Friday, 19 February 2021

 రాజకీయ పార్టీలకు అతీతంగా మహా ప్రజాఉద్యమాన్ని నిర్మిద్దాం!

 

ఉక్కు ఉద్యమానికి MTF సంఘీభావం

 

20-02-21 శనివారం – విశాఖపట్నం

21-02-21 ఆదివారం – కాకినాడ

22-02-21 సోమవారం – విశాఖపట్నం

 

టాకింగ్ పాయింట్స్

 

ఉక్కుఫ్యాక్టరీ కోసం ప్రాణత్యాగాలు చేసిన జి కృష్ణారెడ్డి   షేక్ అహ్మద్, మరి 30 మందికి –

ఉద్యమిస్తే సాధించలేనిది ఏదీ లేదని చాటి చెప్పిన  1960-70 నాటి యువతరానికీ -

ఆనాటి ఉద్యమానికి నాయకత్వం వహించిన తెన్నేటి విశ్వనాధం గారికీ -

ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న  తమనంపల్లి అమృతరావు గారికీ –

 

ముందుగా నివాళులు - 

 

1.     ఒక పరిశ్రమ కావాలని ప్రజలు పోరాడి  ప్రాణత్యాగాలు చేసిన సందర్భం  ఎక్కడయినా వుందా? ఆ చరిత్ర కేవలం విశాఖ ఉక్కుకు మాత్రమే వుంది.  ఒకరూ ఇద్దరూ కాదు 32 మంది చనిపోయారు. ఆంధ్రా రాయలసిమ తెలంగాణల్లో కూడ విశాఖ ఉక్కుకోసం బలిదానాలు జరిగాయి.

2.        ఇవాళ మన దేశంలో ఒక విషాదం, ఒక ప్రహసనం రెండూ ఒకేసారి జరుగుతున్నాయి.

3.        విషాదం ఏమంటే భారత దేశాన్ని గజాలు అడుగుల చొప్పున విదేశీ సంస్థలకు అమ్మివేయడానికి ఫైళ్ళు చాలా వేగంగా కదులుతున్నాయి.  

4.        ప్రహసనం ఏమంటే మన రాజకీయ నాయకులు వెన్నెముకలేనిజీవుల్ని తలపిస్తున్నారు.

5.        నేను చరిత్రలోనికి ఎక్కువగా వెళ్ళనుగానీ, వర్తమానంతో పోల్చడానికి రెండు సంఘటనల్ని మీ ముందు వుంచుతాను.

6.        బ్రిటీష్ సైనికాధికారి రాబర్ట్ క్లైవ్   ప్లాస్సీ (Plassey) దగ్గర 1757లో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలా సైన్యంతో హోరాహోరీ పోరాటం చేశాడు. ఆ తరువాతగానీ  భారత దేశాన్ని హస్తగతం చేసుకోవడం ఈస్ట్ ఇండియా కంపెనీకి సాధ్యం కాలేదు.

7.        దక్షణ కొరియాలో మాజీ సైనికాధికారి పార్క్ తాయి జూన్ నెలకొల్పిన సంస్థ పోస్కో.

8.        ఈస్ట్ ఇండియా కంపెనీలా ఇవ్వాళ భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి యుధ్ధం చేయాల్సిన పనిలేదు. సైన్యం అక్కరలేదు. గుర్రాలు, ఏనుగులు, తుపాకులు, ఫిరంగులు అక్కరలేదని పోస్కోకు చాలా స్పష్టంగా తెలుసు.

9.        పోస్కో సిఇవో చోయి జెఓంగ్ వూ ఒన్ ఫైన్ మార్నింగ్ పోహాంగ్ నుండి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగుతాడు. బంగాళాఖాతం తీరాన ఓ ఉదయమో, సాయంత్రమో వ్యాహాళికి వెళుతాడు.

10.   అక్కడ 33 వేల ఎకరాల భూమి వృధాగా పడివుండడాన్ని చూసి బాధపడిపోతాడు.  ఢిల్లీ వెళ్ళి ఆ వ్యర్ధ భూమిని ఉద్దరిస్తానని ఆఫర్ చేస్తాడు.

11.   పాతదీపాలకు కొత్త దీపాలు ఇస్తాననే చైనా మాంత్రికుడు వచ్చినట్టు మనోళ్ళు గొప్పగా ఆనందిస్తారు. వాడు ఆ భూమికి వెలకట్టి అక్కడికక్కడే నెట్ బ్యాంకింగ్ లో డబ్బు ట్రాన్స్  ఫర్ చేస్తాడు.

