Monday, 5 May 2014

Tsunduru : Justice Denied

ప్రజల వద్దకు న్యాయం ఇదేనా?


ఉషా యస్ డానీ


చుండూరు ఊచకోత కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు సామాజికన్యాయం కోరుకునేవారికి తీవ్ర అసంతృప్తిnని కలిగించింది. ఇదేమీ ఊహాజనిత కేసుకాదు. హతులో, నిందితులో ఆచూకీ లేకుండా పోయిన కేసూ కాదు. పెత్తందారీ సామాజికవర్గాలకు చెందిన దాదాపు నాలుగు వందల మంది ఏకమై తమ గ్రామాలకు చెందిన దళితుల్ని పట్టపగలు వేటకొడవళ్లతో వెంటాడి వేటాడి ఎనిమిది మందిని నరికి చంపి సాక్ష్యాల్ని రూపుమాపడానికి శవాల్ని గోనె సంచుల్లో మూటకట్టి  కాలవలో పడేసిన అతికిరాతక కేసు ఇది.

చుండూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ఏడేళ్ల క్రితం 56 మంది నిందితులకు విధించిన శిక్షలను హైకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 22న రద్దు చేసి, వాళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. దళితుల కుటుంబాలకు కలిగిన వేదన తీర్చలేనిదని అంటూ,   ఇప్పటికైనా కక్షలకు స్వస్తిపలికి, మానవతా విలువలతో కలిసి మెలిసి బతకాలని పిర్యాదిదారులకూ,  నిందితులకూ ధర్మాసనం హితవు పలికింది. నిర్దోషులుగా బయటపడిన నిందితుల్ని విజయోత్సవాలు జరుపుకోవద్దని మందలించింది. చుండూరుమోదుకూరు గ్రామాల్లో అల్లర్లు చెలరేగకుండా కనీసం మూడు నెలలపాటు ముందు జాగ్రత్త చర్యగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది.

ఒక వివాదానికి ముగింపు పలకాల్సిన ధర్మాసనం తీర్పు అనేక కొత్త  సందేహాలకు ద్వారాలు తెరిచింది. నిందితులకు భద్రతను ఏర్పాటు చేయమని ఆదేశించిన కలంతో బాధితులు, మృతుల కుటుంబాలకు ఎలాంటి ఓదార్పునూ అందించలేకపోయింది. ధర్మాసనం తీర్పు ఇంతగా వివాదాస్పదం అయిన సందర్భం ఇటీవలి కాలంలో మరొకటిలేదు. చట్టం డబ్బున్నోడి చుట్టం అనే పాతకాలపు నాటు సామెత ఇప్పటీకీ నిజం అనిపిస్తోంది.

హైకోర్టు ధర్మాసనం తీర్పులోని సామాజిక కోణాన్ని లోతుగా అర్ధం చేసుకోవాలంటే ఈ కేసును తలకిందులు చేసి చూడాలి. చుండూరు మారణకాండలో హతులు పెత్తందారీ కులాలవాళ్ళై, హంతకులు దళితులై, నిందితుల్ని ధర్మాసనం నిర్దోషులంటూ తీర్పు చెపితే ఎలా వుండేదీ? నిందితులకు భద్రత ఏర్పాటు చేయాలని ధర్మాసనం అదేశిస్తే  అప్పుడీ సమాజం ఇంత ప్రశాంతంగా వుండేదా? 

       కరువుకాటకాల్లో ఆకలితో నకనకలాడే  మనుషులు ఆహారం కోసం కొట్లాడుకుంటే అదో ఇది. కాలువలు సుడులు తిరిగి, పొలాలు విరగపండి, గాదుల నిండా ధాన్యరాశులు, ఇంటినిండా ధనరాశులు మూలుగుతున్నాసరే వున్నవాళ్ళు లేనివాళ్ళని వేటాడి చంపుతారని కారంచేడు కండకావరం 1985లో నిరూపించింది. తెలంగాణ వర్గపోరాటాలకు పుట్టినిల్లయితే, సీమాంధ్ర కులపోరాటాల కురుక్షేత్రం అనే అభిప్రాయం పుట్టింది అప్పుడే!

