Saturday, 23 May 2020

నరేంద్ర! ఐ లవ్ యూ

నరేంద్ర! ఐ లవ్ యూ - II

ఈ రాత్రి హటాత్తుగా నరేంద్ర రేవల్లి బాగా గుర్తుకు వస్తున్నాడు.
ఆర్థిక శాస్త్రంలో మెళుకువల్ని నేను ప్రొఫెసర్ ఆర్ ఎస్ రావు దగ్గర నేర్చుకున్నాను. నేను నా గురువులుగా భావించే వారిలో ఆర్ ఎస్ రావు ఒకరు.
పొట్లూరి పుల్లయ్య గారూ (షేర్ సింగ్) ఆంధ్రజ్యోతిలో స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ ను విశ్లేషించేవారు. నన్ను టెక్నికల్స్ ను విశ్లేషించమని వారు ప్రొత్సహించారు.
ఆర్థిక శాస్త్రంలో ముఖ్యంగా స్టాక్ మార్కెట్ మీద నాకున్న నైపుణ్యాన్ని టివీ ప్రేక్షకులకు తెలుపడానికి చాలా ఆసక్తి చూపినవాడు నరేంద్ర. తను నేను 2004-2006 మధ్య కాలంలో సి-టీవీలో రెండేళ్ళకు పైగా కలిసి పనిచేశాము. ప్రతి వారం నా డెస్క్ దగ్గరకు వచ్చి ఇంటర్ వ్యూ చేసేవాడు. అప్పటి అనేక వీడియోల్లో ఓ రెండు మాత్రం నా దగ్గర మిగిలాయి.
ఆ తరువాత హెచ్ ఐవీ-ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలోనూ నేను ఒక రిసోర్స్ పర్సన్ గా వున్నాను. దానికి కో-ఆర్డినేటర్ నరేంద్ర.
ఇప్పుడు నరేంద్ర మన మధ్యలేడు. కానీ అతని జ్ఞాపకాలు నాతో కొనసాగుతున్నాయి. నరేంద్ర! ఐ లవ్ యూ.

Thursday, 21 May 2020

Godavari Water to Karnataka


రావమ్మా గోదావరి రాయలసీమకు
డానీ
22 మే 2020

కృష్ణానది నిర్వహణ బోర్డు KRMB  ఈ రోజు సమావేశం అయింది.
కృష్ణా జలాల్లో కేటాయించిన వాటికన్నా ఎక్కువ నీళ్ళు వాడుకుంటున్నారని  
తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ
ఆరోపణలు చేసుకుంటున్నాయి.

కృష్ణానదిలో నీళ్ళు తక్కువ వినియోగం ఎక్కువ.
గోదావరినదిలో నీళ్లు ఎక్కువ వినియోగం తక్కువ.
కృష్ణానదిలో నీళ్ళు తక్కువ వివాదాలు ఎక్కువ !


అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం – 1956 Interstate River Water Disputes Act – 1956

కృష్ణానదీజలాల వివాదం 50 యేళ్ల క్రితమే మొదలయింది.

కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ – ఇప్పుడు తెలంగాణ

గోదావరి నది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా  - ఇప్పుడు తెలంగాణ, ఛత్తీస్ గడ్.  

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ బచావత్  10 ఏప్రిల్ 1969న ట్రిబ్యూనల్.

The final report of Krishna Water Disputes Tribunal KWDT  was submitted to GoI on  27 May 1976.

The final report of the Godavari Water Disputes Tribunal GWDT was submitted to GoI on 7 July 1980

Krishna Waters Distribution
75% dependable yield 2060 TMC
Maharashtra 500 TMC
Karnataka 760 TMC
Andhrapradesh 800 TMC (plus 11 TMC)

Godavari Waters Distribution
75% dependable yield 3565 TMC
Andhrapradesh   1495 TMC
AP has harnessing 600 TMC

ఇప్పుడు ఉమ్మడి ఏపీ తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ గా మారాయి.


ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం – 2014 సెక్షన్ 85లో కృష్ణా జలాలను నిర్ధిష్టంగా పంపిణి చేశారు.

ఆంధ్రప్రదేశ్ కు 64  శాతం 512 / TMCs
తెలంగాణకు 36 శాతం             288 / TMCs

 కృష్ణానదిలో లభ్యమయ్యే నీటిలో చివరి చుక్క వరకు 1976లో పంచేశారు.
ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రాజెక్టు కట్టే అవకాశమేలేదు.
కట్టినా దానికి నికరజలాల కేటాయింపులేదు.

1977లో మద్రాసు మహానగరం దాహార్తిని తీర్చడానికి కృష్ణా పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు
చెరో 5 టిఎంసీలు = 15 టిఎంసీలు.
శ్రీశైలం రిజర్వాయర్ - పూండి రిజర్వాయర్. 406 కి.మీ.
1983 ఎన్టీఆర్ – ఎంజిఆర్ – ఇందిరాగాంధి.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్. 11, 500 క్యుసెక్కులు. 15 + 15 టిఎంసీలు.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్ – బనకచర్ల

తెలుగుగంగ,
గాలేరు-నగరి,
శ్రీశైలం కుడిగట్టు కాలువ
ప్రతి ఏటా 102 టీఎంసీలు.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్
కర్నూలు జిల్లా  నందికొట్కూరు – ఆత్మకూరు పట్టణాల మధ్య ప్రధాన రహదారికి 4 కి.మీ.

స్పిల్ లెవల్ 841 అడుగులు MSL
Minimum Draw Down Level (MDDL) of 854 ft. MSL  3,000 cu/sec
Full Reservoir Level FRL 890 ft. MSL 40, 000 cu/sec

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్ - బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ 16.5 కి.మీ.
అక్కడి నుండి మూడు మార్గాలు.


వరద రోజులు తగ్గిపోవడంతో తక్కువ కాలంలో నిర్ణిత జలాలను విడుదల చేయాలంటే డిశ్చార్చి కెపాసిటీని పెంచక తప్పదు.

రెగ్యులేటర్ డిశ్చార్చి కెపాసిటీని 44 వేల క్యుసెక్కులకు పెంచుతూ 
అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 2005 సెప్టెంబరు 13న AP GO MS 170ని విడుదల చేశారు.
అది అప్పుడూ పెద్ద దుమారాన్ని రేపింది. వైయస్ కేబినెట్ లో వున్న టిఆర్ఎస్ మంత్రులు కొందరు ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజీనామాలు చేశారు.
ఇప్పుడు మళ్ళీ వరద రోజులు తగ్గిపోయాయి.
డిశ్చార్జి కెపాసిటీని మళ్ళీ పెంచాల్సిన సందర్భం వచ్చింది.

హెడ్‌ రెగ్యులేటర్‌  నీటి విడుదల సామర్థ్యాన్ని 80 వేల కుసెక్కులకు పెంచుతూ 2020 మే 5న  ఏపీ ప్రభుత్వం AP GO MS No. 203ను జారీ చేసింది.

సహజంగానే తెలంగాణలో వివాదం మొదలయింది.
తెలంగాణ ప్రభుత్వం KRMB కు పిర్యాదు చేసింది.
ఆమ్ధ్రప్రదేశ్ కూడ KRMBకు ప్ర్యాదు చేసింది.

అతిక్రమణలు రెండువైపులా వున్నాయి.

కేసిఆర్ సంయమనంతో వ్యవహరించారు.
గోదావరిలోవున్న అదనపు జలాలను ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకోవచన్నారు.

తెలంగాణలో ప్రతిపక్ష బిజేపి పోతిరెడ్డిపాడు అంశం మీద తీవ్రంగా స్పందించింది.
వ్యవహారాన్ని కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకునిపోయింది.

ఏపిలో ప్రతిపక్ష చంద్రబాబు పోతిరెడ్డిపాడు విస్తరణకు సమర్థించనూ లేదు వ్యతిరేకించనూ లేదు. పోతిరెడ్డిపాడు సృష్టికర్త టిడిపి యే అని చెప్పుకొచ్చారు.
పోతిరెడ్డిపాడు విస్తరణ అంశాన్ని మాత్రం మాట్లాడలేదు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్  NGT పోతిరెడ్డిపాడు విస్తరణ పథకానికి స్టే ఇచ్చింది.


గోదావరిలో దాదాపు 3 వేల కుసెక్కులకు పైగా  నీళ్ళున్నాయి.

1.     ప్రాణహిత నది తెలంగాణలో  కాళేశ్వరం వద్ద గోదావరి ప్రధాన పాయతో కలుస్తుంది. Kaleshwaram is a village in Mahadevpur Mandal in Bhoopalpally          district in the Indian state of Telangana.

2.    The Ichchampalli project location is downstream of the point where Indravati River joins Godavari river in Karimnagar district  of Telangana. The Indravati joins the Godavari river near Bhadrakali village in Bijapur district of Chhattisgarh.

3.    శబరి నది ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా కూనవరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. స్తుంది.  

ఈ మూడు  పాయింట్లలో ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లో
3000 - 3100 వేల టిఎంసిల నీటి లభ్యత వుంటుంది.

The Kaleshwaram Lift Irrigation Project was opened by Telangana Governor E. S. L. Narasimhan and Chief minister K. Chandrashekar Rao On 21 June 2019

Union Government
Godavari, Krishna and Kaveri -  three rivers linkage project.  
Draft Detailed Project Report (DDPR)
247 TMC from Godavari

Rattan Lal Kataria, Union Minister of State for Jal Shakti & Social Justice and Empowerment announced in a written reply in Rajya Sabha on February 10, 2020.   

