Wednesday, 18 September 2019

Divorce - is it a Civic Solution or Crime?


Divorce - is it a Civic Solution or Crime?
విడాకులు పౌర పరిష్కారమా? నేరమా?
డానీ
          నరేంద్ర మోదీ 2.O ప్రభుత్వం తిరిగి ఎన్నికయిన నాటి నుండే ముస్లిం సమాజాన్ని వేధించడానికి దూకుడుగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం నేరుగానో, పరోక్షంగానో, ప్రాయోజితంగానో కొన్ని చిన్న సమూహాల మీద అలా వేధింపుల్ని సాగిస్తుంటే  మిగిలిన విస్తార సమూహాలు వాటిని ఆస్వాదిస్తూ అధికారపక్షానికి బలమైన ఓటు బ్యాంకుగా మారే ఒక అమానవీయమైన రాజకీయ వాతావరణం మన చుట్టూ వుంది. ఆ ఓటు బ్యాంకును ఉత్తేజపరచడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వ కార్యకలాపాలు సాగుతున్నాయి.  
          17వ లోక్ సభ ఎన్నికల తరువాత ఏర్పడిన కేంద్ర మంత్రివర్గం తొలి సమావేశంలోనే ముస్లిం మహిళ (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లు - 2019కు తుది మెరుగులు దిద్దింది. కొత్త పార్లమెంటు సమావేశాల తొలి రోజే  ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు.  తక్షణ ముమ్మారు తలాకులు చెప్పిన భర్తల మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి మూడేళ్ళ వరకు కారాగార శిక్ష విధించే వివాదాస్పద క్లాజ్ వున్న ఈ బిల్లును జులై 30న పార్లమెంటు ఆమోదించింది.
          ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని బిజెపి మూడేళ్లుగా  ఒక రాజకీయ వివాదంగా మండిస్తూనే వుంది. ముస్లిం మహిళ (వైవాహిక హక్కుల  పరిరక్షణ) బిల్లు - 2017ను ఆ ఏడాది డిసెంబరు 28న లోక్ సభ ఆమోదించింది. అయితే, అప్పట్లో రాజ్యసభలో అధికార జాతీయ ప్రజాస్వామిక కూటమికి  తగిన ఆధిక్యత లేని కారణంగా ఆ బిల్లు చట్టం కాకుండ ఆగింది. లోక్ సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి నెలలో కేంద్ర మంత్రివర్గం ఒక ఆర్డినెన్స్ ద్వార ఈ బిల్లును  అమల్లోనికి తెచ్చింది.
          తక్షణ ముమ్మారు తలాక్ బిల్లు రాజ్యసభ  ఆమోదాన్ని పొందగానే “ఇది లింగ న్యాయానికి ఘన విజయం” అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. వారు ఎర్రకోట బురుజుల మీద నిలబడి ఇచ్చిన  స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలోను ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.  “ఇన్నాళ్ళూ ముస్లిం మహిళల్ని తక్షణ  ముమ్మారు తలాక్ భయం వెంటాడుతూ వుండేది.  మేము  దానికి చరమ గీతాన్ని పాడాము” అన్నారు.     షాయరా బానూ అనే ముస్లిం మహిళ విడాకుల కేసును విచారించిన భారత వున్నత న్యాయస్థానం 2017 ఆగస్టు 22న తక్షణ ముమ్మారు తలాక్ చెల్లదని తీర్పు చెప్పింది.  దానిని ప్రాధమిక హక్కులకు వ్యతిరేకంగానూ, రాజ్యంగ విరుధ్ధంగానూ పేర్కొనడమేగాక అది ఇస్లామిక్ మౌలిక ఆదర్శాలైన  ఖురాన్ హదీసులకు కూడ వ్యతిరేకం అని తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు తక్షణ ముమ్మారు తలాక్ చెల్లదని చెప్పడం అంటే ఆ భార్యాభర్తల మధ్య విడాకులు రద్దు అయిపోయి వివాహబంధం పునరుధ్ధరణ జరగాలని అర్థం.   సుప్రీం కోర్టు తీర్పు తరువాత కూడ  దేశ వ్యాప్తంగా 345 తక్షణ ముమ్మారు తలాక్ కేసులు నమోదయ్యాయని కేంద్ర న్యాయశాఖా మంత్రి రవి శంకర్ప్రసాద్ పార్లమెంటులో ప్రకటించారు. ఈ సాంఘీక దురాచారాన్ని అంతం చేయడం కోసం దాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటిస్తూ చట్టం చేయాల్సిన అవసరం ముందుకు వచ్చిందన్నారు. “ఈ బిల్లు మన దేశ ఆడబిడ్డల న్యాయం, గౌరవానికి సంబంధించింది. మహిళల హక్కులు, సాధికారత కోసం దీన్ని తీసుకువస్తున్నాం. దీనికి మతం, కులంతో సంబంధం లేదు. దీన్ని రాజకీయ కోణంలో చూడకండి” అని వారు విపక్షాలను కోరారు.
