Monday 17 June 2013

Vegunat Mohana Prasad

డెభ్భయేళ్ళ పసిపిల్లాడు!
ఉషా యస్ డానీ

 అప్పుడు కాలం కడుపుతోవుండింది. కార్ల్‌ మార్క్స్‌ ను కనింది అని మయకోవిస్కీ రాసినట్టు, ఎమరెన్సీ రోజుల్లో విజయవాడ కడుపుతో వుండింది. కాలం కలిసివస్తే నడిచివచ్చే పిల్లలు పుడతారు అన్నట్టు మమ్మల్ని కనింది. మేము అంటే నేను, తాడి మోహన్‌, ఖాదర్‌, గౌస్‌, పతంజలి, విశ్వేశ్వరరావు, రావి రాంప్రసాద్‌, జమున వగయిరాలు. అప్పటికి మా వయస్సు  పాతికేళ్లకు ఓ బెత్తుడు అటుఇటూ వుండేది.   ఎవరికైనా ఇప్పుడు అభ్యంతరం వుంటేవుండొచ్చుగానీ, నాటి శ్రీకాకుళంకరీంనగర్‌, ఆదిలాబాద్‌ సాయుధ రైతాంగ పోరాటాల ప్రభావం మావిూద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వుంది. ఆమేరకు, మేమంతా నక్సల్‌ బరీ సంతతి!

కథకులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కవి వేగుంట మోహన్‌ ప్రసాద్‌ మాకన్నా ఓ పుష్కర కాలం  పెద్దాళ్ళు. వాళ్ళిద్దరికీ అప్పట్లోనే ఒకరకం స్టార్‌ ఇమేజి వుండేది.

ఖాదర్‌, గౌస్‌ ఇద్దరూ వేగుంట మోహన్‌ ప్రసాద్‌ గారితో చాలా సన్నిహితంగా వుండేవారు. అనేక రాత్రుళ్ళు ఆయనతో గడిపేవారు. అయితే, తొలిదశలోవేగుంట మోహన్‌ ప్రసాద్‌ గారితో నావి సత్సంబంధాలు కావు.  మా ఇద్దరికీ అసలు పడేదికాదు. పడే అవకాశమూలేదు. ఎలా పడుతుందీ? ఆయన టి.ఎస్‌. ఇలియట్‌ అభిమాని. నాది జాక్‌ లండన్‌ జీవనశైలి. ఇర్వింగ్‌ స్టోన్‌   'సైలర్‌ ఆన్‌ హార్స్‌ బ్యాక్‌' గుర్తుందికదా! మనది సేమ్‌ టూ సేమ్‌ స్టోరీ! !

సున్నితమనస్కుడైన ఓ కవికీ, కరడుగట్టిన కమ్యూనిస్టు కార్యకర్తకు పొంతన ఎలా కుదురుతుందీ? వ్యవసాయిక విప్లవానికేతప్పా, సాహిత్య వ్యవసాయానికి అది సమయం కాదని నమ్మే 'విజయవాడ చారు మజుందార్‌' వి.వి. కృష్ణారావు నాకు రాజకీయ గురువు. పచ్చి నిరాశవాదం, పలాయనవాదమంటూ 'మో' 'చితీ-చింత' ను చించి చాటేసిన 'తిరుపతి మావో సేటుంగ్‌' త్రిపురనేని మధుసూదనరావు నాకు తాత్విక గురువు!
అప్పట్లో, విజయవాడలో ఎక్కడ సాహిత్య సభ జరిగినా  కృష్ణారావు మమ్మల్ని తీసుకువెళ్ళేవారు. ''విూదారి నక్సల్‌ బరియా? కాదా?'' అని వక్తల్ని నిలదీసేవారు. అప్పుడు కొంత రభస జరిగేది. మేము సివిల్‌ కోర్టుల్ని కూడా వదిలేవాళ్లం కాదు. జడ్జిగారి పోడియంలోకి వెళ్ళి''బూర్జువా కోర్టులు నశించాలి'' అని నినాదాలు చేసేవాళ్ళం.  ఎక్కడైనా సరే గొడవపడడమే మాపని. కృష్ణారావు దళంలో నాది దండనాయకుని  పాత్ర అని వేరే చెప్పాల్సినపనిలేదు. ఆ పరంపరలో, 'చెట్టు' ఇస్మాయిల్‌, 'ఖాళీసీసాల' స్మైల్‌ సభల్లో కూడా మేము రభసచేశాం. మా భీభత్సాన్ని కళ్ళారా చూసినవాళ్లలో నండూరి రామ్మోహనరావు, వేగుంట మోహన్‌ ప్రసాద్‌ వంటి సున్నిత మనస్కులు కూడా వున్నారు.

