Manu Smriti -Fascism - Manu Smriti
మనుస్మృతి
– ఫాసిజం – మనుస్మృతి
-
డానీ
ఫాసిజాన్నీ,
నాజిజాన్నీ అధ్యయనం చేయాల్సిన అవసరం గతంలోకన్నా ఇప్పుడు ఎక్కువగా ముందుకు
వచ్చింది. చాలామంది లైబ్రరీల మీద పడి అలనాటి ఇటలీ, జర్మనీ రాజకీయార్ధిక
పరిణామాల్నీ, అప్పటి తత్వవేత్తల పుస్తకాలనీ తెగ చదివేస్తున్నారు. నిజానికి భారతీయులు
అంత దూరం వెళ్ళాల్సిన అవసరంలేదు. మన ‘మనుస్మృతి’యే ‘చండాలుడు’ (Tschandala) సిధ్ధాంతంతో సహా జర్మనీకి చేరి ప్రైడరిక్ నీషేను ప్రభావితం చేసి ఆ తరువాత అతని సోదరి ఎలిజబెత్ ఫోర్ స్టర్ నీషే
ద్వార హిట్లర్ కు చేరి ఆ నియంతకు కొత్త
ఉత్తేజాన్ని ఇచ్చింది. నీషే రచనల సమగ్ర సంకలనాన్ని మరో నియంత బెనిటో ముస్సోలినికి
పుట్టిన రోజు కానుకగా ఇచ్చాడు హిట్లర్.
ఆర్య సంస్కృతి, సమానత్వ సిధ్ధాంత నిరాకరణలతోపాటూ స్వస్తిక్ చిహ్నం సహితం
జర్మన్ క్రైస్తవ మతవర్గతత్త్వ నియంతకు గొప్పగా నచ్చేశాయి.
ఇప్పటి
మన కేంద్ర ప్రభుత్వ పోకడల్ని గమనిస్తే వారికి కూడ మనుస్మృతి ఆదర్శంగా
మారుతున్నట్టు సులువుగానే అర్థం అవుతోంది. మన రాజ్యాంగపు ప్రవేశికలో “సర్వసత్తాక
సామ్యవాద, లౌకికవాద, ప్రజాస్వామికవాద రిపబ్లిక్” అనే ఆకాంక్ష ప్రకటనను “సర్వసత్తాక
మనువాద రిపబ్లిక్” గా మార్చేందుకు పావులు కదులుతున్నట్టుగా కూడ బోధపడుతుంది. న్యాయం, స్వేఛ్ఛా, సమానత్వం,
సౌభ్రాతృత్వాలకు ముప్పు రాబోతున్నదని గ్రహించకపోతే మన జ్ఞాన వ్యవస్థ పనిచేయడం మానేసిందని అనుకోవచ్చు.
ప్రజాస్వామం అంటే అధికసంఖ్యాకులు ఆధిపత్యాన్ని
చెలాయించడం కాదు, అల్పసంఖ్యాకుల మనోభావాల్ని సహితం గౌరవించాలని అర్థం. పాలనాధికారం మొత్తం ఒకే విభాగంలో కేంద్రీకరించేస్తే నియంతృత్వ పోకడలు పొడచూపుతాయని ప్రజాస్వామిక సిధ్ధాంతకర్తలు ముందుగానే ఊహించారు. అందుకే పాలనాధికారాన్ని న్యాయ, చట్టనిర్మాణ, కార్యనిర్వాహక వ్యవస్థలకు సమానంగా పంచారు. కొన్ని దేశాల్లో మీడియా, కార్మిక సంఘాలు, పౌరసమాజాన్ని కూడ ప్రజాస్వామ్య భవనానికి మూల స్థంభాలుగా భావిస్తారు.