          ప్రభుత్వాలు ప్రభుత్వాధినేతలు కొత్త చట్టాలను చేస్తున్నప్పుడు అనేక గొప్ప ఆదర్శాలను వల్లె వేస్తారు. కొందరిని బాధితులుగా చూపి వాళ్ళ భయాందోళనల్ని పోగొట్టి ఆదుకోవాల్సిన బాధ్యతను తక్షణ జాతీయ అవసరంగా చిత్రిస్తారు. నిజంగానే వాళ్ళు చెపుతున్న లక్ష్యాల కోసమే కొత్త చట్టాలను వినియోగిస్తారా? బాధితుల్ని నిజంగానే ఆదుకుంటారా? లేకుంటే ఇప్పుడు పైకి చెప్పని రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని దుర్వినియోగం చేస్తారా? అనేవి ప్రజలు ప్రతిపక్షాలు అడగాల్సిన సమంజసమైన ప్రశ్నలే.           ముస్లిం మహిళల గురించి అంతగా ఆవేదన చెందుతున్న ప్రధాని నరేంద్ర మోదీ కొత్త చట్టం ద్వార వాళ్ళకు కల్పిస్తున్న కొత్త ఆశ్వాసన ఏమిటీ? తక్షణ ముమ్మారు తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించి భర్తను మూడేళ్ళు  జైలుకు పంపించడంతో  చట్టం పని అయిపోతుంది. అప్పుడు ఆ భార్య వైవాహిక స్థానం (marital status) ఏమిటీ? తక్షణ ముమ్మారు తలాక్ చెల్లేదయితే ఆమె విడాకులు పొందిన మహిళ అవుతుంది. తక్షణ ముమ్మారు తలాక్ చెల్లకపోయేదయితే ఆమె వివాహిత మహిళ అవుతుంది.  అప్పుడు, తనే జైలుకు పంపిన భర్తకు మూడేళ్ళు బలవంతపు భార్యగా కొనసాగాల్సి వుంటుంది. దాపంత్య జీవితంలోలేని భర్తకు, తనను ఈసడించుకుంటున్న వ్యక్తికి ఒక మహిళ బలవంతంగా మూడేళ్ళు భార్యగా వుండాల్సిందేనా? అది ఆమె ప్రాధమిక హక్కులకు, ఆత్మగౌరవానికీ భంగం కాదా?  ఈ మూడేళ్ళు ఆమెకు జీవనాధారం ఏమిటీ? ఆమెకు పిల్లలుంటే వాళ్ళను ఎవరు సాకాలీ?  బాధితురాలు, ఆమె పిల్లల పోషణ కోసం ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక నిధినిగానీ పెన్షను పథకాన్నిగానీ ఏర్పాటు చేస్తుందా? మూడేళ్ళ తరువాత కారాగారం నుండి విడుదలై వచ్చిన భర్తతో ఆమె సంబంధాలు ఎలా వుండాలీ?  ఇవన్నీ సందేహాలే. వీటిల్లో ఒక్కదానికి కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.
          విడాకులనేవి కేవలం ముస్లిం సమాజంలో మాత్రమే కొనసాగుతున్న సాంప్రదాయం ఏమీకాదు. దేశంలోని అన్ని సమాజాల్లోనూ విడాకులు వున్నాయి. సంఖ్య రీత్య చూసుకున్నా, శాతం రీత్య చూసుకున్నా ముస్లింలకన్నా విడాకులు ముమ్మరంగా సాగుతున్న సమాజాలున్నాయి. ముస్లిం సమాజంలో విడాకులకు ధార్మిక సమర్ధన కూడ వుంది గాబట్టి వాటి గణాంకాలు కఛ్ఛితంగా వుంటాయి. ఇతర సమాజాల్లో లాంఛనంగా విడాకులు తీసుకోకుండానే అనధికారికంగా విడిపోతున్న దంపతుల సంఖ్య చాలా ఎక్కువగా వుంటోంది. పైగా, ముస్లిం మహిళలకు ఒక సౌలభ్యం కూడా వుంది. పునర్వివాహాలు, వితంతు పునర్వివాహాలు ముస్లిం సమాజంలో అతి సాధారణ విషయాలు. ఇతర సమాజాల్లో అదొక అసాధారణ వ్యవహారం. విడాకులు ఇచ్చిన ముస్లిమేరత భర్తల్ని వదిలేసి కేవలం ముస్లిం భర్తలనే శిక్షించ పూనుకోవడం మత వివక్ష కాదా? సాక్షాత్తు ప్రభుత్వమే మత వివక్షకు ఇంత బాహాటంగా పాల్పడవచ్చా?
          ఏనుగుకు కనిపించే దంతాలువేరు నమిలే దంతాలు వేరు అన్నట్టు  చట్టాలకు సంఘపరివారం చెప్పే కారణాలు వేరు సాధించ దలిచే లక్ష్యాలు వేరు.  ముస్లిం భర్తల్ని జైళ్లకు పంపి, ముస్లిం భార్యల్ని రోడ్ల మీద పడేసే పన్నాగం ఈ చట్టం వెనుక దాగి వుందని కొందరు వ్యక్తం చేస్తున్న  ఆందోళన కొట్టిపడేయదగ్గదేమీ కాదు.
          2016లో సుప్రీం కోర్టులో మొదలయిన ఈ  వివాదం పార్లమెంటులో చట్టంగా మారి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడ పడిన తరువాత మళ్ళీ సుప్రీం కోర్టుకు చేరింది. ముస్లిం మహిళ (వైవాహిక హక్కుల పరిరక్షణ) చట్టం – 2019 మీద  జమాతే ఉలేమా- ఏ- హింద్  లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు ఆగస్టు 23, 2019న విచారణకు స్వీకరించి, తన వాదనను వినిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నోటిసులు పంపింది. దానితో దేశవ్యాప్తంగా విడాకుల విధివిధానాల మీద మరో మారు ఒక విస్తృత చర్చకు తెర లేచింది.
