Communal Politics and the Congress
మతవర్గతత్త్వ రాజకీయాలు
– కాంగ్రెస్
- డానీ
మత రాజకీయాలు
అనగానే మనకు సంఘపరివారం, భారతీయ జన సంఘ్, భారతీయ జనతా పార్టి వగయిరాలు గుర్తుకు
వస్తాయి. దేశంలో మతరాజకీయాలను ప్రోత్సహించడంలో భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన
పాత్ర కూడ తక్కువదేమీ కాదు.
స్వాతంత్ర్యానంతరం
భారత పార్లమెంటరీ రాజకీయాల్లో ఎడమ, కుడి, మధ్య పక్ష శిబిరాలు చాలా
కాలం నడిచాయి. అప్పట్లో కమ్యూనిస్టుల్ని వామపక్షంగానూ, భారతీయ జన సంఘ్ ను కుడి
పక్షంగానూ కాంగ్రెస్ ను మధ్యస్థ పక్షంగానూ భావించేవారు. గిరిగీసినట్టు ఎవరి రాజకీయ
సిధ్ధాంతాలు వారికి వుండేవి.
కాంగ్రెస్ 1885
నుండే రాజకీయ రంగంలో వుంది. 1925లో భారత కమ్యూనిస్టు పార్టి ఆవిర్భవించింది.
అదే సంవత్సరం ఆరెస్సెస్ కూడ ఆవిర్భవించింది. అయితే, డాక్టర్ కేశవ్ బలిరామ్
హేగ్డేవార్ స్థాపించిన ఆరెస్సెస్ ఒక హిందూత్వ సిధ్ధాంత ప్రచార సంస్థేగానీ
రాజకీయ పార్టికాదు. ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే తలంపు రెండవ సర్సంగ్ ఛాలక్
గురూజీ ఎం. ఎస్. గోల్వాల్కర్ కాలంలో కలిగింది. అప్పట్లో హిందూమహాసభ
అధ్యక్షునిగా వున్న డాక్టర్ శ్యామ ప్రసాద ముఖర్జి అధ్యక్షునిగా, సంఘ్ ప్రచారక్
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపాధ్యక్షునిగా భారతీయ జన సంఘ్ (బిజెఎస్)
ఆవిర్భవించింది. అయితే, తొలిదశలో దానికి ఎన్నికల్లో ఎన్నడూ చెప్పుకోదగ్గ మద్దతు లభించలేదు.
భారత తొలి, మలి ప్రధానులైన జవహర్ లాల్ నెహ్రు, లాల్ బహద్దూర్ శాస్త్రి ఇద్దరూ 1964-66
మధ్య ఏడాదిన్నర వ్యవధిలో చనిపోయారు.
దానితో,కేంద్ర ప్రభుత్వంలో నాయకత్వ సమస్య తలెత్తి ఒక అస్థిరత చోటుచేసుకున్న తరుణంలో రాజకీయాల్లో కాంగ్రెసేతర శక్తులు పుంజుకున్నాయి. 1967 లోక్ సభ ఎన్నికల్లో సి రాజగోపాలాచారి నాయకత్వంలోని స్వతంత్రపార్టికి 44 సీట్లు రాగా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ నాయకత్వంలోనిజన
సంఘ్ కు 35 సీట్లు దక్కాయి. వుభయ
కమ్యూనిస్టులకు 23, 19, స్థానాలు దక్కాయి. ప్రధానంగా ఢిల్లీ నగర పరిసరాల్లో జన
సంఘ్ కు మంచి పట్టు వుండేది. 1971 లోక సభ
ఎన్నికల్లో భారతీయ జనసంఘ్ కు 22 సీట్లు
దక్కగా వుభయ కమ్యూనిస్టులకు 23, 25 సీట్లు వచ్చాయి.
