సీమాంధ్రలో కులపోరు!
డానీ
సీమాంధ్ర ఎన్నికల్లో రాజకీయపోరు క్రమంగా
కులపోరుగా మారిపోయింది. ఈ ఎన్నికలు తేల్చేది కొత్త రాష్ట్రాన్ని ఏ రాజకీయ కూటమి
ఏలాలనేదికాదు; ఏ సామాజికవర్గం మిగిలిన సామాజికవర్గాల్ని ఏలాలనేదే! రెండు
పెత్తందారీ సామాజికవర్గాలు ఇంతగా బరి గీసుకుని ఎన్నికల్లో తలపడడం ఇదే
మొదటిసారి. యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ
మరియూ మధ్యంతర సామాజికవర్గాలు ఎవర్ని ఎన్నుకుంటారన్నదే ఇప్పుడు కీలక అంశం.
సహజంగానే ఈ ఎన్నికల్లో రాజకీయ
సిధ్ధాంతాలకన్నా కులాల ఆకర్ష పథకాలే ప్రచారాస్త్రాలుగా మారాయి. ప్రధాన రాజకీయకీయ శిబిరాలు రెండూ రోజుకో కులానికి
ఎరవేయడం మనకు కనిపిస్తోంది. “కాపుల్ని ఉపముఖ్యమంత్రిని చేస్తాం” “బీసీల్ని
ఉపముఖ్యమంత్రిని చేస్తాం” వంటి వాగ్దానాలు అందులో భాగమే! ముఖ్యమంత్రి
పదవి మాత్రం కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకు రిజర్వు చేశారనేది అనేది ఇక్కడ
అంతరార్ధం!
సీమాంధ్రలో ఆధిపత్య కులాలంటే కమ్మ, రెడ్డి
సామాజికవర్గాలేనని కొత్తగా చెప్పాల్సిన
పనిలేదు. కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కాపులు కూడా ఆధిపత్య కులంగా
కొనసాగుతున్నప్పటికీ అది సీమాంధ్రలో సార్వజనీన లక్షణంకాదు. అయితే సంఖ్యరీత్యా
కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకన్నా, కాపు సామాజికవర్గం జనాభా ఎక్కువ.
కమ్మసామాజికవర్గం ప్రధానంగా చంద్రబాబు నాయుడు,
వెంకయ్య నాయుడు నాయకత్వం వహిస్తున్న టిడిపి-బీజేపి కూటమిని బలపరుస్తుండగా, రెడ్డి సామాజికవర్గం ప్రధానం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ ఆర్ సిపిని బలపరుస్తున్నది.
కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవి కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సారధ్యాన్ని
నిర్వహిస్తున్నారు కనుక వారి స్వంత సామాజికవర్గం తార్కికంగా కాంగ్రెస్ పక్షం
వహించాలి. కానీ అలా జరగడంలేదు. దానికి రెండు కారణాలున్నాయి. ఇందులో మొదటిది, అంతర్-బహిర్ కారణాలవల్ల కాంగ్రెస్ ఈసారి సీమాంధ్రలో
గట్టి పోటీ ఇచ్చే స్థితిలో లేదు. రెండోది, కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు
సంఘటితమైనట్టు కాపు సామాజికవర్గం ఇప్పటి వరకు సంఘటిత సమూహంకాదు. అందులో అనేక రాజకీయ స్రవంతులున్నాయి. గత
ఎన్నికల్లో కాపు సామాజికవర్గంలో ఒక భాగం ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపింది కానీ ఆ
ప్రయోగం అంతగా సఫలం కాలేదు. ఈసారి కాపు సామాజికవర్గం ప్రధానంగా జగన్ వెంట వుంది.
ఇతర
సామాజికవర్గాల విషయానికివస్తే, హిందూ వెనుకబడిన కులాల్లో, మాదిగ సామాజికవర్గంలో
టిడిపికి కొంతపట్టు వుంది. మాల సామాజికవర్గం, ముస్లింలు, క్రైస్తవులు, బ్రాహ్మణ,
క్షత్రీయ, వైశ్య సామాజిక వర్గాలు స్థూలంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా వున్నారు.
అయితే, కాంగ్రెస్ నాయకత్వం కకావికలు కావడంతో ఈ సామాజికవర్గాలు ఈసారి జగన్ పక్షం
వహించే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. అలాగే మాదిగ సామాజికవర్గంలో అత్యధికులు
క్రైస్తవులే గనుక వాళ్ళూ జగన్ వైపుకు మొగ్గే అవకాశాలున్నాయి.
జగన్ వ్యవహారశైలి, ఆయనపై ఆర్ధిక ఆరోపణలు
నచ్చని ఉదారవాదులు, విద్యావంతులు, లౌకికవాదులు కొంతకాలం క్రితం చంద్రబాబు
మద్దతుదారులుగా మారారు. బీజేపీ-ఆరెస్సెస్
తో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు అలా కొత్తగా అందివచ్చిన ఓటు బ్యాంకును మళ్ళీ
కోల్పోయారు. ఇలా బయటికి పోతున్నవారిలో ఎంతోకొంత
చంద్రబాబు స్వంత సామాజికవర్గం కూడా వుంది.
