Friday, 28 February 2020

మనువాద ఫాసిజం ముసుగులు తీసే సైరన్ మోత - చల్లపల్లి స్వరూపరాణి


మనువాద ఫాసిజం ముసుగులు తీసే సైరన్ మోత
- చల్లపల్లి స్వరూపరాణి

ఇప్పుడు భారత దేశానికి పట్టిన రెండు ముఖ్యమైన చీడ పురుగులు ‘ఫాసిజం’, ‘మనువాదం’. ఈ దేశపు కుల వర్గ సమాజంలో ఈ రెండు దుష్ట శక్తులు ప్రజల జీవితాలతో పరాచకాలాడుతూ అణగారిన కులాలు, ఆదివాసులు, మతపరమైన ముస్లింలు, క్రిస్టియన్లు, స్త్రీలపై పాశవిక దాడులకు పాల్పడుతూ వారిని తీవ్రమైన అభద్రతా భావానికి గురిచేస్తున్నాయి. వారు తినే తిండి పైన, కట్టే బట్టపైన, మొక్కే దైవం పైన ఆంక్షలు విధిస్తూ ఆవు లాంటి ఒక జంతువుకిచ్చిన విలువ కూడా వారికి లేకుండా వారి వ్యక్తిగత స్వేచ్చను హరిస్తున్నాయి. గతకాలంలో ఎందరో శాస్త్రవేత్తలు రేయింబవళ్ళు కష్టపడి శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన అభివృద్ధిని, ఆవిష్కరణలను కించపరుస్తూ పుష్పక విమానాలు, టెస్ట్ ట్యూబ్ బేబీలను పుట్టించడం వంటివి అన్నీ పురాణాల కాలంలోనే ఉన్నాయనీ, ఆవు మూత్రం సకల రోగ నివారిణి అని చెప్పుకొస్తూ, శాఖాహారాన్ని కీర్తిస్తూ, అసంఖ్యాక ప్రజల ఆహారపు అలవాట్లను అవమానించడంతో పాటు దళితులూ, ముస్లింలూ తమ ‘గోమాత’ను చంపి తింటున్నారనే నెపంతో వారి పై దాడి చేసి చంపడం, విచక్షణా రహితంగా కొట్టడం వర్తమాన కాలంలో తరచుగా చూస్తున్నాం.
వీరికి మరొక ప్రధాన శత్రువు స్త్రీ స్వేచ్చ. స్త్రీల మీద రకరకాల ఆంక్షలు, వారికి ‘శీల పరీక్షలు’, బడిలోకి గుడిలోకి రానీయయకుండా అడ్డుకోవడంతో పాటు పసిపిల్లలను, స్త్రీలను రేప్ చేసేవారికి పదవులిచ్చి గౌరవించడం, బాధిత స్త్రీలకు సహకరించేవారిని హింసించడం, బాధితులపై తిరిగి కేసులు పెట్టి వేధించడం వంటివి లెక్కలేనన్ని జరుగుతున్నాయి. మరోవైపు ముస్లిములపై ద్వేష భావాన్ని వ్యాప్తి చెయ్యడం, వారిని పుట్టుకతో నేరస్తులుగా ప్రచారం చేసి వారిని, క్రైస్తవులను ‘ఇతరులు’ గా వేరుచేసి ప్రజలమధ్య మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం మనువాద ఫాసిజం లోని ప్రధానమైన కోణం.
అంతేకాదు మనువాద రాజ్యాధినేతలు గత చరిత్రలో భీమా కోరేగావ్ యుద్ధంలో బ్రాహ్మణవాదంపై తిరుగుబాటు చేసిన మహార్ వీరులను స్మరించుకోవడాన్నికూడా తట్టుకోలేనంత అసహనానికి గురై అక్కడ గుమికూడిన వారిపై అక్రమంగా కేసులు బనాయించింది. భారతదేశ చరిత్ర అంతా బ్రాహ్మణ వాదానికి, బౌద్ధానికి మధ్య జరిగిన పోరాటంగా అంబేద్కర్ వ్యాఖ్యానిస్తే మతతత్వవాదులు అదేదో ముస్లింలకు, హిందువులకూ మధ్య జరిగిన పోరుగా వక్రీకరించడంతోపాటు చరిత్రలో ముస్లిములపై యుద్ధం చేసిన వారిని దేశ భక్తులుగా కీర్తిస్తారు. గత పార్లమెంటు ఎన్నికలను మూడవ పానిపట్టు యుద్ధంతో పోల్చడం ప్రజల్లో మతవిద్వేషాలను రెచ్చగొట్టి జనం మధ్య అడ్డుగోడలు నిర్మించడమే. అంతేకాదు స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు ప్రాతిపదికగా వారి జాతి, మతం, లింగ భేదాలతో సంబంధం లేకుండా దేశంలో పుట్టిన పౌరులందరికీ సమానమైన ప్రాధమిక హక్కులూ, సమ న్యాయం అందించే రాజ్యాంగానికి కన్నాలు వేసి దాని స్పూర్తిని పక్కాదారి పట్టిస్తూ అసమానతలతో కూడిన తమ సొంత ఎజెండాను అమలు పరుస్తున్నారు. సాక్షాతూ సుప్రీంకోర్టును తమ కనుసన్నలలో మసలుకునే కుక్కపిల్లను చెయ్యడానికి రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. దేశాన్ని కార్పోరేట్ దొరలకు అప్పనంగా రాసిచ్చి వారి ప్రయోజనాలు కాపాడడం కోసం పనిచేస్తున్నారు.
ఇప్పుడు ఫాసిజం, మనువాదం రూపాలు మార్చుకుంటూ చాపకింద నీరులా పాకుతున్నాయి. ప్రజలకు ప్రధాన శత్రువులైన ఫాసిస్ట్, మనువాద ఆధునిక పోకడలను సరైన సందర్భంలో ఎత్తిచూపుతూ సీనియర్ జర్నలిస్ట్, రచయిత, ఉద్యమకారుడు ఉషా యస్. డానీ తీసుకొచ్చిన పుస్తకం ‘నయా ఫాసిజం, నయా మనుస్మృతి’ ఆయన వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాలూ, సభలలో చేసిన ఉపన్యాసాల నోట్సుల సంపుటి ఇది. ఈ పుస్తకం నడుస్తున్న దుష్టకాలానికి అవసరమైన చర్చని ముందుకు తీసుకొచ్చింది.
‘ఫాసిజం’, ‘నాజిజం’ అనేవి హిట్లర్, ముస్సోలినీలతోనే అంతం కాలేదని ఫాసిజం అంటే ముస్సోలినీలాగా లిబియా మీదనో, హిట్లర్ లాగా ఆస్ట్రియా, పోలెండ్ ల మీదనో సైనిక దాడి చెయ్యడంలాంటిది మాత్రమే కాదు, నిరంకుశ అప్రజాస్వామిక వైఖరితో ప్రజల స్వేచ్చను హరించడం కూడా ఫాసిజమేనని డానీ ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం నాటిదని చెప్పే మనుస్మృతి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు? అనేవారికి డానీ ఈ పుస్తకంలో మంచి సమాధానం ఇచ్చారు. మనుస్మృతి ఒకవైపు యజమాని కులాలకు అపరిమితమైన అధికారాలు ఇవ్వాలంటుంది. మరోవైపు శ్రామిక కులాల్ని సాంసృతిక, ఆర్ధిక రంగాలలో తీవ్రంగా అణచివేయాలంటుంది. రెండువేల సంవత్సరాలుగా ఇది రూపంలో కొన్ని మార్పులు చేసుకున్నప్పటికీ సారంలో అదేవిధంగా కొనసాగడాన్ని ఆయన అనేక సంఘటనల ఆధారాలతో వివరించారు. గతంలో మనువాదం బ్రాహ్మణుడిని ‘సూపర్ మాన్ ‘ ని చేసి అందరూ అతనికి అనుకూలంగా మసలుకుంటూ ముఖ్యంగా శూద్రులు వారికి సేవలు చేస్తూ అణిగి మణిగి ఉండాలని సూచిస్తే నయా మనువాదం బ్రాహ్మణేతరులలో కూడా ‘ సూపర్ మాన్’లను తయారు చేసి జనం మీదకు సవారీకి పంపుతుందని, వారే కార్పోరేట్ దొరలని డానీ పేర్కొన్నారు. సాంప్రదాయ మనువాదం బ్రాహ్మణులు సంతోషంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని చెబితే, నయా మనువాదం కార్పొరేట్లు బాగుంటే దేశం శక్తివంతంగా ఉంటుందని బుకాయిస్తుంది అంటూ ముసుగులు తొలగిన మనువాదాన్ని రచయిత డానీ ఎత్తి చూపారు.
ఫాసిజం, మనువాదాల మధ్య పరస్పర అనుబంధం ఉంటుంది. ఈ రెండింటి లక్ష్యం ప్రజల మధ్య అసమానతలు పెంచి పోషించి వారిని తమకు బానిసలుగా మార్చుకోవడం. సంప్రదాయ మనువాదం శూద్రులకు ఆదాయ వనరులు ఉండకూడదని, వారు పైవారికి సేవ చేసి వారి దయాదాక్షిణ్యాల మీద బతుకు ఈడ్చుకుంటూ ఉండాలి అని అంటే నయా మనువాదం ధనవంతులను మరింత ధనవంతులుగా చేసి పేదవారిని మరింత పేదరికంలోకి నెట్టివేసే పధకాలు పన్నుతుంది.
నాజీ నియంత హిట్లర్ యూదులను అణచివేస్తే ఈనాటి ఫాసిస్ట్ పాలకులు ముస్లింలను, క్రైస్తవులను శత్రువులుగా భావించడమేకాక దళితులు, ఆదివాసీలను, స్త్రీలను మరింత బానిసత్వంలోకి నెట్టివేస్తుంది. ఫాసిజంలాగే మనువాదం కూడా సమాజాన్ని ‘లోపలివారు’, ‘బైటవారు’ లేదా ‘ఇతరులు’ అనే గ్రూపులుగా విడగొట్టి లోపలివారు సుఖంగా ఉండాలంటే బైటివారిని కష్టపెట్టి, హింసించాలి అనే సూత్రం మీద పనిచేస్తుంది. మనువాదానికీ, ఫాసిజానికీ మధ్య ఉన్న సంబంధాన్ని అంబేద్కర్ వివరంగా చర్చించాడు. ఫాసిజాన్ని ప్రజా ఉద్యమాలు, మనువాదాన్ని రాజ్యాంగం ఓడించాయి కాబట్టి అవి ఇప్పుడు సరికొత్త వేషధారణతో ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చెయ్యడానికి వస్తున్నాయని, వాటి దొంగ వేషాలను ప్రజలు గుర్తించకపోతే జరిగే నష్టం గతంలో కంటే తీవ్రంగా ఉంటుందని డానీ ఈ పుస్తకంలో హెచ్చరించారు.
సంప్రదాయ మనుస్మృతి శూద్రులకు విద్యను నిరాకరిస్తే నయా మనుస్మృతి పైకి వారికి విద్యను నిరాకరించినట్టు ఉండకుండా వారికి ఉచితంగా విద్యనందించే ప్రభుత్వ స్కూళ్ళను, విద్యాలయాలను బలహీనపరిచి పరోక్షంగా వారికి విద్యను దూరం చేస్తుంది. విశ్వవిద్యాలయాలను నాశనం చేసి అక్కడ చదివే విద్యార్ధులలో ముఖ్యంగా అణగారిన కులాలు, మైనారిటీ లను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఆడపిల్లల హాస్టల్స్ మీద దాడులు చేసి వారు చదువు మానేసి ఇంటికెళ్ళి పెళ్లి చేసుకునేలా పరోక్షంగా దోహదం చేస్తుంది.

