Monday, 17 June 2013

Library christened in the name of a tea vendor

కళాక్షేత్రానికి టీ కొట్టువాడి పేరు
ఉషా యస్‌ డానీ

        ఏదో పుస్తకంలో చదివిందో, ఎక్కడో విన్నదో ఈ సంఘటన.

        అక్టోబరు విప్లవం విజయవంతమయ్యాక రష్యాలో సాంస్కృతిక పునర్‌ నిర్మాణం మొదలైంది. అప్పటి వరకు రష్యాలోని అనేక నగరాలకు, వీధులకు జారు చక్రవర్తుల పేర్లో, వాళ్ల కొలువులోని ఉన్నతాధికారుల పేర్లో వుండేవి. వాటిని మార్చేపనిలో పడింది కమ్యూనిస్టుపార్టి. ఆ క్రమంలో అనేక ప్రధాన పట్టణాల  పేర్లు, వీధుల పేర్లు మారిపోయాయి.

        అప్పట్లో,  మాస్కో నగరంలో ఓ పెద్ద ఒపేరా హౌస్‌ వుండేది. ఆ ఆడిటోరియానికి కొత్త పేరుపెట్టే సందర్భం వచ్చింది. ఆడిటోరియానికి పేరు పెట్టడానికి రష్యన్లకు కవులు, రచయితలు,  కళాకారులకు కొదవ ఏముందీ?  కమ్యునిస్టు పార్టి సాంస్కృతిక విభాగం ఓ డజను మంది ప్రసిధ్ధ కవులు, రచయితలు,  కళాకారుల పేర్లను  ప్రతిపాదించి తుది నిర్ణయం కోసం లెనిన్‌ దగ్గరికి  పంపింది.

        లెనిన్‌ ఆ పేర్లన్నింటినీ పక్కనపెట్టి ఆడిటోరియానికి కొత్త పేరు పెట్టాడు. ఆ పేరు విని అక్కడున్న  కమ్యూనిస్టు ప్రముఖులందరూ ఆశ్చర్యపోయారు. వాళ్లందరికీ  సుపరిచితమైన పేరది. అతను కవికాదు. రచయితకాదు. కళాకారుడుకూడాకాదు.  మాస్కోలో ఓ మారుమూల ప్రాంతంలో ఓ చిన్న టీ బంకు నడుపుకునేవాడు అతను. జీవితంలో, తెల్లకాగితం మీద అక్షరం ముక్క రాసినవాడూకాదు. అత్యంత ప్రతిష్టాత్మక  కళాకేంద్రానికి  లెనిన్‌ అతని పేరు పెడతాడని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకు పెట్టాడో కూడా వాళ్లకు అర్ధం కాలేదు. వాళ్ల సందేహాన్ని లెనినే తీర్చాడట!

        ఉద్యమకాలంలో. అజ్ఞాతవాసంలోవున్న కమ్యూనిస్టు కవులు, రచయితలు మారుపేర్లతో పత్రికలకు రచనలు పంపించేవారు. వాటికి కేరాఫ్‌ అడ్రస్‌ గా ఆ టీ బంకు వుండేది. అంతేకాదు, రాయడానికి  కావలసిన కాగితాలు, కష్టకాలంలో జేబు ఖర్చులు వగయిరాలు ఇచ్చి ఆ  కవులు, రచయితల్ని  ఆ టీ బంకు  యజమాని ఆదుకుంటుండేవాడు.

        ”మన కవులు, కళాకారులు, రచయితల్ని గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళు రాసిన రచనలున్నాయి. మరి ఆ టీ బంకు యజమాని చేసిన సాహిత్యసేవ గురించి భావితరాలకు తెలియడానికి ఏముందీ?" అని లెనిన్‌ సూటిగా అడిగాడట!

            ఈ సంఘటనను తలుచుకున్నప్పుడెల్లా నాకు ముగ్గురు ఆత్మీయులు  గుర్తుకువస్తారు. ఆ ముగ్గురూ విజయవాడవాళ్ళే. ఒకరు, ’శ్రీశ్రీ ప్రింటర్స్‌’ విశ్వేశ్వరరావు, మరొకరు ’నాగేంద్ర ప్రెస్‌’ బాబూరావుగారు. మూడవ వ్యక్తి తమ్మిన గణపతిరావు పాత్రుడు.  వాళ్ళు రాతగాళ్ళుకాదు. రాతగాళ్లంటే వాళ్లకు వల్లమాలిన అభిమానం. విశ్వేశ్వరరావు నన్ను బంధించి రాయించిన సందర్భాలున్నాయి. నేను ఒక అక్షరం రాస్తేచాలు దేశమంతా ప్రచారం చేసి వచ్చేవారు గణపతిరావు. చేపలంటే నాకు ఇష్టమని చేపలు వండించి తేవడమేగాక, స్వయంగా ముళ్ళు తీసి, తినిపించేంతటి  అక్షర ప్రేమికులు బాబూరావుగారు!

        మా ముందు తరంవాళ్ళు ’నవోదయ పబ్లిషర్స్’ రామ్మోహన రావుగారి గురించి కూడా ఇలాంటి అభిమానపు మాటలే అనేవారు.

హైదరాబాద్‌

1 ఆగస్ట్‌ 2011 

No comments:

Post a Comment