Monday, 25 January 2021

Andhrapradesh Political Scenario - 2021

 Andhrapradesh Political Scenario

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 1

-        డానీ

 

            సారం తన రూపాన్ని వ్యక్తీకరణనీ ఎంచుకుంటుందని జీవశాస్త్రంలో, తత్వశాస్త్రంలో చెప్పుకుంటాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ సూత్రం చెల్లదు.  కనీసం వర్తమాన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వరకు ఇది వాస్తవం.  ఇప్పటి రాజకీయ పార్టిల రూపసారాలు ఒకటిగా వుండవు.  ప్రతి పార్టీలోనూ  ప్రకటిత ఆశయాలకూ, ఆచరణకు పొంతన వుండడంలేదు.  రాజకీయ పార్టీలు  ఒకటి చెపుతాయి; ఇంకొకటి చేస్తాయి.

 

            ఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం 49.95 శాతం ఓట్లు, 151 సీట్లతో వైఎస్ ఆర్ సిపి అధికార పార్టిగా ఆవిర్భవించింది.  39.17 శాతం ఓట్లు, 23 సీట్లతో టిడిపి ప్రధాన ప్రతిపక్ష పార్టిగా నిలిచింది. 5.53 శాతం ఓట్లు, ఒకే ఒక్క సీటుతో జనసేన సాంకేతికంగా మూడవ పార్టిగా మిగిలింది. ఈ మూడు పార్టిలకు తప్ప రాష్ట్రంలో మరే ఇతర పార్టీకీ శాసనసభలో  ప్రాతినిథ్యం దక్కలేదు.  ఓట్ల ప్రాతిపదికన 1.17 శాతం ఓట్లతో (ఇందిరా) కాంగ్రెస్, 0.84 శాతం ఓట్లతో బిజెపి, 0.28 శాతం ఓట్లతో బిఎస్పి మిగిలాయి. వామపక్షాలయిన సిపిఐ, సిపియంలకు అరపావు శాతం  ఓట్లు కూడ రాలేదు.

 

            రాజకీయాల్లో ప్రతి పార్టికి కొన్ని దీర్గకాలిక విధానాలు వుంటాయి. ఇవే ఆ పార్టీలకు సాపేక్షంగా స్థిర ఓటు బ్యాంకును ఏర్పాటు చేస్తుంటాయి. ఇవిగాక ప్రతిసారీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టిలన్నీ ఓ కొత్త ప్రణాళికను విడుదలచేస్తాయి. తాము అధికారంలోనికి వస్తే ఏఏ వర్గాల అభ్యున్నతి కోసం ఎలాంటి పథకాలను చేపడతాయో అందులో వివరిస్తాయి. ఈ ఎన్నికల వాగ్దానాలు స్వల్పకాలికమైనవి. అవి ఆ ఎన్నికల వరకే పరిమితం. ఈ దీర్ఘకాలిక విధానాలనైనా, తాత్కాలిక హామీలనైనా ఆయా పార్టీలు చిత్తశుధ్ధితో పాటిస్తాయా అంటే అదీ అనుమానమే. అవసరాలను బట్టి, అవకాశాలనుబట్టి, ప్రభుత్వాధినేతల ఆసక్తుల్ని బట్టి ఈ విధానాలు, హామీలు మారిపోతుంటాయి.

 

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 2

-        డానీ

 

 (ఇందిరా) కాంగ్రెస్

 

            అభివృధ్ధి-మతసామరస్యం అనేవి చాలాకాలం కాంగ్రెస్ కు జాతీయ విధానాలుగా వుండేవి. నెహ్రూ మార్కు ఒక పలుచని సామ్యవాదం కూడ ఆ పార్టి విధానాల్లో కొంచెం మసగ్గా అయినా కనిపించేది. రాష్ట్రాల్లో భూస్వామ్యవర్గం దానికి అండగా వుండేది. ఎస్సీలు, మైనార్టీలు ఆ పార్టికి నమ్మకమైన ఓటు బ్యాంకుగా వుండేవారు.

 

 

            అయితే, ఈ సమీకరణకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ రోజుల్లోనే బీటలు పడ్డాయి. పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఛిన్నాభిన్నమైపోయింది. కాంగ్రెస్ మితవాద బిజెపి అయితే బిజెపి మతవాద కాంగ్రెస్ అనేమాట రాజకీయాల్లో స్థిరపడింది. సోనియాగాంధి మళ్ళీ మతసామరస్యం- అభివృధ్ధి  విధానాలను ముందుకుతెచ్చి ఆ పార్టికి ఓ పదేళ్లు  జీవం పోశారు. ఏపిలో వైయస్ రాజశేఖర రెడ్డి ఆ పార్టికి కొత్త తరహా సంక్షేమ పథకాలతో కొత్త శక్తి నిచ్చారు. వుమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం కాంగ్రెస్ లో ఎక్కువగా వుండేది.

 

            2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారాన్ని కోల్పోయాక ఆ పార్టీలో  స్థానిక, ప్రాంతీయ నాయకులు తిరుగుబాట్లు సాగించారు. బలమైన, ఉత్తేజకరమైన నిర్ణయాత్మకమైన జాతీయ నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టి కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ బలహీనపడిపోయింది. తెలంగాణ ఏర్పాటు చేసిన తీరు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు చావు దెబ్బ కొట్టింది. పదేళ్ళు అధికారంలో వున్న పార్టికి 2014, 2019 ఎన్నికల్లో శాసన సభలో ప్రాతినిధ్యమే దక్కలేదు.  అయితే, కేంద్రంలో బుల్ డోజింగ్ ప్రజాస్వామ్యాన్ని సాగిస్తున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలవరించాలంటే ప్రత్యామ్నాయ కూటమిలో కాంగ్రెస్ వుండితీరాలనే మాట ఒక్కటే ఆ పార్టిని ఇప్పటికీ బతికిస్తున్నది.

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 3

-        డానీ

 

చంద్రబాబు - టిడిపి

            తెలుగు జాతి ఆత్మగౌరవం, సమాఖ్య విలువలు, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి వంటి విధానాలతో తెలుగుదేశం పార్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం రేపింది. “రెండు రూపాయలకు కిలో బియ్యం” వంటి హామీ   పేద ప్రజానీకాన్ని గొప్పగా ఆకర్షించింది. పేదల ఆర్థిక విధానంతో ఎన్ టిఆర్-టిడిపి కాంగ్రెస్ పునాదుల్ని పెకళించింది.  బిసిలు, ఎస్సీల్లో ఒక వర్గం టిడిపికి అండగా నిలిచారు.

 

            ప్రాంతీయ పార్టి కావడాన దానికి కుటుంబ స్వభావం వుంది. కాంగ్రెస్ లో రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం వున్నట్టు టిడిపిలో కమ్మ సామజికవర్గం ప్రాబల్యం వుంది.

 

            చంద్రబాబు హయాంలో టిడిపి పేదల ఆర్థిక విధానం, ఫెడరల్ ఆదర్శం రెండూ మారిపోయాయి. సరళికరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్ పి జి) ఆర్థిక సంస్కరణలకు పివి నరసింహారావు – మన్మోహన్ సింగ్ రూపశిల్పులు అయితే దానికి సిసలైన బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. తనే పలుసార్లు చెప్పుకున్నట్టు ఆయనొక నిపుణుడైన సిఇవో. రియల్ ఎస్టేట్ అభివృధ్ధిని రాష్ట్ర అభివృద్ధిగా ప్రచారం చేసుకోవడంలో వారు దిట్ట.

 

            కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పాలనే ఆశతో చంద్రబాబు సమాఖ్య స్పూర్తికి దూరం అయిపోయారు. ఈరోజు కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడి ‘బుల్ డోజింగ్ ప్రజాస్వామ్యం’తో రాష్ట్రాల హక్కుల్ని కాలరాయడానికి దోహదపడినవారిలో చంద్రబాబు ముఖ్యులు. ఆ విషయాన్ని మరో పధ్ధతుల్లో వారు చాలాసార్లు గొప్పగా చెప్పుకున్నారు.

 

            ప్రాయోజిత పెట్టుబడీదారీ (క్రోనీ కేపిటలిజం) విధానాలకు పెద్ద పీట వేయడం ద్వార చంద్రబాబు పేదప్రజలకు  అభద్రలోకానికి దూరం అయిపోయారు. బిజెపితో జతకట్టి మైనారిటీలకు దూరం అయిపోయారు. విద్యుత్ సంస్కరణలతో రైతులకు దూరం అయిపోయారు.  వెరసి తొలి దశలోని ఎన్టీఆర్-టిడిపి ఆదర్శాలన్నింటికీ వారు తూట్లుపోడిచారు.

            ఎన్టీ రామారావు ప్రభావంతో రైతులు టిడిపికి అభిమానులుగా వుండేవారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే రైతులు  గుర్తుకు వస్తారు. రైతుల రుణమాఫీ ఫైలు మీద తొలి సంతకం చేస్తానని 2014 ఎన్నికల్లో వారు హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. వారు వేల సంతకాలు చేశారుగానీ పూర్తిగా రుణమాఫీ చేసే సంతకం మాత్రం చేయలేదు. అప్పుల్ని ఐదు విడతల్లో రద్దు చేసేలా జీవో జారీ చేశారు.  ఐదేళ్ళ పాలనలో  మూడు విడుతలే ఇచ్చారు. చివరి రెండూ గాల్లో కలిసిపోయాయి.  ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల్ని చంద్రబాబు-టిడిపి సమర్ధించడం  ఆ పార్టి  రైతుల మీద చూపించే కపట  ప్రేమకు సరికొత్త ఉదాహరణ.  

 

            చంద్రబాబు - టిడిపివి కేంద్రీకృత పెరుగుదల ఆర్థిక విధానాలు (Centralised Growth Economics). ఇవి అభివృధ్ధి పేరిట సాగే  వైపరీత్యాలు. ఆయన అతిశయాలతో నింపేసి, పెంచేసి ప్రచారం చేసిన అమరావతి, పోలవరం ప్రాజెక్టులు కూడ వైపరీత్యాలే (pervercities). 

 

            చంద్రబాబు పాలనలో ఒక విచిత్రం వుంటుంది. ఆయన అధికారంలో వున్నంత వరకు అంతా బాగానే వున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయన పాలనకు లబ్దిదారులు సంపన్నులు. రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పినట్టు అమరావతి భూముల్లో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ జరగలేదని అనుకున్నా ఆ భూముల్ని కొన్నవాళ్ళు,  సంపదను పెంచుకున్న వాళ్ళు అందరూ సంపన్నులే అనే వాస్తవాన్ని మాత్రం హైకోర్టుతోసహా ఎవరూ కాదనలేరు.  సంపన్నులు ప్రాబల్యం నోరున్న వర్గం కనుక మీడియా కూడ వాళ్ళ భజన చేస్తుంటుంది. అంచేత రాష్ట్రం వెలిగిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎన్నికల్లో కళ్ళు బైర్లుకమ్మే ఫలితాలు వస్తాయి.  2004లోనూ అదే జరిగింది, 2014లోనూ అదే జరిగింది. అభద్రలోకం చంద్రబాబు-టిడిపి ఆర్థిక విధానాలకు రెండుసార్లు గట్టి గుణపాఠం చెప్పింది.  

 

            తాను అనుసరించిన కేంద్రీకృత పెరుగుదల ఆర్థిక విధానాలు తనను ఒటమి దిశగా నడుపుతున్నాయని 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుకు చాలా స్పష్టంగానే తెలిసివచ్చింది. నష్టనివారణ చర్యగా ‘పసుపు కుంకుమ’ పేరిట నగదు బదిలీ పథకాన్ని రూపొందించారు. నగదు బదిలీ పథకాల సృష్టికర్త చంద్రబాబే అయినప్పటికీ అవి ఆయన్ను ఆదుకోలేదు. అప్పటికే జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. 

 

            మళ్ళీ బిజెపితో జట్టు కడితేగానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  గట్టెక్కలేమని చంద్రబాబు టిడిపికి అర్థం అయింది. చంద్రబాబు బిజెపిల మధ్య పూర్వపు దోస్తీని పునరుధ్ధరించడానికి బిజెపి  నాయకులైన సుజన చౌదరి, దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు గట్టి కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిజెపిని మించిన మతరాజకీయాలు నడపడానికి చంద్రబాబు నడుం బిగించారు. టిడిపి బలగాలతోపాటూ, బిజెపి శ్రేణులకు కూడ సంయుక్తంగా నాయకత్వం వహించాలని వారు ముచ్చట పడుతున్నారు. మనువాద ఓట్ బ్యాంకును ఆకర్షించడానికి కొన్ని నెలలుగా క్రైస్తవ ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు. మైనారిటీ వ్యతిరేకిగా ముద్ర వేసుకోవడానికి ఉవ్వీళ్ళూరుతున్నారు. ఒకప్పుడు వాజ్ పాయిని నడిపానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు బండి సంజయ్ ను  అనుసరిస్తున్నారు. తెలంగాణలో బండి సంజయ్ ఉపన్యాసాల్లో ‘ముస్లింలు’ అని తిట్టిన చోటెల్లా  ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ‘క్రీస్టియన్లు‘ అని మార్చుకుని వాడుకుంటున్నారు. అదొక్కటే తేడా!

