Tuesday 11 June 2013

KV Ranga Reddy : The Unity Among Ruling Classes


కేవీ రంగారెడ్డి - తెలంగాణ ఆంధ్రా పాలకుల ఐక్యత
ఉషా యస్ డానీ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ప్రస్తుత దశకు ఒక ప్రత్యేకత వుంది. చరిత్రపట్ల పాలకుల దృక్పధాన్ని ప్రజలూ, ప్రజల దృక్పథాన్ని పాలకులూ మాట్లాడుతున్నారు. ఇలాంటి భావజాలంలో ఒక ప్రమాదం నిబిడీకృతంగా వుంటుంది. ఉద్యమంలో పోరాట స్వభావం అంతరించి మంతనాల (లాబీయింగ్) స్వభావం పెరుగుతుంది.

వేర్పాటు ఉద్యమాల్లో, ప్రజల మధ్య ఐక్యత, పాలకుల మధ్య ఘర్షణ వుండాలి. తప్పుడు భావజాలాల ఫలితంగా ప్రజల మధ్య ఘర్షణ, పాలకుల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. ఇలాంటి పరిణామాలు పాలకులకు అనుకూలం. ప్రజలకు ప్రమాదకరం. 

"నవంబరు 1 ద్రోహం" అనే మాట ఇప్పుడు ప్రాచూర్యంలోనికి వచ్చింది. ఒక కోణంలో అది నిజమే. ఆ ద్రోహం చేసింది నలుగురు. తెలంగాణ ప్రాంతం నుండి  బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగా రెడ్డి, ఆంధ్రా ప్రాంతం నుండి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి. వీరిలో, బూర్గులది బ్రాహ్మణ సామాజిక వర్గం. మిగిలిన ముగ్గురిదీ రెడ్డి సామాజికవర్గం. అప్పటికి ఇరువైపులా ముఖ్యమంత్రులుగావున్న బూర్గుల, బెజవాడ ఇద్దరూ మెతక మనుషులు. అయితే, ఇరువైపులా కాంగ్రెస్ అగ్రనేతలుగావున్న కేవీ రంగారెడ్డి, నీలం సంజీవ రెడ్డి ఇద్దరూ మొండివారు.

        విశాలాంధ్ర ఏర్పడడానికి బూర్గుల, బెజవాడ ఇద్దరూ తమ ముఖ్యమంత్రి పదవుల్ని త్యాగం చేశారు. సంజీవరెడ్డిని ఉమ్మడి ముఖ్యమంత్రి చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడిని (రంగారెడ్డి) ఉపముఖ్యమంత్రి చేయాలన్న పెద్దమనుషుల ఒప్పందాన్ని సంజీవరెడ్ది ప్రమాణ స్వీకారం నాడే  తుంగలో తొక్కారు. రంగారెడ్డి మేనల్లుడు, పెద్దమనుషుల ఒప్పందంలో ముఖ్యుడు అయిన మర్రి చెన్నారెడ్దికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. పైగా, "ఉపముఖ్యమంత్రి పదవి ఆరోవేలుతో సమానం" అని మీడియా ముందు ఎద్దేవ చేశారని ఒక ప్రచారంవుంది. దీనికి భిన్నమైన వాదన కూడా వుంది. "ఉపముఖ్యమంత్రి పదవి తనకు ఆరోవేలుతో సమానం" అని రంగారెడ్డి తేలిగ్గా తీసుకున్నారని కొందరు అంటారు.

        తొలి తెలంగాణవాదిగా పేరున్న రంగారెడ్డి అంత  మెతగ్గా ఎందుకు వ్యవహరించారు అనేది ఎవరికైనా రావలసిన సందేహమే! దీనికి సమాధానం మనకు పాలకుల చరిత్రలో కనిపించదు. దానికోసం ప్రజల చరిత్రను తిరగేయాలి.

ఉమ్మడి హైదరాబాదు రాష్ట్ర శాసనసభలో, మొత్తమ్మీద కాంగ్రెస్ కు స్వల్ప మెజారిటివున్నప్పటికీ, అది మరాఠ, కన్నడ ప్రాంతాల నుండి వచ్చిందే. తెలంగాణ ప్రాంతంలో, కాంగ్రెస్ కన్నా కమ్యూనిస్టుల ఆధిక్యత ఎక్కువ. అంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అధికారం కమ్యూనిస్టుల చేతికి పోతుంది. ఇది తెలంగాణ ప్రాంత భూస్వామ్యవర్గాలకు ఏ మాత్రం ఇష్టంలేని వ్యవహారం. కాంగ్రెస్ లో రంగారెడ్ది తెలంగాణ ప్రాంత భూస్వామ్యవర్గాల ప్రతినిధి. తెలంగాణప్రాంత భూస్వామ్యవర్గాలు, ఆంధ్రాపాంత భూస్వామ్యవర్గాలు ఏకమై విశాలాంధ్ర ప్రతిపాదనని ముందుకు తెచ్చాయి. రాజకీయ పార్టీ పరంగా, తెలంగాణ, ఆంధ్రాల్లోనేగాక, కేంద్ర ప్రభుత్వంలోనూ కాంగ్రెస్సే అధికారంలోవుంది. దానితో, ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంగా మారింది. అప్పటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలోని భూస్వామ్యవర్గాలూ దీనికి సానుకూలంగా స్పందించాయి.

        సంజీవరెడ్డే తొలి ముఖ్యమంత్రి ఎందుకు కావాలీ? అనేది మరో సందేహం. దానికి సమాధానాన్ని 1955 నాటి ఆంధ్రా ఎన్నికల్లో చూడాలి. ఆ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో, కమ్యునిస్టులు అధికారంలోనికి వచ్చేస్తున్నారన్నంత ప్రచారం సాగింది. ఊపుమీదున్న కమ్యునిస్టుల్ని  అడ్డుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నాటి ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు నీలం సంజీవరెడ్డి. అతన్నే తీసుకొచ్చి, అంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిని చేస్తే, తమ ప్రాంతంలోనూ కమ్యూనిస్టుల్ని అణిచివేయవచ్చని తెలంగాణ భూస్వామ్యవర్గాలు ఆశించాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమా? కమ్యూనిస్టుల్ని అణిచివేయడమా? అనేవాటిల్లో ఒక్కదాన్నే ఎంచుకోవాల్సివచ్చినపుడు రంగారెడ్డి వంటి అప్పటి తెలంగాణవాదులు మొదటిదాన్ని త్యాగం చేసి, రెండోదాన్ని ఎంచుకున్నారు; కొంచెం కష్టంగానూ, కొంచెం ఇష్టంగానూ!.     

కేవీ రంగారెడ్డి డెభ్భయ్యవ జయంతోత్సవాలని (1960) విజయవాడలో ఘనంగా జరిపారంటే ఇప్పుడు చాలా మంది నమ్మక పోవచ్చు.

హైదరాబాద్
12 జూన్ 2013
Published in Surya Telugu daily di\t. 13 June 2013

http://www.suryaa.com/pdf/display.asp?edition=0&page=4 


1 comment: