Tuesday, 10 June 2014

The Era of Identity Movements

అస్థిత్వ ఉద్యమాల యుగం
డానీ
అస్థిత్వ ఉద్యమాల కాలం ఇది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు  ఆచీతూచీ అడుగులు వేయాల్సిన రోజులివి. ఏమాత్రం తేడా వచ్చినా ప్రజలు నిలదీస్తారు. ఓట్లు వేసి గెలిపించిన చేతులతోనే మెడ పట్టుకుంటారు. 

 అనేక అస్థిత్వాలు కలిసి సాగిన తెలంగాణ ఉద్యమ లక్ష్యం సాకారమవ్వడాన్ని ఇటీవలే చూశాం.  కొత్త రాష్ట్రం ఆవిర్భావ సంబురాలు ఇంకా జరగనేలేదు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఏమివ్వబోతోందో ఇంకా తేలనేలేదు. అప్పుడే  కేసిఆర్ ఢిల్లీ వెళ్ళి “ఏపీకి ఏమిచ్చినా తెలంగాణకూ ఇవ్వాల్సిందే” అని ప్రధానికి మరీ చెప్పివచ్చారు. అస్థిత్వాల వ్యవహారం అంత సున్నితంగా మారింది.

తెలంగాణ తొలి రోజే అస్థిత్వాల పంచాయితీ మొదలయ్యింది. ఆ రోజుల్లో రాజా కిషన్ పర్షాద్ ను నిజాం నవాబ్ ప్రధానిగా నియమిస్తే ఈ రోజుల్లో తనను కేసిఆర్ ఉప ముఖ్యమంత్రిగా నియమించారని ఎండీ మహమూద్ అలీ ఒప్పొంగిపోయారు.  భారత జాతిపిత గాంధీజీ అయితే తెలంగాణ జాతిపిత కేసిఆర్ అంటూ తన పేషీలో  వాళ్ళిద్దరి ఫోటోలు పక్కపక్కనే పెట్టి పరవశించిపోయారు. ఈలోపులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగోలో ఉర్దూ లేదంటూ సీనియర్ కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీ నిరసనకు దిగారు.  

మరోవైపు, చంద్రబాబు మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసీ చేయగానే ఆయన కేబినెట్ లో సామాజికవర్గాల సమీకరణల డీఎన్ ఏ అన్ని ప్రధాన పత్రికల్లోనూ ప్రముఖంగా వచ్చేసింది. మొత్తం పంతొమ్మిది మంది మంత్రుల్లో  కమ్మ, కాపు, రెడ్డి, వైశ్య, కొప్పుల వెలమ, తూర్పు కాపు, గౌడ, యాదవ, మత్స్యకార, మాల, మాదిగ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లభించింది. త్వరలో  ఎస్టీ అభ్యర్ధికి స్థానం కల్పిస్తారని వార్తలొచ్చాయి.  

తెలంగాన లోగోలో ఉర్దూకు ప్రాతినిథ్యం లేకపోతే, చంద్రబాబు మంత్రివర్గంలో ఏకంగా ముస్లిం సామాజికవర్గానికే ప్రాతినిథ్యం లేకుండా పోయింది. తెలంగాణలో షబ్బీర్ అలీ చేసినట్టు వాళ్ళు నిరసన తెలిపే స్థితిలో లేరు కనుక లోలోపల మదనపడే అవకాశం మాత్రమేవుంది. మంత్రివర్గంలో ముస్లింలకు స్థానం దక్కకపోవడానికి టిడిపిలో ఆ సామాజికవర్గం నుండి ఒక్క శాసనసభ్యుడు కూడా లేకపోవడం దీనికి కారణం అని చెపుతున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఏదీ కాకపోయినా పొంగూరు నారాయణకు మేధావుల కోటాలో స్థానం కల్పించారు.