 

            ఎన్నికల తరువాత తలవంచి తెలంగాణలో ప్రవాస జీవితాన్ని గడుపుతున్న చంద్రబాబుకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలంగా మారే  అవకాశం కల్పించింది జగనే. అధికార వికేంద్రీకరణ పేరిట జగన్ ముందుకు తెచ్చిన మూడు రాజధానుల చట్టం చంద్రబాబుకు మళ్ళీ ఏపీలో కాలుపెట్టే అవకాశాన్ని కల్పించింది. ఆ కృతజ్ఞతా భావంతో కావచ్చు చంద్రబాబు కూడ జగన్ కు ఒక మేలు చేశారు. ఏపీ పోలీసుల దౌర్జన్యాలు మితిమీరడంతో ఆ మధ్య ఎస్సీల్లో వైయస్సార్ సిపి ప్రభుత్వం మీద అసమ్మతి రగిలింది. ఎస్సీల నిరసనను  తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు  పూర్తిగా విఫలం అయ్యారు. ఇప్పుడు వారు క్రైస్తవుల మీద సాగిస్తున్న  ద్వేష ప్రచారంతో  క్రైస్తవులేగాక ఎస్సీలు సహితం వైయస్సార్ సిపీలోనికి పోలరైజ్ అయిపోతున్నారు.

 

            మరోవైపు, మొదటి నుండీ టిడిపిలో ప్రాబల్యాన్ని సాగించిన కమ్మ సామాజికవర్గానికి వైయస్సార్ సిపి పాలన సహజంగానే నచ్చదు. చంద్రబాబు – టిడిపిని ఏదో ఒక విధంగా మళ్ళీ అధికారంలోనికి తెచ్చుకోవాలని ఆ సమూహం రాత్రింబవళ్ళు అదనపు శ్రమ చేస్తున్నది. జగన్ ను అడ్డంగా వ్యతిరేకించడం, నవరత్నాలను అవహేళన చేయడం, అమరావతి సింగిల్ రాజధాని అనడం, ఎస్ ఇసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెనకేసుకు రావడం వంటివి ఈ ప్యాకేజీలో భాగం. ఈ విధానాలకు మద్దతు ఇస్తున్నవారిలో  సామ్యవాదులు, కమ్యూనిస్టు అభిమానులు కూడ వున్నారు. చంద్రబాబు మతోన్మాద ఉగ్రరూపం దాలుస్తున్నా వాళ్ళకు పెద్దగా అభ్యంతరం లేకపోవడం హాశ్చర్యకరం.

 

            క్లిష్ట దశలో చంద్రబాబుకు  గొప్ప నైతిక మద్దతుగా నిలబడుతున్నది వర్ల రామయ్య, కంచికచర్ల బాలకోటయ్య, తాడికొండ శ్రీనివాస్ వంటి ఎస్సీ నేతలే. అయితే, క్రైస్తవ వ్యతిరేక ప్రచారాన్ని రోజురోజుకు వుధృతం చేస్తున్న చంద్రబాబు  ఆ దళిత నేతల్ని ఎంత కాలం నిలబెట్టుకుంటారన్నది అనుమానమే.  

 

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 4

-        డానీ

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టి

            కొంత కాంగ్రెస్ విధానాలు, కొంత జగన్ స్వంత ఎజెండా వగైరాలను కలిపి వైఎస్సార్ సిపి విధానాలు రూపుదిద్దుకున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మరికొన్ని చేర్చి నవరత్నాలను రూపొందించడంతో అభద్రలోకం ఆ పార్టికి ఓటు బ్యాంకుగా మారింది. ఎస్సీలు, మైనారిటీలతో కూడిన కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు ఇప్పుడు వైఎస్సార్ సిపి వైపుకు మళ్ళింది.

 

            ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో  రెడ్డి సామాజిక వర్గం జనాభా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రాల్లో విస్తరించి వుండేది. అప్పట్లో రాజకీయ ప్రాబల్యం కూడ వాళ్ళకు ఎక్కువగా వుండేది. రెడ్ల కుల వృత్తి రాజకీయం అన్నంతగా సన్నివేశం వుండేది. కమ్మ సామాజికవర్గం జనాభ తెలంగాణలో ఓ రెండు జిల్లాల్లోనూ, రాయలసీమలో ఇంకో రెండు జిల్లాల్లోనూ కొంత వున్నప్పటికీ ప్రధానంగా మధ్య ఆంధ్రాలో కేంద్రీకృతమై వుండేది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ  సందర్భంగా రెడ్డి సామాజికవర్గం జనాభా రెండు రాష్ట్రాల్లోను చెరి సగంగా విడిపోయింది. కమ్మ సామాజికవర్గం జనాభాలో అలాంటి విభజన లేకపోవడంతో కొత్త ఆంధ్రప్రదేశ్ లో సంఖ్యరీత్యా వాళ్ళ రాజకీయ అవకాశాలు పెరిగాయి. పైగా, కమ్మ సామాజికవర్గంలో ఏక పార్టి అభిమానం ఎక్కువగా వుండే రెడ్డి సామాజికవర్గంలో బహుళ పార్టి అభిమానం వుంది. ఆ నేపథ్యంలో, 2014 ఎన్నికల్లో, స్వల్పతేడాతో అయినా సరే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి మార్గం సులువయ్యింది.

 

            అధికారాన్ని చేపట్టడానికి తనకు స్వీయ సామజికవర్గం మద్దతు సరిపోదని 2014 ఎన్నికల అనంతరం జగన్ కు తెలిసి వచ్చింది.  పాదయాత్ర సందర్భంగా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇతర పేదవర్గాలను ఒక ప్రణాళిక ప్రకారం చేరదీసి జగన్ తన ఓటు బ్యాంకును 50 శాతానికి పెంచుకున్నారు. ఈ ప్రయత్నం ఫలించి వారు  ముఖ్యమంత్రి అయ్యారు.

 

            కాంగ్రెస్ లో వున్నట్టే వైఎస్సార్ సిపిలోనూ రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్‍ కన్నా కొంచెం ఎక్కువే కనిపిస్తోంది. టిడిపిలో కమ్మ సామాజికవర్గానిదే ప్రాబల్యం అనేది బహిరంగ రహాస్యం అయినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో సోషల్ ఇంజినీరింగ్ ను ప్రదర్శించడంలో చంద్రబాబు  ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారు. వారు పాల్గొనే వేదికల మీద దేవేందర్ గౌడ్ (బిసి-గౌడ), యనమల రామకృష్ణూడు (బిసి -యాదవ) ఎలిమినేటి మాధవరెడ్డి / నాగం జనార్దన రెడ్డి  (రెడ్లు) లాల్ జాన్ బాషా (ముస్లిం)  జిఎంసి బాలయోగి / ప్రతిభా భారతి/ కడియం శ్రీహరి  (ఎస్సీ)లకు మాత్రమే అవకాశం ఇచ్చేవారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన మరో నాయకునికి సాధారణంగా ఆయన వేదికల మీద అవకాశం ఇచ్చేవారు కాదు. ఇలాంటి సోషల్ ఇంజినీరింగ్ ను ప్రదర్శించడంలో జగన్ చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇతర సమూహాల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం రాజకీయాల్లో మేలు చేయదు.

 

            వ్యక్తిగత ఎజెండాలో చంద్రబాబు, జగన్ మధ్య ఒక సారూప్యం వుంది. శాశ్విత ముఖ్యమంత్రిగా  వుండాలనేదే ఇద్దరి కోరిక. ఆ మాటకొస్తే పార్టీ పెట్టిన ప్రతిఒక్కరూ ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటారు. ఇందులో చిన్న తేడా కూడ వుంది. ముఖ్యమంత్రిగా వున్న తన తండ్రి చనిపోతే  ఆ స్థానంలో తాను ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ కోరుకున్నారు. ముఖ్యమంత్రిగా వున్న తన మామను తప్పించి తాను ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు.

 

            ఆర్థికరంగంలోనూ చంద్రబాబు-టిడిపికి పూర్తిగా విరుధ్దమైన విధానాలను జగన్ అనుసరిస్తున్నారు. చంద్రబాబు – టిడిపి అనుసరించిన కేంద్రీకృత పెరుగుదల ఆర్థిక విధానాలు (Centralised Growth Economics). సృష్టించిన విధ్వంసానికి విరుగుడుగా వైయస్సార్ సిపి వికేంద్రీకృత పెరుగుదల ఆర్థిక విధానాలను (De-Centralised Growth Economics) ముందుకు తెచ్చింది. నవరత్నాలు, నగదు బదిలీలు, ప్రభుత్వ పాఠషాలల్లో ఇంగ్లీషు మీడియం వగయిరాలు  అందులో భాగమే.

 

            ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక తప్పును సరిదిద్దబోయి ఇంకో తప్పు చేస్తున్నట్టు నగదు బదిలీ పథకాల మీద విమర్శలున్నాయి. కేంద్రీకృత పెరుగుదల ఆర్థిక విధానాలు సాగించిన విధ్వంసానికి నష్టపరిహారంగా ఇలాంటి పథకాలు తప్పవనే సమర్థనలూ వున్నాయి.         

 

            పేటల్లోనే సచీవాలయం అనే విధానం గొప్పది. ఇది కొన్ని మేళ్ళు చేస్తున్నా, కొన్ని కొత్త ఇబ్బందుల్ని కూడ తీసుకు వచ్చింది.  అక్కడి సిబ్బంది  అధికార స్వామ్యంతోపాటూ పార్టి పక్షపాతాన్ని కూడ ప్రదర్శిస్తున్నది. ఇసుక, లిక్కర్  పంపిణీలో  వైయస్సార్ సిపి ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఏడాదికి పైగా ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టాయి. ఇటీవల ఇసుక సరఫరాను క్రమబధ్ధం చేసినా, లిక్కర్ ధరల్ని కొంచెం తగ్గించినా ఆ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. ప్రీమియం లిక్కర్ అంటూ వైన్ షాపుల్లో కొత్తగా ప్రవేశపెట్టిన అనామక  బ్రాండ్లతో, వాటి అధిక ధరలతో మధ్యతరగతి, ఆ పైతరగతి సమూహాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఎన్నికల్లో వీటి ప్రభావం వుంటుంది.

 

            చంద్రబాబుకన్నా తాను మృదువైన ప్రత్యర్థి (సాఫ్ట్ అప్పోనెంట్)  అని జగన్ తరచూ బిజెపికి సంకేతాలు పంపిస్తున్నారు. కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి జగన్ దగ్గరున్న  22 లోక్ సభ సీట్లకన్నా  6 రాజ్యసభ సీట్లు చాలా విలువైనవి. పైగా పార్లమెంటు వుభయ సభల్లోనూ జగన్ ప్రభువును మించిన ప్రభుభక్తిని ప్రదర్శిస్తున్నారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు మద్దతును ఇవ్వడమేగాక ఇంకా బిల్లుల దశలోనే వున్న కేంద్ర విద్యుత్ సంస్కరణల్ని అప్పుడే రాష్ట్రంలో అమలు చేయడానికి జగన్ సన్నాహాలు మొదలెట్టేశారు.

 

            చంద్రబాబులా జగన్ ను కూడ మనువాద ఫోబియా వెంటాడుతోంది. తాను చంద్రబాబును మించిన ‘హిందువు’నని చెప్పుకోవడానికి ఆయన ఈ మధ్య చాలా తంటాలు పడుతున్నారు. వాటివల్ల కొత్త ఓటు బ్యాంకు రాకపోగా వున్న ఓటు బ్యాంకుకు బీటలు పడే ప్రమాదం వుంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 5

-        డానీ

 

బిజెపి

 

            గుజరాత్ ను అభివృధ్ధి నమూనాగా ప్రచారం చేయడంలో బిజెపి సఫలమయింది. గుజరాత్ లో సాగింది, సాగుతున్నదీ అభివృధ్ధా, పెరుగుదలా అనేది ఒక చర్చ అయితే, అక్కడ ఆ పెరుగుదల అయినా నరేంద్ర మోదీజీ హయాంలోనే మొదలయిందా? లేక అంతకు ముందే వుందా? అనేది ఇంకో చర్చ. 2002 నరమేధంతో రాష్ట్రంలో నెత్తుటి కాలువలు ప్రవహిస్తున్న కాలంలో ‘గుజరాత్ సుగంధం’ (గుజరాత్ కి ఖుష్ బూ) అని ప్రచారం చేసుకో గలిగిన గొప్ప నైపుణ్యం బిజెపి ప్రచార విభాగానికి వుంది. 

 

            ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి అభివృధ్ధి మంత్రంకన్నా మతపరమైన భావోద్వేగాలే నమ్మకంగా పనిచేస్తాయని బిజెపికి అనుభవపూర్వకంగా తెలుసు. అలా ఆ పార్టి చాలాసార్లు లాభపడింది కూడ. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అవకాశం తక్కువగా వున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో  మాత్రమే అది గుజరాత్ మార్కు అభివృధ్ధి నమూనాను ప్రచారం చేస్తుంది.

 

            ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధికి ప్రధాని నరేంద్ర మోదీజీ దోహద పడతారంటే నమ్మేవారు మొత్తం రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరూ వుండరు. విదేశాల్లోని నల్ల ధనాన్ని వెనక్కి తీసుకు రావడంలోగానీ, స్వదేశంలోని నల్లధనాన్ని రూపుమాపడంలోగానీ, జిడిపి గ్రోత్ రేటును పరుగులు పెట్టించడంలోగానీ నరేంద్రమోదీజీ సాధించిన ఘనవిజయాల గురించి తెలియనివారు ఎవరూ వుండదు. గత ఎన్నికల్లో ఆ పార్టికి గుజరాత్ అభివృధ్ధి నమూనాకు, మత రాజకీయాలకు కలిపి పడిన ఓట్లు ఒక్క శాతం కూడ కాదు. అంచేత అభివృధ్ధి మంత్రాన్ని పక్కన పెట్టి మతపరమైన  భావోద్వేగాలను రెచ్చగొట్టడమే ఏపీలో  తమ విధానంగా ఆ పార్టి మార్చుకుంది. కేంద్రంలో తిరుగులేని అధికారంలో వుండడం దానికి అదనపు సౌకర్యంగా మారింది. 