The cost of the project has been estimated as Rs 60,361 crore at the financial year 2018-19 price level by National Water Development Agency (NWDA).

The minister said that the project to connect the rivers includes three links —
a.    Godavari (Inchampalli/Janampet)-Krishna (Nagarjunasagar),
b.    Krishna (Nagarjunasagar)-Pennar (Somasila) and
c.    Pennar (Somasila)-Cauvery (Grand Anicut).
According to the draft DPR, around 247 TMC of water can be diverted from Godavari river to Nagarjunsagar dam through lifting and further south for meeting the demands of Krishna, Pennar and Cauvery basins.

In 2019 Nitin Gadkari, the then Water Resources Minister had said that Godavari-Kaveri river linking project would resolve the water disputes of Andhra Pradesh, Telangana, Karnataka and Tamil Nadu.

The project will make use of 1,100 tmc ft water of Godavari which is currently being wasted by going directly into the Bay of Bangal.

కేంద్ర ప్రభుత్వ జోక్యంతో గోదావరి నీళ్ళను ఇతర రాష్ట్రాలు కొట్టుకుపోవడానికి ముందే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు సమిష్టిగా రాయలసీమ సమస్యను పరిష్కరించాలి.





Tuesday, 12 May 2020

లోకం మారలేదు. చాలా బాధగా వుంది.

లోకం మారలేదు. చాలా బాధగా వుంది.

తొమ్మిదో ఏట నుండి నేను వింటున్న కథ ఇది. రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ కాలం నాటి కథ. పేదవాళ్ళకు బాగా పరిచయం వున్న కథ. ఇది నా జీవితంలోని కథ. ఇంట్లో అన్నం నిండుకుందని మాకు నేరుగా చెప్పలేక మా అమ్మ ఈ కథను తరచూ చెప్పేది. ఆకలంత సహజంగా అన్నం అంత అవసరంగా  నా జీవితం లోనికి కథలు వచ్చాయని మూడున్నర  దశాబ్దాల క్రితం కాళీపట్నం  రామారావుగారికి చెప్పాను. ఓ వ్యాసంలోనూ రాశాను.  రెండు రోజుల క్రితం సాజీ గోపాల్ చేసిన ఇంటర్వ్యూలోనూ ఈ కథను ప్రస్తావించాను.

ఇప్పుడు నిజంగా జరుగుతోంది. లోకం మారలేదు. చాలా బాధగా వుంది. దుఖఃం ముంచుకు వస్తోంది. 

Wednesday, 6 May 2020

From Markaz to Palghar Lynching


From Markaz to Palghar Lynching
మర్కజ్ నుండి పాల్ఘార్ వరకు

డానీ

            కరోనా వైరస్ జాతి, కుల, మతాల్ని చూడదని భారత ప్రధాని నరేంద్ర మోదీజీ ఏప్రిల్ 19న గుర్తు చేశారు. కరోనా సొకినవారిని  ‘బాధితులు’ అనరాదనీ వారిని ‘కరోనా సోకినవారు‘ ‘చికిత్సలో ఉన్నవారు’ అని మాత్రమే పేర్కొనాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. కరోనా వ్యాప్తి విషయంలో “మతాలు, ప్రాంతాల” ముద్రలు రుద్దకూడదని కూడ హెచ్చరించింది. అంతకు ముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి కూడ ఇలాంటి హెచ్చరికలే చేశాయి. కానీ అప్పటికే భారత దేశంలో కరోనాకు మతతత్వం గట్టిగా సోకేసింది.  అంతకు ముందే దేశంలో కొనసాగుతుండిన ఆర్ధిక మందగమనం కరోనా వైరస్ వ్యాప్తితో ఆర్థిక మాద్యంగా మారినట్టు అంతకు ముందే దేశంలో కొనసాగుతున్న ఇస్లామో ఫోబియా కరోనా వైరస్ కాలంలో మరింతగా విజృంభించింది.

            కరోనా మతతత్వానికి ఆజ్యంపోసింది సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి మధ్యలోనే కరోనా ప్రమాదాన్ని గురించి హెచ్చరించింది. మార్చి 11న కోవిడ్-19ను విశ్వమారిగా ప్రకటించింది. కోవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ లేదని ప్రకటించి దేశ ప్రజలకు మార్చి 13న ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవాల్ మార్చి 29న  ఢిల్లీ నిజాముద్దీన్ లోని తబ్లిఘీ జమాత్ అంతర్జాతీయ కార్యాలయం (మర్కజ్)ను ఖాళీ చేయించిన తరువాత లవ్ అగర్వాల్ కొత్త వివాదానికి తెరలేపారు.  వారు ప్రతిరోజూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కరోనా సోకిన వారి వివరాలు చెప్పే సమయంలో మర్కజ్ తో లింకులున్న కేసుల్ని ప్రత్యేకంగా పేర్కొనడం మొదలెట్టారు. ఇది వైద్య ఆరోగ్య నైతిక ప్రమాణాలకు వ్యతిరేకం మాత్రమేకాదు చట్ట విరుధ్ధం కూడ.

            ఆ మాత్రం ఉప్పు అందితే చాలు సామాజిక మాధ్యమాల ట్రోలర్స్ (Trollers) రెచ్చిపోతారు. ఇది సత్యానంతర (Post-truth) కాలం కనుక వాస్తవాలకన్నా నకిలీ వార్తలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంటాయి. వాస్తవవాస్తవాలతో  సంబంధం లేకుండ చేతికి అందిన పది రాళ్లను వేగంగా విసరడమే దినచర్యగా మార్చుకున్న సామాజిక మాధ్యమాల వీరులకు చేతినిండా పని దొరికింది. నకిలీ వీడియోలు, సంబంధంలేని వీడియోలు, మార్పులు చేసిన (doctored) వీడియోలు, అసందర్భ ఆడియోలు రంగప్రవేశం చేసి వైరల్ గా మారి వాతావరణాన్ని మతోన్మాదంతో కలుషితం చేసేశాయి.
                       

          ప్రపంచాన్ని కరోన వైరస్ కమ్ముకుంటున్న వేళ మర్కజ్ ఆమిర్ (అధినేత) మౌలనా ముహమ్మద్ సాద్ కాంధ్లావి  మార్చి13-15 తేదీల్లో  ఒక అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో వివిధ దేశాల ప్రతినిధులు అనేకులు పాల్గొన్నారు. మర్కజ్ లో జరిగిన ఈ సమావేశానికి అవసరమైన అన్ని అనుమతుల్నీ ముందుగానే తీసుకున్నారు. తీరా విదేశీ ప్రతినిధులు భారతదేశం చేరుకుని మర్కజ్ లో సమావేశం ఆరంభమయ్యాక ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాప్తి నిరోధానికి రాజధాని నగరంలో అనేక నిషేధాజ్ఞాల్ని ప్రకటించింది. సాంకేతికంగా తమ తప్పు ఏమీలేదని మర్కజ్ భావించవచ్చు. కానీ, ప్రపంచం రోగగ్రస్తంగా మారుతున్నప్పుడు బాధ్యతగల ధార్మిక సంస్థలకు సామాజిక బాధ్యత, నైతిక బాధ్యత కూడ ముఖ్యమే.

దేశంలోనికి విదేశీ పర్యాటకుల రాకపోకల వ్యవహారం మొత్తం కేంద్ర హోంశాఖ కనుసన్నల్లో వుంటుంది. ఢిల్లీ పోలీసు వ్యవస్థ కూడ కేంద్ర హోంశాఖ ఆధీనంలోనే వుంటుంది. మర్కజ్ గోడను ఆనుకునే నిజాముద్దీన్ పోలీసు స్టేషన్ వుంటుంది. అయినా ఈ సమావేశాన్ని పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. అమాయికత్వంతోనో, అజ్ఞానంతోనో, తగిన సమాచారంలేకనో, అతివిశ్వాసంతోనో, మూఢత్వంతోనో మౌలనా ముహమ్మద్ సాద్ ఒక తప్పుచేశారు. సయ్యద్ అహమద్ ఉల్ హుస్సైనీ సయీదుల్ ఖాదరి వంటి ముస్లిం స్కాలర్లు చెప్పినట్టు మౌలానా ముహమ్మద్ సాద్ చర్య “నేరపూరిత అజ్ఞానం” (Criminal Ignorance) అయితే; రాజ్ దీప్ సర్దేశాయి వంటి సీనియర్ జర్నలిస్టులు చెపుతున్నట్టు తబ్లీఘీల సమావేశాన్ని నిరోధించడంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యం కూడ “నేరపూరితమైన నిర్లక్ష్యం” (criminal negligence). రెండు వైపులా తప్పు జరిగినప్పుడు ఒక వైపు జరిగిన తప్పునే ఎత్తి చూపడాన్ని ఏమనాలీ? ఇది మతతత్వంకాక మరేమిటీ?

