మన్యం - మైదానం
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అల్లూరి శ్రీరామరాజు సమకాలికులు. వాళ్ళిద్దరు దాదాపు
ఒకే కాలంలో, వేరువేరు ప్రాంతాల్లో, విభిన్న పధ్ధతుల్లో, శాసనోల్లంఘనం చేశారు. ఇద్దరూ
యుక్తవయస్సులోనే చనిపోయారు. ఇద్దరూ అప్పటి ’విశాల కృష్ణాజిల్లా’లో పుట్టేరు. (ఇప్పటి
పశ్చిమ గోదావరిజిల్లా అప్పట్లో కృష్ణాజిల్లాలో భాగంగా వుండేది). ఇద్దరికీ యోగాభ్యాసం,
జ్యోతిషం, దేశీవైద్యంలో ప్రవేశం వుండేది.
తపస్సు కోసం మన్యం చేరిన శ్రీరామరాజు తూర్పు గోదావరిజిల్లా (అప్పట్లో గోదావరిజిల్లా)
డిప్యూటీ కలెక్టర్ ఫజలుల్లా ఖాన్ ద్వార, అడ్డతీగల సమీపాన పైడిపుట్టి (పైడిపుట్టపాడు) గ్రామంలో 60 ఎకరాల
భూమిని పొంది ’రామవిజయనగర్’ నిర్మించాడు. ఆ ఆశ్రమంలోనే అనేకమంది స్వఛ్ఛంద సేవకులకు
మన్యం పితూరికి అవసరమైన శిక్షణ ఇచ్చాడు. పాశ్ఛాత్య చదువులతో, పరాయి కొలువులతో విసిగిపోయిన
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రకాశంజిల్లా (అప్పట్లో గుంటూరుజిల్లా) ఒంగోలు డివిజనల్ ఆఫీసర్ యస్.వీ. రామమూర్తి ద్వార
చీరాల తాలూకాలోని ఈపురుపాలెం గ్రామంలో 60 ఎకరాల భూమిని పొంది ’రామనగర్’ నిర్మించి, విద్యాపీఠం,
గోష్టి ఏర్పాటు చేశాడు. ఆ ఆశ్రమంలోనే ఆయన ’రామదండు’ పేరున స్వఛ్ఛంద సేవకుల్ని సృష్టించాడు.
అల్లూరి, దుగ్గిరాల నడిపిన పోరాటాలు ఏదో ఒక మోతాదులో గాంధీజీ అహింసా విధానాలకు భిన్నమైనవి;
ఒక విధంగా వ్యతిరేకమైనవి.
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తన పోరాటానికి మైదాన ప్రాంతాన్ని ఎంచుకుంటే, అల్లూరి శ్రీరామరాజు
తన పోరాటానికి మన్యాన్ని కార్యక్షేత్రంగా ఎంచుకున్నాడు.
వాళ్ళిద్దరూ ఎంచుకున్న కార్యక్షేత్రాలలోని వ్యత్యాసమే వాళ్ళిద్దరు ఎంచుకున్న పోరాట
రూపాలలో వ్యక్తమయింది. న్యాయవాదైన దుగ్గిరాల తనపోరాటాన్ని చట్టబధ్ధపధ్ధతుల్లో సాగించాలనుకున్నాడు.
ఆదివాసి హృదయాలు వినిపించే కోరికలైనా, నిరసనలైనా
సాయుధరూపంలోనే వుంటాయి. చట్టబధ్ధ పోరాటాలు, న్యాయస్థాన లావాదేవీలు ఆదివాసులకు తెలియని
వ్యవహారం. అందుకే, అల్లూరి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.
జలియన్ వాలా బాగ్ దురంతం (1919) తరువాత గాంధీజీ సహాయనిరాకరణోద్యమాన్ని ప్రారంభించడంతో, అల్లూరి, దుగ్గిరాల ఇద్దరూ
జాతీయ కాంగ్రెస్ పోరాటపటిమను అతిగా అంచనా వేశారు. చౌరాచౌరి సంఘటనతో (1922) గాంధీజీ
ఆందోళనపడి ఉద్యమ విరమణ పిలుపునిచ్చారు. అక్కడితో, దుగ్గిరాల ఉద్యమం ఆగిపోయింది. సరిగ్గా
అక్కడి నుండే అల్లూరి పోరాటం వుధృతమయింది.
