Thursday, 19 March 2015

Pattiseema Technical Dimensions

Pattiseema  Technical Dimensions 
1 TMC         10000,00,000 cft
2 80 TMS       800000,00,000
3 Vertical Turbine  Pipes  30 Nos 
4 Discharge Capacity  each Pipe 8 Cumecs  280 cu / sec
1 Cumecs = 35.314667 Cusecs
5 Aggregate Discharge Capacity  D9XD11 8400 cu / sec
6 Per Day 60X60X24                     86,400  Seconds  
7 Discharge Capacity per Day            7257,60,000 cu / sec
8 Discharge Capacity per Day  130 Days       943488,00,000  cu/sec 
9 Discharge in 130 Days  Installed 
Capacity
                           94  TMCs 
10 To Discharge 80 TMCs                           110  Days. 
11 Utility                             85  % 

Saturday, 7 March 2015

తూర్పుకు నడిపించే ’సొంత సంతకం’

తూర్పుకు నడిపించే  ’సొంత సంతకం’ 
మన మెదళ్లను పశ్చిమ వ్యామోహం ఏలుతున్న కాలంలో తూర్పు దిక్కుకు చూడండి అని చెప్పిన కొద్ది మందిలో జాన్ సన్ చోరగుడి ఒకరు.ఇప్పుడు తూర్పుకు చూడడం కొత్త ట్రెండుగా మారిందిగానీ ఈ విషయంలో జాన్ సన్ చాలా ముందున్నారు.

తెలుగు పత్రికల ఎడిట్ పేజీల్లో వామపక్షభావాలు విరబూస్తున్న కాలంలో ప్రవేశించిన విభిన్న సంతకం జాన్ సన్ చోరగుడి. ఆయన  వామపక్షంకాదు. జహ్నవీలా కుడిపక్షం కాదు, అరవిందరావులా ధార్మికపక్షమూకాదు. వారిది ఉపయోగితావాదం. అందులోకూడా వారు జెరిమీ బెంథామ్. జాన్ స్టూవర్ట్ మిల్ లా సాంప్రదాయిక ఉపయోగితావాది కూడా కాదు. యుటిలిటేరియనిజానికీ, కాన్సిక్వెన్షియలిజానికి (Consequentialism - "the ends justify the means")  మధ్యేమార్గం తన ప్రాపంచిక దృక్పధం అని ఆయనే స్వయంగా చెప్పుకున్న సందర్భాలున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే  జాన్ సన్ మత అల్పసంఖ్యాకవర్గాల ఉపయోగితావాది. క్రైస్తవ ఉపయోగితావాది. ఆసియా ఖండంలో పుట్టిన క్రైస్తవం ఆసియా క్రైస్తవంలానో, ఇండియా క్రైస్తవంలానో వుండాలనేదిది జాన్ సన్ అభిలాష. యూరప్ కో, అమెరికాకో వెళ్ళి సూటూ బూటూ హ్యాటు పెట్టుకునివచ్చిన క్రైస్తవం వారికి నచ్చదు.

లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్.పి.జి) విధానాలని వామపక్షాలు సూత్రప్రాయంగా వ్యతిరేకిస్తాయి. సంక్షేమ పథకంవల్ల నూటికి ఐదుగురికి అన్యాయం జరిగినా వామపక్షాలు విమర్శిస్తాయి. సంక్షేమ పథకాలవల్ల ఐదుగురు పేదలకు మేలు జరిగినా మంచిదేగా అనేది జాన్ సన్  తత్వం. ప్రభుత్వపథకాల లోటుపాట్లను పక్కనపెట్టి, వాటిని దళితాభ్యుదయానికి ఏమేరకు ఉపయోగించవచ్చు అని నిరంతరం ఆలోచిస్తూ వుంటారు ఆయన.

ఆంధ్రప్రదేశ్ విడిపోతే సీమాంధ్ర భవిష్యత్తు అంధకారం కాబోతోందని అనేకమంది పెద్ద గొంతుతో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నపుడు, రాష్ట్రం విడిపోయినా సీమాంధ్ర మరింత వేగంగా అభివృధ్ధిని సాధిస్తుందని భౌగోళిక మ్యాపులు గీసి మరీ చెప్పిన బహుకొద్దిమందిలో జాన్ సన్ ఒకరు.