ప్రమాణ స్వీకారాల తరువాతి ఘట్టం ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలుపరచడం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతల్ని ఒకే అంశం కలవరపరుస్తుండడం విశేషం. అది రైతు రుణమాఫీ! ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తున్నపుడు  నాయకుల చేతికి ఎముక వుండదు. కళ్ళ ముందు ఓట్ల వర్షం కురుస్తూ వుంటుంది. ఎన్నికల తరువాత వాళ్లకు కొండలు, గుట్టలు కనిపిస్తాయి. ఇప్పుడు తెలంగాణ చంద్రుడూ, ఆంధ్రప్రదేశ్ చంద్రుడు ఇద్దరికీ వింధ్యాపర్వతంలా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కనిపిస్తోంది. రైతు రుణమాఫీ విధివిధానాల రూపకల్పన కోసం కేసిఆర్ కొంచెం గడువు కోరితే, ఆ అంశాన్ని పరిశీలించడానికి చంద్రబాబు ఒక కమిటీని వేశారు. అలా ఇద్దరూ వాగ్దానం చేసిన తొలి సంతకాన్ని పెట్టీ పెట్టనట్టు పెట్టారు.

కేసిఆర్ ముందున్న సమస్యలు,  సవాళ్ళకన్నా చంద్రబాబు ముందున్న సమస్యలు సంఖ్య రీత్యా ఎక్కువ. తీవ్రత రీత్యా పెద్దవి. అందులోనూ రాజధాని నగరం వంటి సంక్లిష్ట సమస్యను పరిష్కరించడం మరీ కష్టం. నిజానికి  కేసి శివరామకృష్ణన్ కమిటి  తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేంత వరకు  ఈ అంశాన్ని వాయిదా వేసే అవకాశం చంద్రబాబుకు వుంది.  అయినా, ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే  రాజధాని నగరంపై చంద్రబాబు ప్రకటన చేయడం సాహసమనే చెప్పాలి. విజయవాడ – గుంటూరు మధ్యన రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నట్టు వారు ప్రకటించారు. ఒకవేళ భూసేకరణకు అక్కడి రైతులు సహకరించకపోతే మరో చోటికి వెళతామన్నారు. ఆ ప్రాంతం కూడా ఆ సమీపంలోనే వుంటుందన్నారు.  గుంటురు-విజయవాడ మధ్యన కుదరకపోతే విజయవాడ- ఏలూరు మధ్యన వుంటుందని ఇది సంకేతం కావచ్చు.

చంద్రబాబు అన్నట్టు రాజధాని నగరం ’మృతదేహం’లా ఉండకూడదన్నది నిజమేగానీ, ప్రపంచంలోకెల్లా అందమైన నగరం నిర్మించాలనుకుని దాన్ని మరో హైదరాబాద్ లా తయారు చేస్తే పాత సమస్యలే పునరావృతమయ్యే ప్రమాదం వుంటుంది. కేంద్రంలో వున్నది మిత్రపక్షమేకాక, పట్టణాభివృధ్ధిశాఖా మంత్రి వెంకయ్యనాయుడు సహితం రాష్ట్రానికి చెందిన నాయకుడే కనుక  జిల్లాకో  స్మార్ట్ సిటీలను కట్టే అవకాశం వుంది. జిల్లాలు, ప్రాంతాల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవడం అన్నింటికన్నా ప్రాణప్రదమైన ప్రమాణం!
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
10 జూన్ 2014
ప్రచురణ :

Saturday, 7 June 2014

The Rising State

The Rising State
ఉదయిస్తున్న రాష్ట్రం
ఉషా యస్ డానీ

దాని ఇబ్బందులు దానికి వున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉదయిస్తున్న రాష్ట్రం. గుజరాత్ తరువాత అంతటి సముద్రతీరం వున్న రాష్ట్రం అంధ్రప్రదేశ్. తడ నుండి ఇచ్చాపురం రోడ్డు మార్గం 970 కిలో మీటర్లుగానీ, సముద్రతీరం అంతకన్నా 70 కిలోమీటర్లు ఎక్కువ.  భౌగోళికంగా గుజరాత్ లో సూర్యుడు అస్తమిస్తాడు. ఆంధ్రప్రదేశ్ లో సూర్యుడు ఉదయిస్తాడు. జపనీయులు తమది ఉదయిస్తున్న సూర్యుDiడి దేశం అనుకున్నట్టు తెలుగువాళ్ళు తమది ఉదయిస్తున్న సూర్యుడి రాష్ట్రం అనుకోవచ్చు. 

