Tuesday, 17 September 2019

విలీనమా? విమోచనమా?


Merger or Liberation
విలీనమా? విమోచనమా?       
ఏ.యం. ఖాన్ యజ్దానీ ( డానీ)  
         
          బండారు దత్తాత్రేయ వ్యాసం ‘జాతి పండుగగా సెప్టెంబరు 17’ (ఆంధ్రజ్యోతి సెప్టెంబరు 16) చదివాక కొన్ని సందేహాలు వచ్చాయి.
          భారతదేశానికి 1947 ఆగస్టు 15న, పాకిస్తాన్ కు  ఆగస్టు 14న స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం సంస్థానానికి ఎప్పుడు స్వాతంత్ర్యం వచ్చిందో దత్తాత్రేయ పేర్కొనలేదు. పాకిస్తాన్, ఇండియాల కన్నా ముందే భారత ఉపఖండంలో బ్రిటీష్ పరోక్ష పాలనలోని సంస్థానాలకు  స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం సంస్థానం అటు పాకిస్తాన్ లోనూ, ఇటు ఇండియాలోనూ చేరకుండా  స్వతంత్ర హైదరాబాద్ ‘దేశంగా పధ్నాలుగు నెలలు కొనసాగింది. స్వతంత్ర దేశం హొదాలోనే నిజాం తన ప్రతినిధి ప్రొఫెసర్ ముహమ్మద్ హమీదుల్లాను  నాలుగవ కింగ్ జార్జి దగ్గరికీ, అప్పటి బ్రిటీష్ ప్రధాని క్లెమెంట్ రిచర్డ్ అట్లీ దగ్గరికేకాక  చివరకు ఐక్యరాజ్య సమితికి కూడా పంపించాడు. ఈలోపు, 1948 సెప్టెంబరు 13న ఆరంభమై 18న ముగిసిన ‘ఆపరేషన్ పోలో అనే ‘పోలీసు యాక్షన్’ అనే  సైనిక చర్య నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేసేసింది.
          హైదరాబాద్ బొలారంలో - ఇప్పటి రాష్ట్రపతి శీతాకాలం విడిది భవనంలో-  భారత ఏజెంటు జనరల్ గా వుంటున్న కే.యం. మున్షీకు 1948 సెప్టెంబరు 17 సాయంత్రం నిజాం ప్రభుత్వం తన నిస్సహాయతను తెలియపరచింది. ఆ మరునాడు అంటే, 1948 సెప్టెంబరు 18 సాయంత్రం భారత మేజర్ జనరల్ జయంతో నాథ్ చౌధరి ముందు  నిజాం మేజర్ జనరల్ ఎల్ ఇద్రూస్ లాంఛనంగా లొంగుబాటును ప్రకటించాడు.  ఇక్కడ నిజాం అధికారిక విలీనం సెప్టెంబరు 17 నా? లేక 18నా? అనేది తేలాల్సిన అంశం.
          భారత రాజ్యంగం అమల్లోనికి వచ్చిన రోజు (26  జనవరి 1950) నుండి   హైదరాబాద్ స్టేట్ సమగ్రంగా వున్నంత (31 అక్టోబరు 1956) వరకు దాదాపు ఏడేళ్ళు ఏడవ నిజాం మీర్ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్ బహద్దూర్ బిరుదుతో రాజభరణాలు సకలం పొందుతూ,  రాజ్ ప్రముఖ్ (రాష్ట్రాధినేత)గా కొనసాగాడు. ఇప్పటి రాజ్ భవన్ అతని అధికార నివాసంగా వుండేది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లేదా ఆ పక్కనే వున్న దిల్ సుఖ గెస్ట్ హౌస్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అధికార నివాసంగా వుండేది. ఆ తరువాత కూడా రాజ్ ప్రముఖ్ పదవిలో కొనసాగమని భారత ప్రభుత్వం కోరింది. గానీ,  భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని మూడు ముక్కలుగా విభజించడంతో మనస్థాపానికి గురై ఆ పదవి నుండి మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ స్వఛ్ఛందంగా తప్పుకున్నాడు. ఆ తరువాత రాజ్ ప్రముఖ్ పదవి రాష్ట్ర గవర్నర్ గా మారింది.
