Sunday, 15 May 2016

‘కట్టుకథ’ ఇంకా కాటేస్తూనే ఉంది

‘కట్టుకథ’ ఇంకా కాటేస్తూనే ఉంది

-  ఉషా యస్ డానీ


‘పుట్టుమచ్చ’కు పాతికేళ్లు

బ్రిటీష్ ఇండియా చివరితరం ముస్లింలు దేశ విభజన శిలువను మోయాల్సి వచ్చింది. నిజానికి పాకిస్థాన్  వెళ్ళిపోయినవారి కన్నా వెళ్ళని ముస్లింలే అనేక రెట్లు ఎక్కువ. రిపబ్లిక్‌ ఇండియాలో వుండిపోయిన ముస్లింలు పాకిస్థాన్ వెళ్ళడానికి నిరాకరించినవాళ్ళు అనే వాస్తవాన్ని గానీ, భారతదేశాన్నే స్వదేశంగా భావించినవాళ్ళు అనే భావోద్వేగాల్ని గానీ గుర్తించేవాళ్ళు క్రమంగా కరువయ్యారు. స్వతంత్రానంతర భారతదేశంలో పుట్టిన ముస్లింల మీద కూడా ఈ వివక్ష కొనసాగింది. కవి అబ్దుల్‌ ఖాదర్‌ మొహియుద్దీన్‌ స్వతంత్ర భారత దేశంలో పుట్టాడు. తన తరం ముస్లిం సమాజపు భుజాల మీదకు కట్టుకథలతో  దేశవిభజన శిలువను ఎక్కించడానికి హిందూత్వ శక్తులు చేస్తున్న ప్రయత్నాలను సహించలేకపోయాడు.

బీజేపీ అప్పటి అధ్యక్షులు ఎల్‌.కె.ఆడ్వాణీ 1990 సెప్టెంబరులో రామ్‌ రథయాత్ర మొదలెట్టారు. టొయోటా వ్యానులో ముస్లిం సమాజం మీద మొదలెట్టిన ఈ ఆధునిక అశ్వమేధయాగం దేశసామాజిక వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చివేసింది. భారత ముస్లిం సమాజం ప్రాణభయంతో వణికిపోయింది. యాగాశ్వాన్ని నిలవరించడం చాలా పెద్దమాట. కనీసం భాధను వెళ్ళగక్కుకునే అవకాశం కూడా దానికి లేకుండా పోయింది. అణగారిన జీవులకు మతం ఒక నిట్టూర్పు వంటిది అని కార్ల్‌ మార్క్స్‌ అన్నాడు. అణగారిన భారత ముస్లిం సమాజానికి ఒక చారిత్రక దశలో ఒక నిట్టూర్పు అవకాశం ఇవ్వడానికి ఖాదర్‌ నడుం బిగించాడు. అదే ‘పుట్టుమచ్చ’ దీర్ఘకవిత. బాధాతప్త  భారత ముస్లింసమాజపు నిట్టూర్పు  'పుట్టుమచ్చ'.  

‘పుట్టుమచ్చ’ ఒక చారిత్రక సందర్భంలో ఆవిర్భవించడమేకాక తెలుగు కవిత్వరంగంలో తానే ఒక కొత్త చరిత్రను సృష్టించింది. ఖాదర్‌ ఇచ్చిన ధైర్యంతో వందల మంది తెలుగు ముస్లిం కవులు తమ కలాలకు పదునుపెట్టారు. ఇలాంటి ఒక మహాస్రవంతికి పునాది వేసిన కవిని యుగకవి, మహాకవి అనవచ్చో లేదో నాకు తెలీదు గానీ, తెలుగు ముస్లిం సమాజానికి పుట్టుమచ్చ మహాకావ్యం; ఖాదర్‌ ఆదికవి అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ వుండాల్సిన పనిలేదు.