కొత్త చారిత్రక సందర్భాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చినపుడు కట్టడాలు, ఊర్ల పేర్లేకాదు రాష్ట్రాల పేర్లు కూడా మారిపోతుంటాయి. హైదరాబాద్, తెలంగాణ లేని ఆంధ్రప్రదేశ్ కు అదే పేరును కొనసాగించుకోవచ్చు. లేదా డొక్క మాణిక్య వరప్రసాద్ తదితరులు ప్రతిపాదిస్తున్నట్టు తెలుగునాడు అనుకోవచ్చు. ఏ పేరు పెట్టినా ఉత్తర, మధ్య, దక్షణ తీరాంధ్రా, రాయలసీమ ప్రజలకు ఆమోదయోగ్యంగా మాత్రమేగాక కొత్త  ఉత్తేజాన్నిచ్చేదిగా వుండాలి. ఇంగ్లీషులో రెసిడ్యూయల్ అనే పదానికి ఇబ్బందికర తెలుగు అనువాదంగా అవశేషాంధ్ర  అనకుండా వుంటే చాలు.

ఒక రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీకరించేటప్పుడో,  పునర్ నిర్మించేటప్పుడో రెండు రకాల అభివృధ్ధి మోడల్స్ మన ముందుంటాయి. వీటిల్లో మొదటిది,  మానవాభివృధ్ధి నిర్మితి (Human Development Paradigm). రెండోది, పెరుగుదల అధారిత నిర్మీతి (growth – Based Paradigm). ఉద్యమ పార్టీలయితే తమకు సాధ్యం అయినా కాకపోయినా పటిష్టంగా మానవాభివృధ్ధి నిర్మితిని అమలు చేస్తామని ప్రకటిస్తుంటాయి. ఎలక్టోరల్ పార్టీలకు అలా ప్రకటించడం కూడా కుదరదు.  పెరుగుదల అధారిత నిర్మీతిని ఆశ్రయించకుండా అవి మనుగడ సాగించలేవు.

పెరుగుదల అధారిత నిర్మీతిని పాటించకపోతే పెట్టుబడులు రావు. స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదల రేటు ప్రస్పుటంగా కనిపించదు. అయితే, మానవాభివృధ్ధి నిర్మితిని పాటించకపోతే విశాల ప్రజానీకం మద్దతు, ఆమోదాంశం ప్రభుత్వానికి లభించదు. అంచేత ప్రభుత్వాలు సందర్భాన్నిబట్టి ఈ రెండు రకాల నిర్మీతుల్లో ఏదో ఒకదాన్ని ఆశ్రయిస్తుంటాయి.  ఒక్కోసారి రెండింటినీ ఒకేసారి కూడా ఆశ్రయిస్తుంటాయి.

 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ రెండు రకాల నిర్మితులకు పట్టం కట్టనుంది. రైతుల రుణాల్ని మాఫీ చేస్తూ తొలి సంతకం చేయబోతున్న చంద్రబాబు అదే వేదిక మీద నుండి కార్పొరేట్ సంస్థలకు భారీగా రాయితీలు ప్రకటించే అవకాశాలున్నాయి. ఆదానీ, అంబానీ, సింఘానియా సంస్థలకు ఆహ్వానాలు పంపడం అందుకే కావచ్చు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదానీ, సునీల్ మిట్టల్. అశోక్ హిందూజా వంటి కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు. అలాంటి సన్నివేశాన్ని మళ్ళీ మనం  మంగళగిరిలో చూసే అవకాశం వుంది.

తెలంగాణలో రైతు రుణాల మాఫీకి కేసిఆర్ అనుసరించబోయే విధివిధానాల గురించి కొన్ని వార్తలు బయటికి పొక్కాయి. అంతే ఇదే అదనుగా,  విపక్షాలు వీధికెక్కాయి.  ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే పరిణామాలకు కూడా ఒక సంకేతం కావచ్చు.