వర్ణవ్యవస్థలో శూద్రులుగా వుండి, ఆధునిక సాంఘీక చట్రంలో ఆధిపత్యకులాలుగా ఎదిగిన సామాజికవర్గాలు 1970-80వ దశాబ్దాల్లో దేశమంతటా చెలరేగిపోయారు. దళితులపై ఒక పరంపరగా దాడులు కొనసాగించారు.  బీహార్ లోని బెల్చీ, పిప్రా,  ఉత్తరప్రదేశ్ లోని కఫల్తా, మధ్యప్రదేశ్ లోని మందసౌర్, మళ్ళీ బీహార్  సాహిబ్ గంజ్ జిల్లాలోని బంఝీలో పోలీసుకాల్పులు, ఆంధ్రప్రదేశ్ లోని కారంచేడు వంటి దురాగతాలు ఆ దశలో  జరిగినవే. దళితులపై దాడుల్ని నివారించడానికి గట్టి కోరలున్న కొత్త చట్టాలు తేవాలంటూ దళిత యంపీలతో పాటూ పౌరహక్కులు, మానవహక్కుల  సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. కారంచేడు ఉద్యమానికి కేంద్ర కార్యాలయమైన చీరాల విజయనగర్ శిబిరం కూడా పదిమందితో కూడిన మహిళా బాధితుల బృందాన్ని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ దగ్గరికి పంపింది. చివరకు, 1987లో స్వాతంత్ర దినోత్సవం నాటి సాంప్రదాయ  ఎర్రకోట ప్రసంగంలో  యస్సీ, యస్టీలపై అత్యాచారాల నిరోధానికి ఒక చట్టం తెస్తున్నట్టు  రాజీవ్ గాంధీ ప్రకటించారు.  ఈ చట్టాన్ని 1989 సెప్టెంబరు 11 న భారత పార్లమెంటు ఆమోదం తెలిపింది. నిబంధనలన్నీ రూపొందించుకుని ఇది 1995 మార్చి 31  నుండి అమల్లోనికి వచ్చింది.

కారంచేడు, చుండూరు దురాగతాల్లో ఒక సామాన్యాంశం వుంది. కమ్మ సామాజికవర్గం నాయకత్వంలోని తెలుగుదేశం పాలన కొనసాగుతున్న రోజుల్లో కారంచేడులో కమ్మసామాజికవర్గం  దళితుల మీద దాడులు జరపగా,  రెడ్డి సామాజికవర్గం నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన కొనసాగుతున్న రోజుల్లో చుండూరులో రెడ్డి సామాజికవర్గం  దళితుల మీద దాడులు జరిపింది.


యస్సీ, యస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టానికి పార్లమెంటు ఆమోద ముద్ర వేయడానికీ, అది అమల్లోనికి రావడానికీ మధ్య కాలంలో 1991 ఆగస్టు 6న చుండూరు సంఘటన జరిగింది.  దళితులపై అత్యాచారాల కేసుల్ని విచారించి దోషుల్ని సత్వరం శిక్షించడానికి వీలుగా  ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటు చేయడానికీ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడానికీ  ఈ చట్టంలోని 1415 సెక్షన్లలో అవకాశం కల్పించారు.  ఈ నేపథ్యంలో ఏర్పడిన ప్రత్యేక కోర్టు మొదట్లో గుంటూరులోనూ, తరువాత చుండూరు క్యాంపు కోర్టులోనూ  విచారణ సాగించింది. దీన్నే ప్రజల వద్దకు న్యాయం అని అప్పట్లో చాలా ఘనంగా చెప్పుకున్నారు.
జస్టిస్ అనీష్ న్యాయమూర్తిగావున్న చుండూరు క్యాంపు కోర్టులో దివంగత న్యాయవాది బీ. చంద్రశేఖర్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించారు.   179 మంది నిందితుల్లో సాక్ష్యాధారాలు లేవని కొందరినీసాక్ష్యాలు ఉన్నా  రికార్డు లేదని మరికొందరినీ, సంశయాత్మక లబ్ది (బెన్‌ఫిట్ ఆఫ్ డౌ ట్) కింద ఇంకొందరినీ మొత్తం 123పై ప్రత్యేక న్యాయస్థానం కేసు కొట్టివేసింది. . మిగిలిన 56 మందిలో 21 మందికి యావజ్జీవ ఖైదు, 35 మందికి ఏడాది జైలు శిక్ష విధించింది.

కారంచేడు భూమి మీద అద్భుత ఉద్యమం; న్యాయస్థానాల్లో బలహీన పోరాటం. చుండూరు భూమి మీద బలహీన ఉద్యమం న్యాయస్థానాల్లో అద్భుత పోరాటం. అయితే ఆ తరువాత జరిగింది వేరు. ప్రకాశం జిల్లా సెషన్స్ కోర్టు నిందుతులకు విధించిన శిక్షను హైకోర్టు కొట్టివేయగా, 2008 చివర్లో సుప్రీం కోర్టు ఒకరికి జీవిత ఖైదునూ, మరో ముఫ్ఫయి మందికి మూడేళ్ళ చొప్పున కఠిన కారాగార శిక్షను విధించింది.

       చుండూరులో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టు విధించిన శిక్షతో సంతృప్తి చెందని బాధిత కుటుంబాలు, దోషులకు మరింత కఠిన శిక్ష విధించాలంటూ హైకోర్టును ఆశ్రయించాయి.  అలాగే, ప్రత్యేక కోర్టులో  శిక్షలు పడినవాళ్ళు సహితం  ఆ తీర్పును హైకోర్టులో సవాలు చేశాయి.  ఆ తరువాత జరిగిందంతా నడుస్తున్న చరిత్రే!