‘పుట్టుమచ్చ’ కవిత కవి వ్యక్తిగత గోడుతో మొదలై క్రమంగా సామాజికస్థాయికి ఎదుగుతుంది. సబ్జెక్ట్‌ నుండి ఆబ్జెక్ట్‌కు, వ్యక్తి నుండి వ్యవస్థకు, సమకాలీనత నుండి సర్వకాలీనతకు ఎదగడం గొప్ప రచనల లక్షణం. ఆ లక్షణాలన్నీ పుష్టిగా వున్నాయి గాబట్టే ‘పుట్టుమచ్చ’ రజతోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇప్పుడు దాని అవసరం ప్రాసంగికత మరింతగా పెరిగింది.

ఆలోచనాపరుల మీద మనకు కలిగే గౌరవం వాళ్ళ స్వీయ సామాజికవర్గాలకు కూడా విస్తరిస్తుంది. కొన్ని కులాల మీద మనకు గౌరవం కలుగుతున్నదంటే ఆ కులాల్లో పుట్టిన కవులు, కళాకారులు, ఆలోచనాపరులు మనల్ని ప్రభావితం చేస్తున్నారని అర్థం. జాషువా, గురజాడ, త్రిపురనేని రామస్వామి చౌదరి, కట్టమంచి రామలింగారెడ్డి, తాపీ ధర్మారావు, మఖ్దుం మొహియుద్దీన్‌ల మీద మనకు గౌరవం కలిగినపుడు వాళ్ళ వాళ్ళ సామాజికవర్గాల మీద కూడా గౌరవం కలుగుతుంది. ఆలోచనాపరుల్ని సృష్టించుకోలేని, ఆదరించుకోలేని సామాజికవర్గాలు ఇతర సామాజికవర్గాల నుండి నైతిక మద్దతును కోల్పోయి పతనదిశగా ప్రయాణిస్తాయి. ఆలోచనాపరులు తాము పుట్టిన సామాజికవర్గాలకు ఒక ఆమోదాంశాన్ని (లెజిటిమసీ) కల్పిస్తారు.

ఆలోచనాపరులు సృష్టించే ఆమోదాంశం తాలూకు ప్రభావం ఏ స్థాయిలో వుంటుందో అంతర్జాతీయంగా రెండు ఉదాహరణలు ఇస్తాను. ట్విన్‌ టవర్స్‌ మీద అల్‌ఖైదా దాడి చేసిన తరువాత అమెరికా పాలకులు పెద్దఎత్తున ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టారు. సద్దాం హుస్సేన్‌, ఒసామా బిన్‌లాడెన్‌లను అమెరికాకు ప్రధాన శత్రువులుగా ప్రచారంచేశారు. అయితే, అమెరికా ప్రజలు (కనీసం మెజారిటీ ప్రజలు)  భిన్నంగా ఆలోచించారు. సగం సద్దామ్‌ హుస్సేన్‌, సగం ఒసామా బిన్‌లాడెన్‌ల పేర్లతో పోలిన పేరుతో ముస్లిం సమాజంలో పుట్టిన బారక్‌ హుస్సైన్‌ ఒబామాకు అమెరికా రాజ్యాంగం అనుమతించినన్నిసార్లు దేశాధినేతగా పట్టంకట్టారు. ఇదొక చారిత్రక అద్భుతం. ఇలాంటి అద్భుతాలెన్నో ఆలోచనాపరులు సాధించగలరు.

