాహిత్య వారసుడినని శ్రీశ్రీ యే చెప్పుకున్నాడు. తొలిదశలో శ్రీశ్రీ మీద విశ్వనాధ,
దేవులపల్లిల ప్రభావం కూడా వుంది. శ్రీశ్రీ నిర్మించిన సాహిత్య వేదిక మీద ఇంకో మెట్టు పైకెక్కి శివసాగర్ విప్లవ భావకవిత్వాన్ని సృష్టించాడు. గురజాడ ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ శివసాగర్ ‘చెల్లి చెంద్రమ్మ’కు లీడ్ గా పనికి వచ్చిందంటే ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు. గురజాడ నుండేకాదు ఆత్రేయ వంటి సినీ కవుల నుండి కూడా శివసాగర్ లీడ్ తీసుకున్న సందర్భాలున్నాయి. ఒక తరం నుండి మరోతరం ప్రేరణ పొందడం చాలా సహజం. ఇదొక సాహిత్య వంశావళి క్రమం.
ఎంతటి ఆలోచనాపరులైన సర్వజ్ఞులు కారుకనుక వాళ్లకు తెలియని విషయాలు కూడా అనేకం వుంటాయి. తెలిసిన విషయాల మీద మాత్రమే వాళ్లు రాయగలరుగానీ తెలియని విషయాల మీద రాయలేరు. తెలిసిన విషయాల్లోనూ వాళ్లకు ఆసక్తి వున్న విషయాల మీద రాస్తారు. మిగిలిన వాటిని వదిలేస్తారు.
రచయితలకు తెలియని అంశాలు, తెలిసి విస్మరించిన అంశాలు, వివక్ష చూపిన అంశాలు తక్షణం కాకపోయినా ఆ తరువాతి కాలంలో అయినా చర్చకు వస్తాయి. తెలియని అంశాలను, విస్మరించిన అంశాలను తరువాతి తరాలు గుర్తుచేస్తాయి. వివక్ష చూపిన అంశాలను వివక్షితులు విమర్శించి తీరుతారు. అది ఒక అవసరమైన సామాజిక విమర్శ కూడ. సాహిత్యవిమర్శ ప్రాధమికంగా రచయితలు రాసిన దానినే తీసుకుంటుంది. ఆ మేరకు వాళ్లను గౌరవిస్తుంది. రచయితల్ని సాహిత్య విలువల పరంగా ఏమేరకు అభిమానించాలీ, సామాజిక దృక్పథాల పరంగా ఏమేరకు విమర్శించాలీ, వ్యక్తిగత చేష్టల మూలంగా ఏమేరకు తిరస్కరించాలీ అనేవి భావితరాల అవసరాలు దృక్పథాలు విచక్షణల మీద నిర్ణయం అవుతుంది.
తమ స్వీయ సామాజికవర్గాల వర్తమాన అవసరాలు, అభిలాషలకు భిన్నమైన రచనలు చేసిన వారినందరినీ అసలు రచయితలుగానే గుర్తించబోము అనే సమూహం సమాజపు ప్రతి దశలోనూ వుంటుంది. అలాంటివాళ్ల అభిలాషల్ని నెరవేర్చాలంటే ప్లేటో, అరిస్టాటిల్ దగ్గర నుండి ఇవ్వాల్టీ వరకు మొత్తం రచయితల్నీ, మొత్తం సాహిత్యాన్నే నిషేధించాల్సి వుంటుంది. ఇలాంటి అతివాదపు పనులు సాంస్కృతిక విప్లవం సందర్భంగా చైనాలో అనేకం జరిగాయి. రాచరిక, ఫ్యూడల్, పెట్టుబడిదారీ దశల్లో రాసిన పుస్తకాలన్నింటినీ “విషపూరిత కలుపు మొక్కలు” అంటూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని చైనా ప్రభుత్వం నిషేధించింది. షేక్స్ పియర్ రచనలతోపాటూ అతని సమకాలీనుడైన చైనా రచయిత తాంగ్ గ్జియాంజు రచనలు కూడా ఆ నిషేధిత జాబితాలో వున్నాయి. ఆ తరువాత చైనా సాహిత్యం డోల్ల బోయిందని పదేళ్లకుగానీ అర్ధం కాలేదు. అప్పుడు లెంపలేసుకుని నిషేధాన్ని ఎత్తివేసి, మొత్తం పాత పుస్తకాలన్నింటినీ ఇంగ్లీషులో అచ్చువేయడమేగాక, చైనా భాషలో అనువాదాలు చేసి మరీ పంపిణీ చేశారు.
లెజండ్స్ వాళ్ల కాలానికి మాత్రమే అధిపతులు. తరువాతి కాలానికి వాళ్ళు లీడ్ ఇవ్వగలరు గానీ లీడ్ చేయలేరు. చారిత్రక, సామాజిక, వ్యక్తిగత పరిమితులు అందరి మీదా వుంటాయి. ఆ పరిమితుల మధ్యనే కొందరు సమాజం మీద గొప్ప సానుకూల ప్రభావాలను వేస్తారు. వాళ్ళనే తరువాతి తరాలు గుర్తు చేసుకుంటారు. గురజాడ, శ్రీశ్రీ, శివసాగర్ తదితరులు ఆ కోవలోనికి వస్తారు.
మనది కుల వ్యవస్థ. ప్రతి కులం తన వాళ్ళను గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. ముస్లింలు, క్రైస్తవులు భిన్న మతస్తులుగా పైకి కనిపిస్తున్నప్పటికీ భారత కులమానం ప్రకారం వాళ్ళూ కొన్ని కులాలే. అయితే, కేవలం ప్రచారంవల్ల ఎవరూ గొప్ప కవులు కారు. గొప్ప కవులకు ప్రచారం కూడ లభిస్తే వాళ్ళ రచనలు ఎక్కువ మందికి చేరే అవకాశాలుంటాయి. అదొక సౌకర్యం మాత్రమే. శ్రీశ్రీ, గురజాడ బ్రాహ్మణులు కనుక ఆ సామాజిక వర్గం విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళిద్దర్ని మహాకవుల్ని చేసుకున్నదని కొందరి ఆరోపణ. బ్రాహ్మణుల్లో కూడా పరస్పరం బొత్తిగా పడని రెండు శాఖలున్నాయి. మరోవైపు, బ్రాహ్మణ, కమ్మ సామాజికవర్గాల మధ్య కొంతకాలం సాంస్కృతిక యుధ్ధమే నడిచింది. రాజకీయ రంగంలో దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది.
అయితే, సామాజిక చరిత్రలో ఒక విచిత్రంగా కమ్మ సామాజికవర్గం తమ కులానికి చెందిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిని సహితం పక్కన పెట్టి శ్రీశ్రీతో పాటూ గురజాడ, వేమనను కూడ భుజాన వేసుకుంది. ఈ క్రమం కమ్యూనిస్టు పార్టిల వేదికల మీద చాలా వేగంగా సాగింది. 1950-60లలో బుర్రకథ నాజర్ ను, 1970ల తరువాతి కాలంలో శివసాగర్, గద్దర్, కలేకూరి ప్రసాద్ తదితరుల్ని ప్రోత్సహించింది కూడా కమ్యూనిస్టు వేదికలే. కనీసం వాళ్ళ రాజకీయ, సామాజిక జీవితాల్లోని మొదటి అర్థభాగం వరకు అయినా ఇది వాస్తవం.
ఈరోజు అంబేడ్కరిస్టు శిబిరంలోనూ, ముస్లింవాద శిబిరాల్లోనూ ముఖ్య ఆలోచనాపరులుగా
వున్నవారు పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు వర్గపోరాటాల్లో శిక్షణ పొందినవారే. 1985 చివర్లో ఓసారి మాటల సందర్భంగా కొండపల్లి సీతారామయ్య
“పీపుల్స్ వార్ పార్టి మాల గద్దర్ ను ప్రజాగాయకుడిని చేసింది; ముస్లిం డానీ చేత తత్వశాస్త్ర
పాఠాలు చెప్పిస్తోంది. ఇది మన సోషల్ కాంట్రిబ్యూషన్ కాదా?” అన్నార్ట. ఆ సందర్భంలోనే
ఆయన అల్లం రాజయ్య, బియస్ రాములు పేర్లను కుడా
ప్రస్తావించారట.
ఇప్పుడు శిసాగర్ ను విప్లవకవి అంటే దళితులకు నచ్చడంలేదు. పోనీ ఆయన్ని దళిత కవి అందామన్నా మరికొందరు అభ్యంతరం పెడుతున్నారు. ఈ అభ్యంతరాలు రెండు రకాలు. ఆయన్ను దళిత కవి స్థాయికి కుదించుతారా? అనేది ఒక అభ్యంతరం. “మాదిగల కోసం కవిత్వం రాయని మాల కవిని దళిత కవి స్థాయికి పెంచుతారా”? అనేది ఇంకో అభ్యంతరం. అనుమానం వున్నవాళ్ళు కృపాకర్ పొనుగోటిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు.
సాహిత్య పరిణామ క్రమంలో భాగంగా రేపు ఒక మాదిగ మహాకవి కూడా అవిర్భవిస్తాడు. అప్పుడు అంతే సహజంగా ‘రెల్లి’ ‘మెహతర్’ వంటి సామాజిక వర్గాలు అతన్ని “మాదిగ అగ్రకుల కవి” అని విమర్శించడమేగాక ఆ పుస్తకాలను నిషేధించాలని కోరుతుంది!. ఇదొక అంతులేని కథగా కొనసాగుతుంది.
ఇప్పుడు రూపంలో కవుల మీద, వారి రచనల మీద చర్చలుగా కనిపిస్తున్నదంతా సారాంశంలో సమాజ విమర్శే. కులవర్గ సమాజంలో కుల దోపిడిని అంతం చేయడానికి మనకు కొన్ని సిధ్ధాంతాలు అందుబాటులోవున్నాయి. వర్గదోపిడిని అంతం చేయడానికి కూడా మరికొన్ని సిధ్ధాంతాలు అందుబాటులోవున్నాయి. విషాదం ఏమంటే కులదోపిడి సిధ్ధాంతాన్ని నమ్మేవాళ్ళు వర్గదోపిడి సిధ్ధాంతాన్ని ఒప్పుకోవడంలేదు. మరోవైపు, వర్గదోపిడి సిధ్ధాంతాన్ని నమ్మేవాళ్ళు కులదోపిడి సిధ్ధాంతాన్ని ఒప్పుకోవడంలేదు. ఇద్దరూ ప్రత్యర్ధి శిబిరాలుగా మారి చెరో వైపు నుండి ఒకే తప్పును చేస్తున్నారు. ఈ రెండు శిబిరాలు తమ తప్పుల్ని సరిదిద్దుకొనంత వరకు సమాజంలో కులవర్గ దోపిడి సజావుగా కొనసాగుతూ వుంటుంది. కులవర్గ సమాజాన్ని మార్చాలని ఆశించేవాళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఏమంటే, ఈ రెండు శిబిరాల మధ్య వైషమ్యాన్ని తగ్గించి సామరస్యాన్ని పెంచే ప్రతిపాదనల్ని ముందుకు తేవాలి, ఇది ఒక చారిత్రక అవసరం.
