నా సామాజిక దృక్పథం
: నా రాజకీయాలు
నా సామాజిక దృక్పథం
గురించి, నా రాజకీయ
అవగాహన గురించి గతంలో చాలాసార్లు చెప్పాను. అయినప్పటికీ కొందరు దీన్ని తరచు ఒక వివాదంగానో,
నా
వ్యక్తిత్వ హననంగానో మారుస్తున్నారు.
నేను కమ్యూనిస్టు వ్యతిరేకిననేది తరచుగా జరుగుతున్న ప్రచారం. రెండోది నేను విప్లవకారుడ్ని కాదనేది ఇంకో విమర్శ.
విషయాల మీద మాట్లాడడానికి
ముందు ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సివుంది. నాకు ముహమ్మద్ ప్రవక్త అన్నా, కార్ల్ మార్క్స్
అన్నా చాలా ఇష్టం. కమ్యూనిస్టు పార్టి సభ్యులు అనేకమందికన్నా మార్క్స్ ను నేను లోతుగా
చదివాను. తరచూ వర్తమాన సమాజానికి సృజనాత్మకంగా అన్వయిస్తూ వున్నాను. నన్ను విమర్శించేవారిలో
అత్యధికులు కనీసం ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’ కూడా చదవని వాళ్ళే.
చిన్నప్పుడు బాల కార్మికునిగా నా జీవితం ఆరంభం
అయింది. ఆ సామాజిక అస్తిత్వమే నన్నొక 'సహజ కమ్యూనిస్టు' (ఆర్గానిక్స్ కమ్యూనిస్టు)గా మార్చాయి. యవ్వనంలో తీవ్ర మత వివక్ష కారణంగా నా మొదటి భార్య భార్య చనిపోవడంతో సమాజాన్ని మార్చే శక్తుల్ని వెతకాల్సిన అవసరం నా జీవితంలో కలిగింది.
సమసమాజం
అనేది నాకు సరదాకాదు; లైఫ్ సేవింగ్ డ్రగ్.
విజయవాడలో దాదాపు ఒక నెలరోజులపాటు వెతికి కొందరు నక్సలైట్లను కలిశాను. ఆ బృందానికి నాయకుడు వాసిరెడ్డి వి కృష్ణారావు. నాయకుడు. వాళ్ళది సీవోసీ గ్రూపు అని దాని అగ్రనేత కొండపల్లి సీతారామయ్య అని ఆ తరువాత తెలిసింది.
కేఎస్ గ్రూపు నక్సలైట్లను కలిశాక నా అవగాహన చాల పెరిగింది. సమాజాన్ని విశ్లేషించే
గతితార్కికంగా భౌతికవాద మెథడాలజీ వంటబట్టింది. ముందు ‘రాడికల్’ అయ్యాను. తరువాత రాడికల్స్ యువజన సంఘానికి జిల్లా అధ్యక్షుడిని అయ్యాను. ‘నడుస్తున్న చరిత్ర’, ‘తూరుపుగాలి’ పత్రికల ప్రచురణలోనేగాక
హంగేరియన్ మార్క్సిస్టు తత్వవేత్త జియోర్జి లూకాక్స్ (György Lukács) అభిమానులు లండన్ నుండి ప్రచురించే ‘బ్రాడ్ షీట్’
పత్రికను విజయవాడలో ఇక్కడ పునర్ ముద్రించే పనిలోనూ పాల్గొన్నాను. విప్లవ రచయితల రచయితల సంఘంలో చేరాను. కృష్ణా వుభయగోదావరి జిల్లాల
ప్రాంతీయ కన్వీనర్ ని అయ్యాను. కృష్ణారావు గారు బ్యటికి వెళ్ళిపోయిన దశలో హోల్
టైమర్ గానూ, ఒక దశలో కృష్ణాజిల్లా
పీపుల్స్ వార్ కు బాధ్యునిగా వున్నాను. సున్నపు బట్టీల సెంటర్ లో దాసరి రమణ నగర్ నిర్మాణానికి నాయకత్వం వహించాను. నెల్లూరు నుండి శ్రీకాకుళం
వరకు లోపల బయట కూడ తత్వశాస్త్రం వర్తమాన రాజకీయాలు ప్రాధమిక పాఠాలు చెప్పేవాడిని. ఒకే మనిషి బయట యూనివర్శిటీ విద్యార్ధుల ముందు ప్రసంగించడం,
లోపల నిరక్షరాశ్యులకు పాఠాలు చెప్పడం సాధారణ సాము కాదు. చివరకు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలోనూ విప్లయోద్యమానికి నా సేవలు అందించాను. (ఆ వివరాలను చెప్పడం టెక్నికల్ గా సాధ్యంకాదు.) నేను చేరిన కొత్తలోనే సివోసి విజయవాడలో ఒక రహాస్య పాఠశాల నిర్వహించింది.