ప్రభుత్వాలు కోల్పోతున్న ఆమోదాంశానికి తిరిగి జీవంపోయడానికి ఐక్యరాజ్యసమితి చేపట్టిన కార్యక్రమం సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్).  అయితే, భారతదేశంలో  ఈ కార్యక్రమాన్ని క్రిస్మస్ రోజున మొదలెట్టడం మీద  నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సందర్భంగా జాన్ సన్  భిన్నంగా ఆలోచించారు. క్రిస్మస్ గౌరవాన్ని భారత ప్రభుత్వం పెంచినట్టు భావించారాయన.  ఏసుక్రీస్తు బోధనల్లోనే Eight Elements of Good Governance వున్నాయని మరీ గుర్తు చేశారు.  వారి వ్యాససంపుటి ’సొంత సంతకం’లో కూడా ప్రజలు, ప్రాంతము, ప్రభుత్వము, సమాజము, ప్రపంచము, విశ్వాసము, కాలము, మీడియా అనే ఎనిమిది అధ్యాయాలుండడం విశేషం. సమాజము-సరళీకరణ-సమకాలీనత అనేది దీనికి ట్యాగ్ లైన్. 

జాన్ సన్ వ్యాసాల విస్తృతి కూడా పెద్దదే. నెహ్రు-అంబేద్కర్ కార్టూను దుమారం, నలందా విశ్వవిద్యాలయం పునరుధ్ధరణ మొదలు ఇజ్తాయిల్-పాలస్తీన వివాదం వరకు  అనేక వర్తమాన అంశాలపై  సొంత దృక్పథంతో రాసిన వ్యాసాలు ఇందులో వున్నాయి.

అప్పుడప్పుడు పత్రికల్లో అచ్చయ్యే వ్యాసాలు చదివి రచయిత మీద ఏర్పరచుకునే అభిప్రాయాలు పాక్షికమైనవి. వాటిని ఒక సంకలనంగా చదివినపుడు మాత్రమే ఏ  రచయితను అయినా  సమగ్రంగా అర్ధం చేసుకునే అవకాశం వుంటుంది. అలాంటి అవకాశాన్ని ‘సొంత సంతకం’ ఇస్తుంది. వర్తమాన ప్రపంచం తూర్పుకు చూడాల్సిన అవసరాన్నీ, దాని ప్రయోజనాలనీ తెలుసుకోవాల్సినవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం ‘సొంత సంతకం’. సొంత ఆసక్తి వున్నా లేకపోయినా గ్రూపు సర్విసు పరీక్షల్లో నెట్టుకురావడం కోసమైనా సమాజ శాస్త్రాలను చదువుతున్న కొత్త తరానికి ఇది హ్యాండ్‍ బుక్కు అవుతుంది. 
-     డానీ

సొంత సంతకం
412 పేజీలు
జాన్ సన్ చోరగుడి
అబా మీడియా ప్రచురణ, విజయవాడ
వెల :  250 రూపాయలు




Monday, 2 March 2015

The Signals of Neo-Crusades

The Signals of Neo-Crusades

మతయుధ్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి!
ఉషా యస్ డానీ

పారిస్ లోని ఛార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై  దాడి తరువాత పత్రికా స్వేఛ్ఛ మీద మరోసారి విస్తృత చర్చ మొదలయింది. దాడిలో పత్రిక సంపాదకులు సహా అరడజను సిబ్బంది కూడా చనిపోవడంవల్ల చర్చల తీవ్రత కూడా ఆ స్థాయిలోనే కొనసాగుతోంది. సామాజిక కోణంలో చూస్తే భావప్రకటనా స్వేఛ్ఛ పేరిట సాగుతున్న ఈ చర్చలోఇరువర్గాలు వర్ణ ప్రాతిపదిక మీద విడిపోయారని సులువుగానే అర్ధం అవుతోంది. శ్వేతవర్ణ జాతీయులు, వాళ్ళ మేధోబృందాలు పత్రిక కార్యాలయంపై  దాడినీ, సిబ్బంది హత్యనూ తీవ్రంగా ఖండిస్తుంటే, ఇతర వర్ణాలకు చెందిన ప్రజలు, వాళ్ళ మేధోవర్గాలు  ఛార్లీ హెబ్డో పత్రిక దుందుడుకు స్వభావాన్నే తప్పుపడుతున్నారు.  

