ప్రపంచాన్ని కుదిపేస్తున్న
రెండు దశాబ్దాలు
ఒక గొప్ప సిధ్ధంతం వేళ్ళూనుకోవడానికి ఒక గొప్ప ఆచరణకావాలి. ఒక గొప్ప ఆచరణ ఫలవంతం కావడానికి ఒక గొప్ప సిధ్ధాంతం కావాలి. ఆచరణలేని సిధ్ధాంతం మెట్టవేదాంతంగా మారిపోతుంది. సైధ్ధాంతిక పునాదిలేని ఆచరణ ప్రాధమిక అనుభవాల వ్యామోహంగా మిగిలిపోతుంది. ఇస్లాం సిధ్ధాంత, ఆచరణల మేలుకలయిక.
ఇంతకీ గొప్ప సిధ్ధాంతం అంటే ఏమిటీ? అనేది అసలు ప్రశ్న. దీనికి ఒక్క ముక్కలో సమాధానం చెప్పాలంటే ... యధాస్థితిని మార్చడం. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మార్చడం. దేన్నయినా మార్చగలిగేదే గొప్పసిధ్ధాంతం.
సామాజిక చరిత్రలోని ప్రతి దశకూ ఒక విశిష్టత వుంటుంది. అప్పటికి అది అలా వుండడంవల్ల, కొందరికి కొన్ని ప్రయోజనాలుంటాయి; కొందరికి కొన్ని ఇబ్బందులు వుంటాయి. ప్రయోజనాలు వున్నవాళ్ళు యధాస్థితిని కాపాడుకోవాలనుకుంటారు. ఇబ్బందులు వున్నవాళ్ళు యధాస్థితిని మార్చాలనుకుంటారు. యధాస్థితితో ప్రయోజనాలు వున్నవాళ్ళు పాలకవర్గం. యధాస్థితితో ఇబ్బందులు వున్నవాళ్ళు పాలితవర్గం. పాలకవర్గం ఎప్పుడూ అధికారాలరీత్యా పెద్దది; సంఖ్యరీత్యా చిన్నది. పాలితవర్గం ఎప్పుడూ అధికారాలరీత్యా చిన్నది; సంఖ్యరీత్యా చాలా పెద్దది.
పాలకులకు సిధ్ధాంత ఆలంబన అక్కరలేదు. వాళ్ల చేతుల్లో దండం వుంటుంది. పాలితుల చేతుల్లో దండం వుండదు. వాళ్ళకు సిధ్ధాంత ఆలంబన తప్పనిసరి. సూటిగా చెప్పాలంటే, ఎప్పుడయినాసరే, పాలితులకు మేలు చేసేదే గొప్ప సిధ్ధాంతం. పాలితుల్ని విముక్తి దిశగా నడిపేదే మహత్తర సిధ్ధాంతం.
ఆరవ శతాబ్దపు అరేబియా సమాజాన్ని మార్చడానికి పుట్టింది ఇస్లాం. ఆ తరువాత, మార్పుకోరే ప్రతి సమాజానికీ ఇస్లాం ప్రత్యంక్షంగానో, పరోక్షంగానో ఒక ప్రేరణగా వుంటూనే వచ్చింది. ఇప్పటికీ అలా కొనసాగుతూనేవుంది.
”మనుషులందరూ సర్వసమానులు” అనే మహత్తర చారిత్రక ప్రకటనతో ఇస్లాం ఒక సామాజిక విప్లవానికి నాందీ పలికింది. అప్పటికి, ఆధునిక సమానత్వ సిధ్ధాంతాలు, సామ్యవాద సిధ్ధాంతాలు ఆవిర్భవించలేదు. ఆ కోవలో ఇస్లాం మొదటిది. ఎక్కువమంది చరిత్రకారులు, సామాజిక పరిశోధకులు దాన్ని కేవలం ఒక మతంగా మాత్రమే చూడడంవల్ల ఇస్లాంకు చాలా అన్యాయమే జరిగింది. పధ్నాలుగు వందల సంవత్సరాల క్రితమే చెలరేగిన ఒక సామాజిక విప్లవంగా ఇస్లాంకు రావల్సినంత గుర్తింపురాలేదు.
నేటి ఏకధృవ ప్రపంచంలో ప్రాంతాలు, దేశాలు లేవు. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. ఇప్పటికీ, ప్రపంచ పాలితులకు ప్రేరణగా వున్న అంశాల్లోనూ ఇస్లామే కీలకం. ప్రపంచ పాలకుల్ని భయపెడుతున్న అంశాల్లోనూ ఇస్లామే కీలకం. అనుమానం వున్నవాళ్ళు టోనీ బ్లేయర్ సరికొత్త పీడకలను చూసి నివృత్తి చేసుకోవచ్చు.
ఇస్లామియ సమాజిక నియమాలు సూటిగా, సరళంగా వుంటాయి. మనిషిని మనిషి ముట్టుకోవడానికి కూడా ఆంక్షలున్న ప్రపంచంలో, సాటి మనుషుల్ని ఆలింగనం చేసుకుని హృదయానికి హత్తుకోండి అని చెప్పింది ఇస్లాం. ”ముస్లింలంతా పరస్పరం సోదరులు. శ్రామికుల వంటికి పట్టిన చెమట ఆరక ముందే వాళ్లకు వేతనం చెల్లించండి. మీ పనివాళ్లకు మీరు తినే తిండినే పెట్టండి. మీరు ధరించే బట్టల్నే ఇవ్వండి. స్త్రీలపై పురుషులకు ఎంత హక్కువుంటుందో, పురుషులపై స్త్రీలకూ అంతే హక్కు వుంటుంది. పిల్లలు, అనాధలు, విధవలు, నిస్సహాయుల విషయంలో దయగలిగి ప్రవర్తించండి. ఒకవేళ, మీరు ఎవరికీ ఏ సహాయమూ చేయలేని స్థితిలోవుంటే, కనీసం ఆప్యాయంగా పలకరించండి. అదే పుణ్యం” - అనేవి ముస్లిం సామాజిక జీవితానికి కొలమానాలు.
ముస్లిం ధార్మిక సమాజానికి రెండే రెండు ప్రమాణాలు. మొదటిది; ఖురాన్, రెండోది; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) జీవితం. మొదటిది సిధ్ధాంతం; రెండోది ఆచరణ. ఆ రెండింటినీ విడదీయడం కుదరదు. ఆ రెండింటి అన్యోన్య అనుబంధమే ముస్లిం ప్రాపంచిక దృక్పధం. వాళ్ల జీవన విధానం.
ఇస్లాం ప్రభావం ముస్లిం సమాజానికే పరిమితమయిందనుకుంటే పొరపాటు. ఇస్లాం తన తరువాత వచ్చిన ఉద్యమాలనేకాక, తనకన్నా ముందు ఆవిర్భవించిన మతాల్ని సహితం ప్రభావితం చేసింది. క్రైస్తవంలో వచ్చిన ప్రొటెస్టెంట్ సంస్కరణలపై ఇస్లాం ప్రభావాన్ని నిరాకరించలేం. అలాగే, హిందూ మతసమాజంలో చెలరేగిన భక్తి ఉద్యమాలకు, ముస్లిం సమాజంలోని సూఫీ శాఖలు ఇచ్చిన ప్రేరణను తక్కువ అంచనా వేయలేం. శిక్కుమత స్థాపకులు గురునానక్ పై సూఫీ గురువుల ప్రభావం అందరికీ తెలిసిన విషయమే. అది అంతటితో అగలేదు, గురునానక్ స్వయంగా హజ్ యాత్ర చేసివచ్చారు. అలాగే, భారత ఉపఖండంలో, బౌధ్ధం అస్తిత్వమే సంక్షోభంలో పడిపోయిన సమయంలో, ఇస్లాం నిర్వహించిన పాత్ర గురించీ విస్తారంగా పరిశోధనలు జరగాల్సివున్నాయి.