సీమాంధ్రలో రెండు రోజులపాటు నరేంద్ర మోదీ
సాగించిన ఎన్నికల ప్రచార యాత్ర టీడిపి-బీజేపీ
లకు ప్రతికూల ఫలితాలని ఇచ్చింది. తనను
తాను ఒక పిచ్చివాడని ప్రకటించుకున్న ఒక సినిమా నటుడితో, ప్రధాని అభ్యర్ధి వేదికను
పంచుకోవడం విద్యాధికులైన సీమాంధ్ర మధ్యతరగతికి ఏమాత్రం రుచించలేదు. స్కామాంధ్ర
కావాలో, స్వర్ణాంధ్ర కావాలో తేల్చుకోమని మోదీ విసిరిన సవాలు కూడా వెనక్కి చీదింది.
చంద్రబాబు స్వర్ణాంధ్రను జనం ఇప్పటికే రెండుసార్లు ఛీ కొట్టారు. కర్ణాటకలో బీజేపి మంత్రులు
సాగించిన స్కాముల గురించి తెలియనివాళ్ళు ఎవరూలేరు. యడ్యూరప్ప, శోభాకరాండ్లజే, గాలి
జనార్దన రెడ్డి ఆత్మగా పేరుగాంచిన బీ, శ్రీరాములు తదితరుల్ని చంకలో పెట్టుకుని
మోదీ స్కాముల గురించి మాట్లాడడం మధ్యతరగతి వర్గానికి అస్సలు నచ్చలేదు.
ఎలా చూసుకున్నా సీమాంధ్రలో చంద్రబాబుకన్నా
జగన్ ఓటు బ్యాంకు బ్యాలెన్సే ఎక్కువగా వున్నట్టు కనపడుతోంది. ఇది జగన్ ఘనత అనడంకన్నా
మోదీ-చంద్రబాబు కూటమి మీద వ్యతిరేకత అనడమే సబబు. మరోవైపు,
బీజేపీ-ఆరెస్సెస్ తో పొత్తువల్ల చంద్రబాబుకు కొత్తగా
కలిసివచ్చే ఓటు బ్యాంకు కూడా వుండవచ్చు. అయితే, కలిసివచ్చేదానికన్న చంద్రబాబు కోల్పోయేదే
ఎక్కువనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
జగన్
కు కేంద్ర ప్రభుత్వం విషయంలో సంధిగ్ధం వుంది.
స్కామాంధ్ర కావాలా? అని నరేంద్ర మోదీ అన్నతరువాత కూడా జగన్ కు ఎన్డీయే మీద
వ్యామోహం తగ్గినట్టులేదు. “ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోదీకిగానీ, ఎన్డీయేకుగానీ మద్దతు
ఇచ్చేదిలేదు” అని స్పష్టంగా
ప్రకటించాల్సిన సమయంలో “కేంద్రంలో
అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతు ఇచ్చి, రాష్ట్రానికి నిధులు తెస్తాము” అని ప్రకటించి
హిందూత్వ వ్యతిరేకశ్రేణుల నుండి కొత్త
చిక్కులు కొని తెచ్చుకున్నారు. సంఘ్ పరివారం వ్యతిరేకులు, బీజేపి మిత్రపక్షాల
వ్యతిరేకులూ, రాష్ట్రంలో అంబానీ గ్రూపు
కార్యకలాపాల వ్యతిరేకులూ ప్రస్తుతం తన వెంట వున్నారని జగన్ గుర్తించినట్టులేదు.
“ఎన్డీయేను
వ్యతిరేకిస్తానంటే యూపియేకు మద్దుతు ఇస్తారనే” తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లవచ్చు
అని జగన్ జంకవచ్చు. అప్పుడు వారు మూడవ ఫ్రంట్ కు మద్దతిస్తానని ప్రకటించవచ్చు.
మాయా, మమత, జయ ఇప్పుడు ఆ మార్గంలోనే పోతున్నారు. చంద్రబాబుది హిందూత్వమార్గం అని స్పష్టం అయిపోయినపుడు
తనది లౌకికమార్గం అని స్పష్టత ఇవ్వకపోతే జగన్ జీవిత కాలం పాటు కోల్పోయేది “వాళ్ళ నాయన కుర్చీ’నే! “ ప్రధాని నరేంద్ర మోడీనా, ఎల్లయ్యా, పుల్లయ్యా
అనేది తర్వాత చూద్దాం.” అంటూ
ప్రచారఘట్టం ముగియడానికి ఒకరోజు ముందు జగన్ చేసిన ప్రకటన నష్టనివారణకు కొంత
ఉపకరించవచ్చు. ప్రచార ఘట్టం చివరి రోజున
ఆయన మరింత స్పష్టత ఇస్తే ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటారు! లేకపోతే మరో స్వయంకృతాపరాధంలో
మునిగిపోతారు.
సమాజంలో సాధారంగా దళిత బహుజనులు, మత
అల్పసంఖ్యాకవర్గాలు అభద్రతా భావానికి గురవుతుంటాయి. ఈసారి ఎన్నికల్లో సీమాంధ్ర పెత్తందారీ కులాలు
అభద్రతా భావంతో భయపడుతున్నాయి. సామాజికంగా ఇది చాలా పెద్దమార్పు!
(రచయిత సీనియర్
పాత్రికేయులు, రాజకీయార్ధిక విశ్లేషకులు)
హైదరాబాద్
5 మే
2014
http://www.andhraprabha.com/columns/a-column-by-danny/16774.html
super sir
ReplyDelete