Monday 3 June 2013

Death Bath

చావునీళ్ళు

ఏ.యం. ఖాన్ యజ్దానీ

      దిక్కులేని శవాలకు పేర్లుండవు,  వేదాద్రి రేవులో అందరికీ ఆమె శవంగానే తెలుసు. దిక్కులేని శవాలకు కథలుంటాయి. ఈ శవానికీ ఒక కథుంది. ఈ శవంకథ చాలామందికి తెల్సు. అంటే, వాళ్ళందరికీ ఈ కథ మొత్తంగా తెలుసనీకాదు. ఒక్కొక్కరికీ ఒక్కొక్క ముక్క తెల్సు. తెలిసినవాళ్లంతా ఒకచోట చేరి ఒకరి వెంట ఒకరు ఒక్కొక్క ముక్క చెపితే బావుణ్ణు. దిక్కులేని శవాల గురించి చాలా మందికి చాలా విషయాలు తెలిసేవి. కానీ వాళ్ళు అలా ఒక చోట కూర్చోవడం కుదరదు. కుదిరినా నోరు విప్పి కథ చెప్పడం అంతకన్నా కుదరదు.

        ఆమె శవం ఎలాగూ దిక్కులేనిదే. ఆ శవం కథకూ ఇప్పుడు దిక్కు లేకుండాపోయింది. శవం మీది చీరా జాకెట్టుని బట్టి, బోసి మెడనుబట్టి, బోసి నుదిటిని బట్టి, గిల్టు గాజుల్ని బట్టి ఆమె భర్త ఇంతకు ముందే పోయాడని చూసిన వాళ్లకు ఇట్టే తెలిసిపోతుంది. ఆమెకు ఆరు పదుల వయస్సు వుంటుందని కూడా వాళ్ళంతా నిర్ధారించారు.

        రేవుకు వెళ్లడానికి ముందు ఆమె గుడికి వెళ్ళింది. గుళ్ళోకి వెళ్ళడానికి ముందు గుడి బయట పూజా సామాగ్రి కొన్నది. పూజా సామాగ్రి అమ్మే ఆమెతో కొద్దిసేపు కబుర్లాడింది. చత్వారం కళ్ళజోడు ఇచ్చి, దాన్ని దాయమని మరీమరీ వేడుకుంది.

        వర్షాలు లేక కృష్ణానది ఇసుక ఎడారిలా మారిపోయింది. ఆమె కోసమో, అలాంటివాళ్ల కోసమో వేదాద్రి రేవులో పెద్ద అఖాతముంది. 

          నరసింహస్వామికి దండం పెట్టుకుని, రేవులో దిగిందామె. లోతుగావున్న చోటు వెతుక్కుని రెండు మునకలు వేసింది. మూడోసారి మునిగిందిగానీ పైకి తేలలేదు. దగ్గర్లోవున్న జాలర్లు గడవేసి గాలించారు. గట్టుకు చేర్చే లోపునే ఆమె శవమైపోయింది.

        దిక్కులేని శవాలకు పంచనామా జరపాలి. శవాన్ని విజయవాడకు పంపి, బంధువులు వచ్చేవరకు మార్చురీలో వుంచాలి. నాలుగు రోజులైనా ఎవరూ రాకపోతే, ఆ శవానికి  దహన సంస్కారాలు జరపాలి. వీటన్నింటికీ కలిపి నాలుగైదు వేల రూపాయలైనా ఖర్చు అవుతుంది. చిల్లకల్లు పోలీసు స్టేషన్లో అంత బడ్జెటులేదు. శవం తేలిందని పోలీసులకు వార్త వెళ్ళింది. బడ్జెట్టే లేనపుడు శవం దగ్గరికి వెళ్లడం మాత్రం దేనికని పోలీసులు ఊరకుండిపోయారు.

