Wednesday 19 June 2013

Notes On Religion

Notes on Religion

డానీ

18 July 2013

మతాల సామాజిక దృక్పధాలు

       భారత ఉపఖండంలో హిందూమతం అతిపురాతన మతమనీ, ఇతర మతాలు ఆ తరువాతే ఇక్కడ పుట్టాయి, లేదా ఇక్కడికి వచ్చాయి, అనే వాదనతో నాకు స్థూలంగా ఏకాభిప్రాయం వుంది. దీని అర్ధం ఏమిటీ? హిందూమతంలోని అంతర్గత అణిచివేతని భరించలేక, అణగారిన వర్గాలు ఇతరమతాల్లోకి వెళ్ళడమో, లేక, తామే ఒక కొత్త మతాల్ని సృష్టించుకోవడమో చేశాయనేకదా!. అంటే, సాంప్రదాయిక హిందూమతంకన్నా, ఆ తరువాత పుట్టిన లేదా, వచ్చిన మతాలు, సంపూర్ణంగా కాకపోయినా, సాపేక్షకంగా అయినా  ఉదారమైనవనేకదా!

       ఇతర మతాల నుండి హిందూ మతాన్ని స్వీకరించిన వాళ్ళు దాదాపు వుండరనే చెప్పాలి. కానీ, హిందూ మతాన్ని వదిలి ఇతర మతాల్ని స్వీకరించినవాళ్ల సంఖ్య  వేలు, లక్షలుకాదు కోట్లలో వుంటుంది. ఇలా మత వలసలు ఒకవైపుకే ఎందుకు వుండేవి అనేది  ఆలోచించాల్సిన విషయం.

       అణగారినవర్గాలు ఇతర మతాల్లోకి పొయే వలసలు ఇటీవలికాలం లో తగ్గుముఖం పట్టివుండవచ్చు. దానికి కారణం హిందూ మతంలో మార్పులు వచ్చాయనికాదు, రాజ్యాంగం వాళ్లకు ప్రత్యేక రక్షణ కల్పించడమే! హైందవ పెత్తందారీ కులాలు దళిత బహుజనులపై దాడులుచేయడం ఇప్పటికీ ఆగలేదు. 


Danny Notes
19 June 2013

మతాల సామాజిక దృక్పధాలు
       విభిన్న మతాల సామాజిక దృక్పధాలని తులనాత్మక పరిశీలన చేయాలంటే రెండు అంశాలని పరిగణణలోనికి తీసుకోవాలి. వీటిల్లో, మొదటిది ఆయా మతాలు ప్రకటించుకున్న పామాణిక గ్రంధాలు. రెండోది, చరిత్ర క్రమంలో ఆయా మత సామాజికవర్గాల ఆచరణలో వస్తున్న మార్పులు. ఈ రెండింటిలో మొదటిదానికన్నా రెండోదే కీలకం.

       హిందూ సామాజికవర్గం ఆచరణను పరిశీలించడానికి మనం గతంలోకి పెద్దగా ప్రయాణం చేయాల్సిన పనిలేదు. వర్తమానంలోనే అడుగడుగునా దానికి కొకోల్లలుగా ఉదాహరణలు కనిపిస్తాయి.

       "ఆంధ్రులంతా ఒక్కటే ఒకేజాతి, ఒకేభాష, ఒకేరాష్ట్రం. ఆంధ్రుల్ని సమైక్యంగా వుంచడానికి ప్రాణల్నైనా ఇస్తాం" అంటూ సమైక్యవాదులు గొంతు చించుకుంటున్న సమయంలోనే, గత ఏడాది జూన్ రెండవవారంలో, శ్రీకాకుళం జిల్లా, వంగర మండలం, లక్ష్మింపేటలో దళితుల మీద అతి క్రూరంగా దాడి జరిగింది. మరోవైపు,"తెలంగాణలో, కులాలులేవు, మతాలులేవు, వర్గాలులేవు, అందరిదీ ఒకే స్వప్నం, ఒకే స్వర్గం" అంటూ, పండితులు, పామరులు కూడా ఒకే రాగాలాపన చేస్తున్న సమయంలోనే, రాజధాని నగరానికి కూతవేటు దూరంలోవున్న, కీసర మండలం, రాంపల్లి దాయర గ్రామంలోని దళిత కాలనీపై పెత్తందారీ కులసామాజికవర్గానికి చెందినవారు దాడులు జరిపారు.

       రాంపల్లి దాయరలో దళితులపై దాడులు జరిపినవారు సీమాంధ్రులూ కారు. లక్ష్మింపేట దళితులపై దాడిచేసినవారు తెలంగాణవారూ కాదు. బలహీనవర్గాలపై పెత్తందారీ కులాలు సాగిస్తున్న అణిచివేతకు ప్రాంతీయవాదాలు సహితం అవరోధంకాదని చెప్పడానికి లక్ష్మింపేట, రాంపల్లి దాయర సంఘటనలు సమీప, సజీవ ఉదాహరణలు. కులప్రసక్తి  వచ్చిందంటేనే అది హిందూ మతసామాజికవర్గమని ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. రెండు ప్రాంతాల ప్రజలు రెండు ఉద్యమాల్లో సమైక్యంగావున్న కాలంలోనూ  కులం తన పని తాను చేసుకుని పోతున్నదని చెప్పడానికే ఆ రెండు ఉదాహరణలు పేర్కొన్నాను.