          విడాకుల మీద లోతైన చర్చకు వెళ్ళడానికి ముందు ముస్లిం సమాజానికి చెందిన   కొన్ని మౌలిక అంశాల మీద ప్రాధమిక అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం వుంది. ఎందుకంటే ఇతర సమాజాలు  ఇస్లాం గురించి అర్థం చేసుకున్నది తక్కువ అపార్థం చేసుకుంటున్నది ఎక్కువ.

1.    ఇస్లాం సామాజిక విప్లవం.
          ప్రపంచ మతాలు  మూడింటిలో బౌధ్ధం, క్రైస్తవం కన్నా  కొత్తది కావడాన ఇస్లాంలో ఆధునిక భావాలు పుష్కలంగా కనిపిస్తాయి. విగ్రహారాధనను నిషేధించడంలో హేతువాద, నాస్తిక చింతనలు దర్శనమిస్తాయి. దేవుని ముందు మనుషులందరూ సమానులు; వాళ్ళందరూ సోదరులు అనే ఒక సామాజిక విప్లవ ప్రకటనతో ఇస్లాం ఆవిర్భవించింది.  ముస్లిం సమాజంలోని సౌభ్రాతృత్వం (మిల్లత్)కు  ఇది పునాది. వడ్డీ నిషేధం, “కార్మికుల వంటికి పట్టిన  చెమట ఆరిపోకముందే వారి కూలీని చెల్లించండి” “మీరు తినే ఆహారాన్నే పేదలకు పెట్టండి” మీరు ధరించే దుస్తులనే ఇతరులకు దానం చేయండి” “పేదల ఆకలిని తీర్చాల్సిన బాధ్యత సంపన్నులది” “స్త్రీ పురుషులు, పిల్లలు, ప్రతి ఒక్కరూ ధర్మ గ్రంధాలను చదివి తీరాలి”, ఆకలితో  ఉన్నవారికి ఆహారం ఇవ్వండి”అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని సందర్శించండి” ”ఎవరినైనా అన్యాయంగా నిర్బంధిస్తే ఆ బందీని విడిపించండి”అణచివేతకు గురౌతున్నవారు ముస్లింలు అయినా, ముస్లిమేతరులు అయినా వారికి సహాయం చేయండి” వంటి ఆదేశాలు ఒక కొత్త సమాజ సృష్టికి బీజాలేశాయి. 
స్త్రీలకు విద్య, ఆస్తి హక్కులతోపాటూ పునర్వివాహ హక్కును కూడా కల్పించి ఆర్ధిక, నైతిక, సాంస్కృతిక రంగాలన్నింటినీ ఇస్లాం ఏడవ శతాబ్దంలోనే విప్లవీకరించింది. ఇస్లాం ప్రభావంతో  మధ్యప్రాచ్యంలో విజ్ఞాన శాస్త్రాలు, వ్యాపార గణాంక శాస్త్రాలు వేగంగా అభివృధ్ధి చెందాయి. మరో మాటల్లో చెప్పాలంటే 18వ శతాబ్దపు ఆరంభంలో వాల్టైర్, రూసోలు రంగప్రవేశం చేసి ఫ్రెంచి విప్లవ కాలంలో “స్వేఛ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం” అని నినదించే వరకు  ప్రవక్త  ముహమ్మద్  సందేశాలే ఆధునిక భావనలుగా కొనసాగాయి అంటే అతిశయోక్తికాదు.

2.     వివాహం - విడాకులు  
స్త్రీపురుష సంబంధాల గురించి మాత్రమేగాక సంభోగం గురించి సహితం ఇస్లాం చాలా విపులంగా చర్చించింది. ముస్లిం వివాహం ఒక ఒప్పంద బంధం. ఆధునిక పరిభాషలో అగ్రిమెంట్ మ్యారేజ్. వివాహానికి వధువు అంగీకారాన్ని తప్పనిసరి చేయడం ఆ కాలంలో సామాన్యమయిన విషయం కాదు. ఇస్లాం ఆ పని చేసింది. విడాకుల హక్కుల గురించి ఇతర సమాజాలు ఆలోచించడం కూడా సాధ్యంకాని రోజుల్లో వివాహబంధం నుండి విడిపోవడానికి కూడా ఒక ప్రక్రియను ఇస్లాం రూపొందించింది. ఇతర సమాజాలు ఇరవయ్యవ శతాబ్దంలో అలాంటి హక్కుల కోసం పోరాడడం మనకందరికీ తెలుసు.   
ముస్లిం సమాజంలో వివాహబంధం నుండి విడిపోయే హక్కు భార్యా భర్తలు ఇద్దరికీ వుంటుంది. భర్త ఇచ్చే విడాకుల్ని తలాక్ అంటారు. భార్య ఇచ్చే విడాకుల్ని ఖులా అంటారు. పరస్పర అంగీకారంతో తీసుకునే విడాకుల్ని ముబారత్ అంటారు.
తలాక్ కు భార్య అంగీకారంతో పనిలేదు. భర్త ఏకపక్షంగా విడాకులు ఇవ్వవచ్చు. ఖులాకు భర్త అంగీకారం కూడా కావాలి. ఇదొక పరిమితి. అయితే, తనకు తలాక్ హక్కులు వుండాలని వివాహ సమయంలో ప్రత్యేకంగా కోరే  అవకాశం వధువుకు వుంటుంది. అలాంటి ప్రత్యేక హక్కులు పొందిన వధువు భర్త అంగీకారంతో పని లేకుండానే ఎప్పుడయినా విడాకులు ప్రకటించి వివాహ బంధాన్ని రద్దు చేసుకోవచ్చు.  
