Monday, 5 May 2014

Caste War in Seemandhra

సీమాంధ్రలో కులపోరు! 

డానీ

సీమాంధ్ర ఎన్నికల్లో రాజకీయపోరు క్రమంగా కులపోరుగా మారిపోయింది. ఈ ఎన్నికలు తేల్చేది కొత్త రాష్ట్రాన్ని ఏ రాజకీయ కూటమి ఏలాలనేదికాదు; ఏ సామాజికవర్గం మిగిలిన సామాజికవర్గాల్ని ఏలాలనేదే! రెండు పెత్తందారీ సామాజికవర్గాలు ఇంతగా బరి గీసుకుని ఎన్నికల్లో తలపడడం ఇదే మొదటిసారి.  యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ మరియూ మధ్యంతర సామాజికవర్గాలు ఎవర్ని ఎన్నుకుంటారన్నదే ఇప్పుడు కీలక అంశం. 


సహజంగానే ఈ ఎన్నికల్లో రాజకీయ సిధ్ధాంతాలకన్నా కులాల ఆకర్ష పథకాలే ప్రచారాస్త్రాలుగా మారాయి.  ప్రధాన రాజకీయకీయ శిబిరాలు రెండూ రోజుకో కులానికి ఎరవేయడం మనకు కనిపిస్తోంది. “కాపుల్ని ఉపముఖ్యమంత్రిని చేస్తాం” “బీసీల్ని ఉపముఖ్యమంత్రిని చేస్తాం” వంటి వాగ్దానాలు అందులో భాగమే! ముఖ్యమంత్రి పదవి మాత్రం కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకు రిజర్వు చేశారనేది అనేది ఇక్కడ అంతరార్ధం!

సీమాంధ్రలో ఆధిపత్య కులాలంటే కమ్మ, రెడ్డి సామాజికవర్గాలేనని  కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కాపులు కూడా ఆధిపత్య కులంగా కొనసాగుతున్నప్పటికీ అది సీమాంధ్రలో సార్వజనీన లక్షణంకాదు. అయితే సంఖ్యరీత్యా కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకన్నా, కాపు సామాజికవర్గం జనాభా ఎక్కువ.

కమ్మసామాజికవర్గం ప్రధానంగా చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు నాయకత్వం వహిస్తున్న టిడిపి-బీజేపి కూటమిని బలపరుస్తుండగా,  రెడ్డి సామాజికవర్గం ప్రధానం వైయస్ జగన్  నాయకత్వంలోని వైయస్ ఆర్ సిపిని బలపరుస్తున్నది. కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవి కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సారధ్యాన్ని నిర్వహిస్తున్నారు కనుక వారి స్వంత సామాజికవర్గం తార్కికంగా కాంగ్రెస్ పక్షం వహించాలి. కానీ అలా జరగడంలేదు. దానికి రెండు కారణాలున్నాయి. ఇందులో మొదటిది, అంతర్-బహిర్ కారణాలవల్ల కాంగ్రెస్ ఈసారి సీమాంధ్రలో గట్టి పోటీ ఇచ్చే స్థితిలో లేదు. రెండోది, కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు సంఘటితమైనట్టు కాపు సామాజికవర్గం ఇప్పటి వరకు సంఘటిత సమూహంకాదు.  అందులో అనేక రాజకీయ స్రవంతులున్నాయి. గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గంలో ఒక భాగం ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపింది కానీ ఆ ప్రయోగం అంతగా సఫలం కాలేదు. ఈసారి కాపు సామాజికవర్గం ప్రధానంగా జగన్ వెంట వుంది.  

       ఇతర సామాజికవర్గాల విషయానికివస్తే, హిందూ వెనుకబడిన కులాల్లో, మాదిగ సామాజికవర్గంలో టిడిపికి కొంతపట్టు వుంది. మాల సామాజికవర్గం, ముస్లింలు, క్రైస్తవులు, బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య సామాజిక వర్గాలు స్థూలంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా వున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకత్వం కకావికలు కావడంతో ఈ సామాజికవర్గాలు ఈసారి జగన్ పక్షం వహించే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. అలాగే మాదిగ సామాజికవర్గంలో అత్యధికులు క్రైస్తవులే గనుక వాళ్ళూ జగన్ వైపుకు మొగ్గే అవకాశాలున్నాయి.

జగన్ వ్యవహారశైలి, ఆయనపై ఆర్ధిక ఆరోపణలు నచ్చని ఉదారవాదులు, విద్యావంతులు, లౌకికవాదులు కొంతకాలం క్రితం చంద్రబాబు మద్దతుదారులుగా మారారు. బీజేపీ-ఆరెస్సెస్ తో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు అలా కొత్తగా అందివచ్చిన ఓటు బ్యాంకును మళ్ళీ కోల్పోయారు. ఇలా బయటికి పోతున్నవారిలో ఎంతోకొంత  చంద్రబాబు స్వంత సామాజికవర్గం కూడా వుంది.

                     సీమాంధ్రలో రెండు రోజులపాటు నరేంద్ర మోదీ సాగించిన ఎన్నికల ప్రచార యాత్ర టీడిపి-బీజేపీ లకు ప్రతికూల ఫలితాలని ఇచ్చింది.  తనను తాను ఒక పిచ్చివాడని ప్రకటించుకున్న ఒక సినిమా నటుడితో, ప్రధాని అభ్యర్ధి వేదికను పంచుకోవడం విద్యాధికులైన సీమాంధ్ర మధ్యతరగతికి ఏమాత్రం రుచించలేదు. స్కామాంధ్ర కావాలో, స్వర్ణాంధ్ర కావాలో తేల్చుకోమని మోదీ విసిరిన సవాలు కూడా వెనక్కి చీదింది. చంద్రబాబు స్వర్ణాంధ్రను జనం ఇప్పటికే రెండుసార్లు  ఛీ కొట్టారు. కర్ణాటకలో బీజేపి మంత్రులు సాగించిన స్కాముల గురించి తెలియనివాళ్ళు ఎవరూలేరు. యడ్యూరప్ప, శోభాకరాండ్లజే, గాలి జనార్దన రెడ్డి ఆత్మగా పేరుగాంచిన బీ, శ్రీరాములు తదితరుల్ని చంకలో పెట్టుకుని మోదీ స్కాముల గురించి మాట్లాడడం మధ్యతరగతి వర్గానికి అస్సలు నచ్చలేదు.