అప్పటి ప్రధాని
ఇందిరాగాంధి 1975లో న్యాయపరపరమైన
చిక్కుల్లో పడ్డారు. వాటిని అధిగమించడానికి ఆ ఏడాది జూన్ 26న అత్యయిక పరిస్థితిని ప్రకటించి, భారత పార్లమెంటరీ వ్యవస్థ ఆమోదాంశాన్నే సంక్షోభంలోనికి పడేశారు. ఎమర్జెన్సీ తరువాత, 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలిసారిగా పరాజయం పాలవ్వగా, కమ్యూనిస్టుల
ప్రాబల్యం కూడా తగ్గింది. ఆ ఎన్నికల్లో సిపిఎం కు 22 స్థానాలు దక్కగా, సిపిఐ బలం
కేవలం 3 స్థానాలకు పడిపోయింది. ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ఏకమై
జనతా పార్టీగా ఏర్పడ్డాయి.
జనసంఘ్ కూడ జనతా పార్టీలో చేరి రాజకీయాల్లో బలపడి తొలిసారిగా కేంద్రంలో
అధికారాన్ని పంచుకుంది. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ టిక్కెట్టు మీద 93 మంది జనసంఘ్
అభ్యర్ధులు విజయాన్ని సాధించడం విశేషం. అయితే, స్వల్పకాలంలోనే జనసంఘ్
సభ్యులకు ఆరెస్సెస్ తో వున్న అనుబంధం కారణంగా ‘ద్వంద్వ సభ్యత్వం’ పేరిట జనతా
పార్టీలో వివాదాలు తలెత్తాయి.
జనతా పార్టీలో
తలెత్తిన లుకలుకలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారాయి. 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోగా జనతా పార్టి కూటమి కకావికలైపోయింది.
కమ్యూనిస్టులు మళ్ళీ పుంజుకున్నారు. సిపియం 37 స్థానాలు దక్కించుకోగా సిపిఐకు 10
స్థానాలు దక్కాయి.
1980 లోక్ సభ
ఎన్నికల తరువాత భారత రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. జనతా పార్టి నుండి బయటికి
వచ్చిన మాజీ జన సంఘ్ సభ్యులు అటల్ బిహారీ వాజ్ పాయి, ఎల్ కే అడ్వాణిల
నాయకత్వంలో 1980 ఏప్రిల్ 6 న భారతీయ జనత పార్టిని ఏర్పాటు చేసుకున్నారు.
కొత్తగా ఏర్పడిన బిజెపి ‘గాంధీయ సోషలిజం’ తన లక్ష్యంగా ప్రకటించుకోవడం ఒక విశేషం.
మొదటి నుండీ అనేక విషయాల్లో హిట్లర్ ను ఆదర్శంగా భావించే సంఘపరివారం పార్టీ
విధానాల విషయంలోనూ హిట్లర్ నే ఆదర్శంగా తీసుకుంది. నాజీ పార్టీ పూర్తి పేరు నేషనల్
సోషలిజం. అయితే బిజెపి నేతలు జాతీయ స్థానంలో గాంధీజీ పేరు పెట్టారు.
నిజానికి గాంధీజీ పాటించిన ‘’మైనార్టీ పక్షపాత’’ విధానాలతోనూ, సామ్యవాదంతోనూ
సంఘపరివారానికి తీవ్రమైన సైధ్ధాంతిక విబేధాలున్నాయి.