సాక్షాత్తు కొండపల్లి సీతారామయ్య, కేజి సత్యమూర్తి, ఐవి సాంబశివరావులు చెరో రోజు
పాఠాలు చెప్పారు. బయట గాలికి కూడ తెలియకుండ ఆ పాఠశాల విజయవంతమయింది. నిజానికి నేను
ఆ పాఠశాలలో విద్యార్ధిని కాదు; నిర్వాహకుల్లో ఒకడిని. డానీకి పని అప్పసెపితే అది జరిగిపోయినట్టే అనే పేరు వచ్చింది. నన్ను పెర్ఫెక్షనిస్టు అనేవారు. అప్పచెప్పిన
పనిని అంత మెటిక్యూలస్ గా ప్లాన్ చేసేవాడిని. స్విడిష్ రచయిత జాన్ మీర్డాల్
కొండపల్లీ సీతారామయ్యను కలవడానికి ఆంధ్రప్రదేశ్ కు వచ్చినపుడు కేఎస్ కు తోడున్నది
నేనే. కొరియర్ అనుకోండి, బాడీగార్డ్ అనుకోండి.
ఆరోజుల్లో ఇన్ని రంగాలలో ఏకకాలంలో పనిచేసింది నేనే అనుకుంటాను.
కానీ మూడేళ్ళ తరువాత కొంత అసంతృప్తి
మొదలయింది. చారు మజుందార్ అతివాదాన్ని తప్పు పడుతూ 1974లో అప్పటి సీవోసీ ఒక డాక్యుమెంట్ రాసింది. దాన్ని 'ఆత్మవిమర్శ' డాక్యుమెంట్
అనేవారు. ఎమర్జెన్సీ
మూలంగా దాని మీద చర్చ మూలనడి చాలా లేటుగా 1980లో ఆమోదించారు. ‘చైనా ఛైర్మన్ మన ఛైర్మన్’ అనడం నాకూ నచ్చేదికాదు. నక్సలైట్లు అప్పట్లో రష్యాను సోషల్ సామ్రాజ్యవాదం అనేవారు; ఛైనాను విప్లవకేంద్రం అనేవారు. నాకు ఇదీ నచ్చేది కాదు. "ఓల్గా ఘనీభవించినపుడు యాంగ్సీ
కూడా ఘనీభవించియిందని అనుమానించడం గతితార్కిక చారిత్రక
భౌతికవాద విధానం కదా?" అని అప్పటి రాష్ట్ర సమితి కార్యదర్శి ముక్కు సుబ్బా రెడ్డిని నేరుగా అడిగాను. వారు నాకు సమాధానం చెప్పలేక పోగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని ఒక నింద వేశారు. అప్పట్లో ఆ నింద చాలా తీవ్రమైనది. పార్టీ వ్యతిరేక
ముద్రపడుతుందనే భయంతో కామ్రేడ్స్ కొన్నాళ్లు నాకు దూరంగ మసలడం మొదలెట్టారు. ఇది
ఎంత వరకు వెళ్ళిందంటే 1981లో వరంగల్ లో జరిగిన రాడికల్ యువజన సంఘం మహాసభలకు నన్ను
ప్రతినిధిగా కూడ ఎంపిక చేయలేదు.
