Monday, 23 September 2019

Danny Speech On Fascism and Julius Fučík


Danny Speech On  Fascism and Julius Fučík
8 September 2019
Talking Points

1.         అందరికీ పాత్రికేయుల అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవ  శుభాకాంక్షలు.

2.             జూలియస్ ఫ్యూజిక్ (Julius Fuchik) ను ఉరి తీసిన రోజును ఐక్యరాజ్య సమితి International day of solidarity of journalists గా ప్రకటింది.

3.         ఈ రోజు ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకులు, గొప్ప నాటక ప్యయోక్త డాక్టర్ గరికపాటి రాజారావు జయంతి  కూడ.

4.          ఒక చారిత్రక సందర్భంలో ఒక సామాజిక బాధ్యతగా జరుగుతున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు సభ నిర్వాహకులు విజయవాడ సాహితీ మిత్రులకు, ముఖ్యంగా శ్రీశ్రీ విశ్వేశ్వరరావుకు   కృతజ్ఞతలు.

5.         నన్ను వేదిక మీదికి ఆహ్వానిస్తూ నా గురించి అనేక మంచి మాటలు చెప్పిన కవి మిత్రుడు బండ్ల మాధవరావుకు ప్రత్యేక  కృతజ్ఞతలు.

6.         మిత్రులారా ! ఈ సభలో నా ప్రసంగ అంశాలు 1. జ్యూలియస్ ఫ్యూజిక్ జీవితం, 2. ఫాసిస్టుదాడి – రెండవ ప్రపంచ యుధ్ధం.

7.         ఇందులోని రెండు అంశాలు కూడ చాలా విస్తారమైనవి. వీటిని వివరించడానికి ఒక పూట కూడ సరిపోదు. అయితే బహిరంగ సభల కాలపరిమితిని దృష్టిలో పెట్టుకుని ఒక 30 నిముషాల లోపు నా ప్రసంగాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తాను.

8.         నాతోపాటు వేదిక మీద కామ్రేడ్ తమ్మినేని  వీరభద్రం గారు, శ్రీశ్రీ విశ్వేశ్వరరావు వున్నారు. వేదిక ముందు వున్నవారిలోనూ అనేక మంది పెద్దలు వున్నారు. రెండవ ప్రపంచ యుధ్ధం గురించి, జూలియస్ ఫ్యూజిక్ పోరాటం గురించీ అనేక వివరాలు మీకు తెలుసు. అంచేత నేను ఆ వివరాల్లోనికి ఎక్కువగా వెళ్ళకుండ కొన్ని ప్రధాన సంఘటనలను మాత్రమే మీ ముందు వుంచుతాను. .

9.         మిత్రులారా!

10.      రెండవ ప్రపంచ యుధ్ధం గురించీ,  ఫాసిజం, నాజిజంల గురించీ మరింత లోతుగా స్పష్టంగా, వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం మళ్ళీ ముందుకు వచ్చింది.

11.      మన దేశంలో 1977లో ఎమర్జెన్సీ ముగిసిన తరువాత పఠనరంగంలో  జైలు డైరీల ప్రాముఖ్యత పెరిగింది. మేరీ టేలర్, భగత్ సింగ్, జూలియస్ ఫ్యూజిక్ పుస్తకాలను అప్పట్లో ఎక్కువగా  చదివేవారు.

12.      ఒక సుదీర్ఘ విరామం తరువాత  ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకాలకు ఆదరణ పెరుగుతోంది.

13.      ఎందుకంటే ఇప్పుడు    మన దేశం కూడ క్రమంగా ఫాసిస్టు, నాజీయిస్టు  ధోరణుల్లోనికి పోతున్నదనే అనుమానాలు బలపడుతున్నాయి. 

14.      సమాజంలో ఒక కొత్త చారిత్రక దశ ఆరంభం అవుతున్నప్పుడు గతంలో సాగిన అలాంటి దశను అధ్యయనం చేయాలనే ఆసక్తి కలుగుతుంది. అది అవసరం కూడ.

15.      మనం కొంత కాలం ప్రజాస్వామ్యం ముసుగులో సాగిన నియంతృత్వాన్ని చూశాము. మరి కొంత కాలం ముసుగు కప్పిన ఫాసిజంలో బతికాం. ఇప్పుడు ఫాసిజం ముసుగు తీసేస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఫాసిజం బాహాటంగా ముందుకు వచ్చేస్తే ఏం చేయాలనే ఆలోచనలు కూడ మనలో  మొదలయ్యాయి.

16.      అయితే, మనం గతాన్ని  అధ్యయనం చేసేది గతాన్ని ఉధ్ధరించడానికి కాదు.

17.       చరిత్ర అనేది ఎన్నడూ గతం కాదు. చరిత్ర వర్తమానం కూడా కాదు. చరిత్ర అంటే భవిషత్తు.

18.      వర్తమానం తన భవిష్యత్తును నిర్మించుకోవడం కోసమే గతాన్ని తలచుకుంటుంది. గతం నుండి కొన్ని పరికరాలను తెచ్చుకుంటుంది.


19.    1942-43ల్లో ఒక 14 నెలలపాటూ ప్రాంకాస్ జైలులో తన అనుభవాలని రహాస్యంగా చిన్న చిన్న కాగితపు ముక్కల మీద రాసి బయటికి పంపించేవాడు జూలియస్ ఫ్యూజిక్. యుధ్ధానంతరం అతని భార్య గుస్తా ఫ్యూజికోవ ఆ చీటీలను Notes from the Gallowsగా అచ్చు వేసింది. కొన్ని దేశాల్లో  "the Report with a noose around his neck"  అనే పేరుతోనూ ఇవి అచ్చు అయ్యాయి. 

20.      మన దేశంలో, మన రాష్ట్రంలో,  స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే జవహర్ లాల్ నెహ్రు మార్కు నియంతృత్వాన్ని మనం చూశాం. 1948 సెప్టెంబరులో నైజాం సంస్థానం మీద ‘పోలీస్ యాక్షన్’ సమయంలో వేలాది మంది ముస్లింలను , ఆ వెనుక మళ్ళీ వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తల్ని చంపిన చరిత్ర నెహ్రూది.

21.       నేహ్రు క్రౌర్యాన్ని చూసిన పరుచూరి కోటేశ్వరరావుగారు 1960లలో జూలియస్ ఫ్యూజిక్  Notes from the Gallows ను ‘రక్తాక్షరాలు’గా తెలుగులో అనువాదం వేశారు.

22.      ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ మార్కు నియంతృత్వాన్ని చూసిన చలసాని ప్రసాదరావుగారు 1980లో Notes from the Gallows ను మరొక్కసారి ‘రక్తాక్షరాలు’ పేరుతోనే  అనువాదం వేశారు.

23.        సరిగ్గా ఆ రొజుల్లోనే నేను రెండు ప్రపంచ యుధ్ధాల మధ్య కాలంలో, ఫాసిస్టు ఇటలీ, నాజీ జర్మన్ లు సాగించిన నరమేధం నేపథ్యంలో జూలియస్ ఫ్యూజిక్ ను ఒక ప్రొటోగానిస్టుగా తీసుకుని పుస్తకం రాయాలనుకున్నాను. 

24.      ఫాసిజం, నాజిజంలు అతి భయంకరమైనవి అతి బలమైనవి అయినప్పటికీ  ఓడించసాధ్యం కానివి మాత్రంకాదు. ఎర్రసైన్యం చేతిలో ఫాసిజం, నాజిజం రెండూ కుక్క చావు చచ్చాయి అని గుర్తు చేసి కొత్త తరాలకు కొండంత ధైర్యాన్ని ఇవ్వడమే నా పుస్తకం లక్ష్యం.

25.        ఉద్యమ రచనలు అన్నీ స్థానిక అవసరాలలో పుడతాయి.  అంతర్జాతీయ అనుసంధానంతో ఒక పరిపూర్ణతను సాధిస్తాయి. అంతిమంగా స్థానికులకు ఒక ఉత్తేజాన్ని ఇస్తాయి. థింక్ గ్లోబల్లి యాక్ట్ లోకల్లి అంటే అదే.

26.        పరుచూరి కోటేశ్వరరావు గారు అయినా, చలసాని ప్రసాదరావు గారు అయినా, నేనయినా జెక్ ప్రజల కోసం రచనలు చేయలేదు. తెలుగు ప్రజల కోసమే పుస్తకాలు ప్రచురించాం. ఫ్యూజిక్ ను కథాంశంగా తీసుకున్నాం. నియంతృత్వాన్ని, దాని క్రౌర్యాన్ని కథా వస్తువుగా స్వీకరించాం. 

27.       ఎర్రసైన్యం ముస్సోలినీ హిట్లర్ సైన్యాలను ఓడించి బెర్లిన్ నగరంలో ప్రవేశించిన మేడే రోజే 1981లో నా 'జూలియస్ ఫ్యూజిక్' పుస్తకావిష్కరణ సభ విజయవాడలో జరిగింది.

28.        దాదాపు నలభై యేళ్ల తరువాత కూడ నా పుస్తకం మీద చర్చ జరుగుతున్నదంటే రచయితగా చాలా ఆనందంగా వుంది.  కానీ, ఒక సామాజిక కార్యకర్తగా ఇది నాకు ఏమాత్రం ఆనందాన్ని ఇచ్చే అంశం కాదు. 

29.      నా జూలియస్ ఫ్యూజిక్ ను రెండుసార్లూ విశ్వేశ్వరరావే ప్రచురించాడు.  ఆ పుస్తకం మీద    ఇంతటి ప్రేమను పెంచుకోవడానికి తనకు కూడ ఒక స్థానిక ప్రేరణ వుంది. నెహ్రూ మార్కు నియంతృత్వ నిర్భంధ  రాక్షసత్వాన్ని చవిచూసిన  కాటూరు-ఎలమర్రు గ్రామంలోనే విశ్వేశ్వరరావు పుట్టాడు. ఆ ప్రభావం అతను మనసు మీద ఇప్పటికీ వుంది. అంచేత అతను ప్రపంచంలో నిర్భంధం, నియంతృత్వం ఎక్కడున్నా వ్యతిరేకిస్తాడు. నిర్భంధానికి వ్యతిరేకంగా పోరాడేవాళ్లను ప్రేమిస్తాడు.

30.      తత్వశాస్త్రంలో సబ్జెక్టివ్ నుండి ఆబ్జెక్టివ్, స్పెసిఫిక్ టు జనరల్, పర్టిక్యూలాటి టు యూనివర్శాలిటీకి  చేరుకోవడం అంటే ఇదే.

31.      ఏదైనా వ్యక్తిగతం నుండి విశ్వగతంకు చేరుకోవాలి. మాతృప్రేమ అంటే మన తల్లిని ప్రేమిస్తే సరిపోదు. మాతృదేశాన్ని కూడ అంతే ప్రగాఢంగా ప్రేమించాలి.

32.      అయితే దేశభక్తిలో నా దేశభక్తికీ  నరేంద్ర మోదీ, అమిత్ షాల దేశభక్తికి బోలెడు తేడా వుంది. 

33.      జూలియస్ ఫ్యూజిక్ అయినా ఈరోజు ఇక్కడ మరి కాస్సేపటిలో ఆవిష్కరించబోతున్న నాకథ ‘మదర్సా మేకపిల్ల’ అయినా dystopian రచనలే. Utopian రచన పదికాలాలు బతకాలి. Dystopian రచన సాధ్యమైనంత త్వరగా ప్రాసంగికతను కోల్పోవాలి. ఒక Dystopian రచన ఎక్కువ కాలం బతికి వుందంటే సమాజంలో ఆ రచయిత ఆశించిన మార్పు సరాలేదని అర్థం.  ఇది బాధాకరమే! 

34.      జూలియస్ ఫ్యూజిక్ అనేక రంగాలలో అనేక విభాగాలలో నిపుణుడు. కవి, గాయకుడు, రచయిత, నటుడు, సాహిత్య విమర్శకుడు, ఉద్యమ కారుడు, పాత్రికేయుడు, జెకోస్లావోకియా కమ్యూనిస్టు పార్టి వ్యవస్థాపకుల్లో ఒకడు. నాజీల మీద తిరగబడినవాడు. నాజీల నిర్బంధాన్ని స్వయంగా అనుభవించినవాడు. చివరకు నాజీల క్రౌర్యానికి  బలయినవాడు.

35.      మొదటి ప్రపంచ యుధ్ధానికి ముందు జెకోస్లావోకియా రాజధాని ప్రాగ్ నగరంలోని  ఒక మురికివాడలో పుట్టాడు. రెండవ ప్రపంచ యుధ్ధ కాలంలో బెర్లిన్ లోని ప్లాట్ జెన్సీ జైలులో ఉరికంభం మీద చనిపోయాడు.

36.      కొలిమిలో ఇనుము ఉక్కుగా మారినట్టు పొరాటాల్లో, ఉద్యమ సాహిత్యంలో నిర్బంధాల్లో, చిత్రహింసల్లో ఫ్యూజిక్ రాటుదేలాడు.

37.      ఆయా సందర్భాలలో ఫ్యూజిక్ వాడిన  ఒన్ లైనర్స్ ప్రపంచ పీడిత ప్రజల్ని ఇప్పటికీ ఉత్తేజ పరుస్తూనేవున్నాయి.

38.      నాజీ  వోక్స్ గెరిచేస్టోఫ్ కోర్టు న్యాయమూర్తి రోలాండ్ ఫ్రేయిజ్లర్  అతని తలతీసి వేయమని తీప్రు చెప్పినపుడు ఫ్యూజిక్ చేసిన ప్రకటన వింటుంటే ఇప్పటికీ వొళ్ళు గగుర్పొడుస్తుంది.

39.      “తల తీసివేసినంతమాత్రాన మనిషి అల్పుడైపోడు”. Man does not become less even he is made shorter by a head.

40.      ప్రజలారా! మిమ్మల్ని  ప్రేమించాను. మీ జాగ్రత్తలో మీరుండండి. People! Be on your guard.

