ప్రేమాస్పదుడు – వివాదాస్పదుడు
డానీ
కోడెల శివప్రసాదరావు చనిపోయారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెపుతున్నట్టు హైదరాబాద్
వెస్ట్ డిసిపి వెళ్ళడించారు. పోస్ట్ మార్టెం నివేదిక వస్తేగానీ కోడెల మృతి వివరాలు స్పష్టం కావు.
కోడెల శివప్రసాదరావు ఒకరు కాదు ఇద్దరని సన్నిహితులు
అంటుంటారు. వైద్యునిగా వారు రోగులకు గొప్ప ప్రేమాస్పదులు; రాజకీయాల్లో అత్యంత వివాస్పదులు.
కోడెల బాల్యంలోనే ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు
తమ్ముళ్లు స్మాల్ పాక్స్‌తో ఓ వారం వ్యవధిలో చనిపోయారు. ఆ సంఘటన శివప్రసాద రావును
కలచివేసిందనీ దాని ప్రభావంతోనే ఆయన కసిగా వైద్య విద్యను చదివారని అంటారు. కర్నూలు,
గుంటూరు, వారణాసీల్లో వైద్యవిద్యను అభ్యసించిన కోడెల నరసారావుపేటలో సర్జన్ గా స్థిర పడ్డారు. శివప్రసాదరావు స్కాల్పెల్
బ్లేడు పట్టుకుంటే శస్త్ర చికిత్స విజయవంతం అయినట్టేనని జనం చెప్పుకునేవారు. ఆయన హస్తవాసి
గురించి నరసారావుపేట పరిసరాల్లో కథలు కథలు వినిపించేవి.
ఎన్ టీ రామారావు 1982లో తెలుగు దేశం పార్టిని
పెట్టినప్పటి నుండీ కోడెల అందులో చురుకైన కార్యకర్తగా వున్నారు. వైద్యరంగంలో కోడెలకున్న మంచి పేరును చూసిన ఎన్టీఆర్ ఆయన్ను పిలిచి
టిక్కెట్టు ఇచ్చారని అంటారు. రాజకీయాల్లో ప్రవేశించాక కోడెల శివప్రసాద్ క్యారెక్టర్
మారిపోయింది. డాక్టరుగా స్కాల్పెల్ బ్లేడు వాడినంత నైపుణ్యం వారికి కత్తులు, కఠార్లు
తిప్పడంలోనూ వుండేదని అనేక కథనాలు ప్రచారంలోనికి వచ్చాయి.
అప్పట్లో నరసారావుపేట నియోజకవర్గం కమ్మ-రెడ్డి
సామాజికవర్గాల కుమ్ములాటలకు నిలయంగా వుండేది. సరసారావుపేట పరిసరాల్లో అనేక ఫ్యాక్షన్
గ్రామాలుండేవి. బాంబు దాడులు హత్యల సంస్కృతి కొనసాగేది. కోడెల కమ్మ
సామాజికవర్గానికి రాజకీయ ప్రతినిధిగా వుండేవారు. క్రమంగా ఆయన కూడ ఫ్యాక్షన్ నాయకుడనే
ముద్రను వేయించుకున్నారు. ఆయన ఇంటి పెరట్లోనే బాంబుల గిడ్డంగి వుండేదని ఒక స్దశలో పెద్ద ప్రచారం సాగింది. కోడెల 1987-88లలో రాష్ట్ర హొం
మంత్రిగా వున్నారు. ఆ కాలంలో మరీ వివాదాస్పదుడిగా వున్నారు. ఆయన ఇంటి పెరట్ళోనే బాంబులు పేలి నలుగురు చనిపోయిన సంఘటన అప్పట్లో రాజకీయ రంగంలో
పెద్ద దుమారం రేపింది. కోడెల హోంమంత్రిగా వున్న
కాలంలోనే ఆయన మీద ఒకసారి బాంబుదాడి జరిగింది. ఇంకోసారి యాసిడ్ దాడి జరిగింది. ఆ దాడుల్లో
వారు స్వల్ప గాయాలతో తప్పించుకోగలిగారు. టిడిపిలో ఆయన ఎన్టీఆర్ కు, చంద్రబాబుకూ ఆయా
దశల్లో అత్యంత సన్నిహితులుగా వున్నారు. ఎన్టీ రామారావు హయాంలో పంచాయితీ రాజ్, నీటి
పారుదల శాల మంత్రిగానూ ఆయన పనిచేశారు.
