Sunday 23 June 2013

Congress, BJP and Uttarakhand Havoc

Congress, BJP and Uttarakhand Havoc
కేదార్ నాధ్ : కాంగ్రెస్ - బీజేపిల జంటపాపం
             కేదార్ నాధ్ రుద్రరూపం వీడియోస్ చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. రాజకీయ నాయకులు వేరు; భక్తులువేరు. ఏ మతానికిచెందినా వారైనా, భక్తులు స్వభావరీత్యా సాత్వికులు, దైవభీతి, పాపభీతి కలవారు.  అలాంటి అమాయక జీవులు అంత పెద్ద సంఖ్యలో నిస్సహాయంగా చనిపోవడం చాలా బాధాకరం. ఈ విలయం మానవ తప్పిదం అని గుర్తుకువచ్చినపుడు మనస్సు చివుక్కుమంటుంది. 

               ఉత్తరాఖండ్ ఏర్పడ్డాక గడిచిన పదమూడు సంవత్సరాల్లో, కాంగ్రెస్, బీజేపి చెరో ఆరున్నరేళ్ళు ఆ రాష్ట్రాన్ని పాలించాయి. విచక్షణా రహితంగా ప్రాజెక్టులు కట్టడంవల్ల, సొరంగాలు, గనుల తవ్వకాలవల్ల, అడవులు నరకడంవల్ల ఆ ప్రాంత భౌగోళిక స్వరూపమే మారిపోయింది. పర్యావరణ సమతుల్యం పూర్తిగా దెబ్బతిన్నది. పాతికేళ్లక్రితం వరకు కూడా ఉత్తరాఖండ్ లోని ఉత్తర భాగం హిందూ పుణ్యక్షేత్రాల నిలయంగా వుండేది. మనుషుల్లో నిరంతరం పెరిగిపోతున్న అత్యాశను, వర్తమాన సమాజంలో విధ్వంసమైపోతున్న మానవసంబంధాలనూ చూసి విరక్తిచెందినవాళ్ళు కాసింత మనశ్శాంతి కోసం హిమపాదాల్లోని పర్వత సాణువుల్లో గడిపేవారు. ఇప్పుడది విలాసవంతుల పర్యాటక కేంద్రంగా మారిపోయింది. గంగా జలాన్ని అందరూ స్వఛ్ఛమైనవిగా భావిస్తారు, కొందరు పవిత్రమైనవిగా కూడా నమ్ముతారు. గంగానది జన్మస్థలం హిమగర్భంలోనే ’బిస్లరీ’ ప్లాస్టిక్ నీళ్ల సీసాలు అమ్ముతున్నారంటే ఆ ప్రాంతంలో కాలుష్యం ఏ స్థాయికి పెరిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.  ఈ తీరుగా, అభివృధ్ధ్ది పేరిట ఆ రాష్ట్రంలో జరిగిన భారీ విధ్వంసానికి ప్రధాన జాతీయ పార్టీలు రెండూ సమాన దోషులే. 

        ఉత్తరాఖండ్ లో పధ్నాలుగు నదీలోయలున్నాయి. వీటిల్లో ఏకంగా రెండు వందలకుపైగా విద్యుత్తు, మైనింగ్ ప్రాజెక్టులు నిర్మాణంలో వున్నాయి.  గంగానది ఉపనదులైన అలకనంద, మందాకిని నదులపై డెభ్భయికి పైగా జల విద్యుత్కేంద్రాలు నిర్మించతలపెట్టారు. ఇందులో, నది ప్రవాహ మార్గాన్ని దారిమళ్ళించే ప్రాజెక్టులు, సొరంగాలు తవ్వి కొండల్ని దాటించే ప్రాజెక్టులు ఉన్నాయి. ఉత్తరాఖండ్ లోయల్లో సాగుతున్న భౌగోళిక విధ్వంసానికి ఇవి ప్రాధమిక  కొలమానాలు మాత్రమే!