ప్రజాస్వామిక సిధ్ధాంతకర్తలు
భయపడ్డట్టే కొన్ని చారిత్రక దశల్లో కొన్ని దేశాల్లో ప్రభుత్వం, కార్పొరేట్లు ఏకం అయిపోయారు. నరేంద్ర
మోదీజీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా జరిగింది అదే. నరేంద్ర మోదీజీని ప్రధానిని
చేసిన భారత కార్పొరేట్లు ‘గుజరాత్ ఫార్మూలా’ను దేశానికి వర్తింపచేసి మరింత లాభాలు దండుకునే
ప్రయత్నంలో వున్నాయి. ప్రభుత్వమే తమ గుప్పిట్లో వున్నప్పుడు న్యాయ, చట్టనిర్మాణ, కార్యనిర్వాహక వ్యవస్థలను సహితం కార్పొరేట్లు తమ గుప్పిట్లో పెట్టుకున్నట్టే.
ప్రభుత్వ విధుల్ని న్యాయ, చట్టనిర్మాణ, కార్యనిర్వాహకవర్గ వ్యవస్థలకు పంచితే అది ప్రజాస్వామ్యం. ప్రభుత్వం కార్పొరేట్లు కలిసిపోతే అది ఫాసిజం. ఇటలీలో ఫాసిజానికి ఆద్యుడు అయిన బెనిటో ముస్సోలిని ఈ సత్యాన్ని చాలా గర్వంగానూ చెప్పుకున్నాడు. “ఫాసిజానికి సరైన అర్థం ఏమంటే రాజ్యాన్ని కార్పొరేట్ గా మార్చడం. ఎందుకంటే ఇది రాజ్యాన్నీ, కార్పొరేట్ శక్తినీ విలీనం చేస్తుంది” అన్నాడు. “Fascism should more appropriately be called Corporatism because
it is a merger of state and corporate power”
రాజ్యాన్ని కార్పొరేట్ గా మార్చే ప్రక్రియా ప్రధానంగా ఆర్థిక పరమైనది. వివరంగా చెప్పాలంటే, సంపదను సృష్టించే భూమి, అడవులు, ఖనిజాలు, కొండలు, లోయలు, నదులు, సముద్రాలు తదితర సహజ వనరులన్నింటినీ కార్పొరేట్ల పరం చేయడం. అయితే, దేశ జనాభాలో అత్యధికులుగా వుండే సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక అసమానత్వాన్ని అంతకన్నా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. పోలీసులు, లాఠీలు, తుపాకులు, జైళ్ళు, ఉరికొయ్యలతో వాళ్ళ నోళ్ళను నొక్కే ప్రయత్నం ప్రభుత్వం
చేయవచ్చు. అశాంతిని అదుపు చేయడానికి సైన్యాన్ని కూడ రంగంలోనికి దించవచ్చు. అయితే, అది సత్ఫలితాలను ఇస్తుందన్న నమ్మకంలేదు. ప్రజలు
తెగబడి పోరాటాలకు సిధ్ధపడితే అంతర్యుధ్ధం చెలరేగవచ్చు. ఇలాంటి ప్రమాదం
నుండి తప్పించుకోవడానికి ప్రజల్లో చీలికలు తేవడం ఒక అవసరంగా కార్పొరేట్ రాజ్యం గుర్తిస్తుంది.
ప్రజల్లో చీలికలు తేవడానికి కార్పొరేట్
రాజ్యానికి అనేకానేక అస్థిత్వాలు అందుబాటులో వుంటాయి. వీటన్నింటిలోనూ పదునైన, బలమైన
ఆయుధం మతం. అయితే, మతాన్ని నేరుగా రాజకీయాల్లోనికి తేవడం విద్యాధికులైన మధ్యతరగతికి
అంతగా రుచించదు. కార్పొరేట్లు బలపడితేనే దేశం శక్తివంతం అవుతుందని వాళ్ళను నమ్మించగలిగితే
మతం దేశభక్తి కలగలిసి ఒక్క రూపాయి ఖర్చు కూడ లేకుండా ఒక బలమైన అసంఖ్యాక స్వఛ్ఛంద సాంస్కృతిక
సైన్యం ప్రభుత్వానికి అనుకూలంగా ఏర్పడుతుంది. ప్రభుత్వానికీ, కార్పొరేట్లకూ అనుకూలంగా
స్థాయీ సైన్యం సహితం చేయలేని అనేక పనుల్ని ఈ సాంస్కృతిక సైన్యం సునాయాసంగా చేసి పడేస్తుంది. ఇటలీలో ముస్సోలిని ‘బ్లాక్ షర్ట్స్’
పేరుతో ఫాసిస్టు మూకల్ని సృష్టిస్తే, జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ ‘షుట్జ్ స్టాఫెల్’ (ఎస్ ఎస్) పేరుతో నాజీ
మూకల్ని సృష్టించాడు.