ఎలా చూసుకున్నా సీమాంధ్రలో చంద్రబాబుకన్నా జగన్ ఓటు బ్యాంకు బ్యాలెన్సే ఎక్కువగా వున్నట్టు కనపడుతోంది. ఇది జగన్  ఘనత అనడంకన్నా  మోదీ-చంద్రబాబు కూటమి మీద వ్యతిరేకత అనడమే సబబు. మరోవైపు,  బీజేపీ-ఆరెస్సెస్ తో పొత్తువల్ల చంద్రబాబుకు కొత్తగా కలిసివచ్చే ఓటు బ్యాంకు కూడా వుండవచ్చు. అయితే, కలిసివచ్చేదానికన్న చంద్రబాబు కోల్పోయేదే ఎక్కువనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

       జగన్ కు కేంద్ర ప్రభుత్వం విషయంలో సంధిగ్ధం వుంది.  స్కామాంధ్ర కావాలా? అని నరేంద్ర మోదీ అన్నతరువాత కూడా జగన్ కు ఎన్డీయే మీద వ్యామోహం తగ్గినట్టులేదు. “ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోదీకిగానీ, ఎన్డీయేకుగానీ మద్దతు ఇచ్చేదిలేదు” అని స్పష్టంగా ప్రకటించాల్సిన సమయంలో “కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతు ఇచ్చి, రాష్ట్రానికి నిధులు తెస్తాము” అని ప్రకటించి హిందూత్వ వ్యతిరేకశ్రేణుల నుండి  కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నారు. సంఘ్ పరివారం వ్యతిరేకులు, బీజేపి మిత్రపక్షాల వ్యతిరేకులూ,  రాష్ట్రంలో అంబానీ గ్రూపు కార్యకలాపాల వ్యతిరేకులూ ప్రస్తుతం తన వెంట వున్నారని జగన్ గుర్తించినట్టులేదు.

“ఎన్డీయేను వ్యతిరేకిస్తానంటే యూపియేకు మద్దుతు ఇస్తారనే” తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లవచ్చు అని జగన్ జంకవచ్చు. అప్పుడు వారు మూడవ ఫ్రంట్ కు మద్దతిస్తానని ప్రకటించవచ్చు. మాయా, మమత, జయ ఇప్పుడు ఆ మార్గంలోనే పోతున్నారు. చంద్రబాబుది హిందూత్వమార్గం అని స్పష్టం అయిపోయినపుడు తనది లౌకికమార్గం అని స్పష్టత ఇవ్వకపోతే జగన్ జీవిత కాలం పాటు కోల్పోయేది  “వాళ్ళ నాయన కుర్చీ’నే!  “ ప్రధాని నరేంద్ర మోడీనా, ఎల్లయ్యా, పుల్లయ్యా అనేది తర్వాత చూద్దాం.” అంటూ ప్రచారఘట్టం ముగియడానికి ఒకరోజు ముందు జగన్ చేసిన ప్రకటన నష్టనివారణకు కొంత ఉపకరించవచ్చు.  ప్రచార ఘట్టం చివరి రోజున ఆయన మరింత స్పష్టత ఇస్తే ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటారు! లేకపోతే మరో స్వయంకృతాపరాధంలో మునిగిపోతారు.

సమాజంలో సాధారంగా దళిత బహుజనులు, మత అల్పసంఖ్యాకవర్గాలు అభద్రతా భావానికి గురవుతుంటాయి.  ఈసారి ఎన్నికల్లో సీమాంధ్ర పెత్తందారీ కులాలు అభద్రతా భావంతో భయపడుతున్నాయి. సామాజికంగా ఇది చాలా పెద్దమార్పు!

(రచయిత సీనియర్ పాత్రికేయులు,  రాజకీయార్ధిక విశ్లేషకులు)

హైదరాబాద్
5 మే 2014
http://www.andhraprabha.com/columns/a-column-by-danny/16774.html

Tsunduru : Justice Denied

ప్రజల వద్దకు న్యాయం ఇదేనా?

ఉషా యస్ డానీ


చుండూరు ఊచకోత కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు సామాజికన్యాయం కోరుకునేవారికి తీవ్ర అసంతృప్తిnని కలిగించింది. ఇదేమీ ఊహాజనిత కేసుకాదు. హతులో, నిందితులో ఆచూకీ లేకుండా పోయిన కేసూ కాదు. పెత్తందారీ సామాజికవర్గాలకు చెందిన దాదాపు నాలుగు వందల మంది ఏకమై తమ గ్రామాలకు చెందిన దళితుల్ని పట్టపగలు వేటకొడవళ్లతో వెంటాడి వేటాడి ఎనిమిది మందిని నరికి చంపి సాక్ష్యాల్ని రూపుమాపడానికి శవాల్ని గోనె సంచుల్లో మూటకట్టి  కాలవలో పడేసిన అతికిరాతక కేసు ఇది.

చుండూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ఏడేళ్ల క్రితం 56 మంది నిందితులకు విధించిన శిక్షలను హైకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 22న రద్దు చేసి, వాళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. దళితుల కుటుంబాలకు కలిగిన వేదన తీర్చలేనిదని అంటూ,   ఇప్పటికైనా కక్షలకు స్వస్తిపలికి, మానవతా విలువలతో కలిసి మెలిసి బతకాలని పిర్యాదిదారులకూ,  నిందితులకూ ధర్మాసనం హితవు పలికింది. నిర్దోషులుగా బయటపడిన నిందితుల్ని విజయోత్సవాలు జరుపుకోవద్దని మందలించింది. చుండూరు, మోదుకూరు గ్రామాల్లో అల్లర్లు చెలరేగకుండా కనీసం మూడు నెలలపాటు ముందు జాగ్రత్త చర్యగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది.

ఒక వివాదానికి ముగింపు పలకాల్సిన ధర్మాసనం తీర్పు అనేక కొత్త  సందేహాలకు ద్వారాలు తెరిచింది. నిందితులకు భద్రతను ఏర్పాటు చేయమని ఆదేశించిన కలంతో బాధితులు, మృతుల కుటుంబాలకు ఎలాంటి ఓదార్పునూ అందించలేకపోయింది. ధర్మాసనం తీర్పు ఇంతగా వివాదాస్పదం అయిన సందర్భం ఇటీవలి కాలంలో మరొకటిలేదు. “చట్టం డబ్బున్నోడి చుట్టం” అనే పాతకాలపు నాటు సామెత ఇప్పటీకీ నిజం అనిపిస్తోంది.

హైకోర్టు ధర్మాసనం తీర్పులోని సామాజిక కోణాన్ని లోతుగా అర్ధం చేసుకోవాలంటే ఈ కేసును తలకిందులు చేసి చూడాలి. చుండూరు మారణకాండలో హతులు పెత్తందారీ కులాలవాళ్ళై, హంతకులు దళితులై, నిందితుల్ని ధర్మాసనం నిర్దోషులంటూ తీర్పు చెపితే ఎలా వుండేదీ? నిందితులకు భద్రత ఏర్పాటు చేయాలని ధర్మాసనం అదేశిస్తే  అప్పుడీ సమాజం ఇంత ప్రశాంతంగా వుండేదా? 