దండనాయకుని  పాత్ర మొరటుగావున్నా, అందులో కొన్ని అదృష్టాలు కూడా వుంటాయి. ఉద్యమ ప్రముఖులు కృష్ణాజిల్లాకు వచ్చినపుడు వాళ్లకు అంగరక్షణ పాత్రను కూడా నేను నిర్వహించేవాడిని. నోబెల్‌ బహుమతి గ్రహిత గున్నార్‌ మిర్డాల్‌ కొడుకు జాన్‌ విూర్డాల్‌ (థర్డ్‌ వరల్డ్‌ పత్రిక ఎడిటర్‌)  1979లో కొండపల్లి సీతారామయ్యను కలవడానికి భారతదేశానికి వచ్చాడు. ఆ సమావేశం  సందర్భంగా కొండపల్లికి బాడీగార్డ్‌ గా నన్ను పంపించారు కృష్ణారావు. అలాగే, 'మాభూమి' సినిమా శతదినోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన శ్రీశ్రీకి కాపలాగా నన్నే పెట్టారు.

శ్రీశ్రీని కలవడానికి వచ్చినపుడు హాఫో, ఫుల్లో తేవడం అభిమానులకు అలవాటు. రాత్రి సభ జరిగిన తరువాత ఎలాగో అభిమానులు ఆయన్ని  ఆల్కహాలాభిషేకం చేస్తారు కనుక, సభ జరిగేవరకైనా శ్రీశ్రీని  తాగకుండావుంచే బాధ్యతను నాకు అప్పచెప్పారు. గవర్నరుపేట నటరాజ్‌  హోటల్లో  శ్రీశ్రీకి బస ఏర్పాటు చేశాం. వారిని లోపల విశ్రాంతి తీసుకోమని చెప్పి, గుమ్మం ముందు చెయ్యెత్తు కర్ర పట్టుకుని నేను నిలబడ్డాను. అభిమానుల్ని కలవకుండా (మందు ముట్టనివ్వకుండా) మహాకవిని గదిలో పెట్టారని ఊర్లో  ప్రచారం అయిపోయింది. విశ్వేశ్వరరావుని వెంటబెట్టుకుని, వేగుంట మోహన్‌ ప్రసాద్‌ హోటలుకు వచ్చారు. నేను అడ్డు నిలబడ్డాను. వారు నన్ను పక్కకు తోసేసి లోపలికి వెళ్ళిపోయారు. ఆ పెద్దాయన్ని నేనేం చేసేదీ? అంతే! అభిమానులంతా కలిసి విూటింగుకన్నా ముందే శ్రీశ్రీని ఫుల్లుగా ముంచేశారు. సభ జరిగే హనుమంతరాయ గ్రంధాలయానికి మహాకవిని దాదాపు మోసుకుపోవాల్సి వచ్చింది. అందుకు నేను మాట పడాల్సివచ్చింది. మరోవైపు, వేగుంట నన్ను ''డానీయిజమ్‌ - డాండీయిజమ్‌'' అనడం మొదలెట్టారు. ఆయన నన్ను తిడుతున్నారని  తెలిసేదిగానీ, ఆ తిట్టుకు అర్ధం మాత్రం తెలిసేదికాదు. నా ఇంగ్లీషు పరిజ్ఞానం పరిమితమైనదని కొత్తగా చెప్పాల్సినపనిలేదు.