చార్లీ హేబ్డో పత్రిక సామాజిక దృక్పథాన్ని అర్ధం చేసుకోవడానికి ముందు ఫ్రాన్స్ రాజకీయార్ధిక నేపథ్యాన్ని ఒకసారి పరిశీలించాలి. ఫ్రాన్స్ నిన్నమొనటి వరకు వలస పాలక దేశంగా వుండేది. బ్రిటీష్ వలస పాలకులకన్నా ఫ్రెంచ్ వలస పాలకులు మరింత అహంభావులు. వలసలు అంతరించి దశాబ్దాలు గడుస్తున్నా, అలనాటి వలసదేశాల ప్రజలంటే ఫ్రెంఛ్ ఉన్నత వర్గాలకూ, వాళ్ళ మనోభావాల్ని ప్రచారంచేసే పత్రికలకూ ఇప్పటికీ చిన్న చూపే. అక్కడి పత్రికల్లో వచ్చే కార్టూన్లల్లో వర్ణ వివక్ష ప్రస్పుటంగా కనిపిస్తుంది. వీళ్ళలో మరీ బరితెగించిన పత్రిక ఛార్లీ హేబ్డో. మినహాయింపు లేకుండా అందరి మీదా వ్యంగ్య బాణాలు సంధిస్తూ వుంటుందని ఉదారవాద ఫ్రెంచ్మేధావులు ఈ పత్రికని మెచ్చుకుంటూ వుంటారు. ఇది పాక్షిక సత్యం మాత్రమే. కాస్త పరికించి చూస్తే, ఈ పత్రిక తెల్లవాళ్లను సుతారంగా గోళ్లతో గిల్లి వదిలేస్తుందనీ, నల్లవాళ్ళు తదితర ఒకనాటి వలస ప్రజల్ని కర్కశంగా గొడ్డళ్ళతో పొడుస్తుందనీ సులువుగానే అర్ధం అవుతుంది.

నిజానికి ఈపాటి జ్ఞానాన్ని సంపాదించడానికి ఆలోచనాపరులెవ్వరూ ప్యారిస్ పర్యటనకు వెళ్ళాల్సిన పనిలేదు. తెలుగు వార్తా పత్రికల్ని అధ్యయనం చేసినా సరిపోతుంది. తెలుగు మీడియా సంస్థలన్నీ ఏదో ఒక రాజకీయపార్టీకి మద్దతు దారులుగా మారిపోయాయన్న సంగతి తెలియనివాళ్ళు ఇప్పుడు ఎవరూలేరు. ప్రతీ పత్రిక రాజకీయకార్టూన్లు ప్రచురిస్తుంది.  తాము సమర్ధించే పార్టీల ప్రత్యర్ధుల మీదే కాకుండా కొన్ని సందర్భాలలో  తాము సమర్ధించే పార్టీల నాయకుల మీద కూడా కార్టూన్లు వేయాల్సి వుంటుంది. అంత మాత్రాన  వాళ్ళు  సమర్ధించే పార్టీల మీద వేసే కార్టూన్ల తీవ్రతా, తాము సమర్ధించే పార్టీల ప్రత్యర్ధుల మీదే వేసే కార్టూన్ల తీవ్రతా ఒకే స్థాయిలో వుంటాయని పుర్రెలో కాస్తంత బుర్ర వున్నవాడు ఎవరయినా నమ్ముతారా?  సీనియర్ పాత్రికేయులు కొందరు నమ్ముతూ వుండవచ్చు. వాళ్లను చూసి జాలిపడడంతప్ప మనం చేయగలిగింది ఏమీలేదు. పత్రికా స్వేఛ్ఛ అంటే యధేఛ్ఛకాదు!

అప్పట్లో ఆఫ్రో-అమెరికన్ నల్లజాతీయుల్ని కోతులుగా చిత్రించిన అమెరికా శ్వేతవర్ణీయుల పత్రికల్ని, హిట్లర్ కాలంలో యూదుల్ని కించపరుస్తూ కార్టూన్లు వేసిన జర్మన్ పత్రికల్ని ఛార్లీ హెబ్డో పత్రిక  అనుసరిస్తూ వుంటుంది.  ఇటీవలి కాలంలో ఆర్ధికసంక్షోభంలో పడిపోయిన చార్లీ హెబ్డో పత్రిక  'సమవర్తి' ముద్ర నుండి బయటపడి ఇస్లామోఫోబియాను ప్రచారం చేయడం ద్వార శ్వేతవర్ణీయుల మద్దతు కూడగట్టి లాభాలబాట పట్టే ప్రయత్నాలు మొదలెట్టిందనే వాదనలున్నాయి. దాడి తరువాత ఆ పత్రిక్కి సంఘీభావంగా తరలివస్తున్న శ్వేతవ్వర్ణ నిధులు ఈ వాదనను బలపరుస్తున్నాయి. లాభాలు సంపాదించడానికి  ఏకంగా ఒక సంపాదకుని ప్రాణాలను బలిపెడతారా? అనే సందేహం ఎవరికయినా రావచ్చు. అయితే, "పది శాతం లాభం కోసం ఉరికభం ఎక్కడానికి కూడా పెట్టుబడిదారులు  వెనుకాడరు." అనేది అందరికీ తెలిసిన సూత్రమే!