       కరువుకాటకాల్లో ఆకలితో నకనకలాడే  మనుషులు ఆహారం కోసం కొట్లాడుకుంటే అదో ఇది. కాలువలు సుడులు తిరిగి, పొలాలు విరగపండి, గాదుల నిండా ధాన్యరాశులు, ఇంటినిండా ధనరాశులు మూలుగుతున్నాసరే వున్నవాళ్ళు లేనివాళ్ళని వేటాడి చంపుతారని కారంచేడు కండకావరం 1985లో నిరూపించింది. తెలంగాణ వర్గపోరాటాలకు పుట్టినిల్లయితే, సీమాంధ్ర కులపోరాటాల కురుక్షేత్రం అనే అభిప్రాయం పుట్టింది అప్పుడే!

వర్ణవ్యవస్థలో శూద్రులుగా వుండి, ఆధునిక సాంఘీక చట్రంలో ఆధిపత్యకులాలుగా ఎదిగిన సామాజికవర్గాలు 1970-80వ దశాబ్దాల్లో దేశమంతటా చెలరేగిపోయారు. దళితులపై ఒక పరంపరగా దాడులు కొనసాగించారు.  బీహార్ లోని బెల్చీ, పిప్రా,  ఉత్తరప్రదేశ్ లోని కఫల్తా, మధ్యప్రదేశ్ లోని మందసౌర్, మళ్ళీ బీహార్  సాహిబ్ గంజ్ జిల్లాలోని బంఝీలో పోలీసుకాల్పులు, ఆంధ్రప్రదేశ్ లోని కారంచేడు వంటి దురాగతాలు ఆ దశలో  జరిగినవే. దళితులపై దాడుల్ని నివారించడానికి గట్టి కోరలున్న కొత్త చట్టాలు తేవాలంటూ దళిత యంపీలతో పాటూ పౌరహక్కులు, మానవహక్కుల  సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. కారంచేడు ఉద్యమానికి కేంద్ర కార్యాలయమైన చీరాల విజయనగర్ శిబిరం కూడా పదిమందితో కూడిన మహిళా బాధితుల బృందాన్ని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ దగ్గరికి పంపింది. చివరకు, 1987లో స్వాతంత్ర దినోత్సవం నాటి సాంప్రదాయ  ఎర్రకోట ప్రసంగంలో  యస్సీ, యస్టీలపై అత్యాచారాల నిరోధానికి ఒక చట్టం తెస్తున్నట్టు  రాజీవ్ గాంధీ ప్రకటించారు.  ఈ చట్టాన్ని 1989 సెప్టెంబరు 11 న భారత పార్లమెంటు ఆమోదం తెలిపింది. నిబంధనలన్నీ రూపొందించుకుని ఇది 1995 మార్చి 31  నుండి అమల్లోనికి వచ్చింది.

కారంచేడు, చుండూరు దురాగతాల్లో ఒక సామాన్యాంశం వుంది. కమ్మ సామాజికవర్గం నాయకత్వంలోని తెలుగుదేశం పాలన కొనసాగుతున్న రోజుల్లో కారంచేడులో కమ్మసామాజికవర్గం  దళితుల మీద దాడులు జరపగా,  రెడ్డి సామాజికవర్గం నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన కొనసాగుతున్న రోజుల్లో చుండూరులో రెడ్డి సామాజికవర్గం  దళితుల మీద దాడులు జరిపింది.


యస్సీ, యస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టానికి పార్లమెంటు ఆమోద ముద్ర వేయడానికీ, అది అమల్లోనికి రావడానికీ మధ్య కాలంలో 1991 ఆగస్టు 6న చుండూరు సంఘటన జరిగింది.  దళితులపై అత్యాచారాల కేసుల్ని విచారించి దోషుల్ని సత్వరం శిక్షించడానికి వీలుగా  ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటు చేయడానికీ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడానికీ  ఈ చట్టంలోని 14, 15 సెక్షన్లలో అవకాశం కల్పించారు.  ఈ నేపథ్యంలో ఏర్పడిన ప్రత్యేక కోర్టు మొదట్లో గుంటూరులోనూ, తరువాత చుండూరు క్యాంపు కోర్టులోనూ  విచారణ సాగించింది. దీన్నే ప్రజల వద్దకు న్యాయం అని అప్పట్లో చాలా ఘనంగా చెప్పుకున్నారు.
జస్టిస్ అనీష్ న్యాయమూర్తిగావున్న చుండూరు క్యాంపు కోర్టులో దివంగత న్యాయవాది బీ. చంద్రశేఖర్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించారు.   179 మంది నిందితుల్లో సాక్ష్యాధారాలు లేవని కొందరినీ, సాక్ష్యాలు ఉన్నా  రికార్డు లేదని మరికొందరినీ, సంశయాత్మక లబ్ది (బెన్‌ఫిట్ ఆఫ్ డౌ ట్) కింద ఇంకొందరినీ మొత్తం 123పై ప్రత్యేక న్యాయస్థానం కేసు కొట్టివేసింది. . మిగిలిన 56 మందిలో 21 మందికి యావజ్జీవ ఖైదు, 35 మందికి ఏడాది జైలు శిక్ష విధించింది.

కారంచేడు భూమి మీద అద్భుత ఉద్యమం; న్యాయస్థానాల్లో బలహీన పోరాటం. చుండూరు భూమి మీద బలహీన ఉద్యమం న్యాయస్థానాల్లో అద్భుత పోరాటం. అయితే ఆ తరువాత జరిగింది వేరు. ప్రకాశం జిల్లా సెషన్స్ కోర్టు నిందుతులకు విధించిన శిక్షను హైకోర్టు కొట్టివేయగా, 2008 చివర్లో సుప్రీం కోర్టు ఒకరికి జీవిత ఖైదునూ, మరో ముఫ్ఫయి మందికి మూడేళ్ళ చొప్పున కఠిన కారాగార శిక్షను విధించింది.

       చుండూరులో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టు విధించిన శిక్షతో సంతృప్తి చెందని బాధిత కుటుంబాలు, దోషులకు మరింత కఠిన శిక్ష విధించాలంటూ హైకోర్టును ఆశ్రయించాయి.  అలాగే, ప్రత్యేక కోర్టులో  శిక్షలు పడినవాళ్ళు సహితం  ఆ తీర్పును హైకోర్టులో సవాలు చేశాయి.  ఆ తరువాత జరిగిందంతా నడుస్తున్న చరిత్రే!

                     కారంచేడులో ప్రజలు న్యాయస్థానం తీర్పుకోసం ఎదురుచూడలేదు. తమదైన శైలిలో తీర్పు చెప్పారు. ప్రజాకోర్టును నిర్వహించి ప్రధాన నిందితుడికి మరణదండన విధించారు. చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకుని  ఆ తీర్పును తామే స్వయంగా అమల్లోనికి పెట్టారు. దళితులపై అత్యాచారాల కేసుల్లో ప్రజాతీర్పే సరైనదేమోననే అభిప్రాయాన్నీ  చుండూరు కేసులో ఉన్నత న్యాయస్థానాల తీర్పులు కలిగిస్తున్నాయి. 