41.      “మేమంతా సోషలిస్టు విప్లవాల కోసం ఈ భూమిలో నాటబడిన విత్తనాలం. ఈరోజు కాకపోతే రేపయినా  వసంత కాలం రాకమానదు. మాలో అన్నీ కాకపోయినా కొన్ని విత్తనాలయినా మొలకెత్తక మానవు”.

42.      ఫాసిజానికి మృత్యువు. మానవునికి స్వేఛ్ఛ. కమ్యూనిజానికి భవితవ్యం”

43.      ఫాసిజం, నాజిజాలను అధ్యయనం చేయాల్సిన అవసరం రావడంతో అనేకులు ఈమధ్య  లైబ్రరీల మీద పడి అలనాటి ఇటలీ, జర్మనీ రాజకీయార్ధిక పరిణామాల్నీ, అప్పటి తత్వవేత్తల పుస్తకాలనీ తెగ చదివేస్తున్నారు.

44.      ఫాసిజం, నాజిజాలను అధ్యయనం కి భారతీయులు అంత దూరం వెళ్ళాల్సిన పనిలేదు. మన ‘మనుస్మృతి’యే ‘చండాలుడు’ సిధ్ధాంతంతో సహా జర్మనీకి చేరి  ప్రైడరిక్ నీషేను గొప్పగా ప్రభావితం చేసింది. చుండూరును ఇంగ్లీషులో T s u n d u r u అని రాసినట్టు చండాలను నీషే T s c h a n d a l a అని రాశాడు.  

45.        నీషే తరువాత అతని సోదరి ఎలిజబెత్ ఫోర్స్ టర్ నీషే ద్వార హిట్లర్ కు చేరి  ఆ నియంతకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. నీషే రచనల సమగ్ర సంకలనాన్ని మరో నియంత బెనిటో ముస్సోలినికి పుట్టిన రోజు కానుకగా ఇచ్చాడు హిట్లర్. 

46.      ఆర్య సంస్కృతి, సమానత్వ సిధ్ధాంత నిరాకరణలతోపాటూ స్వస్తిక్ చిహ్నం, సూపర్ మ్యాన్ భావన  సహితం జర్మన్ మతతత్త్వ నియంతకు గొప్పగా నచ్చేశాయి.

47.      నిఘంటువు అర్థంలో ఫాసిజం అంటే ఇటలియన్ భాషలో కట్టెల మోపు అని అర్థం. నాజిజం అంటే జర్మనీ భాషలో జాతీయ సామ్యవాదం అని అర్థం.  నిఘంటువు అర్థాలు వేరు ఆచరణాత్మక అర్థాలు వేరు.

48.        మన దేశంలో 1980లో భారతీయ జనతా పార్టి ఏర్పడినపుడు దాని రాజకీయ సిధ్ధాంతం గాంధీయ సోషలిజం. దీన్ని వాళ్ళు హిట్లర్ జాతీయ సోషలిజం నుండి ఎరువు తెచ్చుకున్నారు.

49.       ముస్సోలినీ, హిట్లర్ లు ఫాసిజం అన్నా నాజిజం అన్నా, బిజెపి మరోమాట అన్నా రాజకీయార్ధిక సామాజిక వ్యవస్థల్లో దాని సాంకేతిక నామం మతవర్గతత్వ నియంతృత్వం. ఇంకా ఎంతకాలం మనం ఇటలియన్, జర్మన్ పదాలనే వాడుతుంటాం.

50.      1984 నాటి ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిరాగాంధి హత్య తరువాత శిక్కుల ఊచకోతల నేపథ్యంలో  కేవి రమణా రెడ్డిగారు మతవర్గతత్వం అనే ఒక సిధ్ధాంత వ్యాసాన్ని రాశారు.

51.       మన సాంప్రదాయ కమ్యూనిస్టుల మీద నాస్తికవాద హ్యాంగోవర్ బలంగా వుంటుంది. అంచేత, ఒక మతాన్ని వర్గం అనవచ్చునా? అనే సందేహం ఇటీవలి కాలం వరకు బలంగా వుండేది.

52.      మొన్నటి లోక్ సభ ఎన్నికలు ఆ సందేహాలను మొత్తంగా పటాపంచలు చేసేశాయి. ఈ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికగా, రాజకీయ సిధ్ధాంతాల ప్రాతిపదికగా జరగలేదు. హార్డ్ హిందూత్వ, సాఫ్ట్ హిందూత్వ, నాన్ హిందూత్వల మధ్య జరిగాయి. ఎప్పుడూ ఎలాగూ స్వల్ప మినహాయింపులు వుంటాయి గానీ స్థూలంగా దేశమంతటా ఇదే సూత్రం పనిచేసింది.

53.      ఇప్పుడు మనమంతా ఫాసిజంను ఎదుర్కోవడానికి జర్మనీ భాష నేర్చుకొని నీషేను అధ్యయనం చేయవలసిన పనిలేదు.

54.      సామాజిక రంగంలో మనువాదాన్ని ఎదుర్కోవడానికి జ్యోతిబా ఫూలే, పెరియార్ ఇవి రామసామి నాయకర్ బీఆర్ అంబేడ్కర్ లను అధ్యయనం చేసితీరాలి.  మరో మార్గం లేదు. 

55.        భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక రంగంలో వర్గం వున్నట్టే, సామాజికరంగంలో  కులం మతం తెగ లింగం కూడ తప్పనిసరి అస్తిత్వాలుగా  వుంటాయి.  మినహాయింపు ఏ ఒక్కరికీ లేదు.

56.        ఎవరో కొందరు తమకు కులం లేదనో మతం లేదనో చెప్పుకోవచ్చు.  కానీ ఆచరణలో అలా కుదరదు. నేను అనేకమంది కమ్యూనిస్టు ప్రముఖుల అంత్యక్రియల్లో పాల్గొన్నాను. వాళ్ళు హిందువులయితే దహనం చేస్తారు. ముస్లింలు అయితే ఖననం చేస్తారు. అంటే చనిపోయాక మాత్రమే  కమ్యూనిస్టులకు మతం వస్తుందా? బతికుండగా మతం వుండదా? ఇదేమి హిప్పోక్రసీ?  

57.        ఈ రోజు భారతదేశంలో సంఘ పరివారం కుల మతాలను గుర్తిస్తూ బలపడుతున్నది. కమ్యూనిస్టు పార్టీలు కులమతాలను నిరాకరిస్తు బలహీన పడుతున్నాయి. ఇదొక వాస్తవం.
58.        కమ్యూనలిజం అన్ని సందర్భాల లోనూ నెగటివ్ గానే వుంటుందనే నేరేటివ్ నుండి ముందు మనం బయటపడాలి. పాజిటివ్ కమ్యూనలిజం అనేది కూడా ఒకటి వుంటుందని గుర్తించాలి. ‘పాజిటివ్ డిస్క్రిమినేషన్’ అనే సూత్రం లేకుండా  ఉద్దీపన చర్యలు సాధ్యం కావుకదా! ఇదీ అంతే.