కార్పొరేట్ సంస్థలకు లాభాలే ముఖ్యం.
ఏ విదేశీ సంస్థతో అయినా సరే అవి ఎప్పుడయినా కలిసిపోతాయి. లాభాలు ఎక్కువగా వస్తే తమ
సంస్థల్ని పూర్తిగా అమ్మేసుకుంటాయి. అలాంటప్పుడు కార్పొరేట్ దేశభక్తి వంటి భావనల్ని
బయటి నుండి చొప్పించడం సాధ్యమేనా? ప్రభుత్వం చెపితే ప్రజలు నమ్మేస్తారా? మనుషుల విచక్షణా
జ్ఞానం సంగతేంటీ? వంటి సందేహాలూ ఈ సందర్భంగా తలెత్తుతాయి. వీటికి సమాధానాలు ఇవ్వడానికి
ముందు మనిషి స్వభావాన్ని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.
“మనిషి స్వభావసిధ్ధంగా వున్నతుడు
అని ఎవరైనా అన్నప్పుడు వాళ్ళు ఒక గొప్ప విషయాన్ని చెపుతున్నట్టు మనమంతా నమ్ముతాము. కానీ, మనిషి స్వభావసిధ్ధంగానే
చెడ్డవాడు అని ఎవరైనా అంటే వాళ్ళు అంతకన్నా మహత్తర విషయాన్ని చెపుతున్నారని
మాత్రం మనం మరిచిపోతాం” అన్నాడు జర్మన్ తత్వవేత్త
జోర్జ్ విల్హెమ్ ఫ్రైడ్రిక్ హెగెల్.
ప్రకృతిలో ఏ జీవితో పోల్చినా అతి క్రూరమైన జీవి మనిషి.
తనను సృష్టించిన ప్రకృతినే కబళించాలనుకునే కృతఘ్నుడు. ఒక రోజు తాను సహితం నాశనం అయిపోతానని
తెలిసినా ప్రకృతి విధ్వంసాన్ని ఆపని స్వార్ధపరుడు. తల్లిదండ్రులో, సోదరులో చనిపోతే వాళ్ల ఆస్తి తనకు సంక్రమిస్తుందని ఎదురుచూసే
అత్యాశ పరుడు మనిషి. వ్యక్తిగత ఆస్థి మీద ఆత్యాశ అతిశయించినపుడు జన్మనిచ్చిన
తల్లిదండ్రుల్ని సహితం చంపడానికి వెనుకాడని భూతం మనిషి. సంచలనాత్మక
హత్యల్ని చేయిస్తున్నది ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలు కాదు; వేల కోట్ల రూపాయల రాజప్రసాదాల్లో
నివశిస్తున్న శ్రీమంతులు. వీటి అర్ధం ఏమంటే ఈ భూమ్మీద అత్యంత ప్రమాదకర జీవి మనిషి.
మనిషి మాంసం రుచి మరిగిన పులిని అడవినంతా గాలించి చంపేస్తారు ఆటవికులు. వ్యక్తిగత ఆస్థి
రుచి మరిగిన మనిషి తమ మధ్య సంచరిస్తున్నా మౌన ప్రేక్షకుల్లా వుండిపోతారు నాగరీకులు.
