Danny
letter
24
June 2013
సోదరుడు
కమలాపతిరావుకు!
ఉత్తరాఖండ్
మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుకుంటూ రాయునది.
మనిద్దరి
ఆవేదనలు, అభిప్రాయాలు, ఒకేలాగున్నాయి.
ఈ రోజు ఆఫీసులో
కేదార్ నాధ్ రుద్రరూపం వీడియోస్ కొన్ని చూశాను. గుండె తరుక్కుపోయింది. రాజకీయ నాయకులు
వేరు; భక్తులువేరు. ఏ మతానికిచెందినా వారైనా, భక్తులు స్వభావరీత్యా సాత్వికులు, దైవభీతి,
పాపభీతి కలవారు. అలాంటి అమాయక జీవులు అంత పెద్ద
సంఖ్యలో నిస్సహాయంగా చనిపోవడం చాలా బాధాకరం. 1977నాటి దివిసీమ ఉప్పెన
బాధితులకు మా స్నేహితులందరం కలిసి మా స్థాయిలో, పాత వస్త్రాలు, కోంద నగదు పంపించాం.
ఇప్పుడు అలాంటి చిన్నపని కూడా చెయలేకపొతున్నామనే అంశమే నన్ను ఎక్కువగా బాధపెడుతోంది.
నువ్వు పంపిన
’కేదార్ నాథ్ రుద్రరూపం - అసలు కారణాలు’ పూర్తిగా చదివాను. "ప్రజల పాపాలకు శిక్ష పాలకులకు పడుతుంది అని
మన ప్రాచీన స్మృతులు చెబుతున్నాయి. కాని ప్రస్తుత కలియుగంలో పాలకుల పాపాలకు శిక్షలు
ప్రజలకు పడుతున్నాయి" అని నువ్వు రాసిన దానితో నాకూ బాధతో కూడిన ఏకాభిప్రాయం వుంది.
"కేదార్
నాథ్ రుద్రభూమి. భగవంతుని యొక్క రుద్రస్వరూపం సంహారాత్మక మైనది. దానికి మనాతనా ఉండదు.
చెయ్యకూడని పని చేసినప్పుడు ఆ వ్యక్తిని నిర్మూలించడమే రుద్రతత్త్వం. రుద్రుని ఫాలనేత్రాగ్ని
జ్వాలల్లో చావులేని మన్మధుడే కాలిపోయి భస్మమయ్యాడు. మనుషులెంత?" అన్న నీ మాటలతొ
నాకు కొంత భిన్నాభిప్రాయం వుంది.
తప్పులు
చేసేవాళ్ళూ, ధర్మం తప్పేవాళ్ళూ, సాధారణంగా
సమాజంలో బలవంతులై వుంటారు. వాళ్లను నిస్సహాయులు ఎదుర్కోలేరు. అంచేత, పాపుల్ని
దేవుడే శిక్షిస్తే బాగుంటుందని నేనూ చాలాసార్లు అనుకుంటాను. నువ్వూ అలాంటి
అభిప్రాయాన్నే చెప్పావు. కానీ, కేదార్ నాధ్ విలయంలో తప్పు చేసింది ఏవరూ?
బలయిపొయింది ఎవరూ? నువ్వు చెప్పినట్టు దేవుడే ఈపని చేసివుంటే, విచక్షణా రహితంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న
కాంట్రాంక్టు కంపెనీల అధినేతల్ని, ఆ కంపెనీలకు అనుమతులిచ్చిన రాజకీయ పార్టీలని
శిక్షించివుండాల్సింది. కానీ, కేదార్ నాధ్ లో అమాయక భక్తులు వేలాదిమంది చనిపోయారు.
ఏకంగా భగవంతుని ఆలయాలే విధ్వంసం అయిపోయాయి.
ఎక్కడో హేతుబధ్ధత తప్పినట్టులేదూ.
"మనుషులు
సాగిస్తున్న విధ్వంసంపై ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంది" అని కొందరు పర్యావరణ శాస్త్రవేత్తలు
అన్నారు, కేదార్ నాధ్ ప్రళయం తరువాత ఒక్క రాజకీయ
నాయకుడూ, ఒక్క కాంట్రాక్టరూ ఇది తమ తప్పిదమని చెప్పలేదు.
దేశంలోనే
అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు గుళ్ళు విధ్వంసమై, వేలాది భక్తులు చనిపోయినపుడు దానికి కారణమైన ప్రాజెక్టు నిర్మాణ సంస్థలూ, వాటికి
వత్తాసు పలికే రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా
సంఘ్ పరివారం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని అనుకోవడం ఎవరికైనా సహజం. కానీ
అలా జరగలేదు. సంఘ పరివారం మౌనంగా వుండిపోయింది. కేదర్ నాధ్ పరిసరాల్లో బాధితులకు సేవలందిస్తున్నావారిలో
సంఘ పరివారం కార్యకర్తలు కూడా వున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు వారిని అభినందించాల్సిందే.
సంఘటనను
సంఘటనగా చూడడం పరిశోధనల్లో, మొదటి అడుగు మాత్రమే. దానికి, ముందూ వెనుకా చూడాలి. జరిగినదాన్నిబట్టి
జరగబోయేదాన్ని వూహించాలి. రాజకీయపార్టీలు,
నిర్మాణసంస్థలూ, దేవాలయాలు, భక్తులు, బాధితులు ఆన్నీ ఒకే మతానికి చెందినవారేగాబట్టి
ఈ విషాదం వివాదం కాలేదు. ప్రస్తుత వినాశనానికి కారణంగా భావిస్తున్న అలకానంద హైడల్ పవర్
కంపెనీ లిమిటెడ్ యాజమాన్యం ఒకవేళ హిందూవేతరులదైతే (ముస్లింలదైతే), సంఘపరివారం ఎలా ప్రతిస్పందించేదో ఊహిస్తే, మతతత్వాన్ని
నిర్వచించడానికి ఒక సజీవ ఉదాహరణ మనకు దొరుకుతుంది.
నాకు దేవుని మీద విశ్వాసం వుంది. ఇతర దేవుళ్లని నమ్మే ఇతర మతస్తుల మీద గౌరవమూ వుంది. కానీ, ఏ మతసామాజికవర్గంలో అయినా మతతత్త్వాన్ని నేను అంగీకరించలేను.
మతం అనేది
ప్రకృతి మీద మనుషుల విశ్వాసానికి సంబంధించిన అంశం. మతతత్వం అనేది, స్వమత పెట్టుబడిదారులకు
లాభాల్నీ అర్జించిపెడుతూ, పరమత పోటీదారులపై అణిచివేతనీ పురికొల్పే సాధనం. మొదటిది ఆధ్యాత్మికం,
రెండోది ఆర్ధికం. మతం అలౌకికం; మతతత్వం లౌకికం.
పేస్ బుక్
లో నా పోస్టుల మీద వచ్చే విమర్శలకు నేను సమాధానం ఇవ్వాలనుకోను; తీవ్ర అపార్ధం చోటుచేసుకుందని
భావించినప్పుడుతప్ప.
శ్రేయోభిలాషి
ఉషా యస్ డానీ
No comments:
Post a Comment