మా అపార్ధాలకు ఓ పారడాక్స్‌ కూడా వుంది. పెద్ద ఇస్మాయిల్‌, చిన్న ఇస్మాయిల్‌ తో నాకు దూరపు చుట్టరికం వుందని చాలా కాలం తరువాత  తెలిసింది. పెద్దాయన నాకు తాత వరస. చిన్నాయన నాకు అన్న వరస. నండూరిగారి విషయమూ అంతే. ఓ పదేళ్ల తరువాత నేను ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేరి, ఓ ఏడాది పనిచేసిన తరువాతగానీ, నండూరిగారికి నా విూద పాత అభిప్రాయం పోలేదు. వారి ఉద్యోగ విరమణ ఉపన్యాసంలో నన్ను చాలా  ఆత్మీయంగా ప్రస్తావించారాయన. అన్నట్టు, మోహన్‌ ప్రసాద్‌ గారిది పశ్చిమ గోదావరి జిల్లా. ఆ విషయం నాకు ముందే తెలియక పోవడం అన్యాయం. పశ్చిమ గోదావరి జిల్లావాళ్లకు ఒక సాంప్రదాయం ఉంది. వాళ్ళు, అక్కడ పుట్టినవాళ్లకు  నూరుతప్పుల్ని మన్నించేస్తారు!.

          1981 అక్టోబరు నెలలో  జవహర్‌ లాల్‌ నెహ్రు యూనివర్శిటీకి చెందిన విదేశీ భాషల విభాగం లూసన్‌ శతజయంతోత్సవాలు నిర్వహించింది. అందులో వక్తగా నన్ను పిలిచారు.  విశ్వవిద్యాలయం వేదిక విూంచి ఇంగ్లీషు ప్రసంగం చేయడానికి శక్తిని కూడదీసుకోవాల్సివచ్చింది. ముందు తెలుగులో రాసుకుని, దాన్ని నెమ్మదిగా ఇంగ్లీషులోనికి మార్చుకున్నాను. దాన్ని సంస్కరించమని అడగడానికి  వేగుంట మోహన్‌ ప్రసాద్‌ గారి ఇంటికి వెళ్ళాను.  'కమ్మేమోరేషన్‌'  'డేడికేటరి' 'హానర్‌' 'ట్రిబ్యూట్‌' 'మొమెంట్‌' 'మూవ్‌ మెంట్‌' 'ఎజిటేషన్‌' 'ప్రోటెస్ట్‌' 'డిస్టర్బన్స్‌' వగయిరా పదాల ధాత్వర్ధాల్ని నాకు వివరించి చెప్పడానికే వారు నాలుగైదు  గంటలు తీసుకున్నారు.  ఆ రోజు ఒక్క పేరా కూడా సరిచేయలేకపోయాం.  ఇంగ్లీషు భాషలో వారిది అపారమైన పరిజ్ఞానం. కానీ, వారి పధ్ధతిలోపోతే డెడ్‌ లైన్‌ లోపల ఆ పని పూర్తికాదని భయంవేసింది. జ్ఞానం మరీ ఎక్కువైపోయినా పనికాదు అని నాకు అనిపించింది. వీళ్ళకు ఎప్పటికప్పుడు పని జరిగిపోవాలేతప్పా, జ్ఞానంతో పనిలేదని వారికి అనిపించింది. పైగా, డెడ్‌ లైన్‌ విధింపు అనేది మోహన్‌ ప్రసాద్‌ గారికి అస్సలే పడని విషయం!
స్మైల్‌, వేగుంట ఆత్మీయ మిత్రులు. స్మైల్‌ విజయవాడలో వున్నరోజుల్లో వాళ్ళిద్దరూ దాదాపు ప్రతిరాత్రీ కలిసేవారు. త్రిపురనేని శ్రీనివాస్‌ విజయవాడకు మారేక మోహన్‌ ప్రసాద్‌ గారితో సన్నిహితంగా వుండేవాడు. స్మైల్‌, శ్రీనివాస్‌ ల ద్వార నేను వేగుంటని కలిస్తుండేవాడ్ని. అప్పట్లోనే మా మధ్య అపార్ధాలు తగ్గడడం మొదలైంది.