          నిజాం సంస్థానాన్ని ముస్లిం మతరాజ్యం అనడం చరిత్రని అడ్దంగా వక్రీకరించడమే అవుతుంది. నాటి నిజాం సంస్థానంలోని పాలకవర్గంలో హిందూ ముస్లింలు ఇద్దరూ వున్నారు; పాలితవర్గంలోనూ హిందూ ముస్లింలు ఇద్దరూ వున్నారు. మతాంతర ఐక్యత ఇటు ప్రజల్లోనూ అటు పాలకుల్లోనూ కొనసాగింది. అది ముస్లింల మత రాజ్యమే అయ్యేదయితే నిజాం వ్యతిరేక తిరుగుబాటుదార్లలో తుర్రేబాజ్ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్, బందగీ, షోయబుల్లా ఖాన్ వంటి వారు ముందుపీఠిలో ఎందుకుంటారూ? నాటి కమ్యూనిస్టుల పోరాటానికి మేధోసరోవరంలా పనిచేసిన కామ్రేడ్స్ అసోసియేషన్ లో ఇద్దరు ముగ్గురుతప్ప మిగిలినవాళ్లంతా విద్యావంతులయిన ముస్లింలే.  పైన సింహాసనం మీద వున్న నిజాం ముస్లిం అన్నమాటే గానీ సంస్థానం తాబేదార్లయిన దేశ్ ముఖ్ లు, జాగీరుదారులు, జమీనుదారులు, గ్రామాల్లోని పటేల్ పట్వారీల్లో అత్యధికులు హిందువులు. దళితుల మీద నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సానుకూల వైఖరితో వుండేవాడు. తాను నవాబుగా వున్న కాలంలో  దళితనేత నేత భాగ్యరెడ్డి వర్మను సత్కరించడమేగాక, సంక్షేమ వ్యవహారాల్లో సంస్థాన సలహాదారుగా నియమించాడు. తాను దేశ్ ముఖ్ గా వున్న కాలంలో బీఆర్ అంబేడ్కర్ ను సత్కరించాడు. 
          వివరాల్లోనికి వెళితే నిజాం సంస్థానంలో జరిగిన అనేక పోరాటాలు, తిరుగుబాట్లు స్థానిక దేశ్ ముఖ్ లు, జాగీరుదారులు, పటేల్ పట్వారీలకు వ్యతిరేకంగా జరిగినవే అనే వాస్తవం తెలుస్తుంది. అసలు, దేశ్ ముఖ్ లు, జాగీరుదారులు, పటేల్ పట్వారీల మూలంగానే నిజాం పాలన అంతగా  అప్రదిష్ట పాలయిందంటే అతిశయోక్తికాదు.
          నాజీల మించినవురో నైజాము సర్కరోడా!” అని ఆనాటి సామాన్యులు పాటకట్టి నిజాంపై కోపాన్ని వెళ్ళగక్కేవారని దత్తాత్రేయ రాశారు. ఇది ఇంకో వక్రీకరణ. ఆ పాటకు మాతృకను 1940ల నాటి పోరాట కవి-గాయకుడు బండి యాదగిరి  రాశాడు.  నాటి నల్గొండా, వరంగల్లు జిల్లాల్లో హిందూ సామాజికవర్గానికి చెందిన దేశ్ ముఖ్ లు, జాగీరుదారులు, జామీనుదారులకు వ్యతిరేకంగా రాసిన పాట అది. పాత మాతృకలో  దేశ్ ముఖ్ కుల ప్రస్తావన కూడా స్పష్టంగానే వుంది. దత్తాత్రేయ ప్రస్తావించిన పాట 1979 నాటి ‘మాభూమి సినిమా లోనిది. ఇప్పుడు యాదగిరి రాసిన అసలు పాటను వదిలేసి నకిలీ సినిమా పాటను పట్టుకుని పత్రికలకు ఎక్కారు దత్తాత్రేయ.
