Thursday, 20 December 2018

Political Silence can also be decoded


రాజకీయాల్లో మౌనాన్ని కూడా డీకోడ్ చేయవచ్చు
ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ)  

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను రాయతీలు అడగడం ప్రజా సమూహాలకు సహజ హక్కు. అధికార పార్టీ ఇస్తున్న రాయితీలకన్నా ఎక్కువ రాయితీలను ప్రకటించమని ప్రతిపక్ష పార్టిని ప్రజా సమూహాలు కోరుతాయి.   ప్రతిపక్షం స్పందించి కొత్త రాయితీలను ప్రకటిస్తే, వాటిని చూపి రాయితీల ప్యాకేజ్ ను పెంచమని అధికార పార్టీని మళ్ళీ అడుగుతాయి. అణగారిన ప్రజా సమూహాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లాబీయింగ్ ద్వారా క్రమక్రమంగా, దశలవారీగా తమ రాయితీలను పెంచుకునే తీరు ఇదే. ఈ క్రమం సర్పూలాకృతి (spiral)లో సాగుతుంది. అంతిమంగా ఎన్నికల సమయంలో ఎవరి ప్యాకేజి బాగుంటే ఆ పార్టీకే ఓటు వేస్తారు. ఇలా రాయితీలు కోరే ముస్లిం సమూహానికి కూడా వుంటుంది.
                ఎన్నికల్లో  ప్రధాన పార్టీలన్నీ పోటీచేస్తాయి. అనుకూల ప్రతికూలతలను బట్టి కొన్ని గెలుస్తాయి, కొన్ని గెలవలేవు. ప్రజా సమూహాల కోరికలూ అంతే. ప్రతి ఎన్నికల సమయంలోనూ ప్రజా సమూహాల కోరికల్ని నెరవేర్చుకునేందుకే ప్రయత్నం చేస్తాయి. అనుకూల ప్రతికూలతలను బట్టి  కొన్ని ఎన్నికల్లో కొన్ని కోరికలు నెరవేరుతాయి. కొన్ని ఆలా వాయిదా పడిపోతూ వుంటాయి. ప్రజా సమూహాలన్నింటి సంక్షేమాన్ని, ఆ సమూహాల్లోనూ ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ప్రభుత్వాలు తమ బాధ్యతను నెరవేర్చకపోవడం వల్లనే ప్రజలు తమ కోరికల్ని నెరవేర్చుకోవడానికి ఉద్యమాలో, లాబీయింగులో చేయాల్సి వస్తుంది.
గతంలో, ఇందిరా గాంధి, ఎన్టీ రామారావు,  వైయస్ రాజశేఖర రెడ్డిల వద్ద లాబీయింగ్ ద్వారానే ముస్లింలు కొన్ని మేళ్ళను సాధించుకున్నారు.  అందుకు కృతజ్ఞతగా ఆయా ఎన్నికల్లో ముస్లింలు ఆయా పార్టీలకు మద్దతు పలికారు. అందుకు భిన్నంగా వ్యవహరించిన సందర్భాల్లో నిర్దాక్షిణ్యంగా ఆ పార్టిల్ని ఓడించారు కూడా. వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడుకోవాలి.
ఇందిరా గాంధి పెట్టిన పార్టి అనో, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అనో, వైయస్ రాజశేఖరెడ్డి కొడుకు పెట్టిన పార్టీ అనో ప్రజలు ఎప్పుడూ ఎవరికీ  ఓటు వేయరు. అయితే, కొన్ని ఎన్నికల్లో భావోద్వేగాలు కూడా పనిచేస్తాయి. ఎవరయినా చనిపోయినపుడు వాళ్ళ వారసుల్ని ప్రజలు గెలిపిస్తారు. ఆ సానుభూతి ఒక్కసారి  మాత్రమే వుంటుంది. ఆ తరువాత ఏ ఎన్నికల లెఖ్ఖ ఆ ఎన్నికలదే.
            బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా ముస్లింలు పనిచేశారు. ప్రజాస్వామిక మార్గాల్లో ముస్లింలు సాగించిన  వత్తిడికి కాంగ్రెస్ దిగి వచ్చింది. ముస్లింలకు క్షమాపణలు చెప్పి వారిని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేసింది. దాని ఫలితంగానే జాతీయ స్థాయిలో  సచార్ కమిటిని వేశారు. ఆంధ్రప్రదేశ్ లో 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. వీటిని కాంగ్రెస్ ఇచ్చిందన్నది ఎంత వాస్తవమో ముస్లింలు సాధించుకున్నారన్నది కూడా అంతే వాస్తవం. లాబీయింగ్ చేయకుండా,  వత్తిడి తేకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ రాయితీ రాదు.
            ముస్లింల 4 శాతం రిజర్వేషన్ లో సయ్యద్, పఠాన్, మీర్జా, బేగ్, తదితర సమూహాలూ లేవు. వీరిని కూడా  బిసి జాబితాలో చేర్చాలని ముస్లింలు మొదటి నుండీ కోరుతున్నారు. భారత ముస్లిం సమాజం మొత్తాన్ని సాంస్కృతికంగా వెనుకబడిన ఒక సమూహంగా గుర్తించాలనేది ముస్లింల ప్రధాన డిమాండు. వీళ్లందరికీ 5%  రిజర్వేషన్ ఇస్తానన్నది వైయస్ ఎన్నికల హామీ. తరువాత సాంకేతిక కారణాలు చూపి దాన్ని 4 శాతానికి కుదించారు. 2004లో వైస్  రాజశేఖర రెడ్డికి వచ్చిన ఓట్లు, సీట్లు కన్నా 2009 ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లు రెండూ తక్కువ. వారే స్వయంగా ఓ ప్రెస్ మీట్ లో “ప్రజలు మాకు పాస్ మార్కులు మాత్రమే వేశారు” అన్నారు. ఆ పాస్ మార్కుల్ని కూడా తాను ముస్లింల మద్దతుతోనే సాధించినట్టు  వైయస్ కు తెలుసు. సయ్యద్, పఠాన్, మీర్జా, బేగ్, తదితర సమూహాలకు మేళ్ళు చేసే ప్రక్రియను కూడా చేపట్టాలని వారనుకున్నారు. జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ముస్లింల డిమాండ్. దాన్ని వారు ఎలా పరిష్కరించేవారోగానీ ఈ లోపులో హఠాత్తుగా చనిపోయారు.
            వైయస్ రాజకీయ వారసునిగా రంగప్రవేశం చేసిన జగన్ ను ముస్లింలు గట్టిగా నమ్మేరు. గట్టి మద్దతు ఇచ్చారు. కడప అసెంబ్లీ, లోక్ సభ ఉప ఎన్నికలతో కలుపుకుంటే మూడు ఎన్నికల్లో జగన్ కు అండగా నిలిచారు. ఇంతగా మద్దతు ఇచ్చినా జగన్ ఎన్నడూ ముస్లిం కొత్త ప్యాకేజి గురించి ప్రస్తవించలేదు. 
          మరోవైపు, 2014లో బిజెపితో జతకట్టి అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవాలని ముస్లింలను అనేక విభాగాల్లో  ఇబ్బందులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముస్లింలు ఇంతటి మనోవేదనకు గురి అయిన కాలం లేదు. పొరుగురాష్ట్రం తెలంగాణలో కేసిఆర్ ముస్లిం ఫ్రెండ్లీ పాలనను సాగిస్తే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అందుకు విరుధ్ధంగా యాంటి ముస్లిం పాలనను సాగించారు. ఎన్నికలు వస్తే చంద్రబాబును ఓడించడానికి తమ శక్తినంతా ఉపయోగించాలని మంది ముస్లింలు భావించారు.
            ఈ పరిణామాలకు టర్నింగ్ పాయింట్ నంద్యాల ఉపఎన్నికలు. ముస్లింలను సంతుష్టిపరచాల్సిన అవసరాన్ని చంద్రబాబు అప్పుడే గుర్తించారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వానికి దగ్గర కావలసిన అవసరాన్ని జగన్ గుర్తించారు. వాళ్ళిద్దరి రాజకీయ కదలికల్ని ముస్లింలు గుర్తించారు.
            నంద్యాల ఉపఎన్నికలు జరగడానికి ఓ మూడు నెలలు ముందు జగన్ ఢిల్లీ వెళ్ళీ ప్రధాని నరేంద్ర మోదిని కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఎ అభ్యర్ధి ఎవరైనా సరే తమ మద్దతు వుంటుందని చెప్పారు.  అంతేకాక, “అసలు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నిజంగా ఎవరయినా (బిజెపికి వ్యతిరేకంగా) పోటీ పెట్టాలని అనుకుంటే అది తప్పు”  అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి  ఒక హెచ్చరిక కూడా చేశారు. ఢిల్లీలో ఒక విధంగా వారు ఎన్డీఏ కన్వీనర్ గా వ్యవహరించారు. మోది జగన్ ల కొత్త రాజకీయ హనీమూన్ ప్రభావం ముస్లింల మీద పడి నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది.  
ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో  రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. రాజకీయ కారణాలతో కొంత, వ్యక్తిగత కారణాలతో మరికొంత చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఎన్ డి ఏ నుండి టిడిపి  బయటికి వచ్చేసింది. అలా ఏర్పడిన ఖాళీలో ప్రవేశించడానికి జగన్ చాలా ఉత్సుకతతో పావుల్ని వేగంగా కదిపారు. భువనసుందరి కథలోలా జగన్ రాజకీయాల్లోనికి చంద్రబాబు ప్రవేశిస్తే,   చంద్రబాబు రాజకీయాల్లోనికి జగన్ పరకాయ ప్రవేశం చేశారు. ఫలితంగా ముస్లింలకు దగ్గర కావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే ముస్లింలను దూరంగా వుంచడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు.
మొదట్లో చిన్న తగవుగా మొదలయిన మోదీ బాబూ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మోదీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ మొదలయిన విమర్శలు మోదీ ఫాసిస్టూ, నియంత, మతోన్మాది, దేశ ఆర్థిక వ్యవస్థ వినాశకారుడు అనే వరకు పెరిగాయి. ముందు మోదీతో మొదలయిన వివాదం తరువాత బిజెపికి విస్తరించింది. ఆ తరువాత ఎన్ డి ఏ కు ఆ తరువాత  సంఘపరివారానికి విస్తరించింది. ఇక అక్కడి నుండి వారు వెనక్కు తిరిగే అవకాశాలు లేవు. కనీసం ఈ ఎన్నికల వరకు అది జరిగే పని కాదు. 
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ముస్లింలలో ఒక చిన్న భాగం మాత్రమే టిడిపికి మద్దతుదారులుగా వుంది. . మోదీతో తలపడి ఎన్నికల్లో గెలవాలంటే మిగిలిన ముస్లింలను సహితం సంతుష్టికరించాల్సిన అవసరాన్ని చంద్రబాబు సరిగ్గానే గుర్తించారు. నంద్యాల ఉపఎన్నికలు జరిగిన సరిగ్గా ఏడాది తరువాత ‘నారా హమారా! టిడిపి హమారా!’ పేరుతో గుంటూరులో  ముస్లిం మహాసభ నిర్వహించి 24 అంశాలతో ఒక ప్యాకేజి ప్రకటించారు.
కేంద్రంలో  మోదీ నియంతృత్వ పాలను అంతం చేస్తానంటున్న చంద్రబాబు సవాలు ఉత్సాహాన్ని ఇస్తున్నప్పటికీ గుంటూరు ప్యాకేజి నిజానికి ముస్లింల ఆశలకు తగ్గట్టుగా లేదు. ముఖ్యంగా, చట్ట సభల్లో ముస్లింల ప్రాతినిధ్యాన్ని పెంచే అంశం మీద హామీ అందులో స్పష్టంగా లేదు. ప్రజాస్వామ్యంలో అధికారపక్షంకన్నా ప్రతిపక్షం ఎంతో ఉదారంగా వుండాలి. అధికార పక్షం ముస్లిం ప్యాకేజీని ప్రకటించినపుడు ప్రతిపక్షం దానికి పోటీగా అంతకన్నా మెరుగైనా ప్యాకేజీని ప్రకటించాలి. కానీ జగన్ ఆ పని చేయలేదు. చేయదలచడం లేదనే సంకేతాలూ వస్తున్నాయి.  గతంలో ముస్లింల ప్యాకేజీ మీద చంద్రబాబు చూపించిన నిర్లిప్తంగా ఉన్నట్లు ఇప్పుడు జగన్కూడా పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారు. వారు ప్రజాస్వామిక బాధ్యతను నిర్వర్తించపోగా ప్రజాస్వామ్య ప్రక్రియకు అడ్దంకిగా మారారు. జగన్ ఇప్పుడు తాను మోదీ పంచన చేరినట్టూ ఒప్పుకోరు. ముస్లింలను దూరంగా పెడుతున్నట్టూ ఒప్పుకోరు. అన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానంగా వుంటున్నారు.
అయితే రాజకీయాల్లో మౌనాన్ని కూడా సులువుగా డీకోడ్ చేయవచ్చు. కొన్ని లొగరిథమ్స్ ను వుపయోగించి మౌనాన్ని శబ్దంగా మార్చవచ్చు. వైసిపి సంస్థాగత నిర్మాణంలోని 6 జోన్లు, 25 పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లాల బాధ్యుల్ని గమనిస్తే జగన్ సోషల్ ఇంజినీరింగ్ అర్ధం అయిపోతుంది.  31 మంది బాధ్యుల్లో ఒక్కరంటే ఒక్క ముస్లిం కూడా లేకుండా చేసి ముస్లిం సమాజానికి జగన్ ఏం సంకేతాన్ని ఇస్తున్నారూ? ముస్లిం ప్రాతినిథ్యం మీద జగన్ విధానం ఏమిటీ? అది వారు చెప్పకుండానే అర్థం అవుతోంది.
విచిత్రం ఏమంటే కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిమ పవన్ కళ్యాణ్ సహితం ముస్లిం సమస్యల పరిష్కారం  విషయంలో జగన్ బాటలోనే నడుస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లు టిడిపి-కాంగ్రెస్ మధ్యో, టిడిపి-వైసిపి మధ్యో ఊగిసలాడుతూ వుండిపోతున్నారే తప్ప ముస్లింల అభ్యున్నతిని సాధించే స్వతంత్ర ప్రత్యామ్నాయ కార్యక్రమం అంటూ ఒకటి ఏర్పరచుకోలేకపోయారు. సిపిఐ, సిపిఎం రాష్ట్రశాఖలు   ఏడాది ఆగస్టు 27 కర్నూలులో ముస్లిం మేధావులు, ఉద్యమ ప్రతినిధులతో ఒక సదస్సు నిర్వహించి  ముస్లిం అభ్యున్నతి కార్యక్రమం ఒకదాన్ని రూపొందించారు. వామపక్షాలతో కలిసి నడుస్తానంటున్న జనసేన నేత పవన్కళ్యాణ్ఇంకా విషయంలో తన పార్టీ విధానమేమిటో చెప్పకపోవడం విశేషం. వారి మౌనాన్ని కూడా డీకోడ్ చేయాల్సివుంది.  
(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్) సెల్ 9010757776
రచన : 18 డిసెంబరు 2018
ప్రచురణ : ప్రజాశక్తి దినపత్రిక, 21 డిసెంబరు 2018