                     మనకు సామాజిక న్యాయస్థానాలు కావాలి! ఇప్పటి న్యాయస్థానాలకు కుల స్వభావం, మత స్వభావం, వర్గ స్వభావం వుందీ. ఒక్కసారి ఒక్క కేసులో కోర్టుకు వెళ్ళండి.  నిందితుడిగానేకాదు పిర్యాదిదారుడిగా అయినా సరే వెళ్ళండి. గొప్ప జ్ఞానోదయం అవుతుంది. న్యాయస్థానాల్లో డబ్బు గెలుస్తుంది. కులం గెలుస్తుంది. మతం గెలుస్తుంది. రాజకీయ పార్టి గెలుస్తుంది.

       చట్టనిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థలకన్నా న్యాయవ్యవస్థలో అవినీతి అన్ని హద్దులనూ దాటిపోయింది. గనుల ఘనుడికి బెయిలు ఇవ్వడానికి నాలుగు వందల కోట్లు అడిగిన న్యాయమూర్తులు మనకు తెలుసు. చంచల్ గూడ జైల్లో గనుల ఘనులేకాదు వాళ్లకు బెయిళ్ళు మంజూరు చేసిన న్యాయమూర్తులూ వున్నారు. న్యాయమూర్తులూ మనుషులే. వాళ్ళకూ కులం, మతం, వర్గం, స్వార్ధం, ప్రేమ, పెళ్ళాం, బిడ్డలు, కష్టాలు సుఖాలు, రాజకీయ ఇష్టాయిష్టాలు, డబ్బు ఆశ అన్నీ వుంటాయి.

మనం కార్యనిర్వహణ వ్యవస్థను విమర్శిస్తున్నాం. శాసన నిర్మాణ వ్యవస్థను విమర్శిస్తున్నాం. న్యాయవ్యవస్థకు  మాత్రం మినహాయింపుదేనికీ? అది కూడా ప్రజాస్వామ్యవ్యవస్థకున్న మూడు స్థంభాల్లో ఒకటికదా! ఒక అధికారి తప్పుచేస్తే అతని కార్యాలయం ముందు ధర్ణా చేస్తున్నాం. ఒక శాసన సభ్యుడు తప్పుచేస్తే అతని ఇంటి ముందు ధర్ణా చేస్తున్నాం. ప్రభుత్వం తప్పుచేస్తే,  సచివాలయం ముందు ధర్ణా చేస్తున్నాం. సామాజిక న్యాయానికి విరుధ్ధంగా తీర్పులుచెపితే న్యాయస్థానాలు  ముందు ధర్ణా చేయడం కూడా మొదలెట్టాలి.

యస్సీ, యస్టీల హక్కుల  పరిరక్షణ కోసం అధికారులు, సిబ్బందిని నియమించే సందర్భాల్లో బాధితుల సమస్యల మీద  సరైన దృక్పధం, సరైన అవగాహన కలిగివున్నవాళ్లనే నియమించాలనీ యస్సీ, యస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం సెక్షన్ 13 లోని 1వ క్లాజ్ స్పష్టంగా ఒక నియమాన్ని విధించింది. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలనీ కూడా ఈ క్లాజు  అదేశిస్తుంది.   

13:1    The State Government shall ensure that the administrative officers and other staff members to be appointed in an area prone to atrocity shall have the right aptitude and understanding of the problems of the Scheduled Castes and the Scheduled Tribes.

 సరిగ్గా ఈ నియమం తప్పడంవల్లనే హైకోర్టులో చుండూరు తీర్పు అలా వచ్చింది. కారంచేడు సంఘటనలో జరిగినట్టు ఇక సుప్రీంకోర్టులో అయినా సామాజికన్యాయం జరుగుతుందని ఆశిద్దాం!  

(రచయిత సీనియర్ పాత్రికేయులు,  రాజకీయార్ధిక విశ్లేషకులు)

హైదరాబాద్

5 మే 2014


ప్రచురణ :
బాస మాసపత్రిక, గుంటూరు

జూన్ సంచిక 2014

Saturday, 26 April 2014

Gulam Yazdani - A Memory

Gulam Yazdani - A Memory 


గులాం యజ్దానీ – ఒక అనుబంధం  

డానీ

                     విఖ్యాత చరిత్రకారుడు గులాం యజ్దానీ పై  డా. ద్యావనపల్లి సత్యనారాయణగారి  వ్యాసం “ తెలంగాణ చరిత్ర పితామహుడు” ఈరోజు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో  (http://www.andhrajyothy.com/node/88452) వచ్చింది. గులాం యజ్దానీగారిని నేను ఎన్నడూ చూడలేదు. అయితే, వారితో నాకు ఓ దూరపు  అనుబంధంవుంది.

          మా తాతగారి పేరు గులాం మొహిద్దీన్ ఖాన్ గారు. వారి అన్నగారు గులాం గౌస్ ఖాన్ గారు.  మా తాతగారు నరసాపురంలో స్థిరపడగా, వారి అన్నగారు నిజాం సంస్థానం  రెవెన్యూ విభాగంలో కొలతల ఉద్యోగి (ఓవర్ సీర్) గా స్థిరపడ్డారు. మా పెదతాతగారి పెద్దల్లుడు అబ్దుల్ సత్తార్ పాషా నిజాం సంస్థానంలో ఉన్నతాధికారి. వారు నిజామాబాద్ పరిసరాల్లో తహశీలుదారుగా పనిచేశారో  అంతకన్నా పెద్ద హోదాలో పనిచేశారోగానీ వారిని మా ఇళ్లల్లో “గవర్నర్ సాబ్” అని పిలిచేవారు. వారు మా నాన్నగారికి పెద్ద బావగారు.  న్యాయశాఖ మాజీమంత్రి ఆసిఫ్ పాషాగారు  అబ్దుల్ సత్తార్ పాషాగారికి స్వయాన అల్లుడు. ఆసిఫ్ పాషా నాకు మేనత్త కొడుకు.

మా కుటుంబంలో మౌలానా హజ్రత్ గారని ఒక ధార్మిక గురువుగారు వుండేవారు. వారు ఆరు నెలలు నరసాపురంలోనూ, ఆరు నెలలు హైదరాబాద్ లోనూ వుండేవారు. ఆ కాలంలో, మా కుటుంబంలో ఎవరు పుట్టినా మౌలానా హజ్రత్ గారే పేర్లు నిర్ణయించేవారు. సాంప్రదాయ వంశం (బతికి చెడిన కుటుంబం అనేది దీనికి మరోపేరు) కావడాన మా కుటుంబంలో పేర్లు అనేక సమీకరణలతో వుంటాయి. గులాం మొహిద్దీన్ ఖాన్ ఆసిఫ్, గులాం గౌస్ ఖాన్ షానవాజ్, గులాం మొహిద్దీన్ ఖాన్ దుర్రానీ, గులాం మొహిద్దీన్ ఖాన్ సమ్దానీ, లియాఖత్ అలీ ఖాన్ రబ్బానీ ఇలా వుంటాయి.