మనుస్మృతి, ఫాసిజం అనేవి కేవలం సామాజిక సాంస్కృతిక అంశాలు అనుకుంటే పొరబాటే! అవి రాజకీయ, ఆర్ధిక అంశాలని గుర్తించడం నేటి అవసరం. సంప్రదాయ మనుస్మృతి ఆస్తిని సంపాదించే సామర్ధ్యం ఉన్నప్పటికీ సూద్రుడు ఆస్తిని పొందకూడదని నిర్దేశిస్తుంది. అయితే ముసుగు తొడుక్కున్న నయా మనువాదం బలహీన వర్గాలకు ఆర్ధిక వనరులు సమకూడిన సందర్భాలలో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. వారు సంపదను పొందడాన్ని సహించలేక వారిపై దాడులకు పాల్పడుతుంది. అలాగే ముస్లింలు సంపన్నులుగా ఉండే నగరాలలో మత కల్లోలాలు సృష్టించి వారి సంపదను పెరగకుండా నియంత్రిస్తుంది. మనుస్మృతి ఏ రూపంలో ఉన్నా శ్రామిక కులాలు స్వేచ్చగా జీవించడానికి, తద్వారా అధికారంలో న్యాయమైన భాగాన్ని పొందడానికి అవకాశాలు లేకుండా చేస్తుంది.
ఫాసిజం గ్రామాలలో, పట్టణాలలో వేరు వేరుగా వ్యక్తమవుతుంది. గ్రామాల వ్యవసాయాధారిత ఆర్ధిక వ్యవస్థలో భూమి మీద హక్కులుండే రైతులు అగ్రకులాలవారే అయ్యి ఉంటారు. వ్యవసాయ కూలీలు సహజంగా కింది కులాలవారై ఉంటారు. వ్యవసాయ కూలీలను కట్టు బానిసలుగా మారిస్తే గానీ వ్యవసాయం, గ్రామాలు పూర్వ వైభవాన్ని పొందలేవని వ్యవసాయదారులు భావిస్తారు. వారు స్వేచ్చ, సమానత్వం అనే భావనలను ఇష్టపడరు. రాజ్యాంగం దళితులకు, మైనారిటీలకు, స్త్రీలకు సమానత్వాన్నిస్తే వారు మాట వినరని, గతకాలపు సంప్రదాయపు వ్యవస్థ చిన్నా భిన్నం అవుతుందని అనుకోవడం గ్రామీణ మనువాద ఫాసిజం అని రచయిత అంటారు. అలాగే పట్టణాలలో అగ్రకుల సంపన్న వర్గం విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు, సంక్షేమ పధకాలు రావడాన్ని ఈసడించుకుంటారని, సంక్షేమ పధకాల వల్ల ఆయా రంగాలలో నాణ్యత పడిపోతుందని వాపోవడం పట్టణాలలో వ్యక్తమయ్యే ఫాసిస్ట్ మనువాద కోణమని డానీ ఈ పుస్తకంలో విశ్లేషించారు.
మతం, మతతత్వం రెండూ ఒకటి కాదని, ప్రజల విశ్వాసాలు మతం అయితే ఇతర మతాలను ద్వేషించడం మతతత్వం అని చాలావరకు ఈ రెండింటిని ఒకే విధంగా పరిగణించడంపైన ఆయన అభ్యంతరం వ్యక్తపరిచారు.
అలాగే మెజారిటీ మతస్తులైన హిందువులు కూడా ప్రస్తుత పరిస్తితిలో బాధితులే అని రాముడిని, కృష్ణుడిని కొలిచేవారు మోడీ, అమిత్ షాలను కొలిచేవారు ఒకరు కాదని సైద్ధాంతిక పరమైన గందరగోళం నుంచి ప్రజలు బైటపడాలని డానీ సూచిస్తారు. కార్పోరేట్ దొరల దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి వచ్చిన మనువాద పాలకులు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి వారి ప్రయోజనాలను కాపాడే పనిలో తమ పదవీ కాలాన్నంతా వినియోగించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చెయ్యడమేనని రచయిత డానీ అంటారు.