భారత ముస్లిం సమాజంలో ఇటీవలి కొత్త పరిణామం ఏమంటే భర్తలు ఇచ్చే విడాకుల (తలాక్) సంఖ్యకన్నా, భార్యలు ఇచ్చే విడాకుల (ఖులా) సంఖ్య ఎక్కువగా వుంటోంది.  హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన ఒక నమూన సర్వే ప్రకారం తలాక్ కేసుల కన్నా ఖులా కేసులు దాదాపు 50 శాతం ఎక్కువగా వుంటున్నాయట. 40 శాతం తలాక్ కేసులుంటే 60 శాతం ఖులా కేసులుంటున్నాయని దీని అర్థం. మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెరిగిన తరువాత వివాహ వ్యవసథలో వస్తున్న మార్పుగా దీన్ని భావించాల్సి వుంటుంది.

3.     తలాక్  ఒక సుదీర్ఘ ప్రక్రియ
ముస్లిం జీవన విధానానికి ప్రమాణాలు రెండు. మొదటిది; ఖురాన్ రెండోది; హదీస్.  ఖురాన్  అంటే సూరాలు, ఆయతులు. హదీస్ అంటే ప్రవక్త ముహమ్మద్ ప్రవచనాలు, వారి జీవిత ఆచరణ.
పై రెండు ప్రాణప్రద ప్రమాణాల ప్రకారం ముస్లిం దాంపత్య జీవితంలో విడాకుల వ్యవహారం సుదీర్ఘ కాలం సాగాల్సిన ప్రక్రియ. ఇందులో అనేక దశలున్నాయి. భార్యా భర్తల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తడంతో ఈ ప్రక్రియ ఆరంభం అవుతుంది. మనస్పర్ధలు అనేవి ఏ రంగంలో నుండయినా తలెత్త వచ్చు. ధార్మిక, ఆర్ధిక, కామ, నైతిక, సాంస్కృతిక, ఉపాధి, రాజకీయ, కుటుంబ వ్యవహారాలు, అభిరుచులు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ  ….  మరేదయినా కావచ్చు.      
విడాకులను ప్రధాన కథాంశంగా తీసిన అస్గర్ ఫర్హాది 2012 ఆస్కార్ పురస్కార పర్షియన్ సినిమా  జుదాయి (Separation). తన పిల్లలు ఇరాన్ వంటి ‘ఉద్రిక్త’ సామాజిక వాతావరణంలో కాకుండా అమేరిక వంటి ‘ప్రజాస్వామిక’ వాతావరణంలో పెరగాలని భార్య ఆశిస్తుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రిని రోడ్డు మీద వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళడం తప్పు అని భర్త భావిస్తాడు.  భార్యాభర్తల మధ్య అనేక రాత్రుళ్ళు ఈ విషయమై చర్చలు జరుగుతాయి. ఎవ్వరూ తమ అభిప్రాయాలను మార్చుకోవడానికి సిధ్ధపడరు. ఇక ఏకాభిప్రాయం కుదరదని నిర్ణయించుకున్నాక ఇద్దరూ వెళ్ళి ఖాజీకి విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడంతో  ‘జుదాయి’ సినిమా ఆరంభం అవుతుంది.
మనస్పర్ధలు, బేధాభిప్రాయాలు మొదలవ్వగానే  మొదటి దశలో భార్యభర్తలు ఇద్దరూ కూర్చొని తమ అసంతృప్తికి కారణాలను పరస్పరం చెప్పుకోవాలి. తీరు మార్చుకోమని కోరాలి. సమస్య భార్యా భర్తల మధ్య పరిష్కారం కానప్పుడు రెండో దశలో ఇరు కుటుంబాల  పెద్దల సమక్షంలో  పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే మూడవ దశలో విడాకుల సన్నాహాలు మొదలెట్టాలి.  భార్యకు భర్త గానీ తద్విరుధ్ధంగాగానీ తొలి తలాక్ ప్రకటించడంతో మూడు నెలల ఇద్దత్ గడువు ( భార్యకు మూడు బహిష్టుల కాలం) మొదలవుతుంది.  
భార్యాభర్తల మధ్య కేవలం ద్వేషభావం మాత్రమే వుంటుందనుకోవడం ఒక తప్పుడు అభిప్రాయం. వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు సహితం వుంటాయి. ద్వేషభావం బలంగా వున్నప్పుడు ఒక ఉద్రేకంలో తలాక్ చెప్పేసినా తరువాతి కాలంలో ప్రేమానురాగాలు గుర్తుకు వచ్చి మనసు మార్చుకునే అవకాశం దంపతులకు వుంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి  తలాక్ ను ప్రకటించిన తరువాత  కూడ భార్యాభర్తలు ఒకే ఇంట్లో వుండాలనే నియమం వుంది. నెల తిరక్కుండానే  తలాక్ ను ఉపసంహరించుకోవచ్చు. లేదా రెండో నెల ఆరంభంలో రెండోసారి తలాక్ చెప్పవచ్చు. ఏ క్షణాన్నయినా తలాక్ ను ఉపసంహరించుకునే అవకాశం మూడు నెలల వరకు వుంటుంది.  మూడు నెలల ఇద్దత్ గడువు పూర్తయిన తరువాత కూడ మనసు మార్చుకోకపోతే మూడోసారి తలాక్ చెప్పవచ్చు. దానితో విడాకులు ఖాయం అయిపోయినట్టు.