మొబైల్ : 9010757776
రచన : హైదరాబాద్, 6 మే 2019
ప్రచురణ : 13 మే 2019, వివిధ పేజీ, ఆంధ్రజ్యోతి దినపత్రిక,
Friday, 10 May 2019
చంద్రబాబు కేసిఆర్ ల జాతీయ రాజకీయాలు
చంద్రబాబు కేసిఆర్
ల జాతీయ రాజకీయాలు
డానీ
(బిబిసి కోసం)
ఇద్దరు
చంద్రుల పాలనలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మాత్రం చల్లగా లేవు. ఇద్దరు
చంద్రుల కన్ను ఒక్కసారిగా జాతీయ రాజకీయాలపై పడడంతో తెలుగు రాష్ ట్రాల రాజకీయం వేడెక్కింది. మే 23 తరువాత రూపుదిద్దుకోబోతున్న జాతీయ రాజకీయాల
ఉహా చిత్రాన్ని ఇప్పుడు హైదరాబాద్, అమరావతి రాజధాని నగరాల్లో చూడవచ్చు.
ఈసారి
ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అన్నింటా ముందస్తు విధానాలను అనుసరిస్తున్నారు.
సచివాలయానికి రావడం లేదనే విమర్శ ఆయనపై ఉన్నప్పటికీ ఆ తీరిక సమయాన్ని కేసీఆర్ రాజకీయ
వ్యూహాలను రచించడానికి సద్వినియోగం చేసుకుంటున్నారు.
తెలంగాణలో
జమిలి ఎన్నికలు జరిగితే జాతీయ రాజకీయాల ప్రాధాన్యం పెరిగిపోతుందని ముందుగా గ్రహించింది
ఆయనే. తాను ప్రధానంగా ఆధారపడుతున్న తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతింటుందని వారు సరిగ్గానే
అంచనా వేశారు. సంక్షేమం వెలుగులపై జాతీయ రాజకీయాల నీడ పడుతుందని కూడా ఆందోళన చెందారు.
ఐదు నెలలు ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరిపించేసి గెలిచి ఒడ్డున కూర్చున్నారు.
కేసీఆర్
ది సేఫ్ గేమ్. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు వచ్చినా రాకున్నా ఆయనకు
పోయేదేమీలేదు. వాళ్లు అంచనా వేస్తున్నదానికి కాస్త అటూ ఇటుగా సీట్లు వచ్చినా జాతీయ
రాజకీయాల్లోనూ కేసిఆర్ ఓ మెరుపు మెరిసే అవకాశాలున్నాయి. జాతీయ రాజకీయాల సన్నివేశమే
ఇపుడలా మారిపోయింది. దేవెగౌడ నాటి రోజులు కేసీఆర్ ను ఊరిస్తున్నాయి.
వారు దాని మీదే దృష్టి పెట్టి పావులు కదుపుతున్నారు.
ఏడాది
కిందటే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని అందుకున్నారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల
ప్రభుత్వం ఏర్పడాలనేది ఈ ఫ్రంట్ ఉద్దేశం. అప్పట్లో ఒడిశా వెళ్లి నవీన్ పట్నాయక్ ను,
పశ్చిమ బెంగాల్ వెళ్లి దీదీ మమతా బెనర్జీనీ కలిసి వచ్చారు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చి కేసిఆర్‌ను కలిశారు.
‘కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నరేంద్ర మోదీ
'బి' టీమ్’
ఫెడరల్
ఫ్రంట్ నినాదాన్ని కాంగ్రెస్ శిబిరం విమర్శనాత్మక దృష్టితో చూసింది. దాన్ని నరేంద్ర
మోదీ 'బి' టీమ్ అంటూ తీసిపడేసింది. దీని మీద తెలంగాణ రాష్ట్ర సమితి వాదన మరోలా వుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ఢిల్లీలో ఉనికి చాటుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టి
ముఖ్యులు చెబుతున్నారు.
ఈసారి
లోక్ సభ ఎన్నికల కోడ్ మరీ 75 రోజులకు పొడిగించారు. తొలి దశలోనే ఎన్నికలు ముగిసి పోవడంతో
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఫలితాల కోసం నెలన్నర సుదీర్ఘ కాలం ఎదురుచూడాల్సి వస్తోంది.
కోడ్ అమల్లో ఉన్న కాలంలో ముఖ్యమంత్రులు ప్రభుత్వాన్ని నడపవచ్చా? లేదా? అనేది కూడ చర్చనీయాంశంగా
మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు, చీఫ్ సెక్రటరి ఎల్ వి
సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇవొ)గోపాలకృష్ణ ద్వివేదిల
మధ్య ముక్కోణ వివాదంగా కొనసాగుతోంది.
ఈ
రాజకీయ విశ్రాంతి సమయాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. మళ్ళీ
ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని బయటికి తీశారు. కేరళ వెళ్లి ముఖ్యమంత్రి పినరయి విజయన్ కలిశారు.
వారి తదుపరి ప్రయాణం చెన్నై. డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లపై
చర్చించాలనుకున్నారు. ఆ తరువాత దీదీ మమత బెనర్జీనీ, నవీన్ పట్నాయక్ ను మరోసారి కలుస్తారని
తెలంగాణ భవన్ వర్గాలు అంటున్నాయి.
కేసిఆర్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలవడంలో ఇంకో ప్రత్యేకత ఉంది. ఆయన ఇంత వరకు ప్రాతీయ
పార్టీల అధినేతల్నే కలుస్తూ వచ్చారు. కానీ, పినరయి విజయన్ జాతీయ పార్టి అయిన సీపీఎం
నాయకుడు మాత్రమేకాదు స్పష్టంగా మోదీ వ్యతిరేక విధానాలు గల నేత. దీనినిబట్టి కేసిఆర్
చిన్నసైజు జాతీయ పార్టీల మీద కూడ కన్నేశారని భావించవచ్చు.
ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు
జాతీయ
రాజకీయాల్లో చంద్రబాబుకు సుదీర్ఘ చరిత్ర వుంది. 1980వ దశాబ్దం చివర్లో ఆయన ఎన్ టి రామారావు
నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్
కన్వీనర్ గా మారి కాంగ్రెస్ సహకారంతో దేవెగౌడ, గుజ్రాల్ లను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడంలో
కీలక పాత్ర పోషించారు. 1998లో ఎన్.డి.యే. కన్వీనర్ గా మారి ఢిల్లీలో చక్రం తిప్పి అటల్
బిహారీ వాజ్ పాయి ప్రధాని కావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అప్పటి ఎన్.డి.యే.లో చంద్రబాబు
ప్రభావం చాలా బలంగా వుండేది. బాబు సూచనల మేరకే 2004లో వాజ్ పాయి ముందస్తు ఎన్నికలకు
సిధ్ధం అయ్యారని కూడా చెపుతారు.
గత
ఏడాది కేంద్ర బడ్జెట్ తరువాత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీతో చెడింది. మొదట్లో
రాష్ట్రానికి నిధుల కేటాయింపు అంశాల్లో మొదలయిన వివాదం క్రమంగా రాజకీయ విధానాల వరకు
విస్తరించింది. మోదీ విధానాలను విమర్శించడంలో చంద్రబాబు జాతీయ నేతలు అందర్నీ మించిపోయారు.
కాంగ్రెస్ తో చిరకాల వైరాన్ని పక్కనపెట్టి కర్ణాటక ఎన్నికల నుండే రాహుల్ గాంధీకు దగ్గరయిన
చంద్రబాబు ప్రస్తుతం యూపియే శిబిరంలో అప్రకటిత కన్వీనర్ గా వున్నారు.
పోలింగ్
జరిగిన మరునాటి నుండే చంద్రబాబు ఈవీఎం వ్యతిరేక పోరాటాన్ని ఆరంభించారు. అది క్రమంగా
జాతీయ ఆందోళనగా మారింది. అలా వారు మరోసారి ఢిల్లీ వేదికల మీద వెలుగు లోనికి వచ్చారు.
మిగిలిన
రాజకీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ లో అగ్రనేతలు ఎక్కువ. అందువల్లే ఎన్నికలకు ముందు
ప్రధాని అభ్యర్ధిని ప్రకటించే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పాటించడంలేదు. ఎన్నికల ఫలితాలు
వచ్చిన తరువాతే ప్రధాని అభ్యర్ధిని ఎంపిక చేస్తామని కాంగ్రెస్ రాకుమారుడైన రాహుల్ గాంధేయే
తరచూ ప్రకటిస్తున్నారు. విపక్షాల్లో ఈసారి ప్రధాని పదవికి దీదీ మమతా బెనర్జీ, బెహన్
మాయావతి హోరాహోరీగా పోటీ పడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రధాని పదవి కోసం ఇంకో ఎన్నికల
వరకు ఆగడానికి మానసికంగా సిధ్ధమయ్యారని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి.
పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు..
రాజకీయాల్లో
ఒక సాంప్రదాయం వుంది. పెద్ద కుర్చీ కోసం ఇద్దరు ప్రముఖులు తీవ్రంగా పోటీ పడితే ఆ పదవి
మూడో వ్యక్తి పోతుంది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు అన్నమాట. గతంలో పివి
నరసింహారావు అలానే ఏ ప్రయత్నమూ చేయకుండ ఇంట్లో కూర్చుంటే ప్రధాని పదవి వచ్చి ఒళ్ళో
పడింది.
లోక్
సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ బిజేపి ఓడిపోయి, విపక్షాలకు ఆధిక్యం వచ్చి, మమత, మాయావతిల మధ్య రాజీ
కుదరకపోతే, రాహుల్ గాంధి పోటీకి బయట ఉండాలని నిర్ణయించుకుంటే కొత్త ప్రధాని పదవి కొత్త
వారి ఒళ్లో పడడం ఖాయం. అలాంటి సందర్భం కోసం చంద్రబాబు ఎదురుచూస్తున్నారని టీడీపీ సన్నిహితుల
అంచన. మరోవైపు, సమీకరణాలు అటూ ఇటూ మారి ఫెడరల్ ఫ్రంట్లో పెద్దపార్టీల మధ్య విభేదాలు
తలెత్తితే డబుల్ డిజిట్‌కి కొంచెం అటూ ఇటూ ఉన్న చిన్న పార్టీలకు కూడా పెద్ద అవకాశం
రావచ్చని కేసీఆర్ కూడా అంచనా వేస్తున్నారు.