ఈ పుస్తకంలో ఆయన ప్రజా ఉద్యమాలలో దొర్లే తప్పులను ఎత్తిచూపిస్తూ సున్నితమైన విమర్శ చెయ్యడం గమనిస్తాం. ఈ దేశంలో మార్క్సిస్టులు ఎంతసేపటికీ ఆర్ధిక వాదం తప్ప భారత సమాజంలో అన్ని అసమానతలకు కారణమైన కులాన్ని, మతాన్ని నిర్లక్ష్యం చెయ్యడం, అలాగే అంబేడ్కర్ వాదులు కుల వివక్షపై దృష్టి పెట్టినంతగా వర్గ పరమైన పోరాటాలు చెయ్యకపోవడం వలన ఈనాడు మనువాద ఫాసిజం ఈ రూపాలు తీసుకుందని రచయిత కంప్లైంట్. అంతేకాక నాస్తికవాదులు, హేతువాదులు మాకు కులమతాలు లేవు, వాటి గురించి ఆలోచించనవసరం లేదు అనే ధోరణితో వ్యవహరించడం కూడా బ్రాహ్మణవాదం పెట్రేగిపోవడానికి మరొక ముఖ్య కారణం అని ఈ పుస్తకంలో డానీ విమర్శించారు. కుల మత సమస్యల్ని పట్టించుకోనక్కర్లేదు అనడం మార్క్సిస్ట్ దృక్పధానికి పూర్తిగా వ్యతిరేకమని, అలాగే అంబేడ్కర్ భారత సమాజానికి సంబంధించిన అన్ని రకాల రుగ్మతలపై పోరాడితే ఆయన వారసులమని చెప్పుకునేవారు ఆయన సిద్ధాంతాన్ని కేవలం కుల సమస్యకి పరిమితం చెయ్యడం వలన వారు బ్రాహ్మణ వాదంలోని మిగిలిన కోణాల్ని ఎదుర్కోలేకపోయారని, దాని ఫలితమే ఇప్పుడు మనుషుల్ని జంతువుల కంటే హీనంగా పరిగణించే నయా మనువాద ధోరణి అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా లౌకిక ప్రజాతంత్ర ఉద్యమాలన్నీ ఒకతాటిమీదకి రావాల్సిన అవసరాన్ని డానీ ఈ వ్యాసాలలో గుర్తుచేశారు.
ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాలు అన్నీ సమాకాలీన సామాజిక, ఆర్ధిక, రాజకీయ చిత్రపటాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తాయి. ఈ పుస్తకం బ్రాహ్మణ వాదంపై పోరాడే శక్తులకు సైద్ధాంతికంగా ఒక మంచి తోడ్పాటునిస్తుంది. సరికొత్త ముసుగులు ధరించి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న నయా ఫాసిజం, నయా మనుస్మృతి అసలు రూపాన్ని పసిగట్టకపోతే దళిత, ఆదివాసీ, మైనారిటీ వర్గాలు మరింత బానిసత్వంలోకి వెళ్ళే ప్రమాదం ఉందనే సైరన్ మోత ఈ పుస్తకం లోని ప్రతి పేజీలో వినిపిస్తుంది.
సందర్భానికి అవసరమైన ‘నయా ఫాసిజం, నయా మనుస్మృతి’ వ్యాస సంపుటి రచయిత ఉషా యస్. డానీ గారికీ, ఆయనతో ఉద్యమ భాగస్వాములుగా ఉండడమే కాక ఈ పుస్తక ప్రచురణ బాధ్యతలు తీసుకున్న సామాజిక పరివర్తన కేంద్రానికి అభినందనలు.
విజయవాడ
27 ఫిబ్రవరి 2020

Wednesday, 19 February 2020

Madarsa mekapilla Pre - publication views.