          నిజాం సంస్థానం చివరి రోజుల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన అల్లరి మూక రజాకార్ల పైన కూడా దశలవారీగా విశ్లేషణ జరగాల్సి ఉంది. దేశంలో బ్రిటీష్ పాలన సాగినపుడు నిజాంకు స్వంత సైన్యంలేదు. నిజాం ఒక్కడికేకాదు బ్రిటీష్ పాలనలోని దాదాపు 600 సంస్థానాల్లోనూ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా గవర్నర్ జనరల్ ఆధీనంలో వుండేవి.
          చాలామందికి తెలియని విషయం ఏమంటే పైకి నిజాం నవాబు వేషంలో అధికారాన్ని చెలాయిస్తున్నట్టు వుండేవాడు. కానీ, అతని మీద సర్వాధికారాలు బ్రిటీష్ రెసిడెంట్ కు వుండేవి. అతను నవాబు నివాసంకన్నా చాలా పెద్దదైన రెసిడెన్సీ భవనంలో వుండేవాడు. కోఠీ వుమెన్స్ కాలేజీ నుండి   ఉస్మానియా మెడికల్ కాలేజి చివరి వరకు ఈ రెసిడెంట్ విస్తరించి వుండేది. 1857లో తుర్రేబాజ్ ఖాన్ తిరుగుబాటు చేసింది కోఠీలోని రెసిడెన్సీ  భవనం పైనే. 1795లో మేజర్ జనరల్ విలియం క్రిక్ ప్యాట్రిక్ తో మొదలయిన ఈ రెసిడెంట్ల పరంపర 1940ల చివర్లో సర్ ఆర్ధర్ లోథియన్ వరకు కొనసాగింది.
          భారత స్వాతంత్ర్య చట్టం-1947 కల్పించిన వెసులుబాటు ప్రకారం  స్వతంత్ర దేశంగా వుండాలని నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్  నిర్ణయించినపుడు దేశ్ ముఖ్ లు, జాగీరుదారులు, జామీనుదారులు, పటేల్, పట్వారీలు అందరూ అతని పక్షాన్నే నిలిచారు. నిజాం ఆశిస్సులతో వాళ్లంతా గ్రామాల్లో తిరుగులేని అధికారాన్ని చెలాయించేవారు. తమ అధికారాన్ని కొనసాగించు కోవడానికి వాళ్ళు నిజాంకు మద్దతు ఇచ్చారు. సైన్యం లేకుండా స్వతంత్ర రాజ్యం మనజాలదు కనుక హూటాహూటిన స్థాయీ సైన్యాన్ని నిర్మించే ప్రయత్నాలు మొదలయ్యాయి. విదేశాల నుండి ఆయుధాలు, సైనిక దుస్తులు దిగుమతి చేసుకునే ప్రయత్నాలు సాగాయి. ఈలోపులో, ఒక మధ్యంతర సర్దుబాటుగా అందుబాటులోవున్న అల్లరి మూకలల్నే రజాకార్ల పేరుతో కనీసం బూట్లు, యూనిఫారాలు, తుపాకులు కూడా లేని సైన్యంగా రంగంలో దించారు. నిజాంవల్ల ప్రయోజనాలున్న దేశ్ ముఖ్ లు, జాగీరుదారులు, జామీనుదారులు, పటేల్, పట్వారీలు అందరూ రజాకార్లను ఇష్టపడి పోషించారు. ఆ దశలోని రజాకార్లలో ముస్లింలే కాక హిందువులు కూడ పెద్ద సంఖ్యలో వుండేవారు. 