ఇద్దత్ గడువు ముగిసే నాటికి భార్య గర్భవతి అని తేలితే విడాకుల వ్యవహారం వాయిదా పడిపోతుంది. పుట్టబోయే శిశువుకు భర్త తండ్రి బాధ్యతల్ని నెరవేర్చాల్సి వుంటుంది.  
ముస్లిం వివాహాల్లో వరునికి వధువు కట్నం ఇచ్చే సాంప్రదాయం లేదు.   పెళ్లి సమయంలో వరుడే వధువుకు ‘మహర్’ (భరణం) ప్రకటిస్తాడు. భార్యకు భర్త ప్రకటిత మహర్ ను సంపూర్ణంగా చెల్లించడంతో విడాకుల ప్రక్రియ పూర్తి అవుతుంది.
విడాకుల కోసం ఇంతటి సుదీర్ఘ ప్రజాస్వామిక ప్రక్రియను మరే ఇతర సమాజాల్లోనూ చూడలేము. ముస్లిం సాంప్రదాయంలో వీటిని  ‘తలాక్- ఏ – అహసన్’ ‘తలాక్ – ఏ - హస్సన్’ పేర్లతో పిలుస్తారు. ఈ రెండు తలాక్ ప్రక్రియలూ ఖురాన్, హదీసుల ప్రకారం ఆమోద యోగ్యమైనవి.  సమాజంలో మరే బంధంకన్నా భార్యాభర్తల బంధం ధృఢమైనది. భార్యాభర్తలు జీవిత భాగస్వాములు. నిజానికి విడాకులకు మరింత సుదీర్ఘ ప్రక్రియ అవసరమని ఖలీఫాలు భావించిన సందర్భాలున్నాయి. విడాకుల ప్రక్రియను నాలుగయిదు  నెలలకు కుదించడానికి రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ ఫారూఖ్ ఒప్పుకోలేదట. “సహనం వహించాల్సిన చోటే మీరు తొందర పడుతున్నారు” అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారట.

4.      నడమంత్రపు విడాకులు
వెయ్యేళ్ళ క్రితం   ఇప్పటి సిరియా, టర్కి   ప్రాంతాల్ని పాలించిన ఉమయ్యాద్ వంశీకులు ముస్లిం వివాహ వ్యవస్థలో  తప్పుడు సాంప్రదాయాలను ప్రవేశపెట్టారు. విలాసాలకు అలవాటుపడిన ఆ చక్రవర్తులు అనేక మంది స్త్రీలను వివాహమాడేవారు. ఇస్లాం బహుభార్యత్వాన్ని ఆమోదిస్తున్నప్పటికీ దానికీ కొన్ని పరిధి పరిమితులున్నాయి. మరోవైపు, వివాహం చేసుకోకుండా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం మీద నిషేధం వుంది. వివాహేతర లైంగిక సంబంధాన్ని ఇస్లాం చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తుంది. ఈ నియమాలకు భంగం కలగకుండ  కొత్త వారిని వివాహం చేసుకోవడానికి వీలుగా పాత భార్యలను వేగంగా వదిలించుకోవడానికి వాళ్ళు ఒక వినూత్న విడాకుల విధానాన్ని కనిపెట్టారు.   
విడాకుల ప్రక్రియలో భార్యాభర్తల సంప్రదింపుల్ని, బంధుమిత్రుల హితోక్తుల్ని, మూడు నెలల ఇద్దత్  గడువును రద్దు చేసి తలాక్ –ఏ- బిద్దత్ అనే ఒక కుత్రిమ  విడాకుల విధానాన్ని సృష్టించారు. పర్షియన్, అరబ్బీ భాషల్లో బిద్దత్ అంటే సృజనాత్మకత, కుత్రిమ, సృష్టి, తక్షణం వంటి అర్థాలున్నాయి. ఒక్క గుక్కలో మూడుసార్లు తలాక్  చెప్పేస్తే ఆ క్షణం విడాకులు అయిపోయినట్టేనని తలాక్ –ఏ- బిద్దత్ అంటుంది. దీనినే ఇప్పుడు ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్,  తక్షణ ముమ్మారు తలాక్ అనే పేర్లతో పిలుస్తున్నారు.  
స్త్రీలోలురైన కొందరు చక్రవర్తులు కుత్రిమంగా సృష్టించిన తలాక్ –ఏ- బిద్దత్ కు ఇస్లాంలో ఎన్నడూ ధార్మిక సమర్ధన లేదు. ఇది ఖురాన్, హదీస్ రెండింటికీ వ్యతిరేకం.  పాకిస్తాన్ తో సహా దాదపు 22 ముస్లిం దేశాలు తలాక్ –ఏ- బిద్దత్ ను చెల్లదని ప్రకటించాయి.  

5.    టెకీ తలాకులు
సమాచార సాంకేతిక (ఐటి) విప్లవం యువతరంలో రెండు పెడధోరణులకు బాటలేసింది. సాప్ట్ వేర్  ఇంజినీరింగ్ చదివి ఉద్యోగాలు రానివారు తీవ్ర నిరాశలో మునిగిపోతుంటే, ఉద్యోగాలు పొందిన వాళ్ళు  అతిశయంలో  జీవిస్తున్నారు. ఈ అతిశయం వైవాహిక వ్యవస్థాను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. నేటి ‘జియో’తరం ముస్లిం యువకులు స్మార్ట్ ఫోన్  ల ద్వార, ఎస్ ఎమ్ ఎస్, ఎమ్ ఎమ్ ఎస్‍, ఈమెయిల్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్,  వీడియో కాల్ వగయిరాల ద్వార తక్షణ ముమ్మారు తలాకులు చెప్పడం మొదలెట్టారు. 2017 తరువాత దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు దాదాపు 550 నమోదయ్యాయి.