ఇప్పుడు యూకే వ్యవహారం చూద్దాం. అబద్ధాలు ప్రచారం చేసి అమెరికాను ఇరాక్‌ మీదకు యుద్ధానికి పురికొల్పినవాడు టోనీ బ్లెయిర్‌. రాడికల్‌ కమ్యూనిజం, రాడికల్‌ ఇస్లాం ప్రపంచ శత్రువులు అని ప్రచారం చేసిన ఘనుడు అతను. లండన్‌ మహానగరంలో రెండు నెలల క్రితం ఒక సంఘటన జరిగింది. సిటీ బస్సులో బుర్ఖాతో ప్రయాణిస్తున్న ఒకామె మీద నలుగురు మహిళలు దాడిచేసి, కొట్టి బస్సు నుండి గెంటేశారు. లండన్‌లో ఆ స్థాయిలో ముస్లిం వ్యతిరేకత కొనసాగింది. మరి లండన్‌ ప్రజలు ఏం చేశారూ? టోనీ బ్లెయిర్‌ పార్టీలోనే అతని వ్యతిరేకవర్గానికి చెందిన ఒక ముస్లిం సాదిఖ్‌ ఖాన్‌కు ఏకంగా పదకొండు లక్షల ఓట్ల ఆధిక్యతనిచ్చి మేయర్‌ సింహాసనం మీద కూర్చోబెట్టారు. లండన్‌ చరిత్రలో ఇంతటి  మెజారిటీ సాధించిన మేయర్‌ మరొకరు లేరు. ఈ అద్భుతాన్ని బ్రిటీష్‌ ముస్లిం ఆలోచనాపరులు, వాళ్లకు సంఘీభావాన్ని ప్రకటించిన ముస్లిమేతర ఆలోచనాపరులు కలిసి సాధించారు.

‘పుట్టుమచ్చ’ ప్రచురణలోనే మతసామరస్యం వుంది. దాన్ని రాసింది ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఖాదర్‌, ప్రచురించినవాళ్ళు హిందూ సామాజికవర్గానికి చెందిన త్రిపురనేని శ్రీనివాస్‌, రావి రాంప్రసాద్‌. ముస్లిం అస్తిత్వ వాదాన్ని చర్చకు పెట్టిన ‘పుట్టుమచ్చ’ కవితను అంకితం చేసింది రావి శేషయ్యగారికి. ఇదీ మనం కోరుకునే భారత సమాజం. మత సామరస్యం మన ప్రాణవాయువు. మీకోసం మేము. మా కోసం మీరు. దేశప్రజల కోసం మనందరం.

పాతికేళ్ళు ప్రయాణించి వర్తమానానికి వద్దాం. ఇటీవల మన సమాజంలో మత అసహన వాతావరణం పెరిగినపుడు స్పందించినవాళ్ళు ముస్లింలు మాత్రమేకాదు, ముస్లిమేతరులు కూడా. ప్రభుత్వ విధానాలకు నిరసనగా అవార్డులు, బిరుదుల్ని తిరిగి ఇచ్చేసినవాళ్లలో అత్యధికులు ముస్లిమేతరులు. వాళ్ళకు ముస్లిం సమాజం రుణపడే వుంటుంది. భారత ముస్లిం సమాజానికి అలాంటి ఆమోదాంశాన్ని సాధించి పెట్టిన ముస్లిం ఆలోచనాపరుల్లో ఖాదర్‌ ఒకడు.


 (పుట్టుమచ్చ  ఖాదర్ కు  ప్రజ్వలిత సంస్థ  సాహితీ సేవామూర్తి  పురస్కారం - 2015 ను తెనాలిలో మే 8న అందచేసి సన్మానించింది. ఆ సందర్భంగా  చేసిన  ప్రసంగపాఠం ఇది. )

హైదరాబాద్
9 మే 2016

ప్రచురణ :
వివిధ సాహిత్య పేజి, ఆంధ్రజ్యోతి దినపత్రిక, 16  మే 2016

http://www.andhrajyothy.com/Artical?SID=241526
https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-241526

Wednesday, 13 April 2016

People's Media

ప్రజామీడియా
- డానీ

ఇప్పటి వాతావరణంలో ప్రజామీడియా అనేది నిస్సందేహంగా దుష్టసమాసమే!  

