జూలియస్ ఫ్యూజిక్
సెప్టెంబరు 8 విజయవాడ మీటింగు కోసం ఇప్పుడు చదువుతున్న పుస్తకం జూలియస్ ఫ్యూజిక్. నా పుస్తకాన్ని నేనే విశ్లేషించడం ఒక చిత్రమైన భావోద్వేగం.
ఉష ఎస్ డానీ కలం పేరుతో రాసిన తొలి రచన జూలియస్ ఫ్యూజిక్. నా రచనల్లో విపరీతంగా కష్టపడి రాసిన పుస్తకం ఇది. ఒక్కో పేజీ రాస్తుంటే చాలా దుఖ్ఖం వచ్చేది. భోపాల్ మిక్ గ్యాస్ మీద రాసినపుడు, ఇటీవల ‘మదరసా మేకపిల్ల’ కథ రాస్తున్నపుడు అలాంటి దుఖ్ఖమే ముంచుకు వచ్చేసింది. తలుపులు మూసుకుని ఏడ్చేసేవాడిని. రచయిత అలాంటి పెయిన్ ను అనుభవించినపుడు ఆ రచనల్లో భావోద్వేగాల స్థాయి పెరుగుతుంది. అది ఆ రచనకు జీవం పోస్తుంది.
అప్పట్లో విజయవాడ ఎస్సారార్ కాలేజీకి అనుబంధంగా వున్న జమిందార్ బిల్డింగ్స్ లో వుండేవాడిని. రాత్రుళ్ళు పెందరాళే నిద్రపోయే వాడిని. హాస్టల్ గదుల్లో అందరూ నిద్రపోయాక తెల్లారు జామున ఏ రెండింటికో, మూడింటికో లేచి రాసేవాడిని. ప్రబంధకవులకు మల్లే రాయడానికి నాకూ కొన్ని రిక్వైర్ మెంట్స్ వుండేవి. అంతా చీకటి, నిశ్శబ్దం ఆవరించాక ఒంటరిగా కూర్చొని రాయడం ఇష్టం. ప్రపంచం అంతా నిద్రపోయిందనీ దాన్ని మేల్కొలిపే బాధ్యతను తాను నిర్వహిస్తున్నాననే భావన ఆ సమయంలో రచయితను ఆవహిస్తుంది. ఆ అనుభూతి మహత్తరమైనది. రచయితలు అలాంటి అనుభూతిని ఆస్వాదించాలి. పాఠకులు అలాంటి రచనను ఆస్వాదించాలి.
ఇప్పుడు పుస్తక రూపంలో వస్తున్న ‘మదరస మేకపిల్ల’ ఆవిష్కరణ కూడ జూలియస్ ఫ్యూజిక్ పుస్తక పరిచయ సభ రోజే జరుగుతుండడం నాకు డబుల్ బోనస్.
ఆ రోజుల్లోనే ఫ్యూజిక్ Notes from the gallows ను చలసాని ప్రసాదరావుగారు ‘రక్తాక్షరాలు’ గా అనువదించి ప్రచురించారు. అందువల్ల కొందరు నా పుస్తకం కూడ మరో అనువాదం అనుకుంటుంటారు. నేను జూలియస్ ఫ్యూజిక్ ను ప్రొటోగానిస్టుగా తీసుకుని రెండు ప్రపంచ యుధ్ధాల మధ్యకాలంలో, ఫాసిస్టు ఇటలీ, నాజీ జర్మన్ లు సాగించిన నరమేధాన్ని వివరించాలనుకున్నాను. ఫాసిజం, నాజిజంలను మన తెలుగు / సంస్కృతాల్లో మతవర్గతత్వ నియతృత్వం అనాలి. అది అతి భయంకరమైనదేగానీ ఓడించసాధ్యం కానిది మాత్రం కాదు. ఎర్రసైన్యం చేతిలో ఫాసిజం, నాజిజం రెండూ కుక్క చావు చచ్చాయి అని గుర్తు చేసి కొత్తతరాలకు కొండంత ధైర్యాన్ని ఇవ్వడమే నా లక్ష్యం. ఎర్రసైన్యం ముస్సోలినీ హిట్లర్ సైన్యాలను ఓడించి బెర్లిన్ నగరంలో ప్రవేశించిన మేడే రోజే 1981లో నా 'జూలియస్ ఫ్యూజిక్' పుస్తకావిష్కరణ విజయవాడలో జరిగింది.
రెండవ ప్రపంచ యుధ్ధ సంఘటనల వరుస క్రమాన్ని వివరించడంలో నేను కొన్ని చోట్ల పొరబడ్డాను. అప్పటి నా జ్ఞానం పరిమితమైనది, సమాచార సేకరణ కోసం వున్న సౌకర్యాలు పరిమితమైనవి. అసలు నిండా ముఫ్ఫయి యేళ్ళు కూడ నిండకుండానే రెండు ప్రపంచ యుధ్ధాలను రచనలో ఆవిష్కరించాలనుకోవడం ఒక దుస్సాహసం. అయితే, అప్పుడు శ్రీకాకుళం గిరిజన, కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ సాయుధ పోరాటాల ఉద్వేగం నన్ను పూర్తిగా ఆవహించి వుంది. ముఖ్యంగా సుబారావు పాణిగ్రాహి నాకు స్థానిక ఉత్తేజంగా వున్నాడు. అదే ఆ పుస్తకానికి అసలు బలం. చారిత్రక తేదీల్లో జరిగిన పొరపాట్లను రెండవ ముద్రణలో సరిచేశాను.
చలసాని ప్రసాదరావు గారే నా ‘జూలియస్ ఫ్యూజిక్’ ను ఈనాడు దినపత్రికలో సమీక్ష రాసి పెద్ద మనసు చాటుకున్నారు. అరుణతారలో కేవి రమణారెడ్డి సమీక్ష చేయగా, విశాలాంధ్రలో కాట్రగడ్డ గంగయ్య గారు సమీక్ష రాశారు. ప్రజాసాహితి, ప్రజాశక్తి కూడా నా పుస్తకాన్ని సమీక్షించాయి. ఒక యువ రచయితకు సాహిత్య పెద్దల నుండి ఇంతకన్నా ప్రోత్సాహం ఇంకేమికావాలీ? ఈ పుస్తకం మీద విపరీతమయిన అభిమానాన్ని కురిపించిన ‘శ్రీశ్రీ’ విశ్వేశ్వరరావు వల్లనే దీని ప్రచురణ సాధ్యం అయింది. మూడు దశాబ్దాల తరువాత తనే రెండవ ముద్రణను మరింత అందంగా తెచ్చాడు విశ్వేశ్వరరావు.
నాకు చాలా పెద్ద సంఖ్యలో అభిమానుల్ని సమకూర్చిపెట్టిన రచన ఇది. ఇప్పుడు చాలా వున్నత స్థాయిల్లో వున్నవారు సహితం తమ విద్యార్ధి దశలో నా 'జూలియస్ ఫ్యూజిక్'ను చదివి ఉత్తేజాన్ని పొందాము అంటుంటారు. రచయితగా చాలాచాలా సంతృప్తినిచ్చిన పుస్తకం ఇది.
నాకు ఇంతటి విలాసాన్ని అందించిన అందరికీ మరొక్కసారి వినయ పూర్వక ధన్యవాదాలు.
మీ
ఉష ఎస్ డానీ
No comments:
Post a Comment