జాతీయ కాంగ్రెస్ కాకినాడ ప్లీనరీ సందర్భంగా, 1923 డిసెంబరు
ఆఖరివారంలో, మన్యం. మైదానం రెండూ చిత్రంగా తారసపడ్డాయి. దుగ్గిరాల, అప్పట్లో, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా వున్నారు. మన్యం పోరాటానికి
సహకారాన్ని కోరుతూ అల్లూరి కాకినాడ కాంగ్రెస్ ప్లీనరీకి సదేశం పంపించాదూ.
కాకినాడ కాంగ్రెస్ ప్లీనరీలో, అల్లూరి, దుగ్గిరాల ఇద్దరికీ అన్యాయం జరిగింది. వాళ్ళిద్దరి మీదా జాతీయ కాంగ్రెస్ సవతి తల్లి ప్రేమను
ఒలకబోసింది. అప్పటి వరకు జూతీయ కాంగ్రెస్ ప్రధాన
కార్యదర్శి బాధ్యతల్ని నిర్వహిస్తున్న దుగ్గిరాలకు కొత్త జాతీయ కమిటీలో కనీసం సభ్యత్వమన్నా
ఇవ్వలేదు. మరొవైపు, మన్యం పోరాటానికి సహకారాన్ని అందించకపోగా, అల్లూరి పంపించిన సందేశాన్ని
కనీసం మహాసభల వేదిక మీంచి చదివి వినిపించడానికి సహితం జాతీయ కాంగ్రెస్ నిరాకరించింది.
ఆంధ్ర కేసరిగా పేరుగాంచిన టంగుటూరి ప్రకాశం
పంతులు మన్యం పితూరీ గురించి మరో కాంగ్రెస్ నేతకు ఉత్తరం రాస్తూ, "దోపిడీగాండ్రూ,
పోలీసు స్టేషన్లను దోచుకుని, తుపాకులనూ. తూటాలనూ తీసుకునిపోవుచుండ కాంగ్రెస్ వారు చేయవలసినదేమో నాకు బోధపడడంలేదు"
అని పెదవి విరిచారు. దుగ్గిరాల నడిపిన చీరాల-పేరాల పోరాటాన్ని, కాంగ్రెస్ చరిత్రకారుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య "కాంగ్రెస్
కు బయట జరిగిన పోరాటం"గా పేర్కొన్నారు.
తన ఉద్యమానికి సహాయసహకారాలు కోరడానికి బరంపురం వెళ్ళిన దుగ్గిరాల 1921 అక్టోబరు
1 న అరెస్టుకావడంతో చీరాల-పేరాల
ఉద్యమం వెనుకంజ వేసింది. 1924 మే 7న అల్లూరి అమరత్వంతో మన్యం
పితూరి అణగారిపోయింది.
దుగ్గిరాలను బరంపురంలో అరెస్టు చేసిన జిల్లా కలెక్టరూ, మన్యం పోరాటన్ని అణిచివేసిన
స్పెషల్ కమీషనరూ ఒక్కడే కావడం విశేషం. 1921 లో గంజాం జిల్లా కలెక్టరుగావున్న రూథర్ ఫర్డ్, 1924 ఏప్రిల్
నెలలో ’స్పెషల్ కమీషనర్ అండ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద ఆపరేషన్’గా మన్యానికి వచ్చాడు. ఆ తరువాతి కాలంలో మద్రాసు గవర్నరుకు ప్రధాన సలహాదారుడయ్యాడు.
కాంగ్రెస్ వారి అంచనాలు ఎలావున్నా, బ్రిటిష్ వలస పాలకులు మాత్రం అల్లూరి, దుగ్గిరాల
లను తమ జాతికి పోరాట స్పూర్తినిచ్చే ప్రమాదకర వ్యక్తులుగా గుర్తించారు. వారిద్దరి మీద
రాసిన సాహిత్యాన్ని మొగ్గలోనే తుంచేశారు. అచ్చయిన పుస్తకాలని నిషేధించారు. "గుసగుసలే
కావచ్చు, దుగ్గిరాలను తలపించేది దేన్నయినాసరే మేము అనుమానించక తప్పదు" అన్నాడు
మద్రాసు గవర్నర్ సలహాదారునిగావున్న రూథర్ ఫర్డ్.
ఉషా యస్ డానీ
సుఫియా కుటీరం
విజయవాడ
27 ఏప్రిల్ 1989
(ప్రచురణ : 2 జూన్ 1989 ఆంధ్రభూమి
దినపత్రిక)
No comments:
Post a Comment