పార్టీలో విధేయులకు పెద్ద పీట వేస్తున్నారని, నాయకుల్లో బ్యూరాక్రటిక్ విధానాలు ప్రవేశించాయని నాకు అర్ధం అయిపోయింది. 1981 మే 1న హోల్ టైమర్ జీవితం నుండి బయటికి వచ్చి ఉద్యోగం వెతుక్కున్నాను.
భారత దేశం వర్ణసమాజం అనే అభిప్రాయం
అనాదిగా చాలా బలంగా వుంది. కమ్యూనిస్టులు దీన్ని వర్గ సమాజంగా అభివర్ణించేవారు.
జాతియోద్యమ కాలంలోనే అంబేడ్కర్ దీనిని కుల సమాజం అన్నాడుగానీ అది అప్పట్లో అంతగా
ప్రాచూర్యాన్ని పొందలేదు. ఉద్యోగ రీత్యా ఢిల్లీతో సంబంధాల కారణంగా 1980 లనాటి పంజాబ్ అశాంతినీ, 1984లో ఢిల్లీలో
శిక్కుల ఊచకోతల్ని నేను దగ్గరగా గమనించాను.
ఆ తరువాత అధికారానికి వచ్చిన రాజీవ్
గాంధీ విధానాల్లో రెండు అంశాలున్నాయి.
ఒకవైపు శిక్కుల ఊచకోత అతనికి రాజకీయాల్లో
లాభించింది. మరోవైపు, సాంకేతిక రంగంలో ఐటి విప్లవానికి నాందీపలకడం యువతను
ఆకర్షించడానికి ఉపయోగపడింది. రాజీవ్ గాంధీని కాపీకొట్టడానికి బిజెపి సిధ్ధమైంది. శిక్కులు
పంజాబ్ కో, ఢిల్లీకో పరిమితమయిన చిన్న మైనారిటీ సమూహం. దేశస్థాయిలో మతవిద్వేషాన్ని
రెచ్చగొట్టాలంటే శిక్కులకన్నా చాలాపెద్ద సమూహ అయిన ముస్లింలే బెస్ట్ ఆప్షన్
అవుతుంది. ఇదంతా గతితర్కమే.
గతంలో "ఓల్గా ఘనీభవించినపుడు యాంగ్సీ
కూడా ఘనీభవించియిందని అనుమానించడం గతితార్కిక చారిత్రక
భౌతికవాద విధానం కదా?" అనే పరికల్పన చేసినట్టు భారతదేశం మతసమాజంగా మారుతోందని, ఈసారి ముస్లింలే
టార్గెట్ అనే ఆలోచన నాకు తట్టింది. ఇలాంటి ఆలోచనని కమ్యూనిస్టు పార్టీలు
తట్టుకుంటాయా? ఇలా ఐదారు నెలలు నిద్రలేని రాత్రులు గడిపాను. ఓ ఏడు నెలల్లోనే కారంచేడు దురాగతం జరిగింది. అపట్టికి నేను
పీపుల్స్ వార్ లో హోల్ టైమర్ ని కాదు. కేవలం సింపథైజర్ ని. పీపుల్స్ వార్ లో
అనేకమంది హోల్ టైమర్లు వున్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలో పేరు మోసిన నాయకులు
వున్నారు. వాళ్ళలో కొందరిని పంపే ప్రయత్నం చేశారు. అది ఫలించలేదు. ఓ రోజు వాళ్ళొక
చుట్టపు చూపుగా వెళ్ళి వచ్చారు. పీపుల్స్ వార్ రీజియనల్ కమిటి (ఆర్ సి)
కి అప్పుడు నిమలూరి భాస్కరరావు (మల్లిక్). అంతిమంగా ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు అప్పటికే అసమ్మతివర్గం గా ముద్రవుంది. నాకిది సవాలు మాత్రమేకాదు; సమాజాన్ని మరింత
దగ్గరగా అధ్యయనం చేయడానికి దొరికి వచ్చిన ఒక గొప్ప అవకాశం అనుకున్నాను.
