Saturday, 24 October 2026

Respected Mayor, please grant me permission to enter your city

 “Respected Mayor, please grant me permission to enter your city.” - Prime Minister Indira Gandhi on 30 Oct 1982 at Gannavaram Airport.

నగరానికి ఒక మేయర్ వుంటారు. నగర పరిధిలో మూడు నాలుగు అసెంబ్లీ స్థానాలుంటాయి. మొన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 24 అసెంబ్లీ సిగ్మెంట్లు వుండేవి. ఇప్పుడు వాటిని మూడు నగరాలుగా విభజించారు గానీ ఇంకా మేయర్ల ఎన్నికలు జరగలేదు. ఎలా చూసినా మేయర్ ఓటర్ల బేస్ శాసన సభ్యులకన్నా చాలా పెద్దది. అయినప్పటికీ శాసన సభ్యులకున్న విలువ మేయర్లకు వుండడంలేదు. ఇటీవలి కాలంలో రాజకీయాల్లో వచ్చిన మార్పు ఇది. ఏదో ఒక మినిస్టర్ అండతో మేయర్లు అయ్యే సాంప్రదాయం వచ్చింది.
మేయర్ పాత్రలు మనకు అలనాటి ఇంగ్లీషు, ఫ్రెంచ్ నవలల్లో చాలా శక్తివంతంగా కనిపిస్తుంటాయి. ఇంగ్లండ్ లో లార్డ్ మేయర్ అంటారు. మోనార్క్ తరువాత అంత గౌరవనీయమైన పదవి అది.
బెజవాడియన్లకు ఒక సంఘటన గుర్తుండే వుంటుంది. 1983 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 1982 అక్టోబరు 30న గన్నవరం ఎయిర్ పోర్టులో జరిగిన సంఘటన ఇది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (విటిపిఎస్) రెండో దశ యూనిట్ ను జాతికి అంకితం చేయడానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విజయవాడ వచ్చారు. విజయవాడ 1981లో నగరంగా మారింది. భారత కమ్యూనిస్టు పార్టికి చెందిన టి. వెంకటేశ్వర రావు తొలి మేయర్ గా ఎన్నికయ్యారు. విజయవాడ నగరంగా మారేక ప్రధాని రావడం అది మొదటిసారి. పైగా, అది ప్రధాని అధికార పర్యటన.
ప్రధాని ప్రత్యేక విమానం ల్యాండ్ కాగానే ఇందిరా గాంధీని రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి, విజయవాడ ఎంపి చెన్నుపాటి విద్య, కొందరు మంత్రులు, కాంగ్రెస్ నేతలు రన్ వే వైపుకు పూలదండలతో హడావిడిగా వెళ్ళారు. ఇందిరాగాంధీ వాళ్లను వారించి “మేయర్ ఎక్కడా?” అని అడిగారు. కాంగ్రెస్ నాయకులు షాక్ తిన్నారు. ప్రధాన మంత్రికి మేయర్ తో ఏం పనో వాళ్లకు అర్ధం కాలేదు. పైగా ఆయన కమ్యూనిస్టు పార్టీకి చెందినవారు.
ఇక్కడ బి-స్టోరి వుంది. వారం రోజుల క్రితమే విజయవాడ మేయర్ కార్యాలయానికి పియంఓ నుండి మెజెస్ వచ్చింది. ప్రధాని అధికార పర్యటన మీద విజయవాడ వస్తున్నారు. వారి నగర ప్రవేశానికి అనుమతి ఇవ్వండి అనేది దాని సారాంశాం. ఆ మెసేజ్ ప్రకారం మేయర్ టి. వెంకటేశ్వర రావు అందరికన్నా ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకుని వెయిటింగ్ రూములో కూర్చున్నారు. కాంగ్రెస్ నాయకులు వారిని పట్టించుకోలేదు. వారు కూడ ప్రధాని కోసం వచ్చి వుంటారనే ఆలోచన రాలేదెవరికీ.
కొన్ని నిముషాలైనాక మేయర్ కూడ రన్ వే దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు ప్రధాని ఇందిరాగాంధి చాలా మర్యాదగా “Respected Mayor, please grant me permission to enter your city.” అన్నారట. దానికి మేయర్ కూడ అంత మర్యాదగా “ నా నగరం మీకు ఆహ్వానం పలుకుతోంది” అన్నారట.. అప్పట్లొ అది కొన్నాళ్లు టాక్ ఆఫ్ ద సిటి. మేయర్ కు ఇంత కత వుందా? అనుకునేవారు.
జంధ్యాల శంకర్ మేయర్ గా వున్నకాలంలో మేయర్ స్థాయి గురించి చాలా చెప్పేవారు. అప్పట్లో వారు హెలీకాప్టర్లతో విజయవాడ కొండల మీద విత్తనాలు చల్లించినపుడు చాలా మంది వారిని అమెరికా మేయర్ అంటూ ఎద్దేవ చేశారు. ఆ విత్తనాలు ఇప్పుడు భారీ చెట్లుగా మారి విజయవాడ ఉష్ణోగ్రతను అదుపులో వుంచుతున్నాయి. 1970లనాటి విజయవాడ ఎండలకు రోకళ్ళు బద్దలయిపోయేవి. రోడ్లు పగిలిపోయేవి. అచ్చమైన రాజకీయులు కాకుండ కొంచెం ముందుచూపు వున్నవాళ్ళు బాధ్యత గల స్థానాల్లో వుంటే దాని కతే వేరు.
Photo Curtsy : Budiga Jamindar

No comments:

Post a Comment