Monday, 17 June 2013

Charu Majumdar Road

చారు మజుందార్ రోడ్డు, విజయవాడ
 ఉషా యస్‌ డానీ

విజయవాడ నివసించేది ఏలూరు రోడ్డుబందరు రోడ్డు మధ్య అనే నానుడి ఒకటుంది. అంటే,  ఈ రెండు రోడ్ల మధ్యనున్న  ప్రాంతంలో నివాసం వుంటున్నవాళ్ళే నగరాన్ని శాసిస్తారని దీనికి విస్తృత అర్ధం. ఇందులోని  'మధ్య' అనేమాటకు నా దృష్టిలో ఇంకో అర్ధం కూడా వుంది. ఈ రెండు రోడ్ల మధ్యగా 5 - 13 సిటీబస్‌ రూటు వెళుతుంది.  ఆ రోడ్డే విజయవాడకు కొత్త  సంస్కృతిని  నిర్ణయిస్తూవుంటుంది. 

ఇప్పుడు ఏలూరు రోడ్డును కార్ల్‌ మార్క్స్‌ రోడ్డుగానూ, బందరురోడ్డును మహాత్మాగాంధీ రోడ్డుగానూ పిలుస్తున్నారు. కానీ, 5-13 సిటీబస్‌ రూట్‌ గా లిటీల్‌ ట్రెడిషన్‌ పేరుతోనే వుండిపోయిన మొగల్రాజపురం రోడ్డుకు ఇప్పటి వరకు గ్రేటర్‌ ట్రెడిషన్‌ పేరులేదు. కానీ, ఆ ప్రాంతం మాత్రం అనేక ఆధునిక సాంప్రదాయాలకు  నిలయం. కనీసం, కస్తురిబాయిపేట గాంధీబొమ్మ దగ్గర మొదలై, ప్రజాశక్తినగర్‌, మధుకళామండపం, జమ్మిచెట్టు, సిధ్ధార్ధ ఆర్ట్స్‌ కాలేజీ, నవోదయకాలనీ, సున్నపుభట్టీల సెంటర్‌, ఆకాశవాణికాలనీ, ఐటిఐ, పాలిటెక్నిక్‌ ల విూదుగా లయోలా కాలేజీ దగ్గర రింగురోడ్డులో కలిసే  మొగల్రాజపురం రోడ్డు మేరకైనా చారు ముజుందార్‌ పేరు పెడితే బాగుంటుంది.

ఇప్పుడు అంతరించిపోయిన పుల్లేరు నది ఒడ్డున, మూడు బౌధ్ధారామాల మధ్య వెలసిన ప్రాంతం మొగల్‌ రాజపురం. అందులోనిదే నవోదయకాలనీ.  దానితో, నా అనుబంధం 1978లో మొదలైంది.  నక్సలైటు ఉద్యమ అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి నివశించిన కాలనీ అది. అప్పట్లో, వాళ్ళే దానికి ఆ పేరుపెట్టారని కూడా విన్నాను. నవోదయ పబ్లిషర్స్‌ రామ్మోహనరావుగారి ఇల్లూ అక్కడే. ఆ పక్కనే అరుణా పబ్లిషర్స్‌ బెల్లపు బాబూరావుగారి ఇల్లు. నా రాజకీయ గురువు  వాసిరెడ్డి వెంకట కృష్ణారావు అప్పట్లో నవోదయాకాలనీలో వుండేవారు. వారికి దగ్గరగా వుండాలని నేను కూడా మొగల్రాజపురం  చేరుకున్నాను.

ప్రజాశక్తి నగర్లో మహీధర రామ్మోహనరావుజమ్మిచెట్టు సెంటరులో సుంకర సత్యనారాయణ, మధుకళామండపం  దగ్గర  ద్రోణవల్లి అనసూయమ్మ, అక్కడే నేనూ, జమున, సిధ్ధార్ధ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా పరకాల పట్టాభిరామారావు, వేగుంట మోహన ప్రసాద్‌, నవోదయ కాలనీలో కొండపల్లి కోటేశ్వరమ్మ, కొండపల్లి కరుణ, వీ.వీ. కృష్ణారావు.  ఇదీ తొలి వరస.