1988 డిసెంబరు 26న విజయవాడలో వంగవీటి మోహన
రంగా హత్య జరిగినపుడు కోడెల శివప్రసాదరావే రాష్ట్ర హోంమంత్రిగా వున్నారు. ఎన్టీ రామారావు,
కోడెల శివప్రసాద్ కుట్ర చేసి రంగాను హత్య చేసినట్టు కాపు సామాజికవర్గం నేతలు తీవ్ర
ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు ఆయన రాజకీయ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయలేదు.
1983 నుండి 1999 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఐదు శాసన సభ ఎన్నికల్లోనూ కోడెల నరసారావుపేట
నియోజకవర్గం నుండి వరుస ఘనవిజయాలు సాధించారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి గాలి బలంగా
వీచిన 2004, 2009 ఎన్నికల్లో ఆయన వరుస పరాజయాలను చవిచూశారు.
రాజకీయాల్లో కోడెల ప్రత్యర్ధుల మీద ఒంటికాలితో
లేచేవారు. ఎలాంటి సంకోచము లేకుండా తీవ్ర ఆరోపణలు చేసేవారు. రెండు శరీరాలు ఒకే ఆత్మలా
కొనసాగిన వైయస్ రాజశేఖర రెడ్డి, కేవిపి రామచంద్రరావుల
మీద తరచూ విరుచుకుపడేవారు. ఒక సారి ఆయన వైయస్ అర్ ను జయలలితతోనూ, కేవీపిని శశికళతోనూ
పోల్చడంతో పెద్ద దుమారం రేగింది. ఆ తరువాత వైయస్ కక్షగట్టి తనను వేధించారని కోడెల అనేవారు. వైయస్ హయాంలోనే కోడేల భూముల్ని స్వాధినం చేసుకోవడానికి
రాష్ట్ర ప్రభుత్వం నోటిసులు పంపింది. ఆయితే ఆ కేసు చివరకు న్యాయస్థానాల్లో నిలవలేదు.
కోడెలకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
2014 ఎన్నికల్లో నరసారావుపేటను వదిలి సత్తెనపల్లీ నియోజకవర్గానికి మారిన కోడెలకు విజయం
దక్కింది. కొత్త రాష్టపు కొత్త ప్రభుత్వంలో సహజంగానే ఆయన పంత్రి పదవిని ఆశించారు. గానీ
చంద్రబాబు ఆయన్ని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. “ప్లేయర్ కావలసినవాడిని ఆపైర్ గా
మార్చారు” అని కోడెల కొంచెం నొచ్చుకున్నారని అంటారు.
శాసన సభ స్పీకర్ గా కోడెల హుందాగా వ్యవహరించలేదనే
విమర్శలున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి మీద కసిని ఆయన కుమారుడు వైయస్ జగన్ మీద తీర్చుకున్నారని
పిస్తుంది. హోం మంత్రిగా విపక్షాల మీద ఒంటి కాలు మీద లేచినట్లే స్పీకర్ గానూ ప్రతిపక్షం
మీద ఇంటికాలి మీద లేచేవారు. కోడెల వ్యవహార శైలివల్లే వైయస్ జగన్ శాసన సభ సమావేశాలకు
దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారు.
రాష్ట్రంలో
తెలుగు దేశం పతనం కోడెలతోనే ఆరంభం అయిందంటే అతిశయోక్తికాదు. సత్తెనపల్లి నియోజకవర్గంలో
పార్టి అధికార ప్రతినిధి అంబటి రాంబాబును రంగంలోనికి దింపింది వైయస్సార్ సిపి. నరసారావు
పేటలో రెడ్డి సామాజికవర్గం కోడెలకు వ్యతిరేకంగా ఏకం అయినట్టే సత్తెనపల్లి నియోజకవర్గంలో
కాపు సామాజికవర్గం ఆయనకు వ్యతిరేకంగా ఏకం అయింది. పోలింగు రోజు రాజుపాలెం మండలం ఇనిమెట్ల
గ్రామ పోలింగ్ బూతుకు ఓట్ల సరళిని పరిశీలించడానికి వెళ్ళిన కోడెల మీద స్థానికులు దాడి చేశారు. ఒక గదిలో ఆయన్ను
బంధించి వేశారు. చేయి చేసుకున్నారు. ఆ కుమ్ములాటలో
కోడెల చొక్కా కూడ చిరిగిపోయింది. ఓ పదేళ్ళ
క్రితం వరకు తాను గడగడలాడించిన పల్నాడు ప్రాంతంలోనే తనకు ఇంతటి పరాభవం జరుగుతుందని కోడెల కలలో కూడ ఊహించి
వుండరు. ఎన్నికల పండితులు ఆరోజే చెప్పేశారు టిడిపి చిత్తుగా ఓడిపోయి వైసిపి ఘనవిజయాన్ని
సాధిస్తుందని. అదే జరిగింది.