ఎలాంటి షరతులు, ప్రమాణలు లేకుండా రైతుల మొత్తం రుణాలు ఎత్తివేయడమో, ఎత్తివేయాలని కోరడమో ఎంత వరకు సమంజసమో పౌర సమాజం చర్చించాల్సిన అవసరం వుంది. రైతుల్లో పేద, సన్నకారు,  మధ్యతరగతి, ధనిక అనే నాలుగు వర్గాల రైతులు వుంటారు. అలాగే రైతులు తీసుకున్న రుణాల్లో పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, వాణిజ్య, పారిశ్రామిక రుణాలు, రీ-షెడ్యూల్డు రుణాలు వగయిరాలు వుంటాయి. వాస్తవానికి వ్యవసాయం చేసే వాళ్లలో అత్యధికులు పేద, సన్నకారు రైతులు. మధ్యతరగతి, ధనిక రైతుల్లో అత్యధికులు వ్యవసాయం చేయరు. మూడు దశాబ్దాల క్రితం యన్టీ రామారావు హయాంలో రైతు రుణాలను మాఫీ చేసినపుడు పేద, సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేశారు. వ్యవసాయానికి ప్రాణప్రదమైన వాళ్ళు పొలం దున్నే వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు. ప్రభుత్వ రాయితీ ఏదైన ముందుగా వాళ్లకు దక్కాలి. రుణమాఫీ పథకం విధివిధానాల్లో ఈ అంశం స్పష్టంగా వుండాలి.

సాధారణంగా మధ్యతరగతి, ధనిక రైతులు పొలాల మీద రుణం తీసుకుని పట్టణాల్లోనో, నగరాల్లోనో వ్యాపారాలు, పరిశ్రమలు నడుపుతుంటారు. వాళ్ళ రుణాలనూ మాఫీ చేయడం అంటే వున్నవాళ్లకే మళ్ళీ పెట్టడం అవుతుంది. ఇది ధనవంతుల్ని మరింత  ధనవంతుల్ని చేస్తుంది. ఆ మేరకు పేదలకూ ధనవంతులకు మధ్య అంతరం మరింతగా పెరిగిపోతుంది. ఇలాంటి పరిణామాలు సమాజ ప్రశాంతతకు ఏవిధంగానూ వాంఛనీయం కాదు.

సమాజ శాంతిని కోరే ప్రభుత్వాలు చేయాల్సిన  మొదటి పని సంపద ఒకేచోట పోగుపడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం. అది వ్యక్తుల స్థాయిలో కావచ్చు, సంస్థల స్థాయిలో కావచ్చు, ప్రాంతాల స్థాయిలో కావచ్చు సంపద ఒకే చోట పోగుపడిపోతుండడం అనర్ధాలకే దారితీస్తుంది.

ప్రాంతాల మధ్య సమానాభివృధ్ధిని సాధించాలంటే సీమాంధ్రను నాలుగు జోన్లు చేయాలి. రాయలసీమ నాలుగు జిల్లాలు మొదటి  జోన్, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు రెండవజోన్, మధ్యాంధ్ర మూడు జిల్లాలు మూడవ జోన్, దక్షణాంధ్ర మూడు జిల్లాలు నాలుగవ జోన్.

మొదటి రెండు జోన్లను వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపునిస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో పేర్కొన్నారు. వాటికి కేంద్రం నుండి భారీ పన్ను రాయితీలు, ఇతర ఆర్ధిక ప్యాకేజీలు వుంటాయి. తరువాతి రెండు జోన్లకూ కూడా ప్రత్యేక ప్యాకేజి ఇవ్వనున్నట్టు ఆ చట్టంలోనే పేర్కొన్నారు. 

అభివృధ్ధి పథకం ఏదైనా నాలుగు జోన్లకూ పంచాలి. సచివాలయం ఒకచోట వుంటే  హైకోర్టు ఇంకోచోట వుండాలి. రెగ్యులర్  శాసనసభా సమావేశాలు ఉష్ణ మండలంలో జరిగితే వేసవి సమావేశాలు హార్స్ లీ హిల్స్ లో జరగాలి. కొన్ని సమావేశాల్ని అరుకులో కూడా జరపవచ్చు. ప్రతి జిల్లాలోనూ కేంద్ర స్థాయి విద్యాలయం వుండాలి. కేంద్ర, రాష్ట్ర కార్పొరేషన్లు అన్నింటీనీ స్థానిక ప్రత్యేకతల్నిబట్టి అన్ని జిల్లాలకూ పంచేయాలి. ఫారెస్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్  దండకారణ్యంలోనో, నల్లమల అడవుల్లోనో వుండాలి. పెట్రోలు ఉత్పత్తులకు సంబంధించిన కార్యాలయాలన్నీ కేజీ బేసిన్ లోనే వుండాలి. మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషస్ రాయలసీమలోనో, ఉత్తరాంధ్రలోనో వుండాలి. దేనికి ఎక్కడ అవసరం ఎక్కువగా వుంటుందో  ఆ కార్యాలయం అక్కడ వుండాలి.