http://www.prajasakti.com/Article/Neti_Vyasam/2098807

Thursday, 13 December 2018

On KCR's Non-Congress, Non-BJP Governments


 కాంగ్రెస్, బీజేపి ముఫ్త్ సర్కార్

డానీ


ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తమను తాము పరిపాలించుకోవడం అనేది నిఘంటువు అర్థం మాత్రమే. ఎంత గొప్ప ఆదర్శ ప్రజాస్వామ్య దేశంలో అయినా అధికార పార్టీయే ప్రభుత్వ రూపంలో ప్రజల్ని పాలిస్తుంది. అందువల్ల ప్రజలకూ, ప్రభుత్వానికి మధ్య ఎప్పుడూ ఒక ఘర్షణ వుంటుంది.    ఘర్షణ ఒక్కోసారి కనిపించనంత  తక్కువగా వుండవచ్చు, ఒక్కోసారి భరించలేనంత ఎక్కువగానూ వుండవచ్చు. ప్రజలకూ, ప్రభుత్వానికి మధ్య కొనసాగే ఘర్షణను ఎన్నికలు క్రమబధ్ధం చేస్తుంటాయి.

ప్రజలు తమ ఆకాంక్షల్ని నెరవేర్చగల ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి వున్న రెండు ప్రధాన సాధనాల్లో ఎన్నికలు మొదటివి. ఇందులో ఒక పరిమితి వుంది. తమ ఆకాంక్షల్ని నేరవేరుస్తాయనే నమ్మకంతోనే ప్రజలు కొత్త రాజకీయ పార్టీలకు అధికారాన్ని కట్టబెడతారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర అంత వరకే. కొత్తగా ఎన్నికయిన రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తాయా? లేదా అనేది వేరే అంశం.

 మరోవైపు, ప్రభుత్వాలు సహితం ఐదేళ్ళకు ఒకసారి తమ ఆధిపత్యానికి ప్రజల ఆమోదాన్ని తిరిగి పొందాల్సి వుంటుంది. అధికారం చేజారిపోతుందనే భయంతో అయినా అధికార పార్టీలు సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుకూలమైన విధానాలు కొన్నయినా అనుసరిస్తాయని  ప్రజాస్వామిక సిధ్ధాంతవేత్తలు గట్టిగా నమ్మేరు. అయితే, మన రాజకీయ నాయకులు అతి తెలివైనవారు. “ఓ ఐదేళ్ళు మేము ఓ ఐదేళ్ళు మీరు  వంతుల వారీగా అధికారాన్ని పంచుకుందాం” అంటూ ప్రత్యర్ధులతో సంతుష్టికరణ ఒప్పందాలు చేసుకుంటున్నారు.  రాజస్తాన్ దీనికి గొప్ప ఉదాహరణ. ప్రతి ఎన్నికల్లోనూ అధికారపార్టీని చిత్తుగా ఓడించేస్తున్నామనే ఆనందం రాజస్థానీయులకు దక్కుతూ వుండవచ్చుగానీ ఈ ఆటకు లబ్దిదారులు మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలే. 