ప్రజలకు సమాచారాన్ని అందజేయడం (Dissemination of news) వార్తా పత్రికల  కార్యకలాపం అనేది చాలా పాతకాలపు మాట. ఇరవయ్యవ శతాబ్దపు తొలి అర్ధభాగంలోనే అది అంతరించిపోయింది.  అప్పట్లో పత్రికల ఉత్పత్తికి అయ్యే ఖర్చుతోపాటూ కొంత లాభాన్ని కూడా ఇచ్చి ప్రజలు కొనేవాళ్ళు. అప్పుడు పత్రికల మీద పాఠకులకు నిజంగానే అదుపు వుండేది.  కాంగ్రెస్ వాళ్లయినా, కమ్యూనిస్టులయినా పార్టీ పత్రికల్ని సామూహికంగా చదవడం, అందులోని వార్తలు, వ్యాసాల  మీద తమ అభిప్రాయాల్ని రాతపూర్వకంగా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం వంటి సాంప్రదాయం ఓ అర్ధశతాబ్దం ముందు  వరకు వుండేవి. తమకు నచ్చని వార్త వచ్చినపుడు వాటి నిర్వాహకుల్ని నిలదీసిన సందర్భాలు కూడా వుండేవి.

వాణిజ్య మీడియా కార్పొరేట్ మీడియాగా రూపాంతరం చెందాక సన్నివేశం మారిపోయింది. ఇప్పుడు పాఠకులుగానీ, ప్రేక్షకులుగానీ మీడియాకు గిట్టుబాటు ధరకాదుకదా కనీస ధర కూడా ఇవ్వాల్సిన పనిలేదు. ఎవ్వరూ ఇవ్వడంలేదు కూడా. అంచేత మీడియా మీద వాళ్లకు ఎలాంటి అదుపు లేదు.  మనం ఐదు రూపాయలు పెట్టి కొనే దినపత్రిక ఉత్పత్తి ఖర్చు పాతిక రూపాయలకు పైనే వుంటుంది.  ఆ అయిదు రుపాయల్లో కూడా  ప్రచురణ సంస్థకు దక్కేది చాలా స్వల్పం. అందులో అత్యధిక భాగం న్యూస్ పేపరు ఏజెంటు కమీషన్ కు, రనాణా ఖర్చులకు సరిపోతాయి. న్యూస్ ఛానళ్లకు కూడా  ప్రేక్షకులు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు.  వాళ్ళు నెలవారీ చెల్లించేది లోకల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వో ల సేవలకేగానీ టీవీ ఛానళ్ళకు మాత్రం కాదు.

పాఠకులు, ప్రేక్షకులు చెల్లించనపుడు మీడియాను పోషించేది ఎవరూ? లాభాలను అర్జించిపెట్టేది ఎవరూ? అనేది ప్రాణప్రదమైన అంశం. ఇప్పటి మీడియాకు పాఠకులు, ప్రేక్షకులు గమ్యంకాదు; గమనం మాత్రమే.  మీడియా వ్యవస్థలో పాఠకులు, ప్రేక్షకులది నిజంగానే ప్రేక్షకపాత్ర మాత్రమే. 

వర్తమాన మీడియాను  పోషించేది ప్రధానంగా  కార్పొరేట్ సంస్థలు. కార్పొరేట్ సంస్కృతిని అలవరచుకున్న రాజకీయ పార్టీలు. ఇక భారీ నిర్మాణసంస్థలు, స్వామీజీలు, ఆ బాపతువాళ్లను కూడా మీడియా పోషకుల జాబితాలో చేర్చవచ్చు. పైకి కనిపించే  వాణిజ్య ప్రకటనల రూపంలోనేకాక పైకి కనిపించని అనేక ఇతర రూపాల్లో కూడా  వాళ్ళు మీడియాను పోషిస్తుంటాడు.  ఒక్క మాటలో చెప్పాలంటే మీడియా వ్యవస్థ మొత్తంగానే ఒక ప్రాయోజిత కార్యక్రమం.