సీమాంధ్రలో మళ్ళీ అసమాన అభివృధ్ధి కొనసాగితే ఇప్పుడు జరిగిందే పునరావృతమౌతుంది. సీమాంధ్రకు ఇది కొత్త జన్మ. అది అందరికీ ఆదర్శంగా వుండాలన్నదే ఆశ!

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
6 జూన్ 2014

ప్రచురణ :
ఆంధ్రప్రభ డైలీ, ఎడిట్ పేజీ,  7 జూన్ 2014

http://www.prabhanews.com/specialstories/article-446152

Wednesday, 4 June 2014

A Copy Story

ఒక కాపీకథ
డానీ

యాభై యేళ్ల క్రితం ఒక  నకిలీ కవి వుండేవాడు. పాత పత్రికల్లోని కవితల్ని వెతికి పట్టుకుని తన పేరుతో ప్రచురించుకునేవాడు. ఆ పనికి ఒక సహాయకుడిని పురమాయించి కొన్ని మార్గదర్శకాలు చెప్పాడు. “మనం ఎంపిక చేసే కవిత  అనాధ అయివుండాలి. అది అనాధ కవిత అని తేల్చడానికి నాలుగు సూత్రాలు వున్నాయి. దాన్ని రాసిన వారి పేరు పైనగానీ, కిందగానీ, అటుపక్కగానీ, ఇటుపక్కగానీ వుండకూడదు” అని చెప్పాడు.

పాతపత్రికల్లో అనాధ కవిత దొరికినప్పుడెల్లా సహాయకుడు దాన్ని పట్టుకుని కవి దగ్గరికి వచ్చేవాడు. కవిగారు పైనా, కిందా, ఇరుపక్కలా పరిశీలించి నమ్మకం కుదిరాక సహాయకుడుకి కూలీ డబ్బులు  ఇచ్చి పంపేవాడు.

అలా ప్రచురణ కోసం పంపిన కవిత ఒకసారి తిరిగి వచ్చింది. కవిగారు హతాశులయ్యారు. దాని అసలు కాపీని తీసి పరిశీలించారు. కళ్ళు పెద్దవి చేసుకుని  పైనా, కిందా, ఇరుపక్కలా గాలించినా కవి పేరు కనిపించలేదు. ఆ ముక్కే సంపాదకుడికి రాశారు. “నా నాలుగు సూత్రాల ప్రకారం ఇది అనాధ కవిత. దీన్ని నేను దత్తత తీసుకున్నాను” అని గడుసుగా రాశారు.

ఈసారి సంపాదకులవారు ఘాటుగా లేఖ రాశారు. “పైనా, కిందా, ఆ పక్క, ఈ పక్క చూస్తే సరిపోదు.  మధ్యలో కూడా చూడండి” అని హెచ్చరించారు.

కవులవారు మళ్ళీ ఆ కవితను అక్షరం అక్షరం జాగ్రత్తగా చదివారు.  “ఇష్క్ పర్ జోర్ నహీ / యే ఆతిష్ హై గాలిబ్/ కే బనాయే న బనే / కే బుఖాయే న బుఝే” అని వుంది.

“అమ్మ గాలిబో! నీ పేరును మధ్యలో ఇరికించేస్తే నే పట్టుకోలేనా?” అని కొలంబస్ అమెరికాను కనుగొన్నంత ఆనందంగా ఊపిరి పీల్చుకున్నారు కవిగారు. సహాయకుడ్ని పిలిచి అనాధ కవితకు ఐదో సూత్రాన్ని గట్టిగా చెప్పారు.

(ఇదొక కాపీకథ అని ముందే చెప్పాను గాబట్టి ఈ కథ మీద నాకు ఎలాంటి వాణిజ్య సంబంధమైన మేధో సంపత్తి హక్కులు లేవని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ కథని ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా రాసేశారు. కావాలంటే మీ వెర్షన్ ను మీరూ రాయవచ్చు.)