Madarsa mekapilla
Pre publication views.
1. Dr. Pasunuri Ravinder.
Write,Kendra Sahistya Academy youth award winner.
As long as the state acts as the representative of wolves, the innocent lambs would continue to be sacrificed. In the last three years, there are no counts of such innocent lambs which became the victim of wolves.
The jungle democracy is more precious to communalistic wolves than the human democracy.
This whole story moves ahead symbolically showing the atrocity of dominant forces, and the helplessness of victim groups parallel to each other.
The narration is interesting. It seems like the writer stepped into shoes of the characters. The writer has immense knowledge upon the state ship, history, law, and war policy. He also has deep understanding of contemporary political situation. His democratic ideology runs as undercurrent in this story.
This is the story which highlights the atrocities of fascist forces which are becoming uncontrollable with the patronage of rulers. This story is a hard slap upon the retrogressive forces which think that everything they do under the mask of religion would remain unquestionable.
Congratulations dear brother...
2. Afsar Mohammad.
Poet and Critic
Brother Danny, thank you ....
When Danny writes story, it remains in our memory for years together and we yearn to read it again and again. Though I was busy with my inevitable journeys, I couldn’t stop reading it. The sound of those whip lashes, the writing style of Danny, the sparkles of his pen are once more in complete glory.
3. Jhonson Cheragudi
Writer and social analyst
The story telling is very good.
Pathos has been created with the symbolism of lamb.
It would have been better if the story has ended on a hopeful note.
It doesn’t deserve to end on a tragic note.
Even if it does now, it’s our responsibility to give a hope to the future generations.
4. Bharadwaja Rrangavagnahala
Writer and Critic
This is the most needed book written in very right time. Even though a couple of dialogues of wolves reminded me of our Nandamoori family, and my sentiments were a bit hurt, as they were inevitable for the story, I can’t stop myself from acknowledging that this is a wonderful book.
5. Vempalle Shariff
6. Wonderful. This story pictures the predicament of Muslims in the future. Just great.
7. I just completed reading the Madasrsa Mekapilla of Danny once again. Being a minority, this story gave me goose bumps.
8. 6.vemana vasantha lakshmi
9. Very touching Danny. Humour, sarcasm, criticism, everything is just at right place. It got everything in equal balance.
10. It’s a pity that Telugu newspapers might not publish this.
7. Abdul Wahed.
It’s too good. Please send it for publication.
8. Gadiyaram Srivatsa
The narration is too good. But when the whole country is full of wolves, what else remains in the story, but the futile effort.
9. Jaha Aara.
Your story is too good sir. You have documented the Muslim lynching in Telugu literature which is demand of the hour....the tragedy in the climax is well established.
10.Sriram Murthy Gaara ( Nijam)
It’s very good sir.
11. anwar, Warangal
It’s a terrific story, just firing!
It’s a powerful political story.
12. Shanti Sri.
When I read it, I felt like I just watched the whole history moving in front of my eyes along with that train. I really didn’t like the murder of that tiny lamb. It would have been better if that courageous lamb, along with other lambs had fought against the wolves. How many more years it would go like this? At the end, Danny just made me cry..
In the kingdom of wolves, goats are minorities... Danny depicted the atrocities, the resistance, the helplessness...but the one who fights against atrocity must win...he must win.. We must win...
13. Mohammad Khadeer Babu.
The anger which accumulated in the gut came out ultimately as this story. This story impacts the readers with hard reality. This is one of the most outstanding stories of 2017.
14. Dr. Gangadhar Gopidesi
Danny...my throat is chocked with inexpressible pain after I completed it. I just can’t say anything more than this.
15. N. Venu Gopal.
Danny, Madarsa Mekapilla is too good. It’s just not too good, it’s powerful. It made me cry. It reminded me of your thirty years old stories, Prahladudu and Kripaaan. Do you remember that after reading Prahladudu, Kaloji himself came asking for you.
16. Parthasaradhi Muktavaram.
It is a modern fable. A gem of rhetoric …. Fantasy is the legitimate device of anyone who attempts realistic themes.
17. Usha S. Danny
The stories are basically of three types. First one; in which the reader or the characters have no clue about course of story. The second one, in which the characters are aware of the story but the readers doesn’t have any clue. The third one, the readers know, but the characters are clueless about their predicament.
I like to write the third type of stories. This Madarsa Mekapilla is one such story.
Ramayan might have been written hundreds of times till now. People read all of them. Dozens of movies were made upon them. People see all of them. Even though the Telugu viewers had already seen the Lavkush, and Sampoorna Ramayan, they just glued to TV for two years to watch Hindi Ramayan .
All the viewers know that when Ram and Lakshman went in search of golden deer, it was Ravan who came in the attire of sage to the parnashala. But Sita doesn’t know this. When Sita tries to cross the Lakshman rekha, each one of the viewers feels like stopping her. ‘He is Ravan! he has come to kidnap you dear mother.’ I have seen many female viewers shouting in the theatre to alert Sita. That’s the magic of epics.
Some people don’t go to movie if they know the climax. But the movies based on the epics have a definite and predetermined starting and ending. And still the viewers run to theatres to watch them. Why? The character of Duryodhana is picturized in one way by S.V. Rangarao and in other way by N.T. Ramarao. Creativity is not just about telling something new, it’s about telling the same thing in a different way.
It’s really took effort on my part to present the story known by everyone in a completely new and creative way. It was a challenge and I love to accept and accomplish such challenges.

Monday, 17 February 2020

ఆరు రంగుల శిశిరానంతర గీతం



ఆరు రంగుల శిశిరానంతర గీతం
ఉషా యస్ డానీ

కలలు వేరు; భవిష్యత్తు వేరు.

          అచ్చంగా కలలే భవిష్యత్తును నిర్మించవు.  కాకుంటే కలలు వర్తమానంలో కొంచెం కదలికను సృష్టిస్తాయి. ఆ కదలికలు బహుశ భవిష్యత్తు కావచ్చు. అందుకేనేమో “కలలు కననివాడు విప్లవకారుడు కాలేడు” అంటారు. కలలు కనలేని కవులూ అంతే!.

          కలలు కనలేని వారికి కలలు పగలడమూ తెలీదు.  కలలు పగలడం తెలీని వారికి కొత్త కలల్ని కనడమూ తెలీదు. వాళ్ళు “పీడ కలలకు భయపడి నిద్ర నటిస్తారు”. కలలు సృష్టించే కదలికలు భవిష్యత్తును రూపకల్పన చేసినట్టే, కలలు కనే కవుల కవిత్వమూ భవిష్యత్తుకు బాటలేయవచ్చు. అప్పుడు సాహిత్యం రేపటి రాజ్యాంగం అవుతుంది. సాహిత్యకారులు రేపటి రాజ్యాంగ నిర్మాతలు అవుతారు.

          బహుశ, తరచుగా కలలు ఒలికిపోతుంటాయి. పగిలి, చితికిపోతుంటాయి. వేళ్ల సందుల్లోంచి జలజలా జారిపోయిన కలల్ని దోసిల్లార ఎత్తుకు తాగి జాతికి మరోమారు ‘స్వప్న హరితాన్ని’ ప్రసాదించడం స్వాప్నికులకు కవులకు మాత్రమే సాధ్యమయ్యే విషయం. అనుమానం వున్నవాళ్ళు ‘క్రితం తరువాత’ విరబూసిన ఆరు రంగుల “ఆకాశ స్వప్నాన్ని’ దర్శించాల్సి వుంటుంది. అక్కడో ‘శిశిరానంతర గీతం’ వినిపిస్తుంది. ప్రపంచ పటంపై వక్రరేఖలు కాలం చేస్తున్న దృశ్యం సాక్షాత్కరిస్తుంది.