 

            కాంగ్రెస్ లా, ప్రాంతీయ పార్టీల్లా బిజెపిలో కుటుంబ పాలన లేదు. అయితే, కుల కోణం స్పష్టంగావుంది.  ఏపిలో కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు చంద్రబాబు-టిడిపి, వైయస్సార్ సిపిల మధ్య చీలిపోవడంతో బిజెపి కాపు సామాజికవర్గం మీద దృష్టి పెట్టింది. ఆ పార్టి రాష్ట్రశాఖ ప్రస్తుత  అధ్యక్షులు సోము వీర్రాజూ, ఇంతకు ముందు అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారే. అంతేకాక, రాష్ట్ర బిజేపి ఔటర్ యార్డులో తెచ్చిపెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడ  కాపు సామాజిక వర్గానికి చెందినవారే. అలాగే రాయలసీమలో రెడ్డి సామాజికవర్గాన్ని ఆకర్షించడానికి కూడ ఆ పార్టి ప్రత్యేక కసరత్తులు చేస్తున్నది.

 

            ఒకే జాతి ఒకే భాష ఒకే చట్టం బిజెపి విధానం అనే మాట తరచూ వినబడుతుంటుంది. వాస్తవం అదికాదు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో బిజెపి నాయకులు అమరావతి సింగిల్ రాజధాని అంటారు. ఉత్తరాంధ్రా బిజెపి నాయకులు విశాఖపట్నం పాలనా రాజధాని అంటారు. రాయలసీమ బిజెపి నాయకులు న్యాయ రాజధాని కర్నూలు అంటారు. ఢిల్లీ నుండి వచ్చే బిజెపి నేతలు కొందరు అమరావతే రాజధానిగా వుంటుందని హామీలు కురిపిస్తుంటారు.  బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం రాజధాని విషయంలో తమ జోక్యం ఏమీ వుండదని హైకోర్టులో అఫిడవిట్ అందిస్తుంది.  ఒకే పార్టి ఒకే అంశం మీద ఒకే రాష్ట్రంలో ఇన్ని రకాలుగా వ్యవహరించడం ఒక రాజకీయ విచిత్రం.           

 

            హిందూ విగ్రహాలను అవమానించేంత ఆలోచనలుగానీ, అవకాశంగానీ రాష్ట్రంలోని క్రైస్తవ సామాజికవర్గాలకు లేవని బిజెపి కూడ తెలుసు. ఈ వివాదం నుండి ఎక్కువ లబ్దిని పొందడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నారని కూడ ఆ పార్టీ పెద్దలకు తెలుసు. అయితే, ఈ సంఘటనల దోషులు ఎవరయినా ఈ వివాదం తమకు అనుకూలంగా మారుతుందని ఆ పార్టి ధీమాగా వుంది.

 

            కేవలం కాపు సామాజికవర్గం మద్దతుతో శాసన సభలో ప్రవేశించడం కుదరదని బిజెపికి స్పష్టంగా తెలుసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘోరపరాజయం వారి కళ్ళముందే వుంది. బ్లహీనవర్గాలను ఆకర్షించే విధానాలు కావి బిజెపివి. ఒక దశలో బిసిల్ని ఆకర్షించవచ్చుగానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడ లేదు. రెడ్డి సామాజికవర్గం నుండి కొందరిని నాయకత్వం లోనికి చేర్చుకున్నా జగన్ బలంగా వున్నంత కాలం ఆ సమూహాన్ని తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడం సాధ్యం కాదు. ఇక కమ్మ సామాజికవర్గం మీద కన్ను వేయడమే దానికి మిగిలిన మార్గం.

 

            కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని వంటివారు ఎలాగూ మొదటి నుండీ వైయస్సార్ సిపిలో వున్నారు.  2019లో టిడిపి ఓటమి తరువాత కమ్మ సామాజికవర్గం నుండి ఇంకో భాగం కూడ చంద్రబాబుకు దూరమై జగన్ కు దగ్గరయ్యింది. ఇక మిగిలిన కమ్మ సామాజికవర్గాన్ని తను  ఆకర్షించాలని బిజెపి ఆశిస్తోంది. దానికి కావలసింది చంద్రబాబు సహిత టిడిపి కాదు; చంద్రబాబు రహిత టిడిపి.

 

            కాంగ్రెస్ ను  తీవ్రంగా ద్వేషిస్తున్న కారణంగా బిజెపికి జగన్ మీద చంద్రబాబుకన్నా సాపేక్షంగా ఒక సాఫ్ట్ కార్నర్ వుంది. గత లోక్ సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోదీని ఓడించడానికి చంద్రబాబు కాంగ్రెస్ తో జతకట్టడాన్ని బిజేపి ఇంకా మరిచిపోలేదు. 

 

           

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 6

-        డానీ

 

పవన్ కళ్యాణ్

 

            రాజకీయాల్లో ఉత్సవ విగ్రహానికి పవర్ స్టార్ గొప్ప ఉదాహరణ. 2014 నాటికే పార్టిని పెట్టినప్పటికీ ఆ ఎన్నికల్లో అభ్యర్ధిల్ని నిలబెట్టకుండానే ఆయన టిడిపి బిజెపి కూటమిలో మూడో భాగస్వామిగా కొనసాగారు. “ప్రశ్నించడానికే నేను వచ్చాను” అని గంభీర ప్రకటనలు చేయడమేతప్ప ఆధిపత్యాన్ని వారు  ప్రశ్నించిన సందర్భంలేదు.

 

            జనసేనను ఒక ప్రాంతీయ పార్టి అనడమూ కష్టమే.  అదొక ద్వి సభ్య కమిటి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్.

 

            కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలోనూ అక్కడ కేంద్రంలోనూ అధికారంలో లేనపుడు “కాంగ్రెస్ కో హటావో - దేశ్ కో బచావో” అని పవర్ స్టార్ గర్జిస్తే  జనం గట్టిగానే నవ్వారు.  వారు  ట్రెండును ఫాలో కాకుండ రెండు స్థానాల్లో పోటీచేసి రెండు చోట్లా ఓడిపోయి ఒక సరికొత్త ట్రెండ్ ను సృష్టించారు. రాష్ట్రంలో టిడిపి పాలన మీద అసంతృప్తిగా వున్నవాళ్ళు జగన్ వైపుకు మళ్ళకుండ చేసేందుకు  ‘చంద్రబాబు ఏజెంటు’గా  పవన్ కళ్యాణ్ ను రంగంలోనికి దించారనే అపవాదూ వుంది.

            సాధారణంగా ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. ఎన్నికలు కాగానే బిజెపితో పొత్తు పెట్టుకుని అక్కడా వారు ఒక ట్రెండ్ సృష్టించారు. స్కూళ్ళకు ఏడాదిలో మూడుసార్లు సెలవులిచ్చినట్టు పవన్ కళ్యాణ్ ఎడాదిలో మూడుసార్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి  రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. అదీ కొత్త ట్రెండే.

 

            తెలంగాణలో హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలు, ఏపిలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు వంటి కీలక సమయాల్లో ఇద్దరు సభ్యుల కమిటి ఢిల్లీ వెళుతుంది. అక్కడ  ప్రధాని అప్పాయింట్ మెంట్  కోసమో, కనీసం హోంమత్రి అప్పాయింట్ మెంట్ కోసమో ఎదురు చూస్తుంది.  చివరకు జెపి నడ్డాను కలువ గలుగుతుంది.  వీళ్ళు “ మేము పోటీ చేస్తాము” అంటారు. వారు “మేమే పోటీ చేస్తాము; మీరు ప్రచారం చేయాలి” అంటారు. ఇద్దరు సభ్యులు బయటికి వచ్చి “చర్చలు సహృద్భావ వాతావరణంలో సాగాయి. ఎకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం” అని ఒక ప్రకటన చేస్తారు. ఏకగ్రీవం, ఏకపక్షం ఒకటే అని వారి భావన కావచ్చు.

 

            రాష్ట్ర రాజకీయాల్లో తన ఆరుశాతం ఓట్ల కన్నా ఒక్క శాతం ఓట్లున్న బిజెపి శక్తివంతమైనదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు నెలలకు ఒకసారి నిరూపిస్తుంటారు. చే గువేరా టీ షర్టులతో రంగప్రవేశం చేసిన పవర్ స్టార్ ను బిజెపి స్టాండ్ బైగా మార్చుకుంది. 

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 7

-        డానీ

 

బహుజన సమాజ్ పార్టి

 

            రాజ్యాంగం ద్వార భారత ప్రజలకు రాజకీయ సమానత్వాన్ని అందించిన ఘనత బాబా సాహెబ్ అంబేడ్కర్ ది. యుక్త వయస్సు దాటిన ప్రతి ఒక్కరికీ ఒక ఓటు; ప్రతి ఓటుకూ సమాన విలువ అనేది చాలా గొప్ప ఆదర్శం.

 

            అంబేడ్కర్ కేవలం రాజకీయ సమానత్వాన్ని మాత్రమే కోరుకోలేదు. ఆర్ధిక సమానత్వాన్నీ, సామాజిక సమానత్వాన్నీ కూడ కోరుకున్నాడు.  ఆర్ధిక సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని సాధించకపోతే  రాజకీయ సమానత్వం కూడ నిలవదని గట్టిగా హెచ్చరించాడు. ఇతర పార్టీలు ఆర్ధిక సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని సాధించకపోగా రాజ్యాంగబధ్ధ   రాజకీయ సమానత్వానికి కూడ  తూట్లుపొడుస్తారని అంబేడ్కర్ సరిగ్గానే ఊహించాడు. ఆర్ధిక సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని సాధించే భారాన్ని కూడ తానే భుజాలకు ఎత్తుకోవాలనుకున్నాడు.

 

            1936లో పెట్టిన ఇండిపెండెంట్ లేబర్ పార్టి, (ఐఎల్ పి) 1942లో మొదలెట్టిన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ (ఎస్ సి ఎఫ్) ప్రయోగాలు అనుభవాల తరువాత రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియా (ఆర్ పిఐ) ను ఆరంభిస్తున్నట్టు 1956  సెప్టెంబరు 30న అంబేడ్కర్ ప్రకటించాడు. అది కార్యరూపం దాల్చకముందే 1956 డిసెంబరు 6న ఆయన చనిపోయాడు. అంబేడ్కర్ ప్రధాన అనుచరులు 1957 అక్టోబరు 3న నాగ్ పూర్ లో  రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియాను ఆరంభించారు. అయితే అంతర్గత కొట్లాటల కారణంగా  ఆర్ పిఐ యాభై ముక్కలైంది. ఇప్పుడో అరడజను  ఆర్ పిఐ లు పనిచేస్తున్నాయి. వీటిల్లో రామ్ దాస్ అథవాలే నాయకత్వంలోని ఆర్ పిఐ కేంద్రంలో అధికార కూటమిగావున్న  ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా వుంది.

 

            ఆర్ పిఐలో చాలాకాలం పనిచేసిన కాన్షీరామ్ 1984లో అంబేడ్కర్ పుట్టిన రోజైన  ఏప్రిల్ 14న బహుజన్ సమాజ్ పార్టిని ఆరంభించాడు.  బిఎస్పీ ఆవిర్భావంతో అంబేడ్కర్ ఆశయాల ప్రచారానికి బలమైన వేదిక లభించింది. మూడు అగ్రవర్ణాలు తప్ప మిగిలిన 85 శాతం ప్రజలు బహుజనులే అనే నిర్వచనం కొన్ని ప్రాంతాల్లో గట్టిగానే పనిచేసింది. 1994 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాన్షీరామ్ –బీఎస్పీ ఒకదశలో ‘ఇప్పుడు వీస్తున్న గాలి’లా కనిపించింది. కానీ, ఎన్టీఆర్ ధాటికి అది నిలబడలేకపోయింది. రాష్ట్ర బిఎస్పీ నాయకులకు ఎన్నికల నిర్వహణ సామర్ధ్యం బొత్తిగా లేకపోవడమూ ఆ ఓటమికి ప్రధాన కారణం.

 

                        తన శిష్యురాలు మాయావతిని ముఖ్యమంత్రిని చేయడం కోసం మనువాదులంటూ తనే చిత్రించిన  బిజెపితో కాన్షీరామ్ జత కట్టడంతో  బిఎస్పీ ఆమోదాశం సన్నగిల్లడం మొదలయింది. అప్పుడప్పుడు బిజెపిని ప్రేమించి, అప్పుడప్పుడు ద్వేషించి ‘లోపట-బయట’ ఆటలతో మాయావతి  బిఎస్పీ ప్రతిష్టను దిగజార్చారు.

 

            2014 ఎన్నికల్లో వైయస్ జగన్ గాలి గట్టిగా వీస్తున్నట్టు కనిపించింది. జగన్ కు హిందూ క్రైస్తవ మతాల్లో ద్వంద్వ సభ్యత్వం వుంది. దానిని చూసి భయపడిన చంద్రబాబు – టిడిపి  జగన్ శిబిరం నుండి ఎస్సీ, క్రైస్తవ  ఓట్లను చీల్చడానికి కొందరు ఎస్సీ నాయకుల్ని ఎజెంట్లుగా నియమించారు. ఆ ఎజెంట్లు ఎవరూ? వాళ్ళ కార్యకలాపాల కోసం ఎన్ని నిధుల్ని కేటాయించారూ? చంద్రబాబు పాలనలో వాళ్ళు ఏఏ పదవులు పొందారు అన్నది రాజకీయ విశ్లేషకులకు ఇప్పటికీ మంచి పరిశోధనా అంశమే. సాక్ష్యాధారాలు ఇంకా శిధిలమైపోలేదు. ప్రజలకు అన్నీ తెలుసు! వాళ్లు చాలా తెలివైన వాళ్ళు. జేమ్స్ బాండ్ - ఓఓ7 ను మించిన గూఢాచారులు వాళ్ళు!.