1951లో నేను పుట్టినపుడు, మౌలానా హజ్రత్ గారు హైదరాబాద్ లో వున్నారు. పిల్లాడికి పేరు సూచించమని మా అమ్మ వారికి ఉత్తరం రాసిందట. వారు యజ్దానీ అని పెట్టమన్నారట.  మా హైదరాబాద్ దాయాదులకు గులాం యజ్దానీ గారు చాలా సన్నిహితులు.

ఇతర సమీకరణలు అన్నీ సరిచేసుకుని చివరకు నా పేరు “అహమ్మద్ మొహిద్దీన్ ఖాన్ యజ్దానీ జర్రానీ” అయింది. నాపేరులో అహమ్మద్ అనేది మా నాయనమ్మగారి తండ్రి అహమ్మద్ షరీఫ్ గారి పేరు. వీరే నరసాపురం టేలర్ పేట మసీదు వీధి వ్యవస్థాపకులు.  మొహిద్దీన్ అనేది మా తాతగారు గులాం మొహిద్దీన్ ఖాన్ గారి పేరు. ఖాన్ అనేది మా తెగ పేరు. జర్రానీ అనేది మా వంశం పేరు. నరసాపురం పాతబజారు, పఠాన్ వీధిలోని సూఫీ గురువు హజ్రత్ ఖాన్ జాన్ ఖాన్ దర్గావల్ల మా వంశానికి  ఆ పేరు వచ్చింది. (ఆ దర్గా చరిత్ర రాయాలనేది నా కోరికల్లో ఒకటి) ఇక మిగిలిన యజ్దానీ ఒక్కటే నా స్వంత నాపేరు.

యజ్దానీ అనేది కాలక్రమేణ ఉఛ్ఛరణ సౌలభ్యం కోసం  యస్ డానీ అయ్యింది. నా పేరు నేపథ్యాన్ని తొలిసారిగా నాకు గుర్తు చేసింది కేవి రమణా రెడ్డిగారు. “యజ్దానీ అంత మంచి పేరుని ఇలా ముక్కలు చేశారా?” అని వాపోయారాయన. కేవీయార్ ఇచ్చిన ప్రేరణతోనే, నా పేరు వెనక వున్న చరిత్రను తవ్వే పనిచేశాను. యంటీ ఖాన్ సాబ్ కూడా “పహలే యే దానీ థే! అబ్ డాన్ బన్ గయే” అంటూ ఆటపట్టిస్తుంటారు.   


26 April 2014

Thursday, 24 April 2014

Thank God I am not Communist!

దేవుడా! నన్ను కమ్యూనిస్టు కాకుండా
చేసినందుకు నీకు ధన్యవాదాలు!

డానీ


ప్రతి ఘర్షణలో, మేధో సంఘర్షణలో రెండు సామాజికవర్గాలుంటాయి. వాటిల్లో తప్పని సరిగా ఒకటి బలమైనది, మరొకటి బలహీనమైనది వుంటుంది. ఒకటి పీడిస్తుంది. మరొకటి పీడితురాలిగా వుంటుంది.  మనం ఎప్పుడయినా చేయాల్సింది పీడితుల పక్షం నిలబడడమే! ఇలా నిలబడాలంటే చాలా నైతిక స్థైర్యంకావాలి.

                        పెత్తందారీ కులాలు. వెనుకబడిన కులాల మధ్య వివాదం మొదలయితే నేను  వెనుకబడిన కులాల పక్షం వహిస్తాను. వెనుకబడిన కులాలు, దళితుల మధ్య వివాదం మొదలయితే నేను  దళితుల పక్షం వహిస్తాను. దళితుల్లో మాలలు, మాదిగల మధ్య వివాదం మొదలయితే నేను మాదిగలపక్షం వహిస్తాను. హిందువులకు శిక్కులకు మధ్య వివాదం మొదలయితే నేను శిక్కులపక్షం వహిస్తాను. హిందువులకు క్రైస్తవులకు మధ్య వివాదం మొదలయితే నేను క్రైస్తవుల పక్షం వహిస్తాను. తెలంగాణకు సీమాంధ్రకూ మధ్య వివాదం మొదలయితే నేను తెలంగాణ పక్షం వహిస్తాను. తీరాంధ్రకూ, రాయలసీమకూ మధ్య వివాదం మొదలయితే నేను రాయలసీమ పక్షం వహిస్తాను.

  పురుషులకూ, స్త్రీలకు మధ్య మధ్య వివాదం మొదలయితే నేను స్త్రీల పక్షాన నిలబడతాను. కార్మికులకూ యజమానులకూ మధ్య వివాదం మొదలయితే నేను కార్మికుల పక్షాన నిలబడతాను. ఉత్తరాదికీ దక్షనాదికీ మధ్య వివాదం మొదలయితే నేను దక్షణాది పక్షాన నిలబడతాను. ప్రపంచదేశాల మధ్య వివాదం మొదలయితే నేను మూడవ ప్రపంచదేశాల పక్షాన నిలబడతాను.

                        ఇవన్నీ నేను దాదాపు మూడు దశాబ్దాలుగా చేస్తూనే వున్నాను. ఇక ముందు కూడా చేస్తాను. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది నన్ను లౌకికవాది, ప్రజాస్వామికవాది అంటూ మెచుకుంటూ కూడా వుంటారు. కానీ, హిందువులకు ముస్లింలకు మధ్య వివాదం మొదలయినపుడు ముస్లింల పక్షం వహిస్తే  వెంటనే నేను కొందరి దృష్టిలో మతవాది అయిపోతున్నాను.  మరి కొందరయితే నాకు కమ్యూనిజం మూల సూత్రాలు నేర్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇది విషాదం.  నిజానికి  ముస్లిం సమాజంలోనూ అష్రాఫ్, అజ్లాఫ్. అర్జాల్  లమధ్య వివాదం మొదలయినా నేను అజ్లాఫ్. అర్జాల్  ల పక్షం వహిస్తాను.

                        కష్టకాలంలో పీడితుల పక్షాన నిలబడడానికి కమ్యూనిస్టు సిధ్ధాంతం అడ్డంకిగా మారితే అది అసలు కమ్యూనిజమేకాదు. దాన్నే కమ్యునిజమని ఎవరైనా చెలాయించదలిస్తే అలాంటి కమ్యూనిజం నాకు అక్కరలేదు. అసలు విషయం ఏమంటే భారతదేశంలో  కమ్యూనిజంతో పనిలేనివాళ్ళంతా, పీడిత జీవితం తెలియనివాళ్ళంతా కమ్యునిస్టు నాయకులుగా చెలామణి అయిపోతున్నారు. దేవుడా! నన్ను కమ్యూనిస్టు కాకుండా చేసినందుకు నీకు ధన్యవాదాలు!