ధార్మిక రంగంలోనేగాక, సామాజిక ఉద్యమాలు, విప్లవాల్లోనూ ఇస్లాం ప్రభావం కనిపిస్తుంది. చైనా విమోచన ఉద్యమంలో మావో అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు, గెరిల్లా యుధ్ధతంత్రాలు, చివరకు లాంగ్ మార్చ్ అనే ’వ్యూహాత్మక వెనుకంజ’కు కుడా ఇస్లాం ఉద్యమమే ప్రేరణ అనిపిస్తోంది. ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన నెపోలియన్ మహత్తర సైన్యాన్ని అడ్డుకున్న పశ్చిమ రష్యన్ సైనికులే; తన గెరిల్లా యుధ్ధ తంత్రాలకు ప్రేరణ అని మావో స్వయంగా చెప్పుకున్నాడు. పంతొమ్మిదో శతాబ్దపు ఆరంభంలో, ఆ పశ్చిమ రష్యన్ సైనికులు పాటించిన యుధ్దతంత్రాలకు మూలాన్ని కనుగొంటే, ఇస్లాం ఉద్యమంతో, చైనా విప్లవానికున్న సంబంధమూ తేలిపోతుంది.
’రాడికల్’ ఇస్లాం, ’తీవ్రవాద’ కమ్యూనిజం రెండూ ఒక్కటే అని టోని బ్లేయర్ ఈరోజు నిందార్ధంలో అంటున్నాడుగానీ, పధ్నాలుగు వందల సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగా సాగిన ప్రతి ఉద్యమంలోనూ ఇస్లాం ఉద్యమ అంశ ఎంతో కొంత వుంటూనేవుంది అనంటే అది అతిశయోక్తికాదు.
ఒక గొప్ప సిధ్ధాంతం పుట్టినపుడు, దాన్ని ఆచరించాల్సినవాళ్ళు సిధ్ధంగా వుండరు. కానీ, దాని శత్రువులు మాత్రం సాయుధంగా సిధ్ధంగా వుంటారు. అందువల్ల ప్రతి విప్లవంలోనూ ప్రారంభ దశ రహాస్య ప్రచారంతోనే సాగుతుంది. ఇస్లాం చరిత్రలో తొలి మూడేళ్ళూ అలాగే సాగాయి. సానుకూలురైనవాళ్లను గుర్తించి, ఒక్కొక్కరిని రహాస్యంగా కలిసి కొత్త సత్యాన్ని వివరించి, ఒప్పించాల్సిన దశ అది. తొలి మూడేళ్లలో, ఇస్లాంను స్వీకరించింది కేవలం నలభై మంది మాత్రమే.
తగినంత మంది అనుయాయులు పెరిగిన తరువాత మొదలయ్యేది బహిరంగ ప్రచార దశ. ఈ దశ మొదలుకాగానే పాలకులు విరుచుకుపడతారు. బెదిరింపుల నుండి దాడులు వరకు అన్ని నిర్బంధాలూ మొదలవుతాయి. బహిరంగ ప్రచారోద్యమం ఆరంభించిన తొలి రోజే ముస్లింలపై హత్యాయత్నం జరిగింది. తొలి అడుగులోనే, హజ్రత్ హారిస్ బిన్ అబీహల అమరులయ్యారు. ముహమ్మద్ (స) తృటిలో మృత్యుముఖం నుంచి తప్పించుకున్నారు.
ప్రచారోద్యమాన్ని వెంబడే నిర్బంధ దశ ఆరంభమవుతుంది. ఈ దశకు ఒక విచిత్ర లక్షణం వుంటుంది. ఒకవైపు, పాలకులు తీవ్రమైన అణిచివేతను కొనసాగిస్తుంటారు. మరోవైపు, విముక్తిని కోరుకునే జనం వెతుక్కుంటూ వచ్చి ఉద్యమంలో చేరుతూవుంటారు. దానికి కారణం ఏమంటే, ప్రజలెప్పుడూ పాలకుల్ని నమ్మరు. నమ్మకమైన ప్రత్యామ్నాయం కోసం వాళ్ళు ప్రతిక్షణం వెతుకుతూనే వుంటారు. ఆనాటి అరబ్ ప్రజానీకానికి ఇస్లాం నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారింది. అందుకే, నిర్బంధం పెరిగేకొద్దీ ఇస్లాం కూడా విస్తరిస్తూపోయింది.
అణిచివేతకు మరో పార్శ్వమే సంక్షేమ పథకాలు. అంటే, ఉద్యమాలని అడ్డుకునే ప్రయత్నంలో పాలకులు ప్రజలకు కొన్ని రాయితీలు ఇవ్వడం మొదలెడతారు. ఉద్యమనేతలకు కూడా అనేక ఎరలు వేస్తారు. సంపద, అమ్మాయిల ఆశతో మొదలెట్టి, చివరకు అధికారంలో భాగస్వామ్యం కూడా కల్పిస్తామంటారు.
ఇదొక సంధిగ్ద దశ. ఉద్యమకారుల నిజాయితీ తేలే సమయమిది. ఉద్యమకారులు ఎరలకు లొంగిపోతే అంతటితో ఆ ఉద్యమం అగిపోతుంది. ఆ నైతిక పతనం ఆ ఉద్యమానికేకాక; భవిష్యత్ ఉద్యమాలకు కూడా నష్టం చేస్తుంది. సమీప భవిష్యత్తులో తలెత్తే ఉద్యమాలనీ ప్రజలు నమ్మడం మానేస్తారు. ఒక మహత్తర ఉద్యమ విజయం వంద ఉద్యమాలకు ఉత్తేజాన్ని ఇచ్చినట్టే, ఒక ఉద్యమ పతనం వంద భవిష్యత్ ఉద్యమాలని పురిట్లోనే చంపేస్తుంది.
ఈదశలో, ఉద్యమకారులు నిలబడ్డారా? నిర్బంధం ఉధృతమౌతుంది. అయితే, ప్రజలకు ఉద్యమం మీద నమ్మకం అపారంగా పెరిగిపోతుంది. అప్పటివరకు, ఒక్కొక్కరుగా వచ్చి చేరుతుండే జనం, ఆ తరువాత గుంపులు గుంపులుగా రావడం మొదలెడతారు. నిర్బంధం పెరుగుతున్నప్పుడు, ఉద్యమాల్లో వచ్చి చేరే జనం కూడా పెరగడం ఒక వైచిత్రి. అయినా, అలాగే జరుగుతుంది.
ఉద్యమాల్లో పాలకులు, పాలితులు బరిగీసుకుని అటూఇటూ నిలబడతారనేది పైకి కనిపించే దృశ్యం. పాలితుల్లో పాలకుల అవలక్షణాలు కలిగినవారు వున్నట్టే, పాలకుల్లోనూ అసమ్మతివర్గం అనేది ఒకటి వుంటుంది. పాలకుల్లోని అలాంటి అసమ్మతివర్గం, కలిసివచ్చినపుడు ఉద్యమాలకు కొత్త ఊపు వస్తుంది. హజ్రత్ హమ్జా, హజ్రత్ ఉమర్ వంటి యుధ్ధ సేనానులు వచ్చి చేరిన తరువాత ఇస్లాం ఉద్యమ విస్తరణలో వేగం మరీ పెరిగింది. పాలకుల్లోని అసమ్మతివర్గంలో ఒక భాగం వచ్చి చేరిన తరువాతే ఉద్యమాలు విజృంభించడాన్ని, రష్యా, చైనా విప్లవాల్లోనూ చూడవచ్చు. ఇలా ప్రతి ఉద్యమంలోనూ జరుగుతుంది.
ఉద్యమం, నిర్బంధం రెండు కలిసే పెరుగుతాయి. ఉద్యమాలు పెరుగుతున్నాయని గమనించినపుడు, పాలకులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున విరుచుకుపడతారు. నలువైపుల నుండి దాడులు మొదలైనపుడు ఉద్యమాన్ని కాపాడుకోవడం అంత సులువుకాదు. సందర్భాన్నిబట్టి ఉద్యమ ఉధృతిని తగ్గించాల్సి వుంటుంది. నాలుగు అడుగులు ముందుకు వేయడం కోసం వ్యూహాత్మకంగా రెండు అడుగులు వెనక్కు వేయాల్సి వుంటుంది.