 

            2019 ఎన్నికల్లోనూ చంద్రబాబు-టిడిపి మళ్ళీ అదే ఎత్తు వేసింది. తన పాలనకు వ్యతిరేక ఓటు (incumbency factor) జగన్ వైపుకు  పోకుండ అడ్డుకోవడానికి జనసేన పవన్ కళ్యాణ్ ను వాడారు. ఎస్సీ, క్రైస్తవ ఓట్లు  దారి మళ్ళకుండ అడ్డుకోవడానికి బిఎస్పీనీ వాడారు. నామినేషన్ల ఘట్టం ఆరంభమం అవుతుండగా జనసేన, బిఎస్పీల మధ్య హడావిడిగా పొత్తు కుదిర్చింది చంద్రబాబు మనుషులు. మొత్తం 175 స్థానాల్లో జనసేన 140 సీట్లు తను వుంచుకుని బిఎస్పీకి 21 స్థానాలు కేటాయించింది. ఈ ముక్కోణ గేమ్ తెలియని అమాయకపు వుభయ కమ్యూనిస్టులు మిగిలిన  సీట్ల కోసం ఈ కూటమిలో చేరారు. నాలుగు పార్టీలు కలిసి పోటీచేస్తే  ఈ కూటమికి మొత్తం రాష్ట్రంలో దక్కింది రాజోలు సీటు ఒక్కటే.

 

            బిఎస్పీ మీద ఆశలు పెట్టుకుని రెండు మూడేళ్ళ ముందే రంగంలోనికి దిగి ఎన్నికల సన్నాహాలు చేసుకున్న అంబేడ్కరిస్టులు రాష్ట్రంలో చాలా మంది వున్నారు. సీట్ల పంపకాలలో దాదాపు వాళ్లందరికీ అన్యాయమే జరిగింది. ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోకుండ రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ బిఎస్పి పోటీ చేసుంటే ఒకళ్ళిద్దరైనా గెలిచి వుండేవారు. అంతకన్నా ముఖ్యంగా ఓట్ల శాతం 4-5 మధ్య వుండేది.

 

             

 

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 8

-        డానీ

-         

వామపక్షాలు

 

            స్వాతంత్ర్యం వచ్చాక  జాతీయ కాంగ్రెస్ మిశ్రమ ఆర్థిక విధానాన్ని ఎంచుకుంది. పెట్టుబడిదారీ విధానం,  సామ్యవాదం రెండూ కలిసి జీవించాలనేది దీని అర్థం.  ఫ్యాక్టరీ కార్మికులు, వ్యవసాయ కూలీల పార్టీగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి రూపుదిద్దుకుంది.  సాయుధ పోరాట మార్గాన్ని విరమించి పార్లమెంటరి పంథాను చేపట్టాక ఆంధ్రరాష్ట్రంలో తొలిసారిగా  జరిగిన 1955 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ హోరాహోరీ వర్గ పోరాటాన్ని చేసింది.

 

            ఆ ఎన్నికల్లో 39.35 శాతం ఓట్లతో 119 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. క్రిషికార్ లోక్ పార్టీ  22 సీట్లతో రెండవ స్థానంలో నిలిచినప్పటికీ దానికి పడ్డ ఓట్లు 7.26 శాతం మాత్రమే. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు 15 సీట్లు మాత్రమే దక్కినా 31.13 శాతం ఓట్లు పడ్డాయి. ఓట్ల పరంగా, ప్రజల మద్దతు పరంగా  ద్వితీయ స్థానం కమ్యూనిస్టులదే.

 

            కాంగ్రెస్, టిడిపి, వైయస్సార్ సిపి, జనసేన వంటి ‘పాపులిస్టిక్’ పార్టీలకు ఒక సిధ్ధాంత ప్రాతిపదిక వుండదు. ఓట్లు రాలుతాయన్న ప్ర్తతి అంశాన్నీ అవి తమ ఎన్నికల ప్రణాళికల్లో చేర్చేసుకుంటుంటాయి. కమ్యూనిస్టు పార్టీలు అలా కాదు. వాటికి ఒక బలమైన సిధ్ధాంత పునాది వుంటుంది.  అది శ్రామికవర్గ దృక్పథం. అదే వాటికి ప్రాణం.

 

            కాంగ్రెస్ పొలిటికల్ మెనూ “అందరికీ అన్నీ” అనే పధ్ధతిలో విస్తరించడంతో స్వంత దృక్పథాన్ని స్వంత వ్యక్తిత్వాన్నీ, స్వంత అస్తిత్వాన్నీ కాపాడుకోవడం కమ్యూనిస్టులకు చాలా కష్టం అయిపోయింది. అయినప్పటికీ దేశరాజకీయాల్లో చాలాకాలం రెండవ అతిపెద్ద పార్టీగా సిపిఐ కొనసాగింది.

 

            1962లో ఈశాన్య సరిహద్దు (నేఫా) ప్రాంతం  మీదికి చైనా   దూసుకు రావడాన్ని సమర్ధించడంతో మొదలయిన కమ్యూనిస్టుల చారిత్రక తప్పిదాలు చిరకాల రాజకీయ ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ 1975లో విధించిన ఎమెర్జెన్సీని సమర్థించే వరకు కొనసాగాయి. ఆ తరువాత వామపక్షాల గ్రాఫ్ లో చలన సగటులు దిగువముఖంగా ప్రయాణించాయి. సిపిఐ, సిపిఐ – ఎంల రాజకీయ చరిత్రల్లో భిన్నత్వం వైవిధ్యం వున్నప్పటికీ ప్రస్తుతం ఆ రెండు పార్టీలకు ఏపి శాసనసభలో ఒక్క స్థానం కూడ లేదు. ఈ దుస్థితికి  కారణం ఏమిటో వామపక్ష పార్టీల నాయకత్వమేగాక, సామ్యవాద భావాలున్న వారు, అబిమానులు  సహితం ఓ సారి సమీక్షించుకోవాలి.     

 

            కమ్యూనిస్టు పార్టీల్లో కుటుంబ పాలన వుండదు. అదొక సానుకూల అంశం. అయితే; కుల ప్రాబల్యం వుంటుంది. ఇతర బూర్జువా పార్టీల్లో ప్రాబల్యాన్ని కొనసాగించే విభిన్న సామాజికవర్గాలే వామపక్షాల్లోనూ తమ  ప్రాబల్యాన్ని సమిష్టిగా కొనసాగిస్తుంటాయి.  ఎన్నికల్లోనూ అంతే. ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మాత్రమే  వామపక్షాలు  ఎస్టీ ఎస్సీ అభ్యర్ధుల్ని పోటీకి దింపుతాయి. మిగిలిన స్థానాల్లో  స్థానికంగా సామాజికవర్గ బలం వున్న అభ్యర్ధులకే పార్టి టిక్కెట్లు ఇస్తారు. కులమత వ్యవహారం ఇంత బాహాటంగా వుంటున్నప్పటికీ తమకు కులం మతం లేదని వామపక్షాలు బుకాయిస్తుంటాయి. ఇలాంటి బూటకపు ప్రకటనల్ని  అణగారిన కులాలు ఆమోదించవు. ఈ క్రమంలో వామపక్షాల నిజాయితీ మీద ప్రజలకు నమ్మకం సడలిపోతోంది.

 

            వర్గపోరు కేవలం ఆర్థిక రంగంలోనే వుండదు; సమస్త రంగాలలోనూ వుంటుంది. దేశంలో కులాల మధ్య, మతాల మధ్య వర్గపోరు కొనసాగుతున్నదన్న వాస్తవాన్ని వామపక్షాలు గుర్తించే స్థితి సమీప భవిష్యత్తులో కనిపించడంలేదు.

           

            కమ్యూనిజాన్ని ప్రపంచ మ్యాపు నుండి తొలగించడానికి  బహుళజాతి సంస్థలు ఎలాగూ ప్రపంచ బ్యాంకు కేంద్రంగా వ్యూహాలు పన్నుతుంటాయి. అదొక నిరంతర ప్రక్రియ. వాటిని ముందుగానే పసిగట్టి ప్రతివ్యూహాలతో తరిమికొట్టే నైపుణ్యాన్ని మన కాలపు వామపక్షాలు సమకూర్చుకోలేదు. రోగి చనిపోయాక విషాదంగా రోదించడంకన్నా రోగనిరోధక మందుల్ని కనిపెట్టాలనే వ్యూహం  వామపక్ష వ్యూహకర్తల్లో  లోపించింది.

 

            కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక వామపక్ష నాయకులు కమ్యూనిజానికి సంబంధించి ఉత్తేజకర వ్యాఖ్యానాన్ని చేసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటీ  కనిపించదు. అసలు వాళ్ళలో కొందరయినా  ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను చదివారా? అనే అనుమానం కలుగుతుంది. ప్రతి అంశంలోనూ బూర్జువావర్గానికి విరుధ్ధమైన విధానం కమ్యూనిస్టులకు వుండాలనే స్పృహ కూడ మనకు నేటి వామపక్షాల్లో కనిపించడం లేదు.

           

            ప్రజలు మునుపటిలా లేరనీ, కరప్ట్  అయిపోయారనీ, అన్యవర్గ ధోరణులు ప్రబలిపోయాయనీ, అత్యాశపరులుగా మారిపోయారనీ వామపక్ష ఎన్నికల వ్యూహకర్తలు తరచుగా అంటున్నారు.  ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని శ్రామికవర్గానికి అన్యవర్గ ధోరణుల్ని అలవాటు చేసిందే వామపక్షాలు.  వామపక్ష పార్టీల నాయకులే కాంగ్రెస్ నో, టిడిపినో, పవన్ కళ్యాణ్ నో నమ్ముకుని వాళ్ళను ఆకాశానికి ఎత్తేస్తుంటే ప్రజలు నేరుగా ఆ కాంగ్రెస్ నే, ఆ టిడిపినే నమ్మడం సహజం.  అది వామపక్ష నాయకులు నేర్పిన విద్యేకదా?

 

            ఈ ఎన్నికల పొత్తులవల్ల ఇతర పార్టీలను వామపక్షాలు ఏమేరకు ప్రభావితం చేశాయో మనకు తెలీదు. విచక్షణా రహితంగా పొత్తులు పెట్టుకోవడంతో ప్రత్యర్ధి పార్టీల ప్రభావం మాత్రం చాలా స్పష్టంగా  వామపక్షాల్లో కనిపిస్తున్నది. భ్రష్టాచారంతో పెట్టుకున్న రాజకీయ పొత్తులు సాంస్కృతిక పొత్తులుగా మారిపోతున్నాయి. శ్రీశ్రీ విశ్వనాధ సత్యనారాయణల మధ్య ఏకత్వాన్ని దర్శించే వరకు ఈ ప్రభావం సాగుతోంది. యుక్త వయస్సు దాటినవారు పరస్పర అంగీకారంతో  పెట్టుకునే వివాహేరత సంబంధాల్ని  రెండేళ్ళ  క్రితం సుప్రీం కోర్టు చట్టబధ్ధం చేసినపుడు ఆ తీర్పు మీద వామపక్షాలు కూడ విరుచుకుపడడం ఆశ్చర్యకరం. స్త్రీపురుష సంబంధాల్లో తాము ఫ్యూడల్ ‘పాతివ్రత్య’ వాదనను బలపరుస్తున్నామన్న స్పృహ కూడ వాళ్ళలో లోపింది.

 

            వామపక్ష నాయకులు తమ పార్టి ప్రయోజనాలను సాధించుకోవడంలోకన్నా ఇతర బూర్జువా పార్టీల ప్రయోజనాలను నెరవేర్చి పెట్టడంలో ఎక్కువ ఉత్సుకతను ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు ఏపిలో కమ్యూనిస్టు నాయకులు, అభిమానులు చేస్తున్న రాజకీయ వాదనలు వామపక్ష విధానాలను బలపరిచే బదులు టిడిపిని బలపరిచేవిగా వుంటున్నాయి.  అమరావతి వివాదం మీద నారాయణ, మధు ప్రకటనల్ని చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థం అవుతుంది. చంద్రబాబు రూపొందించిన పథకాల మీద వామపక్షాలకు భిన్నమైన దృక్పథం వుండాలా? వద్దా? టిడిపి చేయాల్సిన యుధ్ధాన్ని వామపక్షాలు తమ భుజాలకు ఎత్తుకోవడం ఆత్మహత్యా సదృశ్యం. క్రైస్తవ ద్వేషిగా మారిన చంద్రబాబును ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు చీదరించుకుంటున్నారు. ఇక ముందు వాళ్ళ నిరసన వామపక్షాల మీదకు కూడా వ్యాపిస్తే ఆ తప్పు ఎవరిదీ?