24 April 2014

Wednesday, 23 April 2014

గురువులూ మీకు వందనం!

My Teachers in Journalism

పాత్రికేయ గురువులూ మీకు వందనం!
డానీ

నోటికి అన్నమే తింటున్నారా? అనే అరుణ్ సాగర్ పోస్టింగ్ (https://www.facebook.com/arun.sagar.9440?fref=nf) చూశాక రెండు విషయాలు రాయాలనిపించింది. అతని ఆవేదన నా జర్నలిజం కెరీర్ లో కొన్ని మైలురాళ్ళని గుర్తుతెచ్చింది. ముఖ్యంగా, నా గురువుల్ని తలుచుకోవాలనిపించింది.

       నాకు అప్పర్ ప్రైమరీ స్కూలు దశ నుండే రాయడం అలవాటు అయింది. నియతవిద్య  మానేశాక 1973లో రాసిన “ప్రగతి” నాటికకు  పరిషత్తు నాటకాల్లో మంచి గుర్తింపు వచ్చింది. రచయితగా నేను యవ్వనంలో ప్రవేశించింది 1978 లో విప్లవ రాజకీయాల్లో ప్రవేశించిన తరువాతే. ఉపస్రవంతి పత్రికల్లో ఎనిమిదేళ్ళపాటు రచనావ్యాసంగాన్ని కొనశాగించాక 1986 జనవరిలో ప్రధాన స్రవంతి పత్రికల్లో  ప్రవేశించాను.  ప్రధాన స్రవంతి పత్రికల్లో   నా తొలి వ్యాసం ఉదయంలో అచ్చయింది. అప్పట్లో ఆ పత్రిక్కి ఏబీకే ప్రసాద్ సంపాదకుడు. ఆయనే నాకు తొలి బ్రేక్ ఇచ్చారు. మాది ఏబికే ప్రసాద్ కల్ట్ అని చెప్పుకోవడానికి నేను ఇప్పటికీ గర్వపడతాను.

                     విప్లవ పత్రికల రచనల్లో భావోద్వేగానికి పెద్దపీట వేస్తారు. ప్రధాన స్రవంతి పత్రికల్లో ఆవేశం పాళ్లను తగ్గించి, నిష్కామంగా రాయాలి; కనీసం రాస్తున్నట్టు వుండాలి. ఈ కిటుకుని నేను మిత్రులు కే శ్రీనివాస్ (ఇప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్)  దగ్గర చేతులుకట్టుకుని నేర్చుకున్నాను. కొన్ని టాపిక్స్ చెప్పి పనికట్టుకుని నాతో రాయించింది వేమన వసంత లక్ష్మీ.

                     ఇంకో మూడేళ్ళు ప్రధాన స్రవంతి పత్రికల్లో ఎడిట్ పేజీ ఆర్టికల్స్ రాసిన అనుభవం తరువాత 1988లో ప్రేమ కొద్దీ ఆంధ్రభూమితో వర్కింగ్ జర్నలిస్టుగా మారాను. అప్పుడూ ఆ వుద్యోగం ఇచ్చింది ఏబీకే ప్రసాద్. అప్పటి మా బ్యూరో చీఫ్ సతీష్ చందర్. 1990లో నన్ను డక్కన్ క్రానికల్ కు మార్చారు. అప్పుడు మా బ్యూరో చీఫ్ కే శ్రీరాములుగారు. నాకు తొలి ప్రమోషన్ ఇప్పించింది శ్రీరాములుగారే!  డక్కన్ క్రానికల్ లో పనిచేస్తున్నపుడు ఎడిషన్ ఇన్ చార్జి బీ. జయప్రకాశ్ రెడ్డి నను చాలా ప్రోత్సహించారు.

 1991లో నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. దీనికి సమన్వయకర్తలు రావి రాంప్రసాద్, త్రిపురనేని శ్రీనివాస్. అక్కడ ఎడిషన్ ఇన్ చార్జి యూయస్ ఎన్ రాజుగారు.  2003లో నేను సీటీవి ద్వార టెలివిజన్ జర్నలిజంలో చేరాను. దాని ఎడిటర్ పొలిశెట్టి అంజయ్య. జీయం ధనేకుల సుందరయ్య. 

                     ఇందులో విశేషం ఏమంటే నేను గురువులుగా పేర్కొన్న వాళ్ళలో కొందరు నాకన్నా వయసులో చిన్నవారు. మినహాయింపులేకుండా నా గురువులందరూ నా మీద వాత్సల్యాన్నే చూపించారు. వాళ్ళకు గురుదక్షణగా అన్నట్టు నేను కూడా నా శిష్యపరంపర మీద వాత్సల్యాన్నే ప్రదర్శిస్తూ వచ్చాను.

                     అయితే, దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘకాలంలో ఎంతటి మిత్రులతో అయినా మధ్యలో కొన్ని మనస్పర్ధలు వస్తాయి. నాకు నా గురువుల్లో కొందరితో అలాంటి సంఘటనలు కూడా వున్నాయి.  ఇలాంటి సందర్భాల్లో నేను ఎన్నడూ నా గురువులకు ప్రత్యర్ధిగా నిలబడదలచలేదు. నాకు కొంచెం నష్ఠం జరిగినాసరే అస్త్రసన్యాసంచేసి అక్కడి నుండి తప్పుకునేవాడిని. (తోక ముడిచేవాడిని అన్నా తప్పుకాదు)  అసలు నా గురువులకు వ్యతిరేకంగా వాళ్ళ పరోక్షంలో మాట్లాడడం కూడా నాకు రుచించదు; ఏవో కొన్ని సరదా మాటలుతప్ప.

                     ఏడాది క్రితం నా గురువు ఒకరు నన్ను కలవడానికి  ఎన్-టీవీ ఆఫీసుకు వచ్చారు. వారి చొక్కా చిరిగివుంది. దాన్ని దాయడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు నేను కొత్త బట్టలు వేసుకుని ఆఫీసుకు వచ్చాను. జీవితంలో ఇంతటి కాంట్రాస్టు ప్రత్యక్షంగా ఎదురయితే నేను భరించలేను. ఒంటి మీద చొక్కా తీసేసి ఇచ్చేద్దామనుకున్నాను. అప్పుడప్పుడు నాకు ఇలాంటి నాటకీయ ఆలోచనలు వస్తుంటాయి. కానీ తమాయించు కున్నాను. వారు కొన్ని డబ్బులు కావాలన్నారు. పర్సు చేతికి ఇచ్చి తీసుకోండి అన్నాను. వారు అందులో నుండి రెండువేలో, మూడు వేలో తీసుకుని ఇది చాలు అన్నారు. ఫస్ట్  వీక్ లో తిరిగి ఇచ్చేస్తానని రెండు మూడుసార్లు అన్నారు. “మీకు నేను అప్పు ఇవ్వడంలేదు మీరు తిరిగి ఇవ్వడానికి. ఈ విషయాన్ని నేను ఇక్కడితో మరిచిపోతాను. మీరూ మరిచిపొండి. ఎప్పుడయినా ఇబ్బందిగా వుంటే నా దగ్గరికి రండి. మొఖమాటపడవద్దు. నా దగ్గర గొప్పగా డబ్బులు వుండవు. అయినా  వున్నది సర్దుకుందాం” అన్నాను.