        ఖాదర్‌ చెప్పినట్టు వేగుంట మోహన్‌ ప్రసాద్‌ కవితామార్గం నిజంగానే ''అనితర సాధ్యం!''. నేనెలాగూ కవితలు రాసేవాడ్నికాను. అయితే, ఇంగ్లీషులో నైపుణ్యాన్ని మెరుగుపెట్టుకోడానికి వారి పరిచయం నాకు తోడ్పడింది. చరిత్ర గుర్తులు మన చుట్టే వుంటాయి అని డిడీ కొశాంబి అన్నట్టు, ఒక పదం నిర్మీతిలోనే దాని అర్ధం కూడా నిగూఢంగా వుంటుందని వేగుంట మోహన్‌ ప్రసాద్‌  ఒకసారి ఓ 'సెషన్‌' లో చెప్పారు. కాన్‌ స్టేబుల్‌ అనే పదంలో  కాన్‌ స్టాంట్‌, స్టేబుల్‌ అనే రెండు పదాలున్నాయనీ, ఆ రెండింటి అర్ధం స్థిరం అనీ, ఆమేరకు యధాస్థితిని కాపాడడమే పోలీసుల పని అనీ, అది కవులకు బొత్తిగా పడని వ్యవహారమని వివరించారు. అలాగే కాంపోజ్‌ బిళ్లల్లు. అవి మన 'పోజ్‌' ను 'కామ్‌' చేయడానికేనట!

1990లో మానాన్న చనిపోయిన మరునాడు రాత్రి నన్ను 'ఓదార్చే లాంఛనాన్ని' స్మైల్‌ నిర్వర్తించారు.  దానికి వేగుంట మోహన్‌ ప్రసాద్‌ కూడా వచ్చారు. 'తండ్రి చనిపోవడం' అనే కష్టం ఆయన్ని కలిచివేసింది. నా భుజాల్ని పట్టుకుని, గట్టిగా  ఊపేస్తూ, ''నాన్న చనిపోయాడా? నీకిప్పుడు నాన్న లేడా డానీ? నాన్నలేడా? మన డానీ తండ్రిలేని పిల్లాడైపోయాడ్రా స్మైల్‌!'' ఆంటూ ఆయన చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. తరువాత వారిని మేమంతా ఓదార్చాల్సి వచ్చింది. డెభ్భయి యేళ్ల పసిపిల్లాడు మా మాస్టారు!

అయితే, మా పునస్సంబంధాలకు, వ్యక్తిగత కారణాలను మించిన, బలమైన సమాజిక నేపథ్యమే వుంది. 1985లో తెలుగుదేశం ప్రభుత్వం రెండవసారి అధికారాన్ని చేపట్టాక విజయవాడను అర్బన్‌ పోలీస్‌ జిల్లాగా ప్రకటించి, కే.ఎస్‌. వ్యాస్‌ ను ఎస్పీగా నియమించింది. కొత్తగా ఏర్పడిన పోలీస్‌ జిల్లాలో  విజయవాడ సామాన్య ప్రజలు నరకాన్ని చవిచూశారు.  అప్పటి వరకు విజయవాడకు 'నిద్రపోని నగరం' అనే పేరుండేది. మందు మొదలు వేడివేడి ఇడ్లీ వరకు అన్నీ ఇరవై నాలుగు  గంటలూ దొరికేవి. ఏలూరు రోడ్డు బృందావనం  హోటల్లో
అర్ధరాత్రి దాటేక  ఆవిర్లు విరజిమ్మే  ఇడ్లీ తినడం చాలామందికి ఒక అలవాటుగా వుండేది. సినిమాహాళ్ళతో సహా నగరంలో ప్రతీదీ రాత్రి పదకొండు గంటలకెల్లా మూసివేయాలనే వ్యాస్‌ ఉత్తర్వులతో విజయవాడ తన రాత్రికళను కోల్పోయింది. నగరంలో పోలీసు రాజ్యం నెలకొంది. వీటికి పరాకాష్టగా విజయవాడలో లాకప్‌ డెత్‌ లు  పరంపరగా సాగాయి.

