Thursday, 2 February 2023

ఫాసిజం - ఫాసిజం బాధితుల ఐక్యత.

 ఫాసిజం - ఫాసిజం బాధితుల ఐక్యత.

ఉషా యస్ డానీ

 

భారత వర్తమాన రాజకీయాల్లో రెండు పదాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. వీటిల్లో మొదటిది; ఫాసిజం. రెండోది; ఫాసిజం బాధితుల ఐక్యత. ఈ రెండు పదాలు ద్రవ స్థితిలో వున్నాయి; ఇంకా స్థిరపడలేదు. అంటే సమాజంలో వీటి మీద సాగుతున్న చర్చ ఒక కొలిక్కి రాలేదని భావించాలి.

 

ప్రజా వ్యతిరేక చట్టాలు చేసినపుడో, ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాచినపుడో ప్రభుత్వాధినేతల్ని ‘ఫాసిస్టు’ అనడం రెండవ ప్రపంచ యుధ్ధం తరువాత ఒక సాంప్రదాయంగా మారింది. ఎమర్జెన్సీ రోజుల్లో మనదేశంలో ఫాసిజం అనే పదం తరచూ వినిపించేది. ఎమర్జెన్సీ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది. అయితే,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 42 లోక్ సభ స్థానాల్లోనూ తెలుగు ప్రజలు ఇందిరా కాంగ్రెస్ ను ఏకగ్రీవంగా గెలిపించారు. (నంద్యాలలో ముందు జనతా పార్టి గెలిచిందిగానీ వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కూడ కాంగ్రెస్ గెలుచుకుంది.) నియంతృత్వ పాలన మీద కూడ ప్రజల్లో వ్యతిరేకత మాత్రమేగాక  అభిమానం కూడ అంతే తీవ్రస్థాయిలో వుంటుందనడానికి ఇదొక ఉదాహరణ.

ఆ తరువాత అంతకన్నా తీవ్ర స్థాయిలో ప్రజావ్యతిరేక విధానాలను పాటించే ప్రభుత్వాలు వచ్చాయి. అప్పుడు తొందరపడి ఫాసిస్టు అనేశామని భావించేవాళ్లు ఇప్పుడు ఫాసిస్టు అనొచ్చోలేదో అనే సంధిగ్ధంలో పడ్డారు. కొందరు ఫాసిస్టు పాలన ఫాసిస్టు పాలన రాబోతున్నదంటున్నారు. మరికొందరు కొంచెం వచ్చింది అంటున్నారు.  ఇంకొందరు ఫాసిస్టు పాలన నడుస్తున్నది అంటున్నారు.  భారత దేశంలో ఫాసిస్టు పాలన వచ్చే అవకాశమే లేదని వాదించేవారు కూడ లేకపోలేదు.

 

ఫాసిజం మీద ఇంతటి సైధ్ధాంతిక గందరగోళానికి కారణం ఫాసిజం అనే పదమే. ఫాసిజం అనేమాట వినగానే మనకు 1920-40ల నాటి ఇటలీ-బెనిటో ముస్సొలినీ, జర్మనీ-అడాల్ఫ్ హిట్లర్ గుర్తుకు వస్తాడు. 1935లో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ కార్యదర్శి జార్జి డిమిట్రావ్ “ఫైనాన్స్ పెట్టుబడి యొక్క అత్యంత ప్రతిఘాతుక, అత్యంత ఆధిపత్య, అత్యంత సామ్రాజ్యవాద అంశాల బహిరంగ ఉగ్రవాద నియంతృత్వం” అని ఫాసిజాన్ని నిర్వచించాడు. అప్పటి కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ తదితరులు కూడ తమదైన పధ్ధతుల్లో ఫాసిజాన్నినిర్వచించారు.

 

వాళ్ళిద్దరివి అప్పటికి గొప్ప ఆవిష్కరణలు. అయితే, వీటికి చాలా పరిమితులున్నాయి. ఇవి ఇటలీ ఫాసిజానికి  మాత్రమే పరిమితమయిన సిధ్ధాంతాలు. అప్పటికి హిట్లర్ ‘ఫ్యూరర్ ఆఫ్ జర్మనీ’గా మారి ఒక్క ఏడాది మాత్రమే అయింది. జర్మనీలో నాజిజం పూర్తిగా పడగలు విప్పలేదు. పైగా, స్టాలిన్ నాయకత్యంలోని రష్యా ఒక ఎత్తుగడగా హిట్లర్ తో నిర్యుధ్ధ సంధి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వున్న కాలం అది. ఇన్ని పరిమితుల మధ్య ఫాసిజానికి డిమిట్రావ్  ఇచ్చిన నిర్వచనాన్ని అర్ధం చేసుకోవాలి. ‘సాంస్కృతిక జాతీయవాద’ ప్రమాదాన్ని గుర్తించకపోవడం  డిమిట్రావ్  నిర్వచనంలో ప్రధాన లోపం. నిజానికి అప్పటికి పదేళ్ల క్రితమే ఇటలీ కమ్యూనిస్టు సిధ్ధాంత వేత్త ఆంటోనియో  గ్రామ్ స్కీ ‘సాంస్కృతిక ఆధిపత్యవాద సిధ్ధాంతాన్ని’ వివరించాడు. దాన్ని కూడ డిమిట్రావ్ పట్టించుకోలేదు.