మనది బహుళ రాజకీయ పార్టీల ప్రజాస్వామ్యం అనుకుంటాంగానీ, జాతీయస్థాయిలో అయినా, రాష్ట్రాల స్థాయిలో అయినా క్రమంగా రెండు శిబిరాల రాజకీయ వ్యవస్థ బలంగా రూపుదిద్దుకుంటోంది. జాతీయంగా బిజెపి- కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో టిడిపి-వైసిపి, తెలంగాణలో టిఆర్ ఎస్- కాంగ్రెస్, రాజస్తాన్, గుజరాత్ లలో బిజెపి- కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధులుగా కొనసాగుతున్నాయి. ఇలాంటి రెండు శిబిరాల రాజకీయవ్యవస్థలో మొదటి రెండు పార్టీలు కాకుండా మిగిలిన పార్టీలన్నీ ఆటలో బుడంకాయలుగా మారిపోతున్నాయి.

ఓసారి ఎన్నికల్లో చేజారిన అధికారం తదుపరి ఎన్నికల్లో తిరిగి వచ్చేస్తుందనే ధీమాతో ప్రధాన రాజకీయ పార్టీలు వుంటున్నాయి. దానితో, ప్రజల శాంతి సౌభాగ్యాలను మెరుగుపరిచే అంశాలు పక్కకు పోతున్నాయి. మతవాద -మితవాద, హార్డ్ హిందూత్వ - సాఫ్ట్ హిందూత్వ వంటి కేవల భావోద్వేగ అంశాల మీద ఎన్నికలు జరుగుతున్నాయి. మనం సరిగ్గా గమనించలేదుగానీ నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీల్లో ఎవరు గొప్ప హిందువు అనేది వచ్చే లోక్ సభ ఎన్నికల ప్రధాన జాతీయ ఎజెండాగా నిర్ణయం అయిపోయింది.

నిర్ణిత గడువు ప్రకారం వచ్చే ఏడాది లోక్ సభతోపాటు శాసనసభ ఎన్నికలు జమిలిగా జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వున్నాయి. జాతీయ రాజకీయాల్లో బిజెపిని కాదనుకుంటే కాంగ్రెస్ తో కలవక తప్పదని తెలుగుదేశం పార్టి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సరిగ్గానే గుర్తించారు. ఆ మేరకు వారు చిరకాల రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ తో చాలా ఉత్సాహంగా సంబంధాలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబుది స్థూల తర్కం మాత్రమే.

దేశ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు సహితం జాతీయ ఎజెండా మీద జరిగితే ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయనే ఆశతో కమలనాథులు కొంత కాలంగా జమిలి ఎన్నికల్ని బలంగా ప్రతిపాదిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో బిజెపికి ఒక్క చోట కూడా అధికారం దక్కకుండా చేసిన ‘లోక్ సభ సెమీ ఫైనల్’ ఎన్నికల్ని జమిలిగా జరిపివుంటే ఫలితాలు తద్విరుధ్ధంగా వుందేవనేది కమలనాధుల అంచనా.

బిజెపి, కాంగ్రెస్ కలిసి నిర్ణయించిన జాతీయ రాజకీయ ఎజెండా హోరులో జమిలి ఎన్నికలు జరిగితే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ఎజెండాలు అప్రధానంగా మారిపోయే ప్రమాదం వుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పసికట్టారు. అలా గనుక జరిగితే తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బిజెపిల మధ్య సాగి  టిఆర్ ఎస్ అప్రధానం అయిపోతుందని వారు ఆందోళన చెందారు. తనకు కలిసి వచ్చే తెలంగాణ సెంటిమెంట్ మీద ఎన్నికలు జరగాలంటే లోక్ సభ ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికల్ని జరిపేయాల్సిన అవసరాన్ని కేసిఆర్ గుర్తించారు. ముందు జాగ్రత్తతో ముందస్తు ఎన్నికలకు  తెరలేపారు.  కేసిఆర్ గతంలో చంద్రబాబుకు సహాయకునిగా పనిచేశారు. ఇప్పుడు వారు గురువును మించిన శిష్యునిగా మారి జమిలి ఎన్నికల సంక్లిష్ట తర్కాన్ని కూడా దర్శించగలిగారు

కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం మీద అనేక మంది అనేక రకాల ఊహాగానాలు చేశారు.  గానీ, తెలంగాణ సెంటిమెంట్ ను మరొక్కసారి ప్రధాన ఎజెండాగా మార్చడానికే వారు ఆ నిర్ణయం తీసుకున్నారని మాత్రం ఎవరూ గమనించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్ళు అయిపోయిన కారణంగా ప్రాంతీయ సెంటిమెంటు తీవ్రత సాధారణంగా తగ్గిపోతుంది. కానీ తెలంగాణ సెంటిమెంటుని రక్కి పెంచి కేసిఆర్ నెత్తిన పాలు పోసిన ఘనత ‘నటసింహ’ బాలకృష్ణది. కూకట్ పల్లి సెంటర్లో నిలబడి “ఆంధ్రాకు రా! చూసుకుందాం” అన్న డైలాగు  తెలంగాణ ఆంధ్రులకే బొత్తిగా నచ్చలేదు. వాళ్ళు సహితం సైకిల్ గుర్తును చూసి భయపడే పరిస్థితి తెచ్చారు బాలకృష్ణ. 

ప్రధాని నరేంద్ర మోదీ తనను దారుణంగా మోసం చేస్తున్నారని రాజకీయాల్లో ఆయనకన్నా ‘సీనియర్’ చంద్రబాబుకు నాలుగేళ్ళు తెలిసిరాలేదు. సరే. హరికృష్ణ ఇంటిలో తాను ప్రతిపాదించిన పొత్తును కేసిఆర్ తిరస్కరించినపుడయినా ముందస్తు ఎన్నికలకు జూనియర్ రచించిన గేమ్ ప్లాన్ ఆ సీనియర్ కు అర్ధం కావాలిగా? కాలేదు. కేసిఆర్ తెలంగాణ సెంటిమెంటుతోనూ, చంద్రబాబు అభివృధ్ధి నినాదంతోనూ బరిలో దిగారు. 

ఎప్పటిలానే చంద్రబాబు ‘అభివృధ్ధి’ మంత్రం ఈసారి కూడా పని చేయలేదు. వరుసగా 2004, 2009, 2014 (తెలంగాణ) ఎన్నికల్లో పరాజయం పాలయినా సరే తను కొనసాగిస్తున్న  ‘కార్పొరేట్ పెరుగుదల’ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుందని వారు గుర్తించలేక పోతున్నారు. 2016 జీహెచ్ ఎంసి ఎన్నికల్లో ఆధునిక హైదరాబాద్ నిర్మాతను తనేనని ప్రచారం  చేసుకుంటే 150 డివిజన్లలో అవమానకరంగా ఒక్కటంటే ఒక్క డివిజన్ మాత్రమే వారికి దక్కింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో సైబరాబాద్ నేనే నిర్మించాను అని చంద్రబాబు చెప్పుకోవడం ఓటర్లకు చీదర పుట్టించింది. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ సిఇవో వచ్చి బెజవాడ, ధవిళేశ్వరం ఆనకట్టలు నేనే నిర్మించాను అంటే  ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు వేస్తారా? అందుకే, మీడియా నుండి గొప్ప మద్దతు లభించినా టిడిపికి రెండు స్థానాలు (1.68శాతం) మాత్రమే దక్కాయి. 

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, కొత్తగా రాజకీయ నాయకుని అవతారం ఎత్తిన శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద విస్తృతంగా ప్రచారం చేస్తే బిజెపికి వున్న ఐదు సీట్ల లో నాలుగు పోయాయి. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ నడిచిన మార్గంలో స్వామి పరిపూర్ణానంద  శ్రీపీఠం నుండి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠానికి పయనమయ్యారని గట్టిగానే ప్రచారం సాగింది. వారంతా మరో రెండు రోజులు పర్యటిస్తే ఆ మిగిలిన గోషామహల్ సీటును కూడా పోగొట్టి వుండేవారు. 2014లో మోదీ ఎక్కడికి వెళ్ళినా పది ఓట్లు వచ్చేవి. ఇప్పుడు మోదీ ఎక్కడికి వెళ్ళినా  పది సీట్లు పోతున్నాయి.

కోదండరామ్ కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుని ఊరుకుంటే సరిపోయేదేమోగానీ ఆయన టిడిపితో కలవడంతో కేసిఆర్ పని సులభమైపోయింది. గద్దర్ కూడా సరిగ్గా ఆ తప్పే చేశారు. ప్రజాయుధ్ధ నౌక మూసీ నదిలో మునిగింది. వీళ్ళెవరికీ తెలంగాణ సెంటిమెంటును స్వంతం చేసుకోవడం సాధ్యం కాలేదు. మరోవైపు, తనను ఒక్కడ్ని చేసి ఓడించడానికి తన శత్రువులందరూ ఎకమయ్యారని కేసిఆర్ చెప్పుకోవడానికి వీళ్లంతా గొప్పగా  దోహదపడ్డారు.