12.   మన దేశాధినేతలు, రాష్ట్రాధినేతలు తరచూ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్ళి, మేము మీ కోసం ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్ సిధ్ధం చేశాం మీరు పెట్టుబడులతో రండి అని బతిమాలుతుంటారు.

13.   ఈ మొత్తం ప్రక్రియను ఇటీవల దేశాభివృధ్ధి అంటున్నారు. ఇందులో ఎవరికయినా ఏదయినా తప్పుగా అనిపిస్తే వాళ్ళకు దేశాభివృధ్ధి అర్థం కాలేదని మనం అర్ధం చేసుకోవాలి.

14.    మన దేశంలో ఇప్పూడు  దేశభక్తికి అర్థం మారిపోయింది. దేశాన్ని ప్లాట్లు వేసి చదరపు గజాలు చొప్పున విదేశాలకు అమ్మివేయడం దేశభక్తి; దాన్ని తప్పుపట్టడం దేశద్రోహం.

15.   చరిత్ర తనంతటతానే పునరావృతమౌతుంది; మొదటిసారి విషాదంగా రెండోసారి ప్రహసనంగా అన్నాడు కార్ల్ మార్క్స్. అది ఇదే నేమో.  History repeats itself, first as tragedy, second as farce.

16.   పోక్సో అనేది ఒక ఖతర్నాక్ పారిశ్రామిక సంస్థ. అది మనుషులకన్నా యంత్రాలను ఎక్కువగా నమ్ముతుంది. లేదా మనుషుల్ని యంత్రాలుగా మార్చేస్తుంది. తన్ను ఉక్కు ఉత్పత్తికి పది పనిగంతలు అనేది దాని కొలమానం.

17.   లాల్ బహద్దూర్ శాస్త్రి హయాంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రతిపాదన వచ్చింది. ఇందిరాగాంధి శంకుస్థాపన చేశారు. పివి నరసింహారావు ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ విస్తరణ పథకాన్ని ఆరంభించారు.

18.   విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో బిజెపి కాంట్రిబ్యూషన్ కూడ వుంది. 2000లో దాన్ని అమ్మివేయాలని తొలుత ప్రతిపాదించింది వాజ్ పాయి ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని ప్రైవేటు సంస్థలకు అమ్మాలని తీర్మానం చేసింది నరేంద్ర మోదీజీ ప్రభుత్వం.

19.   స్వాతంత్ర్యోద్యమంలోగానీ, ఆ తరువాతి కాలంలో గానీ జవహర్ లాల్ నెహ్రూతో సమానస్థాయిలో నిలిచిన నాయకులు కొందరైనా ఆంధ్రాప్రాంతంలో వుండేవారు. కాంగ్రెస్ లోపల దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అల్లూరి సత్యనారాయణ రాజు, నీలం సంజీవరెడ్డి, ఎన్ జి రంగా వంటివారుంటే; కాంగ్రెస్ బయట చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమిల నాగిరెడ్డి వంటివారు వుండేవారు.

20.   ఢిల్లీ ఒక మిధ్య అనగలిగిన నాయకుడు   ఎన్టీ రామారావు. 1989ఎన్నికల తరువాత  ప్రధాని పదవికి విపి సింగ్, దేవీలాల్ తో పాటూ దీటుగా నిలబడిన నాయకుడాయన.

21.   ఈతరం రాజకీయ నాయకుల్ని చూసి తెలుగు జాతి సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తున్నది. పలనాటి పౌరుషం, రాయలసీమ ఫ్యాక్షనిజం, బెజవాడ గూండాయిజం వంటి గొప్పలు ఇక్కడేగానీ ఢిల్లీలో వీళ్ళ పప్పులు ఉడకడం లేదు.  

22.   కరోనా వుధృతంగావున్న రోజుల్లో ఢిల్లీ విమానాశ్రయంలో ఒక రూల్ వుండేది.  విదేశీయులు విమానం దిగగానే కోవిడ్ టెస్టుల కోసం 14 రోజులు క్వారంటైన్ కు పంపించేవారు. ఇప్పుడు ఏపీ నాయకులు ఢిల్లీలో విమానం దిగగానే  కేంద్ర ప్రభుత్వం వాళ్ళ  వెన్నెముకను తొలగించేస్తున్నది.   

23.   ఢిల్లీ వీరిని కొంచెం లొంగి వుండమంటే వీరు ఏకంగా పాకుతున్నారు.