 

నిజానికి ఫాసిజం నిర్వచనం గురించి ఇంత హైరానా అక్కరలేదు. ముస్సోలినే స్వయంగా ఫాసిజానికి నిర్వచనం ఇచ్చాడు.  1921లో ఇటలీలో  జాతీయ ఫాసిస్టు పార్టి (Partito Nazionale Fascista (PNF))ని ఆరంభిస్తూ “ప్రభుత్వానికి రాజకీయ అధికారం వుంటుంది; కార్పొరేట్లకు ఆర్ధిక శక్తి వుంటుంది. ఈ రెండింటినీ కలిపి దేశాన్ని అప్రతిహత శక్తి గా  మార్చడమే ఫాసిజం” అని వివరించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే “ప్రభుత్వాన్ని కార్పొరేట్ సంస్థగా మార్చడమే ఫాసిజం” అన్నాడు.

 

ఫాసిజానికి విధిగా సాంస్కృతిక జాతీయవాద వత్తాసు కావాలి. దేశ సహజ సంపదను, ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్నీ కలిపి కార్పొరేట్లకు కట్టబెడుతుంటే శ్రామికులేకాక సామాన్య ప్రజలు సహితం తీవ్రంగా అడ్డుకుంటారు. ఈ ప్రమాదాన్ని తప్పించాలంటే వాళ్ళలో సాంస్కృతిక జాతీయవాదాన్ని ఒక పూనకంలా ఎక్కించాలి. ముస్సోలిని ఇటాలియన్ సాంస్కృతిక జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ఫాసిజానికి జీవంపోశాడు. హిట్లర్ ఇంకో  అడుగు ముందేశాడు. శ్రామికులు, సామాన్య ప్రజల చేత కార్పొరేట్లకు ఊడిగం చేయించడానికి క్రైస్తవ మతాన్ని ఒక ఉన్మాదంగామార్చి యూదుల మీద విరుచుకు పడి నాజీజాన్ని నిలబెట్టాడు.

 

ఎక్కువ మందికి ఇటలీ ఫాసిజం, జర్మనీ నాజిజం గురించే తెలుసుగానీ, రెండవ ప్రపంచ యుధ్ధానికి ముందు, స్పెయిన్, పోలాండ్, ఆస్ట్రియా, బ్రెజిల్, క్రొయేషియా, ఫ్రాన్స్, గ్రీస్, హంగేరీ, పోర్చుగల్, యుగోస్లావియా,  తదితర అనేక దేశాల్లో ‘ఫాసిజం’ వంటి పాలన సాగింది. అంచేత, ఫాసిజానికి  నిర్ధీష్ట అర్ధం చెపితే సరిపోదు. ఇటలీలా లేదనో, జర్మనీలా లేదనో, స్పెయిన్ లా లేదనో గుర్తు చేసి మన దేశంలో ఫాసిజం లేదనో రాదనో వాదించేవాళ్ళు పుట్టుకొస్తారు. అంచేత , ఫాసిజానికి ఒక సాంకేతిక నామాన్ని ఇవ్వాల్సిన అవసరం వుంది.

 

పెట్టుబడీదారీ వ్యవస్థలో వలసవాద, సామ్రాజ్యవాద దశల్లా ఫాసిజం కూడ ఇంకో దశ. పెట్టుబడీదారీ వ్యవస్థ దశలు అన్నింటిలోనూ నియంతృత్త్వం వుంటుంది. పెట్టుబడీద్రీ వ్యవస్థ తొలి దశల్లో హేతువాదం, విజ్ఞానశాస్త్రాలు, భౌతికవాదాల్ని తన విస్తరణకు  అనుకూలంగా వుపయోగించుకున్నట్టు ‘ఫాసిస్టు’ దశలో తను బలపడడానికి  మతాన్నీ, సంస్కృతిని వుపయోగించుకుంటుంది. ఈ దశలో దీనిని   సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్త్వం’ అనాలి.  ఇది ఒక్కో దేశంలో ఒక్కో విధంగా వుంటుంది.

No comments:

Post a Comment