హంగేరి మార్క్సిస్టు తత్వవేత్త జార్జ్ లుకాక్స్ అనుయాయుల  అధ్వర్యంలో లండన్‌ నుండి వచ్చే 'బ్రాడ్‌ షీట్‌' పత్రికను కృష్ణారావు.  విజయవాడలో పునర్ముద్రించేవారు. అలాగే, 'తూర్పుగాలిఅనే మాసపత్రికను  ప్రచురించేవారు. వాటి సంపాదకవర్గంలో నన్ను చేర్చుకున్నారు. ఆ తరువాత కృష్ణారావు మొదలెట్టిన 'నడుస్తున్న చరిత్ర'కు కూడా నేను వ్యవస్థాపక సంపాదకవర్గ సభ్యుడ్ని.


తొలిదశలో, నేను పీపుల్స్‌ వార్‌ పార్టిలో రాడికల్‌ యువజన సంఘానికి కృష్ణాజిల్లా బాధ్యుడిగావున్నాను. కృష్ణారావు సూత్రధారిగా, నేను పాత్రధారిగా 1980లో  సున్నపుభట్టీల సెంటరులో రాడికల్‌ నగర్‌ వెలసింది. తరువాత దానికి, నక్సలైట్‌ అమరుడు దాసరి రమణ పేరు పెట్టాము. పార్టీవాళ్ళు మా నాన్నకు ఇచ్చిన స్థలంలోకి నా నివాసాన్ని మార్చుకోవడంతో,  నాపేరు సున్నపుభట్టీల డానీ అయిపోయింది. దాసరి రమణ నగర్‌ లోనే మార్క్సిస్టు తత్వవేత్త   ఏటుకూరి  బలరామమూర్తి, చిత్రకారుడు టీ. వెంకట్రావు వుండేవారు. వేగుంట మోహన్‌ ప్రసాద్‌ కూడా కొంతకాలం సున్నపుభట్టీల సెంటరులో వున్నారు. మాకు ఆనుకునివున్న ఆకాశవాణి కాలనీలో ఖాదర్‌ వుండేవాడు. ఆ పక్కనే, సి. రాఘవాచారిగారు. కొంచెం ముందుకెళితే, బెంజిసర్కిల్‌ లో తుమ్మల వేణుగోపాలరావు, కృష్ణాబాయిగార్ల ఇల్లు. అక్కడే శ్రీశ్రీవిశ్వేశ్వరరావు-ప్రమిలగార్ల నివాసం.  అటుపక్కే రావి రాంప్రసాద్‌ ఇల్లు.

నగరానికి  ఆలోచనాపరులు  ఎవరు వచ్చినా  విజయవాడ- టెన్‌ అనగా లబ్బీపేట (ఇప్పడు దాన్ని తపాలశాఖవాళ్ళు  వెంకటేశ్వరపురం అంటున్నారు) పోస్టాఫీసు పరిధిలోకే చేరేవారు.  నేను ప్రతిపాదించిన  చారు మజుందార్‌ ప్రాంతమంతా విజయవాడ-టెన్‌ పరిధిలోకే వస్తుంది.  తరువాతి కాలంలో, అఫ్సర్‌, కలైకూరి  ప్రసాద్‌, మమత, ఐవీ సురేష్‌, గుర్రం శ్రీనివాస్‌ అంతా మొగల్‌ రాజపురంలోనే వున్నారు. వేమన వసంత లక్ష్మీ, త్రిపురనేని శ్రీనివాస్‌, బుధ్ధా జగన్‌, అంతా బెంజిసర్కిల్‌ ప్రాంతంలో చేరారు.