24.   రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన వైజాగ్ స్టీల్స్ నుండి పెట్టుబడుల్ని ఉపసంహరించుకుని ప్రైవేటు సంస్థలకు అమ్మాలని ఈఏడాది జనవరి 26న కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది.

25.    వ్యవహారం మంత్రివర్గ తీర్మానం వరకూ వచ్చిందంటే ఈ ప్రక్రియ ఈ రెండు మూడేళ్ల క్రితమే ఆరంభం అయివుంటుంది.

26.   పోస్కో ఇండియా గ్రూపు సిఎండి సుంగ్ లయ్ చున్  మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. భావనపాడు, కృష్ణపట్నం, కడపలో పరిశ్రమలు పెట్టే అంశాల్ని మాత్రమే  అప్పుడు చర్చించాముగానీ విశాఖ ఉక్కు విషయం  అసలు ప్రస్తావనకే రాలేదంటున్నారాయన. ఇది నమ్మశక్యంగా లేదు.

27.   విశాఖపట్నం మీద పోస్కోకు ఆసక్తి లేదని కూడ జగన్ అంటున్నారు.

28.   కేంద్ర ఉక్కుమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వాదన మరోలా వుంది. పోస్కో, హ్యుందాయ్ ప్రతిధులతోపాటు భారత్ లో దక్షణ కొరియా రాయబారి 2018లో ఒక బృందంగా విశాఖపట్నం వెళ్ళి ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించారు.   ఏడాది అక్టోబరు 22 ఆర్ ఎన్ ఎల్, ఎన్ ఎండిసి, కేంద్ర ఇనుము ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధులతో వాళ్ళు సమావేశమయ్యారని  ఉక్కుమంత్రి రాజ్యసభలో అధికారికంగా ప్రకటించారు.    

29.   2018 అక్టోబరులో చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నారు.  పైగా అప్పటికి ఒక ఏడాది ముందు చంద్రబాబు దక్షణ కొరియా వెళ్ళి పెట్టుబడులతో ఏపికి రండని అక్కడి కార్పొరేట్లను ఆహ్వానించి వచ్చారు.

30.   పోస్కో సంస్థ ప్రతినిధులు ఫ్యాక్టరీని సందర్శించడం, ఆర్ ఎన్ ఎల్, ఎన్ ఎండిసి, కేంద్ర ఇనుము ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధులతో కీలక సమావేశం జరపడం అప్పటి ముఖ్యమంత్రికి తెలియకుండానే జరిగాయి అనుకోవాలా?

31.   ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రితోగానీ, ఇప్పటి ముఖ్యమంత్రితోగానీ సంప్రదించలేదనేది ఇంకో అభిప్రాయం. ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వానిది కనుక ముఖ్యమంత్రుల్ని సంప్రదించాల్సిన అవసరం లేదన్నది కేంద్రం అభిప్రాయం కావచ్చు.

32.   కొంతమంది ఇప్పటికీ మనది ఫెడరల్ వ్యవస్థ అంటుంటారు. కేంద్ర ప్రభుత్వం రోజుకు డజను సార్లు ఇది యూనిటరీ రాజ్యం అని చెపుతుంటుంది.

33.   కేంద్ర ప్రభుత్వం బయటి పార్టీలనేకాదు స్వంత పార్టిని కూడా  పట్టించుకోలేదు. కేంద్ర కేబినెట్ ప్రైవేటీకరణ తీర్మానం చేసే వరకు తమకు ఆ విషయం తెలియదని బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అంటున్నారంటే దాని అర్ధం ఏమిటీ?   

34.   జనసేన పరిస్థితి మరో ఘోరం. కేంద్ర ప్రభుత్వానికి అది కాంగ్రెస్ వలే బ్యటి పార్టీ కాదు. బిజెపి వలే లోపలిపార్టి కాదు. ఏపిలోనూ దాన్ని ఔటర్ లోనే వుంచుతున్నారు. ఢిల్లీలోనూ దాన్ని ఔటర్ లోనే వుంచుతున్నారు.

35.   పార్లమెంటులోగానీ, శాసనసభల్లోగానీ ఒక విధానపరంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని (FDI) ఆహ్వానించని రాజకీయ పార్టీలు ఏవైనా వున్నాయా?  

36.   బయటివాళ్ళు వచ్చి మనదేదో గద్దల్లా  కొట్టుకుపోతున్నారని మనం తరచూ అనుకుంటుంటాం. వాళ్ళను మనవాళ్ళే ఆహ్వానిస్తున్నారని మరచిపోతుంటాం.