59.        ఈరోజు ప్రపంచ రాజకీయార్థిక ధార్మిక రంగాల్లో యూదుల పాత్ర అత్యంత వివాదాస్పదమే గానీ జర్మనీలో నాజీజాన్ని ఎదుర్కోవడంలో వాళ్లు నిర్వహించిన పాత్ర చాలా సానుకూలమైనది. మనకు ఇలాంటి గతితార్కిక చారిత్రక భౌతికవాద దృక్పథం అలవడాలి. చారిత్రక దశలను బట్టి సామాజిక సమీకరణలు వుంటాయి.  

60.        పాజిటివ్ జెండర్ డిస్క్రిమినేషన్ అంటే స్త్రీపురుష సంబంధాల్లో స్త్రీల పక్షాన నిలబడడం, పాజిటివ్ క్యాస్ట్  డిస్క్రిమినేషన్ అంటే కుల సంఘర్షణల్లో దళితులు బహుజనులపక్షాన నిలబడడం, పాజిటివ్ ట్రైబ్స్ డిస్క్రిమినేషన్ అంటే అడవి మైదాన ప్రాంతాల మధ్య సాగే ఘర్షణల్లో అడవి పక్షాన నిలబడడం, పాజిటివ్ కమ్యూనల్  డిస్క్రిమినేషన్ మత సంఘర్షణల్లో  అల్పసంఖ్యాకుల పక్షాన నిలబడడం. 

61.        కళ్ళముందు ఒక ఘర్షణ జరుగుతున్నప్పుడు బలహీనుల పక్షం వహించి బలవంతుల్ని ఎదుర్కోవాలి. అంతేతప్ప ఎవరి పక్షమూ కాదు అని అంతే తప్ప ఎవరి పక్షమూ కాదు అని ప్రకటిస్తే  వర్తమాన సమాజంలో వాళ్ళకు స్థానం వుండదు.

62.        మనలో చాలామందికి తెలియని విషయం ఏమంటే అంబేడ్కర్ కన్నా, ఫూలేకన్నా ముందే భారత సమాజంలో కుల సమస్య గురించి మాట్లాడిన వాడు కార్ల్ మార్క్స్. అంతేకాదు బ్రాహ్మణీయ వ్యవస్థను కూడా ఆయన పరిశీలించాడు. కుల వ్యవస్థ పోకుండా కింది వర్గాలు / కులాలకు ఆర్ధిక ఫలాలు దక్కవు అని చాలా స్పష్టంగా హెచ్చరించాడు. 

63.      A country not only divided between Mahommedan and Hindoo, but between tribe and tribe, between caste and caste; a society whose framework was based on a sort of equilibrium, resulting from a general repulsion and constitutional exclusiveness between all its members.

64.        అనుమానం వున్నవాళ్ళు 1853లో న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్ కు మార్క్స్ రాసిన వ్యాసాల్ని చదవండి.  అంతేగానీ కమ్యూనిస్టులకు కులం లేదు; మతం లేదు వంటి వట్టి మాటలు  చెప్పొద్దు. సాక్షాత్తు మార్క్స్ ను సహితం హైగేట్ యూదు శ్మశానంలోనే ఖననం చేశారు. 

65.        “కులం అనేది శ్రమ విభజన మాత్రమే కాదు శ్రామికుల విభజన కూడ” అన్నాడు అంబేడ్కర్. "Caste is not just a division of labour, it is a division of labourers". 

66.         “కులనిర్మూలన జరగాలంటే శ్రామికుల ఐక్యత జరగాలి" అనే కద అర్థం!. మరి శ్రామికుల్ని ఏకం చేయడం మార్క్సిస్టుల పనికాదా?

67.      అంబేడ్కర్ రాజకీయ అనుబంధాలతో మనలో కొందరికి భిన్నాభిప్రాయాలు వుండవచ్చుగాక. వున్నాయి కూడ. ఆ భాగాన్ని పక్కన పెట్టయినా సరే అంబేడ్కర్ సాంఘీక విశ్లేషణను  చదవాలి.

68.        ఛార్లెస్ డార్విన్ ను చదవకుండ జీవపరిణామ సిధ్ధాంతం అర్థం కానట్టు, కార్ల్ మార్క్స్ ను చదవకుండ పెట్టిబడీదారీ వ్యవస్థ అర్థం కానట్టు, బాబాసాహెబ్ రాంజీ అంబేడ్కర్ ను చదవకుండ కులవ్యవస్థ అర్థంకాదు.

69.        కులమత వర్గ వ్యవస్థను  అర్థం చేసుకోకుండా ఫాసిజాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. 

70.      జర్మనీ నాజిజాన్ని అధ్యయనం చేయడానికి మనకు ఒక షార్ట్ కట్ రూట్ వున్నది.  అలనాటి అడాల్ఫ్ హిట్లర్, జోసెఫ్ గోబ్బెల్స్ లను చూడలేకపోయాం అని బెంగపడాల్సిన పని కూడ లేదు. మనకూ నరేంద్ర మోదీజీ వున్నారు. అనిత్ షాజీ వున్నారు.

71.      అయితే వీరిలో ఎవరు హిట్లర్ ఎవరు గొబ్బెల్స్ అనేది పెద్ద సందేహం. మోదీజీ ఫస్ట్ టెర్మ్ లో ఆయన హిన్ను  హిట్లర్ లా కనిపించేవారు; అమిత్  భాయి గొబ్బెల్స్ లా కనిపించేవారు. ఇప్పటి మోదీజీ టు-డాట్ ఓ (2.O) ప్రభుత్వం ఏర్పడ్డాక అమిత్ షా  హిట్లర్ లా కనిపిస్తున్నారు;  మోదీజీ గొబ్బెల్స్ లా కనిపిస్తున్నారు.

72.      బ్రిటీష్ కమ్యూనిస్టు నాయకుడు రజినీ పామే దత్ రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసిన తరువాత ‘ఫాసిజం – సోషల్ రివల్యూషన్ అనే 350 పేజీల పుస్తకం రాశాడు. ఫాసిజాన్ని, నాజీజాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ అది ఒక మంచి పుస్తకం.

73.      కమ్యూనిస్టుల సాంప్రదాయ అవగాహన  ఏమంటే పెట్టుబడీదారీ వ్యవస్థలో ఉత్పత్తి అత్యున్నత దశకు చేరుకున్న తరువాత ఉర్పత్తి శక్తులకు, ఉత్పత్తి సంబంధాలకు మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకోవడంతో అక్కడ సోషలిస్టు విప్లవం వస్తుందని. సోషలిజం తొలుత ఇంగ్లండ్ లో వస్తుందని కార్ల్ మార్క్స్ కూడ ఊహాగానం చేశాడు. కానీ పెట్టుబడీదారీ వ్యవస్థ అంతగా ఎదగని తృతీయశ్రేణి దేశం రష్యాలో తొలి సోషలిస్టు సమాజం ఏర్పడింది. .