పోలీసులు, నక్సలైట్లు ఎలాగూ పామూ, ముంగీస లాంటి వైరజాతులు. పుట్టుక రీత్యానే వాళ్లకు పడదు. కానీ, నిషేధాలు తెలియని విజయవాడలో పోలీసు రాజ్యాన్ని చూసి వేగుంట మోహన్‌ ప్రసాద్‌ వంటి సర్రియలిస్టు కవులకు కూడా చిర్రెత్తుకొచ్చింది. 

1985 ప్రత్యేకత ఏమిటోగానీ, ఈ కాలంలోనే నక్సలైట్ల ఆలోచనా విధానంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ''నక్సలైట్లే దేశభక్తులు'' అనే నినాదం ''నక్సలైట్లు కూడా దేశభక్తులు''గా మారింది. వ్యవసాయిక విప్లవాన్ని విజయవంతం చేయడానికి విప్లవకారుల  బలిదానాలు మాత్రమే సరిపోవనీ, దానికి  ప్రజాస్వామికవాదుల మద్దతు కూడా చాలా అవసరమని  గుర్తించడం మొదలెట్టారు. అలా మేము సమాజం నుండి  సాహిత్యానికి ప్రయాణమయ్యాం.

విజయవాడలో పోలీసు రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ఇటునుండి నక్సలైట్లు, అటునుండి ప్రజాస్వామికవాదులు నడుంబిగించారు. ఆ దశలో, లాయర్‌ కర్నాటి రామ్మోహనరావు, కవి వేగుంట మోహన్‌ ప్రసాద్‌ మహత్తరమైన పాత్రను నిర్వర్తించారు.

అప్పట్లో, మురళీధరన్‌ అనే  నావికాదళ ఉద్యోగి ఒకడు, రైలుప్రయాణం మధ్యలో విజయవాడలో దిగాడు. మందు కోసం రైల్వేస్టేషన్‌ సవిూపాన్న  ఓ బ్రాందీ షాపుకు వెళ్ళి వాళ్ళతో గొడవపడ్డాడు. పోలీసులు అతన్ని  అరెస్టుచేసి తీసుకువెళ్ళారు. మర్నాడు అతను శవమైతేలాడు. మురళీధరన్‌ లాకప్‌ డెత్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటనతో, వేగుంట మోహన్‌ ప్రసాద్‌ చలించిపోయారు. అంతః  ప్రపంచాన్ని వదిలి బయటికి వచ్చారు. లాకప్‌ డెత్‌ పై కవిత రాశారు. బహుశ అదే వారి తొలి 'సామాజిక' కవిత అనుకుంటాను.

సుప్రసిధ్ధ ఆంగ్ల రచయిత సోమర్‌ సెట్‌ మామ్‌, 1940లలో రమణమహర్షి ఆశ్రమానికి వెళుతూ, విజయవాడ రైల్వే స్టేషన్లో  కొన్ని గంటలు గడిపాడట. ''అప్పట్లో, వ్యాస్‌ వంటి పోలీసాఫీసర్‌ వుంటేసోమర్‌ సెట్‌ మామ్‌ ని విజయవాడలో లాకప్‌ డెత్‌ చేసేసేవారు కదా!'' అని ఓ బహిరంగ సభలో వేగుంట వాపోయారు.  'మో' కలం నుండి, ఆ పరంపరలో వచ్చిందే, 'డార్క్‌ రూంలో సూర్యుడుకవిత.  విరసం సాంస్కృతిక నాయకుడు వరవరరావు చంచల్‌ గూడ జైల్లో పొలిటికల్‌ డెటిన్యూగా వున్నప్పుడు వారు రాశారు దీన్ని.  అలా మో
సాహిత్యం నుండి సమాజానికి ప్రయాణాన్ని సాగించారు.   