ఈ ముందస్తు ఎన్నికల ఆది మధ్యాంతాలు అన్నీ కేసిఆర్ ప్లానింగ్ ప్రకారమే జరిగాయి. జాతీయ ప్రధాన పార్టీల్లో ఒకటయిన బిజెపి తెలంగాణలో భూమట్టానికి పడిపోయింది. కాంగ్రెస్-టిడిపిలు చావుతప్పి లొట్టపోయాయి. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రభుత్వం ఏర్పడింది. కేసిఆర్ మాటల్లో అది “కాంగ్రెస్ ముఫ్త్, బీజేపి ముఫ్త్ సర్కార్”.

ఎన్నికల్లో టిఆర్ ఎస్ ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తే, విజయానంతరం కేసిఆర్  చేసిన ప్రసంగం ఒక భూకంపంపాన్ని సృష్టించింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలను కొత్త విలువలతో పునర్ నిర్వచిస్తామన్నారు. ఉమ్మడి జాబితాను రద్దు చేస్తామన్నారు. ఎస్ టి, ఎస్ సి, బిసి, ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల ఫెడరల్ హక్కుల్ని కాలరాసే తీర్పులు ఇస్తే సుప్రీం కోర్టును కూడా అదుపు చేస్తామని ఒక హెచ్చరిక చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి రాజకీయ నాయకులు సుప్రీం కోర్టు మీద ఈ స్థాయి వ్యాఖ్యలు చేయడం భూకంపంకన్నా తక్కువేమీ కాదు.  కేసిఆర్ నిర్ణయాన్ని ఆహ్వానిద్దాం. మద్దతునిద్దాం.

తాము జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి కేంద్రంలో కాంగ్రెస్, బీజేపి ముఫ్త్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా కేసిఆర్ అంటున్నారు. ఇది పునః పరిశీలించాల్సిన అంశం. ఎందుకంటే,  రేపటి లోక్ సభ ఎన్నికల్లో బిజేపి వ్యతిరేక ఓటు పూర్తిగా కాంగ్రెస్ శిబిరానికి పడకపోతే, సంఘపరివారం మళ్ళీ లబ్దిపొంది, కేంద్రంలో యధాస్థితి కొనసాగే ప్రమాదం వుంటుంది.

(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు)
సెల్ ఫోన్ : 9010757776

రచన : 13 డిసెంబరు 2018
ప్రచురణ : మన తెలంగాణ దినపత్రిక, 14 డిసెంబరు 2018

Sunday, 2 December 2018

ROBO 2.O – ఒక అమానవీయ బాక్సాఫీసు హిట్ సూత్రం !



ROBO 2.O – ఒక అమానవీయ బాక్సాఫీసు హిట్ సూత్రం !
The story of Humanoids with an inhuman message

అవినీతి మీద తిరుగుబాటు వంటి సమాంతర కథలకు  కమ్మర్షియల్ హంగులన్నీ అద్ది, విజువల్ గ్రాఫిక్స్ తో మిరుమిట్లు గొలిపించి భారీ వసూళ్ళు మూటగట్టుకోవడంలో శంకర్ మొనగాడు.

‘రోబో టూ : ఓ’ లో కూడా శంకర్ తరహా హంగులన్నీ వున్నాయి. రజనీకాంత్ రోబోలో రెండు పాత్రల్లో మెప్పిస్తే ఇందులో ఇంకో రెండు పాత్రల్ని చేర్చారు. నాలుగు పాత్రల్లోను రజనీకాత్ వైవిధ్యంతో మెప్పించారు.

విఎఫ్ ఎక్స్ వినియోగం ఐ మాక్స్ స్క్రీన్ కన్నా ఎక్కువగా వాడారు. డబ్బుల్ని పరిచేసి ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇచ్చే ప్రయత్నం ప్రతి ఫ్రేమ్ లోనూ చేశారు. కథకన్నా విఎఫ్ ఎక్స్ లతోనే సినిమాను హిట్ చేసే ఆతృత  ఎక్కువగా కనిపిస్తుంది.  

శంకర్ సినిమాల్లోని కథానాయకులు సామాజిక న్యాయంకోసం చట్టవిరుధ్ధమైన మార్గాల్ని ఎంచుకుంటారు.  End justifies the means అనే రాబిన్ హుడ్  జీవన సందేశాన్ని శంకర్ తన సినిమాల హిట్ ఫార్మూలాగా మార్చుకున్నారు. నిజానికి అదే వారి సినిమాలకు ప్రాణం.  కానీ, ‘రోబో టూ : ఓ’ కథ విషయంలో  శంకర్ బోల్తా పడ్డారు. తన కాళ్ళను తానే  లేజర్ కిరణాలతో నరుక్కున్నారు. సహజ న్యాయం కోసం చట్టవిరుధ్ధమైన మార్గాల్ని ఎంచుకున్న పక్షి ప్రేమికుడు ఇందులో ప్రతినాయకుడు.   

రజనీకాంత్ స్టార్ డం సినిమా తొలి భాగాన్ని నడిపిస్తుంది. రోబోటిక్స్ సైంటిస్ట్  డాక్టర్ వశీకరణ్  సెల్ ఫోన్ వినియోగదారుల్ని కాపాడడానికి ప్రభుత్వ అనుమతి లేకుండానే ‘చిట్టి’ రోబోను  యాక్టివేట్ చేస్తాడు. ఈ వ్యవహారం అంతా ఇంటర్వెల్ బ్లాక్ వరకు సాగుతుంది.  ప్రతినాయకుడు స్పారోమ్యాన్ ప్రవేశంతో రజీనీకాంత్ ను వెనక్కి తోసి అక్షయ్ కుమార్ తెరను ఆక్రమించుకుంటాడు.

“బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ గా  సుప్రసిధ్ధులయిన సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ జీవితాన్ని ప్రేరణగా తీసుకుని స్పారోమ్యాన్ పాత్రను సృష్టించారు శంకర్. పక్షుల్ని పరిరక్షించడానికి స్పారో మాన్ తపనపడతాడు. వాటి మరణానికి కారకులయిన సెల్ ఫోన్ కంపెనీల మీద ఉద్యమిస్తాడు. అతని శాంతియుత ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో, న్యాయస్థానాల్లో అన్యాయం జరగడంతో నిస్సహాయుడై ఆత్మాహుతి చేసుకుంటాడు. అతని ఆత్మ సెల్ ఫోన్ లులేని సమాజాన్ని నిర్మించదలుస్తుంది.  

నిజానికి స్పారో మ్యాన్ పాత్ర శంకర్ సినిమాలు జెంటిల్ మ్యాన్,  ఒకే ఒక్కడు, శివాజీ, అపరిచితుడుల్లోని కథానాయకుల వరుసలో సృష్టించిందే. అయితే, తన పాత కథల ప్రోటోగానిస్టును ఈ సినిమాలో సెల్ కంపెనీల మీద తిరగబడిన ఉగ్రవాదిగా చిత్రీంచి స్పారో మ్యాన్ ను అతి క్రూరంగా చంపుతాడు శంకర్. ఒక పక్షిప్రేమికుడ్ని క్రూరంగా చంపడం సినిమాటిక్ అన్ జస్టిఫికేషన్. ఆ మేరకు ఇన్నాళ్లు తనను బతికించిన ‘రాబిన్ హుడ్’ పాత్రను చంపి రచయితగ శంకర్ చనిపోయాడు.

బర్డ్స్‍ మ్యాన్ ఆఫ్ ఇండియా  సలీమ్ ఆలీ ని ప్రేరణగా తీసుకుని 'స్పారో మ్యాన్" ను సృష్టించడం తప్పుకాదు. స్పారో మ్యాన్ సంహారం ద్వార  ప్రేక్షకులకు ఒక రాక్షసానందాన్ని ఇవ్వాలనుకోవడం తప్పు. గల్ఫ్, అరబ్ దేశాల తిరుగుబాటుదార్లను టెర్రరిస్టులుగా, రాక్షసులుగా చిత్రించి అమేరికా దర్శకులు తమ ముస్లిం వ్యతిరేకతను ప్రదర్శించి ఆనందిస్తుంటారు. శంకర్ కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకుని తమిళ సినిమాను  అలా ‘హాలివుడ్ బాట’లో నడిపిస్తున్నారు.

రామాయణం లోని జటాయువు పాత్రను మోడల్ గా తీసుకుని ‘పక్షిరాజు’ పాత్రను సృష్టించినట్టు ఒక అభిప్రాయం వుంది.  పురాణం ప్రకారం జటాయువు ప్రోటోగానిస్టు  శ్రీరాముని పక్షాన నిలబడి ఆంటాగోనిస్టు రావణాసురుడ్ని ఎదుర్కొంటుంది.  ఆంటాగోనిస్టు చనిపోతే వధ అంటారు. కంసునివథ, నరకాసుర వథ. బకాసుర వథ, జరాసంధ వధ ఈ కోవకు చెందుతాయి. ప్రొటోగోనిస్టు చనిపోయినపుడు వీరమరణం అంటారు. అభిమన్యుని వీరమరణం,  బాలచంద్రుని వీరమరణం ఈ కోవకు చెందుతాయి.  ఇదొక కళాసాహిత్య నైతిక విలువ. శంకర్ ఈ సినిమాలో జటాయువు వధ అన్నట్టు చిత్రిస్తాడు.  పక్షిరాజును కథానాయకుడు పక్షి సెంటిమెంటుతో మోసం చేసి మరీ చంపుతాడు.  