చంద్రబాబు
మొదటి ప్రాధాన్యం రాష్ట్రమే అని తెలుగుదేశం వారు గట్టిగా అంటున్నారు. అయితే, అసెంబ్లీ
ఎన్నికల ఫలితాల మీద టిడిపి శ్రేణుల్లో కలవరం కనపడుతోంది. వైసీపీ జగన్ గెలుపు అవకాశాలు
పెరిగాయన్న ఆందోళన చాలామందిలో ఉంది.
"అసలు
జగన్ 2014 ఎన్నికలలోనే గెలిచి ఉండేవారు. అప్పటి ఊపు అలానే ఉంది. అయితే కష్టాల్లో ఉన్న
రాష్ట్రానికి సమర్ధుడైన చంద్రబాబే తొలి ముఖ్యమంత్రి కావాలని జనం ఆలోచించారు. ఇప్పుడూ
జనం అలాగే ఆలోచిస్తున్నారు. జగన్ జాతీయ రాజకీయాలకు పనికిరారు. దానికి చంద్రబాబే బెస్టు.
అసెంబ్లీ సీట్లలో ఏదైనా తేడా వస్తే రావచ్చుగానీ, పార్లమెంటు సీట్లలో ఆధిక్యత టిడిపిదే"
అని ఓ టిడిపి వ్యూహకర్త విశ్లేషించారు. వారి మాటలకు అర్ధం ఏమంటే చంద్రబాబు ప్రధాని
రేసులో వున్నారని!.
అటు
తెలంగాణలోనూ కేసిఆర్ ప్రధాని రేసులో వున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. విపక్షాల్లో
కాంగ్రెస్, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ తరువాత పట్టుమని పది లోక్‌సభ సీట్లున్న వాళ్ళు
కూడా ప్రధాని రేసులో నిలవవచ్చు అని చాలామంది భావిస్తున్నారు.
ఎన్టీ
రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ 1989 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఆధిక్యతను సాధించి
వీపీ సింగ్ ప్రధానిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, అప్పటి ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపి ఓడిపోయి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.
చరిత్ర పునరావృతం అవుతుందా? ఏమో!
//EOM//
రచన : 10
మే 2019
ప్రచురణ :
బిబిసి తెలుగు, 10 మే
2019
Friday, 3 May 2019
విద్యార్ధుల ఆత్మహత్యలు - ప్రభుత్వ మేధావులు
Students Suicides and the state Intellectuals
విద్యార్ధుల ఆత్మహత్యలు - ప్రభుత్వ మేధావులు
ఉషా యస్ డానీ
సమాజంలో ఏదైనా
ముఖ్యమైన పరిణామం జరిగినపుడు దానికి బాధితులు మాత్రమేగాక రచయితలు, కవులు, కళాకారులు,
పాత్రికేయులు, సోషల్ వర్కర్లు, యాక్టివిస్టులు, అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు,
కాంట్రాక్టర్లు, ప్రభుత్వం, అందులోని వివిధ శాఖలు, అశేష సామాన్యులు సహితం సహజంగానే
స్పందిస్తారు. వీళ్లందరి స్పందనలు ఒకేరకంగా వుండవు. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఆ అంశం
మీద స్పందిస్తారు. (Rashomon effect అన్నమాట). వాళ్లవాళ్ళ అస్థిత్వాలు, అవసరాలు ఆ అంశం
మీద వాళ్ళ దృక్పథాలను నిర్ణయిస్తాయి. ఇవి పరస్పరం విరుధ్ధంగానూ వుంటాయి. ఈ దృక్పథాలనే
సాహిత్యంలో వస్తువు అంటారు. కొందరు అమాయికత్వం వల్ల అంశాన్నే వస్తువు అని పొరబడుతుంటారు.
ఒక అంశం మీద రచయిత దృక్పథమే వస్తువు. I repeat, ఒక అంశం మీద రచయిత దృక్పథమే వస్తువు.
ఇప్పుడు తెలంగాణను
కుదిపేస్తున్న అంశం ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలు. ఒక్క వారం రోజుల్లోనే ఇరవై
మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక పరంపరగా సాగిన ఈ సామాజిక అఘాయిత్యం, ఒక నరమేధం
ఇక్కడితో ఆగిపోయిందనీ కూడ చెప్పలేము.
నాలుగు లక్షల
మంది తెలంగాణ విద్యార్ధుల భవిష్యత్తును తేల్చే ఇంటర్ మీడియట్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్
18 సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి
బి. జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. ఫలితాల వెల్లడిలో జరిగిన ఘోరమైన తప్పిదాలు కొందరు విద్యార్ధుల ఆత్మహత్యలకు దారితీశాయి. కొన్ని
వేలమంది విద్యార్ధులు, వాళ్ల కుటుంబాలు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాయి.
ఫలితాల వెల్లడిలో
జరిగిన అవకతవకల మీద విద్యాశాఖ ఒక త్రిసభ్యకమిటీని వేసింది. ఆ కమిటి నివేదికను అందుకున్న తరువాత జనార్దన్ రెడ్డి
ఏప్రిల్ 27న మీడియాతో మాట్లాడారు. “531 మందికి
ఒక పేపరు మార్కుల్ని అసలు కలపలేదు. 4288 మందికి ర్యాంకుల్లో దశాంశాలే తేడా అయిపోయాయి.
పరీక్షలు రాసిన 496 మందికి గైర్ హాజిరీ (ఆబ్సెంట్) వేశారు. 99 మార్కులు వచ్చిన అమ్మాయికి ‘00’ రెండు
సున్నాలు వేశారు. సర్వర్ కు డేటా కెపాసిటీ
సరిపోలేదు. ఆన్ లైన్ లో ఫలితాలు కనిపించడంలేదు. ఒక్కో వెబ్ సైట్ లో ఒక్కో రకంగా ఫలితాలు
వున్నాయి” అని వారు త్రిసభ్యకమిటీ కనుగొన్న తప్పిదాలను ప్రకటించారు. ఈ తప్పిదాలను సరిదిద్దడానికి ఆరు రకాల
తక్షణ చర్యలు తీసుకోవడమేగాక ధీర్ఘకాలిక చర్యలుగా విద్యారంగంలో మరికొన్ని సంస్కరణలు
చేపట్టాలని కూడా త్రిసభ్యకమిటీ సూచనలు చేసిందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి
అన్నారు.
ఇంటర్మీడియట్
బోర్డులో జరిగిన అవకతవకల గురించి విద్యార్ధులు, బాధితుల కుటుంబాలు, విద్యార్ధి సంఘాలు,
తల్లిదండ్రుల సంఘాలు, సంఘసేవకులు, ప్రతిపక్ష
రాజకీయ పార్టీలు చెపుతున్న జాబితా ఇంకా పెద్దదిగానే వుంది. వాటి నిజానిజాల వ్యవహారం
ఎలావున్నా త్రిసభ్య కమిటి నిర్ధారించిన అంశాలు చాలు విద్యార్ధుల్ని తీవ్ర నైరాశ్యంలో
ముంచివేయడానికీ, కొన్ని కేసుల్లో ఆత్మహత్యలకు పురికొల్పడానికీ. ఈనాటి జెట్ స్పీడు పోటీ
ప్రపంచంలో ఒక్క మార్కు కూడా విద్యార్ధుల భవిష్యత్తుని గుణాత్మకంగా మార్చివేస్తుందని
అందరికీ తెలుసు. అలాంటిది 99 మార్కులు సాధించగల అద్భుత ప్రతిభగల ఒక విద్యార్ధికి రెండు
సున్నాలు వేస్తే ఆ లేత వయసులో ఎంత షాక్? వాళ్ళేమైపోతారూ?
పరీక్షల నిర్వహణలో
ఏ చిన్నపొరపాటు జరిగినా దానికి మొదట బాధ్యత
పడాల్సింది ఇంటర్ మీడియట్ బోర్డు. ఆపైన విద్యాశాఖ. ఆ పైన విద్యామంత్రి. ఆ పైన రాష్ట
ప్రభుత్వం. ఫలితాలు వెలువడిన కొన్ని నిముషాల్లోనే అవకతవకలు జరిగినట్టు తెలిసిపోయింది.
వాటివల్ల విద్యార్ధుల మానసిక స్థితిలో కలిగే ప్రమాదకర ప్రభావాన్ని విద్యాశాఖలోని బాధ్యులు వెంటనే గ్రహించి
క్షణాలలో ప్రమాద నివారక చర్యలు చేపట్టి వుండాల్సింది. తక్షణం మొత్తం ఫలితాలను నిలిపివేస్తున్నట్టు
ప్రకటించి, రెండు మూడు రోజుల తరువాత సరిచేసిన ఫలితాలను ప్రకటిస్తే సరిపోయేది. ఎలాగూ
ఏప్రిల్ 12న ప్రకటిస్తామన్న ఫలితాలను ఆరు రోజులు ఆలస్యంగా ప్రకటించారు. ఇంకో రెండు
రోజుల వ్యవధి తీసుకునివున్నా పెద్దగా నష్టం వుండేది కాదు.
అలా జరక్కపోగా ఇంటర్ మీడియట్ బోర్డు తన తప్పుల్నికప్పిపెట్టి అడ్డంగా
బుకాయించడానికి పూనుకుంది. వివరాలు తెలుసుకోవడానికి
బోర్డు ఆఫీసుకు వచ్చిన విద్యార్ధులు, వాళ్ళ తల్లిదండ్రుల మీద దౌర్జన్యాలకు, పోలీసు
జులుంకు పాల్పడింది. ఇలాంటి చర్యలు విద్యార్ధుల్ని మరింత నైరాశ్యానికి గురిచేశాయి.
ఈలోగా ఇదంతా కొత్తగా కాంట్రాక్టు దక్కించుకున్న ఓ ఐటీ కంపెనీ నిర్వాకమని బయటికి వచ్చింది.
అనేక సంవత్సరాలుగా పరీక్షల ఫలితాలను ప్రాసెస్
చేస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను కాదని గ్లోబరీన డెత్నాలజీస్ ప్రైవేటు
లిమిటెడ్ కు ఈ కాంట్రాక్టును ఎందుకు ఇచ్చారనే అనుమానం కూడ బలపడింది. కాంట్రాక్టు విలువ
మీద కూడ అనేక ఊహాగానాలు వినిపించాయి. ఈలోగా 23 పసిప్రాణాలు గాల్లోకి ఎగిరిపోయాయి. ఈ
కేసులో నిస్సందేహంగా ప్రధమ ముద్దాయి ఇంటర్మీడియట్ బోర్డు.