          నిజాంను విలీనం చేసుకోవడానికి  ఇండియన్ యూనియన్ సైనిక చర్యకు సిధ్ధపడుతున్నదనే విషయం నిర్ధారణ అయిన తరువాత సన్నివేశం మారింది. దేశ్ ముఖ్ లు, జాగీరుదారులు, జామీనుదారులు, పటేల్, పట్వారీలు అందరూ తమ విధేయతల్ని క్రమంగా మార్చుకుని ఇండియన్ యూనియన్ లో తమ అధికారాల్ని నిలబెట్టుకునే ఆలోచనలు మొదలెట్టారు. ఈ దశలో రజాకార్ల నుండి ముస్లిమేతరులు చాలావరకు బయటికిపోగా ముస్లింలు ఎక్కువ మంది మిగిలారు. మరోవైపు, అధికారాన్ని కోల్పోతున్నామనే నిస్పృహలో రజాకార్లు అనేక వెర్రి చేష్టలకు పాల్పడ్డారు. అంతిమంగా రజాకార్ల ఆగడాలు వాళ్లకు మరణాన్ని శాసించగా,  దేశ్ ముఖ్ లు, జాగీరుదారులు, జామీనుదారులు, పటేల్, పట్వారీలు టోపీలు మార్చుకుని కొత్త ‘దేశంలోనూ పాలకవర్గంగా కొనసాగారు.
1948 సెప్టెంబరు  17న హొం మంత్రి వల్లభాయి పటేల్ ముందు (నిజాం) లొంగిపోయారుఅని దత్తాత్రేయ రాశారు. అసలు ఆరోజు వల్లభాయి పటేల్ హైదరాబాద్ లో వున్నారా? లేక నిజాం మేజర్ జనరల్ లాంఛనంగా లొంగుబాటును ప్రకటించాక నెహ్రూ, పటేళ్ళు హైదరాబాద్ చేరుకున్నారా? అనేది నిర్ధారణ కావల్సిన అంశం. అప్పట్లో వల్లభ్ భాయి పటేల్ హైదరాబాద్ వచ్చినపుడు నిజాం నవాబు ముస్లిం సాంప్రదాయంలో మర్యాద పూర్వకంగా కొద్దిగా తల వంచి సలాం చేశాడు. ఆ ఫోటోను పటేల్ కు లొంగిపోయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గా ప్రచారం చేయడం నీచ సంస్కృతి. అసలు ఆ ఫోటో ఏ తేదీన తీశారో పరిశోధనలు జరగాల్సి వుంది.
          దీనికి తోడు కొందరు “విలీనాన్ని విమోచన అనే కొత్త పదాన్ని జోడించి అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అని దత్తాత్రేయ అనడం సరికొత్త అయోమయం. మళ్ళీ వారే “ప్రభుత్వం “కళ్ళు తెరచి “విమోచన “ఉత్సవాలను  అధికారికంగా జరిపించాలని డిమాండు చేస్తున్నారు.
1948 సెప్టెంబరు  17న జరిగింది (విలీనం కాదనీ) విమోచన అని ప్రచారం చేసే వారికి ఒక రాజకీయ ప్రయోజనం వుంది. నిజాం సంస్థానంలో పాలకవర్గం ముస్లింలు అనీ పాలితవర్గం హిందువులనీ వీళ్ళు ఒక అబధ్ధాన్ని పదేపదే ప్రచారం చేస్తుంటారు. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లోనికి విలీనం చేశారనే నిరాడంబర వ్యాఖ్యానం వీరి రాజకీయ ప్రయోజనాలకు సరిపోదు; ఉత్తేజాన్ని ఇవ్వదు. ఒక ముస్లిం రాజుని సర్దార్ పటేల్ మెడలు వంచి ఓడించి, అతని రాజ్యాన్ని ‘హిందూ’ భారతదేశంలో విలీనం చేసి హిందువులకు ‘విమోచన కలిగించాడు అంటేనే కొందరికైనా ఆవేశం వచ్చి తమ పార్టీకి కొన్ని ఓట్లు అదనంగా పడవచ్చని కమలనాధులు ఆశిస్తారు.