గతంలోనూ ఉద్యమ సినిమాలు, విప్లవ సినిమాలు అనేకం వచ్చాయి. కానీ, ఉద్యమకారులు, విప్లవకారుల్ని ప్రతినాయకులుగా చూపించే సాహసం ఎవరూ చేయలేదు.  శంకర్ సెల్ ఫోన్ కంపెనీల పక్షాన నిలబడి బాధితుల కోసం పోరాడేవాళ్ళను 3డి  తెరమీద క్రూరంగా చంపించాడు. అలా కళా సాహిత్య రంగంలో ఒక  దుష్ట సాంప్రదాయానికి నాందీ పలికాడు. చివర్లో నాయకుడు సెల్ ఫోన్ కంపెనీలకు రేడియేషన్ లెవల్స్ తగ్గించమని లాంఛనంగా ఒక సలహా పడేస్తాడు.    

రజనీకాంత్ కోసమో, గ్రాఫిక్స్ కోసమో ఈ సినిమా గొప్పగా ఆడవచ్చు. రజనీకాంత్  అభిమానులో, పిల్లలో, మానసిక పరిపక్వత లేనివాళ్ళో ఈ సినిమాను గొప్ప హిట్ కూడా చేయవచ్చు.  అయినప్పటికీ, ఈ సినిమా తప్పుడు సందేశాన్ని ఇచ్చిందనే వాస్తవం మాసిపోదు.  

-         డానీ

Tuesday, 27 November 2018

Very Costly Crony Democracy


అత్యంత ఖరీదైన  ప్రాయోజిత ప్రజాస్వామ్యం  

డానీ


ఇప్పుడు మనం చూస్తున్నవి స్వేఛ్ఛాయుత సాంప్రదాయిక   ఎన్నికలు కావు. ఇవి ఆర్థిక (ఫైనాన్స్) ఎన్నికలు. సాంప్రదాయిక ఎన్నికలు సామ్యవాదమా? మధ్యేవాదమా? పెట్టుబడీదారీ వాదమా? అంటూ సిధ్ధాంతాల పరంగా సాగేవి.  కొంతకాలం రైటిస్టు, లెఫ్టిస్టు,  సెంట్రిస్టు,  లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్, రైట్ ఆఫ్ ద సెంటర్ అంటూ కొన్ని  శిబిరాలు కొనసాగాయి.  ఇప్పుడు అవన్నీ పోయాయి. ఆర్ధిక శక్తిని బట్టి ప్రచార ఆర్భాటంతో ఓట్లను మంచి ధర పెట్టి కొనుక్కోవడమే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రక్రియ.  

ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడానికి ఓ ఏడాది ముందే  ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పోలింగ్ బూతుకు ఓ పది మందిని క్రియాశీల కార్యకర్తలుగా ఎంపిక చేసి చెరో లక్ష రూపాయలు చేరవేసేస్తాయి. ఆ క్రియాశీల సభ్యులు చెరో వంద మంది ఓటర్లను ప్రభావితం చేసి వాళ్ళ ఓట్లు తమ పార్టికి పడేలా ప్రయత్నిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి 240 నుండి 250 వరకు పోలింగ్ బూతులుంటాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 43 వేల  పోలింగ్ బూతులున్నాయి. అంటే సీడ్ క్యాపిటల్ 4,300 కోట్ల రూపాయలు. 

రాజకీయాల్లో ఏ పనికైనా డబ్బే ప్రధానం. అయితే, కేవలం డబ్బు తోనే అన్ని పనులు జరగవు. డబ్బుకు తోడుగా కొంచెం ఆప్యాయపు పలకరింపులు కూడా చాలా ముఖ్యం. ఓ ఏడాది ముందు నుండే ఓటర్లను పలకరించే కార్యక్రమం - Interactive Voice Response System (IVRS) సర్వే-  మొదలయిపోతుంది. ఒక్కో కాలర్ రోజుకు సగటున 250 ఫోన్ కాల్స్ చేసేదయితే, దాదాపు 4 కోట్ల 30 లక్షల మంది ఓటర్లను నెలకు రెండుసార్లు పార్టి పక్షాన ఆప్యాయంగా పలకరించాలంటే కనీసం 12 వేల మంది సిబ్బంది పనిచేసే కాల్ సెంటర్లు కావాలి.  ఏడాదిపాటు ఈ సిబ్బంది జీత భత్యాల కోసం సులువుగా ఓ మూడు  నాలుగు వందల కోట్ల రూపాయలు  ఖర్చు అవుతాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై వచ్చే ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసే వారి ఓట్లు తొలగిస్తున్నారని  కొన్ని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎవరంటే వారు ఇష్టానుసారంగా ఓట్లు తీసేయడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ఆర్పీ సిసోడియా ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. గానీ, ప్రజాస్వామిక వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో అవధులు అన్నింటినీ దాటేసిన నరేంద్ర మోదీ-అమిత్ షాల  పాలనలో అలా జరగడంలేదని నమ్మడం కష్టమే.

రాజకీయాల్లో కొన్ని సామాజికవర్గాలు కొన్ని పార్టీలకు వీరాభిమానులుగా వుంటాయి. కమ్మ సామాజికవర్గంలో తెలుగుదేశానికీ, రెడ్డి సామాజికవర్గంలో వైసిపికి, కాపు సామాజికవర్గంలో జనసేనకు ఇలాంటి వీరాభిమానులు వేల సంఖ్యలోనే వుంటారు. వీళ్ళుగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం సామాజికవర్గాల్లోనూ కొందరు కొన్ని పార్టీలకు వీరాభిమానులుగా వుంటారు. ప్రధాన పార్టీలన్నీ ఒక క్రమపధ్దతిలో వీరాభిమానుల సేవల్ని వాడుకుంటాయి. ఈ వీరాభిమానులు స్వఛ్చంద సేవకులు కనుక వాళ్ళకు   జీత భత్యాలు ఇవ్వాల్సిన అవసరం లేనప్పటికీ వాళ్లను కార్యక్షేత్రంలోనికి  దించి ఓటర్లను ప్రభావితం చేయడానికి పెద్ద ఖర్చే అవుతుంది. అదో వంద రెండు వందల కోట్ల రూపాయలు!.

మీడియాలో తమకు వ్యతిరేక వార్తలు రాకుండా ఆపి, తరచుగా అనుకూల వార్తలు వచ్చేలా చేసుకోవడం చాలా పెద్ద ప్రాజెక్టు. ఇప్పుడు మీడియా అంటే కేవలం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే కాదు. సోషల్ మీడియా ప్రభావం కూడా ఇప్పుడు చాలా పెరిగింది.  వీటన్నింటినీ  సానుకూలంగా మార్చుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఇంకో రెండు మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించక తప్పదు.

ప్రధాన పార్టీలకు చెందిన సిట్టింగ్ అభ్యర్ధులేగాక, కొత్తగా రంగంలో దిగే అభ్యర్ధులు సహితం ఏడాది ముందు నుండే  అనేక ప్రచార  కార్యక్రమాలను చేపట్టి పార్టి అధిష్టానవర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రధాన పార్టీల పక్షాన పోటీలో వున్నామనిపించుకోవడానికి ఎన్నికల సంవత్సరంలో ఒక్కొక్కరికి సులువుగా రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆశావహులు పార్టి టిక్కెట్టు కోరడానికి అది దరఖాస్తు రుసుము లాంటిది. ఇవి గాక, ఎన్నికల్లో ఖర్చు చేయడానికి తమ దగ్గర స్వంత నిధులు కనీసం పది కోట్ల రూపాయల వరకు వున్నాయని రుజువు చూపని అభ్యర్ధులకు ప్రధాన పార్టీలు ఎమ్మెల్యే టిక్కెట్లు కూడా ఇవ్వవు. ఎంపీ టిక్కెట్టు ఆశించే అభ్యర్ధుల  ఆర్ధిక అర్హతలు దీనికి ఓ ఏడెనిమిది రెట్లు  ఎక్కువగా వుంటాయి.

మరో మాటల్లో చెప్పాలంటే, చెరో ఏడెనిమిది వేల కోట్ల రూపాయలను  నేల మీద పరిచేశాకే రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిధ్ధం అవుతాయి. జాతీయ స్థాయి ప్రధాన రాజకీయ పార్టీలు దీనికి ఓ పాతిక ముఫ్ఫై రెట్లు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వుంటుంది. ఈ లెఖ్ఖలన్నీ 2014 ఎన్నికల ఖర్చు అంచనాతో వేసినవి. ఇప్పటి ధరల ప్రకారం సవరించాలంటే మరో 30-40 శాతం అదనంగా కలపాల్సివుంటుంది. ఓ సీనియర్ ఎం.పీ మాటల్లో చెప్పాలంటే “ఓటరుకు నికరంగా రెండు వేల రూపాయల నోటు  చేర్చాల్సిందే. అలా చేర్చడం కోసం ఇంకో వెయ్యి రూపాయలు పైఖర్చు పెట్టాల్సిందే”. ఇదొక బండ లెక్క.

  శాసనసభకు 28 లక్షల రూపాయలు, లోక్ సభకు 70 లక్షల రూపాయల్ని ఎన్నికల గరిష్ట ప్రచార వ్యయంగా  కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది నిర్ణయించింది. ఇది సిగరెట్టు ప్యాకెట్ల మీద ధూమపానం హానికరం అంటూ రాసే హెచ్చరిక లాంటిది.  దేశం మొత్తమ్మీద ఒక్కరంటే ఒక్కరూ దాన్ని పట్టించుకోరు.