విద్యాశాఖ
కార్యదర్శి మీడియాకు త్రిసభ్యకమిటి నివేదిక
వివరాలు వెల్లడి చేసిన రోజే డాక్టరేట్ సంగిశెట్టి శ్రీనివాస్ ‘ఇంటిదొంగలే ఇంటర్ కు శాపం’ అనే వ్యాసం రాసి, ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. పేరుకు
ముందు డాక్టరేట్ వుంటే పరిశోధనల్లో దిట్ట అని అర్ధం. సంగిశెట్టి శ్రీనివాస్ వంటి పేరున్న
మేధావి, తనకు “తెలంగాణ అబ్సెషన్” అని తరచు ప్రకటించుకునే రచయిత, ఒక సాంఘీక కల్లోల సమయంలో
ఒక వ్యాసం రాశారంటే - విద్యార్ధుల ఆత్మహత్యలకు దారితీసిన ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహణ
వైఫల్యాలతో పాటూ అనేక సామాజిక రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక మానవీయ కోణాల్ని సహితం ఆవిష్కరిస్తారనీ
వాటి నివారణకు మహత్తర పరిష్కారాలు చూపుతారనీ
ఆశించడం సహజం. వారు ఎంత గొప్ప పరిశోధనాత్మక వ్యాసం రాశారో ఇప్పుడు పరిశీలిద్దాం.
సంగిశెట్టి
శ్రీనివాస్ తనకు “తెలంగాణ అబ్సెషన్” వుందని ప్రకటించుకుంటే అమాయకులు అనేకులు తలలూపవచ్చు.
గానీ, ఆ లండన్ హైగేట్ శ్మశానం సమాధిలో అశాంతిగా కదులుతున్న జర్మనీ గెడ్డపాయన కార్ల్
మార్క్స్ ఒప్పుకోడుగాక ఒప్పుకోడు. తెలంగాణలో ఎవరి మీద వారి అబ్సెషన్? “ అని అడుగుతాడు.
సంగిశెట్టివారి అబ్సెషన్ (ఇప్పటికి) చనిపోయిన
23 మంది విద్యార్ధుల మీదా? ఇంటర్మీడియట్ బోర్డు
మీదా? అని నిలదీస్తాడు.
సంగిశెట్టి
శ్రీనివాస్ తన వ్యాసానికి ‘ఇంటిదొంగలే ఇంటర్ కు శాపం’ అని శీర్షిక పెట్టారు. దీనికి రెండు అర్ధాలున్నాయి.
‘తెలంగాణ ఇంటిదొంగలే
ఇంటర్మీడియట్ విద్యార్ధులకు
శాపం’ అనేది ఒక అర్ధం. ‘ఇంటిదొంగలే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు
శాపం’ అనేది రెండో అర్ధం. మొదటి
అర్ధాన్ని కాదని రెండో అర్ధాన్ని నిరూపించడానికి వారు ఈ వ్యాసంలో అనేక కసరత్తులు, గారడీలు
చేశారు.
(ఇప్పుడు)
“వార్తలొస్తున్న విధంగా
ఎస్సెస్సీ బోర్డులో ఇంటర్ బోర్డుని విలీనం చేసినట్లయితే 1969 నుంచి అంటే 50 ఏండ్లుగా విడిగా మనుగడలో ఉన్న ఇంటర్ బోర్డు ఉనికి మాయం కానున్నది. దీనివల్ల ఎంతోమంది జూనియర్ లెక్చరర్లను త్రిశంకు స్వర్గంలోకి నెట్టివేసినట్లయితది” అని వారు వ్యాసం
చివరి పేరాలో తెగ బాధపడిపోయారు.
త్రిసభ్య
కమిటీ నిర్ధారించి ప్రకటించిన తప్పుల్ని ఒప్పుకోవడానికి కూడ సంగిశెట్టి శ్రీనివాస్
సిధ్ధంగా లేరు. వ్యాసం మొత్తంలో ఎక్కడా ఆ తప్పుల ప్రస్తావన గురించి ఒక్క వాక్యం కూడ
లేదు. అంతేకాదు విద్యార్ధుల ఆత్మహత్యల గురించి వారు చాలా అమానవీయ వ్యాఖ్యలు చేశారు.
“ఇట్లా ప్రతి సంవత్సరం వత్తిడిని తట్టుకోలేని విద్యార్థులు పదుల సంఖ్యల్లో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు” అని ఒకవైపు గుర్తిస్తూనే
మరోవైపు ఆ నేరాన్ని ఇంటర్మీడియట్ బోర్డు నుండి తప్పించి విద్యార్థి సంఘాలు, విపక్ష రాజకీయ పార్టీల మీదకు నెట్టివేసే నీచ ప్రయత్నాలు
కూడా సంగిశెట్టి శ్రీనివాస్ నిస్సిగ్గుగా చేశారు.
విద్యార్థి
సంఘాలు, రాజకీయ పార్టీలు “(విద్యార్ధుల) చావులను
హైలైట్ చేస్తూ పరోక్షంగా విద్యార్ధుల్ని ఆత్మహత్యకు పురిగొల్పుతున్నారు” అని ఈ దార్శినికులు ఒక గొప్ప సామాజిక సత్యాన్ని ఆవిష్కరించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాను
కోరడాన్ని కూడ ఈ తత్వవేత్త ఏమాత్రం సహించలేకపోయారు.
ఈ వ్యాసాన్ని రాస్తున్నపుడు వారిని విద్యామంత్రి
పూనారో, లేక విద్యామంత్రికి వారే (గాత్రదానంలా) మెదడు దానం చేశారో ఎవరయినా పరిశోధిస్తే
మరికొన్ని మహత్తర అంశాలు ఆవిష్కారం అవుతాయి.
వాస్తవాలను
తన ప్రత్యర్ధులు “మరుగున పడేస్తుంటే”
“నీరక్షీర వివేకంతో !!!” “నిష్పక్షపాతంగా
!!!” సోషల్ మీడియా ద్వారా వారు వెలుగులోకి తెచ్చిన మహత్తర విషయాలు ఇవి!!
వీటిని కూడా కొందరు భరించలేక పోతున్నారని వారు వాపోయారు. తన రచనల్ని
“ప్రతిఫలాపేక్షతోటి ప్రభుత్వాలకనుకూలంగా
రాస్తున్నారని” దుష్ప్రచారం చేస్తున్నారని ఇంకో ఆవేదన ప్రకటించారు.
వారు ప్రభుత్వాలకు అనుకూలంగా రాస్తున్నారనేది
ఈ సందర్భంగా చాలా చిన్న ఆరోపణ. ఇంటర్మీడియట్ బోర్డు మీద విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన
రెడ్డికన్నా సంగిశెట్టి శ్రీనివాస్ ఎక్కువ శాఖాభక్తిని ప్రదర్శించారు. పూర్వం రాజుల కాలంలో, దీనినే రాజుని మించిన రాజ్యభక్తి
అనేవారు.
ఆత్మహత్యల
మీద ఒక వ్యాసం రాయాలనుకున్నప్పుడు సమాజ విశ్లేషకులు సహజంగా 19వ శతాబ్దపు ఫ్రెంచ్ తత్వవేత్త
ఎమిలి డర్ఖేమ్ వైపు చూస్తారు. ఆయన 1897లో ఆత్మహత్యల
మీద ‘లె సూసైడ్స్’ అనే ఒక మహత్తర గ్రంధాన్ని రాశాడు. అలాగే మనస్తత్వ శాస్త్రవేత్తలు
సహితం ఆత్మహత్యల మీద అనేక సిధ్ధాంతాలు, పరిష్కారాలు చెప్పివుంటారు. వృత్తి పరిశోధకులు
అయిన సంగిసెట్టి శ్రీనివాస్ కొంచెం వాటిని
అధ్యనం చేసి వర్తమాన ఆత్మహత్యల్ని విశ్లేషిస్తే సమాజానికి కొంచెం మేలు జరిగేది. వ్యాసం
ఆదియు, అంతమునూ, మధ్యముల్లో వారిది ఇంటర్మీడియట్
బోర్డును కాపాడే ఆతృతే అయిపోయిందాయే!.
ఇంటర్మీడియట్
విద్యార్ధుల ఆత్మహత్యల వ్యవహారంలో సంగిశెట్టి శ్రీనివాస్ బెంగంతా
తెలంగాణ ఇంటర్మీడియట్
బోర్డును ఎస్సెస్సీ బోర్డులో కలిపేస్తారనే. అలా కలపొద్దు అని చెప్పడానికే వారు ఈ వ్యాసం
రాశారు. వారి అబ్సెషన్ అంతా తెలంగాణ ఇంటర్మీడియట్
బోర్డు గురించేగానీ తెలంగాణ విద్యార్ధుల గురించి కాదు.
సంగిశెట్టి
శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ కొలువు తనంతట తానుగా పాపపు పని ఏమీకాదు. పొట్టకూటి
కోసం ఎవరి తంటాలు వాళ్ళు పడుతుంటారు. ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
రాయడం ఒక రకంగా కుదరదు. అందుకే కొందరు మహారచయితలు కలం పేర్లతో రాస్తారు. మరికొందరు
రచయితలు తాముగా రాసే అవకాశాలు లేనపుడు తమ దగ్గరున్న సమాచారాన్ని ఆధారాలని ఇతర రచయితలకో,
పాత్రికేయులకో ఇచ్చి అవి ఏదో ఒక విధంగా బయటి ప్రపంచానికి తెలిసేలా సహకరిస్తారు. ఇవేవీ
కుదరనప్పుడు అన్నీ మూసుకుని కూర్చుంటారు. అంతే తప్ప ప్రభుత్వ భజన చేయరు.
సుదీర్ఘ పరిశోధనలవల్ల
సాహిత్య చరిత్రలో సంగిశెట్టి శ్రీనివాస్ సాధించిన గొప్ప విజయం ఒకటి వుంది. తెలంగాణ
సాయుధ రైతాంగ పోరాటం సాగుతున్నప్పుడు ప్రముఖ తెలుగు కవి శ్రీశ్రీ నిజాం సంస్థానంలో
కొలువు చేసేవాడని కనుగొన్నది వీరే. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30న ఆ విషయాన్ని ప్రపంచానికి
చాటుతూ సోషల్ మీడియాలో ఒక పోస్టును వీరు తప్పక పెడుతూ జాతిని జాగృతం చేస్తుంటారు. ఇంత
గొప్ప విషయాన్ని కనుగొన్న మహా సామాజిక ఆలోచనాపరుడు కూడ తెలంగాణలో ఒక పరంపరగా విద్యార్ధుల
ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు ప్రభువుల కొలువులో వున్నాడని రేపటి ప్రపంచానికి ఎవరో ఒకరు
చెప్పాలిగా !!
ఇక్కడ ఇంకో
సూక్ష్మం వుంది. నిజాం సంస్థానంలో కొలువు చేస్తున్నపుడు కూడ శ్రీశ్రీ రైతాంగ పోరాటానికి
వ్యతిరేకంగా కవితలు రాయలేదు. శ్రీశ్రీ రికార్డును
సంగిశెట్టి శ్రీనివాస్ బ్రేక్ చేశారు. విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నపుడు ప్రభువుల
మెప్పు కోసం ఆ శవాల మీద తన భవిష్యత్తును నిర్మించుకునే ప్రయత్నంలో ఇంటర్మీడియట్ బోర్డు
పరిరక్షణ పథకానికి అక్షర సేవలు అందించారు.