1985 ప్రాంతంలో నక్సలైటు ఉద్యమంపై నిర్భధం పెరిగింది. వరంగల్లులో డాక్టర్‌ రామనాధం హత్య తరువాత, తెలంగాణ నక్సలైటు ఉద్యమ మేధావులు  విజయవాడకు వలస రావడం  మొదలెట్టారు. బాలగోపాల్‌, వరవరరావు అలా వచ్చినవారే. అప్పట్లో విజయవాడ ప్రభుత్వ దృష్టిలో శాంతి మండలంగా వుంది.   ఎన్‌. వేణుగోపాల్‌, కే. నరసింహాచారీ, అల్లం నారాయణ ఉద్యోగాలరీత్యా  అప్పటికే విజయవాడలో వున్నారు. కే. రామచంద్రమూర్తి, కే. శ్రీనివాస్‌, గడియారం శ్రీవత్స కూడా  అలా వుద్యోగాల రీత్యా విజయవాడ వచ్చి మొగల్‌ రాజపురాన్ని ప్రేమించినవారే! అప్పట్లో, రాడికల్‌ యువజన సంఘం రాష్ట్ర నాయకునిగా అజ్ఞాతంలోవున్న బీ. ఎస్‌. రాములుకు ఖాదర్‌ ఇల్లో, మా ఇల్లో ఆశ్రయంగా వుండేది. తరువాతి కాలంలో,  ప్రస్తుత ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మేధోసంపత్తిని సమకూర్చడంలో వీళ్ళదే కీలక పాత్రకావడం ఒక ఆసక్తికర పరిణామం. 

అప్పటి మొగల్రాజపురం సాంస్కృతిక జీవనంలో మరో ఇద్దర్ని పేర్కోకపోతే జాబితా పూర్తయినట్టుకాదు. మొదటి వ్యక్తి 'వ్యాన్‌ గార్డ్‌' ఎడిటర్‌ మోహన్‌ రామ్మూర్తి.  రెండవ వ్యక్తి  తమ్మిన గణపతిరావు పాత్రుడు. మోహన్‌ ది తమిళనాడు. గణపతిరావుది చిట్టినగర్‌. కానీ, తెల్లారితే ఇద్దరూ   మొగల్రాజపురం చేరుకునేవారు. ఇంటర్నెట్‌ లేని ఆరోజుల్లోఏ విషయం విూదనైనా 'ఇన్‌ పుట్‌' కావాలంటే సమకూర్చడానికి మోహన్‌ వుండేవాడు. సెల్‌ ఫోన్లు లేని కాలంలో, నేను అక్షరం ముక్క రాస్తే చాలు మొత్తం  ప్రపంచానికి చాటిచెప్పడానికి గణపతిరావు సిధ్ధంగావుండేవారు. ఇప్పటి టెలివిజన్ న్యూస్ ఛానల్స్ భాషలో చెప్పాలంటే, మోహన్ నాకు ఇన్ పుట్ ఎడిటర్ అయితే, గణపతిరావు అవుట్ పుట్ ఎడిటర్!!  వీళ్ళుకాక, వల్లమాలినంత విప్లవాభిమానం, సాహిత్యాభిమానం వున్నవాళ్ళు మొగల్రాజపురంలో కోకొల్లలుగా వుండేవాళ్ళు. ఇదీ మలి వరస.

అప్పటి విరసం కృష్ణాజిల్లా యూనిట్‌ రాష్ట్రంలోకెల్లా పెద్దది. విజయవాడవాసులతోపాటూ, ఆలూరి భజంగరావు, అరుణ, సౌదా, రజినీ కూడా అందులో సభ్యులు. విరసం కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల యూనిట్‌ కు చాలాకాలం నేనే ప్రాంతీయ కన్వీనర్‌ గా వుండేవాడ్ని. మా ఇళ్లన్నీ సాహిత్య సమావేశాలతోనో, యూనిట్‌ విూటింగులతోనో కళకళలాడుతూ వుండేవి. ఏలూరు రోడ్డును రైటర్స్‌ స్ట్రీట్‌ అన్నట్టు, మొగల్‌ రాజపురాన్ని రైటర్స్‌ కాలనీ అనవచ్చు.