37.   మన తెలుగు నాయకులు పోస్కో మీద పోరాటం చేయలేరు. కేంద్రప్రభుత్వ విధానాలనూ విమర్శించలేరు. పోరాడుతున్నట్టు ఒక నాటకం ఆడుతుంటారు.

38.   ఇందిరాగాంధి దిగి వచ్చి ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలోనే నెలకొల్పుతామని ప్రకటించాక అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విశాఖపట్నం వచ్చి టి అమృతరావుకు నిమ్మరసం ఇచ్చి ఆమరణ నిరాహార దీక్షను విరమింపచేశారు.

39.   ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడ విశాఖపట్నం వచ్చి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావుకు నిమ్మరసం ఇచ్చి ఆమరణ నిరాహార దీక్షను విరమింపచేశారు. ఇందులో చిన్న తేడా వుంది. ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలోనే నెలకొల్పుతామని కేంద్రం ప్రకటించాక బ్రహ్మానంద రెడ్డి నిమ్మరసం ఇచ్చారు. ప్రైవేటీకరణను విరమించుకుంటాం అని కేంద్రం చెప్పక ముందే చంద్రబాబు నిమ్మరసం ఇచ్చారు. ఇదో కొత్త పోరాట రూపం.

40.   తెలుగు ప్రజలనైనా, భారత ప్రజలనైనా ఈరోజు పదేపదే ఓడిస్తున్నది లోపలి శక్తులే.

41.    ఈ రాజకీయ పార్టీలను నమ్ముకుని గోదారి ఈదడం ఎంతవరకు సమంజసం?

42.   షాహీన్ బాగ్ ఆందోళన రాజకీయ పార్టీలకు అతీతంగా సాగింది. ఇప్పుడు రైతుల ఆందోళన  కూడ రాజకీయ పార్టీలకు అతీతంగా సాగుతోంది.

43.   రాజకీయ పార్టీలు సంఘీభావాన్ని తెలిపితే మనం స్వీకరించాలి. కానీ వాటి నాయకత్వంలో పోరాటాలు విజయవంతం కావని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి.

44.   షాహీన్ బాగ్,  రైతుల ఆందోళనల బాటలో ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ ఉద్యమం సాగాలి.

45.   ప్రజాస్వామ్యంలో ఉద్యమిస్తే సాధించలేనిది ఏదీ లేదని 1960-70 నాటి యువతరం నిరూపించింది.  అప్పటి యువతరం నుండి నేటి యువతరం స్పూర్తి పొందాలి. 

46.   అలాంటి ఉద్యమంలో MTF భాగస్వామి అవుతుంది.

Wednesday, 17 February 2021

స్టీల్ ఫ్యాక్టరీ మీద డర్టీ పాలిటిక్స్

 

స్టీల్ ఫ్యాక్టరీ మీద డర్టీ పాలిటిక్స్

1.

విశాఖ స్టీల్స్ ను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన మొదట బిజెపికే వచ్చింది. వాజ్ పాయి ప్రభుత్వం 2000లో విశాఖ స్టీల్స్ ను ఖాయిలా పరిశ్రమగా భావించి Board for Industrial and Financial Reconstruction (BIFR)కు అప్పచెప్పింది.

 2

అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగావున్న చంద్రబాబు ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని కేంద్ర ప్రభుత్వానికి వివరించారు. అలా ప్రవేటీకరణ చర్యల్ని వాయిదా వేయించగలిగారు. . 

 3

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు విదేశీ పెట్టుబడులు,  ఆర్థిక సంస్కరణల విషయంలో బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ ల మధ్య స్థూలంగా ఏకాభిప్రాయం వుంది.

 4.

ఈ విషయంలో కాంగ్రెస్ ది  కొంచెం ఓపెన్ డోర్ పాలసి. బిజెపిది క్లోజ్డ్ డోర్ పాలసి.  అదొక్కటే తేడ.

 5

బిజెపి విధానమే జనసేన విధానం కనుక ఆ పార్టి విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.

 6.

నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకో  విచిత్రం వుంది. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న వివాదాస్పద చట్టాలు అన్నింటికి ప్రధాన పక్షాలైన వైసిపి, టిడిపిలు పార్లమెంటులో బేషరతుగా మద్దతు పలుకుతుంటాయి. ఇక్కడ మాత్రం “నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ” అంటూ రాజకీయ ప్రహసనం ఆడుతుంటాయి.

 7.