ఇంగ్లండ్ ముస్లింలలో అత్యధికులు ఒకనాటి బ్రిటీష్ వలస దేశాలకు చెందినవాళ్ళే అయినట్టు, ఫ్రాన్సుదేశపు ముస్లింలలో అత్యధికులు సహజంగానే ఒకనాటి ఫ్రెంచ్ కాలనీలకు చెందినవారు వుంటారు. ఛార్లీ హేబ్డే పత్రిక ఈ సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యం చాటున ముస్లింలను భూతాలుగా (ఇస్లామో ఫోబియాను) ప్రచారంచేస్తూ వుంటుంది.

ఫ్రెంచ్ సామ్రాజ్యానికీ, ఇస్లాంకు ఒక విచిత్ర  అనుబంధం వుంది. ఉత్తర ఆఫ్రికా ఖండంలో  ఫ్రెంచ్ సామ్రాజ్యం శిఖరాగ్ర దశలో వున్నప్పుడు, అక్కడ ఇస్లాం చాలా వేగంగా విస్తరించింది.  ఒక దశలో అయితే ముస్లింల జనాభా అత్యధికంగా వున్న సామ్రాజ్యం తనదేనంటూ  ఫ్రాన్సు గొప్పగా చెప్పుకునేది. ముస్లిం దేశాల్లోని చమురుపైఆధిపత్యాన్ని సాధించడానికి ఈ జనాభా అంశాన్ని పెద్దగా ప్రచారం చేసుకునేది. 

ప్రపంచవ్యాప్తంగా శ్వేత జాతీయులు ఇప్పుడు కార్టూన్లు ప్రచురించినందుకు ఒక పత్రికా సంపాదకుడ్ని ముస్లింలు క్రూరంగా చంపేశారని గగ్గోలు పెడుతున్నారు. ముహమ్మద్ ప్రవక్తను నగ్నంగా చిత్రించడం వ్యంగ్యమేనా? ముస్లింల ప్రవక్త వికృత మైధూనాని (సుడోమి) కి పాల్పడినట్టు  ఒక మతిచెడినవాడు తీసిన ఒక బూతు సినిమాకువత్తాసు పలకడం హాస్యమేనా? శాసనసభ్యులుగా ఎన్నికైన ’పల్లెటూరి బైతులు’ ప్రభుత్వం ఇచ్చిన  ల్యాప్ టాపుల్ని మడిచి ఎక్కడ పెట్టుకుంటారో? అని ఒక వెకిలి వ్యాఖ్య చేసినందుకు, అగ్రస్థానంలోవున్న ఒక న్యూస్ ఛానల్ ఆర్ధిక పునాది కదిలిపోవడాన్ని తెలంగాణలో   మనం కళ్ల ముందు చూశాం. తమ మతప్రవక్త మీద అదేపనిగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటే విశ్వాసులు ఎలా స్పందిస్తారో ఊహించడం కష్టమేమీకాదు.

ఛార్లీ హెబ్డో పత్రిక మీద దాడి చేసింది ముస్లింలు అనేది కూడా పాక్షిక సత్యమే. ఈ కేసులో అరెస్టు అవుతున్న వారందరూ ఒకనాటి ఫ్రెంచ్  వలసలైన అల్జీరియా, మాలియన్ దేశాల నుండి వచ్చినవారే నన్నది మరో కోణం. పత్రిక మీద దాడికి మతంకన్నా జాతివివక్ష అంశమే బలంగా పనిచేసిందని దీనినిబట్టి అర్ధం అవుతున్నది.అంతర్జాతీయ పత్రికల్లో శ్వేతవర్ణ మేధావులు రాసే వ్యాసాలు చదివి రెచ్చిపోతున్న మన సమకాలిక ’నల్ల’ మేధావులకు వలసజాతుల ఆవేదన అర్ధం అయినట్టులేదు.