అసలు, తెలంగాణ
సాయుధ రైతాంగ పోరాటం మీద మహా ఆలోచనాపరుడు అయిన
సంగిశెట్టి శ్రీనివాస్ సెంటిమెంట్ ఎంత ప్రగాఢమైనదీ? అనేది ఇప్పుడు మరో కీలక ప్రశ్న. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జులై 4న ఆరంభమయింది.
కరీంనగర్ జిల్లాలో ఇసక రవాణాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని నేరెళ్ళ పోలీసు
స్టేషన్ లో 2017 జులై 4 రాత్రి స్థానిక ఎస్పీ
చాలా కర్కశంగా చిత్రహింసలు పెట్టాడు. బాధితులు చాలా కాలం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడారు.
ప్రముఖ దినపత్రికలు అన్నింటిలోనూ ఈ వార్తలు వచ్చాయి. అప్పుడు సంగిశెట్టి శ్రీనివాస్ తన తెలంగాణ సాయుధ
రైతాంగ పోరాటం సెంటిమెంటును బయటికి తీశారా? లేక ఆ సెంటిమెంటును లోదుస్తుల్లో గట్టిగా
దాచుకున్నారా? ద్వంద్వ ప్రమాణాలను పాటించేవారిని అసలు మనిషి అనడం కూడా తప్పు; ఆలోచనాపరుపరుడు అనడం చాలా పెద్ద
తప్పు.
ఈ సందర్భంగా
ఒక మాట చెప్పకుండ వుండలేము. మౌఖిక, లిఖిత సాహిత్యాల్లో తెలంగాణకు ఒక గొప్ప సాంప్రదాయంవుంది.
ఆ వాసనలేవీ ఈ ఇంటర్మీడియట్ బోర్డు మేధావికి అబ్బినట్టులేవు. బోర్డు పరిరక్షణ కోసం రాసిన
వ్యాసంలో ఒక్క వాక్యానికయినా జీవం వుందా? భాషలో జీవం ప్రజలవైపు నిలబడినప్పుడు వుంటుంది.
ప్రభుత్వం వైపు నిలబడినపుడు భాష నిర్జీవం అయిపోయి ప్రభుత్వ ఉత్తర్వుల్లా మాడిపోతుంది.
విద్యార్ధుల
ఆత్మహత్యల మీద వారు రాసిన వ్యాసం మీద బహిరంగ చర్చను కొనసాగిద్దామని ప్రతిపాదించినపుడు
సంగిసెట్టి శ్రీనివాస్ తాను “ప్రభుత్వ ఉద్యోగి” అంటూ పరిమితుల్ని గుర్తుచేశారు. అయితే
వారి స్వీయ అస్థిత్వం ప్రకటన చారిత్రికంగా మహత్తరమైనది. తెలంగాణ ఉద్యమం సాగుతున్న రోజుల్లో విద్యార్ధులేగాక
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు సహితం పెద్ద సంఖ్యలో రోడ్ల
మీదకు వచ్చి అప్పటి ప్రభుత్వాన్నీ, ప్రభుత్వాధినేతల్ని పేర్లు పెట్టి విమర్శీంచేవారు.
అప్పుడప్పుడు తిట్టేవారు కూడ. నిజంచెప్పాలంటే తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యోగ సంఘాలే ముందుండి
నడిపాయి. ఆ విశాల ప్రజాస్వామ్యం గతించిన కాలమని, ఇప్పుడు నోరు మెదపడానికి కూడ అవకాశాలు
లేవని సంగిసెట్టి శ్రీనివాస్ చాలా అద్భుతంగా చెప్పారు. ఈ చారిత్రక వాస్తవ ప్రకటనకు
వారిని మెచ్చుకోకుండా వుండలేం!
రచన : హైదరాబాద్, మే డే, 2019
ప్రచురణ :
Monday, 29 April 2019
PAN'S Labyrinth Movie Review - Do not rule with the blood of the helpless!
Do not rule with the blood of the helpless!
నిస్సహాయుల నెత్తురుతో పరిపాలించకండి !
ఉష
యస్ డానీ
ప్రవేశిక
మెక్సికన్ డైరెక్టర్ గుల్లెర్మో డెల్ తోరో కథ రాసి, దర్శకత్వం వహించిన 2006 నాటి Dark Fantasy Drama Film Pan's Labyrinth . పాన్ / ఫాన్ అంటే ప్రకృతి దేవత. వనకన్య. లాబిరింత్ అంటే చీకటి గుయ్యారం.
భావోద్వేగాలతో సాగే సినిమాలను డ్రామా అంటారు, కల్పిత, అద్భుత, మానవాతీత పాత్రలతో సాగే గాథల్ని ఫాంటసీ అంటారు. హింసాత్మక లేదా భయంకర సన్నివేశాలుంటే డార్క్ అంటారు. ఈ మూడు శైలులతో కూడిన సినిమా ఇది.
స్పెయిన్ లో 1944 నాటి సైనిక పాలన వాతావరణంలో స్పానిష్ భాషలో తీసిన ఈ సినిమాను సబ్ టైటిల్స్ తో ప్రపంచమంతటా విడుదల చేశారు. ఇంగ్లీషు సబ్ టైటిల్స్ ను డెల్ తోరో స్వయంగా రాశాడు గాబట్టి వాటిని కూడా ఆస్వాదించవచ్చు. అయితే, సినిమాను మొదటిసారి చూస్తున్నప్పుడు సబ్ టైటిల్స్ ను పట్టించుకోక పోవడమే మంచిది. అనువాదం కోసం సబ్ టైటిల్స్ మీద దృష్టిని పెడితే సినిమా విజువల్ ప్రభావాన్ని పూర్తిగా ఆస్వాదించలేము. (కావాలంటే అనువాదం కోసం రెండోసారి సినిమా చూడవచ్చు).
2007 ఫిబ్రవరిలో జరిగిన 79వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో Pan's Labyrinth Best Cinematography, Best Art Direction, Best Make-up విభాగాల్లో మూడు ఆస్కార్లు అందుకుంది. అనేక ఇతర ఫిలిం ఫెస్టివల్స్ లో ఇంకా అనేక అవార్డులు గెలుచుకుంది.
133 కోట్ల రూపాయల సాధారణ బడ్జెట్ తో తీసి 600 కోట్ల రూపాయల భారీ వసూళ్ళు చేసిన సినిమా ఇది. అవతార్ వంటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ 8 శాతం మాత్రమే.
సినిమాను చూసిన తరువాత ఎలాగూ సమీక్ష చేస్తాం కనుక పరిచయంలోనే సినిమా కథను చెప్పడం భావ్యం కాదు. అయితే ఈ సినిమాను ఏ లక్ష్యంతో తీశారో చెప్పాల్సిన అవసరం వుంది.
PAN'S cతరువాత గుల్లెర్మో డెల్ తోరో 2017లో THE SHAPE OF WATER సినిమా తీశాడు. అది అతనికి దర్శకునిగా ఆస్కార్ అవార్డు తెచ్చి పెట్టింది. ఆ సందర్భంగా అతను ఒక టివీ ఇంటర్ వ్యూలో "మన కాలపు విద్వేషాలకు విరుగుడుగా ఆశ, విమోచనల గురించి ఒక అందమైన, సొగసైన కథల్ని సృష్టించాలనుకుంటాను” అన్నాడు.
Guillermo del Toro
THE STORY
“I wanted to create a beautiful, elegant story about hope and redemption as an antidote to the cynicism of our times. I wanted this story to take the form of a fairy-tale in that you have a humble human being who stumbles into something grander and more transcendental than anything else in her life.
And then I thought it would be a great idea to juxtapose that love against something as banal and evil as the hatred between nations, which is the Cold War, and the hatred between people due to race, colour, ability and gender.”
05-Mar-2018
THE PAST “In a monster movie of the 50s, Michael Shannon’s Colonel Richard Strickland, the square-jawed, good-looking government agent, would be the hero, and the creature would be the villain. In The Shape of Water I wanted to reverse those things.”
ఇదీ ఆయన సినిమాల లక్ష్యం.
Guillermo del Toro
ఇక ఇప్పుడు మీరంతా సినిమాను చూడండి.
సినిమా వీక్షణానంతర సమీక్ష
సినిమా ఆరంభ సన్నివేశాల్లోనే 14-15 నిముషాల మధ్య ఒక నాటకీయ ఘట్టం వుంటుంది.
తల్లి కార్మెన్ కడుపులో పుట్టబోయే బిడ్డ కదులుతూ వుంటాడు. అప్పుడామె తన కూతురు అఫేలియాతో “లోపల నీ తమ్ముడు అశాంతితో గోల చేస్తున్నాడు. వాడికి ఒక కథ చెప్పు. విని వాడు శాంతిస్తాడు” అంటుంది.
అప్పుడు మన కథా నాయకి, ప్రొటాగోనిస్టు, అఫేలియా తల్లి పొట్ట మీద తల వాల్చి ఓ కథ చెపుతతుంది.
“తమ్ముడా! నా తమ్ముడా!
పూర్వకాలంలో
విషాదం అలుముకున్న ఒక ఏకాంత ప్రాంతంలో
ఒక భయంకరమైన పెద్ద నల్లరాయి కొండ వుండేది.
అదొక ముళ్ళదారి. ఆ ముళ్ళ నిండా విషం.
ఆ కొండశిఖరం మీద
ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో
ఒక గులాబీ పువ్వు వికసించేది.
అది గొప్ప మహత్తు గలది.
దాన్ని అందుకున్న వాళ్ళు
కష్టాల నుండి విముక్తులు అవుతారు.
స్వేఛ్ఛ పూర్వక జీవితాన్ని గడుపుతారు.
ఆ లోకంలో మనుషులందరూ
హింస గురించీ, కష్టాల గురించి,
నెత్తి మీద వేలాడుతున్న కత్తి గురించీ,
నీడలా వెంటాడుతున్న చావు గురించీ
నిరంతరం భయపడుతూ బతికేవారు.
అంతేగానీ,
సాహసించి కొండశిరానికి చేరుకుంటే
అమరత్వం సిధ్ధిస్తుందని
ఒక్కరు కూడా ఆలోచించేవారు కాదు.
గులాబి చెట్టు తన పని తాను చేసుకుంటూ పోయేది.
ప్రతి సాయంకాలం ఒక కొత్త గులాబీ పువ్వు వికసించేది.
దాని మహత్తును గుర్తించేవారు ఎవరూ లేక
అమరత్వాన్ని అందుకునేందుకు ఎవరూ ముందుకు రాక
ఆ చీకటి కొండ మీద ఆ గులాబి పువ్వులు
ప్రతి రాత్రి కృశించిపోయేవి.
కాలం అంతమయిపోయే వరకు
ఈ విషాదం ఇలాగే కొనసాగింది” -
- అంటూ కథను ముగిస్తుంది అఫేలియా.