4 జూన్  2014

Tuesday, 3 June 2014

New Hopes and New Challenges

కొత్త ఆశలు, కొత్త సవాళ్ళు
డానీ

ముక్కోటి రతనాల వీణ తెలంగాణ
తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ కు
శతకోటి శుభాకాంక్షలు!

నూతన రాష్ట్ర ఆవిర్భావ దినాన
తెలంగాణ ప్రజలకు
సహస్ర కోటి శుభాకాంక్షలు!


తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారాన్ని చేపట్టడంతో కొత్త ఘట్టం మొదలయ్యింది. పార్టీ ప్రణాళికలో, ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని కొత్త ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. చాలా మంది గద్దెనెక్కగానే వాగ్దానాలను మరిచిపోతారు.  కేసిఆర్ పాలన అందుకు భిన్నంగా వుంటుందని ఆశిద్దాం.

కేసిఆర్ ప్రమాణ స్వీకారానికి పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పంపుతున్నట్టు రెండు రోజుల క్రితం వార్తల్లో వచ్చింది. కానీ, అలా జరగలేదని తరువాత తెలిసింది. అంధ్రప్రదేశ్ విభజనకు మద్దతుగా చంద్రబాబు నాయుడు 2008 లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాయడం తెలంగాణ ఉద్యమంలో ఒక మలుపు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ముఠామేస్త్రి టీఆరెస్సే అనుకున్నా కూలీలుగా  రాళ్ళెత్తిన పార్టీలు  టిడిపి, సిపిఐల దగ్గరి నుండి మావోయిస్టుల వరకు చాలానే వున్నాయి.  తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, పొరుగు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే అభివృధ్ధి ఫలాలు దక్కుతాయి.

మంత్రివర్గం ఏర్పడగానే సహజంగానే కులాలు, మతాలు, సంఘాలు, లింగాలు, జిల్లాలు వంటి సమీకరణలు ముందుకు వస్తాయి. అస్తిత్వవాద ఉద్యమాల ఫలితంగా అధికారాన్ని చేపట్టినపుడు ఇలాంటి సమీకరణలు మరింత కీలకంగా మారుతాయి. కేసిఆర్ తొలి విడత మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ నుండి సబితా ఇంద్రారెడ్డి, గీతా రెడ్డి, డికే అరుణ, కొండ సురేఖ, సునీత లక్ష్మారెడ్డిలకు ఒకేసారి మంత్రివర్గంలో స్థానం కల్పించిన వైయస్ రాజశేఖర రెడ్డి ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.  ఇప్పటి నిబంధనల ప్రకారం 17 మంది వరకు తెలంగాణ మంత్రివర్గంలో వుండే అవకాశం వుంది గాబట్టి మహిళా మంత్రుల లోటును ఒకటి రెండు రోజుల్లో కేసిఆర్ సరిదిద్దు కుంటారని అనుకోవచ్చు. 

మంత్రివర్గంలో స్థానం దక్కక పోవడం ఒకరకం వివాదం అయితే, స్థానం దక్కించుకోవడం కూడ మరోరకం వివాదం. హరీష్ రావు, కేటిఆర్ లను మంత్రివర్గంలోనికి తీసుకోవడంతో వారసత్వ పాలన అనే విమర్శకు దారితీసింది. రాహుల్ గాంధీ వంటి మొద్దబ్బాయిని ప్రధానిని చేయాలనుకుంటే దాన్ని కుటుంబపాలన అనవచ్చుగానీ, హరీష్ రావును మంత్రివర్గంలోనికి తీసుకోవడాన్ని కుటుంబ పాలనగా పేర్కొనడం సరికాదు. పార్టీలో, నియోజకవర్గంలో, ఉద్యమంలో, ఎన్నికల్లో, అసెంబ్లీలో హరీష్ రావు తన సామర్ధ్యాన్ని చాలాసార్లు నిరూపించుకున్నారు. ఆ మాటకొస్తే కేటిఆర్, కవిత కూడా స్వయం సమర్ధులే!