యాధృఛికంగా సోదరులు చనిపోతే కొందరికి ఆస్తి కలిసి రావచ్చు. కానీ, ఆస్తి కోసం సోదరుల్ని చంపేస్తే అది రక్తపు కూడు అవుతుంది. ఇంతటి కౄరత్వానికి ఒక సాంస్కృతిక జాతీయవాద ముసుగు కప్పి దానికి ఆమోదాంశాన్ని సాధించడం ద్వార చరిత్రలో మతవర్గ నియంతృత్వం ప్రవేశిస్తుంది.
మనుషుల్లో దాగివున్న భూతం బిరడాను
తీసి ప్రజల్లో ఒక సాంస్కృతిక ఉన్మాదాన్ని రేకెత్తించి తన రాజకీయార్ధిక అవసరాలకు
వాడుకోవడం కార్పొరేట్ రాజ్యానికి బాగా తెలుసు. “ఆస్తి కోసం మీరు మరొకర్ని చంపి హంతకులు
కావల్సిన పనిలేదు. మీకోసం నేను ఇతరుల్ని చంపి మీ సంపదను పెంచుతాను” అనే సంకేతాలను అది
చాలా బలంగా ప్రసారం చేస్తుంది.
ముస్సోలినీ,
హిట్లర్ లకు మొగమాటం లేదు కనుక ఈ విషయాన్ని వాళ్ళు చాలా బాహాటంగానే
చెప్పుకున్నారు. ఆఫ్రికా ఖండాన్ని ఖాళీ చేయించి, (అంటే, స్థానికుల్ని చంపేసి) అక్కడ కోటి మంది ఇటాలియన్లకు స్థిర నివాసం ఏర్పాటు చేస్తే ఇటలీ
ప్రజలు ఛాతీ నిండా ఊపిరి పీల్చుకోవచ్చు అన్నాడు ముస్సోలిని. రష్యాను ఆక్రమించుకుని అక్కడి యూదు రైతుల్ని బానిసలుగా
మార్చుకుంటే జర్మన్లకు కావాలసినంత ఆహారాన్ని వాళ్ళు పండించి పెడతారు అన్నాడు హిట్లర్.
మన దేశాధినేతలకు ‘మొగమాటం’ ఎక్కువ వాళ్ళు
అలాంటి ప్రకటనలు చేయరు గానీ అలాంటి ఆ పనులు మాత్రం చేస్తారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల
మనోభావాలను వింటే మనకు ఆ విషయాలు మరింత స్పష్టంగా అర్థం అవుతాయి. దీనికి సరికొత్త ఉదాహరణ
కశ్మీర్. కశ్మీర్ గురించి ఇప్పుడు ప్రపంచం
అంతా మాట్లాడుతోంది. కశ్మీరీలు ఏ మాట్లాడుతున్నారో మాత్రం ప్రపంచానికి ఇప్పటికీ తెలియడంలేదు.
కశ్మీర్
కు ప్రత్యేక హక్కులను ఇచ్చే అధీకరణం 370ను పార్లమెంటు ఆగస్టు 6న రద్దు చేసింది. ఆరు
రోజుల్లోనే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని కశ్మీర్ లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు
ప్రకటించారు. భారత పార్లమెంటు ఆర్టికల్ 370ని రద్దు చేయడం మూలంగా రిలయన్స్ సంస్థ కశ్మీర్
లో పెట్టుబడులు పెడుతున్నదా? లేక రిలయన్స్ సంస్థ కశ్మీర్ లో పెట్టుబడులు పెట్టదలిచింది
గాబట్టి భారత పార్లమెంటు ఆర్టికల్ 370ని రద్దు చేసిందా? అనేది ఎవరికయినా రావలసిన సందేహమే!
ప్రత్యేక హక్కుల రద్దు క్రమం కాశ్మీర్ తో ఆగదు.
ఈ క్రమం లక్ష్యం ప్రజాస్వామిక రాజ్యాంగం రద్దు!
(రచయిత సీనియర్ జర్నలిస్టు, సమాజ విశ్లేషకులు)
మొబైల్
9010757776
రచన
: 30 ఆగస్టు 2019
ప్రచురణ
: ప్రజాపాలన, 21 సెప్టెంబరు 2019
No comments:
Post a Comment