సంఘపరివారం
సోషలిస్టు రాగం అందుకున్న తరుణంలో ఇందిరా గాంధి అందుకు పూర్తి విరుధ్ధంగా
వ్యవహరించారు. ఎమర్జెన్సీ చివరి ఘట్టంలో 1977 జనవరి 3న భారత రాజ్యాంగానికి 42వ
సవరణ చట్టం ద్వార ప్రవేశికలో “సామ్యవాద, లౌకికవాద” లక్ష్యాలను చేర్చిన ఘనత ఇందిరా
గాంధీదే. కానీ, తిరిగి అధికారాన్ని చేపట్టిన ఇందిరాగాంధి అప్పటి వరకు కాంగ్రెస్ కు
వున్న ‘సెంట్రిస్ట్ ఫోర్స్’ అనే ముద్రను చెరిపి వేసి రాజకీయాల్లోనూ, వ్యక్తిగత
జీవితంలోనూ మతతత్వ పోకడలు పోయారు. మతమైనార్టీలైన శిక్కుల్ని బూచీలుగా చూపెట్టి
మిగిలిన సామాజికవర్గాల్లో ఒక జాతీయ ఉన్మాదాన్ని సృష్టించి కాంగ్రెస్ ఓటు
బ్యాంకును విస్తరింప చేసుకుని తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు అడ్డదారులు
తొక్కారు. ఈ వ్యవహారం ముదిరి 1984 జూన్ మొదటి వారంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేరుతో
అమృతసర్ లోనీ హర్మందిర్ సాహెబ్ (స్వర్ణదేవాలం) మీద సైనిక దాడి వరకు సాగింది.
‘ఆపరేషన్ బ్లూస్టార్’లో చనిపోయిన జర్నైల్ సింగ్ భింద్రేన్ వాలే అభిమానులైన
ప్రధాని అంగరక్షకులు ఆ ఏడాది అక్టోబరు 31న ఇందిరా గాంధీని హత్య చేయడంతో ఒక అధ్యాయం
ముగిసి రాజీవ్ గాంధీ అధ్యాయం ఆరంభమయింది.
ఇందిరాగాంధీ
హత్యానంతరం దేశరాజధాని ఢిల్లీతో సహా దేశంలో అనేక చోట్ల శిక్కుల మీద ఊచకోత సాగింది.
ప్రభుత్వ లెఖ్ఖల ప్రకారమే ఢిల్లీలో 2800 మంది ఇతర నగరాల్లో 3350 మంది శిక్కులు
చనిపోయారు. స్వతంత్ర సంస్థల లెఖ్ఖలు దీనికి రెట్టింపుకన్నా ఎక్కువగా వున్నాయి.
రెండు నెలల
తరువాత జరిగిన 1984 లోక్ సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్
రికార్డు స్థాయిలో 414 సీట్లు గెలుచుకోగా బిజెపి బలం కేవలం రెండు స్థానాలకు
పడిపోయింది. ఇందిరాగాంధీ హత్యతో దేశమంతటా కాంగ్రెస్ కు అనుకూలంగా సానుభూతి పవనాలు
వీచాయని ఎక్కువ మంది భావించారు. అయితే, మతతత్త్వం మూలంగా తనకు భారీ ఆధిక్యత
వచ్చిందని రాజీవ్ గాంధీ గుర్తించారు. ఆ నమ్మకంతో ఇందిరాగాంధి మలిదశ మతతత్వ
విధానాలనే వారు కొనసాగించారు. విడాకులు పొందిన ముస్లిం మహిళకు మనోవర్తిని రద్దు
చేస్తూ ముస్లిం ఛాందసులకు అనుకూలంగా చట్టం తేవడం, అయోధ్యలో రామమందిరం తలుపులు
తెరిచి కొత్త వివాదానికి తెర లేపడం వగయిరా కీలక నిర్ణయాలన్నీ ఈ క్రమంలో సాగినవే.
చివరకు 1989 లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని సహితం రాజీవ్ గాంధీ ఆయోధ్య నుండే
మొదలెట్టారు.
జాతీయ సామ్యవాదం
విధానంతో కొత్త సమూహాల్లోనికి దూసుకు పోవచ్చని ఆశించిన బిజేపి 1984 ఎన్నికల్లో
ఘోరంగా విఫలమయింది. జన సంఘ్ స్థావరంగా భావించే ఢిల్లీలో సహితం ఒక్క సీటు కూడ
రాకపోవడంతో ఆ పార్టి పునరాలోచనలో పడింది. మరోవైపు రాజీవ్ గాంధి హిందూత్వ
నినాదాన్ని హైజాక్ చేసి ముందుకు దూసుకుపోతుండడాన్ని సంఘీయులు సహించ లేకపోయారు.