6.    ముస్లిం ధార్మిక సంస్థల తప్పిదం
మనది అసమాన సమాజం. ఇప్పటికీ ఎక్కువ మంది గృహిణులు ఆర్థిక వ్యవహారాల్లో భర్తల మీదనే ఆధారపడి జీవిస్తుంటారు. విడాకులవల్ల వాళ్ళు దాంపత్య జీవితంలోనేగాక ఆర్ధిక ఆలంబనలోనూ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. తలాక్- ఏ- బిద్దత్ విడాకుల వ్యహారాన్ని ముస్లిం ధార్మిక సంస్థలు తేలిగ్గా తీసుకున్నాయి. విడాకుల బాధితులయిన మహిళల పక్షాన నిలబడాల్సిన సామాజిక బాధ్యతను వాళ్ళు సకాలంలో గుర్తించలేదు.      ధార్మిక సంస్థల పెద్దల్లో ఎక్కువ మంది పురుషాధిక్య భావజాలాన్ని కలిగి వుంటారు. భార్యాభర్తల వివాదాలను పరిష్కరించాల్సి వచ్చినపుడు వాళ్ళు పురుష పక్షపాతంతో వ్యవహరిస్తు తీర్పులు చెపుతుంటారు. ఇస్లాం జీవన విధానంలోని అనేక ప్రగతిశీల అంశాలను ఈ మతపెద్దలు తమ పురుషాధిక్య తప్పుడు భావజాలంతో చిదిమేస్తుంటారు. సమీప గతంలో వీరి పురుషాధిక్య భావజాలం 1986లో బయటపడింది.
మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ఒక ముస్లిం వ్యాపారి తన 62 ఏళ్ళ భార్య, ఐదుగురు పిల్లల తల్లి అయిన  షాబానో కు విడాకులిచ్చాడు. ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించగా షాబాను భర్త నెలకు 179 రూపాయల చొప్పున మనోవర్తి చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.  ఆరోజుల్లో కూడ నెలకు 179 రూపాయలు అనేది చాలా చిన్న మొత్తమే. నిజానికి ముస్లిం సమాజం ఆ నెలసరి మనోవర్తి మొత్తాన్ని పెంచాలని ఆందోళన చేసి వుండాల్సింది. కానీ అలా జరగలేదు. అందుకు పూర్తి విరుధ్ధంగా జరిగింది.  ఇద్దత్ గడువు పూర్తయిన తరువాత భర్త పరాయి పురుషుడు అయిపోతాడని ముస్లిం మతాచార్యులు కొత్త భాష్యాలు చెప్పారు. ఒక మహిళ పరాయి పురుషుని నుండి  ఆర్థిక సహాయాన్ని పొందడాన్ని ముస్లిం ధార్మిక విలువలు అంగీకరించవని అడ్డంగా వాదించారు.
అప్పట్లో మత ఓటు బ్యాంకు ప్రయోజనాలను ఆస్వాదిస్తున్న ప్రధాని రాజీవ్ గాంధి ముస్లిం ఛాందసుల వాదం వైపు మొగ్గు చూపించారు.  విడాకులు పొందిన ముస్లిం మహిళలు మనోవర్తి తీసుకోవడానికి వీలు లేకుండ ముస్లిం మహిళల (విడాకు హక్కుల పరిరక్షణ) చట్టం – 1986ను తెచ్చారు. ఇలాంటి ధోరణులవల్ల యువతరానికి ముఖ్యంగా మహిళలకు ధార్మిక పెద్దల మీద నమ్మకం తగ్గిపోతూ వుంటుంది.
ముస్లింల పౌర స్మృతిని షరియత్ అంటారు. ఇది దాదాపు 7వ శతాబ్దంలో రూపుదిద్దుకుంది. అప్పటికి స్మార్ట్ ఫోన్లు  లేవు.  స్మార్ట్ ఫోన్, వీడియో ఛాట్ విడాకులు ఇస్లాం వ్యతిరేకం అని చెప్పడానికి  ఈ ఒక్క అంశం చాలు. దానికి పెద్ద పరిశోధనలు అక్కర లేదు. అయినప్పటికీ ముస్లిం మతాచార్యులు మౌన ప్రేక్షకులుగా వుండిపోయారు. ప్రభుత్వం తమ పౌర స్మృతిలో జోక్యం చేసుకోదనే అతి విశ్వాసంలో వాళ్ళు వుండిపోయారు.
జమాత్ ఏ ఇస్లాం, జమాత్ ఏ ఉలేమా ఏ హింద్ వంటి ఒకటి రెండు జమాత్ లకు తప్ప దేశంలోని ఇతర ముస్లిం జమాత్ లకు సామాజిక రాజకీయ అంశాలు అస్సలు పట్టవు. ధార్మిక జీవితమే (దీన్ దారి) సర్వస్వం  అనే భ్రమల్లో వాళ్ళు బతుకుతుంటారు. సామాజిక రాజకీయ పరిణామాలను (దునియాదారీ) పట్టించుకోకపోతే ఒకరోజు తమ ధార్మిక జీవితానికి కూడా ముప్పు వస్తుందన్న సోయి కూడ వాళ్ళకు వుండదు.