ఇస్లాం ఉద్యమంలో ఇలాంటి దశ పదమూడవ సంవత్సరంలో వచ్చింది. నిర్బంధాన్ని తట్టుకోవడానికి, ఉద్యమాన్ని కాపాడుకోవడానికి, మక్కాను వదిలి మదీనాకు వలస పోవాల్సివచ్చింది. అదే హిజ్రత్. అదే హిజ్రీ శకం ఆరంభం. ఉద్యమ వెనుకంజను సహితం ఉద్యమ విస్తరణగా మార్చిన మహావ్యూహకర్త ముహమ్మద్ (స). ఇలాంటి సందర్భంలో, ఎవరికైనా, చైనాలో ఎర్రసైన్యం సాగించిన లాంగ్ మార్చ్ గుర్తుకురావడంలో ఆశ్చర్యమేమీలేదు. ఆదలాగే జరుగుతుంది. అది అంతే.
మదీనాకు చేరుకున్న తరువాత ఇస్లాం ఉద్యమలో కొత్త దశ ఆరంభమైంది. మక్కా పాలకులు కురైషీలు. మదీనాలో అలాకాదు. ముస్లింల మాటే అక్కడ చెల్లుతుంది. ముస్లిం ఉద్యమానికి మదీన ఒకవిధంగా తొలి విముక్తి ప్రాంతం. విముక్తి ప్రాంతం ఎర్పడగానే ఉద్యమ నియమాలు మారిపోతాయి. ఉద్యమకారులు అప్పటి వరకు ప్రచారం చేసిన కొత్త విలువలన్నింటినీ విముక్తి ప్రాంతాల్లో ఆచరించాల్సి వుంటుంది.
మనుషుల నిజస్వరూపాన్ని తెలుసుకోవాలంటే, వాళ్లకు అధికారాన్ని ఇచ్చి చూడాలి. నిజమైన ఉద్యమకారులో, ఉద్యకారుల ముసుగులోవున్న కొత్త పాలకులో అనేది విముక్తి ప్రాంతంలో తేలిపోతుంది.
నిర్బంధ కాలంలో ఉద్యకారుల బలహీనతలు బయటపడే అవకాశాలు తక్కువ. ఒకవేళ పొడసూపినా ఆ నెపాన్ని పాలకుల మీదో, నిర్బంధం మీదో, నెట్టివేసే అవకాశంవుంటుంది. విముక్తి ప్రాంతాల్లో అలాంటి అవకాశం వుండదు. ఉద్యమకారుల తప్పులు సులువుగా బయట పడిపోతాయి. ఇస్లాం ఉద్యమంలో మక్కాకూ, మదీనాకూ తేడా అదే.
విముక్తి ప్రాంతాల్లో ఉద్యమకారుల ప్రవర్తనే, ఉద్యమ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ దశలో, ఉద్యమకారుల జీవన విధానాన్నీ, నైతిక ప్రవర్తనని, బయటి జనం, నిశితంగా గమనిస్తూ వుంటారు. అక్కడ వాళ్ళు గమనించిన దాన్నిబట్టే, రాబోయే నవసమాజాన్ని ఊహించుకుంటారు.
విముక్తి ప్రాంతాలు కొత్త సమాజానికి తొలి నమూనాగా వుండాలి. అంచేత, ఈ దశలో, ఉద్యమకారుల బాధ్యత మరింతగా పెరుగుతుంది. ప్రవక్త స్వతహాగానే నిరాడంబరులు. మదీనా చేరాక వారు మరింత నిరాడంబరులుగా మారిపోయారు. మస్జిదున్నబవీ నిర్మాణంలో సామాన్య కూలీగా రాళ్ళు మోశారు. ఆడుసు కలిపారు. ఈ దశలోని ముహమ్మద్ (స) జీవన శైలి సమిష్టిజీవన (కమ్యూన్) నియమాలుగా మారాయి. ముస్లిం సౌభాత్రృత్వానికి పునాదులేసింది ఈ సమిష్టిజీవన నియమాలులే. తరువాతి కాలంలో ఈ నమూనాను అనుసరించిన ఉద్యమలకు లెఖ్ఖేలేదు. నాయకుడు నిరాడంబరంగా వుండాలనే విలువలకు అది పుట్టినిల్లు.
ప్రతి ఉద్యమం కొన్ని కొత్త విలువలతో ఆరంభమౌతుంది. అయితే, ఉద్యమకారులకు తాము చెప్పే కొత్త విలువలపట్ల అచంచల విశ్వాసం వుండాలి. అదే లోపించినపుడు ఎంతటి ఉద్యమమైనాసరే ఆరంభదశ దాటకుండానే అంతరించిపోతుంది.
సామ్యవాద ఉద్యమాలు పైకి ఎగసినంత వేగంగా తరచూ కిందికి పడిపోతుండడానికి కారణం చెప్పే సిధ్ధాంతానికీ, చేసే ఆచరణకూ పొంతనలేక పోవడమే. సామ్యవాద ఉద్యమాలు వ్యక్తిగత ఆస్తిని తీవ్రంగా ద్వేషిస్తాయి. సామ్యవాదులు ఆ విషయాన్ని గట్టిగా నమ్మేటట్టయితే, మొత్తం సమాజంలో కాకపోయినా, కనీసం వాళ్ల సంఘ సభ్యుల మధ్య అయినా, పరిమిత స్థాయిలోనైనా, వ్యక్తిగత ఆస్తిని రద్దు చేసుకోవచ్చు. వాళ్ళే అలా చేయలేకపోతే, సామ్యవాద సిధ్ధాంతాల్ని బయటివాళ్ళేకాక, లోపలివాళ్ళూ నమ్మరు. కొంత కాలానికి, ఆచరణలేని సామ్యవాద సంస్థల్లోనే ఉన్నవాళ్ళు, లేనివాళ్ల మధ్య అంతర్యుధ్ధం ఆరంభమౌతుంది.
ఆర్ధికరంగంలో ఉన్నవాళ్ళు, లేనివాళ్లనే విభజనని ఇస్లాం గుర్తిస్తుంది. ఇస్లాం రాజకీయార్థిక విధానం శ్రేయోరాజ్యం. పెట్టుబడిదారీ సమాజంకన్నా, సామ్యవాద సమాజంకన్నా ఇది భిన్నమైనది. పెట్టుబడిదారీ సమాజం శ్రామికుల కష్టాన్ని గుర్తించదు. సామ్యవాద సమాజం పెట్టుబడీదారుల నిర్వహణ సామర్థ్యాన్నీ గుర్తించదు. ఇస్లాం ఆ రెండింటినీ సమన్వయ పరుస్తుంది. పేదలు, అనాధలు, అన్నార్తులపట్ల బాధ్యతాయుతంగా, మానవీయంగా, దయగలిగివుండాలని ధనవంతుల్ని కట్టడిచేస్తుంది. ఇస్లావిూయ సమాజంలో, తమ పరిసరాల్లోని పేదల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ధనవంతులదే. ఇందులో, వాళ్లకు మినహాయింపులేదు.
ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనేవి ఇస్లాం ధార్మిక జీవనానికి ఐదు మూలస్థంభాలు. వీటిల్లో, మొదటి మూడు విధుల్ని ధనిక, పేద తేడాల్లేకుండా ప్రతి ముస్లిం పాటించితీరాల్సిందే. మిగిలిన రెండు విధులు ప్రధానంగా ధనంతుల కోసం నిర్దేశించినవి.
ధర్మబధ్ధమైన వ్యాపకాల ద్వార ముస్లింలు వ్యక్తిగత ఆస్తిని కూడబెట్టవచ్చు. అయితే, అలా సంపాదించిన ఆస్తిపై ప్రతియేటా పేదలకు విధిగా జకాత్ చెల్లిస్తూవుండాలి. ధనవంతుల ఆస్తిపై జకాత్ అనేది పేదల హక్కు. జకాత్ చెల్లించని అస్థి ఇస్లాంలో ధర్మసమ్మతంకాదు. ఈ నియయమే, వక్ఫ్ ఆవిర్భావానికి దారితీసింది. జకాత్ కు కొనసాగింపే ఆధునిక శ్రేయోరాజ్యాలు. ఇస్లాం శ్రేయోరాజ్య ప్రభావం మహాత్మ గాంధీజీ బోధించిన ధర్మకర్తృత్వ రాజ్యంలో కూడా కనిపిస్తుంది.