 

            ఏప్రిల్ 6న లవ్ అగర్వాల్ ప్రకటించిన గంణాంకాల ప్రకారం దేశంలో కరోనా సోకినవారు 4,281 మంది అయితే వారిలో మర్కజ్ లింకు వున్న వారు 1,445 మంది. అంటే 33.75 శాతం. ఏప్రిల్ 18 గణాంకాల ప్రకారం కరోనా సోకినవారు 14,378 మంది అయితే మర్కజ్ లింకు 4,291. అంటే మర్కజ్ శాతం 33.75 నుండి 29.84 కు తగ్గింది.  ఇక్కడ లవ్ అగర్వాల్ తెలివిగా దాటవేసిన విషయం ఒకటుంది. 29 శాతం  ఒక మత సంస్థకు చెందిన వారని ప్రకటించారుగానీ మిగిలిన 71 శాతం ఏ మత సంస్థకు చెందినవారో వారు ప్రకటించలేదు. వారు చెప్పక పోయినా ఆ సమూహాన్ని ఊహించడం పెద్ద కష్టం ఏమీకాదు. ఆ తరువాత మర్కజ్ లెఖ్ఖలు చెప్పడం వారు మానేశారు. అది కూడ ఒక తెలివే. ఇతర లింకుల్లో కరోనా సోకినవారి వివరాలు బయటికి వచ్చే కొద్దీ మర్కజ్ లింకు శాతం తగ్గుతూ వుంటుంది.

 

            ముస్లిం సమాజంలో సున్నీ, షియా, సూఫీ, నూర్ భాషా, ఆష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్  వంటి కొన్ని  తెగలు వుంటాయి. ఆ పైన ఓ పది  జమాత్ లు వుంటాయి. అలాంటి జమాతుల్లో తబ్లిఘీ ఒకటి. అసలు ఏ జమాత్ లోనూ వుండనివారు కూడ అనేకులు వుంటారు.  మొత్తం భారత ముస్లిం సమాజంలో తబ్లిఘీ అనేది ఒక చిన్న భాగం మాత్రమే అని చెప్పడానికే ఈ వివరణ. 

 

            అసదుద్దీన్ ఒవైసీ వంటి ముస్లిం రాజకీయ  ప్రతినిధులు మొదలుకొని ముస్లిం ఆలోచనాపరులు, మౌల్వీలు, ముఫ్తీలు  అనేకులు  కరోనా వ్యాప్తి నిరోధానికి స్వీయసమాజానికి అనేక సూచనలు చేశారు. వైద్యులతో సహకరించాలనీ, క్వారంటైన్, ఐసోలేషన్, ఫిజికల్ డిస్టాన్స్ సురక్షిత దూరం  నియమాలు పాటించాలనీ శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనలు, రంజాన్ మాస నమాజులు, ఇఫ్తార్లు, తరావ్హీలు ఇంట్లోనే సాగించాలనీ అక్కడా భౌతిక దూరాన్ని పాటించాలని ముస్లిం ధార్మిక సంస్థలు ఫత్వాలు జారీ చేశాయి. ఇస్లాం పవిత్ర స్థలాలైన మక్కా, మదీనా మసీదుల్లోనూ భక్తులు గుమిగూడడాన్ని నిషేధించారు. ఈ వాస్తవాలు ప్రధాన స్రవంతి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వైరల్ కాలేదు!. కొద్దిమంది చేసిన తప్పుకు దేశంలోని 20 కోట్ల మంది ముస్లింలను శిక్షించాల్సిందే అన్నట్టుగా మూకోన్మాదం చెలరేగిపోయింది.

 

            భారత ముస్లిం సమాజంలో  అత్యధికులు వృత్తిదారులు, చిరువ్యాపారులు, స్వయం ఉపాధిదారులు. లాక్ డౌన్ కాలంలో ‘సోషల్ డిస్టాన్స్’ అనేది వీళ్ళ మీద సోషల్ బాయ్ కాట్ గా మారింది. రైతుబజార్లలో ముస్లిం దుకాణదారుల వద్ద కూరగాయలు ఎవరూ కొనడంలేదు. వీధుల్లో  ముస్లిం  తోపుడుబండ్ల వారి వద్ద పండ్లు కొనడంలేదు. డెలివరీ బాయ్స్ ముస్లింలు అయితే ఫ్లాట్ యజమానులు తిప్పి పంపించేస్తున్నారు. అద్దెకు వుంటున్న ముస్లింలను ఇళ్ళు క్హాలీ చేయమంటున్నారు. రేపు లాక్ డౌన్ ముగిసిన తరువాత ముస్లింల షో రూములు సహితం ఈ ఆర్థిక వెలివేతకు  గురికాబోతున్నాయి. కష్టమర్ల మెప్పుకోలు కోసం ప్రైవేటు వాణిజ్య సంస్థలు ముస్లింలను రిక్రూట్ చేసుకోకపోవచ్చు. వున్న ముస్లిం సిబ్బందిని తొలగించవచ్చు. దేశంలో మొత్తం ముస్లింల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతున్నది!.

 

            లౌకికవాదం ఇతరులకు ఒక ఆప్షన్ మాత్రమే. అది ముస్లింలకు ప్రాణావసరం. మూకోన్మాదం క్రమంగా లౌకికవాదాన్ని మింగేస్తుంది. ఇప్పుడు మతసామరస్యవాదులుగా కొనసాగుతున్నవారి అంతరాంతరాలలో కొనసాగుతున్న మతతత్వాన్ని మూకోన్మాదం వెలికి తీస్తుంది. పోలీసు, న్యాయవ్యవస్థల్లోనూ ఇంకిపోయిన మతోన్మాదం మూకోన్మాదులతో ఉదారంగా వ్యవహరిస్తుంది. వాళ్ళను శిక్షించకుండ వదిలేసి, లీగల్ ఇంప్యూనిటీని ఇస్తుంది. మూకోన్మాదాన్ని మొగ్గలోనే తుంచివేయాలి.  లేకపోతే కొందరికి అదొక వ్యసనంగా మారిపోతుంది. ఈరోజు ముస్లింల మీద మూకోన్మాద దాడులు  చేస్తున్నవాళ్ళురేపు హిందువుల మీద కూడ దాడులు చేస్తారు. ఈరోజు ఆకుపచ్చ రంగు మీద కసిగా వున్నవాళ్ళు రేపు కాషాయ రంగును సహితం వదలరు. ఈ పరిణామాలు అప్పుడే అనేక చోట్ల పొడచూపుతున్నాయి.  మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సాధువుల మీద సాగిన మూకోన్మాద హత్య దీనికి తాజా ఉదాహరణ. రెండు రోజుల తరువాత ఉత్తర ప్రదేశ్ బులంద్ షహర్ జిల్లాలో ఓ శివాలంయంలో ఇద్దరు సాధువుల్ని ఒకడు హత్య చేశాడు.

 

          సూరత్ కు చెందిన గురుశ్రీ మహంత్ రాంగిరిజీ ఏప్రిల్ 16న చనిపోయారు. వారి అంత్యక్రియల్లో పాల్గొనడానికి మహారాష్ట్రలోని జునా ఆఖారా కు చెందిన ఇద్దరు సాధువులు చిక్నే మహరాజ్  కల్పవృక్షగిరి, మహరాజ్ సుశీల్ గిరి కారులో సూరత్ కు బయలు దేరారు. అవయవాల అమ్మకం కోసం పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు తిరుగుతున్నాయని పాల్ఘార్ జిల్లాలో కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. లాక్ డౌన్ కాలంలో రాత్రి 10 గంటలకు పాల్ఘార్ జిల్లా గడ్చించాలే గ్రామం మీదుగా పోతున్న ఆ ఇద్దరు సాధువుల  కారును స్థానికులు అడ్డుకున్నారు. పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చారనే అనుమానంతో వాళ్ళ మీద కర్రలతో దాడి చేశారు. సంఘటనా స్థలంలో వున్న పోలీసులు సహితం ఉన్మాదులకు సహకరించినట్టు వీడియోలు వచ్చాయి.  ఈ మూకోన్మాద దాడిలో ఇద్దరు సాధువులతోపాటూ కారు డ్రైవరు కూడ చనిపోయాడు.  

మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న బిజేపి ఈ సంఘటనను హిందువుల మీద ముస్లింలు చేసిన దాడిగా చిత్రించడానికి ప్రయత్నించింది. ట్రోలింగ్ వీరులు సోషల్ మీడియాలో అలాంటి ప్రచారాన్ని ఉధృతం చేశారు. లాక్ డౌన్ లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ‘‘మహారాష్ట్రలో ఇద్దరు సాధువులను కొందరు విచక్షణరహితంగా కొట్టి చంపేసినా ఇప్పటి వరకూ లిబరల్స్ ఎవరూ కనీసం నోరు మెదపలేదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏమయ్యాతి? మన మానవహక్కుల వీరులు ఎందుకు ఆక్రోశం వ్యక్తం చేయడం లేదు’’  అని  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా  వెటకారంగా  ట్వీట్ చేశారు.  సరిగ్గా ఇలాంటి అవకాశాల కోసమే ఎదురుచూసే రిపబ్లిక్ టివీ అధినేత అర్ణబ్ గోస్వామి ఏప్రిల్ 20న  అలవాటు ప్రకారం (కిలో గుంటూరు కారం బొక్కి) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధావ్ థాక్రే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీల మీద విమర్శల వర్షం కురిపించారు. “ఇద్దరు హిందూ సాధువుల్ని బహిరంగంగా హత్య చేశారు. ఈ దేశంలో 80 శాతంకన్నా ఎక్కువ జనాభా హిందువులది. సనాతనులది. ఈ దేశంలో హిందువుగా పుట్టడం ఒక నేరంగా మారిపోయిందా?  దీన్ని నా దేశం అంగీకరించదు. ఇది నాదేశం”. మహారాష్ట్రలోని “సోనియా –సేనా ప్రభుత్వం నాలుగురోజులు ఈ ఘోరాన్ని దేశ ప్రజలకు తెలియకుండా ఎందుకు దాచివుంచిందీ?” అని గర్జించారు.