వలసజాతుల భావోద్వేగాలకు ఉధామ్ సింగ్ అద్భుత ప్రతీక. జలియన్ వాలా బాగ్ దురంతాన్ని జరిపిన బ్రిగేడియర్-జనరల్  రెగినాల్డ్ డయర్ (Dyer) కన్నా  ఆ నరమేధానికి అనుమతి ఇచ్చిన పంజాబ్ గవర్నర్ మైఖేల్ ఓ’ డయ్యర్ (O’Dwyer) ప్రధాన దోషి అని ఉధామ్ సింగ్ భావించాడు. ఇరవై యేళ్ళు గడిచిపోయినా సరే, డయ్యర్ పదవీ విరమణ చేసి డెభ్భయి ఆరేళ్ళ  వృధ్ధుడు అయిపోయినాసరే  కసి చల్లారక లండన్ వెళ్ళి మరీ చంపేశాడు. అదే ఒక లండన్ పత్రిక తరచూ భారతీయుల్ని కించపరుస్తూ వ్యాసాలో, వ్యంగ్య చిత్రాలో ప్రచురిస్తుంటే ఉధామ్ సింగ్ లాంటి వాళ్ళు ఏమి చేసి వుండేవాళ్ళూ?  అప్పుడు ఆ చర్యను వలసపాలకులు ఎలాగూ ఖండిస్తారు. వాళ్ళచట్టాల ప్రకారం ’దోషుల్ని’ ఎలాగూ శిక్షిస్తారు. వలస ప్రజల్ని సమర్ధించే మేధావులు ఏం చేయాలి? అన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.


ఇస్లామో ఫోబియా అనేది సంస్కృతిక దాడి అయితే, దానికి మూలమయిన రాజకీయార్ధిక కారణాలను ఏకధృవ ప్రపంచాన్ని ఏలుతున్న అమెరికా సామ్రాజ్యవాదంలో చూడాలి. దానికి వ్యూహాలు రచిస్తున్న అమెరికా-ఇజ్రాయిల్ అనుబంధంలో చూడాలి. సామ్రాజ్యవాదిగావున్న అమెరికాను  రాజకీయార్ధిక కోణంలో బాహాటంగాసమర్ధించడానికి కొన్ని మతాలకు కొన్ని ఇబ్బందులు వున్నమాట నిజమే. అయితే, సాంస్కృతికంగా ముస్లిం వ్యతిరేక శిబిరానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా వెనుక నడవడానికి ఇప్పడు ముస్లిమేతర మతాలన్నీ ఉవ్విళ్ళూరుతున్నాయి.


ఏదో ఒక శత్రువు లేకుండా మనుగడ సాగించలేని  అమెరికా సామ్రాజ్యవాదం  సోవియట్ రష్యా పతనం తరువాత ముస్లింలనే తన ప్రధాన శత్రువుగా భావిస్తోంది. వర్తమాన ప్రపంచంలో అసంఖ్యాక పీడిత ప్రజలు అనేక యుధ్ధరంగాల నుండి అనేక రకాలుగా అమెరికా సామ్రాజ్యవాదంతో తలపడుతున్నారనేది ఎవరికైనా అర్ధం అయ్యేవిషయమే.  ఈ యుధ్ధాల్లో ముందుశ్రేణిలో నిలబడి అమెరికాతో తలపడుతున్నది ముస్లింలే అనేది కూడా  సులభంగానే తెలుస్తోంది. ఈ జ్ఞాన సముపార్జన క్రమం ఇంకో అడుగు ముందుకు వేస్తే ఎవరికైనా అర్ధం అయ్యేది ఏమంటే వర్తమాన ప్రపంచంలో ప్రధాన పీడితులు ముస్లీంలు అని. విప్లవ రచయిత వరవరరావు వంటి వారుముస్లింలతోపాటూ ఆదివాసుల్ని కూడా ప్రధాన పీడితులుగా పేర్కొంటున్నారు. ఇది సంమంజసమైన ప్రతిపాదన. ముస్లిం దేశాల్లో చమురు నిల్వలున్నాయి. ఆదివాసుల నివాసాల్లో ఖనిజ నిక్షేపాలున్నాయి. ఇది సాంస్కృతిక రూపంలో సాగుతున్న పచ్చి ఆర్ధిక పోరాటం.