కేసిఆర్ ఒక పుష్కర కాలం ఉద్యమకారునిగా వున్నారు. ఇటీవల రాజకీయ నాయకునిగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాధినేత  అయ్యారు. ఉద్యమకారులుగా వున్నప్పుడు ఎవరినైనా విమర్శించే సౌలభ్యం వుంటుంది. ఇప్పుడు అలా కాదు. చిన్న తేడా వచ్చినా  విమర్శలు పడాల్సి వుంటుంది. ఇది కేసిఆర్ కు కొత్త అనుభవమే!

తెలంగాణ ఏర్పడిన రోజే సాంకేతికంగా ’మిగిలిన” ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడిన రోజు అవుతుంది. తెలంగాణలో సంబురాలు జరుపుకున్నట్టు  రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకునే భావోద్వేగాలు ఇప్పుడు ’మిగిలిన” ఆంధ్రప్రదేశ్ లో లేవు. బహుశ జూన్ 8 సాయత్రం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అక్కడ ఒక ఉత్సాహపూరిత వాతావరణం రావచ్చు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం ’మిగిలిన” ఆంధ్రప్రదేశ్ ఇక ముందు ఆంధ్రప్రదేశ్ గానే కొనసాగుతుంది. అయితే తెలంగాణ, హైదరాబాద్ లేని సగం రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అనవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందిని వెంటాడుతోంది. అంచేత ’మిగిలిన” ఆంధ్రప్రదేశ్ అనే మాట ముందుకు వచ్చింది. మిగిలిన అనేమాట నచ్చని వాళ్ళు సీమాంధ్ర అనే కొత్త పేరును విరివిగా వాడుతున్నారు. అయితే ఈ పేరులో ఆంధ్రా వున్నంత బలంగా రాయలసీమ లేదనే అసంతృప్తి కూడా వుంది. సీమాంధ్రను  1953-56 మధ్య కాలంలో ఆంధ్రరాష్ట్రం అనేవారు. ఇప్పుడు ఆ పేరునూ ఎవరూ పలకడంలేదు. రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలని కలిపి గౌరవప్రదంగా సంభోదించే పేరు ఒకటి ఇప్పుడు కావాలి.

తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీ అంత మెత్తనిదికాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీ. రాజధాని ఎక్కడో తేల్చకుండా అందులో సుఖాసీనులు  కావడం అంత సులువూకాదు. విజయవాడ – గుంటూరు మధ్య నాగార్జున యునివర్శిటీ ఎదురుగా వున్న మైదానంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి దగ్గర్లోనే కొత్త రాజధాని వుంటుందని వారు సంకేతాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే విభక్త ఆంధ్రప్రదేశ్  కొత్త రాజధాని జాతీయ రహదారి - 5 మీదనే వుంటుంది. అది విజయవాడ గుంటూరు మధ్యన కావచ్చు. లేదా విజయవాడ ఏలూరు మధ్యన కావచ్చు. ఈ ప్రాంతం రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలకు కూడా దాదాపు మధ్యలో వుంటుంది. 

దక్షణాన కుప్పం నుండి ఉత్తరాన ఇచ్చాపురం  వరకు ఆంధ్రప్రదేశ్ పొడవు 1250 కిలోమీటర్లు. ఈ రహదారిపై విజయవాడ దాదాపు మధ్యలో 650 కిలోమీటర్ల వద్ద వుంటుంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లోనూ కుప్పం నుండి హైదరాబాద్ కూడా దాదాపు  650 కిలో మీటర్లే. విశేషం ఏమంటే తడ – ఇచ్చాపురం 970  కిలో మీటర్ల జీయన్ టీ రోడ్డుపై ఏలూరు సరిగ్గా మధ్యలో వుంది ఆ పరిసరాల్లోవున్న పెద్ద నగరం కూడా విజయవాడే.  ఏలూరు విజయవాడల మధ్య, హనుమాన్ జంక్షన్ వద్ద కొత్త రాజధాని నగరాన్ని నిర్మిస్తే అన్ని ప్రాంతాలకూ అనుకూలంగా వుంటుందనే వాదన బలపడుతోంది. రాష్ట్రంలో ఏ మూల నుండయినా రాజధాని నగరానికి ఒక రాత్రి ప్రయాణం (ఓవర్ నైట్) సరిపోతుంది. హనుమాన్ జంక్షన్ dదక్షణాన 24 కిలో మీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్ పోర్టు వుంటుంది. ఆగ్నేయాన 64 కిలో మీటర్ల దూరంలో మచిలీపట్నం సీ పోర్టు వుంటుంది.