కారంచేడు ఉద్యమం మొదలయినపుడు క్రైస్తవ ప్రతినిధులు
కొన్ని రోజులు బాధితుల్ని ఆదుకున్నారు. అది రాజకీయ రూపం సంతరించుకున్నాక హేతువాద
సంఘం నుండి వచ్చిన కత్తి పద్మారావు, కాంగ్రెస్ నాయకుడు సలగల రాజశేఖర్ దానికి
నాయకులుగా వున్నారు. నేను మూడవవాడిగా చేరాను. పోలీసులు నిర్లిప్తంగా వున్నంతకాలం
ఉద్యమం సజావుగా సాగింది. పోలీసులు లాఠీ
జడిపించడం మొదలెట్టాక నిర్బంధం పెరిగింది. రాష్ట్రబంద్ కు ముందు రోజు సలగల రాజశేఖర్ బయటికి వెళ్ళిపోయారు. రాష్ట్రబంద్
తరువాతి రోజు కత్తి పద్మారావు చీరాల వదిలి
వెళ్ళిపోయారు. ఆ నిర్భంధకాలంలో ఒక నెల రోజులు నేను ఒక్కడ్నే విజయనగర శిబిరానికి
నాయకునిగా వున్నాను. విజయవాడలో కత్తి పద్మారావు అరెస్టు తరువాత పోలీసులు నన్ను
చీరాల వదిలి వెళ్ళాలని ఆంక్ష విధించారు.
కారంచేడు ఉద్యమకాలంలో పీపుల్స్ వార్ మీద నా అసమ్మతి
మరీ పెరిగింది. అప్పట్లో ప్రకాశం జిల్లా కార్యదర్శిగా గురవయ్య అని ఒక ముసలాయన
వుండేవారు. ఆయన్ని మార్చి బాలయ్య అనే అతన్ని పంపించారు. టెక్నికల్ గా నేను అతని
కింద పనిచేయాలి. అతను తనకు షేల్టర్ ఇచ్చిన వారి ఇల్లాలిని ఎత్తుకుపోయే పనిలో
నిమగ్నమై వుండేవాడు. వారితో నాకు సైధ్ధాంతిక విభేధాలు ఉన్నా కత్తి పద్మారావు, సలగల
రాజశేఖర్ గౌరవనీయులు.
బాలయ్యను ప్రకాశంజిల్లాకు
పంపిన నిమలూరి భాస్కరరావు మరీ నికృష్డుడు. అతనికి చదువుకున్నవాళ్ళంటే భయం. ప్రతి
జిల్లాలో ఒక చెత్త గ్యాంగ్ ను తయారు చేసి వాళ్ళ ముందు మహానాయకునిగా చెలామణి
అవుతుండేవాడు. ఆ జిల్లాలలోని మేధావులు మీద నైతిక దాడులు చేయిస్తుండేవాడు. ఈ
విమర్శను సాక్షాత్తు కొండపల్లి సీతారాయయ్య
ఓ ఇంటర్ వ్యూలో చేశారు.