మధ్య యుగాల్లో రాజకీయార్ధిక వ్యక్తీకరణలన్నీ  మత రూపంలోనే సాగేవి. పధ్ధెనిమిదవ శతాబ్దం ఆరంభంలో వాల్టేర్, రూసోలు రంగప్రవేశం చేశాక మాత్రమే రాజకీయార్ధిక వ్యక్తీకరణలకు ఆధునిక మాధ్యమం ఏర్పడింది. గడిచిన మూడు శతాబ్దాల కాలంలో జరిగిందేమంటే పెట్టుబడీదారీ రాజకీయార్ధిక విధానాలు సామ్రాజ్యవాద దశకుచేరుకుని ప్రపంచ పీడిత ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకను ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభాన్ని దాటి మళ్ళీ ఆమోదాంశాన్ని పొందాలంటే సామ్రాజ్యవాద దేశాలు తమ రాజకీయార్ధిక వ్యక్తీకరణలకు ఒక కొత్త మాధ్యమాన్ని కనిపెట్టాలి. ఇప్పుడు వాటికా శక్తిలేదు. అంచేత గతంలో వదిలేసిన మత మాధ్యమాన్నే అవి పునరుధ్ధరిస్తున్నాయి.అమెరికా నాయకత్వంలో సాంస్కృతికంగా ప్రపంచం ఇప్పుడు నిజంగానే రెండు మత శిబిరాలుగా చీలిపోయింది.  గ్లోబ్ ను మతయుధ్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి!

ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రధాన వార్తల్ని చూస్తుంటే ఇస్లాంను ద్వేషించని వారు భూగోళం మీద ఎవరూ లేరేమో అనిపిస్తోంది. ఇంకొన్ని పేజీలు తిరగేస్తుంటే అందుకు విరుధ్ధమైన వార్తలు కూడా కనిపిస్తున్నాయి. ముస్లిం జనాభా మెజారిటీ అయిపోతోందని యూరప్ దేశాలు భయపడిపోతున్నాయట. ఇంగ్లండ్, జర్మనీ, అమెరికాలనూఇప్పుడు ఇస్లాం భూతం వెంటాడుతోంది!.  అంతమంది అంతలా తిట్టిపోస్తున్నా, ముస్లింలను భూతాల్లా చూపిస్తున్నా, ఇస్లాంను స్వీకరించేవాళ్ళు రోజురోజుకూ పెరిగిపోతుండడం నిజంగా ఆశ్చర్యమే! ఇలాంటి సందర్భాల్లో  ఖిలాఫత్ ఉద్యమ నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్‍ కు అలనాటి అధ్యక్షుడు, కవి మౌలాన ముహమ్మద్ ఆలీ(జౌహర్) కవితా పంక్తులు గుర్తుకు వస్తాయి.  "ఖతల్ ఏ హుస్సేన్ అసల్ మే మర్గ్ ఏ యజీద్ హై /  ఇస్లాం జిందా హోతాహై హర్ కర్బలా కే బాద్"  దీనికి ఒక్క ముక్కలో అర్ధం చెప్పుకోవాలంటే "అణిచివేత నుండే ఇస్లాం జీవాన్ని నింపుకుంటుంది".

కళాకారులు, ఆలోచనాపరులు చెయ్యాల్సిన పని ఆధిపత్యాన్ని సవాలుచేయడం. వాళ్ళు ఎప్పటికీ చేయకూడని పని పీడితుల్ని వెటకరించడం. అమెరికా ప్రపంచ ప్రధాన పీడక దేశం అయ్యి, ముస్లింలు, ఆదివాసులు ప్రపంచ ప్రధాన పీడితులు అయినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వున్న సామ్రాజ్యవాద వ్యతిరేకులు ఏం చేయాలీ? అనేదేఈరోజు మన ముందున్న ప్రధాన సమస్య. దానికి ఎవరికివారు ఇచ్చుకునే సమాధానమే ప్రపంచ ప్రజల ముందున్న చారిత్రక కర్తవ్య నిర్వహణకు దారితీస్తుంది. ఇటో అటో తేల్చుకోవాల్సిన సమయమిది.

(రచయిత సీనియర్ పాత్రికేయులు సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 90107 57776

హైదరాబాద్,  21  జనవరి 2015
ప్రచురణ :
 వీక్షణం మాసపత్రిక, ఫిబ్రవరి 2015 :