అసెంబ్లీలో ఫర్నిచర్ మాయం కేసు కోడెల మెడకు ఎంతగా చుట్టుకుందోగానీ
ఆయన పరువును మాత్రం నరసారావుపేట మురుగుకాలవలో పడేసింది. అసెంబ్లీ స్పీకరుగా ఐదేళ్ళు పని చేసిన వ్యక్తి మీద
ఫర్నిచరు దొంగతనం కేసు రావడం చాలా ఇబ్బందికర వ్యవహారమే. అసెంబ్లీ అధికారులు కోడెల ఇంటిని
సోదా చేసేందుకు రావడానికి కొద్ది నిముషాల ముందు ఆయన ఇంటిలోని రెండు కంప్యూటర్లను దుండగులు
ఎత్తుకు పోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది.
మరోవైపు, గుంటూరు నగరంలో కోడెల కొడుకుకు చెందిన బైక్స్ షోరో రూమ్ ఇంకో పెద్ద
వివాదంలో ఇరుక్కుంది. కొత్త వాహనాలకు టిఆర్ లేకుండానే అమ్ముతున్నారనే అభియోగం మీద ఆ
షోరూమును రవాణాశాఖ అధికారులు తాళం వేశారు.
ఈలోగా ఇంకో స్కామ్ జరిగిందనే వార్తలు గుప్పుమన్నాయి. అసెంబ్లీలోనూ, స్పీకర్ కొడుకు షోరూమ్ లోనూ ఓకె రకం
ఫర్నిచర్, ఏసీ మిషిన్లు వుండడం ఈ అనుమానాలకు తావిచ్చింది. ఇదిలా వుండగా ఆరోగ్యశ్రీ జాబితాలో పెడతాననీ కోడెల కుమార్తె విజయలక్ష్మీ
ఒక నర్సింగ్ హోమ్ నిర్వహకుల వద్ద నాలుగు లక్షల రూపాయలు లంచంగా తీసుకుని మోసం చేశారని
420 కేసు నమోదయింది. తననూ తన సంతానాన్ని సహితం కేసులు చుట్టుముట్టి వీధుల్లోనికి లాగడంతో
కోడెల హతాశులైపోయారు. తెలుగు దేశం పార్టి, నాయకులు సహితం తనకు నైతిక మద్దతు నివ్వడానికి ముందుకు రాకపోవడంతో
కోడెల మానసికంగా కుంగిపోయారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కేసుల పేరిట తనను
తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నదని ఇటీవల ఆయన బాహిరంగంగానే ఆవేదన వెలిబుచ్చారు. అయితే
కేసులకు భయపడి జీవితాన్ని చాలించే స్వభావం కాదు ఆయనది. కుటుంబ అంతర్గత వివాదాలు సహితం
ఆయనను కుంగదీశాయనే మాట కూడ గట్టిగానే వినపడుతోంది. ఆ వివరాలు బయటికి వచ్చాకే ఆయన మృతి
మీద ఒక స్పష్ట వస్తుంది.
రాజకీయాల్లో ఆయన పాత్ర ఎంతటి వివాదాస్పదం
అయినప్పటికీ వైద్యరంగాలో ఆయన పాత్ర మహత్తర మైనది. నరసారావుపేటలో అప్పట్లో వారు అందించిన
వైద్య సేవలు ఒక ఎత్తు అయితే, హైదరావాద్ లో కొంతకాలం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్టు
ఛైర్మన్ గా ఆయన అందించిన వైద్య సేవలు మరో ఎత్తు. రాజకీయాల్లో పట్టుదల గల నాయకునిగా,
వైద్యరంగంలో ఒక సేవాతత్పరునిగా కోడెల గుర్తుంటారు.
రచన : 16సెప్టెంబరు
2019
ప్రచురణ :
బిబిసి తెలుగు, 16సెప్టెంబరు 2019
No comments:
Post a Comment