ఇదంతా పైకి కనిపించే ప్రపంచం. దీనికి ఎప్పటికప్పుడు ప్రాణవాయువును అందించే ఒక రహాస్య  ప్రపంచం మరొకటుండేది. పీపుల్స్‌ వార్‌ నాయకత్రయం  కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, ఐవీ సాంబశివరావు అప్పుడప్పుడు వచ్చి, పరిసర జిల్లాల యువకులకు  రహాస్య తరగతులుపెట్టి, స్వయంగా జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు బోధించి, పీపుల్స్‌ వార్‌ పంథాను వివరించి వెళుతుండేవారు. 'టెక్‌' జాగ్రత్తల రీత్యా పదిమందిని ఒకేసారి కలవడం కుదరనపుడు, వ్యక్తిగత స్థాయిలోనే ఈ జ్ఞాన ప్రసరణ కార్యక్రమాలు సాగేవి.

        పీపుల్స్‌ వార్‌ నాయకత్రయం తలలకు ప్రభుత్వం కట్టిన  వెలలు వుండేవి. వారిని  గుర్తించగలిగిన వాళ్ళు  మొగల్‌ రాజపురంలో చాలా మంది వుండేవారు. సిపిఐ, సిపియం ప్రముఖులు వుండే ప్రాంత్రం అది.  ఆ ముగ్గురితో వాళ్లకు  రాజకీయంగా తీవ్ర విబేధాలు కూడా వుండేవీ. కానీ, ఎవ్వరూ ఎప్పుడూ వాళ్ల సమాచారాన్ని బయటపెట్టే ప్రయత్నం చేయలేదు. ''వాడూ మావాడే. మనతో విబేధించినా మంచిపనే చేస్తున్నాడుగా'' అని కొంచెం కినుకతో మెచ్చుకునేవారు.   దాయాదుల మీద నమ్మకంతోనే, పీపుల్స్ వార్ నాయకత్రయం మొఘల్రాజపురంలో స్వేఛ్ఛగా తిరుతూ వుండెది.


        ప్రజాశక్తినగర్‌ నుండి బెంజిసర్కిల్‌ వరకు మొత్తం సాగదీస్తే రెండు కిలోవిూటర్ల ముక్క. కావల్సినవాళ్ళంతా ఒకేచోట వుండడంవల్లనేమో విజయవాడ ఓ పెద్ద గ్రామంలా కనిపించేదేతప్పా, ఎప్పుడూ ఓ నగరంలా కనిపించేదికాదు. విజయవాడ వాళ్లకు సెన్సాఫ్‌ బిలాంగింగ్‌ కూడా కొంచెం ఎక్కువ. 

          నక్సలైటు అభిమానులు ఎక్కువగా వుండడంవల్ల విజయవాడ-టెన్‌ విూద ఎప్పుడూ పోలీసు నిఘా వుండేది. పోలీసు భాషలో వాళ్ళు ఏకే-47!. దీనికి మరో కారణం కూడా వుంది. అప్పట్లో విజయవాడ-టెన్‌  పరిధిలోని  (బీ.ఎస్‌.ఎన్‌.ఎల్‌.)  టెలీఫోన్ల  లెవల్‌ 47.  డానీ, విజయవాడ  - 10  అని రాస్తే చాలు మా ఇంటికి వుత్తరం వచ్చేసేది. అప్పట్లో అదో ఇది!!!

హైదరాబాద్‌
8 ఆగస్ట్‌ 2011


No comments:

Post a Comment