74.      ఫాసిజం కూడ అంతే. మరీ భారీ ఆర్ధిక వ్యవస్థల్లో కాకుండా సంక్షోభాల్లో కొట్టు మిట్టాడుతున్న ఇటలి, జర్మనీదేశాల్లో వచ్చాయి.

75.        ఈ సూత్రాన్ని కొనసాగిస్తే, ఈనాటి గ్లోబల్ ఆర్ధిక సంక్షోభంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్తలైన అమెరిక, చైనాలకన్నా ఐదు స్థానాలు కింద వున్న భారతదేశంలో ఫాసిజం-నాజిజం వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. 

76.      పామే దత్ మరో మాట కూడ అన్నాడు; కార్పొరేట్లలో లుంపెన్ స్వభావం గల ఒక మైనార్టి వర్గమే పాసిజాన్ని నియంత్రిస్తుంది అని. ఈ సూత్రం కూడ ఇప్పటి మన ఆర్థిక కవ్యవస్థలో పని చేస్తున్నదని అనిపిస్తోంది.

77.      ప్రజాస్వామ్యం అంటేనే అధికారాల వికేంద్రీకరణ. చట్ట సభల్లో అయినా, సమాజంలో అయినా మైనారిటీల  భావోద్వేగాలను  మెజారిటీ గౌరవించడం ప్రజాస్వామ్యం.  అంతే తప్ప ప్రజలు అధికారాన్ని ఇచ్చారనే వంకతో అధికారపక్షం మైనారిటీ పక్షాల మీద కాలుదువ్వడం  నియంతృత్వం అవుతుందిగానీ ప్రజాస్వామ్యం కాదు.

78.        గతంలో అయితే అధికారా పీఠాన్ని ఎవరు అధిష్టించాలి? అనేది ప్రజలు నిర్ణయించేవారు. ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లు నిర్ణయిస్తుండడంతో ప్రజలు ఇచ్చిన అధికారం అనే మాట కూడ అనుమానాస్పదంగా  మారిపోయింది.  

79.      ప్రభుత్వ విధుల్ని న్యాయ, చట్టనిర్మాణ, కార్యనిర్వాహకవర్గ వ్యవస్థలకు పంచితే అది ప్రజాస్వామ్యం. ప్రభుత్వం కార్పొరేట్లు కలిసిపోతే అది ఫాసిజం.

80.      ఈ మాట స్వయంగా ముస్సోలినీ యే అన్నాడు. “Fascism should more appropriately be called Corporatism because it is a merger of state and corporate power”.  

81.        ముస్సోలిని మాటలకు  అర్థం ఏమంటే మోదీజీ ఆడానీలు కలిసి పోవడం అని అర్థం, అమిత్ భాయి ముఖేష్ అంబానీ ఏకం అయిపోవడం అని అర్థం.

82.        కశ్మీర్ కు ప్రత్యేక హక్కుల్ని ఇచ్చే ఆర్టికల్ 370, 35 ఏ లను  తొలగిస్తూ ఆగస్టు 6న భారత పార్లమెంటు రాజ్యాంగ సవరణ తీర్మానం చేసింది. ఆగస్టు 12న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సర్వసభ్య సమావేశం జరిగింది.  ఆ సమావేశంలో మనదేశ అత్యంత సంపన్నుడయిన ముఖేష్ అంబానీ కశ్మీర్ లో భారీ పెట్టుబడుల్ని పెట్టడానికి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

83.        కశ్మీర్ ప్రత్యేక హక్కుల్ని తీసేసినందుకు ముఖేష్ అంబాని అక్కడ పెట్టుబడులు పెడుతున్నారా? లేక  ముఖేష్ అంబాని అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వీలుగా కశ్మీర్ ప్రత్యేక హక్కుల్ని రద్దు చేశారా? అనేది ఎవరికయినా రావలసిన సందేహం.

84.      భారత దేశాన్ని ఐదేళ్ళలో ఐదు  ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని ప్రధాని నరేంద్ర మోదీజి తరచుగా అంటున్నారు. ఎర్రకోట బురుజు మీద నిలబడి చేసిన స్వాతంత్ర్య  దినోత్సవ ప్రసంగంలోనూ వారు ఆ మాట మరోసారి అన్నారు. ఆ లక్ష్యాన్ని దాన్ని సాధించాలంటే సాలీన జిడిపి అభివృధ్ధి రేటు 14 శాతం కన్నా ఎక్కువగా వుండాలి. ప్రస్తుతం మన జిడిపి అభివృధ్ధి రేటు క్రమంగా తగ్గుతూ 5 శాతానికి పడిపోయింది. యూపియే మన్మోహన్ సింగ్  హయాంలో అది దాదాపు 10 శాతానికి పైగా వుంది. కొలమానాలు మార్చేశారు కనుక ఇప్పుడు అది నికరంగా 5 శాతం కూడా లేదు అని బిజెపికే చెందిన మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా అంటున్నారు.

85.        ఈలోగా మళ్ళీ ముఖేష్ అంబానీ అమిత్ భాయి ఏదైనా చేయగలరు. దేశాన్ని త్వరలోనే ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చగలరు అని మరో ప్రకటన చేశారు.

86.        మన దేశంలో అధికారపక్షం భాషను కార్పొరేట్లు మాట్లాడుతున్నారు. కార్పొరేట్ల భాషను అధికారపక్షం మాట్లాడుతోంది. గతంలో ఈ సాంప్రదాయం ఇంత బాహాటంగా లేదు.


87.      ఇంతకీ మతవర్గతత్వ నియంతృత్వం ఏ కర్తవ్యాలను నిర్వహించడానికి ఆవిర్భవిస్తుందనేది ఇప్పుడు కీలక ప్రశ్న. మతవర్గతత్వ నియంతృత్వం రెండు రంగాల్లో చురుగ్గా పనిచేస్తుంది. మొదటిది, ఆర్థిక రంగం, రెండోది సాంస్కృతిక రంగం.

88.        వర్తమాన భారత సమాజపు మేధో విషాదం ఏమంటే ఆర్థిక రంగాన్ని పట్టించుకునేవాళ్ళు సాంస్కృతిక రంగాన్ని పట్టించుకోరు; సాంస్కృతిక రంగాన్ని పట్టించుకునేవాళ్ళు ఆర్థికరంగాన్ని పట్టించుకోరు.

89.        ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే మార్క్సిస్టులు వర్గం గురించి మాత్రమే మాట్లాడుతున్నారుగానీ కులమతాల గురించి మాట్లాడడం లేదు. అంబేడ్కరిస్టులు కులమతాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారుగానీ వర్గం గురించి మాట్లాడడం లేదు.

90.        చారిత్రకంగా ఐక్యం కాలసిన ప్రజా సమూహాలు  ఇప్పుడు రెండు శత్రు శిబిరాలుగా వ్యవహరిస్తున్నాయి. మార్క్స్ వెర్సెస్ అంబేడ్కర్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఈ రెండు శిబిరాలు కలవాల్సిన అవసరం వుంది.