భూస్వామ్య వ్యవస్థ నుండి విమోచన కోసం తెలంగాణలోని రెండు జిల్లాల్లో కమ్యూనిస్టు  పార్టి నాయకత్వాన రైతాంగ సాయుధ పోరాటం సాగింది. వెట్టి కూలీలు, పేద రైతులు కన్న కలలు నిజమయ్యేవేమోగానీ నిజాం గద్దే దిగగానే భారత  కమ్యూనిస్టు పార్టి పోరాట విరమణ ప్రకటన చేసేసింది. పార్టీ లైన్ తో సంబంధం లేకుండానే విమోచన పోరాటాన్ని కొనసాగించాలని మైనార్టివర్గం భావించింది. చెదురుమదురు సంఘటనలతో మరో రెండేళ్లు అనధికార పోరాటాన్ని కొనసాగించింది కూడ. కానీ పార్టీ నాయకత్వం నుండి మద్దతు లేకపోవడం వల్ల, బయటి నుండి ఆర్థికం, ఆహారం, ఆయుధాల సరఫరా ఆగిపోవడంతో వాళ్ళ ప్రయత్నాలు ఫలించ లేదు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న గెరిల్లా దళాలను పార్టి నిర్ధాక్షిణ్యంగా వదిలేయడంవల్ల దాదాపు నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు చనిపోయారు. మరో వైపు, కొన్ని లక్షల మంది ముస్లింలు  (మీరు వింటున్నది నిజం) చనిపోయారు. కాంగ్రెస్ ది మొదటి నుండీ విలీన సిధ్ధాంతమే. వాళ్ళకు ఆ స్పష్టత వుంది. ఎటొచ్చీ  కమ్యూనిస్టు పార్టీయే చెప్పిందొకటి; చేసిందొకటి.
          నిజాం సంస్థానంలో తెలంగాణ ఒక భాగం. అంతేతప్ప అదే నిజాం సంస్థానం కాదు. పుచ్చలపల్లి సుందరయ్య, దేవులపల్లి వేంకటేశ్వరరావు వంటి అలనాటి కమ్యూనిస్టు అగ్రనాయకులు రాసిన పుస్తకాల పేర్లు కూడ తెలంగాణ మాత్రమే. కొంత మంది కవులు అప్పుడో, ఆ తరువాతి కాలంలోనో అతివ్యాప్తి దోషంతో నైజాం అన్నారు. అది వేరే చర్చ.  
          చాలామంది ఇప్పుడు నిజాం సంస్థానికి తెలంగాణకు తేడా తెలీకుండ మాట్లాడుతున్నారు. నిజానికి అది తెలంగాణ పోరాటం కూడా కాదు; నల్గొండ, వరంగల్ జిల్లాల రైతుల పోరాటం. అవి రెండు జిల్లాలు అప్పట్లో ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దు జిల్లాలు. తరువాతి కాలంలో ఆ రెండు జిల్లాల నుండి ఖమ్మం జిల్లా ఏర్పడింది.  నైజాం సంస్థానంలోని మూడు భాగాల్లో ఒకటైన తెలంగాణలోని నాలుగో భాగంలో ఆ పోరాటం సాగింది. కానీ ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలే దాన్ని నిజాం వ్యతిరేక పోరాటంగా ప్రచారం చేస్తున్నాయి. ఇదొక చారిత్రక అపచారం. కమలనాధులు  అలరించాలనుకుంటున్న సమూహాలనే వీళ్ళూ అలరించాలని అనుకుంటున్నట్టున్నారు.            
          
          భారత కమ్యూనిస్టు పార్టి 1925లో ఆవిర్భవించినప్పటికీ 1946లో సాయుధపోరాట పంథాను తీసుకుంది. కొన్ని ఇతర రాష్ట్రాల్లోను కొన్ని చెదురుమదురు సంఘటనలు జరిగాయిగానీ ఆ పార్టి తన ప్రధాన కార్యక్షేత్రంగా తెలంగాణను ఎంచుకుంది. తెలంగాణలో రైతు కూలి రాజ్యం సాధిస్తామంటూ సాయుధ పోరాటాన్ని ఆర్భాటంగా ఆరంభించిన ఆ పార్టి నిజాం సంస్థానం భారత్ లో విలీనం కాగానే సాయుధ పోరాట విరమణ ప్రకటించింది. భారత కమ్యూనిస్టు పార్టి లక్ష్యం కూడ నైజాంను భారత్ లో విలీనం చేయడమే అనుకోవచ్చా?