ఇస్లామీయ రాజ్యం ఏర్పడ్ద తరువాతే, ఇస్లామీయ ఆర్ధిక విధానాన్ని అమలు చేయవచ్చని, ముహమ్మద్ (స) వాయిదా వేయలేదు. మదీనా చేరుకున్న కొద్దిరోజులకే దాన్ని అమల్లోపెట్టారు. మదీనాలో స్థితిమంతులైన అన్సార్లను పిలిచి, మక్కానుండి కట్టుబట్టలతో వచ్చిన ముహాజిర్లని సోదరులుగా చూసుకోవాలన్నారు. వెంటనే, ముహాజిర్లందరినీ ఆ అన్సార్లు తమ ఇళ్లకు తీసుకు వెళ్ళి, ఆస్థిపాస్తుల లెఖ్ఖలు చూపి, కొత్త సోదరులకు సగం వాటాలు రాసివ్వడమేగాక, తక్షణం వాటిని స్వాధీనం చేసేశారు. విచిత్రం ఏమంటే, ఇస్లాంకు ఇంకా చెప్పుకోదగ్గ పెద్ద విజయం ఏదీ దక్కక ముందే, ముస్లిం సమాజంలో సమిష్టి ఆర్ధిక విధానాన్ని ప్రవేశపెట్టేశారు. ఈ సమిష్టి ఆర్ధిక విధానం అరేబియా దేశాల్లో అప్పట్లో, ఒక భూకంపాన్ని సృష్టించింది.
పాలకులకు ఒక విచిత్ర లక్షణం వుంటుంది. ప్రతి ఉద్యమాన్నీ అవి క్రూరంగా అణిచివేస్తాయి. అయితే, ఉద్యమాల్ని అణిచివేసినంత సులువుగా, ఆ వుద్యమాలు ముందుకు తెచ్చిన కొత్త విలువల్ని అణిచివేయడం సాధ్యంకాదు. అందువల్ల, ఉద్యమాలని అణిచివేసిన పాలకులే, ఆ ఉద్యమాలు ముందుకు తెచ్చిన కొత్త విలువల్ని అపహరించేస్తాయి. వాటిలోని, ఆత్మను, జీవగర్రను తొలిగించేసి, మిగిలిన తుక్కుని తమమీద కప్పుకుంటాయి. అలాంటి సందర్భాల్లో, పాలకులే ఉద్యమకారులుగా మారిపోయినట్టు భ్రమ కలుగుతుంది. పాలకులు ఆడే ఇలాంటి కపట నాటకం నిర్బంధంకన్నా ప్రమాదకరం.
చరిత్రలో ప్రతి ఉద్యమం ఒక పాత ఉద్యమానికి కొనసాగింగిపుగానే పుడుతుంది. కానీ, పాత ఉద్యమాల్లోంచి, జీవం తీసేసిన శవాల్ని పాలకవర్గాలు మోస్తున్నపుడు ప్రజల్లో ఒక గందరగోళం ఏర్పడుతుంది. పాత ఉద్యమాల్లోని ప్రాణప్రదమైన అంశాల్నీ కాపాడుకొంటూనే, వాటిపట్ల పాలకులు సృష్టిస్తున్న గందరగోళాన్ని ఛేధించగలిగిపుడే కొత్త ఉద్యమాలు ముందుకు సాగుతాయి.
ఇస్లాం ఉద్యమం మదీనాకు చేరిన కొత్తలో ముస్లింలు, యూదులు దాయదుల్లా వుండేవారు. ఇద్దరి ధార్మికకేంద్రం ఒక్కటే. ఇద్దరికీ ఉమ్మడి కిబ్లాగా బైతుల్ మక్దిస్ (జెరూసలేం) వుండేది. ధార్మికమార్గంలో యూదులు దారితప్పారని చాటిచెప్పాల్సిన సమయం వచ్చింది. యూదులు సృష్టిస్తున్న గందరగోళాన్ని పటాపంచలు చేయడానికి, హిజ్రీ శకం రెండవ సంవత్సరంలో కిబ్లానే మార్చాల్సివచ్చింది. కొత్త ధార్మికకేంద్రంగా కాబా అవతరించింది. వర్తమాన చరిత్రలో కూడా విప్లవకేంద్రాలను మార్చడం, ఉద్యమ కేంద్రాలను మార్చడం వంటివి మనకు కనిపిస్తాయి.
అంతవరకు కమ్యూనిస్టులు ప్రపంచ విప్లవకేంద్రంగా భావిస్తున్న సోవియట్ రష్యాను మావో అమెరికాతో సమానంగా సామ్యాజవాద దేశంగా పేర్కొని, విమర్శించాడు. చైనాను కొత్త ప్రపంచ విప్లవకేంద్రంగా పేర్కొన్నాడు. దిక్కుల పరంగా చూస్తే, ప్రపంచ విప్లవ కేంద్రాన్ని మావో పశ్చిమ దిక్కు నుండి తూర్పు దిక్కుకు మర్చాడు.
ఆయుధాల్లేని యుధ్ధాలే రాజకీయాలు. ఆయుధాలతో కూడిన రాజకీయాలే యుధ్ధాలు. అది నిజమేకానీ, యుధ్ధాల్లో విజయాన్ని నిర్ణయించేవి ఆయుధాలు కాదు; సైనికుల అంకితభావం. అంకితభావంగల సైనికులు వందల సంఖ్యల్లోవున్నాసరే, వేల సంఖ్యల్లోవుండే కిరాయి సైనికుల్ని అవలీలగా ఓడించగలరని బద్ర్ యుధ్ధంలో నిరూపించారు ముహమ్మద్ (స). అలాగే, ఉద్యమకారుల్లో ఆత్మవిశ్వాసం అతిశయిస్తే, సులువుగా దక్కాల్సిన విజయాలు కూడా పరాజయాలుగా మారిపోయే ప్రమాదంవుందని ఉహుద్ యుధ్ధంలో హెచ్చరించారు.
మానవ సంబంధాలు, ఆర్ధిక లావాదేవీల చర్చ ఉహూద్ యుధ్ధం తరువాత వేదిక మీదికి వచ్చింది. మనుషుల్లో కొందరు భావోద్వేగాలనుతప్ప, ఆర్ధిక నియమాలను గుర్తించరు. వీళ్ళు అచ్చంగా భావుకులు. మరికొందరు ఆర్ధిక నియమాలనుతప్ప భావోద్వేగాలను పట్టించుకోరు. వీళ్ళు ఆర్ధిక నిర్ణాయక వాదులు. నిజానికి వీళ్ళిద్దరి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. ఎందుకంటే, ఇద్దరూ రెండువైపుల నుండి ఓకే తప్పును చేస్తుంటారు. ఆర్దిక నియమాల్ని అదుపుచేస్తూ, మనిషితనాన్ని కాపాడడానికి ఇస్లాం కృషిచేస్తుంది.
ఇస్లాం వ్యక్తిగత ఆస్తిని నిరాకరించదు. వ్యక్తిగత ఆస్థిని అమానుషంగా మార్చివేసే వడ్డీని మాత్రం పూర్తిగా రద్దుచేస్తుంది. వడ్డీని మానజాతికి పట్టిన రాచపుండుగా, హెచ్.ఐ.వీగా భావిస్తుంది. ఉహూద్ యుధ్ధం తరువాత జరిగిన సమీక్షా సమావేశంలో, ముహమ్మద్ (స) వడ్డీని శాశ్వితంగా నిషేధించారు. రాజకీయార్ధికశాస్త్రంలో ఇతరులకూ, ఇస్లాం అనుయాయులకు ప్రధానమైన తేడాఇదే.