ఈ కేసులో పాల్ఘార్ పోలీసులు 101 మందిని అరెస్టు చేశారు. విధినిర్వహణలో  ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధావ్ థాక్రే, హోం మంత్రి  అనిల్ దేశ్ ముఖ్  విడివిడిగా నిందితుల జాబితాను విడుదల చేశారు. నిందితులందరూ హిందూ సమాజానికి చెందినవారేననీ వారిలో ముస్లింలు ఒక్కరూ లేరని స్పష్టం చేశారు.  

మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్ సంఘటనల్లో మతకోణం లేదని పోలీసులు ప్రకటించబట్టి వాతావరణం చల్లబడిందిగానీ లేకుంటే లాక్ డౌన్ లోనూ మతకల్లోలాలు చెలరేగేంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.  థ్యాంక్ గాండ్!

విచిత్రం ఏమంటే, మీడియాలో మర్కజ్ వివాదాన్ని రెచ్చగొట్టింది అర్ణబ్ గోస్వామి యే. రిపబ్లిక్ టివి మార్చి 31 రాత్రి ‘ద డిబేట్’ కార్యక్రమంలో ‘మర్కజ్ కోవిడ్ స్ప్రెడ్’  హాష్ టాగ్ తో చర్చను నడిపింది.  మర్కజ్ “ఉద్దేశ పూర్వకంగా”, “బాహాటంగా”, “ప్రణాళికా బధ్ధంగా”  దేశంలో కరోనా వ్యాప్తికి “కుట్ర” చేసి “దేశద్రోహం”కు పాల్పడిందని ఆర్నాబ్ గోస్వామి ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో మూకోన్మాదాన్ని రెచ్చగొడతాయనీ, దానికి ముస్లింలే కాకుండా హిందువులు సహితం బలవుతారని అర్ణబ్ గోస్వామి అప్పుడు ఊహించి వుండరు. 

(రచయిత సీనియర్ జర్నలిస్టు, సమాజ విశ్లేషకులు. మొబైల్ 9010757776)

రచన : 25 ఏప్రిల్ 2020
ప్రచురణ :

Monday, 27 April 2020

సంక్షోభం వచ్చినపుడు ఆమె తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.


సంక్షోభం వచ్చినపుడు
ఆమె తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.

          మతాంతర వివాహం కనుక  చాలామంది మాది ప్రేమ వివాహం అనుకుంటారు. మాది అరేంజెడ్ మ్యారేజి. పెళ్ళికి ముందు మా మధ్య పెద్దగా పరిచయం కూడ లేదు; రెండు సందర్భాలలో పార్టి మీటుంగుల్లో కలవడం తప్ప. ఇప్పుడిది కొందరికి ఆశ్చర్యంగా వుండొచ్చుగానీ అప్పట్లో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల్లో ఇలాంటివి అనేకం జరిగేవి. ఇప్పటి కొలమానాలు మారిపోయాయిగానీ, ఉద్యమాల్లో పనిచేయడం అప్పట్లో స్త్రీపురుషుల మధ్య ప్రధాన ఆకర్షణ అంశంగా వుండేది. అలా ఉద్యమకారుల్ని పెళ్ళి చేసుకోవడానికి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఉత్సాహం చూపేవారు.   నేను పనిచేసిన పీపుల్స్ వార్ లో ఈ సాంప్రదాయం కొంచెం ఎక్కువగా వుండేది.

          తన కూతుర్ని పార్టీలో ఇవ్వాలని ఏలూరి భీమయ్య అనుకున్నారు. “డానీకి ఇస్తే బాగుంటుంద”ని కొండపల్లి సీతారాయయ్య  సలహా ఇచ్చారు. సాహిత్యలోకానికి అజ్ఞాత సూర్యుడుగా, ఉద్యమకారులకు మల్లిక్ గా తెలిసిన   నెమలూరి భాస్కరరావు నాకు పెళ్ళి సంబంధం తెచ్చినపుడు “ఓసారి అమ్మాయితో మాట్లాడాక ఓ నిర్ణయానికి వద్దాము” అన్నాను. ఆయన అలాగే మాకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు.

          ఓ ఆటోమోబైలు కంపెనీలో చిన్న ఉద్యోగం నాది. ఆరుగురు సభ్యులున్న కుటుంబానికి బ్రెడ్ ఎర్నింగ్ బాధ్యత నాది. ఆ పైన ఉద్యమంలో ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియని ఒక ఉత్కంఠ వాతావరణం. పైగా మతం కూడ వేరు. అలాంటి కుటుంబంలో ఇమడాలంటే గొప్ప ఏ అమ్మాయికయినా గొప్ప మానసిక సంసిధ్ధత కావాలి.

          భీమయ్య గారిది కమ్మ సామాజికవర్గం. కృష్ణాజిల్లా నందిగామ తాలూకాలో మధ్యతరగతి రైతు. మనిషి చాలా నిరాడంబరంగా వుండేవారు. వారి ఏకైక సంతానం అజిత ఔత్సాహిక విద్యార్థి నాయకురాలు. “నాకు ఆర్థిక స్తోమత లేదు. పైగా కష్టాలు, రిస్క్ కూడ వుంటాయి” అన్నాను. అప్పుడు తను డిగ్రీ సెకండియర్ యాన్యూవల్ పరీక్షలు రాస్తోంది.  విద్యార్థినుల్లో వుండే విప్లవ అతి ఉత్సాహపు అమాయికత్వం వల్ల తను నన్ను చేసుకోవాలనుకుంది!.

          సీనియర్ జర్నలిస్టు ఏలూరి రఘుబాబు నన్ను ఒకసారి ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. ప్రముఖు ముస్లిం రచయితలు  హిందువులను పెళ్ళి చేసుకున్నారు. ఇదెలా జరిగిందని. నరసాపురంలో మా గురువుగారు, ప్రముఖ నాటక రచయిత యం.జి. రామారావుగారు పెళ్ళి విషయంలో నాకో సలహా ఇచ్చారు. “భార్యకు రెండు లక్షణాలు వుండాలి. మొదటిది; మొగుడి మేధస్సును ఎంతోకొంత అర్థం చేసుకునేంత జ్ఞానం వుండాలి. రెండోది; తన మొగుడికన్నా గొప్పవాడు ఈ లోకంలో మరొకడు లేడనుకునేంత అజ్ఞానం వుండాలి” అని. యంజీఆర్ మాటల్నే నేను రఘుబాబు గారికి చెప్పాను. అప్పట్లో ఆంధ్రా ప్రాంతంలో మా తెలుగు రచనల్ని అర్థం చేసుకుని మెచ్చుకునేంత నైపుణ్యంగల ముస్లిం మహిళలు లేరు. తెలుగు సాహిత్యంలో మా నైపుణ్యాన్ని హిందూ స్త్రీలే గుర్తించినట్టున్నారు.

          మా కష్టాలు పెళ్లి రోజునే మొదలయ్యాయి. 1983 మేడే నుండి వారం రోజుల పాటు కృష్ణా వుభయగోదావరి జిల్లాల్లో విద్యార్థి యువజనులకు రాజకీయ శిక్షణా తరగతులున్నాయి. అప్పట్లో ఆ మూడు జిల్లాలకు నేను విరసం, రాడికల్ యూత్ లీగ్ లకు బాధ్యునిగా వున్నాను. కొత్త వారికి చారిత్రక గతితార్కిక భౌతికవాదం ప్రాధమిక పాఠం చెప్పడం నా బాధ్యత.   ఆఫీసులో సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే పెళ్ళి కోసం స్టాఫ్ కు ఏడు రోజులు సెలవు ఇచ్చే సాంప్రదాయం ఒకటి వుండేది. ఆ అవకాశాన్ని వాడుకున్నాను. మే డే రాజకీయ తరగతుల కోసం  ఏప్రిల్ 27న పెళ్లి చేసుకున్నాము. ఆ రాజకీయ తరగతులే మా హానీమూన్.

          మా పెద్దబ్బాయి 1985 ఏప్రిల్ 2న పుట్టాడు. కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టాము. ఓ బంద్ సందర్భంగా బెజవాడ పోలీసులు నన్ను ముందస్తు అరెస్టు చేసి రోజుకో స్టేషన్లో వుంచారు. పసిపిల్లాడ్ని పక్కింటివాళ్లకు అప్పచెప్పి రోజూ నన్ను వెతుక్కుంటూ పోలీసు స్టేషన్లన్నీ తిరిగేది. ఆ ఏడాది జులై 17న కారంచెడు దురాగతం జరిగింది. వంద రోజుల కొడుకుని వదిలేసి నాలుగు నెలలు ఆ ఉద్యమం లోనికి వెళ్లిపోయాను. మా ఇల్లు నిర్మాణం ఆగిపోయింది. కారంచెడు నిందితులు తన సామాజిక వర్గానికి చెందినవారు. అసలు తను అదేమీ పట్టించుకోలేదు.  కుటుంబానికి జరిగిన ఆర్థిక నష్టంకన్నా అప్పట్లో నాకు వచ్చిన పేరును చూసి తను మురిసిపోయింది. అప్పట్లో మాకు ఒంగోలు సమీపాన చేజర్ల మండలంలో 5 ఎకరాల పట్టా భూమి వుండేది. కారం చెడు ఉద్యమ ఉత్సాహంలో ఆ భూమిని వదిలేశాను. తనేమీ అనలేదు. తను నన్ను ఎప్పుడైనాసరే ఒక సోషల్ యాక్టివిస్టుగా చూడాలనుకుంటుంది.

