డానీ కాలం
ఆత్మహత్యలు
ఏ. యం. ఖాన్ యజ్దానీ
''ఒక కవి, సృష్టికర్త;
తనను తాను విధ్వంసం చేసుకున్నాడు
ఒక తత్వవేత్త,
ఆలోచనాపరుడు
ఆలోచన ప్రక్రియను స్థంభింపచేశాడు''
ప్రముఖ హిందీ విప్లవ కవి గోరక్ పాండే 1989 జనవరిలో
చనిపోయినపుడు, పాత్రికేయ మిత్రుడు మోహన్ రామ్మూర్తి,
ఢిల్లీ నుండి వెలువడే పేట్రియాట్ ఇంగ్లీషు డైలీలో రాసిన న్యూస్
ఐటమ్ ప్రవేశిక ఇది.
సాటి మనిషి ఆత్మహత్య చేసుకున్నప్పుడు బాధ్యత
వహించడానికి ఎవ్వరూ సిధ్ధంగా వుండరు.
ఆత్యహత్య అనేది మానసిక రోగం అని కొందరంటే, అది వాళ్ళకు బాల్యం నుండే కొనసాగిన దౌర్బల్యం
అని మరి కొందరంటారు. చాలా సందర్భాలలో వాస్తవాలకన్నా, వ్యాఖ్యానాలే
ఎక్కువ ప్రాచూర్యాన్ని సంతరించుకుంటాయి. ఒక రకం ఫోబియాకు గురై గోరక్ పాండే
ఆత్మహత్య చేసుకున్నాడనేది ఒక వాదం. అన్నంలో అతనికి రక్తం కనిపించేదట. మానసిక
వైద్యులు ప్రయత్నించారుగానీ అతన్ని కాపాడలేకపోయారు. ఫలితంగా ఆయన తనను తాను చంపుకున్నాడు అనేది ఈ
వాదం సారాంశం.
మనస్తత్త్వ కారణాలు, జీవధర్మ కారణాలవల్ల గోరక్ పాండే
ఆత్మహత్యకు పాల్పడ్డాడనే వాదనతో మోహన్
రామ్మూర్తి ఏకీభవించలేకపోయాడు. పాండే ఆత్మహత్యకు మరో పార్శ్వాన్ని అవిష్కరించే
ప్రయత్నం చేశాడతను. విప్లవ కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడడాన్ని పాండే
జీర్ణంచేసుకోలేక పోయాడు.
అప్పటి వరకు భావోద్వేగ జీవితాన్ని ఆస్వాదించిన కవికి, ప్రధాన స్రవంతిలో
కలిసిపోయి బతికేయడం చేతకాలేదు. పైగా, అలా బతకాలనుకోవడం హీనం
అనుకున్నాడు. ''నెత్తుటి కూడు'' తిన
లేకపోయాడు. నాటి ఢిల్లీలోని ఇతర పాత్రికేయులకన్నా మోహన్ రామ్మూర్తికి, ఈపార్శ్వం బాగా తెలుసు. అందుకే అ
ప్రవేశిక అంతగా భావాల ఉన్నతీకరణని సంతరించుకుంది.
ఆత్మహత్యల్ని చాలా మంది స్వీయ మానసిక సమస్యగానో, జీవసంబంధ సమస్యగానో
భావిస్తుంటారు. గోరక్ పాండే ఆత్మహత్యను మోహన్ రామ్మూర్తి రాజకీయ సమస్యగా గుర్తించాడు. తాత్విక సమస్యగా
భావించాడు. అంతిమంగా దాన్ని ఒక సామాజిక సమస్యగా ఆవిష్కరించాడు.
ఆత్మహత్యల్ని మొట్టమొదటిసారిగా, సామాజిక సంక్షోభంగా
గుర్తించినవాడు ఎమిలి డర్ఖేమ్ (1858 - 1917). ఈ ఏప్రిల్ 15 నాటికి డర్ఖేమ్ పుట్టి సరిగ్గా నూటయాభై సంవత్సరాలు. నూట పదకొండు
సంవత్సరాల క్రితం, 1897లో, రాసిన ఉద్గ్రంధం 'లా సూసైడ్'లో సమాజానికీ, ఆత్మహత్యలకూ మధ్యనున్న అవినాభావ
సంబంధాన్ని ఎమిలి డర్ఖేమ్ సవివరంగా నిరూపించాడు.
సామాజిక జీవనం అంటే అన్యోన్య, పరస్పర సంఘీభావమే
అని గుర్తించినవాడు ఎమిలి డర్ఖేమ్. ఈ సంఘీభావం కూడా, ఏదో ఒక
కుటుంబ సభ్యుల మధ్యనో, ఒక వీధో, ఒక
ప్రాంతానికో చెందిన వాళ్ల మధ్యనో పరిమితమై వుండదనీ, మొత్తం
సమాజ సభ్యుల మధ్య సజీవ సంఘీభావం కొనసాగుతూవుంటుందని ఆయన నిర్థారించాడు.