తల్లిదండ్రులు దయనీయ స్థితిలో వుంటే ఆ పాపం పిల్లలదే అయినట్టు గురువులు దయనీయ స్థితిలోవుంటే ఆ పాపం శిష్యులదే!


ఏప్రిల్ 24, 20014

Tuesday, 1 April 2014

బీజేపి, టిడిపి మళ్ళీ పెళ్ళి

వర్తమానం
బీజేపి, టిడిపి మళ్ళీ పెళ్ళి
డానీ
      
       బీజేపి, టిడిపి పొత్తు కుదిరినట్టు ఇరువైపుల నుండి బలమైన సంకేతాలు వస్తున్నాయి. పొత్తుల చర్చలు, అభ్యర్ధుల ఎంపిక కసరత్తుల నుండి రాష్ట్రానికి చెందిన బీజేపి సీనియర్ నేత స్వచ్చందఘా తప్పుకోవడంవల్ల ఆ పార్టి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ప్రకాశ్ జవదేకరో, రాజ్యసభాపక్ష నేత అరుణ్ జైట్లో టిడిపితో పాటూ పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు వ్యవహారంకూడా వచ్చేవారం ప్రకటించే అవకాశాలున్నాయి.

నిజానికి టిడిపి, బీజీపి పొత్తు ఎప్పుడో  పొడవాల్సింది. నరేంద్ర మోదీని బీజేపి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన మరుక్షణం నుండే చంద్రబాబు పొత్తు దిశగా కదలడం మొదలెట్టారు. పంచాయితీ ఎన్నికల్లో టీడీపి ముందంజ వేయగానే కాంగ్రెస్  జగన్ కు బెయిల్ ఇచ్చి బయటికి తెచ్చిందనీ,  తాను రాజ్ నాథ్ సింగ్ ను కలవగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటి  తెలంగాణ ఏర్పాటును ప్రకటించిందనీ, తాను నరేంద్ర మోదీని  కలవగానే కేంద్ర మంత్రివర్గం తెలంగాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని చంద్రబాబు చాలాసార్లు అంటున్నారు. అయితే, తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ బీజేపి సభ్యులు ప్రదర్శించిన అతిఉత్సాహం టీడిపీని ముఖ్యంగా సీమాంధ్ర తమ్ముళ్లని ఇరుకున పెట్టేసింది. తమకు జరిగిన అన్యాయానికి ప్రతిగా సీమాంధ్ర ఏకంగా భారతదేశం నుండి విడిపోతుందని కొందరు ఎస్-తమ్ముళ్ళు ఆవేశంగా ప్రకటించగా, బీజేపిని సీమాంధ్ర ద్రోహిగా  ప్రకటించాలని మరికొందరు ఎస్-తమ్ముళ్ళు ఆక్రోశం వెళ్ళగక్కారు. హఠాత్తుగా రాజకీయవాతావరణం వేడేక్కడంతో టిడిపి-బీజేపి రాజకీయ సహజీవనం నెలన్నర రోజులు వాయిదా పడింది. ఇప్పుడు వాతావరణం మళ్ళీ పొత్తులకు అనుకూలంగా మారుతోంది.

        బీజేపి-టిడిపి పొత్తు ఒక విధంగా ఓడలు, బండ్లు లాంటిది.  సీమాంధ్రలో బీజేపి భారాన్ని టీడిపి మోస్తే, తెలంగాణలో టీడిపి భారాన్ని బీజేపి మోయాల్సివుంటుంది.  ప్రస్తుతం బీజేపికి సీమాంధ్రలో ఎమ్మెల్యేలుగానీ, ఎంపీలుగానీ లేరు. అక్కడ కాలుమోపాలంటే మోదీ ఇమేజితోపాటూ టీడిపితో పొత్తు అనివార్యమని బీజేపి భావిస్తోంది. పైగా సీమాంధ్రలో ఇప్పుడు అన్నిపార్టీలకన్నా టిడిపి ముందంజలో వున్నట్టు కనిపిస్తోంది. జగన్ పార్టి గతంకన్నా బలహీనపడుతున్నట్టు సంకేతాలు వస్తుండడంతో టిడీపీతో కలిసి ఎన్నికలకు పోవడమే మంచిదని కమలనాధులు భావిస్తున్నారు.

తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. టీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ టీడీపిని బలహీనపర్చడమే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు. అధినేత మీద నమ్మకం కుదరని టి-తమ్ముళ్ళు ఎన్టీఆర్ భవన్ ను వదిలి తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఈ పరిస్థితిలో బీజేపి అండలేనిదే తెలంగాణలో టీడీపీ చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించే స్థితిలోలేదు.  ఈ నేపథ్యంలో సీమాంధ్రలో అయినా, తెలంగాణలో అయినా తాము కలిసి నడిస్తేనే ఇద్దరికీ శ్రేయస్కరం అనే అభిప్రాయం టిడిపి, బీజేపి రెండింటికీ వుంది.

టిడిపి-బీజేపి అనుబంధానికి దాదాపు దశాబ్దంన్నర చరిత్రవుంది. 1996  ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో  చక్రంతిప్పి  యునైటేడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అయితే, 1998ఎన్నికల తరువాత మళ్ళీ కేంద్రంలో  చక్రం తిప్పడానికి యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా  ఢిల్లీ విమానం ఎక్కిన చంద్రబాబు బీజేపి అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పాయిని ప్రధానిని చేసి, ఎన్డీయే కన్వీనర్ గా హైదరాబాద్ లో విమానం దిగారు.

దేవేగౌడ, ఐకే గుజ్రాల్ లను ప్రధానుల్ని చేయడానికి చంద్రబాబు కాంగ్రెస్ మద్దతు తీసుకున్నప్పుడు పెద్దగా విమర్శలు రాలేదుగానీ, వాజ్ పాయికి మద్దతు పలికినపుడు మాత్రం చంద్రబాబు లౌకికపార్శ్వం విమర్శలకు గురైంది. తమ మనోభావాల్ని దెబ్బతీశారంటూ ముస్లిం సామాజికవర్గం టిడిపి మీద గట్టిగానే నిరసన వ్యక్తం చేసింది. అప్పటి భారీ పరిశ్రమల మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ మనస్థాపం చెంది  ఏకంగా రాష్ట్ర మంత్రివర్గం నుండి తప్పుకున్నారు. అయితే, వాజ్ పాయిని సమర్ధించడం చంద్రబాబుకు రాజకీయంగా కలిసి వచ్చింది. 1999ఎన్నికల్లో కార్గిల్ సెంటిమెంటు వాజ్ పాయి ప్రభుత్వాన్ని  గెలిపించగా, వాజ్ పాయిని నమ్ముకున్న చంద్రబాబు ఆ ఏడాది జమిలిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కారు. ఎన్నికల్లోచంద్రబాబు టీడిపిని గట్టెక్కించిన  సందర్భం ఇప్పటికి అదొక్కటే!