బిజెపి తీరు మరీ విచిత్రం. “ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే భాష” దాని నినాదం. కానీ ఆ పార్టి నేతలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషలో మాట్లాడుతుంటారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీ కరించాలని కేంద్ర కేబినెట్ మరీ ముహూర్తం చూసి ‘రిపబ్లిక్ డే’ రోజున తీర్మానించింది. ఫిబ్రవరి 6న బిజేపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ సాంకేతికరంగం అభివృద్ధి చెందేకొద్దీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటిని ప్రైవేటీకరించక తప్పదన్నారు. ఆ మరునాడు విశాఖపట్నం వచ్చిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలనే నిర్ణయం బిజేపిది కాదన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం బయటికి వచ్చే వరకు అసలు ఆ విషయమ తమకు తెలియదన్నారు.

8.

ఎప్పటిలాగే రాష్ట్రంలో టిడిపి వైసిపి బురదజల్లుడు ఆట మొదలెట్టాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి కేంద్రంలో బిజెపికి ‘లొంగిపోయి’ విశాఖ ఉక్కు మీద హక్కును వదులుకున్నారని టిడిపి విమర్శిస్తోంది. పోస్కో ఇండియా గ్రూపు సిఎండి సుంగ్ లయ్ చున్  మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్ ను తాడేపల్లి నివాసంలో కలిసినప్పుడే ఈ కుట్రకు బీజాలు వేశారని ఆ పార్టి ఆరోపిస్తోంది.   

9.

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫిబ్రవరి 10న రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ పోస్కో వాళ్ళు భారత్ తో మూడేళ్ళుగా సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. పోస్కో, హ్యుందాయ్ ప్రతిధులతోపాటు భారత్ లో సౌత్ కొరియా రాయబారి 2018లో ఒక బృందంగా విశాఖపట్నం వెళ్ళి ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించారు.  ఆ ఏడాది అక్టోబరు 22న ఆర్ ఐ ఎన్ ఎల్, ఎన్ ఎండిసి, కేంద్ర ఇనుము ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధులతో వాళ్ళు సమావేశమయ్యారని మంత్రి ప్రకటించారు. ఉక్కు మంత్రి పేర్కొన్న సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో వుంది. సరళికృత ఆర్థిక విధానాన్ని పివి నరసింహారావు - మన్మోహన్ సింగ్ ద్వయం రూపొందించినప్పటికీ దానికి  తానే అసలుసిసలు బ్రాండ్ అంబాసిడర్ నని చంద్రబాబు ఘనంగా చెప్పుకుంటుంటారు.  చంద్రబాబు హయాంలో జరిగిన 2018 నాటి సమావేశంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఫైళ్ళు కదలడం ఆరంభమయిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఓ ట్వీటు చేశారు.

 10.

“జియో ఉచితంగా ఇచ్చి లాభాలు సంపాదిస్తుంటే బిఎస్ ఎన్ ఎల్ చార్జీలు  పెంచి నష్టాల్లో కూరుకుపోతుంది” అని ఒక కార్పొరేట్ జోక్ వుంది. ప్రైవేటు సంస్థలు లాభాల్ని సంపాదిస్తుంటే ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల ఊబిలో ఎందుకు కూరుకుంటున్నాయన్నది చాలా కాలంగా మనల్ని వేధిస్తున్న ప్రశ్న.  ఇంతటి ప్రతిష్టాత్మక ఉక్కు కంపెనీకి స్వంత గనుల్ని కేటాయించని కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాలీ? ప్రభుత్వం ప్రైవేటు సంస్థల్ని స్వంత బిడ్డల్లా, పబ్లిక్ రంగ సంస్థల్ని సవతి బిడ్డల్లా చూస్తుందనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంటుందీ?


11.

పిబ్రవరి 16, 17 తేదీల్లో ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం పర్యటనకు వెళ్ళారు. ఆందోళన చేస్తున్న కార్మిక నాయకుల్ని ఇద్దరూ కలిశారుగానీ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రిని ఒక్కరూ పల్లెత్తు మాట అనలేదు. ఢిల్లీలో మకాంవేసి ప్రవేటీకరణ ప్రక్రియను ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు జనసేనాని పవన్ కళ్యాణ్ సంకేతాలిస్తున్నారు. “విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలోనే వుంటుంది; కార్మికులూ వాళ్ళే వుంటారు” అని బిజెపి ప్రతినిధులు అంత గట్టిగా చెపుతున్నారంటే; కథ ముగిసిపోయిందనే అర్థం.

 12.