                     కారంచేడులో ప్రజలు న్యాయస్థానం తీర్పుకోసం ఎదురుచూడలేదు. తమదైన శైలిలో తీర్పు చెప్పారు. ప్రజాకోర్టును నిర్వహించి ప్రధాన నిందితుడికి మరణదండన విధించారు. చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకుని  ఆ తీర్పును తామే స్వయంగా అమల్లోనికి పెట్టారు. దళితులపై అత్యాచారాల కేసుల్లో ప్రజాతీర్పే సరైనదేమోననే అభిప్రాయాన్నీ  చుండూరు కేసులో ఉన్నత న్యాయస్థానాల తీర్పులు కలిగిస్తున్నాయి. 

                     మనకు సామాజిక న్యాయస్థానాలు కావాలిఇప్పటి న్యాయస్థానాలకు కుల స్వభావంమత స్వభావంవర్గ స్వభావం వుందీ. ఒక్కసారి ఒక్క కేసులో కోర్టుకు వెళ్ళండి.  నిందితుడిగానేకాదు పిర్యాదిదారుడిగా అయినా సరే వెళ్ళండి. గొప్ప జ్ఞానోదయం అవుతుంది. న్యాయస్థానాల్లో డబ్బు గెలుస్తుంది. కులం గెలుస్తుంది. మతం గెలుస్తుంది. రాజకీయ పార్టి గెలుస్తుంది.

       చట్టనిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థలకన్నా న్యాయవ్యవస్థలో అవినీతి అన్ని హద్దులనూ దాటిపోయింది. గనుల ఘనుడికి బెయిలు ఇవ్వడానికి నాలుగు వందల కోట్లు అడిగిన న్యాయమూర్తులు మనకు తెలుసు. చంచల్ గూడ జైల్లో గనుల ఘనులేకాదు వాళ్లకు బెయిళ్ళు మంజూరు చేసిన న్యాయమూర్తులూ వున్నారు. న్యాయమూర్తులూ మనుషులే. వాళ్ళకూ కులంమతంవర్గంస్వార్ధంప్రేమపెళ్ళాంబిడ్డలుకష్టాలు సుఖాలురాజకీయ ఇష్టాయిష్టాలుడబ్బు ఆశ అన్నీ వుంటాయి.

మనం కార్యనిర్వహణ వ్యవస్థను విమర్శిస్తున్నాం. శాసన నిర్మాణ వ్యవస్థను విమర్శిస్తున్నాం. న్యాయవ్యవస్థకు  మాత్రం మినహాయింపుదేనికీ? అది కూడా ప్రజాస్వామ్యవ్యవస్థకున్న మూడు స్థంభాల్లో ఒకటికదా! ఒక అధికారి తప్పుచేస్తే అతని కార్యాలయం ముందు ధర్ణా చేస్తున్నాం. ఒక శాసన సభ్యుడు తప్పుచేస్తే అతని ఇంటి ముందు ధర్ణా చేస్తున్నాం. ప్రభుత్వం తప్పుచేస్తే,  సచివాలయం ముందు ధర్ణా చేస్తున్నాం. సామాజిక న్యాయానికి విరుధ్ధంగా తీర్పులుచెపితే న్యాయస్థానాలు  ముందు ధర్ణా చేయడం కూడా మొదలెట్టాలి.

యస్సీ, యస్టీల హక్కుల  పరిరక్షణ కోసం అధికారులు, సిబ్బందిని నియమించే సందర్భాల్లో బాధితుల సమస్యల మీద  సరైన దృక్పధం, సరైన అవగాహన కలిగివున్నవాళ్లనే నియమించాలనీ యస్సీ, యస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం సెక్షన్ 13 లోని 1వ క్లాజ్ స్పష్టంగా ఒక నియమాన్ని విధించింది. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలనీ కూడా ఈ క్లాజు  అదేశిస్తుంది.   

13:1    The State Government shall ensure that the administrative officers and other staff members to be appointed in an area prone to atrocity shall have the right aptitude and understanding of the problems of the Scheduled Castes and the Scheduled Tribes.

 సరిగ్గా ఈ నియమం తప్పడంవల్లనే హైకోర్టులో చుండూరు తీర్పు అలా వచ్చింది. కారంచేడు సంఘటనలో జరిగినట్టు ఇక సుప్రీంకోర్టులో అయినా సామాజికన్యాయం జరుగుతుందని ఆశిద్దాం!  

(రచయిత సీనియర్ పాత్రికేయులు,  రాజకీయార్ధిక విశ్లేషకులు)

హైదరాబాద్

మే 2014


ప్రచురణ :
బాస మాసపత్రిక, గుంటూరు

జూన్ సంచిక 2014

1 comment:

  1. Your account on the judgement on Chundur atrocity is apt. Dalits have no other go except to concentrate on educating themselves and rise in society.

    ReplyDelete