        ఇప్పుడు పునరేకీకరణకు ప్రధాన ఆకర్షణగా మారిన నరేంద్ర మోదీ వల్లనే అప్పట్లో టిడిపి_బీజేపి రాజకీయ దాంపత్యానికి సమస్యలు మొదలయ్యాయి. 2002 లో సాగిన గుజరాత్ అల్లర్ల సందర్భంగా నరేంద్ర మోదీని చంద్రబాబు విమర్శించినప్పటికీ.  బీజేపీతో దోస్తీని మాత్రం వదలలేదు. దీని ఫలితం 2004 ఎన్నికల్లో కనిపించింది. కార్గిల్ యుధ్ధం అటు వాజ్ పాయినీ, ఇటు చంద్రబాబునీ  1999 ఎన్నికల్లో గెలిపించినట్టు, నరేంద్ర మోదీ మార్కు గుజరాత్ అల్లర్లు అటు వాజ్ పాయినీ, ఇటు చంద్రబాబునీ కూడా ఆ తరువాతి ఎన్నికల్లో అధికారం నుండి తప్పించాయి. 

        అలిపిరిలో నక్సలైట్ల బాంబు పేలుడు తరువాత, తన మీద సానుభూతి పవనాలు వీస్తున్నాయని చంద్రభాబు గట్టిగా నమ్మారు. దానితో, 2004లో ముందస్తు ఎన్నికలుకు వెళ్ళారు. తనతోపాటు ఎన్డీయేను కూడా  ముందస్తు ఎన్నికలకు సిధ్ధం చేశారు. తమ హయాంలో దేశం వెలిగిపోతున్నదనే భ్రమలోవున్న బీజేపి, 2020వరకు  తానే హైటెక్కు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని గట్టి నమ్మకంతోవున్న చంద్రబాబు ఇద్దరూ ఆ ఎన్నికల్లో భంగపడ్డారు. నిర్ణిత కాలవ్యవధికన్నా ముందుగానే అధికారాన్ని కాంగ్రెస్ కు అప్పచెప్పారు.

        2004 జమిలి ఎన్నికల్లో అనూహ్య పరాజయం తరువాత రాష్ట్రంలో టిడిపి, బీజేపిల మధ్య కొంతకాలం పరస్పరం తిట్ల పర్వం కొనసాగింది. టిడీపి హైటెక్కు పోకడలవల్లనే తమపార్టీ ఓడిపోయిందని బీజేపి నేతలు, బీజేపి మీద వ్యతిరేకతవల్లనే తమ పార్టి ఓడిపోయిందని టిడీపి నేతలు విమర్శించుకున్నారు. ఆ తరువాత రెండు పార్టీలు లాఛనంగా రాజకీయ విడాకులు తీసుకున్నాయి.        2009 ఎన్నికల్లో రెండుపార్టీలు విడివిడిగానే పోటిచేశాయి. అయినా పెద్దగా మార్పురాలేదు.

మతవాద రాజకీయాలు కొన్ని ఓట్లను సంపాదించిపెట్టేమాట నిజమే. కానీ, భారతీయుల్లో అత్యధికులు మతాన్ని ఎంతగా అభిమానిస్తారో, మతవాద రాజకీయాల్ని అంతగా ద్వేషిస్తారు.

మతవాద శిబిరంలో చాలాకాలం అతివాదిగా కొనశాగిన లాల్ కిషన్ అడవాణీజీకి 2005 లో ఒక విషయం అర్ధం అయింది. ఇంతకాలం తన బలానికి కారణం అనుకుంటున్న మతవాద ముద్రే భారత ప్రధాని కావడానికి తనకు ప్రధాన అడ్దంకిగా మారిందని  భావించారు. దానితో, మతవాద ముద్రను తొలగించుకోవడానికి కరాచి వెళ్ళి సాక్షాత్తు మహమ్మదాలీ జిన్నా సమాధి దగ్గర నిలబడి పాకిస్తాన్ నిర్మాతను లౌకికవాది అని కొనియాడి వచ్చారు.

        ఆ తరువాత ఆరేళ్ళకు చంద్రబాబు కూడా అడవాణి మార్గంలో పాపప్రక్షాళన కార్యక్రమం మొదలెట్టారు. బీజేపీతో అంటకాగిన గుర్తుల్ని చెరిపేసుకుని లౌకిక స్వరూపాన్ని సంతరించుకోవడానికి ప్రయత్నించారు. కేంద్రంలో బీజేపి ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించడం తప్పేనని ఒప్పుకుని  2011 మే 28నటీడిపి మహానాడు వేదిక నుండి వారు ముస్లింలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో బీజేపీతో కలిసేదిలేదని మరీ ఒట్టేసి వాగ్దానం చేశారు.  ఒక దశలో లౌకిక రాజకీయాలు ప్రాతిపదికగా యూపియే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కూడా వారు సిధ్ధమయినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇవన్నీ జగన్ కు బెయిలు రాకముందు,  నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిడానికి ముందు నాటి పరిణామాలు.   

రాజకీయాల్లో శాశ్విత శత్రులు వుండనట్టు, శాశ్విత వాగ్దానాలూ వుండవు, తరువాత మోదిఫికేషన్, నమో, మోదీ మానియా దేశరాజకీయాల్ని హోరెత్తించడం మొదలేట్టిన తరువాత చంద్రబాబు తన పాలసీని మరోమారు మార్చుకున్నారు. బీజేపీతో సాధ్యమైనంత త్వరగా పొత్తు కుదుర్చుకుంటేనేగానీ తెలంగాణలో కేసిఆర్ దగ్గరికి పొతున్న తమ్ముళ్లని ఆపలేమని వారు అనుకుంటున్నారు. అలాగే, చంద్రబాబుతో పొత్తు వుంటేనే సీమాంధ్రలో పార్టీ పున:ప్రవేశానికి మార్గం సుగమం అవుతుందని బీజేపి నమ్మతోంది. ఆ నేపథ్యంలో టీడిపి, బీజేపి రాజకీయ పునర్వివాహాన్ని మనం త్వరలోనే చూడబోతున్నాం.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 9010 75 7776


హైదరాబాద్‌
 20 మార్చి 2014
ప్రచురణ :