.                                మొన్నటి వరద వుధృతికి కేదారనాధుడి ప్రధాన ఆలయం ఒక్కటితప్ప, ఆ ఆలయ ప్రాంగణం, పరిసరాలు మొత్తం నాశనం అయిపోయాయి. వరదకు జగద్గురు ఆదిశంకరాచార్యుని సమాధి కొట్టుకుపోయింది. అలకానంద హైడల్ పవర్ కంపెనీ లిమిటెడ్ అయితే, నిర్మాణపు పనుల్లో మరీ బరితెగించింది. ఇది జీవీకే హైడల్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన అనుబంధ సంస్థ. ప్రాజెక్టు నిర్మాణం కోసం, ఏకంగా ఉత్తరాఖండ్ క్షేత్రపాలకురాలుగా భావించే, ధారీదేవీ ఆలయంలో మూలవిరాట్టునే పెకలించి, మరో చోటుకి తరలించేసింది. గత ఏడాది అస్సీ గంగా హైడల్ ప్రాజెక్టు ఉత్తర కాశీలో సృష్టించిన ఉత్పాతం అందరికీ గుర్తుండేవుంటుంది. 

            "మనుషులు సాగిస్తున్న విధ్వంసంపై ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంది" అని కొందరు పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నమాటలు హేతుబధ్ధంగానే వున్నాయి. అయితే,   కేదార్ నాధ్ లో అమాయక భక్తులు వేలాదిమంది చనిపోయారు. విచక్షణా రహితంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాంక్టు కంపెనీలు, వాటికి అనుమతులిచ్చిన రాజకీయ పార్టీలు సురక్షితంగా వున్నాయి. దీన్ని చూస్తుంటే ప్రకృతికి కూడా వర్గపక్షపాతం వుందేమోనని నమ్మాల్సివస్తోంది. 

                        పూరి పీఠాధిపతి స్వామీ నిశ్చలానంద సరస్వతి కేదార్ నాధ్ ప్రాంతానికి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని సరిగ్గానే పసికట్టారు. జూన్ మొదటి వారంలో, కేదార్ వ్యాలిని సందర్శించిన స్వామీ నిశ్చలానంద సరస్వతి దేశంలో గంగానది అంతరించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గంగానది విషాదానికి కాంగ్రెస్, బీజేపీల్ని సంయుక్త బాధ్యులుగా స్వామీజీ పేర్కొన్నారు.

            మతాన్ని నాస్తికులు మత్తుమందు అని ఒక్క మాటలో కొట్టిపడేస్తారు. అది బాధ్యతతో చేసిన విమర్శకాదు. మతాన్ని ’నల్లమందు’ అని పేర్కొన్న కార్ల్ మార్క్స్,  సమాజంలో మతం అస్థిత్వంలో వుండడానికి మూడు కారణాలను కూడా చెప్పాడు. "మతం అనేది అణగారిన జీవులకు ఒక నిట్టూర్పు. హృదయంలేని ప్రపంచానికి ఒక హృదయం, మనస్సులేని వాతావరణానికి ఒక మనస్సు. అది ప్రజలకు నల్లమందు" ("Religion is the sigh of the oppressed creature, the heart of a heartless world, and the soul of soulless conditions. It is the opium of the people") అన్నాడు. మతాన్ని నల్లమందు అనడంలో మార్క్స్ గొప్ప వివేకాన్ని ప్రదర్శించాడు. నల్లమందు కేవలం మత్తు పదార్ధం మాత్రమేకాదు; అదొక ఔషధగుణమున్న మందు కూడా!  వెరసి మనం మతాన్ని ఒక మత్తు; ఒక మందు అనుకోవచ్చు. ఏ మోతాదు వరకు అది మందుగా పనిచేస్తుందీ, ఏ మోతాదు మించితే మత్తుగా మారుతుంది అనేది సామాజిక విచక్షణకు సంబంధించిన వ్యవహారం. 

            మతం అనేది ప్రకృతి మీద మనుషుల విశ్వాసానికి సంబంధించిన అంశం. మతతత్వం అనేది, స్వమత పెట్టుబడిదారులకు లాభాల్నీ అర్జించిపెడుతూ, పరమత పోటీదారులపై అణిచివేతనీ పురికొల్పే సాధనం. మొదటిది ఆధ్యాత్మికం, రెండోది రాజకీయార్ధికం. మతం అలౌకికం; మతతత్వం లౌకికం. మతం వ్యక్తిగతం; మతతత్త్వం రాజకీయం. మతం మందు; మతతత్త్వం మత్తు.