వర్తమాన సమాజంలో, పెట్టుబడీదారీదేశాల కూటమికీ, ముస్లిందేశాలకూ మధ్య సాగుతున్న ఘర్షణకు మూలం వడ్డియే. సామ్రాజ్యవాదం నిలబడేదే ఫైనాన్స్ కేపిటల్ మీద. వడ్డీ తినకుండా ఫైనాన్స్ కేపిటల్ ఒక్క క్షణం కూడా బతకలేదు; మరుక్షణం చచ్చిపోతుంది. వడ్డీని అంతం చేయడమే ఇస్లాం ధార్మిక లక్ష్యం. తద్వార అది సామ్యాజ్యవాదాన్ని కూడా అంతం చేస్తుంది.
వడ్డీని అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళే తననూ అంతంచేస్తారని సామ్యాజ్యవాదానికి కూడా స్పష్టంగా తెలుసు. గల్ఫ్ యుధ్ధంవల్ల అమెరికాపై ఆర్ధికమాద్యం విరుచుకుపడుతుందనీ, దేశంలో పేదరికం పెరిగిపోతుందనీ తెలిసినా సరే, సీనియర్ బుష్, జూనియర్ బుష్షులు వెనుకాడలేదు. అంపశయ్యపైవున్న సామ్యాజ్యవాదాన్ని, ప్రాణరక్షణ మందులు పోసైనా సరే, మరికొంతకాలం బతికించుకోవాలనే తాపత్రయంతోనే అమేరిక, గల్ఫ్ యుధ్ధాల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. చావు భయంతోనే సామ్యాజ్యవాదం, ఇస్లాంపై, ధార్మిక పోరాటం చేస్తోంది.
ఎంతటి అణిచివేతను ప్రయోగించినాసరే, ఉద్యమాలు మునుముందుకే సాగుతున్నప్పుడు పాలకులు ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఊపిరి తీసుకునే సమయం కోసం వాళ్ళు శాంతి చర్చల్ని ఆరంభిస్తారు. చరిత్రాత్మక హుబైదియా శాంతి ఒప్పందంలోని, అన్ని అంశాలూ మక్కా కురైషీలకు అనుకూలంగావున్నాయి. ఇస్లాం ఉద్యమకారులకు సానుకూలంగావున్న అంశాలు అందులో దాదాపు శూన్యం. చివరకు ముహమ్మద్ (స)ను ఎలా సంబోధించాలనే విషయంలోనూ పేచీలొచ్చాయి. అయినప్పటికీ, ఆ ఒప్పందాన్ని సంతోషంగా అంగీకరించి, ఎంతో ముందు చూపు ప్రదర్శించారు ప్రవక్త.
హుబైదియా శాంతి ఒప్పందాన్ని తరచి చూస్తే ఉద్యమానికి సానుకూల అంశాలు అనేకం కనిపిస్తాయి. ఉద్యమకారులతో ఒప్పందం చేసుకున్నారంటేనే ఉద్యమాన్ని పాలకులు గుర్తించారని అర్ధం. ఉద్యమాలకు అదే తొలి విజయం. శాంతికాలంలో ఊపిరి తీసుకునే సమయాన్ని పాలకులు కోరుకుంటారు. అదే సమయంలో, తమ సమూహాల్ని పెంచుకునే అవకాశం ఉద్యమకారులకు కూడా దక్కుతుంది. అది రెండో విజయం. శాంతి ఒప్పంద షరతుల్ని ఎక్కువ రోజులు పాటించడం పాలకులకు ఎలాగూ సాధ్యంకాదు. శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిన మరుక్షణమే పాలకుల నైతిక పతనం ఆరంభమౌతుంది. అది మూడవ విజయం. మరోవైపు, ఉద్యమకారులకు నైతిక మద్దతు పెరుగుతుంది. అది నాలుగో విజయం.
భవిష్యత్ విజయాలను స్వతం చేసుకోవాలంటే, ఉద్యమకారులు కొంచెం నష్టమైనా సరే భరించి దౌత్యనీతిని పాటించితీరాలి. హుబైదియా శాంతి ఒప్పందంపై సంతకం చేయడం ద్వార ముహమ్మద్ (స) చాటి చెప్పిన సత్యం ఇదే.
శాంతి ఒప్పంద కాలంలో దొరికిన వెసులుబాటుని, ముస్లిం సమాజాన్ని సరికొత్త విలువల పునాదులపై నిర్మించడానికి ఉపయోగించారు ముహమ్మద్ (స). ముస్లిం సమాజ సభ్యుల ప్రవర్తనా నియమావళి రూపుదిద్దుకోవడం మొదలైంది ఈ కాలంలోనే, విధవా స్త్రీ పునర్ వివాహం, స్త్రీలకు అస్తిహక్కు, విడాకుల హక్కు, బానిసత్వంరద్దు, శ్రామికుల గౌరవం అనేవి ఇందులో ఆరంభం మాత్రమే. అంతకన్నా మహత్తరమైన విషయాలు ఆ నియమావళిలో చాలాచాలా వున్నాయి. వీటిని విలువలుగా గుర్తించడానికి, ఇతర సమాజాలకూ వెయ్యేళ్లకు పైగా పట్టింది.
ప్రతి కుటుంబంలో, పోషణ భారం మోస్తున్న వాళ్ళకు ఎప్పుడూ ఒక సంధిగ్ధం వుంటుంది. వాళ్ళకన్నా ముందు తరంలో తల్లిదండ్రులువుంటారు, వాళ్ల తరువాతి తరంలో సంతానం వుంటారు. వాళ్లతోపాటు జీవిత సహచరులు వుంటారు. తోబుట్టువులు వుంటారు. తమ సంపాదనలో తాము ఎంత అనుభవించాలో, కుటుంబసభ్యుల్లో ఎవరికి ఎంత పంచాలో తెలియక వాళ్ళు సతమతమౌతారు. ఇవ్వాల్సిన దానికన్నా ఒకరికి ఎక్కువ ఇచ్చినా, ఇవ్వాల్సిన దానికన్నా ఇంకొకరికి తక్కువ ఇచ్చినా కుటుంబంలో సంక్షోభం మొదలువుతుంది. మానవసంబంధాలు దెబ్బతింటాయి. అది అక్కడితో ఆగదు. క్రమంగా, సమాజ సంక్షోభంగా మారుతుంది. ఆర్ధికానికీ, మానవసంబంధాలకూ సంబంధించి అత్యంత సున్నితమైన ఆస్థి పంపకాల వ్యవహారాన్ని ఇస్లాం ధార్మిక వేదిక మీద పరిష్కరించింది. మనిషి తన కుటుంబ బాధ్యతల్ని, బంధువుల బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలో, వారసత్వ హక్కుల రూపంలో, ఖురాన్ లోని అల్ నిసా సూరా 11వ ఆయత్ లో వుంటుంది.
అలాగే వాణిజ్య లావాదేవీల గురించి కూడా ఈ కాలంలోనే నియమనిబంధనలు రూపుదిద్దుకున్నాయి. ఆస్తులు, అప్పులు, ఒప్పందాలు, రుణాలు చెల్లించాల్సిన తేదీలు, కక్షీదారులు, సంరక్షకులు, సాక్షులు, దస్తావేజులు రాసేవాళ్ళు వగయిరా విధానాలన్నీ మనకు అల్ బఖ్ర సూరాలోని 282వ ఆయత్ లో కనిపిస్తాయి.
ఆరవ శతాబ్దంలో రుపుదిద్దుకున్న ఈ సివిల్, ఫైనాన్షియల్ నిబంధనలు ఇప్పటికీ తమ ప్రాధాన్యతను కోల్పోలేదు. నిజానికి, వీటి ఉల్లంఘనే, నేటి కుటుంబ సంక్షోభాలకూ, కుటుంబాంతర సంక్షోభాలకూ కారణమంటే అతిశయోక్తికాదు.
ఇంతకీ, ఈ రెండు ఆయతుల్లో చెప్పిన నియమావళిని అమలుచేయడానికి అవసరమైన పరికరాలు, యంత్రాంగం అప్పటికింకా అందుబాటులో లేవు. వారసత్వ హక్కుల వాటాలు తేల్చడానికి, హుటాహుటిన, ’అల్ జబ్ర్’ రూపుదిద్దుకుంది. వాణిజ్య లెఖ్ఖలు తేల్చడానికి ’హిసాబ్’ రూపుదిద్దుకుంది. ఇందులో, మొదటిది గణితశాస్త్రంలో ఆల్ జీబ్రాగా అభివృధ్ధి చెందగా, రెండోది వాణిజ్యరంగంలో ఎకౌంటెన్సీగా అభివృధ్ధిచెందింది. ఆధునిక సమాజానికీ, ఆధునిక శాస్త్రాలకూ ఇస్లాం అందించిన అనేక వరాల్లో ఇవి కొన్ని మాత్రమే.