          చుండూరు ఉద్యమంలో నా పాత్ర స్వల్పం. ఉద్యోగం మానేసి వెళ్ళిపోమ్మని తను ప్రోత్సహించింది.అనివార్య కారణాలవల్ల నాకు కుదరలేదు. బలహీనవర్గాల సమాఖ్య కార్యవర్గంలో నాతోపాటు పనిచేసింది. చినగంజాం ఉప్పు ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటం, వాడరేవు షిప్ బ్రేకింగ్ యూనిట్ వ్యతిరేక పోరాటం, నెల్లూరులో యానాది సంఘాల సమాఖ్య ఏర్పాటు మొదలు అమ్రాబాద్ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన  వరకు అన్నింట్లోనూ తను నా వెంటే వుంది.

          అనేకానేక ఉద్యమాలు, రాజకీయ మలుపులు, అరెస్టులు అలా ఆ ఉత్కంఠ 37 సంవత్సరాలు కొనసాగింది. మేమిద్దరం మాత్రమే ఓ నెల రోజులు ఒకే చోట వుండిపోయిన సందర్భం ఇదొక్కటే. ఆ అవకాశాన్ని కరోనా లాక్ డౌన్ మాకు కల్పించింది.

          నాది ఉద్రేక స్వభావం. అలాంటి భర్తను నాలుగు దశాబ్దాలపాటు భరించడం అంత సులువు కాదు. తనదీ ఉద్రేక స్వభావమే. అంచేత తాలింపు మాడిందనో, కారం ఎక్కువయిందనో, చింతపండు వాడారనో, కరెంటు బిల్లు కట్టకుండా క్యాంపుకు వెళ్ళిపోయాననో, బాత్ రూం స్లిప్పర్స్ తో హాలు లోనికి వచ్చేశాననో ఇలా అనేకానేక కారణాలతో మేమిద్దరం క్రమం తప్పకుండ రోజుకు మూడు పుటలా కోట్లాడుకుంటుంటాం. చీకటిపడగానే కలిసిపోతుంటాం.

          చలసాని ప్రసాద్ మా పెళ్ళి పురోహితుడు. వంద పెళ్ళిళ్ళు చేసిన ఘన చరిత్ర అతనిది. అందులోనూ ఒక విచిత్రం వుంది. ఆయన చేసిన నూరు వివాహాల్లో 99 జంటలు విడిపోయారు. “ఒరే డ్యానీగ్యా! నువ్వూ అజిత కూడ విడిపోతే నా పేరున ఒక  రికార్డు నెలకొంటుంది” అనేవాడు చలసాని.  ఆ వంద జంటల్లో ముందుగా మేమే విడిపోతామని సామాజిక పండితులు నమ్మేవారు. ముస్లింలు అలవోకగా విడాకులు ఇచ్చేస్తారనే ప్రచారమూ బలంగా వుండేది.  మేము ఆ ఊహాగానాలను నిజం కానివ్వలేదు.

          మా ఇద్దరి మధ్య ఒక శ్రమ విభజన వుంది. నేను రచయితను. తను టెక్నీషియను. ప్రింటు మీడియాలో డిటిపి పనులు, ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్ ప్రోగ్రామింగ్, కెమేరా సెట్టింగ్, లైటింగ్, వీడియో ఎడిటింగ్ తదితర సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ తనకు మంచి నైపుణ్యం వుంది. ఈ విభాగాల్లో నేను తన మీద ఆధారపడతాను. 

          కమ్మ సామాజికవర్గపు స్త్రీలలో ఎక్కువ మందికి ఆర్థిక వ్యవస్థ మీద స్థూలంగా అయినా ఒక  అవగాహన వుంటుంది. అజితకు కూడ అలాంటి నైపుణ్యం  వుంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో తనవల్ల ఎప్పుడూ నాకేమీ ఇబ్బంది కలుగకపోగా, నేను ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పుడు తనే సమర్థంగా ఇంటిని నడిపేసేది.  ఇందులో సౌకర్యంతో పాటూ ఒక అసౌకర్యం కూడా వుంటుంది; ఇంట్లో ఇద్దరు యజమానులు వుంటారు!.

          భార్యాభర్తల సంబంధాల్లో అంతిమంగా భార్యలే పీడిత వర్గం. దాంపత్యంలో నేనేమీ విప్లవాత్మక మార్పులు తేలేదుగానీ కొన్ని సంస్కరణలు మాత్రం చేశాను. అజితకు వారసత్వంగా వచ్చిన స్థిర చరాస్తుల్ని నేనేమీ ముట్టుకోలేదు. ఆపైన, నా స్థిర చరాస్తుల్ని ఆమె పేరున రాసి ఇచ్చేశాను. ఇల్లు, కారు, స్కూటరు, బంగారం, నగదు ఏదీ నా పేరున వుంచుకోలేదు. ఆర్థిక వ్యవహారాల నుండి తప్పుకోవడంలో ఒక హాయి వుందనిపిస్తోంది. ఆ కష్టాలేవో తనే పడుతుంది.  నాకు మాత్రం అలెన్ సొలీ బ్రాండుకు తగ్గకుండ డ్రెస్సులు కొనిపెడుతుంది.

          సాధారణ సందర్భాల్లో అజిత కూడ ఒక సాధారణ స్త్రీయేగానీ ఆర్థిక సంక్షోభం వచ్చినపుడు ఆమె తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. పన్నెండేళ్ళ క్రితం నేను పనిచేస్తున్న ఓ టీవీ ఆఫీసు నుండి ఫోన్ చేసి “ఇక్కడి వాతావరణం నాకు నచ్చడంలేదు” అన్నాను. “ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వచ్చేయి. నేనున్నాగా.” అంది.   మరుక్షణం ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వచ్చేశాను.

          పదేళ్ళ క్రితం వరవరరావు ఒక సాహిత్య సభలో నా గురించి చెప్పినట్టు నేను నిరంతర అసమ్మతివర్గం. ప్రత్యర్ధుల్ని ఎలాగూ తెగబడి ఖండిస్తాను. మావాళ్లు అనుకున్నవాళ్ళు తప్పు చేసినా నిర్మొహమాటంగా మందలిస్తాను. అజిత లేకపోతే నేను అలాంటి కొన్ని సాహసాలు చేయగలిగేవాడిని కాదేమో! నాకు నచ్చింది నచ్చిందనీ, నచ్చనిది నచ్చలేదని ధైర్యంగా చెప్పగలిగేవాడిని కాదేమో! నిజసతోదర పొషణార్థమై గడ్డి కరవాల్సిన కాంప్రమైజ్ కావాల్సిన అవసరం నాకు రాలేదు.

థ్యాంక్యూ డార్లింగ్!

27 ఏప్రిల్ 2020 

Thursday, 16 April 2020

Let us draw lessons from Corona


Let us draw lessons from Corona
కరోనా నేర్పుతున్న గుణపాఠాలు
డానీ

వైద్య ఆరోగ్య వ్యవస్థలో కరోన వైరస్ చాలా ప్రమాదకరమైన ముప్పు. దీని పర్యవసానాలు కూడా చాలా తీవ్రంగా వుంటాయి. అయితే ఇదంతా తాత్కాలికమే. మానవజాతికి ముప్పులు కొత్త కాదు, గతంలోనూ వున్నాయి.  వరదలు, ఉప్పెనలు, భూకంపాలు, ఉల్కాపాతాల్ని ఎదుర్కొని మనం నిలబడ్డాం. కరోనాను మనం తప్పకుండా జయించి తీరుతాం. అందులో సందేహంలేదు. అయితే అదే ముగింపుకాదు. ఆ తరువాత సమాజంలో మనం పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా వున్నాయి. ఎదుర్కోవాల్సిన ఉపద్రవాలూ చాలానే వున్నాయి.

ఈరోజు మనం చూస్తున్న ఉపద్రవాలన్నీ 1990ల నాటి నూతన సరళీకృత ఆర్థిక విధానాల ఫలితాలని ముందుగా మనం గ్రహించాలి. ఈ మహమ్మారి మూలాలు ప్రపంచ వాణిజ్య కేంద్రం పునాదుల్లో వున్నాయి. ఇది చైనాలో పుట్టిందని కొందరు అంటున్నారు. సరళీకృత ఆర్థిక విధానాన్ని తెలివిగా వాడుకొని గట్టిగా లాభపడిన దేశంలో కరోన వైరస్ పుట్టిందని ఎందుకు అనుకోరూ?   ఇప్పుడు మనం అనుభవిస్తున్నది మూడు దశాబ్దాల పాప ఫలితం. ప్రకృతితో చెలగాటం ఎప్పుడూ చెల్లదు. మన తప్పిదాలను ప్రకృతి ఎన్నటికీ క్షమించదు. అది ఆగ్రహిస్తుంది. ప్రకృతి ఆగ్రహాన్ని తట్టుకోవడం అంత సులువుకాదు. ప్రపంచ మానవాళీ మొత్తం ఒకసారి మృత్యుముఖంలోనికి వెళ్ళి వస్తోంది. మానవజాతికి కరోనాకన్నా ప్రమాదకరమైన అణుయుధ్ధం, భూతాపం వంటి మరికొన్ని  ఉపద్రవాలు ముంచుకు రాబోతున్నాయి.  మనం ఇప్పుడు వాటిని ఎదుర్కోవడానికి సిధ్ధం కావాలి.