          వీళ్ళు ఆరుగురు. స్వాప్నికులు. కల పూసిన చోట ఇప్పుడు వెన్నుపూసలు వేలం వేస్తున్నారని కలత చెందిన వారు. నిహిలిస్టులు అందామా? అనడం సులువే! అప్పుడు “కలల్ని బిందువు బిందువుగా కరగదీసిన’ వాళ్ల కోసం కూడ ఓ పదాన్ని సృష్టించాలి. వీళ్ళు ‘పడమటి ఆత్మహత్య’ను ప్రశ్నిస్తున్నారు. సమాధానం కావాలిప్పుడు. ‘కల విఫలమయ్యాక మిగిలిన కొస కాంతి మీంచి’ అడుగులు వెతుక్కుంటున్నారు వీళ్ళు. ‘జీవన శిధిలాల మధ్య కాలం గబ్బిలంలా వేళ్ళాడకూడదని’ కోరుకుంటున్నవాళ్లను ఆపడం న్యాయం కాదు.

          వీళ్ళు ఆరుగురు. రాజకీయులు. అచ్చమైన కవిత్వం నోటెంట పచ్చి రాజకీయాల్ని పలికించ గలవారు. క్రెమ్లిన్ స్థాణు చలనాలు, తీన్ మేన్ స్క్వేర్ చిన్నారి పాద ముద్రలు, మండేల విడుదల, గద్దర్ శబ్ద వ్యాకరణం ….. ఒక్కటేమిటీ? మొత్తం గత శతాబ్దాన్ని కవితా వస్తువుగా స్వీకరించిన వాళ్ళు.

          వీళ్ళు అరుగురు. కవులు. ఏమి చెప్పినా కవిత్వంగా మాత్రమే చెప్పాలని ఒట్టేసినవాళ్ళు. చివరికి కాలాన్నయినా సరే వాన మొగ్గల్లో, ధాన్యాక్షరాల్లో, జనన మరణ రసాయన ద్రవాల్లో, ప్రశాంత ముని వాకిట ఆమ్ల దీపాల సందడిలో కొలవ గలిగిన వాళ్ళు. ‘సిధ్ధాంతాలు ఏవైనా  సంస్థాగతాలు ఏవైనా’ రాజకీయాల్లో ఎండమావిగా మారిన ‘షడ్రుచి పాకాని’కి కవిత్వంలోనైనా కాసింత నీడ కల్పించాలనుకుంటున్న వాళ్ళు. 

          బెర్లిన్ గోడ పగుళ్ళు బారేక ఆత్మవిమర్శ పర్వంతో మొదలయిన ఈ సంయుక్త కవిత ఆరంభావస్థను పడక తప్పలేదు. గొంతు కలపడం కొత్త కదా!  శృతి కుదరొద్దూ! శ్రామికులకు రాజ్యాధికారం దక్కేంత వరకూ బూటకపు ఎన్ కౌంటర్ హత్యలు తధ్ధర్మ క్రియే! ఎవరూ? ఎవర్నీ? అనే ప్రస్తావనే లేకుండ ‘ఈ మధ్యనే భవిష్యత్తులో మరలా హత్యలు జరుగుతాయి/ రేపు గతంలో వందల హత్యలు జరుగుతాయి’ అంటూ ఉద్యమాన్ని ప్రేమార చేతుల్లోనికి ఎత్తుకున్న పంక్తులు సహితం పొందిక కుదరక కలుక్కు మనిపించాయి. ‘సాధారణ నాందీ వాచకాన్నే అసాధారణంగా అంతమొందిద్దాం’ ‘ఖైసర్, సెసెస్క్యూల చెరచాలనాల్లో నివేదించుకుందాం’ ‘నిద్రా ముద్రిత రిక్త హస్త రేఖా విన్యాసాలు’ వంటివి భాషా విన్యాసాలుగా మిగిలిపోవచ్చేమోగానీ కవితకు వాటివల్ల ఒనగూడే మేలేమీ లేదు.

          ‘ఇప్పటికైనా ఈ చెట్టును ఇక్కడి నుండి మోసుకు పోదాం’ అంటూ బాధ్యతను గుర్తించినవాళ్ళు,, చెట్టును ‘ఏమీ లేనితనాన్ని మోస్తున్న ఏదో వున్నతనంగా’, చెట్టు గతాన్ని ‘ఒకానొక నిష్ఫలిత యాగంగా’ చిత్రించడం నిక్కచ్చిగా బాధ్యతా రాహిత్యం. పోనీ దాన్ని కవితావేశంగా సరిపెట్టుకుందామా!  అందుకు పరిహారం ఏమంటే ‘మరెక్కడయినా నీడలతో గూడు కట్టుకుందాం / ఊరేగింపు ముఖ చిత్రం మీద మొక్క మొక్కను  అంటు కట్టుకుందాం’ అనడమే.

          ఎట్లాగూ రాజకీయాల్లోనికి వచ్చేశాం కనుక ‘కాస్సేపు వాతావరణం మీద సాన్నిహిత్య విమర్శ రాద్దాం’. “వర్షం … వర్షం … క్లిక్” వద్దు మాట మార్చవద్దు.

బాధంతా ఒక్కటే ఘనీభవించిన ఓల్గా, యాంగ్సీలకు పట్టిన గతి  గోదావరికి పట్టరాదనే. ముందే ‘మనం కాసేపు వివరంగా మాట్లాడుకుందాం’. ‘లెనిన్ తపస్సు స్టాలిన్ సేద్యం’లో ఎక్కడో ఓ మూల కాసింత లోపం వుందేమోనంటే మనం మాత్రం ఎందుకు భుజాలు తడుముకోవాలీ! నదీ గర్భంలో మంచు గడ్డలు పేరుకుంటున్నాయేమో! వాటి జన్మ రహాస్యాన్ని ఛేధించడానికి మనం నరసాపురం నుండి నిజామాబాద్ మీదుగా నాసికా త్రయంబకం వెళ్ళాలి.

నీ వేలి కొస మీంచే సూర్యోదయం జరుగుతుందని నువ్వు నమ్మినంత ప్రగాఢంగానే తన వేలి కొస మీంచే  సూర్యోదయం జరుగుతుందని నిన్న నువ్వు చంపినవాడు సహితం నమ్మేడు!. మిత్రులంటే అనుచరులేనా? సహచరుల మాటేమిటీ? ‘విబేధం వేరు; విద్వేషం వేరు’. విభేధించిన వారంతా శత్రువులేనా?

పోల్ పాట్, సెసెస్క్యూ, డెంగ్ జీయావో పెంగ్ ల ‘మరణాన్ని’ చూసేక వాళ్ళ అంశ ఇక్కడెక్కడైన మొలకెత్తి పెరుగుతున్నదేమోనని అనుమానం రావడం సబబే!  తప్పు పట్టాల్సింది అలాంటి అనుమానం రాకుంటేనే!