సరళీకృత ఆర్ధిక విధానాల పట్ల వామపక్షాల తీరు కూడ స్పష్టంగాలేదు. అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారంలో వున్నప్పుడు ఇంకోలా వ్యవహరిస్తున్నాయి.  పశ్చిమ బెంగాల్ లో అధికారంలో వున్నప్పుడు వామపక్షాలు సరళీకృత ఆర్థిక విధానానికి ఎర్ర తివాచీ పరిచాయి. దాన్ని అక్కడి ప్రజలు తిప్పికొట్టారు. నందిగ్రామ్ ఆందోళన దానికి పెద్ద ఉదాహరణ. “పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోనే సురక్షిత రాష్ట్రం కేరళ” అని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కామ్రేడ్  పినరయి విజయన్ ప్రకటనలు గుప్పిస్తున్నారు.

  

13.

రాజకీయ నాయకుల అవకాశవాద విధానాలను చూసి ప్రజలకు రాజకీయ పార్టీల మీద నమ్మకం సడలిపొతోంది. అయినప్పటికీ ఒక భారీ ప్రజా ఉద్యమం ఆరంభమం అయితేగానీ  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోతుందని చెప్పలేం.

Tuesday, 16 February 2021

10 Points one should know about VISAKHA STEEL

 విశాఖ ఉక్కు గురించి

తెలుసుకోవాల్సిన

10 అంశాలు 

1

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు.  భారత దేశంలో తీరప్రాంతంలో వున్న ఏకైక స్టీలు ఫ్యాక్టరీ ఇది.

 

2.

64 గ్రామాల ప్రజలు 33 వేల ఎకరాల భూములిస్తే పుట్టిన ప్రాజెక్టు ఇది.

 

3

ఫ్యాక్టరీ శంఖుస్థాపన జరగడానికి ముందే దాన్ని పోరుగు రాష్ట్రం తమిళనాడుకు హైజాక్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ కుట్రను వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1966లో  పెద్ద ఉద్యమం సాగింది. విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, హైదరాబాద్ విద్యార్ధులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన సాగించారు.

 

4.

విశాఖకు చెందిన తెన్నేటి విశ్వనాధం ఉద్యమానికి నాయకత్వం వహించారు. గుంటూరుకు చెందిన టి. అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష సాగించారు. ఆనాడు ఏపీలో వున్న రాజకీయ పార్టీలన్నీ ఉద్యమానికి మద్దతు పలికాయి.

 

5.

ఉద్యమంలో విశాఖపట్నానికి చెందిన 12 మంది చనిపోయారు. ఇతర జిల్లాల్లో ఇంకో 20 మంది చనిపోయారు. ప్రాణ త్యాగాలతో ఆ ఉద్యమం విజయవంతమైంది.

 

6

ప్రధానుల్లో లాల్ బహద్దూర్ శాస్త్రి హయాంలో ఉక్కు ఫ్యాక్టరీ  ప్రతిపాదన వచ్చింది. ఇందిరాగాంధి  శంకుస్థాపన చేశారు. పివి నరసింహారావు  జాతికి అంకితం చేశారు. మన్మోహన్ సింగ్ విస్తరణ పథకాన్ని ఆరంభించారు. అప్పటి రష్యా (యూఎస్ ఎస్ ఆర్) ఫ్యాక్టరీ నిర్మాణానికి సాంకేతిక సహకారాన్ని అందించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరి ప్రస్తుత వ్యవస్థాపక సామర్ధ్యం 63 లక్షల టన్నులు.

 

7

విశాఖ స్టీల్ ప్లాంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి రూ. 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే. విశాఖ స్టీల్ ప్లాంటు నుండి వివిధ పన్నుల వగయిరాల ద్వార ఇప్పటి వరకు దాదాపు రూ. 40 వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేరాయి. 

 

8.

అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు స్వంత ఇనుప గనుల్ని కేటాయించలేదు. 

 

9

విశాఖఉక్కును ప్రైవేటికరించాలని మొదటి నుండీ బిజెపి తపిస్తున్నది. వాజ్ పాయి ప్రభుత్వం విశాఖ ఉక్కు భవిష్యత్తును 2000లో బిఐఎఫ్ ఆర్ కు అప్పచెప్పింది. అప్పటి సియం చంద్రబాబు గట్టిగా ప్రతిఘటించడంతో ఆ ప్రమాదం తప్పింది.

 

10.

ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడానికి బిజెపి మరోసారి సిధ్ధపడింది.  ఈ మేరకు రిపబ్లిక్ డే రోజున కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానం చేసింది.