అనైతిక సాంప్రదాయాలు ఎక్కడ మొదలయినా, ఎంత చిన్నగా మొదలయినా అవి మొత్తం సమాజానికి చాలా వేగంగా చాలా విస్తృతంగా వ్యాపించేస్తాయి. మొదట్లో కార్మికవాడలు, మురికివాడల్లో నివశించే నిరుపేద ఓటర్లు మాత్రమే డబ్బు తీసుకునేవారు. ఇప్పుడు ఈ సాంప్రదాయం మధ్యతరగతి కుటుంబాలకు కూడా వ్యాపించింది. “తీసుకోక పోతే మమ్మల్ని ప్రత్యర్ధి ఖాతాలో పడేస్తారు” అనే భయంతో వాళ్ళు ఓటుకు నోట్లు తీసుకోవడం మొదలెట్టారు. “ఎవర్ని వద్దన్నా ఇబ్బంది కదా?” అంటూ  ఇప్పుడు గడుసరిగా ఇరుపక్షాల దగ్గరా నోట్లు తీసుకుంటున్నారు. కొత్తగా ఓటు హక్కును పొందిన విద్యార్ధులు సహితం ఓటుకు నోటు సంస్కృతికి చాలా సులువుగా అలవాటు పడిపోతున్నారు. ఓ వీకెండ్ పార్టి ఖర్చు ఆ ఖాతాలో పోతుందని వాళ్ళ ఆనందం. కొనుక్కుంటున్నారు గాబట్టి అమ్ముకుంటున్నారో అమ్ముకుంటున్నారు గాబట్టి కొనుక్కుంటున్నారో తేల్చడం ఇప్పుడు చాలా కష్టం.  

అంత మాత్రాన సమాజం మొత్తంగా గొడ్డుపోయిందని కాదు. విధానాలు, సిధ్ధాంతాల ఆధారంగా ఓటింగు జరగాలని కోరుకునే ఆదర్శ ఓటర్లు ఇప్పుడూ వుంటారు. కానీ వాళ్ల సంఖ్యం క్రమంగా క్షీణించి 15-10 శాతానికి పడిపోయింది. ఈ సమూహం ప్రధానంగా విద్యావంతులు. నిజానికి వీళ్ళ కొసమే  రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడుతుంటాయి. ఆదర్శవంతమైన వాగ్దానాలతో ఎన్నికల ప్రణాళికలు విడుదల చేస్తుంటాయి.  ఇప్పుడు ఎంతో కొంత చాటు పాటిస్తున్నారుగానీ, ఈ విద్యాధిక ఆదర్శ సమూహం ఎంతోకొంత లేకుంటే, రాజకీయ పార్టీలు ఏనాడో ఓట్లను చేపల సంతలా మార్చేసేవారు.

ఇంతటి భారీ నిధుల్ని సమీకరించడం, నిఘా సంస్థల కళ్ళుగప్పి వాటిని పంపిణీ చేయడం ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా కష్టమైన పని. ఆయా రాజకీయ పార్టిలు అధికారంలోనికి వస్తే తాము పెట్టిన పెట్టుబడికి పది రెట్లు  లాభాలు దండుకోవచ్చని ఆశించే మెగా కార్పొరేట్లు ఈ భారాన్ని తమ నెత్తిన వేసుకుంటాయి. నిజానికి ఎన్నికల తరువాత ప్రభుత్వ నిర్ణయాలను నియంత్రించేవి ఈ మెగా కార్పొరేట్లే. దీనిని పెట్టుబడీదారీ ప్రాయోజిత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనవచ్చు. మనం తరచూ పత్రికల్లో అదానీ లాభాలు ఇన్ని వేల కోట్లు, అంబానీ లాభాలు అన్ని వేల కోట్లు అని చదువుతున్నది ఈ  ప్రాయోజిత పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఫలాలే.

‘The Industrial Vagina : The Political Economy of the Global Sex’ పుస్తకాన్ని రాసిన Sheila Jeffreys  ఈ సమయంలో ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో వుండి వుంటే  The Industrial Vote : The Political Economy of the Indian Democracy’ అనే గ్రంధాన్ని తప్పకుండా రాసివుండేది. అసలు కథ ఇది. దీన్నీ దాచి పెట్టడానికి  “ముఖ్యమంత్రిగా మారిన ఆరణాల కూలీ”, “ప్రధానమంత్రి కుర్చీ ఎక్కిన చాయివాలా” వంటి ముసుగుల్ని ఈ మెగా కార్పొరేట్లు అప్పుడప్పుడు కప్పుతుంటాయి. అలా దేశంలో ప్రాయోజిత పెట్టుబడీదారీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంటుంది. 

 (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)

రచన : 27 నవంబరు 2018
ప్రచురణ : ప్రజాపక్షం దినపత్రిక, 28 నవంబరు 2018


Wednesday, 14 November 2018

Keep Sangh Parivar dictatorship out of power


Keep Sangh Parivar dictatorship out of power

సంఘపరివార నియంతృత్వాన్ని నిలవరించడమే నేటి కర్తవ్యం!  

Muslim Intellectual’s Meet
Organised by Integrated Forum for Muslim Rights
Guntur, 14th Novamber 2018

సదస్సు చివర్లో నేను చాలా క్లుప్తంగా మాట్లాడాను.
నా ప్రసంగ పాఠం ఇది.

అస్సలాం అలైకుమ్ !

చట్ట సభల్లో ముస్లింల ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలనేది ఒక అందమైన కల.  ఇప్పుడు మనం చూస్తున్నవి  విధానపరమైన  (policy) ఎన్నికలు కావు; ఆర్థికపరమైన( finance )ఎన్నికలు.

పెద్ద పార్టీలు టిక్కెట్లు ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యేకు అయ్యే ఎన్నికల ఖర్చు సగటున పదిహేను కోట్ల రూపాయలు వుంటుంది. టిక్కెట్టు పొందినవాళ్ళు ఓ ఐదారు కోట్ల రూపాయలు అయినా స్వంతంగా ఖర్చుపెట్ట గలిగి వుండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలకు ఇవన్నీ neither economically viable nor politically feasible. ముస్లింలలో ఎవరో నలుగురికో ఐదుగురికో మాత్రమే  అలాంటి సామర్థ్యం వుంటుంది. వాళ్లు ఎలాగూ టెక్కెట్లు తెచ్చుకుంటారు. ఎన్నికల్లో గెలుస్తారు.

130 కోట్ల మన దేశ జనాభాలో ఈరోజు ఒక్క ఐదు శాతం తప్ప 95 శాతం  మంది సమస్యల్లో వున్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ నూట ఒక్క సమస్యలు వున్నాయి. ముస్లింలకు రెండు వందల ఒక్క సమస్యలున్నాయి. ముస్లింల సమస్యలకూ, ఇతర ప్రజా సమూహాల సమస్యలకూ కారణం ఒక్కటే; మూలం ఒక్కటే. పెట్టుబడీదారీ మతతత్వ నియంతృత్వం. దీనినే ఇంగ్లీషులో Capitalist Communal Dictatorship అంటారు.  సులభ భాషలో  ఫాసిజం అంటున్నారు. భారత దేశంలో సంఘపరివార నియంతృత్వం అనవచ్చు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ పరిపాలనని గద్దె దించే రాజకీయ వ్యూహాలను ఈ సదస్సు చర్చించకపోవడం విచారకరం.  

ముందు మనం ఆలోచించాల్సింది సంఘపరివార నియంతృత్వాన్ని ఎలా అంతం చేయాలి అనేది.  ఇది ముస్లింలు ఒక్కరి సమస్యేకాదు; దేశ ప్రజలందరి సమస్య. ఈ సమస్య మీద అనేక రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక సంస్థలు పోరాడుతున్నాయి.  వాళ్లతో కలవకుండ, అసలు సమస్యను వదిలేస్తే మిగిలిందంతా ఎన్నటికీ సాకారంకాని  ఒక అందమైన కల గానే వుండిపోతుంది.

సంఘపరివార నియంతృత్వాన్ని ఎదురించే క్రమంలో సాటి బాధిత ప్రజల సంఘీభావాన్నీ, నమ్మకాన్నీ,  సౌభాతృత్వాన్నీ పొందగలిగితే సహజంగానే ముస్లిం అభ్యర్ర్థులకు ఓట్లు, సీట్లు, ప్రాతినిథ్యం అన్నీ పెరుగుతాయి.  

అల్ హందు లిల్హా !


Saturday, 3 November 2018

Never Again Sangh pariwar Rule


సంఘ్ పరివార్ కి సర్కార్ ఫిర్ కభీ నహీ !!

డానీ


ఆంధ్రప్రదేశ్ ముస్లింలు 2019లో ఎవరికి ఓటేస్తారు? అనేది రాజకీయ పరిశీలకులకు ఎంతటి ఆసక్తికర ప్రశ్నో, ఎవరికి ఓటేయాలి? అనేది ముస్లింలకు కూడా అంతే అంతుపట్టని సంధిగ్ధం.  