ఉద్యమాల్లోకి వచ్చే చేరే వారందరు ఉద్యమకారులే అనుకుంటే పొరపాటు. ఉద్యమం విస్తరిస్తున్నపుడు దానికి ఒకరకపు ’గిరాకీ’ ఏర్పడుతుంది. పరిమిత అధికారం కూడా అందుబాటులోనికి వస్తుంది. ఇలాంటి సమయాల్లో, ఉద్యమకారులతోపాటూ, అనేక రకాల సమూహాలు వచ్చి ఉద్యమాల్లో చేరిపోతుంటాయి. ఇందులో, ఉద్యమ లక్ష్యాల మీద నమ్మకం సన్నగిల్లుతున్నవాళ్ళూ, అనుమాన పీడితులు, భయస్తులు, నిర్బంధంకన్నా పాత జీవితమే మేలనుకునేవాళ్ళూ, ఉద్యమ వ్యతిరేకులు, సంఘ విద్రోహకర శక్తులు, పాలకులు పంపిన గూఢాచారులు, సోమరులు, ఎందుకూ పనికిరానివాళ్ళు, ఇతర అనేకానేక కారణాలతో వచ్చి చేరినవాళ్ళూ వుంటారు. ఒక దశలో ఉద్యమసంస్థలపై, ఉద్యమకారులకన్నా, ఉద్యమ వ్యతిరేకుల ప్రాబల్యమే పెరిగిపోవచ్చు. అప్పుడు సెంటిమెంటును కూడా పక్కన పెట్టి, ఉద్యమ కేంద్రాల్ని సహితం కూల్చేయాల్సి వుంటుంది. ఇలాంటి సందర్భం వచ్చినపుడు, ముహమ్మదు (స) మసీదు అనే సెంటిమెంటును కూడా పక్కనపెట్టారు. ఉద్యమ వ్యతిరేకుల నిలయంగా మారిపోయిన జిరార్ మసీదును కూల్చివేయించారు.
చైనా విప్లవంలో, విప్లవ ప్రతీఘాత శక్తుల్ని ఎదుర్కోడానికి మావో ”బొంబాట్ ద హెడ్ క్వార్టర్స్” అని పిలుపిచ్చాడు. ”నేను నిర్మించాలనుకున్న దేవాలయంలో ముందుగానే దయ్యాలు కాపురం పెట్టాయి” అన్నాడు భారత రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్. స్వాతంత్ర భారత దేశంలో నేటికీ కొనసాగుతున్న చారిత్రక తప్పేమిటంటే, దేవాలయం నుండి ఆ దయ్యాల్ని ఇంతవరకూ ఎవరూ తరమకపోవడమే.
ఉద్యమాలకు వరుస విజయాలు దక్కి, అంతిమ విజయం సమీపిస్తున్న సూచనలు కనిపిస్తున్నపుడు, రెండు ప్రమాదాలు ముంచుకు వస్తాయి. ఒకవైపు, అప్పటి వరకు ఉద్యమానికి ఎన్నో సేవలు అందించిన ప్రముఖులు కొంత అలసత్వానికి అలవాటుపడతారు. మరోవైపు, ఉద్యమ శిబిరంలోనే పాలకవర్గ లక్షణాలు, అధికారాదర్పాన్ని ప్రదర్శించే ధోరణి పొడచూపుతాయి. ఈ రెండు అవలక్షణాల్ని మొగ్గలోనే తుంచేయకపోతే, ఉద్యమానికి దగ్గరగా వచ్చిన అంతిమ విజయం వెనక్కి పోయే ప్రమాదం వుంటుంది.
ఉద్యమాల్లో అలసత్వానికిగురైన వాళ్లను మళ్ళీ క్రీయాశీలురుగా మార్చే తీరును, మనం హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్ ఉదంతంలో చూస్తాం. సాధారణంగా ఉద్యమకారులు తమ సమయంలో ఎక్కువ భాగాన్ని బయటి శతృవులను ఎదుర్కోవడంతోనే గడపాల్సి వుంటుంది. అందువల్ల, ఉద్యమం లోపల పెరుగుతున్న చెడు ధోరణులపై దృష్టిపెట్టే అవకాశం అరుదుగా మాత్రమే దక్కుతుంది. అయినప్పటికీ, అవకాశాన్ని చేజిక్కించుకుని, తరచుగా, ’అంతర్గత చెడులపై యుధ్ధం’ చేయకతప్పదు. తబూక్ పోరాటానికి ముందు ఇస్లాం ఉద్యమంలో, ఇలాంటి ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినట్టు మనకు కనిపిస్తుంది.
ఉద్యమాలు ఆరంభించడం సులువేకానీ, ఉద్యమలక్ష్యాలను సాధించడానికి సుదీర్ఘకాలం పోరాటం చేయాల్సివుంటుంది. ప్రజల్ని చిన్నచిన్న పోరాటాల్లో, తాత్కాలిక యుధ్ధాల్లో, విసృత శిక్షణ ఇచ్చి ఒక మహాసంగ్రామానికి సిధ్ధం చేయాల్సి వుంటుంది. పాక్షికపోరాటాల్లో ఆరితేరిన ప్రజలే ఒకనాడు మహాసంగ్రామంలో ఘనవిజయం సాధించగలరు. అలాంటి ఘనవిజయాన్ని దక్కించుకోవడానికి ఇస్లాంకు రెండు దశాబ్దాలు పట్టింది.
మక్కాను స్వాధీనం చేసుకోడానికి బయలుదేరినపుడు ఇస్లాం సైనికుల సంఖ్య పదివేలు. దారిలో అనేక తెగల ప్రజలు తండోపతండాలుగా వచ్చి కలవడంతో అది అనేకరెట్లు పెరిగిపోయింది. అన్నింటికన్నా విచిత్రం ఏమంటే, పెద్దగా ప్రతిఘటన లేకుండానే మక్కా నగరం ముస్లింల స్వాధీనమైపోయింది. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ నాయకత్వంలో సాగిన సైన్యం చేతిలో పదమూడు మంది చనిపోయారుగానీ, ముహమ్మద్ (స) నాయకత్వంలో సాగిన సైన్యం చేతిలో ఒక్కరంటే ఒక్కరు కూడా చనిపోలేదు.
ఉద్యమకారుల్ని పాలకులు ఎప్పుడూ హింసావాదులుగా, క్రూరులుగా చిత్రిస్తూవుంటారు. ఈ బూటకపు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఉద్యమకారులు ప్రత్యేక కృషి చేయాల్సివుంటుంది. వీలున్న ప్రతిసందర్భంలోనూ ఉద్యమకారులు మహత్తర ఔదార్యాన్ని ప్రదర్శిస్తూ వుండాలి. ముస్లింలు మక్కాను స్వాధీనం చేసుకున్నాక, తమ మీద తీవ్రాతి తీవ్రంగా కక్ష తీర్చుకుంటారని ప్రత్యర్ధులు భయపడిపోయారు. వాళ్ల అంచనాలను తలకిందులుచేస్తూ, అందరికీ మన్నింపులు ప్రసాదించడమే పనిగా పెట్టుకున్నారు ముహమ్మద్ (స). ప్రత్యర్ధుల్లో అత్యంత దుష్టులుగా భావించిన అరేడుగురిని మాత్రమే శిక్షించారు. మహాసంగ్రామం ఇంత ప్రశాంతంగా ముగుస్తుందనిగానీ, ముగిసిందనిగానీ, బహుశ ఎవరూ అనుకుని వుండరు.
మక్కా విజయం తరువాత ఉద్యమ బాధ్యతలు తీరిపోలేదు. పైగా, మరింతగా పెరిగాయి. సాధించిన విజయాలను స్థిరపరచుకోవడం ఒక బాధ్యత. కొత్తగా రాబోయే శతృవులను ఎదుర్కోడానికి ఉద్యమ శక్తుల్ని అప్రమత్తంగా వుంచడం మరో బాధ్యత.