హైదరాబాద్‌
8 ఆగస్ట్‌ 2011

ప్రచురణ : న’మో’
సంకలనం : ఖాదర్ మొహియుద్దీన్, శ్రీశ్రీ విశ్వేశ్వరరావు

విరి వాల్యూమ్స్, ఆగస్ట్ -  2011 

మోహన్‌ ప్రసాద్‌ సెన్సాఫ్‌ హ్యూమర్‌
ఎన్‌. వేణుగోపాల్‌ విజయవాడ నవోదయా కాలనిలో వున్నప్పటి సంఘటన ఇది. అప్పట్లో, వేణు వ్యవహారశైలి క్రమశిక్షణా కమిటి ఛైర్మన్‌ లా వుండేది. ఆయన గదికి దాదాపు ఎదురుగా ఓ చిన్న బ్రాందీ షాపువుండేది. అర్ధరాత్రిదాటినాసరే, తెలిసినవాళ్ళు తలుపుకొడితేఆ షాపులో మందు ఇచ్చేవారు.  అయితే, విరసం సభ్యులుగానీ, నక్సలైట్‌ అభిమానులుగానీ ఆ షాపులో మందు కొనడానికి జంకేవారు. వేణు కళ్ళల్లో పడడం దేనికనీ!

వేణు గదికి ఓ పది ఇళ్ల అవతలే వేగుంట మోహన్‌ ప్రసాద్‌ ఇల్లు.  ఓరోజు రాత్రి  మోహన్‌ ప్రసాద్‌,  త్రిపురనేని శ్రీనివాస్‌ సెషన్‌ అర్ధరాత్రి దాటేసే వరకు సాగింది. మందు అయిపోయింది. ఇంకాస్త మందు వుంటే బాగుంటుంది అనిపించింది. 
  
''ఫరవాలేదు. తలుపు చప్పుడు చేస్తే చాలు. ఆ షాపువాడు మనకు  మందిస్తాడు'' అని  శ్రీనివాస్‌ అన్నాడు.
''కానీ, మరీ రెండవుతోంది. ఇప్పుడు వాడు లేస్తాడా?'' - అని మో సందేహం.
''దాందేముంది మాస్టారూ! లెగకపోతే తలుపు గట్టిగా కొడతాం. బాదిపడేస్తాం. దట్సాల్‌!'' - ఇదీ శ్రీనివాస్‌ ధీమా.
''షాపు తలుపులు  తెరుచుకోకపోయినా ఫరవాలేదు. ఆ సౌండుకు, ఎదిరింటి  తలుపులు తెరుచుకుంటేనే ప్రమాదం!'' అన్నారట మోహన్‌ ప్రసాద్‌! 
(ఖాదర్!  కావాలంటే దీన్ని పై వ్యాసానికి చివర్లో జోడించ వచ్చు)
8 ఆగస్ట్‌ 2011


2 comments:

  1. వేగుంట మీద మొదట్లో నాకు కోపం ఉండేది ఖాదర్ అన్నతో స్నేహం తర్వాతా కొంచం మారింది మీ వ్యాసం కూడా దానికి మేలే చేసింది డానన్నా వీలుంటే మీ జ్ఞాపకాలు ఒక పుస్తకంగా రాయండి నిజం ఎంతో విస్తృత అనుభవం రాజకీయాలు అరుదయిన వ్యక్తుల సహచర్యం మీకే సొంతం

    ReplyDelete
  2. Political movement ni inspiring anecdotes gaa raayaali.

    ReplyDelete