Thursday 26 September 2019

Social Issues and Personal Problems


మన  వ్యక్తిగత సమస్యలకన్నా మన కాన్వాస్ పెద్దదిగా వుండాలి
మా చిన్నోడు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి

          మా అమ్మానాన్నలు భిన్న పార్శ్వాలు. మా నాన్న emotional; మా అమ్మ organizer. ఆ రెండు లక్షణాలు రెండు పార్శ్వాలుగా నాలో వున్నాయంటారు సన్నిహితులు. నాలోని emotional పార్శ్వానికి వారసుడు మా పెద్దాడు అరుణ్ ఇక్బాల్ ఖాన్ చౌదరి. వాడు artist and technician. నాలోని organizer పార్శ్వానికి వారసుడు మా చిన్నోడు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి. వాడు గొప్ప crisis manager. మేము రెండు మతాలు కులాల కలయిక అని చెప్పడానికి మా పిల్లల పేర్లు అలా పెట్టాము. మతసామరస్యాన్ని చాటి చెప్పడం ఒక ఆదర్శం అనుకున్నాము.

                       
సన్నిహితుల్లో ఎవరికి ఎంతపెద్ద సమస్య వచ్చి పడినా చిటికెల్లో పరిష్కారం చూపించే స్తోమత అనిల్ ది. నేను వేసుకోవాల్సిన డ్రెస్సు, షూస్, పెట్టుకోవాల్సిన కళ్ళజోడు, వాచీలు చివరకు తాగాల్సిన మద్యం బ్రాండ్లు కూడ వాడే నిర్ణయిస్తుంటాడు. “Poor man’s luxurious drink Mansion House and rich man’s impoverish drink Johnny Walker Red label. And you are still dwelling between them” అంటాడు.

          కుటుంబ వ్యవహారాల్లో నాకో సలహాదారుడు అవసరమైనపుడు అనిల్ నే సంప్రదిస్తాను. నాకు సలహా ఇవ్వగల సమర్ధుడు వాడు. ఈ మధ్య వాడొక మాట అన్నాడు. “నాన్నా! మమ్మల్ని పెంచడానికీ, చదివించడానికీ, జీవితంలో స్థిరపడేలా చేయడానికీ నువ్వు అనేక త్యాగాలు చేసివుంటావు. ఏదైనా టూరిస్ట్ స్పాట్ కు వెళ్ళాలనుకుని వెళ్ళివుండవు. ఏదైనా పెద్ద బ్రాండు మందు తాగాలనుకుని తాగివుండవు. ఎవరైన గర్ల్ ఫ్రెండ్ తో డేటింగుకు వెళ్ళాలనుకుని వెళ్ళి వుండవు. ఇప్పుడు మనకు వెసులుబాటు వుంది. వాటినన్నింటినీ నెరవేర్చేసుకో. నేను స్పాన్సర్ చేస్తాను” అన్నాడు. వాడు నాకు నచ్చాడు.

          ఉద్యమాల గురించి కూడ వాడి అభిప్రాయాలు భిన్నంగా వుంటాయి. “నువ్వు శిక్కుల్ని పట్టించుకోవడం గొప్ప విషయం; నువ్వు శిక్కువి కాదు కనుక. నువ్వు భోపాల్ గ్యాస్ బాధితుల్ని పరామర్శించడం గొప్ప విషయం; నువ్వు భోపాల్ వాసివి కాదుకనుక. నువ్వు కారంచెడు ఉద్యమంలో పాల్గొనడం గొప్ప విషయం; నువ్వు దళితుడివి కాదుకనుక. నువ్వు చినగంజాం ఉప్పు ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటంలో పాల్గొనడం గొప్ప విషయం; నువ్వు బాధితుడివి కాదుకనుక. నువ్వు యానాదుల కోసం సమాఖ్య పెట్టడం గొప్ప విషయం; నువ్వు ఆదివాసివి కాదుకనుక. ఇతరులు నిన్ను గౌరవించేది అందుకోసమే. కానీ, నువ్వు గుజరాత్ అల్లర్ల సమయంలో అహ్మదాబాద్ వెళ్లడం, ముస్లిం హక్కుల కోసం మాట్లాడడం అంత గొప్ప విషయం కాదు; అది నీ సమస్య కనుక. నువ్వు  మగవాళ్ల సమస్యల గురించి మాట్లాడితే గొప్పెలా అవుతుందీ? That is your problem. నువ్వు మహిళల సమస్యల మీద మాట్లాడితే గొప్ప అవుతుంది. నీ కాన్వాస్ ఎప్పుడయినాసరే నీ వ్యక్తిగత సమస్యలకన్నా పెద్దదిగా వుండాలి” అంటాడువాడు.  

          పెద్దయ్యాక ఇన్ని పెద్ద మాటలు చెపుతాడని వాడు పుట్టినపుడు తెలీదు. ఇప్పుడు ఇన్ని పెద్ద మాటలు చెపుతుంటే వాడు పుట్టినందుకు ఆనందంగా వుంది.

Happy Birthday Anil !.


No comments:

Post a Comment