91.      ఇంతకన్నా ప్రమాదకర ధోరణి ఏమంటే, కొన్ని ప్రాంతాల్లో  అంబేడ్కరిస్టులు  సంఘపరివారంతో అయినా జట్టు కడతాం  కానీ మార్క్సిస్టులతో  పొసగదు అంటున్నారు.  మరికొన్ని ప్రాంతాల్లో మార్క్సిస్టులు కూడ సంఘపరివారంతో అయినా జట్టు కడతాం  కానీ అంబేడ్కరిస్టులతో పొసగదు అంటున్నారు.

92.      పెట్టుబడీదారీ రాజ్యం ఇతర సందర్భాలలో ఆర్థికరంగంలో ఏం కర్తవ్యాలను నిర్వహిస్తుందో  మతవర్గతత్వ నియంతృత్వం కూడ అవే పనులు చేస్తుంది. అయితే, కొంచెం వేగంగా చేస్తుంది. కొంచెం బరి తెగించి చేస్తుంది. ఎక్కువ పక్షపాతంతో చేస్తుంది. జాతి వివక్ష అనేది పరిపాలనా విధానం అయిపోతుంది.

93.      సంపదను సృష్టించే  భూమి, అడవులు, ఖనిజాలు, కొండలు, లోయలు, నదులు, సముద్రాలు తదితర సహజ వనరులన్నింటినీ  కార్పొరేట్ల పరం చేసేస్తుంది.  

94.      దేశంలోని రేవు పట్టణాలన్నింటినీ ఆడానీలకు, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలను అంబానీలకు రాసి ఇచ్చేస్తుంటే ప్రజలు ఊరుకుంటారా? 

95.      జనాభాలో అత్యధికులుగా వుండే  సామాన్య ప్రజలు నిరుపేదలు  దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు.

96.      పోలీసులు, లాఠీలు, తుపాకులు, జైళ్ళు, ఉరికొయ్యలతో వాళ్ళ నోళ్ళను నొక్కే ప్రయత్నం ప్రభుత్వం ఎలాగూ చేస్తుంది. అశాంతిని అదుపు చేయడానికి సైన్యాన్ని కూడ రంగంలోనికి దించవచ్చు. అయితే, అది సత్ఫలితాలను ఇస్తుందన్న నమ్మకంలేదు. ప్రజలు తెగబడి పోరాటాలకు సిధ్ధపడితే అంతర్యుధ్ధం చెలరేగవచ్చు.

97.      అంతర్యుధ్ధ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి కార్పొరేట్ రాజ్యం  ప్రజల్నిమనం – వాళ్ళు అని చీలుస్తుంది. వాళ్ళు అంటే అన్యులు, ఇతరులు, పరాయివాళ్ళు, శత్రువులు ఇలా ఎన్ని అర్థాలయినా చెప్పుకోవచ్చు.

98.      మతమైనార్టీలను బూచీలుగా చూపెట్టి మిగిలిన సామాజికవర్గాల్లో ఒక బూటకపు జాతీయ  ఉన్మాదాన్ని సృష్టించి తన ఓటు బ్యాంకును విస్తరింప చేసుకుని తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు అనేక అడ్డదారులు తొక్కుతుంది ఫాసిజం. .

99.      ప్రజల్లో చీలికలు తేవడానికి కార్పొరేట్ రాజ్యానికి అనేకానేక అస్థిత్వాలు అందుబాటులో వుంటాయి. భాష, కులం, మతం, తెగ, ప్రాంతం వర్గం, మొదలైనవన్నీ అస్థిత్వాలే.

100.    ఒక్క పోలవరం ప్రాజెక్టు విషయమే తీసుకుందాం. నిర్వాశితులు కాబోతున్న ఆదివాసులకు వ్యతిరేకంగా మైదాన ప్రాంతంలో వున్న వారందరూ ఏకం అవుతున్నారు. నిజానికి మైదాన ప్రాంతంలో వున్నవారందరికీ పోలవరం వల్ల మేలు జరుగుతుందా? కృష్ణా డెల్టాలో వ్యవసాయ భూములున్న వారికి మాత్రమే మేలు జరుగుతుందా? డెల్టావ్యవసాయదారులకు అది లైఫ్ లైన్ కావచ్చుగానీ  ఆదివాసులకు లైఫ్ లైన్ కాదుకదా!  ఆదివాసులకు లైఫ్ లైన్ అడవి. మనం ఆదివాసుల్ని  మనలో భాగం అనుకోవడంలేదు. “వాళ్ళు”, “అన్యులు” “ఇతరులు” “శత్రువులు” అనుకుంటున్నాము.

101.    సమాజంలోని అస్థిత్వాలన్నింటిలోనూ పదునైన, బలమైన ఆయుధం మతం.

102.   అయితే, మతాన్ని నేరుగా రాజకీయాల్లోనికి తేవడం విద్యాధికులైన మధ్యతరగతి వర్గానికి అంతగా రుచించదు. వాళ్ళు అభ్యంతరం చెపుతారు. వాళ్లను దారికి తెచ్చుకోవడానికి ఒక మార్గం వుంది.   కార్పొరేట్లు బలపడితేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని  వాళ్లను నమ్మిస్తారు.  

103.   అప్పుడు, మతం దేశభక్తి కలగలిసి ఒక్క రూపాయి ఖర్చు కూడ లేకుండా ఒక బలమైన అసంఖ్యాక స్వఛ్ఛంద సాంస్కృతిక సైన్యం ప్రభుత్వానికి అనుకూలంగా ఏర్పడుతుంది.



104.   ప్రభుత్వానికీ, కార్పొరేట్లకూ అనుకూలంగా స్థాయీ సైన్యం సహితం చేయలేని అనేక పనుల్ని సాంస్కృతిక సైన్యం సునాయాసంగా  చేసి పడేస్తుంది.

105.   ఇటలీలో ముస్సోలినిబ్లాక్ షర్ట్స్పేరుతో ఫాసిస్టు మూకల్ని సృష్టిస్తే, జర్మనీలో అడాల్ఫ్  హిట్లర్షుట్జ్ స్టాఫెల్ (ఎస్ఎస్) పేరుతో నాజీ మూకల్ని సృష్టించాడు.

106.   జనం పిచ్చోళ్ళా? ప్రజలు అంత సులువుగా రిక్రూట్ అయిపోతారా? అనే మాటలూ వినిపిస్తున్నాయి. జనం అటుకేసి వెళుతారు. గుంపులు గుంపులుగా వెళుతారు. అందుకు కారణం మనిషి స్వభావంలోనే అంతర్గతంగా వుంటుంది.  

107.   మనిషి స్వభావసిధ్ధంగా వున్నతుడు అని ఎవరైనా అన్నప్పుడు వాళ్ళు ఒక గొప్ప విషయాన్ని చెపుతున్నట్టు మనమంతా నమ్ముతాము. కానీ, మనిషి స్వభావసిధ్ధంగానే చెడ్డవాడు అని ఎవరైనా అంటే వాళ్ళు అంతకన్నా మహత్తర విషయాన్ని చెపుతున్నారని మాత్రం మనం మరిచిపోతాం అన్నాడు జర్మన్ తత్వవేత్త జోర్జ్ విల్హెమ్ ఫ్రైడ్రిక్  హెగెల్.