Danny Notes
19 June 2013

మతాల సామాజిక దృక్పధాలు
       ఇస్లాం కు మతగ్రంధం ఖురాన్. దానికి అనుబంధమైనది ప్రవక్త ముహమ్మద్ (స) జీవితాచరణ. దాన్నే హదీస్ అంటారు. హిందూ మతానికి ప్రమాణిక గ్రంధాలు వేదాలు. భగవద్గీత, రామయణ, భారతాలతోపాటూ మనుస్మృతికి కూడా మతగ్రంధాల స్థాయి వుంది.

       ఒకేమతానికి చెందిన భిన్న సమాజికవర్గాల మధ్య ఘర్షణలు జరగడం కొత్తేమీ కాదు. వాటికి రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక తదితర ’లౌకిక’ కారణాలు అనేకం వుండవచ్చు. ముస్లిం సమాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు  ఇరాన్ -ఇరాక్ యుధ్ధం ఒక ఉదాహరణ. పాకిస్తాన్ తో ఘర్షణపడి, యుధ్ధంచేసి ప్రత్యేక దేశంగా ఏర్పడింది బంగ్లాదేశ్.

       ఒకేమతానికి చెందిన భిన్న సమాజికవర్గాల విషయంలో ఇతర మతాలకూ, హిందూమతానికీ మధ్య రెండు కీలకమైన తేడాలున్నాయి. ఇతర మత సామాజికవర్గాల్లో ఈ విభజన సమమట్టంగా  (Horizontal  Stratification)  వుంటుంది. హిందూ మత సామాజికవర్గాల్లో ఈ విభజన నిలువు పొరలుగా  (Vertical Stratification)  వుంటుంది. సామాజిక అంతస్తుల దొంతరల్లో పైమెట్ల మీద వున్నవాళ్ళు, తమకన్నా కింది మెట్ల మీద వున్నవారిని సాంస్కృతికంగా తక్కువగా చూడడానికీ, వాళ్ల చేత శ్రమ చేయించుకోవడానీకీ, వాళ్లను అణిచివేయడానికీ సాంప్రదాయక హిందూసమాజంలో ధార్మిక సమర్ధన వుంది. ఇలాంటి ధార్మిక సమర్ధన ఇతర మతాల్లో కనిపించదు. ఈ అంశమే, భారత ఉపఖండంలో అనేక కొత్తమతాల అవిర్భావానికీ, మతాంతీకరణకీ దారితీశాయి.

       భారత రాజకీయాల్లో జాతీయ కాంగ్రెస్ అతి పురాతన పార్టీ. ’గ్రాండ్ ఓల్డ్ పార్టి’లకు ఒక సావకాశం వుంటుంది. తమనుతాము వేరే పార్టీ వాళ్ళుగా  ప్రకటించుకున్నవాళ్ళుతప్ప దేశంలో మిగిలినవాళ్లందరూ తమపార్టీవాళ్ళే అనుకునే చెసులుబాటు ఆ పార్టీకి వుంటుంది. హిందూ నాయకులు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారు. దేశంలో "మిగిలినవాళ్లందరూ’ హిందువులే అంటుంటారు. అంటే, భారతీయులు మతపరంగా  రెండు రకాలు; హిందువులు, మాజీ హిందువులు. ఇది పసలేని వాదన అని నిరూపించడానికి ఎవరూ పెద్దగా శ్రమ పడాల్సిన పనిలేదు. బలహీనవర్గాలపై పెత్తందారీకులాలు ప్రతినిత్యం సాగించే దాడులే ఈ వాదనని ఖండిస్తూ వుంటాయి.


Danny Notes
19 June 2013


"అంరత్గత అణిచివేత" నింద నుండి హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఇప్పుడు కొందరు కృషిచేస్తున్నారు. మనుస్మృతి, భారతం, భగవద్గీత,  రామాయణం, వేదాలకన్నా ముందే భారత ఉపఖండంలో సనాతన ధర్మం అనేది ఒకటి వుండేదనీ, అదే వాస్తమైన హిందూ ధర్మం అనేది వీరు ముందుకు తెస్తున్నవాదం. ఈ రకం వాదనల్లో బలంకన్నా బలహీనతే ఎక్కువగా వుంది. వేదకాలం నుండి ఇప్పటి వరకు, బలహీనవర్గాలపై కులం, మతం పేరున సాగిన, సాగుతున్న అణిచివేత సామాజిక మహా తప్పిదమని వీరు గుర్తిస్తున్నట్టున్నారు. ఈ మహాతప్పిదాన్ని పైనుండయినా, కింది నుండయినా ఎలా సరిదిద్దుతారారనేది మన ముందున్న ప్రశ్న.





No comments:

Post a Comment