                        కేదర్ నాధ్ పరిసరాల్లో బాధితులకు సేవలందిస్తున్నావారిలో సంఘపరివారం కార్యకర్తలు కూడా వున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు వారిని తప్పక అభినందించాలి.  చారిత్రక మందిరాల పునరుధ్ధరణ కోసం సంఘ్ పరివారం సాగించిన పోరాటాలు, నిర్వహించిన రథయాత్రల గురించి తెలియనివాళ్ళు వుండరు. హైదరాబాద్ చార్మినార్ పక్కన, చారిత్రకంగా అంతగా ప్రాధాన్యంలేని, భాగ్యలక్ష్మి గుడి విషయంలో గత ఏడాది సంఘ్ పరివారం భూమ్యాకాశాల్ని ఏకం చేసింది. ఇలాంటి నేపథ్యంలో, కేదర్ నాధ్,  ధారీ దేవి వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు గుళ్ళు విధ్వంసమై, వేలాది భక్తులు చనిపోయినపుడు, ఈ విధ్వంసానికి  కారణమైన ప్రాజెక్టు నిర్మాణ సంస్థలూ, వాటికి వత్తాసు పలికే రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా  సంఘ్ పరివారం  పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని అనుకోవడం ఎవరికైనా సహజం. కానీ అలా జరగలేదు. సంఘపరివారం మౌనంగా వుండిపోయింది. సంఘ్ పరివారానికి భక్తికన్నా  రాజకీయ ఆసక్తి ఎక్కువ అనడానికి ఇది ఒక ఉదాహరణ. 

            సంఘటనను సంఘటనగా చూడడం పరిశోధనల్లో, మొదటి అడుగు మాత్రమే. దానికి, ముందూ వెనుకా చూడాలి. జరిగినదాన్నిబట్టి జరగబోయేదాన్ని వూహించాలి. కేదార్ నాధ్ విధ్వంసంలో, రాజకీయపార్టీలు,  నిర్మాణసంస్థలూ, దేవాలయాలు, భక్తులు, బాధితులు ఒకే మతసామాజికవర్గానికి చెందినవారేగాబట్టి ఈ విషాదం వివాదం కాలేదు. ప్రస్తుత వినాశనానికి కారణంగా భావిస్తున్న అలకానంద హైడల్ పవర్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యం ఒకవేళ హిందూవేతరులదైతే (ముస్లింలదైతే),  సంఘపరివారం ఎలా ప్రతిస్పందించేదో ఊహిస్తే, మతతత్వాన్ని నిర్వచించడానికి ఆలోచనాపరులకు ఒక సజీవ ఉదాహరణ దొరుకుతుంది.

మతం అనేది ఒక సామాజికవర్గపు అంతర్గత వ్యవహారం. మతతత్త్వం అనేది రెండు మత సామాజిక వర్గాలమధ్య వివాదం. 

హైదరాబాద్

 23 June 2013

2 comments:

  1. ఆ పాపం పాలకులదే. పర్యావరణానికి ముప్పువాటిల్లుతుందని తెలిసీ... కుప్పలు తెప్పలుగా హైడల్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చారు. ఇప్పుడు భక్తులను కాపాడడంలో సైన్యానికి తోడుగా ఆర్.ఎస్.ఎస్. ముందంజలో ఉంది. కొన్ని మీడియాల్లో తప్ప, మిగతావాటిలో అవి హైలైట్ కావడం లేదు.

    ఇక నదుల గతిని మళ్లించడం చాలా కష్టతరమైనది. సర్కారు చేస్తానంటే.. ప్రతిపక్షాల విమర్శలు, పత్రికల దెప్పిపొడుపులు మన రాష్ట్రంలో నదుల అనుసంధానం విషయంలోనే నిరూపితమైంది. పరమ పవిత్రమైన గంగానదిని మళ్లించడం సాధ్యమా?

    అంతమాటకొస్తే... అరాఫత్ పర్వతం వద్ద సైతానుపై రాళ్లు కొట్టే సమయంలో తరచూతొక్కిసలాటలు జరిగేవి. ఎందరో చనిపోయేవారు. ఎన్నేళ్ల తర్వాత కొద్దిపాటి విస్తరణ చేశారక్కడ? కారణమేమిటి? చరిత్రను చెక్కుచెదరకుండా చూడాలనేది వారి భావన కావొచ్చు. రోమ్ లో మూడువేల ఏళ్ల కిందట ఒక కోటగోడకు సంబంధించిన ఒక రంధ్రం బయటపడితే.. దాన్ని చారిత్రక ఆధారంగా పరిగణించి అపురూపంగా చూస్తున్నారు. చారిత్రక ఆధారాలను నామరూపాలులేకుండా చేస్తున్న దేశం మనదే కావడం బాధాకరం.