ఈ దశలోనే, ముస్లింలను మరింత పరిపూర్ణులుగా మార్చే పనికి ముహమ్మద్ (స) పూనుకున్నారు. ముస్లింల బాధ్యతను వ్యక్తి నుండి సమిష్టికి అభివృధ్ధిచేశారు. కుటుంబంతో మొదలై, పొరుగువారివరకు, ఆ పైన మొత్తం సమాజం వరకు, ఆ పైన పర్యావరణాన్నీ, ప్రకృతిని కాపాడుకునే వరకు సకల బాధ్యతల్ని ముస్లింలపై మోపారు.
”ముస్లిమేతరుల హక్కుల్ని కాపాడ్డం కూడా మీ బాధ్యతే. వాళ్లకు అన్యాయం తలపెట్టకూడదు. ఒక వేళ మీరు ధర్మం తప్పితే, తీర్పుదినం రోజున అల్లా న్యాయస్థానంలో నేను ముస్లిమేతరుల పక్షాన వాదిస్తాను” అన్న ఒక్క వ్యాక్యం చాలు, ఇస్లాం సమాజాన్ని, ముహమ్మద్ (స) ఎంతటి ప్రజాస్వామ్య పునాదుల మీద నిలబెట్టాలనుకున్నారో అర్ధంచేసుకోవడానికి. ఆధునిక ప్రజాస్వామ్య మహోపాధ్యాయులుగా భావించే, యూరప్ ఉదారవాదులు జాన్ లాక్, వాల్టెర్, రూసోలు ”మా అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోవచ్చు. కానీ మీ భావప్రకటన హక్కును కాపాడడానికి మా ప్రాణాలనైనా ఇస్తాము” అని ప్రకటించడానికి పన్నెండు వందల సంవత్సరాల క్రితమే ముహమ్మద్ (స) అన్న మాటలివి.
ముహమ్మద్ (స) ప్రవక్తగా మారిన తరువాత 22 సంవత్సరాలు జీవించారు. ఇస్లాం
చరిత్రలోని తొలి రెండు దశాబ్దాల కాలం దానికదే
ఒక ఉద్యమ ప్రణాళిక. ప్రపంచంలో, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా, దేన్నయినా మార్చడానికి, ఉద్యమాలని నిర్మించాల్సిన అవసరం వచ్చినపుడు ఒకసారి ఈ మ్యానిఫెస్టోను చదవడం మంచిది. దాన్నివల్ల, నడుస్తున్న ఉద్యమాల స్వరూప స్వభావాలు స్పష్టంగా అర్ధం అవుతాయి. అంతేకాదు, ఆ ఉద్యమాల భవిష్యత్తు కూడా, ’జోస్యం చెప్పినట్టు’, ’అంజనం వేసినట్టు’ ప్రస్పుటంగా కనిపిస్తుంది.
ఏ ఉద్యమంలోనైనాసరే ’గ్రాండ్ నార్మేటివ్స్’ కొన్ని వుంటాయి. తధ్ధర్మక్రియలు అన్నమాటా. వాటిని అర్ధం చేసుకున్నవాళ్ళు రాబోయే పరిణామాలకు సంసిధ్ధంగా వుంటారు. అర్ధంకానివాళ్ళు ప్రతి మలుపులో తత్తరపడిపోతారు. వాళ్లకు ప్రతీదీ, కొత్తగానూ, ప్రపంచంలో మొదటిసారి జరుగుతున్నట్టు వుంటుంది. ఈ ఉపద్రవాన్ని అధిగమించడానికి ఒక సులభ మార్గం ఏమంటే, ముహమ్మద్ (స) జీవిత చరిత్రను అధ్యయనం చేయడం.
అయితే, ముహమ్మద్ (స) జీవిత చరిత్రను రాయడం అంత సులువైన వ్యవహారంకాదు. ఎందుకంటే, ముహమ్మద్ (స) జీవితం గత చరిత్రకాదు! నడుస్తున్న చరిత్ర!. భవిష్యత్ చరిత్ర.! పరిశీలించిన ప్రతిసారీ అందులో వర్తమానానికి చెందిన ఒక కొత్త కోణం కనిపిస్తూనే వుంటుంది.
ఆకలితో, అర్ధాకలితో చనిపోతున్న జనంవున్న వర్తమాన భారతదేశంలో ఎకంగా 30 లక్షల టన్నుల అహారధాన్యాల్ని మురగబెట్టిన మన పాలకుల్ని ఏమనాలి?. ”అహారధాన్యాల్ని నిల్వచేయడం చేతకాకపోతే పేదలకు ఉచితంగా పంచండి” అని భారత సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఆదేశిస్తే ”అది కుదరదు” అన్న మనదేశ వ్యవసాయశాఖా మంత్రిని ఎలా అర్ధంచేసుకోవాలీ?
సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలుసో తెలీదోగానీ, అది పాటించింది మాత్రం పవిత్ర ఖురాన్ ఆదేశాన్నే. ”అరాయతల్లజీ/ యకజ్జబూ బిద్దీన్ /ఫజాలికల్లజీ/ యదివుల్ యతీమా/ ....” అంటూ ఆరంభమయ్యే ’అల్ మావూన్’ సూరాను తమ పరిభాషలో చదివారు న్యాయమూర్తులు.
దాని అర్ధం ఇది:
”సూర 107 : వితరణ
అనంత కరుణామయుడు అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో
పరలోక తీర్పును ధిక్కరించేవారిని చూశారా?
వాళ్ళు అనాధల్ని కసిరికొడుతుంటారు
ఆకలిగొన్నవారికి అన్నదానం చేయరు
వాళ్ళు అవధుల్లేని మహాపిసినారులు
పాతసామాన్లు, పాతదుస్తుల్ని కూడా దానంచెయ్యరు
వాళ్ళు అల్పులు, వాళ్లది ప్రదర్శన బుధ్ధి
ప్రతిపని లోకుల మెప్పుకోసం చేస్తుంటారు.
అల్లా ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తే వినాశనం తప్పదు!”
గతంలో వర్తమానం, వర్తమానంలో గతం అంటే ఇదే. భూత, భవిష్యత్ వర్తమాన కాలాల్ని పెనవేసుకుంటూ సాగుతుంది ముహమ్మద్ (స) జీవితం.
నా పరిమితుల గురించి ఇక్కడ ఒక మాట చెప్పాలి. ముహమ్మద్ (స) గురించి నాలుగు మాటలు రాసే అర్హత నాకు వుందని అనుకోను. అలాంటి అంశ నాలో ఏమాత్రమున్నా, ఆ గౌరవమంతా నా ధార్మిక గురువు మా అమ్మీ సఫియా బేగం కే దక్కాలి. ముహమ్మద్ (స) గొప్పతనం గురించి మాకు తెలిసింది మా అమ్మీ ద్వారానే.
చిన్నప్పుడు నేనూ, మా తమ్ముడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ముహమ్మద్ (స) ను వేడుకునేవాళ్లం. వారి గురించి ఇంట్లో తరచుగా వినడంవల్ల కావచ్చు, మా పేదరికంవల్ల కావచ్చు, మా ఆకలి బాధవల్ల కావచ్చు, మా నిస్సహాయతవల్ల కావచ్చు, మా దిక్కులేనితనంవల్లా కావచ్చు, వారూ (స), వారి కుమార్తె హజ్రత్ ఫాతిమాగార్లు మాకు అత్యంత సమీప బంధువులని మేమిద్దరం నమ్మేవాళ్ళం. మా కోర్కెల జాబితాలో అన్నం, కూరలు, మిఠాయిలు కూడా వుండేవి. ఒక రోజు మా ’దువా’ మా అమ్మీ చెవుల్లో పడింది. లబోదిబోమని గొడవ చేసేసింది. ముహమ్మద్ (స) ను వేడుకున్నందుకు లెంపలు వేయించింది. అల్లాను తప్ప మరి ఎవ్వర్నీ, ఎప్పుడూ, ఏదీ వేడుకోకూడదని పదేపదే హెచ్చరించింది. అల్లాను కూడా; జీవితంలో శాంతి, శుభం (సలామ్ ఔర్ బర్కత్) ప్రసాదించమని కోరడమేతప్ప చిల్లర కోరికలు ఏవీ కోరకూడదు అన్నది.