వాక్యం ఎవరిదైతే నేం? సహపంక్తిలో ఆరగిస్తూ  ఏ పంక్తి ఎవరిదని బేరీజు వేయడం సబబు కాదు. ‘ఒక దుస్వప్న వినాశనం కోసం ఆయుధం మొన మీద ముక్కుకు పదును చెక్కుతున్న పావురమంటే నియంతకు భయం’. ప్రజల కేం! ఆనందంగా హత్తుకో వచ్చు.  

రచన : 22 జూన్ 1990
ప్రచురణ : ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక, 29 జూన్  1990


‘క్రితం తర్వాత’ (సంయుక్త కవిత)

అఫ్సర్, కే నరసింహా చారి, కృష్ణుడు, నీలిమా గోపీచంద్, ప్రసేన్, త్రిపురనేని శ్రీనివాస్.
కవిత్వం ప్రచురణలు, 8 పేజీలు, వెల రెండు రూపాయలు

ప్రతులకు :  త్రిపురనేని శ్రీనివాస్, 40-5/6-10, ఇజ్రాయిల్ పేట, బందర్ రోడ్, విజయవాడ – 520010


Tuesday, 11 February 2020

Delhi Elections – 2020 Results



అభివృద్ధికే ఢిల్లీ ఓటరు పట్టం

-        డానీ

            ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమకారులకు, గొప్ప ఊరట నిచ్చాయి. దేశాన్ని మతోన్మాద కారు మేఘాలు కమ్ముకుంటున్న ఒక చారిత్రక దశలో ఒక తొలకరి జల్లులా వచ్చిన ఫలితాలివి.  మతోన్మాదంపై అభివృధ్ధి మంత్రం సాధించిన విజయం ఇది.

            1992 డిసెంబరులో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత చెలరేగిన మత భావోద్వేగాలు సానుకూలంగా మారడంతో 1993 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టి అధికారాన్ని చేపట్టింది. ఎన్నికల నినాదాలు రూపొందించడంలో గొప్ప నైపుణ్యం వున్న కమలనాధులు “ఇప్పుడు మినీ భారత్ (ఢిల్లీ) గెలిచాం, రేపు బిగ్ - భారత్ గెలుస్తాం”  అంటూ అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రచారం చేసేవారు. 

2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షాలు బిగ్-భారత్ ను గెలిచాయిగానీ మినీ భారత్ కు  2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టి (ఆప్) అధికారాన్ని చేపట్టింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారాన్ని నిలమెట్టుకున్నప్పటికీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి వరుస పరాజయాలను ఎదుర్కోంటోంది. కేంద్రంలోని అధికార పక్షం ఈసారి మినీ భారత్ అసెంబ్లీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  “దేశ్ బద్లా- అబ్ ఢిల్లీ బద్లో” (దేశం మారింది; ఇప్పుడు ఢిల్లీ నువ్వు మారు)! అనే నినాదంతో రంగంలో దిగింది.

అయితే ఈ నినాదంలో ఒక తిరకాసు వుంది. లోక్ సభ ఎన్నికల్లో మారిన దేశంలో ఢిల్లీ లేదా? అనే సందేహం వస్తుంది.  నిజానికి దేశంలోని పది రాష్ట్రాల్లో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం  బిజెపియేతర ప్రభుత్వాలున్నాయి.  దేశమంతా మారలేదనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలీ?

             బిజెపి ప్రచారం మొత్తం చీలిక విధానాలు, మతోన్మాద రాజకీయాలతోనే సాగింది.  ఈ ఎన్నికల్ని“షాహీన్ బాగ్ పై  భారత్ యుధ్ధం”గా ఒకరు చిత్రిస్తే  “పాకిస్తాన్ తో భారత్ యుధ్ధం”గా మరొకరు చిత్రించారు. బిజెపి ఢిల్లీ రాష్ట్ర శాఖకు మనోజ్ తివారి అధ్యక్షులుగా వున్నారు. అలాగే బిజెపికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేపి నడ్డా వున్నారు. అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీలే స్వయంగా పార్టీ ప్రచారాన్ని, వ్యూహాలు ఎత్తుగడల్ని దగ్గరుండి నడిపించారు. ఒక విధంగా ఇది మోదీజీ-షా ద్వయానికీ, కేజ్రీవాల్ –ప్రశాంత్ కిశోర్ ద్వయానికి  మధ్యన సాగిన  ఎన్నికల పోరుగా భావించవచ్చు.

మతభావోద్వేగాలు, లౌకిక విలువల మధ్య ఏటూ తేల్చుకోలేని సంధిగ్ధ స్థితిలో కాంగ్రెస్ వుంది. కాంగ్రెస్‍ అస్త్ర సన్యాసం చేసి యుధ్ధరంగాన్ని వదిలివేయడంవల్ల ఆప్ కు లాభించిన మాట  నిజమేగానీ బిజెపి ఓటమికి కాంగ్రెస్ తోడ్పడిన మాట అంతకన్నా వాస్తవం.  ఇప్పటి పరిస్థితిలో కాంగ్రెస్ చురుగ్గా పనిచేసివుంటే అది బిజెపికి లాభించివుండేది.   
            బిజెపి ప్రచారంలో ఆర్థిక సంక్షోభం నివారణ, ఉపాధికల్పన, విద్యా, వైద్యం వగయిరాల ఊసేలేదు. ప్రధానమంత్రి మోదీజీ పాల్గొన్న సభలు సహితం ఆ బాటలోనే నడిచాయి. మోదీజీ షాహీన్ బాగ్, సర్జికల్ స్ట్రైక్, జేఎన్ యూ, జామియా మిలియా, శీలంపూర్ నిరసనలు వంటి అంశాలతోనే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. అభివృధ్ధి గురించి ఒక్క మాటైనా ప్రస్తావించలేదు.

            పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటు డిసెంబరు 11న  ఆమోదించినప్పటి నుండి ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ముందు జెఎన్ యు, శీలంపూర్, జామియా మిలియాలలో మొదలయిన నిరసనలు జేడి బిర్లా మార్గ్ లో షాహీన్ బాగ్ వద్ద  ఒక శిబిరం ఏర్పడడంతో ఉధృతంగా మారాయి.  షాహీన్ బాగ్ ఉత్తేజంతో దేశంలో   ఇప్పుడు దాదాపు 150 సిఎఎ, ఎన్ పిఆర్, ఎన్ ఆర్ సి వ్యతిరేక శిబిరాలు నడుస్తున్నాయి.  ఒక చేతితో మువ్వన్నెల జాతీయ జెండాను, ఇంకో చేతితో రాజ్యాంగాన్ని పట్టుకుని,  ఒళ్ళో మహాత్మా గాంధీజీ, బాబాసాహెబ్ అంబేడ్కర్ ల ఫొటోలు పెట్టుకుని, రాజ్యాంగ ప్రవేశికలోని “న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావం” ఆదర్శాలను నినదిస్తూ సాగుతున్న మహత్తర లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ఇది.  

