పెట్టుబడీదారులకు ఒకటే లక్ష్యం ప్రైవేటు ఆస్తిని పోగేసుకోవడం. ఈ పని సజావుగా సాగుతుంటే పెట్టుబడీదారులు మంచిగా కనపడుతుంటారు. సజావుగా సాగకపోతే క్రూరులుగాను బయటపడతారు. పది శాతం లాభం కోసం ఉరికంభం ఎక్కడానికయినా పెట్టుబడీదారులు సిధ్ధపడతారని కార్ల్ మార్క్స్ 170 ఏళ్ల క్రితమే అన్నాడు.
పెట్టుబడీదారులు మంచిగా వున్నప్పుడు ప్రజాస్వామ్యం. అధికారాల వికేంద్రీకరణ, సుపరిపాలన వంటి ఆదర్శాలు మాట్లాడుతుంటారు. అప్పుడు అది ముసుగు కప్పిన నియంతృత్త్వం. మంచిగా లేనపుడు నేరుగా వాళ్ళే ప్రభుత్వం, పార్లమెంటు, పోలీసులు, చివరకు న్యాయస్థానాలుగా కూడ మారిపోతారు. అప్పుడు అదు ముసుగు తీసేసిన నియంతృత్త్వం. తేడా అదొక్కటే. రూపాలు మారడమే తప్ప సారం ఎప్పుడయినా ఒక్కటే. రూపాలు మారినప్పుడెల్లా దాని సారం మారినట్టు మనం తరచూ పొరబడుతుంటాము.
పెట్టుబడీదారులు ధరించే రూపాల్లో ఫాసిజం ఒకటి. మతాన్ని అడ్డుపెట్టుకుని, ప్రభుత్వ సహకారంతో దేశసంపదను అవధుల్లేకుండా కొల్లగొడుతూ ప్రజల్ని ఇక్కట్ల పాలు చేయడమే పెట్టుబడీదారీ మతతత్త్వ నియంతృత్త్వం. దీనిని కొన్ని దేశాల్లో ఫాసిజం అన్నారు, మరికొన్ని దేశాల్లో నాజిజం అనేవారు, ఇంకొన్ని దేశాల్లో జుంటా అనేవారు. అంచేత ఫాసిజం ప్రతిదేశంలో ఒకే విధంగా వుంటుందని నిర్వచించడం గతితార్కిక చారిత్రక భౌతికవాద మూల సూత్రాలకే విరుధ్ధం.
ఇటలీలో ముస్సోలినీ జర్మనీలో హిట్లర్ ఎన్నికల ద్వారానే అధికారంలోనికి వచ్చారన్న వాస్తవాన్ని చాలామంది తరచూ మరచిపొతున్నారు. ఐదేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న దేశాన్ని నియంతృత్త్వం అనవచ్చా అని చాలామందికి తరచూ ఒక అనుమానం వస్తుంటుంది. ఇలాంటి అనుమానాలు ఇతరులకు వస్తే అదో కత; కమ్యూనిస్టులకు కూడ వస్తేనే ఇబ్బంది. పెట్టుబడీదారీ వ్యవస్థ అంటేనే పెట్టుబడీదారుల నియంతృత్వం అని కదా ఆ ఉంగరాలు జుట్టు గడ్డపాయన చెప్పింది. అది మరచిపొవడం న్యాయం కాదు; చారిత్రక నేరం కూడ.
No comments:
Post a Comment