ఉన్నతమైన అనేక ఇస్లామిక్ వివాహ సాంప్రదాయాలు వేటినీ ఈ తరం యువకులు పాటించరు.  పెద్ద ఎత్తున కట్నకానుకలు కావాలని కోరుతారు.  విలాసంగా పెళ్ళి విందు జరపాలని కోరుతారు. కానీ విడాకుల విషయం రాగానే మతంలో ఎక్కడో ఓ మూలన తుప్పుపట్టి పడివున్న తలాక్ –ఏ- బిద్దత్ ను బయటికి తీస్తారు. ఇది పచ్చి అవకాశవాదం. మహర్  విషయంలోనూ వీరిది అవకాశవాదమే. లక్షల రూపాయలు కట్నకానుకలు తీసుకుని చేసుకునే పెళ్ళిలో మహర్ ను మాత్రం సాంప్రదాయం ముసుగులో  వందలు, వేలకు మాత్రమే పరిమితం చేస్తారు. ఈ వివాహాలూ ఇస్లాం వ్యతిరేకమైనవే, ఈ విడాకులూ ఇస్లాం వ్యతిరేకమైనవే. 
స్మార్ట్ ఫోన్ విడాకుల వ్యవహారం తమ దృష్టికి రాగానే వాటిని ఇస్లాం వ్యతిరేకమని నిర్ద్వందంగా పేర్కొంటూ జమాతులు తక్షణం ఫత్వాలు (ప్రకటనలు) జారీ చేసుంటే బాగుండేది. వాళ్లు ఆ పని చేయకుండా నిర్లిప్తంగా వుండిపోయారు. ఒక మహా చారిత్రక అపచారం చేశారు. మొత్తం భారత ముస్లిం సమాజాన్ని రక్షణాత్మక స్థితిలోనికి నెట్టేశారు. ముస్లింలను వేధించడానికి సంఘపరివారంకు కొత్త అవకాశలు కల్పించారు. ఈ పాపం నిస్సందేహంగా ముస్లిం జమాతులదే.

7.    ముస్లిం (పౌరస్మృతి) పర్సనల్ లా
ముస్లిం సమాజంలో వివాహ, వారసత్వ, వితరణ (వక్ఫ్) తదితర వ్యవహారాల్లో తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి మన దేశంలో 13వ శతాబ్దం ఆరంభం నుండి కొన్ని ప్రత్యేక న్యాయస్థానాలు వెలిసాయి. బానిస వంశస్తుల పాలన కాలంలోనే ముఫ్తీల పర్యవేక్షణలో ఈ ధర్మపీఠాలు నడిచేవి.  ఇది మొఘల్ చక్రవర్తుల వరకు సాగింది. 1757లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొదలయ్యాక కొత్త శిక్షా స్మృతి వచ్చింది. అయితే, భిన్నత్వంలోనూ బహుళత్వం కలిగిన భారత సాంస్కృతిక జీవనంలోనికి జోక్యం చేసుకోవడం అంత సులువైన వ్యవహారం కాదని కంపెనీ పాలకులకు మొదట్లోనే తెలిసిపోయింది.  1773 నాటి రెగ్యులేషన్ చట్టం కూడ పౌరస్మృతుల్ని ఆయా సమూహాల అంతర్గత వ్యవహారంగా వదిలేసింది. 1930వ దశకం చివర్లో వైశ్రాయిగా వున్న ద మార్క్వీజ్ ఆఫ్ లింలిత్ గోవ్ ముస్లిం పౌరస్మృతికి చట్టబధ్ధ పరిరక్షణ కల్పించాలనుకున్నాడు.  అలా ద ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్ - 1937 అమల్లోనికి వచ్చింది. ఆయన కాలంలోనే ద డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్1939 కూడ వచ్చింది.           స్వాతంత్ర్యానంతరం కూడ ఈ రెండు చట్టాలు యధతథంగా కొనసాగాయి. 1986లో అదనంగా ముస్లిం మహిళల (విడాకు హక్కుల పరిరక్షణ) చట్టం వచ్చి చేరింది.
ముస్లిం వివాహిత మహిళ తన వివాహాన్ని రద్దు చేసుకోవడం కోసం న్యాయస్థానం నుండి అనుమతి (Decree) పొందడానికి ప్రాతిపదిక అయిన 12 అంశాలను ద డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ – 1939లో పొందు పరిచారు. అయితే, ముస్లిం వివాహిత పురుషుడు తన వివాహాన్ని రద్దు చేసుకోవడం కోసం న్యాయస్థానం అనుమతి పొందడానికి ప్రాతిపదికను ఈ చట్టంలో పేర్కొనలేదు. అందుచేత, సాంప్రదాయ పధ్ధతిలో ‘తలాక్- ఏ – అహసన్’ ‘తలాక్ – ఏ - హస్సన్’ పధ్ధతుల్లో విడాకులు కోరడం తప్ప ముస్లిం పురుషులకు మరో మార్గం లేకుండాపోయింది. అలా కాకుండ  ద డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ – 1939లో “మహిళ” అని పేర్కొన్న చోట “దంపతుల్లో ఏ ఒక్కరయినా (spouse)” అని చేర్చి వుంటే ముస్లిం భర్తలు సహితం చట్టబధ్ధంగా విడాకులు తీసుకోవడానికి వీలుండేది. పాత చట్టంలో ఆ ఒక్క మాట ను సవరిస్తే సరిపోయేదానికి  భూమ్యాకాశాలను ఏకం చేసి కొత్త చట్టం చేయడం దేనికీ?