“కష్టజీవులు తిరగబడితే పోయేదేమీలేదు; బానిస సంకెళ్లుతప్ప” అన్నాడు కార్ల్ మార్క్స్. ఎల్లకాలం ఇలా కష్టాలను తలచుకుంటూ కుమిలిపోతూ వుండకండి. కొంచెం తెగిస్తే జీవితం ఆనందమయం అవుతుంది అనే సందేశాన్ని ఈ కథ చెపుతోంది. అలా రాబోయే తరాలకు ఒక సందేశాన్ని పంపుతోంది కథానాయకి. ఇదే PAN'S LABYRINTH సినిమా లక్ష్యం.
నిర్దిష్టంగా చెప్పాలంటే ఫ్రాన్సిస్కో ఫ్రాంకొ వంటి నియంత అత్యంత క్రూరమైన పధ్ధతుల్లో పాలిస్తున్నపుడు ఆ దేశ ప్రజలు ఏం చేయాలో ఈ సినిమా చెపుతుంది.
సినిమాలో నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో పాత్ర నేరుగా కనిపించదుగానీ అతని ప్రతిబింబమే మనకు తెర మీద కెప్టెన్ విడాల్ గా కనిపిస్తుంది. ఇటలీలో నియంత ముస్సోలినీ రాజకీయ భావజాలాన్ని ఫాసిజం అన్నట్టు, జర్మనీలో నియంత హిట్లర్ రాజకీయ భావజాలాన్ని నాజిజం అన్నట్టు స్పెయిన్ లో ఫ్రాంకో రాజకీయ భావజాలాన్ని 'ఫలాంగిజం' అంటారు. వ్యక్తిగా ఫ్రాంకోకు, భావజాలం పరంగా ఫలాంగిజంకు ప్రతిరూపం కెప్టెన్ విడాల్ పాత్ర.
ఆ నిరంకుశుని పేరు వింటేనే ప్రజలంతా భయపడి వణికిపోతున్న కాలంలో ఒక పసిపాప ఆ నియంతను అతని ఇంట్లోనే ఎదుర్కొని అంతం చేయడం ఈ సినిమా సూక్ష్మ కథ. దాన్నే డ్రమాటిక్ యాక్షన్ అంటారు.
ఎంత సుదీర్ఘ ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్నట్టు ఎంత గొప్ప సినిమా కథ అయినా డ్రమాటిక్ యాక్షన్ కు చెందిన ఒక్క వాక్యంతోనే మొదలవుతుంది. ఖనిజాల కోసం ఇతర గ్రహాలకు వెళ్ళిన అంతరిక్ష యాత్రికుల బృందంలోని ఒక సభ్యుడు తన మనసు మార్చుకుని అక్కడి ఆదివాసుల పక్షాన నిలబడడం ‘అవతార్’ సినిమాలో డ్రమాటిక్ యాక్షన్.
డ్రమాటిక్ యాక్షన్ లో మళ్ళీ మూడంశాలు వుంటాయి. ఎవరి గురించీ చెపుతున్నాం? ఏం చెప్పబోతున్నాం? ఎక్కడ ఏ వాతావరణంలో చెప్పబోతున్నాం? అనేవి ఆ ప్రశ్నలు. ఒక మెరుగైన జీవితం కోసం ఓ పదేళ్ళ పాప పడే తపన గురించి చెప్పబోతున్నాం, నియంతల పాలనను అంతం చేయాలని చెప్పబోతున్నాం, 1944 నాటి స్పెయిన్ లో చెప్పబోతున్నాం అనేవి వాటికి సమాధానాలు.
సినిమా కథకు జానపద అంశం తోడయితే అది సులువుగా జనం లోనికి వెళిపోతుంది అని వివరిస్తూ గతంలో ఒక విస్తార వ్యాసం రాశాను. కొంచెం తరచి చూస్తే 'ప్యాన్స్ లాబిరింత్' సినిమాలో భాగవతంలోని ప్రహ్లాదుడి కథ ఛాయలు కనిపిస్తాయి. ఈ కథలో అఫేలియా, కెప్టెన్ విడాల్, కమ్యూనిస్టు గెరిల్లాలను వరుసగా ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, నరసింహావతారంగా ఊహించుకుంటే డ్రమాటిక్ యాక్షన్ నిర్మితి సరిగ్గా అతికినట్టు సరిపోతుంది.
స్పెయిన్ లో 1936-39 మధ్య కాలంలో అంతర్యుధ్ధం సాగింది. ఒకవైపు విప్లవ కారులు, మరో వైపు విప్లవ ప్రతీఘాత శక్తులు, ఒక వైపు, కమ్యూనిజం మరోవైపు జాతీయ అతివాదం, ఒకవైపు గణతంత్ర ప్రజాస్వామ్యం మరోవైపు నియతృత్వం, ఒకవైపు వర్గపోరాటం మరోవైపు మతయుధ్ధం బరి గీసుకుని స్పెయిన్ వీధుల్లో భీకరంగా తలపడ్డాయి. చివరకు 1939లో ఫ్రాన్సిస్కో ఫ్రాంకొ నాయకత్వంలోని నియంతృత్వ శక్తులు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నాయి. నియంత ఫ్రాంకో కర్కశ పాలన ఐదేళ్ళు గడిచాక మన సినిమా కథ మొదలవుతుంది.
సినిమా క్లైమాక్స్ లో, “స్వార్ధం అంటే ఏమిటో తెలీని పసిపిల్లవాడి నెత్తురును ఆ కొలనులో కలిపితే పాతాళ లోకానికి మహారాణివి అవుతావు?” అని అఫేలియాకు చెపుతాడు ప్రకృతి దేవుడు. అఫేలియా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. “ఈ కత్తి తీసుకో ఒకే ఒక్క నెత్తుటి చుక్క కావాలి. సూదిమొనతో చిన్నగా గుచ్చినంత నెత్తురు చాలు. పౌర్ణమి ఘడియలు దాటి పోతున్నాయి, ఇంకొక్క నిముషం ఆలస్యం అయితే ఇంకెన్ని జన్మలు ఎత్తినా నీకు మళ్ళీ మహారాణి అయ్యే అవకాశం రాదు.” అంటూ హెచ్చరిస్తాడు ప్రకృతి దేవుడు. రాజ్యం కోసం అమాయక జీవుల నుండి ఒక్క రక్తపు చుక్కను పారించడడానికి కూడ అఫేలియా ఒప్పుకోదు. పసిపిల్లాడిని కాపాడడడం కోసం తన రక్తాన్ని ధారబోయడానికి సిధ్ధం అవుతుంది. అలా చనిపోతుంది.
సినిమా రిజల్యూషన్ లో అఫేలియా పాతాళ లోకానికి వెళ్ళి యువరాణి 'మొఅన్నా'గా మారిపోయాక పాతాళ రాజు “నిస్సహాయుల్ని, అమాయకుల్ని కాపాడడం కోసం నీ రక్తాన్ని ధారబోశావు. మహారాణి కావడానికి అది అంతిమ పరీక్ష మాత్రమేకాదు అన్నింటికన్నా ప్రాణప్రదమైన పరీక్ష కూడ” అంటాడు.
“మహారాణి మొఅన్నా ధర్మ నిబధ్ధతతో, దయా హృదయంతో అనేక శతాబ్దాలు పాలించింది. ఆమె తన ప్రజలకు ప్రేమపాత్రురాలిగా మిగిలిపోయింది. తాను ఈ భూమి మీద కొన్నాళ్ళు బతికినందుకు గుర్తుగా కొన్ని ఆనవాళ్ళను అక్కడక్కడా వదిలి వెళ్ళింది. ఎక్కడ చూడాలో తెలిసినవాళ్ళకు ఆ చిహ్నాలు ఇప్పటికీ కనిపిస్తాయి” అనే ఎపిలోగ్ లో పాలకులు నియంతలైతే అధికారం కోసం అమాయకుల రక్తాన్ని చిందిస్తారు. పాలకులు ఉత్తములైతే తమ రక్తాన్ని ధారబోసి అమాయకుల్ని రక్షిస్తారు అనే ఒక గొప్ప సందేశంతో సినిమా ముగుస్తుంది.
డ్రమటిక్ యాక్షన్, అందులోని మూడు అంశాలు నిర్ణయం అయిపొయే సమయానికి రచయితకు ప్రధాన పాత్రలు అన్నీ ఊహామాత్రంగా అయినా తెలుస్తాయి. ఆ తరువాత ప్రధాన అంశం మీద, దాని వాతావరణం మీద, పాత్రల స్వభావాల మీద, వాటి జీవన స్థితిగతుల మీద పరిశోధన సాగించాలి.
ముందు పరిశోధన సాగించి తరువాత డ్రమాటిక్ యాక్షన్ ను నిర్ధారించడం తలకిందులు పధ్ధతి. పరిశోధన సందర్భంగా వెలుగులోనికి వచ్చే అనూహ్య అంశాలు డ్రమాటిక్ యాక్షన్ ను దెబ్బతీయకూడదు. ఒక విప్లవ వీరుడు వలస పాలకుల్ని ఎదుర్కొవడాన్ని డ్రమాటిక్ యాక్షన్ గా నిర్ణయించుకున్నాకే అల్లూరి శ్రీరామరాజు మీదనో, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి మీదనో పరిశోధనలు జరపాలి. వాళ్ళ జీవిత వివరాల్లోనికి మరీ లోతుగా వెళితే డ్రమాటిక్ యాక్షన్ చట్రంలో ఇమడలేని అనేక ఇబ్బందికర వాస్తవాలు వెలుగు లోనికి వచ్చి పాత్ర ఔచిత్యం మీద రచయిత నమ్మకాన్ని దెబ్బ తీస్తాయి.
హాలివుడ్ స్క్రిప్టు రచయితలు పరిశోధన కార్యక్రమాన్ని చాలా విస్తృతంగా సాగిస్తారు. తమ కథల్లోని సన్నివేశలను పోలిన సంఘటనలు కొనసాగుతున్న అనేక దేశాలకు సహాయకులను పంపిస్తారు. ఆయా దేశాల్లోని రచయితలు, సమాజ కార్యకర్తల ద్వార విస్తృతంగా ఇన్ పుట్స్ ను తీసుకుంటారు. అవతార్ సినిమా రచన సందర్భంగా జేమ్స్ కామెరాన్ సహాయకులు విశాఖపట్నం వచ్చి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆ జిల్లాలో గిరిజనులు సాగిస్తున్న ఆందోళనల్ని పరిశీలించి వెళ్ళారు. ప్యాన్స్ లేబరింత్ సినిమాలోని సెటప్ మొత్తంగా ఇప్పటి ఛతీస్ గడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టు ఆదివాసులకు, సిఆర్ పిఎఫ్ దళాలకు మధ్య సాగుతున్న ఘర్షణల్ని తలపిస్తుంది. డెల్ తోరో సహాయకులు దంతేవాడ వచ్చి అక్కడి పరిణామాల్ని పరిశీలించి వెళ్ళారన్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు!. హాలివుడ్ సినిమాల స్క్రిప్ట్ పరిశోధన ఆ స్థాయిలోనే వుంటుంది.