Sunday, 14 February 2021

Shocking History of POSCO

Shocking History of POSCO

పోస్కో చరిత్ర వింటే  షాక్ అయిపోతారు !

-       డానీ

 

ఆంధ్రప్రదేశ్ ను ఇప్పుడు భయపెడుతున్న పదం పోస్కో. ఇది దీని పొట్టి పేరు. పొడుగు పేరు పోహాంగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. దక్షణ కొరియా తీర ప్రాంత నగరం పోహాంగ్ దీని కేంద్ర కార్యాలయం. మరో తీర నగరం గ్వాంగ్ యాంగ్ లో మరో యూనిట్ వుంది. సాలీన 43 మిలియన్ (430 లక్షల) మెట్రిక్  టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో పోస్కో ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఉక్కుకర్మాగారంగా కొనసాగుతోంది.     

 

దక్షణ కొరియా మాజీ మేజర్ జనరల్  పార్క్ తాయి జూన్  1968లో పోస్కోను నెలకొల్పాడు. పార్క్ తాయి జూన్ కు వాణిజ్యం అంటే యుధ్ధమే. కార్మిక చట్టాలనుగానీ, పర్యావరణ నిబంధనల్ని గానీ  పాటించదని పోస్కోమీద ఆరోపణలున్నాయి. పార్క్ తాయి జూన్  2011లో  చనిపోయాడు. 2018 నుండి చోయి జెఓంగ్ వూ పోక్సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వుంటున్నాడు.

 

పోస్కోకు మనుషుల మీదకన్నా యంత్రాల మీద నమ్మకం ఎక్కువ. ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని అతిగా పెంచి కార్మికుల సంఖ్యను కుదించి భారీ లాభాలను అర్జించడం ఈ సంస్థ మార్కెట్ వ్యూహం. 430 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఈ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 34 వేలు మాత్రమే. ఈ 34 వేల మందిలోనూ సగం మంది ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్టు  ఉద్యోగులు. ప్రతి పది పని గంటలకు ఒక టన్ను ఉక్కు ఉత్పత్తి కావాలనేది పోస్కో  కొలమానం;  అంటే 1.25 పని దినాలు.

 

          పోస్కో అనుసరించే విచక్షణారహిత విధానాల వల్ల ప్రపంచ దేశాలు దాన్ని దూరంగా పెడుతున్నాయి. ‘సామాజిక దూరం’లా 'పారిశ్రామిక దూరం' పాటిస్తున్నాయి. యూఎస్ స్టీల్  తో కలిసి అమెరికా కాలిఫోర్నియా  రాష్ట్రంలోని పోర్ట్ సిటి పీట్స్ బర్గ్ లో 2010లో యూఎస్ ఎస్ – పోస్కో ఇండస్ట్రీస్ ను నెలకొల్పారు. అందులో రెండు సంస్థలకూ చెరో 50 శాతం వాటాలుండేవి.  POSCOతో పడలేక గత ఏడాది పిబ్రవరిలో  మొత్తం కర్మాగారాన్ని యూఎస్ స్టీల్ స్వాధీనం చేసుకుంది. 50 శాతం వాటాను చెల్లించి పోస్కోను బయటికి పంపించేసింది.

 

రేవు పట్టణాల మీద ఆసక్తివున్న పోస్కో భారత దేశంలో అలాంటి అవకాశం కోసం ఓ పదిహేనేళ్ళగా వెంపర్లాడుతోంది. జగత్ సింగ్ పూర్ జిల్లాలోని పారదీప్ రేవు పట్టణం సమీపంలో ఒక ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడానికి ఒడిశా  ప్రభుత్వంతో పోస్కో 2005లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 4 వేల ఎకరాల భూమి కేటాయించడమేగాక, నీరు, విద్యుత్ వినియోగంపై భారీ రాయితీలు ఇవ్వడానికి ఒడిశా  ప్రభుత్వం అంగీకరించింది. అయితే, విచక్షణా రహితంగా అడవుల్ని నరికివేయడంతో స్థానికులు తిరగబడ్డారు. పర్యావరణ చట్టాలను కఛ్ఛితంగా పాటించాలని ఒడిశా ప్రభుత్వం పట్టుబట్టింది. అది కుదరదని  పోస్కో  అక్కడి నుండి తప్పుకుంది.

 

          ఇనుప గనులు పుష్కలంగావున్న ఛత్తీస్ గడ్, జార్ఖండ్ లలో కాలు మోపడానికి పోస్కో ప్రయత్నాలు చేసింది. అవి ఫలించలేదు. అప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోస్కోను ఆహ్వానించింది.