          దేశంలో దాదాపు ఆరు వందల సంస్థానాలుండగా నిజాం సంస్థానం మీదనే భారత కమ్యూనిస్టు పార్టి తన దృష్టిని ఎందుకు కేంద్రీకరించింది. ఈ విషయంలో ఆర్యసమాజ్, భారత కమ్యూనిస్టు పార్టిల దృక్పథం ఒకటే అనుకోవచ్చా? ముస్లిం వ్యతిరేకత ఆర్యసమాజ్ లో బహిరంగంగా వుంటే భారత కమ్యూనిస్టు పార్టిలో రహాస్య ఎజెండాగా వుండిందా? బిటీ రణదివెకు అతివాదిగా పేరుందికదా? అతని హయాంలోనే సాయుధపోరాట విరమణ ప్రకటన ఎలా వెలువడిందీ?  రైతుకూలీ రాజ్య స్థాపన అనే నినాదం ఒక ముసుగు మాత్రమేనా? అనేవి  ఇప్పటికీ తేలాల్సిన అంశాలే.

రచన : 16 సెప్టెంబరు  2012
ప్రచురణ : ఆంధ్రజ్యోతి దినపత్రిక, 19 సెప్టెంబరు 2012

1 comment:

  1. Bhargava G అన్నా , మొదలు మెథడ్ కు సంబంధించి ఒక చిన్న మాట.
    ప్రతి చారిత్రక క్రమంలో /ఘటనలో(ప్రతి సంఘటనా చారిత్రకం కాదని మీకు తెలుసు) hidden causes and unintended consequences వుంటాయి.
    1).భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు ఏ సాయుధపోరాటానికీ సిద్ధమై వుండలేదు.
    2). ఆంధ్ర మహాసభ మొదలు పెట్టిన ఆత్మగౌరవ సాంస్కృతిక ఉద్యమం క్రమంగా వెట్టి చాకిరీ నిర్మూలన డిమాండ్ చేబట్టి ,అధిక వడ్డీల రద్దు డిమాండ్ తోడై ,చివరకు భూస్వాముల ప్రైవేట్ హింసను ప్రతిఘటించే రూపం తీసుకుంది. 3).ఇక ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనే విషయమై ఆంధ్రమహాసభలో కాంగ్రెస్ ,కమ్యూనిస్టు శిబిరాల మధ్య విభేదాలే కాక కమ్యూనిస్టుపార్టీలోనే విభేదాలు వుండినాయి.
    4).1946 రణదీవే సాయుధపోరాట పిలుపు వ్యవసాయ విప్లవ పంథాకు సంబంధించినది కాదు. అది ప్రధానంగా నగర సాయుధ తిరుగుబాటు(insurrection)కు సంబంధించినది. అది అప్పటికి పార్టీ అధికారిక పంథా కాదు. 1941 నుండీ 1948 వరకూ PC Joshi పంథా (పీపుల్స్ వార్ థీసిసే)అమల్లో వుండేది. 1948 లో రణదీవె కార్యదర్శి అయ్యేనాటికే తెలంగాణా సాయుధ పోరాటం ప్రారంభమై వుండింది.
    5). భారత బూర్జువా వర్గాన్ని సోవియట్ శిబిరం వైపుకు తిరిగేలా నెహ్రూ ప్రభుత్వాన్ని వత్తిడి చేయడానికి సోవియట్ సలహా మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ చేబట్టిన పంథాయే తప్ప రణదీవేకు రైతాంగ విప్లవాలపై నమ్మకం లేదు ,అవగాహన కూడా లేదు.
    6).ఆ పోరాటంతో నిమిత్తం లేకుండానే హైద్రాబాదు రాజ్యానికి భారత యూనియన్ లో కలవడం తప్ప వేరే చారిత్రక అవకాశం లేదు. నిజాం కూ భారత రాజ్యానికీ ఒప్పందం కుదిరి ఆయన రాజ్ ప్రముఖ్ అయ్యాడు. ఆయన అంతేవాసులైన ఫ్యూడల్ దొరలు కాంగ్రెస్ నాయకులయ్యారు. సామాన్య ప్రజల రక్తం ఏరులై పారింది.

    ReplyDelete