జిల్లాలో అతి చెత్త వెధవ అని అందరూ తిడుతున్న
వ్యక్తిని భాస్కరరావు తనకు కొరియర్ గా పెట్టుకున్నాడు. అతని ద్వార నాటకీయంగా
అరెస్టు అయ్యాడు. పిచ్చి నక్సలైట్లు భాశరరావుని విడిపించడానికి హైదరాబాద్ లో ఓ
కాంగ్రెస్ నాయకుడ్ని కిడ్నాప్ చేశారు. అతని కొరియర్ ను చంపేశారు. బయతికి వచ్చిన
భాస్కరరావు ఈసారి అరెస్టు డ్రామా ఆడకుండ నేరుగా సరెండర్ అయిపోయి రివార్డు మనీ
అందుకున్నాడు. ముక్కు సుబ్బారెడ్దిదీ అదే చరిత్ర.
సరిగ్గా కారంచేడు ఉద్యమం జరుగుతున్నప్పుడే మరో కీలక
సంఘటన జరిగింది. కేజీ సత్యమూర్తిని పీపుల్స్ వార్ బహిష్కరించింది. దాన్నొక ‘టూ
లైన్ స్ట్రగుల్’ గా చిత్రించడానికి కొన్ని పుస్తకాలు వేశారు. వాటిల్లో ఏం రాశారో
వీరికీ తెలీదు వారికీ తెలీదు. అంతటి కారంచేడు ఉద్యమం మీద పీపుల్స్ వార్ ఒక
డాక్యుమెంట్ రాసినట్టుగానీ, అందులో నా పాత్రను ప్రస్తావించినట్టుగానీ ఇప్పటి వరకు నాకు తెలీదు.
ఆ తరువాత నేను సహజంగానే పీపుల్స్ వార్ కు దూరం
అయిపోయాను. విరసంలో చాన్నాళ్ళు. కొనసాగాను. విరసం నాయకత్వం మరీ పార్టి స్థానిక నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నదని
తేల్చుకున్నాక 2002లో విరసం సభ్యత్వానికి కూడ రాజీనామా చేశాను. అయినప్పటికీ
సందర్భం వచ్చినపుడు ఆ పార్టీలోని నా పాత మిత్రులు కోరితే కొన్ని పనులు
చేసిపెట్టేవాడిని. కొన్ని రిస్కులు కూడ చేసేవాడిని. 2004లో ప్రభుత్వంతో చర్చలకు వచ్చిన బృదంలో నా మిత్రుడు,
ఆంధ్రా ఒరిస్సా బార్డర్ కమిటి నాయకుడు సుధాకర్ ను ఆయన డెన్ వరకూ చేర్చింది నేనూ, నా
భార్యనే.
పీపుల్స్ వార్, విరసంలో నేను కొందరికి రుణపడి వున్నాను.
కొండపల్లి సీతారామయ్య. కేజి సత్యమూర్తి, ఐవి సాంబశివరావు, త్రిపురనేని మధుసూదనరావు,
చలసాని ప్రసాద్, వరవరరావు, ఆర్ ఎస్ రావు వీరిలో ముఖ్యులు. వీరినుండి జ్ఞానాన్నేగాక
జీవన శైలిని కూడ నేర్చుకున్నాను.
దూరం అయిపోనాసరే పీపుల్స్ వార్ తో నాకు ఒక సన్నటి పేగు
బంధం వుండేది. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలతో చాలా సన్నిహితంగా వున్నా వాటిల్లో చేరాలని
ఎన్నడూ అనుకోలేదు. కొండపల్లి సీతారామయ్యను బహిష్కరించాక ఆ ఫీల్ తగ్గిపోయింది. చైనా
ఛైర్మన్ మన ఛైర్మన్ దగ్గర మొదలయిన నా నిరసన పీపుల్స్ వార్ రద్దయి మావోయిస్టు పార్టిగా
అవతరించాక అనుబంధ అధ్యాయం పూర్తిగా ముగిసింది.
1977 నుండి దేశంలో జరిగిన ప్రతి ఉద్యమాన్నీ నేను పలుకరించాను. పరామర్శించాను. కొన్నింటికి నేరుగా నాయకత్వం కూడ వహించాను.
No comments:
Post a Comment