భారత ముస్లింల రాజకీయ వ్యవహార శైలి భిన్నమైనది. మిగిలిన సామాజికవర్గాల్లా వాళ్ళు కూడా ఆర్ధిక ప్రయోజనాలను కోరుకుంటారు. అయితే, సామాజిక ప్రశాంతతకు ఆర్ధిక ప్రయోజనాలకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇది తెలియనివాళ్ళు ముస్లింలు ధార్మిక (మతపరమైన) అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తరచూ అపార్ధం చేసుకుంటుంటారు.  

 ఏపి ముస్లింలు 2004, 2009 ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. అది బిజెపి ఆధ్వర్యంలోని ఎన్ డిఏ ప్రభుత్వాన్ని గద్దె దించుతుందనే ప్రధాన కారణంతోనూ,  విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తుందనే ద్వితీయ కారణంతోనూ 2004 లో వాళ్ళు కాంగ్రెస్ పక్షాన నిలిచారు. అలాగే ఎన్ డిఏ ప్రభుత్వాన్ని గద్దె దించిందనే ప్రధాన కృతజ్ఞతతోనూ, విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించిందనే   ద్వితీయ కృతజ్ఞతతోనూ  2009లో  వాళ్ళు కాంగ్రెస్ కు  మద్దతిచ్చారు.

కొందరు అంగీకరించకపోవచ్చుగానీ రాష్ట్ర ప్రజల్లో వైయస్ రాజశేఖర రెడ్డి గ్రాఫ్ 2009 ఎన్నికల నాటికే క్రమంగా పడిపోతూ వుంది. “ప్రజలు మాకు పాస్ మార్కులు మాత్రమే ఇచ్చారు” అని స్వయంగా వైయస్సే అన్న సందర్భాలున్నాయి. ఒక విధంగా ముస్లింల గట్టి మద్దతు కారణంగానే వైయస్  ప్రభుత్వం  2009లో గట్టెక్కింది అనంటే అతిశయోక్తికాదు.   

వైయస్ మరణానంతరం చంద్రబాబు 2012లో ముస్లిం సాధికారత పథకాన్ని ప్రకటించారు.  దానితో ముస్లిం సామాజికవర్గంలోని ఒక భాగం  తెలుగు దేశం పార్టి వైపు మళ్ళీ మొగ్గు చూపింది. అయితే, చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తు పెట్టుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. మరోవైపు, ముస్లింలలో ఎక్కువ మంది అభిమానిస్తున్న కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో నవ్యాంధ్రాలో  కనీస పోటీ ఇవ్వగలిగే స్థితిలో కూడా లేదు. వైయస్ కు వారసునిగా వచ్చిన జగన్ అప్పుడు వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయంగా కనిపించారు. కానీ, రాజకీయాల్లో జగన్ ద్వంద్వ వైఖరి కారణంగా అది కూడా సజావుగా సాగలేదు.

మద్దతు ఇచ్చే అంశం మీద ముస్లిం ప్రతినిధులు వైయస్సార్ సిపి తో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి ఘడియ అయిన మే 4 సాయంత్రం 4 గంటల వరకూ హైదరాబాద్ జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లోని వైయస్సార్  సిపి కార్యాలయంలో  ఆ చర్చలు సాగాయి.  జగన్ ప్రతినిధిగా ఆర్థిక నిపుణులు డి.ఏ. సోమయాజులు ఆ చర్చల్లో పాల్గొన్నారు.  “ఎన్నికల అనంతరం ఎన్ డీఏ లో చేరబోన”ని జగన్ స్పష్టంగా ఒక్క ప్రకటన చేస్తే చాలు అనేది ముస్లిం ప్రతినిధుల డిమాండ్. ‘కోవా’ స్వఛ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో వెళ్ళిన ఆ ప్రతినిధుల బృందంలో ఈ వ్యాసకర్త కూడా ఒకరు. ముస్లింల కనీస డిమాండ్‍ ను కూడా జగన్ ప్రతినిధి అంగీకరించలేదు. ఎన్నికల తరువాత తాము మోదీకి దూరంగా వుండలేమని వారు చాలా స్పష్టంగా చెప్పారు.

జగన్ కు ఇటీవల నరేంద్ర మోదీజీ మీద రాజకీయ ప్రేమ పుట్టిందని  చాలామంది అనుకుంటుంటారు. నిజానికి వారు 2014లోనే మోదీజీ మీద మనసు పారేసుకున్నారు. జాతీయ రాజకీయ దృక్పధాల్లో రాజశేఖర రెడ్డికీ, జగన్ కూ  పొంతనలేదు. రాజశేఖర రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పక్షం అయితే, జగన్ భారత జాతీయ కాంగ్రెస్ వ్యతిరేక పక్షం.

వైయస్సార్ సిపీతో చర్చలు విఫలం కావడంతో 2014 ఎన్నికల్లో ఏపి ముస్లిం పెద్దలు తమ స్వీయ సమాజం ఎవరికి ఓటేయ్యాలి అనే విషయంలో  స్పష్టంగా ఒక పిలుపును ఇవ్వలేక పోయారు. ఓటింగును ముస్లింల ‘ఆత్మ ప్రబోధానికి’ వదిలివేశారు.  దానితో ఏపీలో ముస్లిం ఓట్లు చీలిపోయాయి. ముస్లిం ఓట్లలో ఎక్కువ భాగం జగన్ కు పడ్డాయన్నది ఎంత వాస్తవమో టిడిపికి పడిన ముస్లిం ఓట్లు తక్కువేమీ కాదన్నది కూడా అంతే వాస్తవం. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోని విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం ఓటింగ్ సరళిని విశ్లేషిస్తే  ఈ విషయం సులువుగానే అర్ధం అవుతుంది.   అక్కడి ముస్లింలలో అత్యధికులు అసెంబ్లీ ఓట్లను వైసిపికి, లోక్ సభ ఓట్లను టీడీపికి వేశారు.

దేశంలో ఒక భయానక అసహన వాతావరణం, మూకోన్మాదం చెలరేగుతున్న సమయంలో 2019 ఎన్నికలు వస్తున్నాయి. బిజెపితో తగువు పెట్టుకుని కష్టాలను కొని తెచ్చుకోవడంకన్నా ఆ పార్టీలోనే చేరిపోతే మేలని భావించే వాళ్ళు సహితం ముస్లింలలో కొందరు వుంటారు.  అయితే, ముస్లిం సమాజంలోని అత్యధికులు మాత్రం సంఘపరివారాన్ని అదుపుచేసే రాజకీయ కూటమి కోసం నిరంతరం అన్వేషిస్తూనే వుంటారు. ఇలాంటి నేపథ్యంలో, భారత జాతీయ కాంగ్రెస్సే తిరిగి తిరిగి ముస్లింలకు తప్పని అనుబంధంగా కనిపిస్తూ వుంటుంది. సంస్థాగతంగానూ, విధానపరంగానూ కాంగ్రెస్ లో అనేక లోపాలు వుండవచ్చు. అది వేరే కథ.

ముస్లింలు కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపుతారని బిజెపి-సంఘపరివారానికి కూడా తెలుసు. వాళ్లు దానికి విరుగుడును కనిపెట్టి సిధ్ధంగానే వున్నారు. అందులో కీలకమైనది ముస్లింలకు ఓటు వేసే అవకాశం లేకుండా చేయడం; ఎన్నికల  జాబితా నుండి ముస్లిం ఓటర్లను తగ్గించడం; వీలయితే మొత్తంగా తొలగించడం. ఎన్నికల సంఘం ద్వార ఆ పనుల్ని వాళ్ళు సులువుగా చేయగలరు. ప్రజాస్వామిక వ్యవస్ద్థల్ని భ్రష్టు పట్టించడంలో మోదీజీ-అమిత్ షాజీ జంటకు  మరొకరు సాటిరారు.

ఒక అంచనా ప్రకారంలో ఏపీలో అర్హులైన దాదాపు 4 కోట్ల మంది ఓటర్లలో  34 - 36 లక్షల మంది ముస్లింలు వుండాలి. గుంటూరుకు చెందిన ఐఐటియన్ షేక్ హుస్సైనీ విభిన్న లాగరిథమ్స్ ను ఉపయోగించి ప్రస్తుత జాబితాలో 16-17 లక్షల మంది ముస్లింలులకు  మాత్రమే ఓట్లు వున్నాయని తేల్చారు. అంటే, అర్హులైన ముస్లిం ఓటర్లలో సగంకన్నా తక్కువ మందికి మాత్రమే ఇప్పుడు ఓట్లున్నట్టు లెఖ్ఖ.

ఒక సామాజికవర్గానికి ఓటర్ల లిస్టులో చోటు దక్కకపోతే రెండు రకాల నష్టాలు జరుగుతాయి. మొదటిది; వాళ్ళు ఓటు హక్కును కోల్పోతారు. రెండోది; ఓటర్ల లిస్టులో పెద్ద సంఖ్యలో లేని సామాజికవర్గాల సంక్షేమాన్ని రాజకీయ పార్టిలు పట్టించుకోవు. దాదాపు నలభై లక్షల మంది ఓటర్లను కలిసి వాళ్ళలో దాదాపు ఇరవై లక్షల మందిని కొత్తగా జాబితాలో నమోదు చేయడం చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని.  ఇంతటి శక్తి ఇప్పటి ఏపి ముస్లిం సేవా సంస్థలు వేటికీ లేదు. ఎన్నికల సంఘమే దానికి పూనుకోవాలి. లేకుంటే ఏదైనా ప్రధాన రాజకీయ పార్టీ ఆ భారాన్ని మోయాలి. ముస్లిం ఓట్లలో అత్యధిక భాగం బిజేపికి వ్యతిరేకంగా పడేవే కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోదలిచిన రాజకీయ పార్టిలు ముస్లిం ఓటర్ల నమోదుకు పూనుకోవాలి.