108.    ప్రకృతిలో జీవితో పోల్చినా అతి క్రూరమైన జీవి మనిషి. తనను సృష్టించిన ప్రకృతినే కబళించాలనుకునే కృతఘ్నుడు. ఒక రోజు తాను సహితం నాశనం అయిపోతానని తెలిసినా ప్రకృతి విధ్వంసాన్ని ఆపని స్వార్ధపరుడు మనిషి.

109.   దేశంలో సంచలనాత్మక హత్యల్ని చేయిస్తున్నది ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలు కాదు; వేల కోట్ల రూపాయల రాజ ప్రసాదాల్లో నివశిస్తున్న శ్రీమంతులు. వీటి అర్ధం ఏమంటే భూమ్మీద అత్యంత ప్రమాదకర జీవి మనిషి.

110.   మనిషి మాంసం రుచి మరిగి మ్యాన్ ఈటర్ గా మారిన పులిని అడవినంతా గాలించి చంపేస్తారు ఆటవికులు. వ్యక్తిగత ఆస్థి రుచి మరిగిన మనిషి తమ మధ్య సంచరిస్తున్నా మౌన ప్రేక్షకుల్లా వుండిపోతారు నాగరీకులు. ఆటవికులకు వున్నంత సామాజిక బాధ్యత ఈ నాగరీకులకు లేదు. 

111.   నిన్ననే పత్రికలో ఒక వార్త చదివాను. తమ్ముడి కొడుకు బర్త్ డే రోజున  విషం కలిపిన కేకు పంపి చంపిన పెదనాన్న. అంతకు ముందు రోజు తండ్రిని చంపి పెరట్లోనే పాతిపెట్టెసిన కొడుకుల గురించి ఇంకో వార్తవుంది. ఇంకో రోజు ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య. లేదా భార్యను చంపిన భర్త. వరుసకు మేనకోడళు అయ్యే ఓ పాపను ఫర్నేస్ లో పడేసిన మేనమామ. ఇలాంటి వార్తలూ లేని దినపత్రికలు ఒక్కరోజు కూడ వుండవు. నాలుగు రాష్ట్రాల్లో మినీ స్టీలు ప్లాంటులు పెట్టి మినీ లక్ష్మీ మిట్టల్ అనిపించుకుంటున్నాయన తన వ్యాపార భాగస్వామిని చంపించాడు. బోంబే డైయ్యింగ్ అధినేత నస్లీ వాడియా మీద హత్యాయత్నం చేసినట్టు రిలయన్స్ అంబానీ సోదరుల మీద 1989లో ఓ కేసు నమోదైంది.   కన్న కూతురు షీనా బోరానును చంపిన   కార్పొరేట్ తల్లి  ఇంద్రాణీ ముఖర్జియ కేసు ఎలాగూ వుంది.

112.   ఇవన్నీ ఏం చెపుతున్నాయీ? మనుషుల్లో నరమాంస భక్షణ ప్రీతి, హంతక స్వభావం వున్నాయి అని.  

113.   Private property is an evil అన్నాడు ప్లేటో. సమాజంలో ఒక evil గా పుట్టిన  వ్యక్తిగత ఆస్తి మనిషిని Evil గా మార్చేస్తుంది. ఈ  హంతక స్వభావాన్ని మతవర్గతత్వ నియంతృత్వ  రాజ్యం తనకు వీలుగా వాడుకుంటుంది. మనుషుల్లో దాగున్న భూతాన్ని అది బిరడా తీసి బయటికి రప్పిస్తుంది.

114.   అల్లరి మూకలకు legal   Impunity ని ప్రసాదించిఇతరుల’  మీద   స్వైర విహారానికి ఉసిగొల్పుతుంది.

115.   హిట్లర్ అయితే యూదుల మీద   ‘ఇతరులు’ అనే ముద్ర వేసి కొన్ని లక్షల మందిని అతి క్రూరంగా  చంపించాడు.

116.    ఇంతటి మారణ హోమాన్ని కొనసాగించినా కార్పొరేట్ల ఆత్యాశ చావదు. వాళ్ళ వ్యాపారాలను విస్తరింప చేయడానికి కొత్త మార్కెట్లు కావాలి. యుధ్ధ్గాల ద్వార కొత్త దేశాలను కొత్త మార్కెట్లుగా మార్చుకోవాలి.

117.   ముస్సోలిని ఆఫ్రికన్ల మీద కన్నేశాడు. ఆఫ్రికా ఖండాన్ని ఖాళీ చేయించివేస్తే ఇటాలియన్లు ఛాతీ నిండా గాలి పీల్చుకోవచ్చు అన్నాడు. ఖాళీ చేయించడం అంటే కోటి రెండు కోట్ల మందిని చంపేయడం అన్నమాట.

118.   జర్మనీలో ఆహార కొరత వస్తే తూర్పు కేసి చూడాలి అన్నాడు హిట్లర్. మనకు తూర్పున రష్యా వుంటుంది. ఆదేశాన్ని ఆక్రమించుకుంటే అక్కడి యూదు రైతులు మనకోసం ఆహారాన్ని పండిస్తారంటూ జర్మన్ల ముందు ఒక భష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరిఉంచాడు.

119.    రెండవ ప్రపంచ యుధ్ధంలో తొలి విజయాలు దక్కడంతో ముస్సోలినీ, హిట్లర్ చెలరేగిపోయారు. ఆ ఉత్సాహంలో ముస్సోలిని ఆఫికా ఖండాన్ని ఖాళీ చేయించడానికి  వెళితే, హిట్లర్ సోవియట్ రష్యాను ఆక్రమించడానికి బయలు దేరాడు.

120.   రష్యాలో ఇటు నాజీ సేనలకు హిట్లర్ స్వయంగా నాయకత్వం వహించగా, అటు ఎర్రసైన్యానికి కూడ స్టాలిన్ స్వయంగా నాయకత్వం వహించాడు.

121.   ఉర్దూలో ఒక సామెత వుంటుంది, జబ్ గీదడ్ కో మౌత్ ఆతీ హై ఓ షేర్ కే తరఫ్ జాతాహై. (రాబందుకు పోగాలం దాపురించినపుడు అది పులి గుహ వైపుకు వెళుతుంది). 

122.   చరిత్రలో ఒక వైచిత్రి ఏమంటే లో ఇటలీ సేనలకు ఆఫ్రికా ఖండపు ఈజిప్టులోనే ఎదురు దెబ్బలు తగిలాయి. జర్మనీ సేనలకు రష్యాలో అయితే  ఏకంగా చావుదెబ్బే తగిలింది.

123.   ప్రభుత్వ అండతో చెలరేగిపోయిన మూకోన్మాదులకు సహితం ఫాసిజం, నాజిజంల మీద నమ్మకాలు క్రమంగా తగ్గిపోయాయి. వాళ్ళు సహితం ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలెట్టారు.