 

            “అమరావతి, పోలవరంల మీద తెలుగు దేశం కాన్సెప్ట్ ఇది. వైయస్సార్ సిపి కాన్సెప్ట్ ఇదీ. ఇవి రెండూ ‘బూర్జువా’ దృక్పధాలు. భద్రలోకాన్ని సంతృప్తిపరచే విధానాలు.  కమ్యూనిస్టులు ఈ దృక్పధాలనీ, ఈ విధానాలనీ  వ్యతిరేకిస్తారు. కమ్యూనిస్టులది అభద్రలోకాన్ని పరిరక్షించే కాన్సెప్ట్. అమరావతి మీద కమ్యూనిస్టుల కాన్సెప్ట్ ఇది” ...  అని చెప్పిన సందర్భం మనకు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా టిడిపి చేస్తున్న వాదననే యధాతధంగా ఇప్పటి వామపక్షాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రజల దృష్టిలో  టిడిపికి  వామపక్షాలకూ తేడాలేదు. తేడాయే లేనపుడు వామపక్షాలను ఎందుకు ఎంచుకోవాలనే సందేహం ప్రజలకు రావడం సమంజసమే. “కాంగ్రెస్‍ భూస్వాముల  పక్షం, కమ్యూనిస్టులు వ్యవసాయ కూలీల పక్షం” అని 1955 ఎన్నికల్లో చెప్పినంత కరాఖండిగా ఇప్పటి వామపక్షాలు చెప్పలేకపోతున్నాయి. “ధోభీ కా గధా నా ఘర్ కా నా ఘాట్  కా” అనే సామెతలా వామపక్షాల్ని ప్రజలూ నమ్మడం లేదు; పాలకులూ నమ్మడంలేదు.

 

            ఇప్పుడు వామపక్ష నాయకుల కాలమంతా సంఘటిత ఉద్యోగ వర్గాల జీతాలను పెంచడానికో, ఎన్నికల్లో పొత్తుల కోసం  వెంపర్లాడడానికో సరిపోతున్నది. ఎన్నికల్లో మాస్ హిస్టీరియా కమ్యూనిస్టులకు అనుకూలంగా ఎప్పుడూ పనిచేయలేదు. ఓ ఏడాదిపాటు రోజుకు రెండుసార్లు “పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి” అని ప్రకటనలు గుప్పిస్తుంటే  మాస్ హిస్టీరియా ఎలా పనిచేస్తుందీ? పోటీచేసిన రెండూ చోట్లా ఓడిపోయే ఓ ఛోటా నాయకుడ్ని మహానాయకునిగా ప్రచారం చేసే వామపక్షాల్ని నమ్మడానికి ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళా? ఇంతా చేసి సాధించింది ఏమిటీ? అరపావు శాతం ఓట్లా? తమకు ఎన్ని ఓట్లు పడబోతున్నాయో సర్వేలు జరిపి అంచనా వేసే సెఫాలజిస్టులు (ప్రజలనాడి చెప్పే నిపుణలు) సహితం వామపక్షాల్లో కనుమరుగైపోయారు.

 

            పవన్ కళ్యాణ్, మాయావతిలతో జట్టుకట్టకపోయినా సిపియం, సిపిఐలకు అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చేవి. స్వతంత్రంగా పోటీ చేస్తే ఏ పార్టీనయినా సరే విమర్శించే అవకాశం వస్తుంది. తాము చెప్పదలుచుకున్నది చెప్పే స్వేఛ్ఛ వస్తుంది. అంతిమంగా తమకంటూ ఒక అస్తిత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు వామపక్షాలు చేయాల్సింది  అదొక్కటే.

 

            గత 70 యేళ్ళ చరిత్ర చెపుతున్నదేమంటే మన వామపక్షాలకు సాయుధపోరాటం చేసే తెగువా లేదు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాణించే చొరవాలేదు. మినహాయింపులు ఎప్పుడూ వుంటాయి.

 

Wednesday, 20 January 2021

Eswar Allah Tere Naam - Kastur Ba Gandhi

 ఈశ్వర్ అల్లా తేరే నామ్ ! 




సౌదా అరుణ ఏదైనా రాసారంటే దానికి ఒక పరమార్ధం వుంటుంది. సౌదా రచనా శైలి కూడా నాకు నచ్చుతుంది. ‘నల్లగుర్రపు నాడా’ కథ చాలాసార్లు చదివించింది. 

ఈరోజు సౌదాఅరుణల  ‘150 సంవత్సరాల  కస్తూర్బాగాంధీ’ చదివాను. అమెరికాలో కార్ల్ మార్క్స్ ను, భారత దేశంలో మోహన్ దాస్ గాంధీనీ అధ్యయనం చేయడం వర్తమాన చారిత్రక సామాజిక  అవసరం. మర్రిచెట్టు వంటి గాంధీ నీడలో కస్తూర్బా వెలుగు ప్రపంచానికి ప్రస్రించలేదు. కస్తూర్బాకు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు ఈ చిన్నపుస్తకంలో వున్నాయి. 

Communal Harmony Volunteer గా మతసామరస్యం మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని ఓ ఏడాది కాలంగా అనుకుంటున్నాను. ఇటీవల రాజస్థాన్ బికనీర్ లో, మధ్యప్రదేశ్ భోపాల్ లో,ఉత్తర ప్రదేశ్ లో  వివాదం రేపిన లవ్ జిహాద్ కేసుల్ని గమనిస్తున్నాను. ‘150 సంవత్సరాల  కస్తూర్బాగాంధీ’ పుస్తకం చదివాక గాంధీజీ తల్లి పుత్లిబాయి ‘ప్రణామీ’ సాంప్రదాయానికి చెందిన వారని తెలిసింది. నా అధ్యయనం ఇంకో మెట్టు ఎక్కడానికి ఈ పుస్తకం తోడ్పడింది. 

సింధ్ సంస్థానానికి చెందిన శ్రీ దేవ్ చంద్రజీ మహరాజ్ 17వ శతాబ్దం ఆరంభంలో ‘ప్రణామీ’ మతసామరస్య సాంప్రదాయాన్ని ఆరంభించారు. జామ్ నగర్ కు చెందిన మహామతి శ్రీ ప్రాణ్ నాథ్ జీ ఆ తరువాతి కాలంలో  ‘ప్రణామీ’ సాంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. గాంధీజీ ప్రచారం చేసిన “ఈశ్వర్ అల్లా తేరే నామ్ – సబ్ కో సమ్మతి దే భగవాన్” కు మూలం  ఇప్పుడు స్పష్టమయింది.

సౌదాఅరుణలకు ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని మీరు తప్పక చదవండి. ఆసక్తిగలవారు 92471 50243 లో సంప్రదించవచ్చు.


Friday, 1 January 2021

Vyasa is Greater Screenplay Writer than Christopher Nolan

 Vyasa is Greater Screenplay Writer than Christopher Nolan

క్రిష్టోఫర్ నోలాన్ కన్నా వ్యాసుడు గొప్ప ‘స్క్రీన్ ప్లే రైటరు’

 -       డానీ 

స్క్రీన్ ప్లే అంటే ఏమిటీ? వాటికి ఏమైనా నియమనిబంధనలు వున్నాయా? అనే ఆసక్తి  ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. 

మునుపు సినిమా రంగంలోనే స్క్రీన్ ప్లే అనే మాట వినిపించేది. టీవీ,  షార్ట్ ఫిలిం రంగాలు విపరీతంగా విస్తరించాక స్క్రీన్ ప్లే నైపుణ్యానికి పెద్ద గిరాకి వచ్చింది. ఆస్కార్ లో స్క్రీన్ ప్లేకు రెండు అవార్డులు ఇస్తున్నారు; Best Original Screenplay, Best Adapted Screenplay. 

ఏ కళకైనా లక్ష్యం ఒక్కటే; భావోద్వేగాల్ని లక్ష్య సమూహానికి (Target Group) చేరవేయడం.  వాళ్లు పాఠకులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, శ్రోతలు కావచ్చు.  భావోద్వేగాల్ని పటిష్టంగా ప్రసారం చేయగలిగినపుడే కళా ప్రక్రియ ఆశించిన ఫలితాలను సాధిస్తుంది.   

సినిమా నిడివి రెండు నుండి రెండున్నర గంటలు వుంటుంది. ఏ మనిషి కూడ రెండున్నర గంటలు ఏకధాటిగ ఏడ్వనూలేడు నవ్వనూలేడు. అంచేత Target Groupకు రెండున్నర గంటల వ్యవధిలో విభిన్న భావోద్వేగాల్ని ప్రసారం చేయడం ఎలా? అనేది పెద్ద సవాలు. ఈ సవాలుకు సమాధానంగానే అనేక  స్క్రీన్ ప్లే  టెక్నిక్ లు వచ్చాయి. 

మనిషి శరీరంలో Dopamine,  Serotonin, Rines adrenaline, cortisol వంటి కొన్ని గ్రంధుల ఉత్పత్తిలో కలిగే  హెచ్చుతగ్గుల వల్ల ఆనందం, ఆగ్రహం, శోకం, భయం  వంటి భావోద్వేగాలు కలుగుతాయని శరీరధర్మ నిపుణులు అంటున్నారు. అంతెందుకు, lacrimal glands పని చేస్తేనే మనకు కన్నీళ్ళు వస్తాయి. సినిమాల్లో హాస్య విభాగాన్ని ఎంచుకునేవారు డోపమైన్  హార్మోన్ ను లక్ష్యంగా చేసుకుంటారు. హారర్, సస్పెన్స్ జానర్ ను ఎంచుకునేవారు  అడ్రెనలిన్ హార్మోన్ ను చురుగ్గా మారుస్తారు. సినిమాలో కరుణరసాన్ని పండించాలనుకున్నవారు లాక్రిమినల్ గ్లాండ్స్ కు పని చెపుతారు. వైద్య ఆరోగ్యరంగం ముందుకు తెస్తున్న అనేకానేక కొత్త నిర్ధారణల్ని కూడ స్వీకరిస్తే స్క్రీన్ ప్లే  టెక్నిక్ మరింతగా అభివృధ్ధి చెందుతుంది. 

స్క్రీన్ ప్లే అంటే కాగితం మీద సినిమా చూపించడం. సాంకేతిక భాషలో చెప్పాలంటే ఏ ఫ్రేము తరువాత ఏ ఫ్రేము రావాలో చెప్పడం. జేపెగ్ (JPG)లో వున్న ఫొటోలని ఎంపి4 (MP4)లో సెకనుకు 25 చొప్పున చూపిస్తే అదే మూవీ అయిపోతుంది. దాని పేరే చలన చిత్రం. ఒక్కొక్క సినిమాలో నిడివినిబట్టి లక్షన్నర నుండి, రెండున్నర లక్షల వరకు ఫ్రేములు వుంటాయి. ప్రతి ప్రేమూ ఒక దృశ్యమే; ఒక చిత్రమే. అందుకే స్క్రీన్ ప్లేను చిత్రానువాదం, దృశ్యానువాదం అంటున్నారు.  కథను మంచి స్క్రీన్ ప్లేతో నిర్మించినపుడే అది ప్రభావశీలంగా వుంటుంది. 

అయితే, ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన నియమం ఏమిటంటే, గొప్ప సినిమాల నుండే గొప్ప టెక్నిక్ పుడుతుంది. ఆ టెక్నిక్ మళ్ళీ మరికొన్ని గొప్ప సినిమాల సృష్టికి పనికి వస్తుంది. అందుకే స్క్రీన్ ప్లేలను అధ్యయనం చేయడం ఒక అవసరంగా  మారింది. 

సినిమాలకు మాతృక  నాటకం కనుక మన తొలి స్క్రీన్ ప్లే  నియమాలన్నీ నాటకరంగంలోనే పుట్టాయి. క్రీస్తు పూర్వకాలపు కాళిదాసు రాసిన నాటకాల్లో ‘మాళవికాగ్నిమిత్రము’,  ‘విక్రమోర్వశీయము’ కన్నా ‘అభిజ్ఞాన శాకుంతలము’ గొప్ప విజయాన్ని సాధించింది. ఈ నాటకాన్నే స్క్రీన్ ప్లేకు తొలి ప్రామాణికంగా పరిగణిస్తారు. స్క్రీన్ ప్లే రంగంలో కృషి చేయాలనుకున్నవాళ్ళు ముందుగా చదవాల్సింది ‘అభిజ్ఞాన శాకుంతలము’ నాటకాన్ని. దీని మూలం సంస్కృతంలో వున్నప్పటికీ 1889లో కందుకూరి వేరేశలింగం అనువాదం చేసిన తెలుగు కాపీ (1931 నాటి రెండవ ముద్రణ)  ఇప్పుడు అందుబాటులో వుంది. ఇంకా ఆసక్తి వున్నవాళ్ళు  ఎనిమిదవ శతాబ్దపు కవి భవభూతి రాసిన ‘ఉత్తర రామ చరిత్ర’ను కూడా పరిశీలించవచ్చు.  

అన్ని కళలు సమాజం నుండే పుట్టి తిరిగి సమాజానికి చేరుతాయి. కళకు ఆరంభమూ గమ్యమూ సమాజమే. ప్రదర్శన కళల్లో ఈ అనుబంధం నేరుగా ప్రత్యక్షంగా వుంటుంది. 

మనుషుల జీవితాల్లో సుఖదుఃఖాలు రెండూ వుంటాయి. నాటక రచయిత వాటిని గమనిస్తాడు. అనుభవిస్తాడు. వాటి మీద కొన్ని అభిప్రాయాలను కూడ ఏర్పరచుకుంటాడు. ఆ భావోద్వేగాలన్నింటినీ కొన్ని పాత్రలు సంఘటనల ద్వార వ్యక్తం చేస్తాడు. ఆ ప్రసారాల్ని అందుకున్న  ప్రేక్షకులు ఆ భావోద్వేగాల్ని తమ అనుభవంగానే భావించి అనుభూతి చెందుతారు.

  నాటకం ఒక దృశ్యకావ్యం. ప్రదర్శనకావ్యం, ప్రేక్షక కావ్యం, రూపకం అనేవి సాంప్రదాయిక అర్థంలో నాట్యానికి నాటకానికి పర్యాయపదాలే. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందిన భరతముని నాట్య లక్షణాలను రూపొందించాడు. అంతేగాక, రూపక నిర్మాణంలోని విభిన్న విభాగాలను, ఉపవిభాగాలను కూడ వివరించాడు. మన ఉపఖండపు స్క్రీన్ ప్లే సిధ్ధాంతవేత్తల్లో  భరతుడు ప్రముఖుడు.  ప్రధముడు అన్నా తప్పుకాదు.   