ఓటర్ల నమోదు తరువాత కీలక ప్రశ్న ఓటింగుకు సంబంధించింది.  ఏపి ఎన్నికల బరిలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా గ్రాండ్‍ ఫినాలే చంద్రబాబు, జగన్ ల మధ్యనే వుంటుందని ఈపాటికే తేలిపోయింది. వాళ్ళిద్దరిలో ఎవరు యూపియే, ఎవరు ఎన్డీయే అనేది తేల్చడమే ఇప్పుడు ముస్లిం సెఫాలజిస్టులు (Psyphologists) తేల్చాల్సిన అంశం.


మతతత్వశక్తులతో కలవను వంటి పొడిపొడి ప్రకటనలు అప్పుడప్పుడు  చేస్తున్నప్పటికీ మోదీజీతో ఒక సాఫ్ట్ కార్నర్ ను జగన్ అట్టే పెట్టుకుంటూ వస్తున్నారు. వంచనపై గర్జన గుంటూరు సభలో వైసిపీ నాయకులు  మోదీజీ మీద కొంత గొంతు పెంచి మాట్లాడారుగానీ అదొక యాధృఛిక సంఘటనగానే మిగిలిపోయింది. తనకు పేటెంటు హక్కులున్నాయని అంటున్న ప్రత్యేక తరహా హోదా సాధన ఉద్యమం  ఒకవేళ విజయవంతమైనా దానివల్ల ముస్లింలకు ఒనగూడే ప్రయోజనాలు కూడా ఏమీలేవు. మాబ్ లించింగ్, గోగ్రవాదం, విడాకుల్ని నేరంగా పరిగణించే ఆర్డినెన్సు, జాతీయ పౌరసత్వ నమోదు, రాజ్యాంగంలో లౌకిక ఆదర్శాల పరిరక్షణ, వక్ఫ్ భూముల పరిరక్షణ, విద్యా ఉపాధిరంగాల్లో జనాభా దామాషా ఆధారిత  రిజర్వేషన్లు   మొదలైనవి ముస్లింలకు కీలక అంశాలు. వీటి మీద మాట్లాడకపోగా ముస్లింలు తనను వదిలి ఎక్కడికీ పోలేరు అనే ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నారు.  మరోవైపు, జగన్ శిబిరంలో గత ఎన్నికలలో డిఏ సోమయాజులు నిర్వహించిన మోదీజీ అనుకూల పాత్రను ఇప్పుడు వైసిపి జాతీయ కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి నిర్వహిస్తున్నారు.

          మరోవైపు, నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబు సహితం ముస్లింల సంక్షేమానికి చేసిందేమీలేదు. ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చినా, మరో విభాగాల్లో ప్రోత్సహించినా ఢిల్లీలో నరేంద్రమోదీ మనోభావాలు దెబ్బతింటాయని వారు వెనుకాడే వారు. కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు రాకుంటే ఆంధ్రప్రదేశ్ మనుగడ కష్టం కనుక ప్రధాని నొచ్చుకోకుండా మసులుకోవడం తనకు తప్పదనేవారు. మరోమాటల్లో చెప్పాలంటే, నవ్యాంధ్రప్రదేశ్  అభివృధ్ధి కోసం ముస్లింలు త్యాగాలు చేయకతప్పదనేది వారి అభిప్రాయంగా వుండేది.

          నరేంద్ర మోదీ ఐదవ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తరువాత చంద్రబాబు వ్యవహార శైలి మారింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం క్రమంగా వారు మోదీకి వ్యతిరేకంగా స్వరం పెంచారు. దేశంలో ప్రస్తుతం నరేంద్ర మోదీ-అమిత్ షాలను ముఖాముఖీగా ఎదుర్కొంటున్న  ముఖ్యమంత్రులు నలుగురు; మమతా బెనర్జీ, కేజ్రివాల్, పినరయి విజయన్, చంద్రబాబు. వీరిలో చంద్రబాబు ఇప్పుడు  మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. గుంటూరులో ముస్లింల సదస్సును నిర్వహించి వారు కేంద్రానికి స్పష్టమైన సంకేతాన్నే పంపించారు.  

కాంగ్రెస్ తో  చంద్రబాబు జత కూడవచ్చని కొంత కాలంగా సాగుతున్న ఊహాగానాలకు రాహుల్ గాంధీ – చంద్రబాబు గురువారం ఢిల్లీలో  ఒక స్పష్టత ఇచ్చారు.  “మోదీ హయాంలో కుప్పకూలిపోతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు, దేశాన్ని రక్షించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాం” అని  ఒక సంయుక్త ప్రకటన చేశారు. ఈ రెండు పార్టిలతోపాటూ ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, డీఎంకే, ఎన్సీపీ , జేఎంఎం, సీపీఐ, సీపీఎం, తృణమూల్కాంగ్రెస, జేడీఎస్‌, ఎన్సీ, లోక్దళ్‌,. పీడీపీ ఇప్పటికే ఐక్య ప్రజాస్వామిక కూటమిలో చేరాయి. గతంలో యున్సైటెడ్ ఫ్రంట్, ఏన్డీఏలకు కన్వీనర్ గా పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు యూపియే కు కూడా కన్వీనర్ గా  మారినా ఆశ్చర్య పడాల్సింది ఏమీలేదు.

మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలనే కఠిన నిర్ణయం తీసుకుంటే తప్ప జగన్ ఇప్పుడు యూపియేలో చేరే అవకాశాలు లేవు. వైసిపి ఇప్పుడు ఎన్డీయేలో చేరవచ్చు లేదా  మూడో ఫ్రంట్ లో చేరవచ్చు. మూడో ఫ్రంట్ అనేది మోదీజీ టీం –బీ మాత్రమే అని ఇప్పటికే తేలిపోయింది.

కాంగ్రెస్‍ తో చంద్రబాబు చేతులు కలపడం భారత రాజకీయాల్లో ఎంతటి దిగ్బ్రాంతికర పరిణామమో ఏపి ముస్లింలు చంద్రబాబును పూర్తిగా సమర్ధిస్తారా? అనేది కూడా అంతటి దిగ్బ్రాంతికర సందేహమే. ఏపీలోని కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుతం టిడిపిని ప్రత్యర్ధిగానూ, వైసిపిని దారితప్పిన  సోదరునిగానూ భావిస్తున్నారు. అలాగే, ఇప్పటికిప్పుడు చంద్రబాబును సమర్ధించడానికి చాలామంది ముస్లింలు కూడా సుముఖంగా లేరు. కానీ, ఎన్నికలు దగ్గరపడేకొద్దీ కాంగ్రెస్ ప్లస్ టిడిపి అనేది ముస్లింలకు క్రమంగా ఆమోదయోగ్యమైన రాజకీయ ఫార్మూలా అవుతుంది. యూపిఏలో చంద్రబాబు క్రియాశీలంగా మారేకొద్దీ ఇప్పటి దిగ్భ్రాంతి ఒక సాధారణ విషయంగా మారిపోతుంది. ఎన్నికల సంఘం అన్యాయానికి బలైన ముస్లింలను ఓటర్ల జాబితాలో చేర్చే బాధ్యతను న్రవేర్చగలిగితే ముస్లింల వైపు నుండి టిడిపికి అది బోనస్ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నడూ పాత తేదీలు, పాత పేజీలు వుండవు. వుండేదల్లా భవిష్యత్తే. ఎవ్రి డే ఈజ్ ఎ ఫ్రెష్ బిగినింగ్.

          ముస్లిం రాజకీయ చైతన్యం ఓ రెండు మంత్రి పదవుల కోసమో కాదు.  ఓ డజను ఎమ్మెల్యే స్థానాలకోసమో, అరడజను కార్పొరేషన్ల కోసమో అసలు కాదు. ఇది ముస్లింల ఆత్మగౌరవ పోరాటం. వునికిని చాటుకునే ఆరాటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్షాన కేంద్ర ప్రభుత్వంతో పోరాడే ఒక చారిత్రక బాధ్యతను  పంచుకోవడానికి ముస్లింలు సిధ్ధం కావాలి. చరిత్ర విసిరిన సవాలుకు సమాధానం ఇవ్వడానికి ఢిల్లీలో  జాతీయ విపక్షాలు కదులుతున్నాయి. ఇది ఆరంభంలో రాష్ట్ర శ్రేయస్సు కోసం పోరాటం. అంతిమంగా దేశ భవిష్యత్తు కోసం పోరాటం. మోదీని తప్పించడమే నేటి ప్రజాస్వామ్య కర్తవ్యం.  సంఘ్ పరివార్ కి  సర్కార్ ఫిర్ కభీ నహీ !

(రచయిత సమాజ విశ్లేషకులు) మొబైల్ – 9010757776

రచన :  2 నవంబరు 2019
ప్రచురణ : మనతెలంగాణ  4 నవంబరు 2019