 కరోనా సమస్య పరిష్కారం అయ్యాక మన ముందుకు రెండు ప్రత్యామ్నాయాలు వస్తాయి. ప్రభుత్వాలకు నిరంకుశ అధికారాలన్నీ అప్పచెప్పడమా? లేక మానవీయ విలువలతో కూడిన ఒక కొత్త సమాజాన్ని పునర్ నిర్మించడమా? 

కరోన సమస్య తీరే నాటికి దాదాపు అన్ని దేశాల్లోనూ ఆర్ధిక సంక్షోభం చెలరేగుతుంది. ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి  తమకు అపరిమిత అధికారాలు కావాలని ప్రభుత్వాధి నేతలు అడుగుతారు. సామరస్య, సామ్యవాద, ప్రజాస్వామిక ఆదర్శాలున్న రాజ్యాంగాలను అటకెక్కిస్తారు.  కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే  దేశ ఆర్థిక స్థితి మెరుగుపడదంటారు. నిజానికి కరోకా పుట్టడానికి ముందే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం వుంది. ప్రభుత్వాలు కార్పొరేట్ రంగానికి భారీగా రాయితీలు ప్రకటించాయి. ఇప్పుడు మందగమన నెపంతోపాటూ ఆర్థిక సంక్షోభం నెపాన్ని కూడ కరోనా మీద గెటివేసే అవకాశం పాలకులకు దక్కుతుంది. 

ఇలాంటి సంక్షుభిత సందర్భంలో  దురదృష్టావశాత్తు వదరుబోతులు, ముధ్ధోన్మాదులు, వివక్షవాదులు, సమానత్వ వ్యతిరేకులు అనేక దేశాల్లో పాలకులుగా వున్నారు. డోనాల్డ్ ట్రంప్ దీనికి పెద్ద ఉదాహరణ.

అమెరిక ఆర్థిక సామర్థ్యమేగాక సైనిక పాటవం కూడ చాలా పెద్దది. క్యూబా, ఇరాన్ ల మీద అమెరిక అనేక ఆంక్షల్ని విధించింది. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని బలహీనపరచడానికి అనేక కుట్రలు పన్నింది.   అనేక యూరప్ దేశాలు సహితం అమెరిక బాటలోనే నడిచాయి. క్రూడాయిల్ ధరను ఇరాన్ తగ్గించినా అమెరికాకు భయపడి అనేక దేశాలు కొనలేదు. అలా కొనని దేశాల్లో భారత్‍ కూడ ఒకటి.

ఈ కష్టకాలంలో ఏ దేశమూ మరో దేశాన్ని ఆదుకునే స్థితిలో లేవు. కానీ యూరోప్ దేశాల్లో కరోన సోకిన వారికి వైద్య సేవలు అందించడానికి క్యూబా తన వైద్య బృందాల్ని పంపించింది. చాత్రిత్రక అపహాస్యం అంటే ఇదే. ఇప్పుడయినా యూరోపియన్ యూనియన్ సిగ్గుపడాలి.

కరోనా మానవాళిని వెంటాడడం మొదలయ్యాక సహంజంగానే మనలో ఒక పాపభీతి కలిగితీరాలి. మనిషి అత్యాశతో ప్రకృతితో చెలగాటమాడాడు. ప్రకృతిని విచక్షణా రహితంగా విధ్వంసం చేశాడు.  ఇప్పుడు ప్రకృతి కన్నెర్ర చేసింది.  మనిషి బెంబేలెత్తిపోతున్నాడు. అతిశయించిన అత్యాశతో మనం నిర్మించుకున్న  ప్రపంచం ఎలాంటి ఫలితాలను ఇస్తున్నదో ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. మనం ఎలాంటి ప్రపంచాన్ని కోరుకోవాలి? ఎలాంటి ప్రపంచాన్ని కోరుకోకూడదు? అనే విచక్షణ మనకు ఇప్పుడయినా రావాలి.

ఆర్థిక రంగంలో చేపట్టిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (LPG)  విధానాలు సామాజిక సాంస్కృతిక రంగాల్లో గతంలో వుత్పన్నమైన సమస్యల్ని పరిష్కరించలేకపోగా వాటిని భారీగా పెంచాయి.

సీవియర్ ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) 2003లో వచ్చింది. 2015లో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) వచ్చింది.  రెండు పెనుముప్పులు వచ్చినపుడు మూడోది వస్తుందని మనం గుర్తించి వాక్సిన్ తో సిధ్ధంగా వుండాల్సింది. ఓ మనిషికి రెండుసార్లు కుక్కకరిస్తే మూడోసారి కూడా కరుస్తుందని జాగ్రత్త పడాలి. అలా జాగ్రతత పడకపోతే అతనికి పిచ్చిపట్టిందని మనం అనుకోవచ్చు. మానవాళికి అలాంటి పిచ్చి పట్టింది. కరోన మూడవ అవతారం ఎత్తుతుందని మనం గుర్తించనేలేదు. మన ప్రాధాన్యాలు  వేరేగా వున్నాయి. మన చూపు వేరే  చోటవుంది.

మన ఫార్మా కంపెనీల ప్రాధాన్యతలు వేరు. వాటి పని మానవ జాతిని రోగాల నుండి కాపాడడంకాదు; అత్యధిక లాభాలను మూటగట్టుకోవడం. అంటువ్యాధులకు మందులు కనిపెడితే వాటిని ప్రభుత్వం గంపగుత్తగా కొని  సామూహికంగా వాడుతుంది కనుక పెద్దగా లాభాలు రావు. వ్యక్తులకు, ప్రధానంగా స్థితిమంతులకు సాధారణంగా వచ్చే జబ్బులకు మందులు కనిపెడితే మంచి ధరకు అమ్ముకోవచ్చు లాభాలు పిండుకోవచ్చు.

ఆరోగ్యమే మహాభాగ్యమని  గతంలో అనుకునేవారు. ఆరోజులు పోయాయి. ఇప్పుడు మహాభాగ్యమే ఆరోగ్యం. అదొక విలాస సరుకు.

మనకు మూడు చేపల నీతి కథ తెలుసు. ముందుగా జాగ్రత్త పడిన చేప. ప్రమాదం ముంచుకు వస్తున్నపుడు మేల్కొన్న చేప. ప్రమాదం వచ్చాక బెంబేలుపడిపోయిన చేప.

కరోన వైరస్ గురించి 2019 అక్టోబరులోనే పుకార్లు వచ్చాయి. డిసెంబరులో చైనా స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది. నీతి కథలోని మొదటి చేపలా దక్షణ కొరియా, తైవాన్ తదితర దేశాలు జాగ్రత్త పడ్డాయి. రెండవ చేపలా కొన్ని యూరప్ దేశాలు కొంచెం లేటుగా కళ్ళు తెరిచాయి. ఇక చివరి వరకు నిద్ర పోయిన దేశాలు  అమెరిక, యూకే. యూకే ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన దేశం. అమెరిక ఇప్పుడు ప్రపంచాన్ని శాశిస్తున్న దేశం. అయితేనేం ఆ రెండు దేశాలు నిర్లక్ష్యానికి ఫలితంగా ఇప్పుడు కరోన కోరల్లో గిలగిల లాడుతున్నాయి.

కరోన ఒక విపత్తే అయినప్పటికీ అందులోనూ ఒక సానుకూల కోణం వుంది. మన వ్యవస్థలో, మన ఆశల్లో, ఆశయాల్లో, మన ప్రాధాన్యతల్లో వున్న అనేక లోపాలను అది  బయటికి తెచ్చింది అంటున్నారు అమెరిక రాజకీయ విశ్లేషకులు, భాషాశాస్త్రవేత్త నోవోమ్ చోమ్స్కీ.  యూఎస్ లో కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం ఆయన ఆరిజోనా రాష్ట్రంలో స్వీయ – ఒంటరితనంలో వుంటున్నారు. మన సామాజిక ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చాలి  అంటున్నారు చోమ్స్కీ. 

కరోనా మనకు ఒక హెచ్చరిక చేసింది. దీన్ని గుణపాఠంలా తీసుకోవాలి. మన వ్యవస్థల్లోని అంతర్గత లోపాల్ని తప్పుల్ని సరిచేసుకోవాలి. లేకుంటే ఇంతకన్నా పెద్ద ఉపద్రవాల్లో మానవాళి కూరుకుపోవాల్సి వస్తుంది.

సామాజిక దూరం అనేది ఇప్పుడు కొత్త ఆరోగ్య సూత్రంగా ప్రచారం చేస్తున్నారు. మనుషుల మధ్య అంతరం అనేక శతాబ్దాలుగా  కొనసాగుతూ వస్తున్నది. ఒక కులంవాళ్ళు మరో కులంవారిని దూరంగా వుంచుతారు. ఒక తెగవారు మరో తెగని దూరంగా వుంచుతారు. ఒక మత సమూహం మరో మత సమూహాన్ని దూరంగా వుంచుతుంది. ఒక భాషవారు మరో భాష వారిని దూరంగా వుంచుతారు. ఒక దేశంవారు మరో దేశం వారిని దూరంగా వుంచుతారు. సమీప గతంలో మనుషులు కలిసి బతికిందెప్పుడూ?  మనమంతా సమానులం అనుకుని కలిసి బతికిన కాలం ఎవరికయినా గుర్తుందా?