    రాముడు, రామసేన నిర్మించిదిగా కోట్ల మంది ప్రజలు విశ్వసించే రామసేతును కూల్చేందుకు సిద్ధమైంది మన పాలకులే కదా?

    సంఘ్ పరివార్ ను తప్పు పట్టడం ఇక్కడ సరికాదు. మోడీ స్వయంగా బాధితులను పరామర్శించి.. ఆలయాల పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు తమ సర్కారు భరించేందుకు సిద్ధమని ప్రకటించారు. అంత దమ్ము బహుగుణకు లేదు. సోనియా, మన్మోహన్ లకు అంతకన్నాలేదు.

    రామసేతులాంటి చారిత్రక ఆధారాలు ఇంకా పరిరక్షించాలనే ఉద్యమాలు సాగుతున్నాయంటే... అది సంఘ్ పరివార్ లాంటి సంస్థల వల్లే.

    అసలు ప్రళయాలకు కారణమేమిటి? అనేది విశ్లేషించడం ఇప్పుడు అవసరం. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం కాదు. ఒక్కసారి www.teluguyogi.net చూడండి.

    ReplyDelete
  2. Danny letter
    24 June 2013

    సోదరుడు కమలాపతిరావుకు!
    ఉత్తరాఖండ్ మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుకుంటూ రాయునది.

    మనిద్దరి ఆవేదనలు, అభిప్రాయాలు, ఒకేలాగున్నాయి.
    ఈ రోజు ఆఫీసులో కేదార్ నాధ్ రుద్రరూపం వీడియోస్ కొన్ని చూశాను. గుండె తరుక్కుపోయింది. రాజకీయ నాయకులు వేరు; భక్తులువేరు. ఏ మతానికిచెందినా వారైనా, భక్తులు స్వభావరీత్యా సాత్వికులు, దైవభీతి, పాపభీతి కలవారు. అలాంటి అమాయక జీవులు అంత పెద్ద సంఖ్యలో నిస్సహాయంగా చనిపోవడం చాలా బాధాకరం. 1977నాటి దివిసీమ ఉప్పెన బాధితులకు మా స్నేహితులందరం కలిసి మా స్థాయిలో, పాత వస్త్రాలు, కోంద నగదు పంపించాం. ఇప్పుడు అలాంటి చిన్నపని కూడా చెయలేకపొతున్నామనే అంశమే నన్ను ఎక్కువగా బాధపెడుతోంది.

    నువ్వు పంపిన ’కేదార్ నాథ్ రుద్రరూపం - అసలు కారణాలు’ పూర్తిగా చదివాను. "ప్రజల పాపాలకు శిక్ష పాలకులకు పడుతుంది అని మన ప్రాచీన స్మృతులు చెబుతున్నాయి. కాని ప్రస్తుత కలియుగంలో పాలకుల పాపాలకు శిక్షలు ప్రజలకు పడుతున్నాయి" అని నువ్వు రాసిన దానితో నాకూ బాధతో కూడిన ఏకాభిప్రాయం వుంది.

    "కేదార్ నాథ్ రుద్రభూమి. భగవంతుని యొక్క రుద్రస్వరూపం సంహారాత్మక మైనది. దానికి మనాతనా ఉండదు. చెయ్యకూడని పని చేసినప్పుడు ఆ వ్యక్తిని నిర్మూలించడమే రుద్రతత్త్వం. రుద్రుని ఫాలనేత్రాగ్ని జ్వాలల్లో చావులేని మన్మధుడే కాలిపోయి భస్మమయ్యాడు. మనుషులెంత?" అన్న నీ మాటలతొ నాకు కొంత భిన్నాభిప్రాయం వుంది.