శవం గట్టు మీద ఉండగానే, ఆమె కొడుకులు వచ్చారు.  పూజా సామాగ్రి కొట్టు ఆమె వాళ్ల చేతుల్లో కళ్ళజోడు పెట్టింది.  తల్లి పంపిన  ’కళ్ళజోడు సందేశంవాళ్లకు సరిగ్గానే అర్థం అయింది. శవాన్ని తీసుకెళ్ళే శక్తి వాళ్లకులేదు. తల్లికి అంతిమ సంస్కారాలు జరిపే స్తోమత అంతకన్నాలేదు. దినం చేసే దిక్కేవుంటే ఆమె దిక్కులేని చావు ఎందుకు చస్తుందీ? ఆ శవం మాది కాదంటే మాది కాదంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు ఆమె కొడుకులు.

        గుడి దగ్గర శవాన్ని ఎక్కువసేపు వుంచడం మంచిదికాదని అయ్యవార్లు భావించారు. ఊరి మాజీ సర్పంచ్ ఆర్ధిక సహాయంతో శవానికి అంతిమ సంస్కారం జరిపించారు. ఇటీవలికాలంలో వేదాద్రిలో ఇది నాలుగో శవం.

        ఈ శవం కథలో ఇంకో ముక్క మిగిలిపోయింది. అది ఒకరు చెప్పేదీ కాదు. జగ్గయ్యపేట కరువు ప్రాంతంలో ఆ ముక్క గాల్లో పచార్లు చేస్తోంది.

        ఆ శవానిది చిల్లకల్లు సమీపాన చిన్నగ్రామం. యాదవ కుటుంబం. కొడుకులతోపాటూ కోడళ్ళూ, మనవళ్ళూ వున్నారు. ఎకరం మాగాణి. ఎకరం మెట్ట, పది జీవాలు, వాటికి సరిపడా బ్యాంకు అప్పు వెరసి వాళ్ల బతుకు. పొలం పనుల్ని కొడుకులు చూసుకుంటుంటే, జీవాల్ని ఆమె మేపుకొచ్చేది.

        కరువొచ్చి మాగాణి బీడైపోయింది. మెట్టలో మిర్చి వేస్తే నీరులేక చేను ఎండిపోయింది. కిలో గడ్డి మూడు రూపాయలకు మించిపోయింది. జీవనాధారంగావున్న జీవాలను కోదాడ సంతకు తోలెయ్యక తప్పలేదు. పిల్లలకు పూటకింత అన్నం పెట్టలేని రోజుల్లో తల్లికింత ముద్ద పెట్టడం కొడుకులకు తలకు మించిన పనైంది.

        ఆ కుటుంబానికీ, ఈ ప్రపంచానికీ ఆమెతో పనిలేకుండా పోయింది.  ఆకలి, అవమానాలతో కొన్నాళ్ళు బతికింది. ఛస్తే చావునీళ్ళకు కూడా నోచుకోనని ఆమెకు తెలిసిపోయింది. కరువు చావుకన్నా, వేదాద్రి వెళ్ళి కృష్ణలో మునిగి చావడం మేలనుకుంది.

        బతకాలనుకున్న చోట ఆమె బతకలేక పోయింది. చావాలనుకున్న చోట ఆమె చనిపోయింది.

 రచన : 1  మార్చ్   2003 
ప్రచురణ :  ఆంధ్రప్రభ దినపత్రిక,  2  మార్చ్   2003                   







4 comments:

  1. కథ చాల బాగుంది. చూడ్డానికి చాల చిన్న కథ. చాల దుఃఖం ఉంది, ప్రిటెన్షన్స్ లేవు, సెంటిమెంటల్ చెత్త లేదు. ఇది రా నాయ్నా ఇవాల్టి బతుకు అని సూటిగా, అనవసరాలు, అలంకారాలు ఏమాత్రం లేకుండా, టెర్స్ ప్రోజ్ లో ఇలా ఈ మధ్య ఎవరైనా రాశారా, నాకు గుర్తు రావడం లేదు.

    ReplyDelete
    Replies
    1. Thank you very mech HRK!

      caalaa anandam vesindi.

      Danny bahut khush hua!!!

      Delete
  2. Dear HRK

    ee టెర్స్ ప్రోజ్ gurinchi naaku konchem vivarana kaavaali. please.

    ReplyDelete
  3. బాగా రాశారు. నిర్లిప్తంగా, క్లుప్తంగా సాగిన కథనం ఈ కథలోని విషాదాన్ని గాఢంగానే చెప్పగలటం విశేషం!

    ReplyDelete