కరోనా ఎవ్వర్నీ వదలలేదు. చైనానూ వదలలేదు అమెరికానూ వదలలేదు. ఇండియానూ వదలలేదు పాకిస్తాన్ నూ వదలలేదు. సిరియా శరణార్ధుల్నీ వదలలేదు యూరోపియన్ దేశాల్నీ వదలలేదు. రోహింగ్యాలనూ వదలలేదు; బర్మీయుల్నీ వదలలేదు.  ఇంతకు ముందు ఈ దూరాలు సమూహాల స్థాయిలో వుండేవి. ఇప్పుడు కరోనా దాన్ని వ్యక్తుల స్థాయికి తెచ్చింది. కొడుకును తాకడానికి తండ్రి, భర్తను తాకడానికి భార్య, మనిషిని తాకడానికి మనిషి  భయపడుతున్న కాలం లోనికి మనం ప్రవేశించాం.

మారుద్దాం. ఈ లోకాన్ని మారుద్దాం. మనిషిని మనిషి ప్రేమించే లోకాన్ని సృష్టిద్దాం. కరోనా గుర్తు చేస్తున్న గుణపాఠం అదే.

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు, మొబైల్ 9010757776)

రచన : 12 ఏప్రిల్  2020
ప్రచురణ : ఆంధ్రజ్యోతి (ఆంధ్రప్రదేశ్)  16 ఏప్రిల్  2020



Friday, 10 April 2020

Corona and its Background

Corona and its Background



కరోనా : కొంచెంముందూ కొంచెం వెనుక
 డానీ
          శత్రుదేశాల మీద దాడికి అణుబాంబులు సిధ్ధం చేసుకుంటారుగానీ గట్టిగా జలుబుచేస్తే చాలు మనుషుల దగ్గర  మందు వుండదని కరోన గుర్తు చేసింది.

కరోన జన్మస్థలం చైనాలోని వూహాన్ నగరం. అక్కడి  సీఫుడ్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌ పరిసరాల్లో న్యుమోనియా లాంటి వ్యాధి వ్యాపిస్తోందని చైనా ప్రభుత్వం గత ఏడాది డిసెంఅబ్రు 31న ప్రకటించింది. ఆ మరుసటి రోజునే అంటే... జనవరి 1వ తేదీన సీఫుడ్‌ మార్కెట్‌ను మూసేసింది. నిజానికి అప్పటికి రెండు నెలలు ముందే కొవిడ్ -19 అక్కడ పుట్టింది.

ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనాది రెండవస్థానం. దానికి ముప్పు వచ్చిందంటే మొదటి పదిహేను స్థానాల్లో వున్న  అమెరిక, జపాన్, జర్మనీ, యుకే, ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ, బ్రెజిల్, కెనడా, రష్యా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, స్పెయిన్, మెక్సికో దేశాలకు ముప్పు వచ్చినట్టే. తూర్పు ఆసియా దేశమైన చైనాలో మహమ్మారి పుట్టిందని తెలియగానే ఆ ప్రాంతంలోని దక్షణ కొరియా, జపాన్ వంటి దేశాలు రాబోయే వైరస్ వ్యాప్తిని తట్టుకోవడానికి ముందస్తు చర్యలు చేపట్టాయి. ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, సింగపూర్ కూడా వైరస్ పై వార్ కు సిధ్ధపడ్డాయి. మరోవైపు అమెరిక, ఇటలీలతోసహా అనేక దేశాలు రాష్ట్రాల అధినేతలు అనేకులు  కరోనాను అవహేళన చేశారు. జ్వరం, తలనొప్పి, నిమోనియాలకు వాడే పారాసిటమాల్ తదితర ‘ఓవర్ ద కౌంటర్’ (ఓటిసి) టాబ్లెట్స్ తో కరోనాను తరిమి కొట్టవచ్చని తేలిగ్గా తీసిపడేశారు. వేసవి వస్తే కరోనా నిలవదని రోనాల్డ్ ట్రంప్ హేళన చేశారు. తమ దేశం అతి త్వరలో కరోనా వాక్సిన్ ను విడుదల చేస్తుందన్నారు.

జనాభాలోనూ ఆర్థిక రంగంలోనూ చైనాతో పోటీ పడుతున్న  దక్షణాసియా దేశమైన  భారత్ తనకు పొరుగుదేశం నుండి కోవిడ్ ముప్పువుందని ముందుగానే గమనించి వుండాల్సింది కానీ అలా జరగలేదు. కోవిడ్ విశ్వమారిలా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన తరువాత కూడ ఇరవై రోజులకుగానీ మన ప్రభుత్వం మేల్కొనలేదు. పైగా, మార్చి 13న దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ లేదని ప్రకటించి దేశప్రజలకు తప్పుడు సంకేతాన్ని ఇచ్చింది.

వేగంగా దూసుకుని వస్తున్న ఒక మహమ్మారిని సకాలంలో గుర్తించ నిరాకరించిన కారణంగా మార్చి నెలాఖరుకు ప్రపంచ వ్యాప్తంగా  కొవిడ్ – 19 సోకినవారి సంఖ్య పది లక్షలు దాటింది. మృతుల సంఖ్య 50 వేలు దాటింది. వారం రోజుల్లో సోకినవారి సంఖ్య పదిహేను లక్షలు దాటేశాయి, మృతుల సంఖ్య 90 వేలకు చేరుకుంది. దాన్ని బట్టి కరోనా వ్యాప్తి వేగాన్ని అంచనా వేయవచ్చు. ఈ గణాంకాలన్నీ ఆరోగ్య పరీక్షల అనంతరం రోగ నిర్ధారణ అయిన కేసులకు సంబంధించినవి మాత్రమే. తమకు వైరస్ సోకిన విషయం తెలియనివాళ్ళు, శరీరంలో వ్యాధి లక్షణాలు ఇంకా బయటపడని వాళ్ళు ఎందరున్నారో వాళ్ల ద్వార ఇంకెందరికి ఇది సోకుతూ పోతున్నదో ఊహించుకోవలసిందే.

            కోవిడ్ – 19 వ్యాప్తిలో మూడు  దశలుంటాయి. మొదటి దశ; విదేశాల నుండి దిగుమతి కావడం. రెండవ దశ, విదేశాల నుండి వచ్చినవారి ద్వార వారి కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తదితర సన్నిహిత సమూహానికి సోకడం. మూడవ దశ; మొత్తం సమాజంలో విజృంభించడం. విదేశాలకు వెళ్ళకపోయినా, పాజిటివ్ వ్యక్తులతో సంబంధాలు లేకపోయినా అసలు ఎవరి ద్వార సంక్రమించిందో తెలియకుండానే వైరస్ సోకే చెందే దశ ఇది. దీనినే Community Transmission అంటారు. కరోనా వైరస్ సోకే అవకాశాలున్న వారిని రెండవ  దశ వరకు గుర్తించడం కష్టమేగానీ అసాధ్యం మాత్రం కాదు. భారత్ వంటి అత్యధిక జనాభా గలిగిన దేశంలో మూడవ దశలో వైరస్ సోకే వారి సంఖ్యను అంచనా వేయడం  వైద్య ఆరోగ్యరంగ నిపుణులకు సహితం అసాధ్యం.

            నిత్యం దాదాపుగా 25 వేల మంది ప్రయాణీకులు విదేశాల నుండి భారత దేశానికి  వస్తుంటారు. జనవరి, ఫిబ్రవరి, నెలల్లో అలా 6 లక్షల మంది వచ్చి వుంటారు. మార్చి 16న విదేశాల నుండి వచ్చే వారి మీద  నిషేధం విధించే వరకు ఇంకో లక్ష మంది వచ్చి వుంటారు. ఈ ఏడు లక్షల మంది భారత దేశానికి సంబంధించి కోవిడ్ – 19 మొదటి దశకు చెందిన అనుమానితులు.  వీళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ వున్నారూ? వీరి ఆరోగ్య పరిస్థితి ఏమిటీ? వీరితో సన్నిహితంగా మెలిగిన వారి సంఖ్య ఎంత? వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటీ? అనే అంశాల మీద ఒక్కర్ని కూడ మినహాయించకుండ సమగ్ర సర్వే జరగాలి. ఈ సర్వే జనగణన, ఎన్ పిఆర్, సిఏఏ, ఎన్ ఆర్సీలకన్నా ప్రాణప్రదమైనది. ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా ఎన్నార్సీసర్వే జరిపితీరుతాం అని ఒకటికి పదిసార్లు నొక్కి చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడు లక్షల మంది ఆరోగ్య స్థితి మీద సకాలంలో  సర్వే జరపాలన్న అంశాన్ని ఉపేక్షించింది. ఏ ప్రభుత్వంలో అయినా సరే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం అయిపోయినపుడు సామాజిక ప్రయోజనాలు నిర్లక్ష్యానికి గురయిపోతాయి.