బమ్మెర పోతనామాత్యుని ‘శ్రీమదాంధ్రభాగవతం’ లోని ‘వామనచరిత్రము’లో వామనుడు త్రివిక్రముడిగా విశ్వరూపం దాల్చే సన్నివేశం వుంటుంది. ప్రాచీన తెలుగు సాహిత్యంతో  కొద్దిపాటి పరిచయమున్న వారికి కూడ గుర్తుండిపోయే రెండు గొప్ప పద్యాల్ని పోతన ఆ సన్నివేశంలో రాశాడు. 

వీటిల్లో మొదటిది “ఇంతై అంతై వటుడింతై …” అనే పద్యం.  “ఇంతైనాడు, మరింకింతైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుడికి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటినంతైనాడు, సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు” అనేది దీనికి (చీమలమర్రి బృందావనరావు) తాత్పర్యం. 

ఈ వరుసలో రెండవ పద్యం “రవిబింబంబుపమింప…”. ఈ పద్యలో వామనుడు ఎంతగా ఎదిగిపోయాడో సూర్యునితో పోల్చి చెపుతాడు పోతన. ముందు వామనునికి సూర్యుడు గొడుగులా వుంటాడు. తరువాత శిరోరత్నము అవుతాడు. ఆ పిదప చెవిపోగు అవుతాడు. ఇంకా కిందికి దిగి మెడలో హారం అవుతాడు. ఆ తరువాత దండకడియంగానూ, ముంజేతి కంకణంగానూ, మొలతాడులో గంటగానూ,  కాలి అందెయగానూ మారిపోతాడు. చివరకు త్రివిక్రమునిగా మారిన వామనుని కాలి కింద పీఠం అయిపోతాడు. ఈ క్రమంలో సూర్యుడికీ వామనునికీ మధ్యగల పరిమాణం నిష్పత్తి (ratio) పూర్తిగా మారిపోతుంది. మొదట్లో వామనుడు సూర్యుని పరిమాణంలో లక్షవ వంతు కూడ వుండడు. చివరకు వామనుడు సూరునికన్నా లక్ష రెట్లు ఎక్కువ వుంటాడు. అంటే ఎంతగా ఎదిగాడో ఊహించుకోవలసిందే. 

సినిమా చిత్రీకరణ భాషలో చెప్పాలంటే మొదటి పద్యంలో కెమేర ‘ఎక్స్ ట్రీమ్ టాప్- యాంగిల్’ లో మొదలయ్యి వామనుడి మీద పోకస్ చేస్తూ  ‘ఎక్స్ ట్రీమ్ లో-యాంగిల్’ కు టిల్ట్-డౌన్ అవుతుంది.  రెండవ పద్యంలో కెమేర ‘ఎక్స్ ట్రీమ్ లో-యాంగిల్’ లో మొదలయ్యి సూర్యుని మీద పోకస్ చేస్తూ  ‘ఏక్స్ ట్రీమ్ టాప్ యాంగిల్’ కు టిల్ట్-అప్  అవుతుంది. 

పాండవవనవాసం సినిమాలో హనుమంతుడు, భీముని మధ్య ఇలాంటి షాట్ ఒకటి వుంటుంది. సన్నివేశం మొదలయినపుడు భీముడు ఏనుగులా వుంటే హనుమంతుడు ఎలుకలా వుంటాడు. సన్నివేశం చివర్లో హనుమంతుడు ఆకాశమంత ఎదిగిపోతే అతని ముందు భీముడు పిపీలకంలా వుంటాడు.  ఈ సన్ని వేశానికి దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. కెమేరామేన్ రవికాంత్ నగాయిచ్.  పోతన వామనావతారం ఈ షాట్ కు ప్రేరణ అన్నా తప్పుకాదు.

 Christopher Nolan సినిమా Inception (2010)లో కొన్ని ఆశ్చర్యకర సన్నివేశాలుంటాయి. ఒకే సమయంలో, ఒకే పాత్రలు, మూడు భిన్నమైన ప్రదేశాల్లో, మూడు భిన్నమైన కాలాల్లో, మూడు భిన్నమైన చలన వేగాలతో ప్రవర్తిస్తుంటాయి. కొంచెం గమనిస్తే ఇలాంటి కథన ఎత్తుగడ మహాభారత రచనలోనూ కొన్ని చోట్ల  కనిపిస్తుంది.

జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెపుతున్న కథను, వేరే కాలంలో వేరే చోట శౌనకాది మహామునులకు సూతుడు చెపుతుంటాడు. భీష్మపర్వం మొదలయ్యాక ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర యుధ్ధ విశేషాలు చెపుతుంటాడు. అంటే, ఆ సన్నివేశంలో ఒకేసారి మూడుచోట్ల, మూడు కాలాల్లో story telling కొనసాగుతూవుంటుంది.

 స్క్రీన్ ప్లే విషయంలో మార్క్సిస్టులు సాధారణంగా వెసెవొలొద్ పుదోవ్ కిన్ (Vsevolod Pudovkin 1893-1953),  సెర్జీ ఐసెన్ స్టైన్ (Sergei Eisenstein 1898-1948) లను  ప్రస్తావిస్తుంటారు. వీళ్లిద్దరూ సినిమా సిధ్ధాంతవేత్తలు. మూకీ సినిమాల రోజుల్లోనే వాళ్ళు గొప్ప ప్రభావశీలమైన సినిమాలను నిర్మించారు. మాంటేజ్ టెక్నిక్ ని వాళ్ళిద్దరూ అద్భుతంగా అభివృధ్ధిచేశారు.  ఐసెన్ స్టైన్ నిర్మించిన ‘బ్యాటిల్ షిప్ ఆఫ్ పొటెమ్కిన్’  (1925), పుదోవ్ కిన్ నిర్మించిన ‘మదర్’ (1926) ఇప్పటికీ గొప్ప సినిమాలు.

 ఆయాదేశాల్లో టెక్నిక్ పెరగడానికి అక్కడొక సాహిత్య సాంప్రదాయం వుంటుంది. లాటిన్ అమెరికా ప్రాంతానికి  చెందిన కొందరు దర్శకులు ఇటీవల హాలివుడ్ లో మార్మిక వాస్తవికత  (మేజికల్ రియలిజం) ధోరణిని ప్రవేశపెట్టారు. అదేమీ గాలిలో పుట్టలేదు.  Jorge Luis Borges (1899), Gabriel García Márquez (1927-2014)ల కాలం నుండి లాటిన్ అమెరికా ప్రాంతంలో ఒక సాహిత్య సాంప్రదాయంగా మేజికల్ రియలిజం కొనసాగుతోంది.  మన దేశంలో టెక్నిక్ పెరగడానికి మనకూ ఒక సాహిత్య సాంప్రదాయం వుంటుంది. మనం ముందు దాన్ని అధ్యయనం చేయాలి.

 వచ్చిన చిక్కేమిటంటే విద్యాలయాల్లో పురాణాలనో, ప్రబంధాలనో బోధించే టీచర్లకు నవినగాయిచ్ ట్రిక్ ఫోటోగ్రఫీ గురించీ, క్రిష్టఫర్ నోలాన్ స్క్రీన్ ప్లేల గురించి తెలీదు.  క్రిష్టఫర్ నోలాన్ సినిమాల్ని రివ్యూ చేసేవారికి వ్యాసుడు, కాళిదాసు, భవభూతి, పోతన, తిక్కన వాడిన టెక్నిక్ గురించి తెలీదు. దానితో టెక్నాలజీ అంతా పశ్చిమ దేశాల్లోనే వుందని ఒకరు,  అసలు జ్ఞానం మొత్తం తూర్పు దేశాల్లోనే పుట్టిందని మరొకరు అర్థసత్యాలతో చెలరేగిపోతుంటారు. ఇది ప్రమాదకరం. ఒకరి గొప్పతనాన్ని మరొకరు గుర్తించి గౌరవిస్తే జ్ఞానమూ, విజ్ఞానమూ రెండూ ఇరువైపులా పెరుగుతాయి.

 రచన : 09 అక్టోబరు 2020

ప్రచురణ : సారంగ, అక్టోబరు

Monday, 28 December 2020

People's War - Unity & Struggle

 పీపుల్స్ వార్ తో ఐక్యత ఘర్షణ

ప్రపంచంలో ప్రతి అంశంలోనూ ఐక్యతా ఘర్షణలు వుంటాయి. అచ్చంగా ఐక్యత, అచ్చంగా ఘర్షణ అనేది వుండదు. నాకు పీపుల్స్ వార్ తో ఐక్యతా వుంది. ఘర్షణ కూడ వుంది.  

పేదరికం కష్టాలు కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు, వాటి మూలంగా మానసంబంధాల్లో ఏర్పడే ఘర్షణ, వాటి నుండి బయటపడడానికి పడే ఆరాటం అన్నీ  నాకు బాల్యం నుండే వున్నాయి. వీటన్నింటికీ మూలాలు మన సమాజ నిర్మాణంలోనే వున్నాయనీ, మన బతుకులు మారాలంటే ముందు సమాజం మారాలనీ తొలుత సిపిఐ ప్రజాసంఘాలతో పరిచయాల దశలోనే తెలిసింది. సమాజాన్ని మార్చకుండ సమస్యల నుండి మనుషులు బయటపడలేరనీ, దాని కోసం పోరాటం చేయక తప్పదని సివోసి / పీపుల్స్ వార్ లో చేరాకే నాకు అర్థం అయింది. ఆ పోరాటం సాయుధంగా సుదీర్ఘంగా సాగుతుందనేది మా అవగాహన. 

నా ఆవేశాన్ని, సాహస గుణాన్నీ సద్వినియోగం చేసుకోవడం నేర్పింది అప్పటి పీపుల్స్ వార్ కృష్ణాజిల్లా నాయకుడు వాసిరెడ్డి కృష్ణారావు. ఆయన నాకు తొలి రాజకీయ గురువు. నా జీవితానుభవానికి ఒక ప్రాపంచిక దృక్పథాన్ని జోడించడం నేర్చుకున్నది పీపుల్స్ వార్ శిబిరంలోనే. నా ఆగ్రహాన్నీ, ప్రేమనూ ఎవరికి ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో నేర్చుకున్నదీ అక్కడే. 

చారూమజుందార్  రచనలు చాలా ఉత్తేజాన్ని ఇచ్చాయి. అయితే ఆయన్ని నేను ఎన్నడూ చూడలేదు. కొండపల్లి సీతారామయ్య పొలిటికల్  క్లాసులు, ప్రసంగాలూ, రచనలు నాకు అలాంటి ఉత్తేజాన్ని ఇచ్చేవి. నేను ఇప్పటివరకు ప్రత్యక్షంగా కలిసిన గొప్పవాళ్ళలో గొప్పవాడు కొండపల్లి సీతారామయ్య. కేజీ సత్యమూర్తితో కొన్నాళ్ళు సన్నిహితంగా వున్నాను. ఆయన మన కాలపు మహాకవి. 

ముందు నేను 1978లో  సివోసిలో చేరాను. సివోసి రద్దు అయి మరో పార్టీతో కలిసి 1980లో పీపుల్స్ వార్ గా మారింది. కృష్ణాజిల్లాతో పాటూ వుభయగోదావరి జిల్లాల ప్రాంతీయ కమిటీలో బరువైన బాధ్యతల్నే నిర్వర్తించాను. పీపుల్స్ వార్ నాకు నచ్చినంత కాలం అందులో వున్నాను. క్రమంగా అందులో బ్యూరాక్రటికి ధోరణి పెరిగింది. దాన్ని అప్పుడే విమర్శించాను. 1989 ఎన్నికల తరువాత పీపుల్స్ వార్ నాకు అస్సలు నచ్చలేదు. అందులో బ్యూరాక్రటిక్ ధోరణి భరించలేనంతగా పెరిగిపోయింది. 1990లో పూర్తిగా బయటికి వచ్చేశాను. అయితే,  దాని మీద కొంత కాలం ఒకరకం గౌరవం కొనసాగింది.  మనం పుట్టిన ఊరి మీద, మనం పని చేసిన పార్టి మీద మనకు ఒకరకం భావోద్వేగం వుంటుంది. ఇదీ అలాంటిదే. 2004లో పీపుల్స్ వార్ రద్దు కావడంతో ఆ చివరి అనుబంధం కూడా తెగిపోయింది.

 

పీపుల్స్ వార్ జత కలిసిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ మీద నాకు ఎన్నడూ సదభిప్రాయంలేదు. నక్సల్ బరీ పంథాలో ప్రజా సంఘాలను జత చేసిన ఘనత పీపుల్స్ వార్ కు వుండేది.  ఎంసిసి ప్రజా సంఘాలకు వ్యతిరేకం. అది అతివాద పార్టి. ఆ పార్టి పెట్టిన షరతుల మేరకు పీపుల్స్ వార్ తన ప్రజా సంఘాలను కూడ రద్దు చేసుకుంది. అది చాలా స్పష్టంగా వెనకడుగు అని నా అభిప్రాయం.

 

2004లో కొత్తగా ఏర్పడిన సిపిఐ మావోయిస్టు పార్టి తాత్విక రంగంలో గానీ, సామాజిక రంగంలోగానీ, ఉద్యమ విభాగంలోగానీ గత పీపుల్స్ వార్ తో పోలిస్తే కొత్తగా  ఆవిష్కరించిన అంశం ఒక్కటంటే ఒక్కటీ నా దృష్టికి రాలేదు. అంచేత నేను ఎన్నడూ మావోయిస్టు పార్టీని పట్టించుకోలేదు.