             కేవలం ముస్లింలు మాత్రమే సిఎఎను వ్యతిరేకిస్తున్నారనే సంకేతాలు ఇచ్చి హిందూ ఓటు బ్యాంకును సమీకరించాలని స్వయంగా ప్రధాన మంత్రి కూడ ప్రయత్నించారు. అయితే, అప్పటికే ఆలస్యం అయిపోయింది. శిక్కులు మొదటి నుండీ షాహీన్ బాగ్ నిరసనకారులకు అండగా వున్నారు. ఆ పిదప క్రైస్తవులేగాక, హిందూ సమాజానికి చెందిన అనేక సమూహాలు ఆ శిబిరానికి చేరుకున్నాయి. రోజూ షాహీన్ బాగ్ శిబిరంలో సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి.  ఈ మతసామరస్య పరిణామాల్ని మోదీజీ- అమిత్ జీ ద్వయం ఊహించలేదు. అది వారికి జీర్ణం కావడంలేదు.  

            మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పనిని ముందుగా బిజెపి ఎంపి  ప్రవేశ్ వర్మ మొదలెట్టారు. “షాహీన్ బాగ్ నిరసనకారులు మీ ఇళ్ళ లోనికి దూరి మీ మహిళల్ని చెరుస్తారు, మీ సోదరుల్ని హత్యలు చేస్తారు” అని జనాన్ని రెచ్చగొట్టారు. ప్రవేశ్ వర్మ మీద ఎన్నికల కమీషన్ నాలుగు రోజుల నిషేధాన్ని విధించింది. నిషేధం నుండి తిరిగి వచ్చిన వర్మ మరీ రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి కేజ్రివాల్ ను ఏకంగా టెర్రరిస్టు అన్నారు. మళ్ళీ ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకుంది. ఒక్క వారంలో రెండుసార్లు ఎన్నికల కమీషన్ నిషేధించడంతో పార్టీలో వర్మ స్థాయి పెరిగిపోయింది!. రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో చర్చను ప్రవేశపెట్టే కీలక బాధ్యతను ప్రవేశ్ వర్మకు అప్పగించారు. ప్రజల్ని ఎంతగా రెచ్చగొడితే పార్టీలో అంత పెద్ద పీట వేస్తాం అని సంకేతాలిచ్చారు మోదీజీ-అమిత్ జీ.

            ప్రవేశ్ వర్మ  ప్రేరణతో ఆర్థికశాఖ సహాయ మంత్రి  అనురాగ్ ఠాకూర్ ఇంకా రెచ్చిపోయారు. “దేశ్ కే గద్దారో కో; గోలీ మారో సాలో కో” (సాలేగాళ్ళు దేశద్రోహులు; కాల్చిచంపండి వాళ్ళని)  అని రెచ్చగొట్టారు. గాంధీజీని హత్య చేసిన రోజైన జనవరి 30న జామియా మిలియా శిబిరం వద్ద ఒక అగంతకుడు నిరసనకారుల మీద కాల్పులు జరిపాడు. ఆ తరువాత మరో మూడు రోజుల్లో షాహీన్ బాగ్ దగ్గర రెండు సార్లు అగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల వీరుళ్ళు ముగ్గురూ  “దేశ్ కే గద్దారో కో; గోలీ మారో సాలో కో”  నినాదాలే ఇవ్వడం విశేషం.  ప్రచారంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాద్ తన సహజశైలిలో బుల్లెట్ల భాష మాట్లాడారు. బోలీ కి భాష నహి మానేగా తో గోలీ కే భాష సమ్జాయేగా” (షాహీన్ బాగ్ నిరసనకారులు “మాటల భాష వినకపొతే తూటాల భాష దారికి తెస్తుంది”) అన్నారాయన. కేంద్రమంత్రులు ప్రకాష్ జవదేకర్ తదితరులు తమ వంతు ఆజ్యం పోశారు. ప్రచారసారధి  అమిత్ షా చెలరేగిపోయారు. “మీరంతా ఇవియం బటన్ ను ఎంత గట్టిగా నొక్కాలంటే ఆ షాక్ షాహీన్ బాగ్ కు కొట్టాలి” అని పిలుపిచ్చారాయన.  “11వ తారీఖున ఎన్నికల్లో మనం గెలిచిన వార్త రాగానే సాయంత్రం ఆరు గంటల లోగ  విద్యార్థి నాయకులు షర్జీల్  ఇమామ్, కన్హయ్య కుమార్ ల మీద చార్జి షీట్  తయారయిపోతుంది. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడిన గంట లోపులోనే వాళ్ళు జైల్లో వుంటారు” అన్నారాయన.  ఇంతటి ద్వేషపూరిత ప్రచారం గతంలో ఎన్నడూ చూడలేదు.

భావోద్వేగాలను రెచ్చగొట్టి మినీ భారత్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా లబ్ది పొందడానికే బిజెపి ముహూర్తం చూసి సరిగ్గా డిసెంబరులోనే సిఎ చట్టాన్ని తెచ్చింది. ఆ పార్టి ఊహించినట్టే షాహీన్ బాగ్ ఉద్యమం మొదలయింది. అయితే, షాహీన్ బాగ్  తమను ఓడిస్తుందని మాత్రం ల్కమలనాధులు అనుకొని వుండరు.            

            మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం చేజిక్కగానే బిజెపి అధ్యక్షునిగా  అమిత్ షా చేసిన మొదటి ప్రకటన “ఒక్క పార్టి కూడ తమ ప్రణాళికల్లో లౌకికవాదం ఊసే ఎత్తలేదు” అని. లౌకికవాదాన్ని భారత ప్రజలు తిరస్కరించారు అని చెప్పడం వారి అభిమతం. అలాగే, ఢిల్లీ ఎన్నికల్లో గెలవగానే ప్రజలు అభివృధ్ధిని కోరువడంలేదు; వాళ్ళకు మత భావోద్వేగాలే ముఖ్యం అని ప్రకటించి వుండేవారు. అదృష్టవశాత్తు వారికి ఆ అవకాశం రాలేదు. ముస్లిం ద్వేషం, పాకిస్తాన్, సర్జికల్ స్ట్రైక్స్ వంటి మాటలు ప్రజలకు వెగటు పుట్టించాయి. ఇది షాహీన్ బాగ్ విజయం. లౌకిక  భారత ప్రజల విజయం.