అలా పరిశోధించక పోతే సైనిక శిబిరంలో స్థానిక ఆదివాసీలే పనిచేస్తుండడం, వాళ్ళకూ విప్లకారులకూ మధ్య ఒక సహజ సంబంధాలు (ఆర్గానిక్ కనెక్షన్) వుండడం, వాళ్ళే లోపలి వాళ్లకు ఆహారం పంపిస్తూ వుండడం, ఉత్తరాలు బట్వాడా చేస్తూ వుండడం, సైనిక ఆస్థాన డాక్టర్లే విప్లవకారులకూ వైద్యం చేస్తుండడం, ఉద్యమకారుల దగ్గర కొన్ని లాటరీ టిక్కెట్లు దొరకడం వంటి వివరాలు వెలుగు లోనికి రావు. కెప్టెన్ విడాల్ సంగీతాభిమానం, గెడ్దం గీసుకునే పధ్ధతి, అతని మూఢనమ్మకాలు, పగిలిపోయిన వాచీ, అకారణంగా ఓ పేద రైతును చంపి అతను వేటాడి పట్టుకున్న కుందేళ్లను తను వండుకుని తినడం. తన గాయానికి తానే కుట్లు వేసుకునే తెగింపు వంటి సూక్ష్మ అంశాలు విస్తృత పరిశోధనలవల్లే వెలుగులోనికి వచ్చి పాత్రలను పరిపూర్ణంగా తీర్చిదిద్దడానికి తోడ్పడతాయి. నొప్పి తగ్గడానికి విడాల్ మద్యం తాగినపుడు అతని గాయానికి పెట్టిన బ్యాండేజి మీద హఠాత్తుగా రక్తం వ్యాపిస్తుంది. సూక్ష్మస్థాయిలో పరిశోధనలు చేస్తే తప్ప ఇలాంటి వివరాలను స్క్రిప్టుల్లో పొందుపరచడం సాధ్యంకాదు.
డెల్ తోరో ఈ సినిమాను సమర్పించిన పధ్ధతి చాలా గొప్పగా వుంటుంది. ఫస్ట్ ఇమేజితోనే డెల్ తోరో తన స్క్రిప్టు సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తాడు. తొలి ఫ్రేమ్ లో ఎనిమిది అంశాలు వుండాలని సిడ్ ఫీల్డ్ వంటి స్క్రిప్టు పండితులు ఒక నియమం పెట్టివున్నారు. మొదటిది; మెటాఫర్ అలంకారాన్ని వాడాలి. Metaphor అంటే directly refers to one thing by mentioning another కదా. నేపథ్యంలో ఒక లాలిపాట వినపడుతుంటే, నియంత జరిపిన కాల్పుల్లో నెత్తుటి ముద్దగా మారిన పదేళ్ల పాప ముఖంతో సినిమా మొదలవుతుంది. నియంత పాలనకు ఇంతకన్నా రూపకం ఏముంటుందీ? రెండవది, ఆందోళన లేదా ఘర్షణ. ఒక నియంత మీద సాగే పోరాటంలో ఆ పాప చనిపోయింది. మూడవది థీమ్. అమాయకుల రక్తంతో రాజ్యాలు ఏలకూడదు. నాలుగవది ప్రధాన పాత్ర. సినిమా కథా నాయికే ఆ పాత్ర. ఐదవది ప్రధాన పాత్ర ప్రధాన సమస్య. పసిపిల్లవాడైన తన తమ్ముడ్ని కాపాడుకోవడమే ఆ పాత్ర ప్రధాన సమస్య. ఆరవది సెట్టింగ్. సినిమా పేరే ల్యాబెరింత్. ఆ పాప ల్యాబరింత్ లోనే పడివుంది. ఏడవది టైమ్ ఫ్రేమ్. నియంత ఫ్రాంకో పాలనా కాలంలోని ఫలాంగిస్టు కెప్టేన్ విడాల్ ఆమెను కాల్చాడు. ఎనిమిదవది ప్రధాన పాత్ర పేరు. గత జన్మలో మొఅన్నా, ఈ జన్మలో అఫేలియా.
Metaphor; directly refers to one thing by mentioning another.
Struggle and anxiety
Theme of the movie
Protagonist
Major Task
Story Setting
Time Frame
Name of the Protagonist
ఈ ఎనిమిది అంశాల్లో మొదటి నాలుగు అంశాల్ని తక్షణం గుర్తు పట్టవచ్చు. మిగిలిన నాలుగు అంశాలు కూడా ఫస్ట్ ఇమేజ్ లో వున్నాయిగానీ అవి ప్రేక్షకులకు కథా క్రమంలో మాత్రమే అర్థం అవుతాయి. సినిమా చివర్లో ఇదే ఇమేజితో ముగుస్తుంది. వర్ణణాత్మక సాహిత్యంలో The ending scene should lead to conceive the beginning scene అనే మాట ఒకటుంది. ఆ నియమాన్ని కూడా డెల్ తోరో పాటించినట్టయింది.
ఫస్ట్ ఇమేజిని సమర్ధంగా రూపొందిస్తే ప్రేక్షకులకు సగం కథ చెప్పేసినట్టేనని అంటారు. విజయ సంస్థకు చెందిన సుప్రసిధ్ధ తెలుగు నిర్మాత ఆలూరి చక్రపాణి ఫస్ట్ ఇమేజ్ గురించి ఒక మాట అనేవారట. ఎన్ టి రామారావును పెట్టుకుంటే అతన్ని తెర మీద చూడగానే ఈ సినిమాకు ఇతనే హీరో అని ప్రేక్షకులు సులువుగా అర్థం చేసుకుంటారు. అదే కొత్త నటుడ్ని పెడితే ఆ సినిమాకు అతను హీరో అని చెప్పడానికి నాలుగైదు సీన్లు అదనంగా పెట్టాలి. అదో డబ్బు దండగ అనేవారట.
సాధారణంగా 120 నిముషాల నిడివిగల ఏ సినిమా కైనా 60 పెద్ద సీన్లు, ఓ ఇరవై చిన్న సీన్లు వుంటాయి. సాధారణ స్క్రిప్టు రైటర్లు ఈ 80 సీన్లను విడివిడి పెట్టెలుగా రాసుకుని అలాగే చిత్రించి, ఎడిటింగ్ సమయంలో ఫేడ్ఇన్ / ఫేడ్ అవుట్, డిసాల్వ్, వైప్ వంటి ట్రాన్సిషన్స్ ద్వార లంకె ఇచ్చుకుంటుంటారు. డెల్ తొరో అందుకు భిన్నంగా ఐదారు సీన్లను ఒకే గుత్తిగా మార్చి స్క్రిప్టు సిధ్ధం చేస్తాడు. అలాంటి ఒక ఉదాహరణను ప్రిశీలిద్దాం.
సినిమా 26వ నిముషంలో కెప్టెన్ విడాల్ గ్రామ్ ఫోన్ లో సంగీతం వింటూ గడ్డం గీసుకుంటున్నాడు. మెర్సిడీస్ వచ్చింది. వేటగాని దగ్గర పట్టుకున్న కుందేళ్ళను ఆమెకు ఇచ్చి రాత్రికి వండించ మన్నాడు. కాఫీ బాగోలేదని మండిపడ్డాడు. కుందేళ్ళు అందుకుని మెర్సిడీస్ మెట్లు దిగి కిందికి వంటగది లోనికి వచ్చింది. వాటిని మరొకరికి ఇచ్చి వండమంది. అక్కడున్న పనివాళ్లతో రాత్రి డిన్నర్ ఏర్పాట్ల గురించి మాట్లాడింది. ఆ తరువాత వేడినీళ్ళ బకెట్టు తీసుకుని బాత్ రూమ్ లోనికి వెళ్ళింది. అక్కడ మరో పనిషితో కలిసి బాత్ టబ్బును వేడినీళ్ళతో నింపింది. మెర్సిడీస్ వెను తిరుగుతుండగానే అక్కడికి వ్హీల్ ఛైర్లో కార్మేన్ వచ్చింది. అప్పటికే అక్కడ అఫేలియా వుంది. రాత్రి విందు కోసం కుట్టించిన కొత్త డ్రెస్సును అఫేలియాకు చూపించింది కార్మేన్. స్నానం చేయడానికి అఫేలియా బాత్ రూమ్ లోనికి వెళ్ళింది. లోపల ఒక మూలన దాచి వుంచిన మాయా పుస్తకాన్ని బయటికి తీసింది. బాత్ టబ్బు మీద కూర్చోని పుస్తకాన్ని తెరిచింది. బయటి నుండి తల్లి పిలుస్తోంది. లోపల అఫేలియా తన భుజం వెనుక చంద్రుని ఆకారంలో వున్న పుట్టుమచ్చను అద్దంలో చూసుకొంటోంది. కొత్త బట్టల్లో నువ్వు యువరాణిలా వుంటావు అంటోంది బయటి నుండి తల్లి. పుట్టు మచ్చను చూసి నేను నిజంగా యువరాణినే అనుకుంటోంది అఫేలియా. అక్కడి నుండి కొత్త బట్టలు వేసుకోవడం. వంటగదిలోనికి వెళ్ళడం. మెర్సిడీస్ పెరట్లోకి తీసుకెళ్ళి పాలు పితికి గిన్నెలో పోసి ఇవ్వడం. అంతలో కెప్టేన్ నుండి పిలుపు రావడం. మెర్సిడీస్ గొడౌన్ కు వెళ్ళడం. విడాల్ సరుకుల్ని రేషన్ కార్డుల్ని పరిశీలించడం. మెర్సిడీస్ దగ్గరున గొడౌన్ తాళం చెవిని వెనక్కి తీసుకోవడం. అడవిలో ఏదో కాలుతున్నట్టు పొగలు రావడం. గుర్రాల మీద బయలుదేరడం. గుర్రాలను తప్పించుకుని అఫేలియా అడవిలోనికి వెళ్ళడం. సైనికులు తిరుగుబాటుదార్లను వెంటాడుతూ వెళ్ళడం. అఫేలియా చెట్టు తొర్రలో దిగడం. గాలికి ఎగిరి కొత్త బట్టలు బురదలో పడడం. గుర్రాలు తిరుగుబాటుదార్లు విడిది చేసిన ప్రాంతాని చేరడం. అక్కడ తనిఖీలు చేయడం. తిరుగుబాటుదార్లకు కెప్టెన్ విడాల్ సవాలు విసరడం. సైనికులు వెళ్ళిపోయాక తిరుగుబాటుదార్లు మళ్ళీ అక్కడికి రావడం. అఫేలియా రాక్షస కప్ప నుండి తాళంచెవి సంపాదించి బయటికి రావడం వరకు దాదాపు 13 నిముషాల పాటు ఒకే లింకులో అనేక సీన్లు మారుకుంటూ కథ సాగిపోతూ వుంటుంది. అనేక షాట్లు వుంటాయిగానీ ప్రత్యేకంగా సీన్ మారినట్టు ఎక్కడా అనిపించదు. అదేదో నదిలో పడవలా సీన్లు మెత్తగా సాగిపోతుంటాయి.