 

భారత దేశంలో ఉక్కు పరిశ్రమాభివృధ్ధి –  ఒరిస్సా సన్నివేశం అనే అంశంపై 2007 సెప్టెంబరు 27న భవనేశ్వర్ లో ఒక సదస్సు జరిగింది. అందులో ప్రధాన వక్తగా పాల్గొన్న పోస్కో రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్  డైరెక్టర్ ఛాంగ్ హో క్వాంగ్  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఒడిశా, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అపార ఖనిజ నిక్షేపాలున్నాయి.  కానీ; భారీ పరిశ్రమల్ని నెలకొల్పే నైపుణ్యం వాళ్లకు లేదు “పొరుగున వున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం భిన్నమైనది. అక్కడున్న వామపక్ష ప్రభుత్వానికి పెట్టుబడుల్ని ఎలా తీసుకురావాలో తెలుసుఅన్నాడు.

 

విదేశీ పెట్టుబడుల విషయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించినప్పటికీ బెంగాల్ రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. దానితో బెంగాల్ లోనూ  పోస్కో ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది.

 

ఆ తరువాత పోస్కో కన్ను విశాఖపట్నం మీద పడింది. ఏపీలో పోస్కోకు అనేక సానుకూల అంశాలున్నాయి. మొదటిది; ప్రధాన రాజకీయ పక్షాలన్నీ విదేశీపెట్టుబడుల కోసం వెంపర్లాడుతున్నాయి. రెండవది; ఏపీ ప్రజలు ఆందోళనలు చేయడం మరిచిపోయి చాలా కాలం అయింది.  ప్రభుత్వాలు సానుకూలంగా వుండి, ప్రజలు నిర్లిప్తంగా వుండిపోతే అంతకన్నా సానుకూల వాతావరణం ఏముంటుంది సామ్రాజ్యవాద వలసవాదానికి!  (imperialist Coloniaism).

 

13 ఫిబ్రవరి 2021

Saturday, 13 February 2021

మా తరం చేసిన ఒక చారిత్రక తప్పిదం.

మా తరం చేసిన ఒక చారిత్రక తప్పిదం. 

వామపక్ష విప్లవోద్యమ నాయకత్వం మీద  మునుపటి ప్రేరణ, నమ్మకం ఉత్సాహం క్రమంగా తగ్గిపోవడంతో  మా తరం బయటికి వచ్చింది. కొందరు నిర్బంధ కారణాలతోనూ బయటికి వచ్చారు. 

ఆ తరువాత కూడ మాలో వామపక్ష భావాలు మునుపటిలానే  కొనసాగాయిగానీ  రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. కాంప్రమైజ్ ఫార్మూలాగా సామాజిక కార్యకర్తలుగానో,  జర్నలిస్టులుగానో, ఎన్.జి.వోలు గానో స్థిరపడ్డాం.  పార్లమెంటరీ రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ లోనో, టిడిపిలోనో  క్రియాశీల పాత్ర పోషించడానికి అప్పుడు అనేక అవకాశాలు వుండేవి.  మెయిన్ స్ట్రీమ్  రాజకీయాల్లోనికి నాకు ఫ్రీ ఎంట్రీ ఆఫర్లు రెండుసార్లు వచ్చాయి. నేను అన్యమనస్కంగా వుండిపోయాను. ప్రస్తుతం అలాంటి అవకాశాలు లేవు. ఇప్పుడున్నవి ఫైనాన్స్ రాజకీయాలు. వాటిని తట్టుకునేంత శక్తి నాకు లేదు. 

 సాయుధపోరాట రాజకీయాల ‘హ్యాంగ్ ఓవర్’ కారణంగా  ‘పార్లమెంటరీ పాలిటిక్స్ పట్ల విముఖత’ మాలో బలంగా కొనసాగింది. సాయుధపోరాట రాజకీయాల్ని వదిలినపుడు పార్లమెంటరీ రాజకీయాల్ని చేపట్టి వుండాల్సింది. అలా కాకుండ మొత్తం రాజకీయాల్నే వదిలివేశాము.  అది మా తరం చేసిన ఒక చారిత్రక తప్పిదం. 

-        జాన్సన్ చోరగుడి వ్యాసం షర్మిల ఫ్యాక్టర్’: కొన్ని మౌలిక భావనలు! మీద స్పందన 14 ఫిబ్రవరి 2021-         

https://www.sakalam.in/sharmila-factor-some-foundamental-views/