    తప్పులు చేసేవాళ్ళూ, ధర్మం తప్పేవాళ్ళూ, సాధారణంగా సమాజంలో బలవంతులై వుంటారు. వాళ్లను నిస్సహాయులు ఎదుర్కోలేరు. అంచేత, పాపుల్ని దేవుడే శిక్షిస్తే బాగుంటుందని నేనూ చాలాసార్లు అనుకుంటాను. నువ్వూ అలాంటి అభిప్రాయాన్నే చెప్పావు. కానీ, కేదార్ నాధ్ విలయంలో తప్పు చేసింది ఏవరూ? బలయిపొయింది ఎవరూ? నువ్వు చెప్పినట్టు దేవుడే ఈపని చేసివుంటే, విచక్షణా రహితంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాంక్టు కంపెనీల అధినేతల్ని, ఆ కంపెనీలకు అనుమతులిచ్చిన రాజకీయ పార్టీలని శిక్షించివుండాల్సింది. కానీ, కేదార్ నాధ్ లో అమాయక భక్తులు వేలాదిమంది చనిపోయారు. ఏకంగా భగవంతుని ఆలయాలే విధ్వంసం అయిపోయాయి. ఎక్కడో హేతుబధ్ధత తప్పినట్టులేదూ.

    "మనుషులు సాగిస్తున్న విధ్వంసంపై ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంది" అని కొందరు పర్యావరణ శాస్త్రవేత్తలు అన్నారు, కేదార్ నాధ్ ప్రళయం తరువాత ఒక్క రాజకీయ నాయకుడూ, ఒక్క కాంట్రాక్టరూ ఇది తమ తప్పిదమని చెప్పలేదు.

    దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు గుళ్ళు విధ్వంసమై, వేలాది భక్తులు చనిపోయినపుడు దానికి కారణమైన ప్రాజెక్టు నిర్మాణ సంస్థలూ, వాటికి వత్తాసు పలికే రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా సంఘ్ పరివారం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని అనుకోవడం ఎవరికైనా సహజం. కానీ అలా జరగలేదు. సంఘ పరివారం మౌనంగా వుండిపోయింది. కేదర్ నాధ్ పరిసరాల్లో బాధితులకు సేవలందిస్తున్నావారిలో సంఘ పరివారం కార్యకర్తలు కూడా వున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు వారిని అభినందించాల్సిందే.

    సంఘటనను సంఘటనగా చూడడం పరిశోధనల్లో, మొదటి అడుగు మాత్రమే. దానికి, ముందూ వెనుకా చూడాలి. జరిగినదాన్నిబట్టి జరగబోయేదాన్ని వూహించాలి. రాజకీయపార్టీలు, నిర్మాణసంస్థలూ, దేవాలయాలు, భక్తులు, బాధితులు ఆన్నీ ఒకే మతానికి చెందినవారేగాబట్టి ఈ విషాదం వివాదం కాలేదు. ప్రస్తుత వినాశనానికి కారణంగా భావిస్తున్న అలకానంద హైడల్ పవర్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యం ఒకవేళ హిందూవేతరులదైతే (ముస్లింలదైతే), సంఘపరివారం ఎలా ప్రతిస్పందించేదో ఊహిస్తే, మతతత్వాన్ని నిర్వచించడానికి ఒక సజీవ ఉదాహరణ మనకు దొరుకుతుంది.

    నాకు దేవుని మీద విశ్వాసం వుంది. ఇతర దేవుళ్లని నమ్మే ఇతర మతస్తుల మీద గౌరవమూ వుంది. కానీ, ఏ మతంలో అయినా మతత్త్వాన్ని నేను అంగీకరించలేను.

    మతం అనేది ప్రకృతి మీద మనుషుల విశ్వాసానికి సంబంధించిన అంశం. మతతత్వం అనేది, స్వమత పెట్టుబడిదారులకు లాభాల్నీ అర్జించిపెడుతూ, పరమత పోటీదారులపై అణిచివేతనీ పురికొల్పే సాధనం. మొదటిది ఆధ్యాత్మికం, రెండోది ఆర్ధికం. మతం అలౌకికం; మతతత్వం లౌకికం.

    పేస్ బుక్ లో నా పోస్టుల మీద వచ్చే విమర్శలకు నేను సమాధానం ఇవ్వాలనుకోను; తీవ్ర అపార్ధం చోటుచేసుకుందని భావించినప్పుడుతప్ప.

    శ్రేయోభిలాషి

    ఉషా యస్ డానీ

    ReplyDelete