 

ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు  ప్రస్తావిస్తున్నారని కొందరు అడుగుతున్నారు. నిన్న రాత్రి నెల్లూరు రాజశేఖర్ – విశ్లేషణలో డా. కె. విజయకుమార్ ప్రసంగాన్ని విన్నాను.  వారు తమ ప్రసంగంలో పీపుల్స్ వార్ ప్రస్తావన అనేక సార్లు చేశారు. సామాజిక అంశాల మీద ఆ పార్టి అవగాహనను గొప్పగా వివరించారు. కానీ సిపిఐ మావోయిస్టు ప్రస్తావన ఎక్కడా చేయలేదు. అంచేత వారి ఉపన్యాసం గతానికి సంబంధించింది అనిపించింది. అది ముగిసిన అధ్యాయం అని చెప్పడం అవసరం అనుకున్నాను. డా. కె. విజయకుమార్ ఇప్పుడు పీపుల్స్ వార్ ను పునరుధ్ధరించ దలిస్తే అది వేరే విషయం.

 

నేను ముస్లిం సామాజిక వర్గంలో పుట్టాను. ముస్లిం సామాజికవర్గ ప్రతినిధిగానూ భావిస్తాను. నేను దేవుడ్ని నమ్ముతాను. మార్ క్సిస్టులు మతం పేరుతోసాగే  దోపిడిని వ్యతిరేకించాలిగానీ  మత విశ్వాసాలని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. చనిపోయాక కామ్రేడ్స్‍ చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్యలను దహనం చేశారు; ముజఫర్ అహ్మద్, మగ్ధూం మొహియుద్దీన్, ఎంటీ ఖాన్, ఎస్ ఎం రవూఫ్ తదితరుల్ని ఖననం చేశారు. అంటే ఆ కామ్రేడ్లకు చనిపోయాక మతం వచ్చింది. ఇవన్నీ వాళ్ల కుటుంబీకులు చేసిన అంత్యక్రియలుకావు. పార్టీలు జరిపించిన అంత్యక్రియలు. తేడా ఒక్కటే భౌతిక కాయం మీద ఎర్రజెండా కప్పుతారు. ఖననం ఖననం ఖననమే. దహనం దహనమే. చివరకు కార్ల్ మార్ క్స్ ను కూడ యూదుల శ్మశానంలోనే ఖననం చేశాడు ఏంగిల్స్. మార్ క్స్ ఏంగిల్స్ కన్నా గొప్ప మార్ క్సిస్టులు మన కాలంలో వున్నారనుకోను.  

పీపుల్స్ వార్ అధ్యాయాన్ని నేను ముగించలేదు. ఆ పార్టీయే తన అధ్యాయాన్ని తానే ముగించుకుంది. ఒక పార్టీలో వున్నా లేకున్నా స్వతంత్ర  మార్ క్సియన్లు చాలా మంది వుంటారు. నేను ఆ కోవకు చెందుతాను. మార్ క్సిస్టుగా వుండడం నాకు ఇష్టం. చాలా మంది కమ్యూనిస్టు, మావోయిస్టు అభిమానులమనే  పేరుతో   పిచ్చి భాషల్లో మాట్లాడుతుంటారు. మార్ క్సియన్ భాషలో మాట్లాడేవారితో సంవాదానికి  నేను ఎప్పుడూ సిధ్ధమే.


Friday, 25 December 2020

Mohan- Chittaprasada of Our Times

Mohan- Chittaprasada of Our Times

మనకాలపు  చిత్తప్రసాద్  మోహన్

డానీ



 


చిత్రకారుడు  మోహన్ గురించి గత  మూడేళ్ళుగా అనేక మంది అనేక వ్యాసాలు రాశారు. ఈరోజు మోహన్ కళాసేవల విస్తృతి గురించి  మాట్లాడుకుందాము.

మోహన్ చనిపోయిన రోజు (21 సెప్టెంబరు 2017) ఆంధ్రజ్యోతి కోసం రాసిన వ్యాసంలో తనను ‘మన కాలపు చిత్త ప్రసాద్’ అన్నాను. ఈ సభానిర్వాహకులు తాడి శకుంతల, కాగితాల రాజశేఖర్ అప్పటి నా వ్యాఖ్యానాన్నే ఆహ్వానపత్రానికి శీర్షికగా స్వీకరించడం సంతోషంగా వుంది.

 

చిత్త ప్రసాద్ కు ఒక సౌలభ్యం వుంది. ఆయన ప్రధానంగా వుమ్మడి కమ్యూనిస్టు పార్టీతో వున్నాడు. కమ్యూనిస్టు పార్టి పార్లమెంటరీ పంథాను స్వీకరించాక ఆయన దానికి దూరమయినా 1978లో చనిపోయే వరకు శ్రామికుల చిత్రకారునిగా కొనసాగాడు. అలా చిత్తప్రసాద్ చిత్రాలు స్థూలంగా  ఒకే అంశంతో వుంటాయి.

 

విఖ్యాత కథకుడు గై డి మొపాసా నిజానికి ఓ పది పదిహేనేళ్ళు మాత్రమే రచనలు చేశాడు. 1870ల నాటి ఫ్రాంకో-ప్రష్యన్ యుధ్ధాలే ఆయన కథలకు నేపథ్యంగా వున్నాయి. ఇంకో ప్రఖ్యాత కథకుడు సాదత్ హసన్ మంటో కథలకు కూడ నేపథ్యం భారత దేశవిభజనే. మోహన్ కాన్వాస్ అలా homogeneous కాదు.

 

ఆంధ్రప్రదేశ్ లోనేగాక జాతీయంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ 1970-2020 మధ్య కాలం ఒక కల్లోల యుగం. కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు ఓ 40-ప్లస్ అయ్యాయి. అనేకానేక అస్తిత్వవాద ధోరణులు తలెత్తాయి. తూర్పు యూరప్ తో పాటూ ఏకంగా కమ్యూనిస్టుల ‘మక్కా’ రష్యాలోనే సోషలిస్టు వ్యవస్థ పతనమైంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావంతో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (LPG) ఆర్థిక విధానాలు పడకగదుల్లోనూ వచ్చేసి కవులూ, కళాకారులు, ఆలోచనాపరులకు  కొత్త సమాళ్ళు విసిరాయి.

 

మోహన్ ఈ సవాళ్ళను స్వీకరించాడు. కమ్యూనిస్టు పార్టీలు, వాటి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలకేకాక దళిత మహాసభ, మాదిగ దండోర,   మాల మహానాడు, ఆదివాసులు, స్త్రీవాదులు, మైనార్టివాదులు, మలి దశ తెలంగాణ  ఉద్యమం వగయిరాలు అన్నింటికీ తన క్రోక్విల్ సేవలు అందించాడు. మోహన్ చిత్రాలు వైవిధ్య భరితం; heterogeneous. వేదికల మీద మాట్లాడేది నల్లమల గిరిప్రసాద్, కొరటాల సత్యనారాయణ, సురవరం సుధాకర రెడ్డి, కాళోజీ నారాయణరావు, వరవరరావు, బాలగోపాల్, కత్తి పద్మారావు, మంద కృష్ణ మాదిగ, కేసిఆర్ కావచ్చు. ఆ వేదికలన్నింటి వెనుక మోహన్ సృష్టించిన బ్యాక్ డ్రాప్ లే వుండేవి.

 

కార్ల్ మార్క్స్ ఒక సందర్భంలో “లార్డ్ బైరన్ ఆలోచనలు ప్రమాదకరమైనవిగాబట్టి అతను 36వ ఏట చనిపోయినందుకు మనం ఆనందించాలి. పెర్సీ బైషే షెల్లీ సామ్యవాద ఆలోచనలు గలవాడు కాబట్టి అతను 29వ ఎట చనిపోయినందుకు మనం బాధపడాలి” అన్నాడు.  మంచి మనిషి కాకుండ ఎవరూ గొప్ప కళాకారులు, ఆలోచనాపరులు కాలేరు.

 

కమ్యూనిస్టు పార్టీల్లోనో, వాటి అనుబంధ సంస్థల్లోనో సభ్యులుగా వున్నంత మాత్రానా మనుషులు కమ్యూనిస్టులు అయిపోరు. వర్తమాన సమాజంలో  కమ్యూనిస్టులుగా చెప్పుకునేవాళ్ళలో ఎక్కువ మంది బూటక స్వభావులు. Hippocrates. జీవితంలో ఎన్నడూ కమ్యూనిస్టులుగా బతికినవారుకాదు; కమ్యూనిస్టు నీతి నియమాలను పాటించినవారూ కాదు. మన మధ్య కమ్యూనిస్టుగా బతికిన బహుకొద్ది మందిలో మోహన్ ఒకడు. కమ్యూనిస్టు అంటే వున్నంతలో కమ్యూన్ జీవితాన్ని గడపాలి. మనం సాటి ‘కామ్రేడ్’ ‘కమ్యూనిస్టు’ అనుకుని పలకరించడానికి వెళితే వాళ్ళు లివింగ్ రూమ్ లోనే కాఫీ టీ ఇచ్చి వెనక్కి పంపించేస్తే ఒళ్ళు మండదూ? ఆ పని కమ్యూనిస్టేతరులు చేస్తారు. అదే పని వీళ్ళూ చేస్తే ఎలా? మరి కమ్యూనిస్టులు అందుకు భిన్నంగా ఏం చేయాలీ?

 

చనిపోవడానికి ముందు మోహన్ ఓ 10-15 యేళ్ళు ఓ కమ్యూన్ ను నడిపాడు. ఎవరయినా సరే అందులోనికి ప్రవేశించవచ్చు. నేరుగా వంట గదిలోనికి పోవచ్చు. స్వయంగా వండుకొని తినవచ్చు. వండింది ఇతరులకు కూడ వడ్డించవచ్చు. 

 

గ్రామాల్లో ఓ గీత గీయగానే తమలో ఓ చిత్రకారుడు వున్నాడని భావించిన ప్రతి ఒక్కడూ బస్సో రైలో ఎక్కి మోహన్ కమ్యూన్ లో వాలిపోయేవారు. మోహన్ కమ్యూన్ లో చేరాక గీత నేర్చుకున్నవారూ వున్నారు. ఆ రోజుల్లో హైదరాబాద్ లో వేమన వసంత లక్ష్మి, వాసిరెడ్డి శరత్ కూడా తమదైన పధ్ధతుల్లో కమ్యూన్ లు నిర్వహించేవారు. మోహన్ కమ్యూన్ కు శ్రామికవర్గ సంస్కృతి ఎక్కువగా వుండేది. మమ్మ మాస్ !

 

 1980 – 96 మధ్య కాలంలో విజయవాడ సున్నపు భట్టీల సెంటరులో మా ఇల్లు కూడ ఒక కమ్యూన్ గా వుండేది. 11 ద్వారాలున్న ఇల్లు అయినా ద్వారాలు, కిటికీలకు తలుపులు వుండేవి కావు. కామ్రేడ్స్ లోపలికి రావడానికి అడ్డంకులు లేవు. కామ్రేడ్స్  అర్థరాత్రి వచ్చి భార్యాభర్తలు పడుకునివున్న  మంచాన్ని చడీచప్పుడు కాకుండ దాటి వంట గదిలోనికి వెళ్ళి  మైదా ఉడికించుకుని వెళ్ళిపోయేవారు. నిరంతరం ఓ ఇద్దరు (కొన్నిసార్లు అంతకు మించి)  శాశ్విత అతిథులుగా వుండేవారు. “ద్వారములు తెరిచియే వున్నవి”.

 

గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ గొప్పతనం ప్లేటోకు గురువుకావడం. ప్లేటో గొప్పతనం అరిస్టాటిల్ కు గురువుకావడం. శిష్యుల సృష్టి కూడ గురువుల గొప్పతనానికి ఒక కొలమానం.
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో  గొప్ప చిత్రకారులుగా వున్నవారి జాబితా తీస్తే వారిలో చాలా మంది మోహన్ కమ్యూన్ నుండి వచ్చినవారే అయ్యుంటారు. మొహన్ గొప్పదనానికి అదొక కొలమానం.  ఈ కమ్యూన్ లో అనేకమంది కవులూ కళాకారులూ తమ నైపుణ్యాలకు పదును పెట్టుకున్నారు.

 

రష్యాలో బోల్షివిక్ విప్లవం 1917లో విజయవంతమైంది. అప్పట్లో అమెరికాలోనూ బోల్షివిక్ అభిమానులు వుండేవారు. వాళ్ళలో చాలా మందిని  అక్కడి  ప్రభుత్వం అరెస్టు చేసి జైళ్ళలో పడేసింది. విఖ్యాత  రచయిత జాక్ లండన్ అప్పట్లో రాడికల్ సాహిత్య సమూహం ‘ద క్రౌడ్’ లో చురుగ్గా వుండేవాడు.  తను సృష్టించిన నవలలేగాక, స్క్రిప్టు రాసిన సినిమాలు కూడా హాలీవుడ్ లో భారీ విజయాలను సాధించడంతో జాక్ లండన్ సంపన్నుల జాబితాలో చేరిపోయాడు. అరెస్టు అవ్వాల్సిన జాబితాలో అతని పేరు కూడ వుందిగానీ ఆనాడు ప్రపంచ వ్యాప్తంగా జాక్ లండన్ కు వున్న  ప్రజాదరణ రీత్యా ప్రభుత్వం జంకింది.