PAN'S LABYRINTH సినిమాకు మరీ ప్రాణప్రదమైనది శైలి. మాంత్రిక వాస్తవికత. మ్యాజికల్ రియలిజం శైలి అది.
రెండు ఖండాలకు విస్తరించిన లాటిన్ అమెరికా ప్రాంతంలో బ్రెజిల్, మెక్సికో, కొలంబియా, అర్జెంటైనా, వెనెజుల, పెరు, పెద్ద దేశాలు. లాటిన్ అమెరికన్లు పురాతన రోమన్ల భాషలయిన స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్ భాషల్లో రచనలు సాగిస్తున్నప్పటికీ వారి సాహిత్యానికి ఒక ప్రత్యేకత వుంది. Magic realist movement / Magical Realism / fabulism కు ఆద్యుడిగా భావించే జోర్జ్ లూయిస్ బోర్జెస్ (1899 – 1986) వంటి మహారచయిత అర్జెంటైనా కు చెందిన వాడు. ఒన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యూడ్ (1967) రచయిత గేబ్రియల్ గార్షియ మార్క్వేజ్ (1927 – 2014) కొలంబోకు చెందినవాడు. 1988లో 'ద ఆల్కెమిస్ట్' నవలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యాన్ని పొందిన పోర్చుగీస్ రచయిత పౌలో కొయెల్హో కూడా బ్రెజిల్ కు చెందిన వాడే. వీళ్లంతా మాంత్రిక వాస్తవికత సాంప్రదాయాన్ని కొనసాగించినవారే.
మాంత్రిక వాస్తవికత అంటే; సామాన్య మానవులకు సాధారణ పరిస్థితుల్లో సాధ్యంకాని, నెరవేరని అనేక ఆకాంక్షల్ని అసాధారణ మాంత్రిక పధ్ధతుల్లో, అతీత శక్తులు, అద్భుత జీవుల సహాయంతో నెరవేర్చి ఒక సాహిత్య సమర్ధన కల్పించడంగా భావించవచ్చు. fables, myths and allegory మొదలైన శైలులన్నీ ఈ కోవలోనికి వస్తాయి. మాంత్రిక వాస్తవికత అందరికీ సులువుగా అర్ధం అయ్యే రీతిలో ఒక స్థానిక అన్వయాన్ని పరిశీలిద్దాము.
తెనాలి సమీపంలోని చుండూరు గ్రామంలోని పెత్తందారీ కులాలకు చెందినవాళ్ళు 1991 ఆగస్టు 6న దళితవాడ మీద దాడి చేసి ఎనిమిది మందిని క్రూరంగా నరికి చంపారు. అనేక మందిని తీవ్రంగా గాయపరిచారు. శవాలను గోనె సంచుల్లో కుక్కి సమీపంలోని తుంగభద్రా డ్రెయిన్ లో ముంచేశారు. 179 మంది నిందితులుగావున్న ఈ కేసును 16 సంవత్సరాలు విచారించిన ప్రత్యేక కోర్టు 2007లో 21 మందికి జీవిత ఖైదును, 35 మందికి ఏడాది ఖైదును విధించి నేర నిరూపణ జరగని కారణంగా ఇంకో 123 మంది నిందితుల్ని వదిలివేసింది.
శిక్షలుపడ్డ 56 మంది హైకోర్టులో పిటీషన్ వేశారు. ఇంకో ఏడేళ్ల విచారణ సాగిన తరువాత జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ 2014 ఏప్రిల్ 23న తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ వాళ్ళు తగిన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టలేకపోయారనే కారణంతో మొత్తం 56 మందికి కింది కోర్టు విధించిన శిక్షల్ని రద్దు చేసింది.
న్యాయస్థానాల మీద అణగారిన సమూహాల నమ్మకం సడలిన సందర్భం ఇది. ఆ తీర్పు మీద దళిత శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ధర్మాసనం ముందు వాళ్లు నిస్సహాయులుగా వుండిపోయారు. ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్ళిండం తరువాతి పరిణామం.
ఇంత వరకు చెప్పిన కథ అంతా వాస్తవమే. సరిగ్గా ఇక్కడే మేజికల్ రియలిజం లేదా మాంత్రిక వాస్తవికత ప్రవేశిస్తుంది.
శిక్షల నుండి తప్పించుకున్న 179 మంది పెత్తందారీ కులస్తులు చుండూరు పరిసర గ్రామాల్లో విజయోత్సవ యాత్ర తలపెడతారు. ఇది నిస్సహాయుల పుండ్ల మీద కారం చల్లినట్టు అవుతుంది. అణగారిన సమూహాలు కుమిలిపోతాయి. ఎవరి ఇళ్ళలో వాళ్లు దీనంగా మౌనంగా భయంగా రోదిస్తుంటారు.
నరహంతకుల విజయోత్సవం జోరుగా సాగుతున్న సమయంలో ప్రకృతి అసహనంతో ఊగిపోతుంది. భూమి బద్దలయిపోతుంది. రక్కసుల పాపం పండి ప్రళయం ముంచుకు వచ్చేస్తుంది. రోడ్డు పక్కనున్న మర్రి చెట్లు వేళ్లతో సహా ఊగిపోతాయి. మర్రి ఊడలు పూనకం వచ్చినట్టు చెలరేగిపోతాయి.
మరునాడు ఉదయం ప్రకృతి నెమ్మదిగా శాంతిస్తుంది. జనం ఇళ్ల నుండి బయటికి వస్తారు. తలెత్తి ఆకాశం వైపుకు చూస్తారు. ఒక అద్భుతం జరిగినట్టుగా మర్రి చెట్ల ఊడలకు వరుసగా 179 శవాలు వేలాడుతుంటాయి !!!.
మార్మిక వాస్తవికత చేసే సాహిత్య న్యాయం ఇదే.(literary justification)!.
వర్తమాన ప్రపంచ సినిమాను మెక్సికన్లు ఏలుతున్నారంటే అతిశయోక్తికాదు. వరుసగా 2015లో ‘బర్డ్ మేన్’, 2016లో ‘ద రెవనంట్’ సినిమాలకు ఉత్తమ దర్శకునిగా ఆస్కార్ అవార్డుల్ని అందుకున్న అలెగ్జాంద్రో గొంజాలెజ్ ఇనరిట్టు మెక్సికనే. 2013లో ‘గ్రావిటీ’కీ ఉత్తమ దర్శకునిగా ఆస్కార్ అవార్డుల్ని అందుకున్న అల్ఫోంసో కౌరాన్ కూడా మెక్సికనే. గుల్లెర్మో డెల్ తోరో తో కలిపి ఈ ముగ్గురు మెక్సికన్ దర్శకుల్ని ఇప్పుడు ప్రపంచ సినిమా విమర్శకులు ‘మహాదర్శక త్రయం’ అంటున్నారు.
వీళ్ళ సినిమాల్లో హింస పాలు ఎక్కువగానే వుంటుంది. వైన్ బాటిల్ తో పేద రైతు కొడుకును చంపడం, నత్తి వున్న విప్లవకారుడ్ని చిత్రహింసలు పెట్టడం వంటి సన్నివేశాల్లో హింస చాలా జుగుప్సకరంగా వుంటుంది. ఇనరిట్టు దర్శకత్వం వహించిన 2000 నాటి సినిమా ‘అమొరేస్ పెర్రోస్’లో డాగ్ ఫైట్ తదితర సన్నివేశాల్లోని హింస ప్రేక్షకుల్ని ఎక్కువగానే ఇబ్బంది పెడుతుంది. అయితే, సమాజంలో అంతకన్నా ఎక్కువ హింస వుందనేది ఈ దర్శకుల భావన. సమాజంలోని హింసను చూపించకపోతే అంతా బాగుందనే మిధ్య ఒకటి ప్రబలుతుందని వీళ్ళు భావిస్తారు.
మెక్సికన్ ‘మహాదర్శక త్రయం’ ఆ స్థాయికి రావడానికి లాటిన్ అమెరికన్ సాహిత్యం తోడ్పడిందంటే అతిశయోక్తి కాదు. సాహిత్య పునాది లేనివాళ్ళు, సాహిత్య ధోరణులు తెలియనివాళ్ళు గొప్ప కళాఖండాలను సృష్టించలేరు. మాంత్రిక వాస్తవిక సాహిత్య ధోరణి గురించి తెలుసుంటే మనకు లాటిన్ అమెరికన్ సినిమా దర్శకుల సాహిత్య పునాది కూడా తెలుస్తుంది. ఆ ముగ్గురిలో మాంత్రిక వాస్తవిక సాహిత్య శైలి మీద గొప్ప అవగాహనను కొనసాగిస్తున్న దర్శకుడు గుల్లెర్మో డెల్ తోరో. తమ ప్రాంతపు సాహిత్య సాంప్రదాయాల మీద గట్టి పట్టు వున్నవాళ్ళే గొప్ప కళాఖండాలను సృష్టించగలుగుతారు.
(తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ పైడి జయరాజు ప్రీవ్యూ థియేటరులో ఏప్రిల్ 28న ప్యాన్స్ ల్యాబెరింత్ సినిమాను ప్రదర్శించిన సందర్భంగా క్యూరేటర్ గా చేసిన ప్రసంగం పూర్తి పాఠం.)
(స్పానిష్ భాషలో ఎవరి పేరును ఎలా ఉఛ్ఛరిస్తారో నాకు తెలీదు. ఎల్ పక్కన ఎల్ వస్తే ‘య’ అంటారంటా మెక్సికన్లు. అంటే ‘గుల్లెర్మో’ను ‘గుయ్యెర్మో’ అనాలి. అలా ప్రతి భాషలో కొన్ని ప్రత్యేక ఉఛ్ఛారణలు, నిశ్శబ్ద అక్షరాలు వుంటాయి. మనం స్పెయిన్ అనే దాన్ని స్థానికులు ఇస్పాన (ESPANA) అంటారు. అవన్నీ తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. చాలా కాలం క్రితం ఓ పెద్దాయన నాకు దీనికి ఒక పరిష్కారాన్ని బోధించాడు. “నీకు తెలిసిన ఇంగ్లీషులో ఫొనెటిక్స్ ప్రకారం ఉఛ్ఛరిస్తే చాలు” అన్నాడు. నేను దాన్నే అనుసరిస్తున్నాను. బహు భాషా కోవిదులు నా పరిమితిని అర్ధం చేసుకోగలరు).
రచన : హైదరాబాద్, 28 ఏప్రిల్ 2019
ప్రచురణ :
ప్రజాపాలన దినపత్రిక , 29 ఏప్రిల్ 2019 - 2 మే 2019
Subscribe to:
Posts (Atom)