The deference between speeches and writings
నిరక్షరాశ్యుల కోసం ప్రసంగిస్తాను;
అక్షరాశ్యుల కోసం రాస్తాను.
“పెట్టుబడీదారీ
రాజ్యం తన ప్రభువులైన కార్పొరేట్లకు మరింతగా సేవలు చేయడానికి మతాన్ని అత్యాచారం చేయడమే
ఫాసిజం” అంటూ ఈ మధ్య ఫాసిజాన్ని నిర్వచించి ఫేస్ బుక్కులో పోస్టు చేశాను. మరెవరయినా ఇంతకన్నా మెరుగయిన నిర్వచనం ఇస్తే ఆనందిస్తాను.
ఒక
విషయాన్ని ఉపయోగించుకోవడాన్ని ఇంగ్లీషులో use, proper use, under use, over use, misuse,
abuse వంటి అనేక స్థాయిల్లో వ్యక్తం చేస్తారు. Abuse ను తెలుగులో అత్యాచారం అనడం కూడ
వాడుకలో వుంది. ఒకవేళ అత్యాచారం అనే పదం కటువుగా
వుందనుకుంటే దుర్వినియోగం అనుకోవచ్చుగానీ, ఫాసిజం తీవ్రతను నిర్వచించడానికి ఆ పదం సరిపోదు.
నా
నిర్వచనం దివి కుమార్ గారికి నచ్చలేదు. అందులో వారికి “సెన్సేషనలిజం” “కవితాత్మకత”
వంటి కొన్ని నేరాలు కనిపించాయి. “సాధారణ ప్రజలు
అందుకునే విధంగానూ ఆచరణకు దోహదపడేట్లుగానూ … ప్రకటనలు వుంటే మంచిది” అంటూ వారు కొన్ని
సూచనలు కూడ చేశారు. ఆ తరువాత వారు “మతం - అసహాయులకొక ఊతకర్ర. అదే కలిగినవారి చేతిలో
దుడ్డుకర్ర” అంటూ ప్రత్యామ్నాయ నిర్వచనాన్ని ప్రకటించారు.
దివికుమార్
గారు గందరగోళ పడిన మొదటి విషయం ఏమంటే వారికి
ఫాసిజానికీ మతానికీ తేడ తెలియలేదు. వారు ఫాసిజాన్ని నిర్వచించబోయి మతాన్ని నిర్వచించారు.
ఇదేమీ పెద్ద నేరం కాదు. చాలామంది తమకు కొత్త విషయాలు అర్థం కానప్పుడు తమకు తెలిసిన
పాత విషయాలనే వల్లె వేస్తుంటారు. అది మానవ సహజం.
“ఫాసిజం
రూపంలో సాంస్కృతికం, సారంలో రాజకీయార్ధికం”. ఇది కూడ నా నిర్వచనమే. నాకున్న పెద్ద బలహీనత ఏమంటే నేను కొత్త విషయాలను ఇంకాస్త కొత్తగా
చెప్పాలనుకుంటాను. అది అందరికీ ఒక పట్టాన అర్థంకావు. అయితే అర్థం కాకపోవడమే తమ జన్మ
హక్కుగా భావించే ఒక సమూహం ఇటీవల తెలుగునాట బలపడుతూ వుంది.
“సాధారణ
ప్రజలు అందుకునే విధంగానూ ఆచరణకు దోహదపడేట్లుగానూ” అనేది కమ్యూనిస్టు పార్టీల్లో
దాదాపు ఆరు దశాబ్దాలుగా వాడివాడి అరిగిపోయిన రికార్డు. దానివల్ల రెండు ఘోర నష్టాలు
జరిగాయి. మొదటిది; కమ్యూనిస్టుల రాతల్లో సాహిత్య ప్రమాణాలు దారుణంగా పతనం అయిపోయాయి.
రెండోది; నిస్సార భాషలో ఉద్వేగం ఉత్తేజం కొత్తదనం లేక సాధారణ ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను
వదిలి వెళ్ళిపోయారు. రెండు కాళ్లు పట్టుకుని బతిమిలాడినా కమ్యూనిస్టుల కరపత్రాలు చదివేవాళ్లు
ఇప్పుడు ఎవ్వరూ లేరు. కొత్తతరం తెలుగు భాషను వదిలి ఇంగ్లీషు మీద మక్కువ చూపడానికి ఈ సోకాల్డ్ ‘ప్రజా’ కమ్యూనిస్టుల తెలుగు కూడ ఒక కారణం
అనంటే ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు.
నేను
భావానికి ఎంత ప్రాధాన్యం ఇస్తానో వ్యక్తీకరణలో సాహిత్య ప్రమాణాలకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాను. దాని కోసం కొంత సాధన
కూడ చేస్తాను.
“యూరప్ ను ఒక భూతం వెంటాడుతోంది దాని పేరు
కమ్యూనిజం”, “ఇప్పటి వరకు మనకు తెలిసిన చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే” “పెట్టుబడీదారీవర్గం
తానే అదుపుచేయలేని ఒక భూతాన్ని సృష్టించింది; అదే కార్మికవర్గం” “మహిళల విషయంలో ఇప్పుడు
పెట్టుబడీదారులు రహాస్యంగా చేస్తున్న పనిని రేపు కమ్యూనిస్టులు మహా అయితే బాహాటంగా
చేస్తారు” “తిరగబడితే పోయేదేమీలేదు బానిస సంకెళ్లుతప్ప” “చౌకధరలు అనే మరఫిరంగులతో ఎలాంటి
మార్కెట్ కోటలనైనా అది ధ్వంసం చేసేస్తుంది” “దరిద్రుల తత్వశాస్త్రంకాదు అది తాత్వికదారిద్ర్యం”
వంటి ‘సంచలనాత్మక’ ‘కవితాత్మక’ ప్రకటనలు చేయడం నాకు చాలా ఇష్టం. ప్రజలు కూడ వాటినే
ఇష్టపడతారు. ఈ జబ్బు నాకు కార్ల్ మార్క్స్ నుండే అంటుకుంది. తనకు షేక్స్ పియర్ రచనా
శైలి చాలా ఇష్టం అని మార్క్స్ స్వయంగా చెప్పుకున్నాడు. నాకు మార్క్స్ రచనా శైలి చాలా ఇష్టం.
నేను
అక్షరాశ్యుల కోసం మాత్రమే రాస్తాను. నిరక్షరాశ్యుల కోసం ప్రసంగిస్తాను. రెండింటి శైలి
వేరు. వాడే భాష వేరు. కూర్చే వాక్యాలు వేరు. వ్యక్తీకరణ వేరు.
కొందరికి మౌఖిక సాహిత్యానికీ, లిఖిత సాహిత్యానికీ
తేడాలు తెలీవు. అక్కడి ప్రమాణాల్ని ఇక్కడ ఇక్కడి ప్రమాణాల్ని అక్కడ వాడుతుంటారు. అదోరకం
అమాయికత్వం!. మరికొందరు తమకు విషయాలు అర్థం కాలేదన్న సంగతి బయటికి చెప్పకుండ మౌనంగా
వుండిపోతారు. ఇదోరకం తెలివిడితనం. ఇంకొందరైతే తమకు కొన్ని విషయాలు తెలియవని ఒప్పుకోవడానికి
బిడియపడి ప్రజలకు తెలియవు అని వాదిస్తారు. ఇదో రకం గడుసుతనం.
రచన : 28
సెప్టెంబరు 2019
ప్రచురణ :
No comments:
Post a Comment