 

1908 నాటి జాక్ లండన్ నవల ‘ఉక్కుపాదం’ (The Iron Heel) ఒక తిరస్కార సమాజాన్ని (dystopian) చిత్రిస్తుంది. నవల చివర ఒక ఆదర్శ సమాజాన్ని (utopian) సూచిస్తుంది. నిజజీవితంలోనూ జాక్ లండన్ కు అలాంటి ఆదర్శధామ ఆలోచనలు వుండేవి. వాటిని సాకారం చేయడానికి ఒక సువిశాల వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశాడు.  అందులో ఒక ఎస్టేట్ నిర్మాణం మొదలెట్టాడు. “మన కలల సామ్యవాద సమాజం ఏర్పడడానికి ఇంకా సమయం పట్టవచ్చు. మనమేమీ నిరాశ చెందవద్దు. మీరు జైళ్ళ నుండి విడుదలయ్యాక నేరుగా నా ఎస్టేట్ కు వచ్చేయండి. అక్కడ సామ్యవాద జీవితాన్ని గడుపుదురుగాని. మనం ఒక దేశాన్ని విముక్తి చేయలేకపోవచ్చు; కానీ ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కమ్యూన్ గా మార్చలేమా” అనే అర్థం వచ్చేలా సోషలిస్టు ఖైదీలకు 1916లో ఉత్తరాలు రాశాడు. ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు భారీ అగ్నిప్రమాదం జరిగి ఆ ఎస్టేట్ కాలిబూడిదయిపోయింది. సామ్యవాద సమాజం కోసం తను కన్న చివరి కల కూడ చితికిపోవడంతో ఆ రాత్రే జాక్ లండన్ ఆత్మహత్య చేసుకున్నాడు.

 

ఇప్పుడు జాక్ లండన్ ప్రస్తావన తేవడానికి ఒక ప్రత్యేక కారణం వుంది. సమాజంలో ఆలోచనాపరులు, కవులు కళాకారులు, యాక్టివిస్టులు తగ్గిపోతున్నారనీ, వున్న కొద్దిమంది కూడ  వలసపోతున్నారనీ, ప్రభుత్వంలో చేరిపోతున్నారనీ  ఇటీవల చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆవేదన సమంజసమైనదే గానీ ఈ ఆరోపణలో ఒక నిజాయితీ లోపం వుంది. ఆలోచనాపరులు, కవులు కళాకారులు, యాక్టివిస్టులు ఉత్సాహంగా పనిచేయడానికి అనువైన వాతావరణాన్ని మనం కల్పిస్తున్నామా? అనేది సామ్యవాద అభిమానులు ఆలోచించుకోవాలి.

 

ఆలోచనాపరులు స్వభావరీత్యానే అనేక అవకాశాల్ని (advantages) కోల్పోతుంటారు. వాళ్ళకు కొన్ని గౌరవాలు (privileges) అయినా మనం సమకూర్చుతున్నామా? గతంలో కవులూ కళాకారులు కలిసినపుడు స్తోమత కలిగినవాళ్ళు వాళ్ళకు పుస్తకాలు కొనిపెట్టేవారు. భోజనం-వసతి కల్పించేవారు. వాళ్ళ ప్రయాణాలకు చేతనైన సహాయం చేసేవారు. వాళ్ళ రచనల ప్రచురణకు తోడ్పడేవాళ్ళు. అందుకే ఆ రోజుల్లో అంతమంది ఆలోచనాపరులు, కవులు కళాకారులు, యాక్టివిస్టులు వుండేవారు. మనం మన కర్తవ్యాలను నిర్వర్తించడం మానేశాం. సానుకూల వాతావరణం లేకపోవడంతో వాళ్లు తగ్గిపోయారు. ఇప్పుడు మనమే వాళ్లు తగ్గిపోయారని నిందిస్తున్నాం. ఏది కారణం? ఏది కార్యం? నారువేయకుండ, నీరు పోయకుండ పంట దిగుబడి రావాలంటే ఎలా వస్తుందీ? 

1970ల చివర్లో 1980ల ఆరంభంలో విజయవాడలో ఒక గొప్ప సానుకూల వాతావరణం వుండేది. మోహన్, పతంజలి, నేను, ఖాదర్, గౌస్, విశ్వేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, సురేంద్రలు యువతరం. పెద్దిభట్ల సుబ్బరామయ్య, వేగుంట మోహన్ ప్రసాద్, సోదుం రామ్మోహన్, పి. రామకృష్ణారెడ్డి,  టిఎల్ కాంతారావు మా పైతరం, మహీధర రామ్మోహన రావు, కంభంపాటి సీనియర్ ఆ పైతరంగా వుండేవాళ్లం. మూడు తరాలు కలిసి వుండడంవల్ల మామధ్య ఒక సహజ అనుబంధం (organic link) ఉండేది. సమిష్టి జ్ఞానసముపార్జన  స్థాయి గొప్పగా వుండేది. సోషల్ కేపిటల్ అంటే కులం నుండి, వంశం నుండి సంక్రమిస్తుందని చాలా మంది అనుకుంటారు. మనం నివశించే పట్టణాల నుండి, మనం తిరిగే సమూహాల నుండి కూడ సోషల్ కేపిటల్ సమకూరుతుంది. 

తరువాతి కాలంలో ఊసా, ఎన్ వేణుగోపాల్, వసంతలక్ష్మి, త్రిపురనేని శ్రీనివాస్, కే శ్రీనివాస్, కే బాలగోపాల్, సతీష్ చందర్, ప్రసేన్, అఫ్సర్, బిఎస్ రాములు, అల్లం నారాయణ తదితరులు కూడ విజయవాడకు నివాసాన్ని మార్చుకున్న సందర్భాలున్నాయి. అప్పట్లో విజయవాడ మీడియా సెంటర్ కావడంవల్ల వాళ్ళొచ్చారు అనవచ్చుగానీ అదొక్కటే కారణంకాదు. విజయవాడలో ఆలోచనాపరులకు ఆదరణ గొప్పగా వుండేది. మా సమూహానికి నాగేంద్ర ప్రెస్ బాబూరావుగారు చాలాకాలం ఒక ఆశ్రయంగా వుండేవారు. అప్పుడుకదా విజయవాడను ప్రేమించ బుధ్ధి వేసేదీ? అలాంటి పాత్రని ఇప్పుడు శ్రీశ్రీ విశ్వేశ్వరరావు నిర్వహిస్తున్నట్టున్నాడు.

 

ఒకటి మాత్రం నిజం. మనం కమ్మర్షియల్ బతుకు బతికితే మన చుట్టూ కమ్మర్షియల్ కళాకారులు వుంటారు. మనం కమ్యూన్ బతుకు బతికితే మన చుట్టూ కమ్యూనిస్టు కళాకారులు వుంటారు.  

 

మారుతీనగర్ లోని దాసరి శిరీష ఇంట్లో 1978 చివర్లో నేను మోహన్ ను మొదటిసారి కలిశాను. అది యాధృఛ్ఛికంగా చిత్తప్రసాద్ చనిపోయిన సంవత్సరం. అప్పుడు నా వయస్సు 27. తను నాకన్నా ఓ ఏడాది మాత్రమే పెద్ద. అయితే, ఓ సీనియర్ కార్మిక నాయకుని కొడుకు కావడంవల్ల ఇంటా బయట కమ్యూనిస్టు పార్టి వాతావరణంలో పెరిగాడు. జాతీయ (అంతర్జాతీయ?) యవజనోత్సవాలకు కలకత్తా వెళ్ళి వచ్చాడు. అక్కడ అరెస్టు కూడా అయ్యాడు. ఈ నేపథ్యంలో తన ఆలోచనల విస్తృతి మాకన్నా  విశాలంగా వుండేది.  

 

నేను అప్పట్లో రాడికల్ యూత్ లీగ్ కు కృష్ణా జిల్లా అధ్యక్షునిగా వుండేవాడిని. నరసాపురం అనే ఓ సముద్రపుగట్టు చిన్న పట్టణం నుండి వచ్చినవాడిని. అంచేత నా మదర్ బోర్డు, ర్యామ్ రెండూ విజయవాడతో పోలిస్తే చిన్నవి.  అయితే, ఎదుటి వ్యక్తిలోని బలమైన అంశాన్ని కనిపెట్టగలిగే కొన్ని తెలివితేటలు కూడ నాకు వుండేవి. ఆర్టిస్టుగా మోహన్ కు అది ఆరంభదశ. విపరీతంగా పుస్తకాలు చదివేశాడు. అది అతని స్ట్రాంగ్ పాయింట్.  పరిచయం అయిన రెండోరోజే ఒక విన్నపం చేశాను. “మాలాంటి కార్యకర్తలకు రోజూ ఏవో పార్టి పనులుంటాయి. అదే పనిగా పుస్తకాలు చదవడం అస్సలు కుదరదు. అలాగని పుస్తకాలు చదవకపోయినా అస్సలు కుదరదు. అంచేత నాకు ఒక హెల్ప్ చేయి. నువ్వు పదిపుస్తకాలు చదివినపుడు వాటిల్లో ల్యాండ్ మార్క్ పుస్తకాన్ని సెలెక్ట్ చేసి  నాకు చెప్పు. అది నేను చదువుతాను. టెన్ ఈస్టు ఒన్!” అన్నాను. “అదేం పెద్ద పనబ్బా” అన్నాడు. అలా ఆ కాలంలో మోహన్ చెప్పిన ల్యాండ్ మార్క్ పుస్తకాలన్నీ చదివి నేను వుంటాను. బుక్ రీడింగ్ లో బ్రహ్మజ్ఞానాన్ని పొందకపోయినా స్నాతకోత్సవం జరిగింది అనిపించుకున్నాను.  మోహన్ స్కూల్లో ఈ ‘క్రాష్ కోర్స్’ పుణ్యమా అని పుస్తకాలు చదవడంలో నేను ఓ పదేళ్ళు ఆదా చేయగలిగాను.

 

“నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్” అంటాడు గిరీశం. మోహన్ తో సినిమా చూడడం కూడ ఒక ఎడ్యుకేషన్.  హాలివుడ్ నటి ఆడ్రీ హెప్ బర్న్  (Audrey Hepburn) అంటే మోహన్ కు చాలా ఇష్టం. ఆమె నటించిన ‘మై ఫెయిర్ లేడీ’, ‘రోమన్ హాలీడేస్’ ను మోహన్ తో కలిసి చూశాను. బెర్నార్డ్ షా 1913లో రాసిన ‘పిగ్మాలియన్’ నాటకాన్ని  ‘మై ఫెయిర్ లేడీ’ పేరుతో సినిమాగా తీశారు. ఆ నాటకాన్ని నేను చదవలేదు. మోహన్ రన్నింగ్ కామెంట్రీ సహితంగా ఆ సినిమాను చూడడంవల్ల ఆ నాటకం చదివినంత జ్ఞానం వచ్చేసింది.

 

ప్రసంగాన్నీ చిత్తప్రసాద్ తో మొదలెట్టానుగాబట్టి చిత్తప్రసాద్ తోనే ముగిస్తాను. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్న రైతులకు సంఘీభావాన్ని తెలపడానికి ఇటీవల నేను ఢిల్లీ వెళ్ళాను. నా చిరకాల మిత్రుడు బిబిజి తిలక్ నాకు స్థానికంగా సహకరించాడు. తను ఇటీవల సర్రియలిస్టిక్ పెయింటింగ్స్ వేస్తున్నాడు. ఆ సింఘూ బోర్డర్ లో, గాజీపూర్ బోర్డర్ లో రైతు ఆందోళనకారులతో వున్నంత సేపూ నాకు చిత్తప్రసాద్, మొహన్ లే గుర్తుకు వచ్చారు. వాళ్ళయితే ఈ చారిత్రక ఘట్టాన్ని ఎలాంటి చిత్రాలుగా మలిచేవారనే ఆలోచనలు వెంటాడాయి.

 

చిత్తప్రసాద్ చిత్రాలకూ మోహన్ చిత్రాలకూ చాలా పోలికలు కనిపిస్తాయి. అదే ఆవేదన; అదే ఆర్తి; అదే ధిక్కారం; అదే ప్రతిఘటన, అదే తిరుగుబాటు; బానిస సంకెళ్ళను తెంచుకోవడం, బలిష్టంగా భారీ కాయులైన రైతులు, చీమలు దోమలు ఈగల్లా పోలీసులు, పాలకులు, నిరంకుశులు!. ఇవన్నీ ఇద్దరిలోనూ దాదాపు ఒకేలా వుంటాయి. అయితే మోహన్ చిత్రాల్లో ఒక అదనపు  గుణం వుంటుంది. అదే వెటకారం; అవహేళన. నిరంకుశుని ముందు నిటారుగా నిలబడి “పోభే  కుయ్యా!” అంటాయి మోహన్ బొమ్మలు. చిత్రకళలో వెటకారం మోహన్ సంతకం. భవిష్యత్తులో చిత్రకళా పరిశోధకులు కొందరు తవ్వకాలు జరిపి “ మోహన్ కు గోదావరి మండలము నుండి ఈ వెటకారము అబ్బేను” అని నిర్ధారిస్తే మనలో ఎవరికీ  ఎలాంటి అభ్యంతరమూ  వుండాల్సిన పనిలేదు.  

 

చివరగా ఒకమాట, నా జ్ఞాన సంపదను వాటాలు వేసి పంచాల్సివస్తే అందులో మోహన్ కు కూడ కొంత వాట వుంటుంది. నా మిత్రునికి నివాళి.

 

(తాడి మోహన్ 70వ జయంతి సందర్భంగా డిసెంబరు 24, 2020న  విజయవాడ ఎంబి విజ్ఞాన భవన్ లో జరిగిన సభలో చేసిన ప్రసంగ పాఠం)

 

(నా రచనల ప్రచురణ కోసం తపించే చిరకాల మిత్రురాలు శబరికి ఈ వ్యాసం అంకితం) 

 

రచన : 24 డిసెంబరు 2020