ఏ కాలంలో అయినా యధాస్థితితో సంతృప్తి చెందేవారు తక్కువగా వుంటారు, మంచిరోజులు రావాలనుకునేవారు ఎక్కువమంది వుంటారు. వర్తమాన వ్యవస్థతో వున్న సమస్యలేమితీ? వాటికి పరిష్కారాలు ఏమిటీ? అనేవి సమాజ విశ్లేషకులను నిరంతరం వెంటాడే ప్రశ్నలు. ఏ నిర్మాణానికి అయినా పైభాగం, కిందిభాగం వుంటాయి. అన్వయాన్ని బట్టి అవగాహనను బట్టి స్వరూప స్వభావాలు మారుతుంటాయి.
పైవర్గం వంటే పెత్తందారీ కులాలు, కింది వర్గం అంటే అణగారిన కులాలు అనేది ఒక ప్రమాణం. పైవాళ్లు ధనవంతులు, కిందివాళ్లు పేదలు అనేది ఒంకో కొలబద్ద. హిందూ ముస్లిం అనేది కూడ ఇంకో కొలమానం. మార్క్సిస్టులు పునాది, ఉపరితలం అని ప్రత్యేక కొలమానాల్ని వాడుతారు. పునాది అంటే ఆర్ధిక సంబంధాలు. ఉపరితలం అంటే మతం వగయిరా సాంస్కృతిక సంబంధాలు. భారత రాజకీయాల్లో ఆర్ధిక సంబంధాలకన్నా సాంస్కృతిక సంబంధాలే ఇటీవల క్రియాశీలంగా వున్నాయి. సాంస్కృతిక వ్యవస్థను గట్టిగా పట్టించుకుంటున్న సంఘపరివారం రాజ్యాధికారాన్ని సంపూర్ణగా హస్తగతం చేసుకున్నది. సాంస్కృతిక వ్యవస్థను పూర్తిగా వదిలేసిన కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా చతికిలబడ్డాయి.
కమ్యూనిస్టు పార్టీల ప్రత్యేకత ఏమంటే వ్యవస్థ స్వభావం ఏమిటీ? అని డయగ్నైజ్ చేసి తేల్చుకోకుండా, దానికి వైద్యం చికిత్స మొదలెట్టరు. మౌలికంగా అది మంచి పధ్ధతే. సమస్య ఎక్కడ వస్తున్నదంటే వాళ్ళు రోగ నిర్ధారణకు వాడుతున్న పరికరాలు మరీ పాతవి.
వందేళ్లక్రితం ఎప్పుడో అప్పటి చైనాను అర్ధవలస - అర్ధ భూస్వామ్య వ్యవస్థ అన్నాడు మావో. ఆయన అన్నాడు కదా అని ఇక్కడ ఇండియాను కూడ అర్ధవలస - అర్ధ భూస్వామ్య అనడం తప్పు. అప్పుడు ఎవో కొన్నిపోలికలు కనిపించి అలా అన్నారు సరే. ఇప్పుడూ ఆ మాటే అంటే ఎలా? స్థలకాలాలను పట్టించుకోవడమేగా గతితార్కిక చారిత్రక భౌతిక వాదంలో తొలి నియమం. మరచిపోతే ఎలా?
No comments:
Post a Comment