124.   ముందుగా ఇటలీలో ముస్సోలిని అధికారాన్ని కోల్పోయాడు. స్వదేశంలో  అతని ప్రాణాలకే రక్షణ లేకుండాపోయింది.

125.   తనతో సహజీవనం చేస్తున్న క్లారా పెటస్సీని వెంట బెట్టుకుని 1945 ఏప్రిల్ 27న ముస్సోలిని స్పెయిన్ కు పారిపోయేందుకు బయలుదేరాడు.  అప్పుడు స్పెయిన్ ను మరో నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో పాలిస్తున్నాడు.

126.   ముస్సోలిని, క్లారా పెటస్సీలను  ఆ రాత్రి ఇటలీ సరిహద్దుల్లో  కమ్యూనిస్టు కార్యకర్తలు పట్టుకున్నారు.

127.   బ్లాక్ షర్ట్స్ స్వైర విహారం చేస్తున్న రోజుల్లో కమ్యూనిస్టు కార్యకర్తలు దొరికితే రివాల్వర్ తో కాల్చి చంపి, శవాల తోళ్ళు వొలిచి గ్యాస్ స్టేషన్ లో కొక్కేలకు వేలాడ దీసి ఒక భయోత్పాతాన్ని సృష్టించేవారు.

128.   అంతకు ముందు బ్లాక్ షర్ట్స్ చేసినట్టే కమ్యూనిస్టు కార్యకర్తలు కూడ  ఏప్రిల్ 28న ముస్సోలిని, క్లార్తా పెటస్సీలను తుపాకితో కాల్పి చంపి, శవాల చర్మాల్ని వొలిచి, ఒక పెట్రోలు బంకులో కొక్కేలకు వేలాడగట్టి. “ఫాసిజానికి కుక్క చావు” అని నినాదాలు చేశారు.

129.   అప్పటికి జర్మనీలో హిట్లర్ పరిస్థితి కూడ పూర్తిగా దిగజారిపోయింది. ప్రేయసి ఇవా బ్రౌన్ తోపాటు బెర్లిన్ సమీపంలోని ఒక బంకరులో దాక్కొని కాలం గడుపుతున్నాడు.  ఆ సమయంలో తనను పెళ్ళి చేసుకోమని కోరింది  ఇవా.  28 అర్ధరాత్రి వాళ్ళు చాలా నిరాడంబరంగా పెళ్ళి చేసుకున్నారు.

130.   కొత్త దంపతులు మూడు రాత్రుళ్ళు కూడ గడపక ముందే ఏప్రిల్ 30న ముస్సోలిన్  చావు వార్త హిట్లర్ కు చేరింది. తనకూ కుక్క చావు తప్పదని అతనికి తెలిసిపోయింది. అతని భార్యకు కూడ ఆ విషయం అర్థం అయింది. ఆరోజు సాయంత్రం ఇవా బ్రౌన్ సైనేడ్ తాగి చనిపోయింది. హిట్లర్ రివాల్వర్ తో కణితిలో కాల్పుకుని చనిపోయాడు.

131.   ఆ మరునాడు అంటే మే డే రోజు ఎర్రసైన్యం బెర్లిన్ నగర వీధుల్లోనికి ప్రవేశించింది. స్వల్ప ప్రతిగ్హటన తరువాత జర్మన్ మూడో డీచ్ మే 8న లాంఛనంగా లొంగుబాటును ప్రకటించింది. డానినే విక్టరీ ఇన్ యూరోప్ డే (విఇ- డే) అంటారు.

132.    అక్షరాజ్యాల్లో మూడవ ప్రధాన భాగస్వామి అయిన జపాన్ మరి కొంత కాలం యుధ్ధాన్ని కొనసాగించింది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో అమేరిక హిరోషీమ, నాగసాకి నగరాలపై అణుబాంబు దాడులు జరిపిన ఆగస్టు 15న జపాన్ లొంగుబాటును ప్రకటించింది.  దీనినే విక్టరీ ఓవర్ జపాన్ డే అంటారు.  

133.   గతం నుండి వర్తమానం లోనికి వస్తే,  వర్తమాన భారతదేశంలో ఫాసిస్టు పోకడలు అనేకం కనిపిస్తున్నాయి.  మన సమాజంలో మతతత్వం చెలరేగడానికి సంఘపరివారం ఎంత కారణమో కాంగ్రెస్ కూడా అంతే కారణం. 

134.   అయితే దీనిని అప్పుడే ఫాసిజం అనవచ్చునా? మరి కొంతకాలం ఆగాలా? అనే సందేహాలు కూడా వున్నాయి.   

135.    ఒక విషయం అయితే స్పష్టం.  భారత సమాజంలో ‘మనం’ - ‘ఇతరులు’ లకు మధ్య నియంత్రణ రేఖ నిర్మాణం దాదాపు పూర్తి అయిపోయింది.

136.   అలనాటి జర్మనీలో   యూదులు, కమ్యూనిస్టులు ఇతరులుగా వున్నారు.  మన దేశంలో ఇతరులుగా  ముస్లింల పేరు ప్రముఖంగా వినపడుతున్న ప్పటికీ ఆ జాబితాలో క్రైస్తవులు, ఆదివాసులు, దళితులు, శిక్కులు కూడ వున్నారు.

137.    జర్మనీలో కమ్యూనిస్టులు ఇతర ప్రతిపక్షాలు ఐక్యంగా వున్నారు. ఇక్కడ మార్క్సిస్టులు అంబేడ్కరిస్టులు పరస్పర విరోధులుగా వున్నారు.  

138.    పార్లమెంటుకు క్రమం తప్పకుండ ఎన్నికలు జరుగుతున్నప్పుడు దాన్ని ఫాసిజం అనొచ్చునా అనేది ఇంకో ప్రశ్న.

139.    హిట్లర్ పోలెండ్ మీదనో, ఆస్ట్రీయా మీదనో దాడి చేసినట్టు భారత దేశం పొరుగుదేశాల మీద దాడి చేసే వరకు ఎదురు చూడాలని కూడ కొందరి ఆలోచన.

140.    అన్నీ ఇటలీలోనో జర్మనీలోనో జరిగినట్టే ఇక్కడా జరిగితేనే ఫాసిజం అనాలా?  ఫాసిజం సహితం తన రూపాన్ని మార్చుకోవచ్చుకదా?

141.    పోనీ దేశం రేపు ఫాసిజంగా మారిపోయాక దాన్ని ప్రతిఘటించే ప్రయత్నాలు మొదలెట్టాలా? ఇప్పటి నుండే అప్రమత్తంగా వుండాలా? అనేవి ప్రాణప్రద అంశాలు.

142.   ఇంతకీ మనం ఫాసిజాన్ని వ్యతిరేకిస్తున్నామా? ప్రేమిస్తున్నామా? భారతీయుల దేశభక్తికి ఇప్పుడు అదొక్కటే గీటురాయి.

(సెప్టెంబరు 8న విజయవాడలో జరిగిన ఫాసిస్టు వ్యతిరేక సభలో చేసిన ప్రసంగం ఆధారంగా రాసిన వ్యాసం)

//EOM//

No comments:

Post a Comment