సంఘీభావ చారిత్రక స్వభావాన్ని నిర్థారించడంలో తన
పూర్వికుల అభిప్రాయాలతో డర్ఖేమ్ పూర్తిగా విబేధించాడు. పురాతన సులభ సమాజాల్లో
మనుషుల మధ్య బలంగావుండే సంఘీభావం, ఆధునిక సంక్లిష్ట
సమాజాల్లో బలహీన పడిపోతుందని చాలా మంది భావించేవారు. సులభ సమాజాల్లోకన్నా
సంక్లిష్ట సమాజాల్లోనే సంఘీభావం బలంగా వుంటుందని డర్ఖేమ్ సూత్రీకరించాడు.
సులభ సమాజాల్లోని సభ్యులందరికీ ఒకేరకమైన నైపుణ్యం దాదాపు ఒకే స్థాయిలో వుంటుంది గనుక
ఒకరిపై మరొకరు ఆధారపడల్సిన అవసరం వుండదని డర్ఖేమ్ గుర్తుచేశాడు. సంకీర్ణ
సమాజాల్లో విస్తృతమైన శ్రమ విభజన కారణంగా ఒక్కక్కరికి ఒక్కొక్క రకమైన నైపుణ్యం
వుండడమేగాక, నైపుణ్య స్థాయిల్లోనూ విపరీతమైన వ్యత్యాసం వుంటుందన్నాడు. సరిగ్గా ఈ కారణం
వల్లనే, సమాజంలోని సభ్యులందరూ ఒకరిపై మరొకరు అనివార్యంగా
ఆధారపడతారు. ఈ పరస్పరాధార అవసరాలను క్రమబద్దీకరించే సంఘీభావాన్ని పరిరక్షించే
బాధ్యతను నైతిక సమాజం నిర్వహిస్తుందన్నాడు.
నైతిక సమాజానికి ప్రాణప్రదమైన సంఘీభావం స్థాయిని
అంచనావేయడానికి డర్ఖేమ్ ఒక పరికరాన్ని
ఎంచుకున్నాడు. అదే ఆత్మహత్య. సంఘీభావానికీ, ఆత్మహత్యలకూ మధ్య విలోమానుపాత సంబంధం
వుంటుందని దర్ఖేమ్ నిర్థారించాడు. సమాజంలో ఆత్మహత్యల రేటు తక్కువగా వుంటే
సంఘీభావం ఎక్కువగావున్నదని అర్థం. ఆత్మహత్యల రేటు ఎక్కువగావుంటే, సమాజంలో సంఘీభావం అంతరించి పోతున్నదని హెచ్చరిక.
అచ్చంగా సామాజిక లోపాలకారణంగానే, మనుషులు ఆత్మహత్యలు
చేసుకుంటుంటారని నిర్థారించిన ఎమిలీ డర్ఖేమ్ ఆత్నహత్యల్ని నాలుగు రకాలుగా
వర్గీకరించాడు; ఎగోయిస్టిక్, అల్ట్రూయిస్టిక్
, అనామిక్ , ఫాటలిస్టిక్.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ''తిన్నది అరక్క''
అన్న మంత్రులు మనకు తెలుసు. రైతుల ఆత్మహత్యలు ఎక్కడా నమోదు కాకుండా
రికార్డుల్ని మాయం చేసిన పాలకులు మనకు తెలుసు. ఇదేదో ప్రభుత్వ వ్యవహారమనీ, తమకేవిూ సంబంధంలేదనీ భావించే వారిలో మనందరమూ వున్నాం. సంఘీభావహీనతే
ఆత్మహత్యలకు దారితీస్తుందిగనుక, ఒక వ్యక్తి ఆత్మహత్య
చేసుకుంటే అతని చూట్టూవున్న మొత్తం
సమాజాన్ని తప్పుపట్టాలనేది డర్ఖేం లా సూసైడ్ లో ప్రధానాంశం.
భారతదేశంలో ప్రతియేటా ఆత్మహత్యల సంఖ్యేకాదు, ఆత్మహత్యల రేటు
కూడా పెరుగుతోందని ఇటీవలి అనేకానేక సర్వే నివేదికలు చెపుతున్నాయి. విద్యావంతుల
శాతం తక్కువగావున్న బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి
రాష్ట్రాలకన్నా, విద్యావంతుల శాతం ఎక్కువగావున్న కేరళ,
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షణాది
రాష్ట్రాలలోనే ఆత్మహత్యల రేటు అధికంగా వుందనేది చేదు వాస్తవం. అందులో, మన పాత్ర ఎంత అని ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.
విజయవాడ
26-04-2008
No comments:
Post a Comment