            నిజానికి భారత ప్రజలు అద్భుతమైన సివిక్‍ సెన్స్ గలవారు. ప్రధాని జనతా కర్ ఫ్యూ పాటించమంటే పాటించారు. తాలీ ఔర్ థాలీ కార్యక్రమం ఇస్తే తలూపారు. చప్పట్లు కొట్టమంటే కొట్టారు. కంచాలు మీద చెంచాలతో వాయించమంటే వాయించారు.  లాక్ డౌన్ ప్రకటించి మూడు వారాలపాటు ఇళ్ళలో సెల్ఫ్ ఐసోలేషన్ పాటించమంటే పాటిస్తున్నారు. ఏప్రిల్ 5 రాత్రి దీపాలు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించమంటే వెలిగించారు. కరోనాను తరిమి కొట్టడానికి ప్రభుత్వం ఇంక ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా పాటించడానికి ప్రజలు సిధ్ధంగా వున్నారు. సరైన కార్యక్రమాన్ని ఇవ్వకపోతే అది పాలకుల తప్పిదం అవుతుందిగానీ; ప్రజలది మాత్రంకాదు. 

            ఒక అంచనా ప్రకారం ఈ వైరస్  ఒకరి నుండి మరొకరికి సగటున 17 మందికి సోకుతుంది (ట). ఈ లెఖ్ఖ ప్రకారం మొదటి దశలోని 7 లక్షల మంది అనుమానితులు  రెండవ దశలో ఒక కోటి 19 లక్షల మంది అవుతారు. మూడవ దశలో అనుమానితుల సంఖ్య దాదాపు 20 కోట్లకు చేరుకుంటుంది. ఇదొక గరిష్ట ఊహాగానం (Hypothesis) మాత్రమే. ఎందుకంటే మొదటి ధశలో  విదేశాల నుండి వచ్చినవారు అందరూ వైరస్ తో వుండరు. ఎంతమంది వైరస్ తో వచ్చారు అన్నది కూడ పరీక్షలు చేసి తేల్చాల్సిన అంశం. ఈ అంకెలు ఎవర్నీ భయపెట్టడానికికాదు; మహమ్మారిని ఎదుర్కోవడానికి మన సంసిధ్ధత ఏ స్థాయిలో వుండాలో చెప్పడానికి మాత్రమే. ముంచుకు వస్తున్న ఇంతటి మహా ఉపద్రవాన్ని మనం తక్కువగా అంచనా వేసి వేరే పనుల్లో మునిగిపోయాం. మనం అంటే ప్రజలు పాలకులు కూడ.

కేరళలో తొలి కరోన కేసు నమోదయిందని భారత ప్రభుత్వం జనవరి 30న  ధృవీకరించింది. ఆరోజు నుండే  భారత దేశానికి వస్తున్న విదేశీయుల్నీ,  స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయుల్నీ ఎయిర్ పోర్టులనుండే 14 రోజుల క్వారంటైన్ కు పంపించే కార్యక్రమాన్ని మొదలెట్టివుంటే ఈ వైరస్ ను మొగ్గలోనే తుంచేసే అవకాశం వుండేది.  కానీ, భారత ప్రభుత్వ దృష్టి అంతా అమెరిక అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన మీదే వుంది. మరో వైపు ట్రంపు కూడ భారత పర్యటనకు ఉవ్విళ్ళూరారు. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్ లో  అమెరిక అధ్యక్షుని రోడ్ షోకు అట్టహాసంగా అక్షరాల కోటి మందిని సమీకరించడానికి సన్నాహాలు చేశారు. పది మిలియన్ల భారతీయులు తనను చూడడానికి వస్తున్నారని ట్రంప్ స్వయంగా గొప్పగా చెప్పుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) సహితం అమెరిక మీద మొగమాటంతో ట్రంప్ భారత పర్యటన ముగిసే వరకు  కరోన వైరస్ మీద హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటనను వాయిదా వేసింది. డోనాల్డ్ ట్రంప్ ఇండియా వచ్చి యుధ్ధవిమానాలు అమ్ముకోవాలని ఆతృతపడ్డాడేతప్ప; అప్పుడే హైడ్రాక్సి క్లోరోక్విన్  మాత్రలు కొనుక్కోవాలనుకోలేదు

 కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా మార్చి 20న ప్రకటించింది. ఆ రోజు మన ప్రధాని దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మార్చి 22న జనతా కర్ ఫ్యూ నిర్వహించాలని కోరారు. సామాజిక దూరాన్ని పాటించాలనే నియమం కూడ ఆరోజునే మొదటిసారిగా ఎజెండా లోనికి వచ్చింది. లాక్ డౌన్ నియమాలు మార్చి 25 నుండి అమల్లోనికి వచ్చాయి.

            ఏ సమాజంలో అయినా సాంప్రదాయాలు సామాజిక విలువలు ఏర్పడడానికి కొన్ని శతాబ్దాలు పడతాయి. మన దేశంలో సాంప్రదాయాలు మారిపోవడానికి ఒక్క నెల చాలు. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో అమెరికా అధ్యక్షుడ్ని భారత ప్రధాని డజనుసార్లు ఆలింగనం చేసుకోవడం ఒక గొప్ప విలువగా ప్రచారం అయ్యింది. ఒక అభివృధ్ధి చెందుతున్న దేశం ఒక అగ్రరాజ్యం పై సాధించిన నైతిక విజయంగా దాన్ని భావించారు. సరిగ్గా నెల తిరక్కుండానే మార్చి 20న ‘సామాజిక దూరం’ కొత్త విలువగా మారిపోయింది. ఇప్పుడు మనుషుల మధ్య నాలుగు అడుగుల దూరాన్ని పాటించడం కొత్త  ఆరోగ్య సంస్కారం అయిపోయింది.  

            ప్రధాని ప్రకటించడానికి ముందేగాక ప్రకటించిన తరువాత కూడ సామాజిక దూరం నియమం విస్తారంగా వుల్లంఘనకు గురయ్యింది; గురవుతోంది. అవసరమైన ఏర్పాట్లు చేయకుండ, అందుబాటులో ఆహారాన్ని ఏర్పాటు చేయకుండా హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల కొన్ని కోట్ల మంది ప్రజలు ఇళ్ళలోనో రోడ్ల మీదనో ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలిని తట్టుకోలేనివారు గుంపులుగా రోడ్ల మీదకు వస్తున్నారు. కొందరు ఇళ్ళలోనే మగ్గిపోతున్నారు. మరి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ లాజిస్టిక్ లోపాలకు కారకులు ఎవరూ?

            ప్రస్తుతం ప్రపంచాన్ని సోకుతున్న కరోన వైరస్ కొత్తది.  2003 నాటి  సీవియర్ ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS), 2015 నాటి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS)  కన్నా ఇది భిన్నమైనది. అందుకే దీన్ని కొత్త (నావెల్) కరోనా వైరస్ లేదా కోవిడ్ -19 అంటున్నారు.  కోవిడ్ -19కు ఇప్పటి వరకు కచ్చితమైన మందు లేదు ఒక నిర్దిష్ట చికిత్సావిధానం కూడ లేదు. ఇంకా మందునే కనుగొనలేనప్పుడు టీకా (వ్యాక్సిన్) ను కనుగొనడానికి చాలా సమయం పట్టవచ్చు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నెప్పులు, నిమోనియా, సిఓపిడి, మలేరియ తదితర వ్యాధులకు ఇప్పటి వరకు వాడుతున్న మందుల్నే కరోనాకు వాడుతున్నారు. కరోన ప్రధానంగా ఊపిరితిత్తుల వ్యాధి కనుక రోగులకు వెంటిలేటర్లు వాడాల్సివుంటుంది. దానితో  ప్రపంచ వ్యాప్తంగా వెంటిలేటర్లు, సాధారణ మాస్కులు, సర్జికల్ మాస్కులు, గ్లౌజులు, హైడ్రాక్సి క్లోరోక్విన్ మాత్రలు, పర్సనల్ ప్రొటేక్షన్ ఎక్విప్ మెంట్ (PPE) వగయిరాలకు  చాలా పెద్ద గిరాకీ ఏర్పడింది. అనేక చోట్ల పిపిఇలు, మాస్కులు  అందుబాటులోలేక  డాక్టర్లు, పారా మెడికల్ స్టాఫ్, పారిశుధ్య కార్మికులు తమ విధుల్ని నిర్వహించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఏ దశకు చేరిందంటే మందులు, వైద్య పరికరాల కోసం  దేశాలే ఏకంగా హైజాకర్లుగా మారిపోతున్నాయి.

చైనా లోని షాంఘై విమాశ్రయం నుండి ఏప్రిల్ 2న ఎన్-95 మాస్కులతో ఫ్రాన్స్ కు బయలుదేరబోతున్న కార్గో విమానంలోని మొత్తం సరుకును  అమెరిక అక్కడికక్కడే మూడు రెట్లు అధిక ధర చెల్లించి ఎత్తుకు పోయింది. దేశంలో మెడికల్ కిట్స్‍ కు ఇంతటి కొరత వున్న సమయంలో  ఏప్రిల్ 5న కొచ్చి ఏయిర్ పోర్టు నుండి 90 టన్నుల మాస్కులు, సర్జికల్ గ్లౌజులు,  పిపిఇ లతో ఒక కార్గో విమానం సెర్జియా రాజధాని బెల్గ్రేడ్ కు బయలుదేరి వెళ్ళడం మీద ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. అంతకు ముందు మార్చి 29న కూడ మరో విమానంలో 35 లక్షల జతల సెర్జికల్ గ్లౌజులు కొచ్చి ఏయిర్ పోర్టు నుండి ఎగుమతి అయ్యాయి. ఏమిటీ దీనిర్ధం? 

రచన : 4 ఏప్రిల్  2020
ప్రచురణ :   ఫేస్ బుక్.  6 ఏప్రిల్ 2020