వాణిజ్య ప్రకటనకర్తల కోసం  మీడియా రెండు విధులు నిర్వర్తిస్తుంది. మొదటిది, పోషకులకు అవసరమైన వినియోగదారులు, ఓటర్లు,  భక్తుల్ని అది పాఠకులు, ప్రేక్షకుల రూపంలో  సమకూర్చి పెడుతుంది. రెండోది; తన పోషకులకు అవసరమైన , ఇష్టమైన వార్తలు, కార్యక్రమాలను మాత్రమే తన పాఠకులు, ప్రేక్షకులకు అందిస్తుంది. తన పోషకులకు రుచించని వార్తల్ని అది దాచిపెడుతుంది. తన పోషకుల్ని విమర్శించే భావాలు, శక్తుల మీద తనే ఒక ప్రచారపోరాటం చేస్తుంది. అబధ్ధాలు చెప్పడం మీడియా ప్రధాన లక్ష్యం కాదుగానీ, కొన్ని సందర్భాల్లో అపధ్ధర్మంగా   అబధ్ధాలు, అసత్యాలు  ప్రచారం చేయడానికి కూడా  అది వెనుకాడదు. సారాంశంలో మీడియా అనేది కార్పొరేట్ సంస్థలు, రాజకీయపార్టీలకు ప్రజాసంబంధాల వ్యవహారకర్తగా పనిచేస్తుంది. 

పాఠకులు, ప్రేక్షకుల్లో వినియోగ సంస్కృతి కలవారు మాత్రమే మీడియాకు, అంటే, దాని పోషకులకు కావాలి. వినియోగ సంస్కృతికలవారిని సమీకరించలేని మీడియా సంస్థల్ని స్పాన్సర్లు పక్కన పెడతారు. ప్రత్యామ్నాయ భావాల్ని ప్రచురించే మీడియా సంస్థలకు వాణిజ్య ప్రకటనలు రావు. 

వినియోగదారీ సంస్కృతిని సమర్ధంగా ప్రచారం చేయగల సిబ్బంది, కొనుగోలు వాతావరణాన్ని సృష్టించగలిగిన నిపుణులు, మార్కెట్ లో ఉత్తేజాన్ని నింపగలిగిన ఆలోచనాపరులు మాత్రమే మీడియాకు కావాలి. అయితే, అప్పుడప్పుడు అందుకు భిన్నమైన వారిని కూడా మీడియా తనలో ఇముడ్చుకుంటుంది. అది వాళ్ల మీద ప్రేమతోకాదు. మీడియాకు ఒక ఆమోదాంశం కావాలి.  తాను నిష్పక్షపాతంగా వుంటున్నట్టు, భిన్నత్త్వానికి చోటు కల్పిస్తున్నట్టు మీడియా నటిస్తుంది. మీడియాలో భిన్నత్వానికి ప్రాతిధ్యం వహించే మేధావులు కూడా తమకు నచ్చని భావాలు, పరిణామాలతో ప్రణయకలహాల  వరకే పరిమితం కావాలి. అంతేతప్పా, వాటితో  చావో రేవో తేల్చేసుకుంటామంటే మాత్రం మీడియా వాళ్ళకు మొదటి దాన్నే ప్రదానం చేస్తుంది. 

డాక్టరుగా మారి సమాజసేవ చేస్తాను అనేవాళ్ళు మనకు తరసిల్లినట్టే జర్నలిస్టుగామారి సమాజసేవ చేస్తాను అనేవాళ్ళు కూడా కనిపిస్తుంటారు. వాళ్ల సత్ సంకల్పాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదుగానీ  కార్పొరేట్ ఆసుపత్రులు, మీడియా సంస్థలు ఆవిర్భవించేది   సామాన్య ప్రజలకు సేవచేయడానికి కాదు; లాభాలు గడించడానికి. 

ప్రజలు తమకు అనుకూలమైన మీడియా కావాలని బలంగా కోరుకుంటే వాళ్ళు మీడియాకు గిట్టుబాటు ధరను చెల్లించితీరాలి.  అలా చెల్లించడానికి ప్రజలు  సిధ్ధంకానంత కాలం  ప్రజామీడియా బతికి బట్టకట్టదు.

హైదరాబాద్
13 ఏప్రిల్ 2016