8.    సుప్రీం కోర్టు దృష్టిలో తలాక్
షాయరా బానో కేసులో ఆఫ్రీన్ రహమాన్, గుల్షన్ పర్వీన్, ఇష్రత్ జహా, అతియా సాబ్రీ అనే తక్షణ ముమ్మారు తలాక్ బాధిత మహిళలు మరో నలుగురు చేరారు. దాదాపు ఏడాదిన్నర సాగిన ఈ కేసు విచారణలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేక 2017 ఆగస్టు 22న 3:2తో విభజిత తీర్పు చెప్పింది.
జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్, జస్టిస్ యూ యూ లలిత్, జస్టిస్ కురియన్ లతో కూడిన మెజారిటీ న్యాయమూర్తులు ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ గా పిలవబడే తలాక్ –ఏ- బిద్దత్  చెల్లదని చెప్పారు. ఇందులో ఇద్దరు జడ్జీలు ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్  ను  చట్ట విరుధ్ధం, రాజ్యాంగ విరుధ్ధం అని పేర్కొనగా, మూడవ జడ్జీ మాత్రం ఇది  ఇస్లాం సాంప్రదాయానికే విరుధ్ధం గనుక చెల్లదన్నారు.
మెజారిటీ తీర్పుతో విభేదించిన ఇద్దరిలో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ తో పాటు జస్టిస్ ఎస్ అబ్దుల నజీర్ వున్నారు. ఒక సమూహంలో దాదాపు వెయ్యేళ్ళుగా కొనసాగుతున్న ఒక ధార్మిక సాంప్రదాయాన్ని న్యాయస్థానాలు తప్పు పట్టవచ్చునా? అనే సందేహాన్ని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ వ్యక్తం చేశారు. పౌర సాంప్రదాయాల్లో న్యాయస్థానాల జోక్యాన్ని ద ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్ – 1937 నిరోధిస్తున్నదని వారు గుర్తు చేశారు.  పౌరులు మత విశ్వాసాలు కలిగి వుండడానికీ, ఆచరించడానికీ, ప్రచారం చేసుకోడానికి రాజ్యాంగంలోని 25 (1) అధీకరణ హక్కును కల్పిస్తున్నపుడు వాటి మంచిచెడుల్ని విశ్లేషించే అధికారం  న్యాయస్థానాలకు వుండదు అనే  అభిప్రాయాన్ని కూడ వారు వ్యక్తం చేశారు.  అయితే, పాత చట్టాలను సవరించే అవకాశం పార్లమెంటుకు వుంటుందని గనుక ప్రభుత్వం ఆలాంటి  ఒక కొత్త చట్టాన్ని రూపొందించుకోవచ్చని సూచించారు.
మరో సందర్భంలోనూ సుప్రీం కోర్టు ధర్మాసనం విడాకుల మీద అనేక విలువైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. మరొకరి భార్యతో  ఇష్టపూర్వకంగా అయినాసరే వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన పురుషుల్ని శిక్షించే ఐపిసి 497ను  2018 సెప్టెంబరు 27న ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా విడాకుల అంశం చర్చకు వచ్చింది. “వివాహేతర లైంగిక సంబంధాన్ని నేరపూరిత చర్య అనలేము. మహా అయితే అదొక పౌర తప్పిదం మాత్రమే అవుతుంది. పౌర తప్పిదాలకు పౌర పరిష్కారంగా విడాకులు ఎలాగూ వున్నాయి.  ఇక శిక్షలు దేనికీ? వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నంత మాత్రాన ఒక వ్యక్తిని ఐదేళ్ళు జైలుకు పంపడం ఇంగితజ్ఞానంతో కూడిన చర్య అనిపించుకోదు” అని సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఘాటుగా అన్నారు.  ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యల్లో మూడు ప్రాణప్రద అంశాలున్నాయి. మొదటిది, వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకోవడం జైలుకు పంపాల్సినంత నేరం కాదు. రెండోది;  పౌర తప్పిదాలకు పౌర పరిష్కారంగా విడాకులు వున్నాయి. మూడోది; విడాకుల సౌకర్యాన్ని వాడుకోవడం నేరం కాదు.       సుప్రీం కోర్టు ఒక పౌరవ్యవహారంగా  నిర్వచించిన విడాకుల్ని కేంద్ర ప్రభుత్వం ఒక నేరపూరిత చర్యగా పరిగణిస్తు చట్టం తేవడమే  ఒక వైచిత్రి.  ముస్లిం మహిళ (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లు – 2019 మీద జమాతే ఉలేమా ఏ హింద్ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సందర్భంగా ముగ్గురు సభ్యుల ధర్మాసనంలోని జస్టిస్ ఎన్ వి రమణ “న్యాయస్థానం చెడ్డదిగా ప్రకటించిన ఒక చర్యను పార్లమెంటు నేరంగా ప్రకటించ వచ్చునా?” అని ఒక సందేహాన్ని వెలుబుచ్చారు. ధర్మాసనం సందేహం ఎక్కడికి దారి తీస్తుందో భవిష్యత్తు చెప్పాలి.
(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్) మొబైలు : 9010757776
రచన : 25 ఆగస్టు 2019
ప్రచురణ : వీక్షణం మాస పత్రిక, సెప్టెంబరు, 2019

No comments:

Post a Comment