అమ్మీ మమ్మల్ని అంతగా హెచ్చరించడానికి ఒక కారణంవుంది. ఉద్యమాలు ముగిసిన తరువాత, సాధారంగా ఒక తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఉద్యమ నాయకుల విగ్రహాలు అన్ని చోట్లా వెలుస్తాయి. కానీ, ఆయా ఉద్యమాలు ముందుకు తెచ్చిన కొత్త విలువల్ని కొత్త పాలకులు మసకబారుస్తారు; పక్కన పడేస్తారు. సూర్యూడ్ని చూడమని వేలుచూపితే, చూపుడు వేలిని మాత్రమే చూసే మూర్ఖులు ఎప్పుడూ వుంటారు. మహానాయకుల్ని, మహోపాధ్యాయుల్ని విగ్రహాలుగా మార్చేసిన సాంప్రదాయం కమ్యూనిస్టు పార్టీలతోసహా, అనేక ఉద్యమాల్లో చూస్తుంటాం.
ఈ అనుభవంతో, నాకు ఒక విషయం మాత్రం స్పష్టంగానే, అర్ధమయింది. తన తరువాత, తన అనుయాయులు దారితప్పి మళ్ళీ విగ్రహారాధనను చేపట్టవచ్చని ముహమ్మద్(స) కు ఎక్కడో ఒక సందేహం వచ్చివుంటుంది. తనను కూడా కొత్తదేవుళ్ల జాబితాలో చేర్చేస్తారని అనుమానం వచ్చివుంటుంది. అందుకే, తాను ప్రవచించిన విగ్రహారాధన నిషేధాన్ని తనకు కూడా వర్తించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అల్లాను తన కోసం కూడా ప్రార్ధించాలని, ఆయన, అనుయాయులకు మరీమరీ చెప్పారు. ముహమ్మద్ (స) ’ను’ వేడుకోవడంకాదు; ముహమ్మద్ (స) ’కోసం’ వేడుకోవాలి. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా, అంటే, ఈ దువా చేయకుండా ముస్లింలకు ఏ నమాజూ పూర్తికాదు.
అల్లహుమ్మ సల్లి/ అలా ముహమ్మదీన్/ వాఅలాఆలి ముహమ్మదీన్/ కమా సల్లైత / అలా ఇబ్రాహీమా/ వాఅలాఆలి ఇబ్రాహీమా/ ఇన్నక హమీదు మ్మజీద్/
అల్లహుమ్మ బారిక్ / అలా ముహమ్మదీన్/ వాఅలాఆలి ముహమ్మదీన్/ కమా బారక్త / అలా ఇబ్రాహీమా/ వాఅలాఆలి ఇబ్రాహీమా/ ఇన్నక హమీదు మ్మజీద్/
”అల్లా! అబ్రహామ్ ప్రవక్తకూ, ఆయన అనుయాయులకూ ప్రసాదించిన శాంతిని ముహమ్మద్ ప్రవక్తకూ, ఆయన అనుయాయులకూ ప్రసాదించు.
అల్లా! అబ్రహామ్ ప్రవక్తకూ, ఆయన అనుయాయులకూ ప్రసాదించిన శుభాలను ముహమ్మద్ ప్రవక్తకూ, ఆయన అనుయాయులకూ ప్రసాదించు.”
ప్రపంచ రాజకీయ, ఆర్దిక పయనాన్ని గమనించేవాళ్లకు, ఈ దువా గతం కాదనీ, వర్తమానం కూడా అని సులువుగానే అర్ధం అవుతుంది. లేకుంటే, ఇజ్రాయిల్ - పాలస్తీనా శాంతి చర్చలు అర్ధంకావు. అమెరికా ఏకధృవ పాలన అర్ధంకాదు. అవి అర్ధం కాకుంటే ప్రపంచ రాజకీయార్ధికాలు మనకు ఎప్పటికీ అర్ధం కావు. అవి అర్ధంకావాలంటే, ఒక్కసారైనా ముహమ్మద్ (స) జీవితాన్ని అధ్యయనం చేయక తప్పదు.
మనం మరొక్కసారి ముహమ్మద్ (స) జీవితాన్ని చదివే అవకాశాన్ని మిత్రులు రెహమన్ కల్పించారు. నాకు తెలిసి ఈ పుస్తక రచనని వారు కనీసం పదేళ్ల క్రితం ఆరంభించారు. ఇంకా చెప్పాలంటే, ఆయన భూమ్మీద పడ్దప్పటి నుండీ ఈ కథను వింటూనే వున్నారు. రెహమాన్ నాన్నగారు హజ్రత్ అబ్దుర్రజ్జాఖ్ సాహేబ్ జీవితకాలం చీమలపాడు మసీదు ఇమాంగా వున్నారు. వారు మసీదులోనూ, కుటుంబంలోను ప్రచారం చేసింది ముహమ్మద్ (స) బోధనల్నే. ఆ రకంగా చూస్తే, ఈ పుస్తకం మొత్తంగా అరవైయేళ్ల అధ్యయన ఫలితం.
ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాలతోనేకాక, అరబ్బీ, పార్శీ సాహితీ సాంప్రదాయాలతోనూ అపార అనుబంధం కారణంగా, రెహమాన్ రచనలో ఒక వైవిధ్యం కనిపిస్తుంది. ముహమ్మద్ (స) జీవితానికి సంబంధించి రెహమాన్ కు తెలిసిన అనేకానేక కోణాల్ని ఇంత తక్కువ పేజీల్లో రాయడం అంత సులభం కాదు. ఆ కష్టం మనకు ఆయన రచనంతా కనిపిస్తూనే వుంటుంది.
ముహమ్మద్ (స) జీవితం మీద ఇప్పటికే అనేక భాషల్లో అనేక పుస్తకాలు వచ్చాయి. ఇక ముందు కూడా అనేకం వస్తాయి. వాటిల్లో రెహమన్ పుస్తకం తన ప్రత్యేకతను చాటుకుంటుందని అశిద్దాం. అచ్చుకాకముందే చదివే అవకాశం దక్కడమే ఒక అదృష్టం అనుకుంటుంటే, దానికి తొలిపలుకులు కూడా రాయమన్నారాయన. ఇది నాకు అప్పనంగా వచ్చిన కీర్తి. ముఫ్త్ కా యశ్!
రెహమన్ సాబ్ సలామ్ అలైకుమ్! మీకు శాంతి, శుభాలు కలుగుగాక!
- అహమ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ జర్రానీ (డానీ)
నోట్ :
ముస్లిం సంస్కృతిలో ’సలాం’ (శాంతి) అంత తరచుగా వాడే మరో పదం ’బర్కత్’. ఇస్లాం ధార్మిక జీవితంలో ఇవి రెండూ జంట భావనలు, బర్కత్ కు సరైన తెలుగుపదాన్ని నేను కనుక్కోలేకపోయాను. శుభాలు, పొలి కలుగుగాక అనేవి బర్కత్ కు పాక్షిక అర్ధాన్నే ఇస్తున్నాయి. బర్కత్ అర్ధాన్ని ఆచరణాత్మకంగా చెప్పాలంటే, వున్నదానితో సంతృప్తిగా బతకడం. వస్తుగత ప్రయోజనంకన్నా, మానసిక సంతృప్తే ఇందులో ప్రధానం. నలుగురి కోసం వండిన అన్నాన్ని పదిమంది "సంతృప్తిగా" తినడాన్ని కూడా బర్కత్ అంటారు.
హైదరాబాద్
26 సెప్టెంబర్ 2010
sir very intresting story
ReplyDeleteReally great article sir. Pravesika la kanipistonna samagra kathanam.
ReplyDeleteThank you very much.
DeleteThank you very much.
Deletesir thank you so much, detailed information. learnt lot of things
ReplyDeleteThank you very much
ReplyDelete