మృదు హిందూత్వ ముద్ర వున్న వాజ్ పాయిని నాయకత్వం నుండి తప్పించి ముదురు హిందూత్వ
ముద్ర వున్న అడ్వాణీకి బిజెపి నాయకత్వాన్ని అప్పచెప్పారు. అడ్వానీకీ మద్దతుగా విశ్వహిందూ
పరిషత్ రంగ ప్రవేశం చేసి రామమందిరం నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి, ఆర్టికల్ 370
రద్దు అంశాలను చర్చనీయాంశాలుగా మార్చి దేశ వ్యాప్తంగా అలజడి సృష్టించింది.
1989 లోక్ సభ
ఎన్నికల సంవత్సరం అనేక విధాలుగా బిజెపికి కలిసి వచ్చింది. ఫిబ్రవరి 1న కుంభమేళ
జరిగింది. అక్కడ విహెచ్ పి నిర్వహించిన సంత్ సమ్మేళన్ అయోధ్యలో శిలాన్యాస్
జరుపుతామని ప్రకటించింది. ఏప్రిల్ 1న ఆరెస్సెస్ వ్యవస్థాపకులు హెగ్డేవార్
శతజయంతోత్సవాలు జరిగాయి. ఆ సభలో వాజ్ పాయి ‘సహితం’ చెలరేగిపోయారు.
“ముస్లింలు తమ ప్రత్యేక అస్తిత్వాన్ని వదులుకోవాలి లేదా తీవ్ర పరిణామాల్ని
ఎదుర్కోవడానికి సిధ్ధపడాలి” అని హెచ్చరించారు. జూన్ రెండవ వారంలో హిమాచల్ ప్రదేశ్
లోని పాలంపూరులో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం రామ్ మందిర్ ఉద్యమాన్ని
ఉధృతం చేయాలని తీర్మానించింది. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. అంతటి
ఉత్కంఠలోనూ నవంబరు 9న శిలాన్యాస్ జరిగిపోయింది.
ముహూర్తాలు
నిర్ణయించడంలో సంఘపరివారంది ఒక ప్రత్యేక శైలి. నవంబరు 9 బెర్లిన్ గోడను కూల్చేసిన
రోజు. 1992లో బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబరు 6 అంబేడ్కర్ పుట్టిన రోజు.
ఇప్పుడు జమ్మూ-కశ్మీర్ లో విభజనకు నిర్ణయించిన అప్పాయింటెడ్ డే అక్టోబరు 31
సర్దార్ వల్లభ్ భాయి పటేల్ పుట్టిన రోజు.
1984 లోక్ సభ
ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు పరిమితమైన బిజెపి రామమందిరం నినాదంతో 1989
ఎన్నికల్లో 85 స్థానాలను గెలుచుకుని విపి సింగ్ ప్రభుత్వాన్ని నియంత్రించే
స్థాయికి ఎదిగింది. ఆ తరువాత సాగిన చరిత్ర మనకందరికీ తెలిసిందే.
రాహుల్ గాంధీ
నాయకత్వంలోని కాంగ్రెస్ ఓ రెండేళ్లుగా రాజీవ్ గాంధి హిందూత్వ విధానాలతో కొనసాగాలని
భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అప్పుడు ఆ పార్టీకి ప్రతి ఎన్నికలలోనూ 1989
ఎన్నికల ఫలితాలు తప్పవు.
(రచయిత సీనియర్ జర్నలిస్ట్, సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 9010757776
రచ్న : 31 ఆగస్టు 2019
ప్రచురణ : ప్రజాపాలన దినపత్రిక, 24 సెప్టెంబరు 2019
No comments:
Post a Comment