అయితే, రాయలసీమ మారుమూల ప్రాంతాల నుండి విజయవాడకు వేగంగా చేరుకోవడానికి ప్రస్తుతం ఎక్స్ ప్రెస్ హైవే లేదు.  రాయలసీమలో కర్నూలు, హిందూపురంల మీదుగా 254  కిలో మీటర్ల మేర హైదరాబాద్ – బెంగళూరు ఎన్ హెచ్ – 7 / ఏషియన్ హైవే - 43 వెళుతుంది.   చిత్తూరు - కర్నూలు మధ్య  320  కిలో మీటర్ల ఎన్ హెచ్ -18 వెళుతుంది.  కోస్తాంద్రాలో చెన్నై- కొల్ కతా ఎన్ హెచ్–5  (జీ.యన్.టీ) 1000 కిలో మీటర్లు, మచిలీపట్నం – పూనే ఎన్ హెచ్–9  146 కిలో మీటర్లు మాత్రమే ఇప్పటికున్న హైవేలు. ఇందులోనూ 70 కిలో మీటర్ల మచిలీపట్నం – విజయవాడ రీచ్ సంపూర్ణ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు.

కుప్పం - గుంటూరు కొత్త ఎక్స్ ప్రెస్ హైవేతోపాటూ  మడకశిర – కడప హైవేను తక్షణం నిర్మిస్తే రాయలసీమ మారుమూల ప్రాంతాల నుండి కూడా కొత్త రాజధాని నగరానికి చేరుకునే ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది. పలమనేరు పుంగనూరు, రాయచోటి, కడప, బద్వేలు, పోరుమామిళ్ల, కంబం, వినుకొండ, నరసారావుపేటల మీదుగా 553 కిలో మీటర్ల కుప్పం – గుంటూరు స్టేట్ హైవేను ఆరు లేన్ల ఎక్స్ ప్రెస్ హైవేగా మార్చాలి.  అలాగే  పులివెందుల, కదిరి, గోరంట్ల, హిందూపురం, మీదుగా 240 కిలో మీటర్ల కడప - మడకశిర బ్రాంచ్ హైవే నిర్మించాలి.
కడప దగ్గర  మడకశిర హైవే పశ్చిమ దిక్కుకు, కుప్పం హైవే దక్షణ దిక్కుకు పోవడంతో అక్కడ ’వై” జంక్షన్ ఏర్పడుతుంది, మొత్తం 8 వందల కిలో మీటర్ల ఈ హైవే ప్రాజెక్టును  ’వై’ హైవే అనవచ్చు. ఇందులో కొన్ని రీచుల్లో ఇప్పటికే హైవేలున్నాయి. ఆ మేరకు నిర్మాణ వ్యయం తగ్గుతుంది.

వాజ్ పాయి ప్రభుత్వం పన్నెండేళ్ల క్రితం జాతీయ రహదారుల అభివృధ్ధి పథకం (ఎన్ హెచ్ డిపి) కింద ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కోల్ కతా నగరాలను కలుపుతూ బంగారు చతుర్భుజి (Golden Quadrilateral) ని నిర్మించింది. మొత్తం  5, 846 కిలో మీటర్ల పోడవున్న ఈ ప్రాజెక్టును 60 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించారు.  దాదాపు 800 కిలో మీటర్ల కుప్పం-మడకశిర-గుంటూరు (కేయంజీ) ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు 12 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. కొత్త ఆంధ్రప్రదేశ్ లో ఇతర అంశాలకన్నా ఈ ప్రాజెక్టు నిర్మాణం ముందుగా చేపట్టాలి. అప్పటికిగానీ అభివృధ్ధికి ముందు షరతుగా  కావలసిన రవాణ సౌకర్యం ఏర్పడదు.
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు)
హైదరాబాద్
2 జూన్ 2014
ప్రచురణ :

http://www.andhraprabha.com/columns/a-column-by-danny/18250.html