అమ్మా ప్రీతీ! క్షమించు!
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Monday, 27 February 2023
అమ్మా ప్రీతీ! క్షమించు!
వరంగల్ కు చెందిన మెడికల్
పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్ధిని ధరావతి ప్రీతి మరణం కలిచివేసింది. ఆమె ఆదివాసి
సామాజికవర్గానికి చెందిన ఆమె అని తెలిసి మరీ బాధ కలిగింది. ఆ సామాజికవర్గాల్లో ఒక
లక్షకో రెండు లక్షల మందికో ఒకరు ఆ స్థాయికి చేరుకుంటుంటారు. అలాంటివారు చనిపోవడం ఆ
కుటుంబానికేకాదు; ఆ సామాజికవర్గానికి కూడ పూడ్చుకోలేని నష్టం.
భారత మతతత్త్వ
కార్పొరేట్ నియంతృత్త్వానికి ప్రధాన
బాధితులు ముస్లింలు; ఆదివాసులు. ముస్లింల మీద జరుగుతున్న అణిచివేత బయటి
ప్రపంచానికి ఎంతోకొంత కనిపిస్తున్నది. కానీ; ఆదివాసుల మీద జరుగుతున్న దమనకాండ
అడవిదాటి బయటికి పొక్కడం లేదు. అది మరీ ఘోరం.
ప్రీతిని రాగింగ్
చేసి ఆమె ఆత్మహత్యకు దారితీసిన వారిలో సైఫ్ అనే
ఒక ముస్లిం మెడికో కూడ వున్నాడని తెలిసి దిగ్బ్రాంతికి గురయ్యాను. జూనియర్ల
మీద రాగింగ్ చేయడం, ఆత్మహత్యకు పురికొల్పిడం తదితర నేరంలతోపాటు ఎస్టి ఎస్సీ
అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడ అతని మీద కేసులు పెట్టారు.
సాధారణంగా ఇలాంటి
కేసుల్లో భిన్నమైన వాదనలూ వుంటాయి. అదే మెడికల్ కాలేజికి చెందిన కొందరు జూనియర్
డాక్టర్లు సైఫ్ అరెస్టును వ్యతికిస్తూ ధర్నాలు చేశారని ఒక వార్త చదివాను. సైఫ్ నిర్దోషి
అనేది వాళ్ల భావన. ముస్లిం ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఇలాంటి సంఘటనల కోసం ఎదురుచూసే
ఒక సమూహం ఎలాగూ సిధ్ధంగా వుంటుంది. ఆ సమూహం అప్పుడే దీన్ని ‘లవ్ జిహాద్’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టింది.
నిందితుడు సైఫ్ ను వెంటనే అరెస్టు చేశారు కనుక అతను శిక్షించదగ్గ
నేరం చేశాడా? లేదా? అతను చట్టబధ్ధ దోషా?
కాదా? అన్నది తేల్చేపని న్యాయస్థానాలు చూసుకుంటాయి.
ఈ సంఘటన కేవలం
చట్టాలకు, కోర్టులకు సంబంధించిన వ్యవహారం కాదు. ర్యాగింగ్ సంస్కృతి వ్యామోహంలో పడి సైఫ్ ఒక సామాజిక తప్పిదం కూడ చేశాడు అనడానికి వేరే నిరూపణలు
అక్కరలేదు. బాధితురాలు ఆదివాసి మాత్రమేకాదు; ఒక మహిళ కూడ. ఆదివాసులు, ముస్లిం సామాజికవర్గాల మధ్య ఒక
వివాదం రేగడానికి సైఫ్ కారణం అయ్యాడు. ఇప్పటి రాజకీయ, సాంస్కృతిక, సామాజిక
వాతావరణంలో ఇది చాలా పెద్ద చారిత్రక తప్పిదం. ఐక్యం కావలసిన సమూహాల మధ్య చిచ్చు
రేగడం సమాజానికి చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. అలాంటి నష్టనివారణ చర్యల్ని రెండు
సామాజికవర్గాల పెద్దలు సంయమనంతో చేపట్టాలి.
వున్నత
విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ముస్లిం విద్యార్ధులకు ఒక హెచ్చరిక; మీరు హిందూ
సమాజంతో మిత్రధర్మాన్ని పాటించండి. ఎస్టి, ఎస్సి, బిసిలతో మీరూ సమానులనే భావంతో
మెలగండి. క్యాంపస్ వ్యవహారాలన్నింటిలోనూ ఆ మూడు సామాజికవర్గాల పక్షం వహించండి. ఆ మూడు
సామాజికవర్గాలను తక్కువగా చూడడం అంటే మీరు మీ స్వీయ సామాజికవర్గాన్ని వధ్యశిల
మీదికి మరింత త్వరగా పంపిస్తున్నారనే స్పృహతో మెలగండి. ఏ దశలోనూ జెండర్
డిస్క్రిమినేషన్ ను పాటించకండి. అణగారిన
సమూహాలకు చెందిన లేడీ స్టూడెంట్స్ తో మరీ
జాగ్రత్తగా వ్యవహరించిండి. కోపంతోనేకాదు ప్రేమతో కూడ వాళ్ళ మీద జోకులు వేయకండి. తప్పు
మీ నుండి జరిగినా వాళ్ళ నుండి జరిగినా దోషులు మీరే అవుతారని గుర్తు పెట్టుకోండి.
ఉన్నత విద్యాలయాల్లో
సీనియర్లు ఎక్కువ, జూనియర్లు తక్కువ అనే జాడ్యం కొనసాగుతోంది. గత ఐదేళ్ళలో దేశంలో
125-150 మంది మెడికోలు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఇప్పుడే ఒక సర్వే రిపోర్టులో
చూశాను. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువే వుండవచ్చు. అసలు మన
సమాజంలోనే సాంస్కృతికంగా ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావన వుంది. ఇది వర్గం,
కులం, మతం, లింగం, భాషా, ప్రాంతం, వర్ణం అన్నింటిలోనూ వుంటున్నది. ఇప్పుడయినా మనం
దీనిని ఆపాలి. సమస్తరంగాలలో ఆపాలి. మనమే ఆపాలి.
అమ్మా ప్రీతీ! క్షమించు!
ఏయం ఖాన్ యజ్దానీ
(డానీ)
కన్వీనర్, ముస్లిం
ఆలోచనాపరుల వేదిక (MTF)
9010757776
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment