Friday 20 September 2019

Minorities' View on the Withdrawal of Telangana Armed struggle


Minorities' View on the Withdrawal of Telangana Armed struggle

మెజారిటీవర్గం తిడితే విప్లవం!.
మైనారిటీవర్గం విమర్శిస్తే  మతతత్వం!!.

1.            సోషలిస్టు విప్లవం (ఫ్యాక్టరీ) కార్మికవర్గం నాయకత్వంలో సాగుతుందనే భావన ప్రపంచ వ్యాప్తంగా 1940వ దశాబ్దం వరకు బలంగా వుండేది. వ్యవసాయిక దేశమైన చైనాలో అక్కడి కమ్యూనిస్టు పార్టి 1946లో రైతు-కూలీల నాయకత్వంలో నూతన ప్ర‌జాస్వామిక విప్లవ పంథాను చేపట్టిది. మావో పంథా భారత కమ్యూనిస్టు పార్టికి  ప్రేరణ ఇచ్చింది.  

2.            భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, అది కేవలం అధికార మార్పిడి మాత్రమేనని, ప్రజలకు స్వాతంత్ర్యం రాలేదని  భారత కమ్యూనిస్టు పార్టి అంచనా వేసింది.

3.            ఆరు నెలల తరువాత, 1948 ఫిబ్రవరి 28 నుండి వారం రోజుల  పాటు కలకత్తాలో  జరిగిన భారత కమ్యూనిస్టు పార్టి రెండవ మహాసభల్లో కొత్త ప్రధాన కార్యదర్శిగా బిటి రణదివే  ఎన్నికయ్యారు.

4.            బూటకపు స్వాతంత్ర్యాన్ని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా సాయుధ పోరాట పంథాను చేపట్టాలనేది రెండవ కాంగ్రెస్ చేసిన చారిత్రాత్మక నిర్ణయం. We must continue our struggle against the bourgeoisie. Strikes, mass rallies, demonstrations, and armed struggles must be used to challenge this false sense of freedom అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.  

5.            భారత కమ్యూనిస్టు పార్టి సాయుధ పోరాట పంథాను స్వీకరించడంతో పున్నప్ర-వాయలార్, తెభాగ, త్రిపుర వంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని అలజడులు సాగినప్పటికీ సిసలయిన సాయుధ పోరాటం సాగింది మాత్రం తెలంగాణలోనే.

6.            1951 ఫిబ్రవరి ఆరంభంలో కమ్యూనిస్టు పార్టి జాతీయ నాయకులయిన చండ్ర రాజేశ్వరరావు, శ్రీపాద అమృత డాంగే, అజయ్ ఘోష్, మాకినేని బసవ పున్నయ్య సాయుధ పోరాట పంథా మీద అంతర్జాతీయ కమ్యూనిస్టు సమితి సలహా కోసం సోవియట్ రష్యా వెళ్ళారు.

7.            వాళ్ళు అక్కడ  1951 ఫిబ్రవరి 9న స్టాలిన్ ను కలుసుకున్నారు. భారత దేశంలో సాయుధ పోరాటాన్ని విరమించాలని స్టాలిన్ వారికి సూచించాడు. అలా సూచించడానికి నెహ్రూతో స్టాలిన్ అవసరాలు స్టాలిన్ కు వున్నాయి.

8.            రష్యాలో స్టాలిన్ ను కలిసివచ్చిన కమ్యూనిస్టు ప్రతినిధివర్గం 1951 అక్టోబరు చివర్లో ఫైజ్ పూర్ లో  పార్టీ మూడవ కాంగ్రెస్ ను నిర్వహించారు. సాయుధ పోరాట పంథాను చేపట్టిన బిటి రణదివేను ‘వామపక్ష అతివాద దుందుడుకువాదిగా’ విమర్శించి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుండేగాక జాతీయ సమితి నుండి కూడ తొలగించారు. 

9.            ఆ మహాసభలోనే సాయుధ పోరాట పంథాను విరమించి పార్లమెంటరి పంథాను చేపట్టాలని 1951 అక్టోబరు 21న  తీర్మానం చేశారు.

10.       సాయుధ పోరాట పంథాను చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టి రెండవ కాంగ్రెస్ చేసిన తీర్మానికీ, సాయుధ పోరాట పంథాను వదిలి పార్లమెంటరీ పంథాను చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టి మూడవ  కాంగ్రెస్ చేసిన తీర్మానానికీ తెలంగాణలో సాగిన రైతాంగ సాయుధ పోరాటానికీ సంబంధం లేదు. దాని తేదీలు దానివే. దీని తేదీలు దీనివే.

11.       సాయుధ పోరాట పంథాను చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టి రెండవ కాంగ్రెస్ తీర్మానం చేయడానికి ఏడాదిన్నర ముందే తెలంగాణ రాష్ట్ర కమిటి సాయుధ పోరాట పంథాను చేపట్టింది. అలాగే సాయుధ పోరాటాన్ని విరమించాలని భారత కమ్యూనిస్టు పార్టి మూడవ కాంగ్రెస్ తీర్మానం చేయడానికి రెండున్నరేళ్ళు ముందే తెలంగాణ రాష్ట్ర అగ్రనేతలు సాయుధ పోరాటాన్ని విరమించారు. పోరాటం ఆరంభానికీ, విరమణకు కారకులు తెలంగాణ రాష్ట్ర కమిటి అగ్ర నాయకులు రావి నారాయణ రెడ్డి.

12.        తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి థింక్ ట్యాంక్ గా పనిచేసిన  కామ్రేడ్స్ అసోసియేషన్ లో దేవులపల్లి వెంకటేశ్వరరావు వంటి ఒకళ్ళిద్దరుతప్ప మిగతా మేధావులు, కవులు, తత్వవేత్తలు అందరూ ముస్లింలు.

13.    దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణలో సాయుధ పోరాటాన్ని చేపడుతున్నట్లు 1946 జులై 4న రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్ధూమ్ మొహియుద్దీన్  ప్రకటించారు.

14.       ఇండియన్ యూనియన్ చేపట్టిన పోలీస్ యాక్షన్ తో 1948 సెప్టెంబరు 17/ 18 తేదీల్లో నిజాం సంస్థానం భారత్ లో విలీనం అయ్యింది.  

15.   నెహ్రూ మార్కు సోషలిజం మీద విశ్వాసం,  భ్రమలు గలిగిన మితవాద వర్గం కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీలో బలంగా వుండింది. నెహ్రూ ప్రేమికులైన మితవాద వర్గానికి నాయకుడు రావి నారాయణ రెడ్డి.

16. తెలంగాణలో రైతుకూలీ (సోషలిస్టు) రాజ్యం నినాదంతో ఆ పోరాటం మొదలయింది. నిజాం సంస్థానం విలీనం కాగానే రావి నారాయణ రెడ్డి పోరాట విరమణ ప్రకటన చేశారు.

17.  ప్రజలు సామ్యవాదాన్ని కాకుండ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు అనే వాదాన్ని రావి నారాయణ రెడ్డి ముందుకు తెచ్చారు. వారి ఫార్మూలాను అప్పుడూ ఆ తరువాతి కాలంలోనూ కొందరు గట్టిగానే వ్యతిరేకించారు. అయితే, రెండున్నరేళ్ళ తరువాత కమ్యూనిస్టు పార్టి  జాతీయ కమిటి సహితం రావి నారాయణ రెడ్డి  ఫార్మూలానే అధికారిక పంథాగా స్వీకరించింది.   

18. 1948 నుండి 1951 వరకు కొందరు కొనసాగించిన సాయుధ పోరాటం ఒక అనధికార చర్యగా మిగిలిపోయింది.   

19.   తెలంగాణ పోరాటంలో -  పోలీసు చర్యకు ముందు - తొలి అమరుడు షేక్ బందగీ, చివరి అమరుడు షోయబుల్లా ఖాన్. రావి నారాయణ రెడ్డి ప్రకటనవల్ల కమ్యూనిస్టు పార్టీని నమ్ముకున్న ముస్లింలు తీవ్రంగా నష్టపోయారు.

20.       తెలంగాణ సాయుధపోరాట ఫలితాల్లో బందగీ, షోయబుల్లాల స్వీయ సామాజిక వర్గాలకు దక్కింది ఏమిటీ?

21.       చాకలి ఐలమ్మ స్వీయ సామాజిక వర్గాలైన వెనుకబడిన తరగతులకు  దక్కింది ఏమిటీ?

22.       విలీనం , సాయుధపోరాట విరమణల అనంతరం ఆంధ్రా ప్రాంతంలో అయినా తెలంగాణలో అయినా మళ్ళీమళ్ళీ సంపదను పెంచుకున్నది సాంప్రదాయ వ్యవసాయ సామాజికవర్గాలే కదా?

23.      హైదరాబాద్ స్టేట్ గా మారిన నైజాంలో 1952లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు పిడిఎఫ్ పేరుతో పోటీ చేశారు.

24.       పిడిఎఫ్ కూటమికి నాయకత్వం వహించిన డాక్టర్ జయసూర్య పోలీస్ యాక్షన్ సందర్భంగా జరిగిన ప్రాణ నష్టం గురించి కేంద్ర హోంశాఖకు ఒక సమగ్ర రిపోర్టు సమర్పించారు.

25.    నిజాం సంస్థానంలో కనీసంగా 40 వేల మంది నుండి గరిష్టంగా రెండు లక్షల మంది వరకు ముస్లింలను భారత సైన్యం చంపేసిందని  డాక్టర్ జయసూర్య తన నివేదికలో పేర్కొన్నారు.

26. ఆ నివేదికలోని ఆరోపణల్ని పరిశీలించడానికి  ప్రధాని నెహ్రు తన సన్నిహితుడయిన సుందర్ లాల్ ను హైదరాబాద్ స్టేట్ కు పంపించాడు.

27.       సుందర్ లాల్ కమిటీ కూడా డాక్టర్ జయసూర్య నివేదికను బలపర్చింది.

28.  భారత కమ్యూనిస్టు పార్టి తెలంగాణ రాష్ట్ర కమిటీలో రావి నారాయణ రెడ్డికి వ్యతిరేకవర్గం కూడ బలంగా వుంది. పోరాట విరమణ నిర్ణయాన్ని దేవులపల్లి వేంకటేశ్వర రావు వంటివారు తీవ్రంగా విభేదించారు.

29.       వాళ్ళు రావి నారాయణ రెడ్డితో విబేధించి పోరాటాన్ని కొనసాగించాలన్నారు.

30.       ప్రజలు కూడ సాయుధ పోరాటాన్ని కోరుకున్నారు.

31.       ప్రజలు వేరు, కమ్యూనిస్టు పార్టి వేరు.

32.  రాష్ట్ర కమిటీలో అగ్రనేతలే నిరాసక్తంగా వుండిపోవడంతో ఆ పోరాటం ఆ తరువాత పూర్వపు వుధృతిని కోల్పోయింది.

33.       ఒక లాంఛనంగా మాత్రమే 1951 వరకు సాయుధ పోరాటం కొనసాగింది.

34.  నిజాం సంస్థానం విలీనం కాగానే తెలంగాణ కమ్యూనిస్టు అగ్రనేత రావి నారాయణ రెడ్డి పోరాట విరమణ ప్రకటన చేయడానికి దారి తీసిన సాంఘీక  కారణాలను  అన్వేషించడం ఇప్పుడు సామాజిక బాధ్యత.    

35.       ఆనాడు ఆర్యసమాజ్ రూపంలోవున్న సంఘపరివారం, కాంగ్రెస్ రూపంలోవున్న స్వామి రామానంద తీర్థల ఎజెండాలు కమ్యూనిస్టు పార్టి రూపంలోవున్న రావి నారాయణ రెడ్డి ఎజెండా ఒక్కటేనా?

36.   భారత కమ్యూనిస్టు పార్టి సాయుధ పోరాట పంథా అమలుకు అసలు నిజాం సంస్థానాన్నే ప్రధాన కార్యక్షేత్రంగా ఎందుకు ఎంచుకుందీ?

37.   అందులోనూ ఆంధ్రా ప్రాంతానికి ఆనుకుని వున్న నల్గొండ, వరంగల్ వంటి రెండు తెలంగాణ జిల్లాలలో మాత్రమే  సాయుధ పోరాటాన్ని ఎందుకు సాగించిందీ?

38.   ఈ సాయుధ పోరాటాన్ని తెలంగాణ ప్రజల విముక్తి కోసం సాగించిందా? లేక నిజాం సంస్థానంలో ఆంధ్రా వ్యవసాయ సామాజికవర్గాల ప్రవేశం కోసం సాగించిందా?

39.       తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంవల్లగానీ, పోరాట విరమణవల్లగానీ ఎస్టీ, ఎస్సీ, బీసి, మైనారిటీ సామాజికవర్గాలకు కలిగిన ప్రయోజనం ఏమిటీ?

40. సాంఘీకంగా అణగారిన సమూహాలకు ఈ పోరాటం వలన కలిగిన ప్రయోజనాలను పుచ్చలపల్లి సుందరయ్యగారు గానీ, దేవులపల్లి వేంకటేశ్వర రావుగారు గానీ తమ పరిశోధన గ్రంధాల్లో రాశారా?

41. ప్రాణప్రదమైన ఈ అంశాల్ని వారు రాయకపోతే ఆ పుస్తకాలను ఈతరపు అణగారిన సమూహాలు ఎందుకు చదవాలీ?

42.       కమ్యూనిస్టు సీనియర్లు ఇటీవల చేస్తున్న కామెంట్లను బట్టి ఇప్పుడు మరికొన్ని కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. 

43.   సిపిఐను 1964లో ‘రివిజనిస్టు’ అని సిపిఐ (యం) నాయకులు విమర్శించింది నిజం కాదా?

44.   1969 తరువాత సిపిఐ (యం)ను ‘నయా రివిజనిస్టు’ అని సిపిఐ (మార్క్సిస్టు లెనినిస్టు), యూసిసిఆర్ ఐ (మార్క్సిస్టు లెనినిస్టు) విమర్శించింది నిజంకాదా?

45.  1948లో తెలంగాణలో సిపిఐ అనుసరించిన విధానాలను తప్పుపడుతుంటే  మార్క్సిస్టు లెనినిస్టులుగా చెలామణీ అవుతున్నవారు సహితం ఇబ్బంది పడుతున్నారు.  

46.       1970 లలో భారత శ్రామిక ఉద్యమానికి సిపిఐ ద్రోహం అనే పేరుతో ఒక విమర్శన డాక్యుమెంట్ రాలేదా?

47.    మెజారిటీవర్గం తిడితే విప్లవం!. మైనారిటీవర్గం విమర్శిస్తే  మతతత్వం!!. ఇదేమీ న్యాయం కామ్రేడ్స్? 

48.  1925 డిసెంబరులో  లాంఛనంగా ఆరంభమైన భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో అత్యధికులు ముస్లింలు. (అహమ్మద్ హసన్, హస్రత్ మొహానీ, రఫీక్ అహమ్మద్, సుల్తాన్ అహ్మద్ ఖాన్, ముజఫర్ అహ్మద్, ఖాజీ నజ్రుల్ ఇస్లాం). నిజానికి అంతకు ముందు తాష్కెంట్ కొండల్లో ప్రాధమికంగా భారత కమ్యూనిస్టు పార్టీని  స్థాపించిన వాళ్ళూ ముస్లింలే. భారత సాహిత్యంలో 1932లోనే  ఆధునిక భావాలను ప్రవేశపెట్టిన అంజుమన్ తరక్కి పసంద్ ముస్సనఫీన్ ఏ హింద్ (భారత అభ్యుదయ సాహిత్య ఉద్యమం) నిర్వాహకుల్లో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ  ముస్లింలే.   ఇప్పటి సంక్షోభ కాలంలో ముస్లింలకు అలాంటి ఆశ్వాసాన్ని భరోసాను ఇచ్చే స్థితిలో కమ్యూనిస్టు వేదికలు వున్నాయా?  

49.  నేను వారం క్రితం కాంగ్రెస్ మతతత్వం మీద ఒక వ్యాసం రాసాను. ఇప్పుడు కమ్యూనిస్టు శిబిరంలో అంతర్లీనంగా కొనసాగుతున్న  మతతత్వం మీద ఒక విస్తార వ్యాసం రాయాల్సిన అవసరం వున్నది.

50. తరుముకు వస్తున్న నయా మనువాదానికి వ్యతిరేకంగా మార్క్ సిస్టులు,  అంబేడ్కరిస్టులు, సామ్యవాదులు, సామరస్యవాదులు,  పౌర-మానహక్కుల వాదులు, ప్రకృతి ప్రేమికులు అందరూ ఏకమై పోరాడాల్సిన చారిత్రక సందర్భం ఇది. మునుపటి తప్పులు మళ్ళీ జరగకుండా వుండేందుకు గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి.  


రచన : 20 సెప్టెంబరు 2019
ప్రచురణ : https://khanyazdani.blogspot.com , 21 సెప్టెంబరు 2019



కామ్రేడ్ IFTU ప్రసాద్!

 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద ముస్లిం మైనారిటీల దృక్పథం భిన్నమైనది.

1.     ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి చరిత్ర మొత్తంలో  కేవలం ముస్లిం పరిపాలకుడున్న  నిజాం సంస్థానంలో మాత్రమే సాయుధపోరాటం చేసింది.

2.     దేశంలో హిందూ పాలకులున్న సంస్థానాలు వందలాది వున్నా అక్కడ సాయుధ పోరాటం చేయలేదు.

3.     ఆంధ్రమహాసభలో ముస్లిం వ్యతిరేక ధోరణులున్నాయి. రామానంద తీర్ధ ప్రభావం బలంగా వుంది.

4.     పోలీస్ యాక్షన్ లో ముస్లింలు నమ్మలేనంత పెద్ద సంఖ్యలో చనిపోయారు.

5.     కమ్యూనిస్టు ఎజెండాకన్నా హిందూ ఎజెండా బలంగా పనిచేసిందనేది ఆరోపణ.

6.     ఒక దేశంలో /రాజ్యంలో సమసమాజాన్ని స్థాపిస్తామని బయలుదేరి, దాన్ని ఒక పెట్టుబడీదారీ  దేశంలో ఒక రాష్ట్రంగా మార్చగానే సాయుధపోరాట విరమణ ప్రకటించడం ఏం ఘనతా?

7.     విశాలాంధ్ర నినాదం అంతకన్నా బూటకం అని చరిత్ర తేల్చేసింది. తెలంగాణలో ఆ పేరుతో పత్రికను సహితం నడపలేని పరిస్థితి వచ్చింది.

8.     రెండు తెలుగు రాష్ట్రాలనే  నినాదంతో సాగుతున్న పార్టీతో 2009 ఎన్నికల్లో కమ్యూనిస్టులు కూటమి కట్టారు.  ఎక్కడ బయలు దేరారూ? ఎక్కడ ముగిశారూ?

-        ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు చెప్పగలరు. 

No comments:

Post a Comment