             మరోవైపు, ఈ ఎన్నికల్లో  నోటిఫికేషన్ వెలువడిన రోజే ఆప్ గెలుపు ఖాయం అయిపోయింది.  అందివచ్చిన విజయాన్ని స్వీయ తప్పిదాలతో చేజార్చుకోకుండా కేజ్రివాల్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మోదీజీ అమిత్ జీ తనను ఎంత రెచ్చగొట్టినా స్పందించలేదు.  సిఎఎను వ్యతిరేకిస్తున్నప్పటికీ షాహీన్ బాగ్ శిబిరానికి వెళ్ళలేదు. కేవలం అభివృధ్ధి మంత్రాన్నే ఎంచుకున్నారు. సిబిఎస్ ఇ పరీక్షల్లో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు జాతీయ సగటుకన్నా, ప్రైవేటు విద్యా సంస్థల కన్నా మెరుగైన ఫలితాలను సాధించారు.  ఉచిత నీరు, ఉచిత విద్యుత్తు, ఉచిత వైద్యం పథకాలు, విద్యా రంగంలో సంస్కరణలు కేజ్రీవాల్ కు “ప్రో-ఇన్కుంబెన్సీ”గా  మారాయి.

కమలనాధులకు రాజకీయ ప్రాణవాయువుగా పని చేస్తున్న మతోన్మాదాన్ని, చీలిక విధానాలని పక్కకు తోసి అభివృధ్ధిని దేశ రాజకీయ ఎజెండాగా మార్చడానికి ఈ ఎన్నికలు నాంది పలికాయని ఆశించవచ్చు. అందుకు దోహద పడిన ఆమ్ ఆద్మీ పార్టి అధినేత కేజ్రీవాల్ కు అభినందనలు.

(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు, రచయిత, సమాజ విశ్లేషకులు, మొబైల్ 90107 57776)

రచన : 11 ఫిబ్రవరి2020
ప్రచురణ :  సాక్షి దినపత్రిక, 12 ఫిబ్రవరి2020


Saturday, 18 January 2020

Tragedy in the Education System


Tragedy in the Education System 
ఇదొక విద్యా విషాదం
డానీ

            నరసాపురం ఎంబేరు మన్నారుస్వామివార్ల కోవెల దగ్గర పిలక పంతులుగా పిలిచే అగ్నిహోత్రావధాన్లు (గురువుగారికి నమస్కారం) గారి  దగ్గర  నేను అక్షరాభ్యాసం చేశాను. వారి దగ్గరే చిన బాలశిక్ష చదివి నరసాపురం టేలరు హైస్కూలు బ్రాంచి స్కూలులో చేరాను. అక్కడ ఐదు వరకు చదివిన తరువాత టేలరుపేట మునిసిపల్ అప్పర్ ప్రైమరీ స్కూలులో 6వ తరగతి నుండి 8వ వరకు చదివాను. అప్పట్లో దాన్ని శిష్ ట్లా సూర్యనారాయణ (గురువుగారికి నమస్కారం) స్కూలు అనేవారు. అప్పట్లో ఎమిదవ తరగతికి థర్డ్ ఫామ్, ఎయిత్ స్టాండర్డ్  అనే రెండు బోధనా పధ్ధతులు వుండేవి.   పబ్లిక్ ఎగ్జామ్ కనుక ఎయిత్ స్టాండర్డ్  కు థర్డ్ ఫామ్ కన్నా  అదనపు విలువ వుండేది. ఎయిత్ స్టాండర్డ్  పాసైన వారికి ఎలిమెంటరీ స్కూలు టీచర్లు, పోస్ట్ మ్యాన్లు, నర్సులు, కాంపౌండర్లు వంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేవారు. 1963-64 విద్యా సంవత్సరంలో ఎయిత్ స్టాండర్డ్  కామన్ ఎగ్జామ్ లో పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో నాది రెండవ ర్యాంకు.

            నరసాపురంలో  రెండే హైస్కూళ్ళు వుండేవి; టేలర్ హైస్కూలు, మిషన్ హైస్కూలు. టేలర్ హైస్కూలులో అల్లూరి శ్రీరామరాజు చదవగా, మిషన్ హైస్కూలులో చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు చదివారు. అదీ ఆ స్కూళ్ళ గొప్పతనం. అప్పట్లో టేలర్ హైస్కూలుకన్నా మిషన్ హైస్కూలు ప్రభ వెలిగిపోతూ వుంది. అంతర్జాతీయ విద్యావేత్త డిబి బర్ట్ వంశీకులు దాన్ని నిర్వహిస్తూ వుండేవారు.  మిషన్ హైస్కూలుకు అనుబంధంగావున్న ఎలిమెంటరీ స్కూలులో మా నాన్న మూడో తరగతి చదివారట. ఆపాటి చదువుకే ఆయన ఇంగ్లీషులో సంతకం పెట్టేవారు. ఉత్తరాల మీద ఇంగ్లీషులో అడ్రస్సులు రాసేవారు. బ్యాంకుల్లో రైల్వేస్టేషన్లలో అప్లికేషన్లు పూర్తిచేసే పనులు కూడ ఇంగ్లీషులో చేసేవారు.    పైగా వారి ఇంగ్లీషు రాత చాలా అందంగా వుండేది. నన్ను కూడ అక్కడ చేర్చాలని ఆయన కోరిక. అప్పటి హెడ్మాష్టారు బూల అజరయ్య (గురువుగారికి నమస్కారం) గారితోనూ మానాన్నకు చిన్న అనుబంధం ఏదో వుండేది. కానీ, మా ఎయిత్ స్టాండర్డ్ పబ్లిక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే నాటికి మిషన్ హైస్కూలులో  9వ తరగతికి చెందిన నాలుగు సెక్షన్లూ  నిండిపోయాయి. సెక్షనుకు యాభై మందికి మించి తీసుకోవడానికి వీల్లేదు. ఇతర పట్టణాలకు పంపి చదివించే స్తోమత మా కుటుంబానికి లేదు.

            బూల అజరయ్య (గురువుగారికి నమస్కారం)  గారి సలహాతో మా నాన్న ఏలూరు వెళ్ళీ డిఇవోను కలిశారు. నాకు మెరిట్ స్టూడెంట్ గా సీటు ఇవ్వాలని డిఇవో సిఫారసు లేఖ ఇచ్చారు. అలా  రోల్ నెంబరు 51తో మిషన్ హైస్కూలు 9వ తరగతి ‘ఏ’ సెక్షన్ లో చేరాను. ఆ రోజుల్లో ‘ఏ’ సెక్షన్ అంటే అదో గొప్ప. నాలాగే ఎయిత్ స్టాండర్డ్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో కోడి వీర వేంకట సత్యనారాయణకు కూడ పెద్ద ర్యాంకు వచ్చింది. అతన్నీ డిఇవో సిఫార్సు చేశారు. తన రోల్ నెంబరు 52.  అప్పట్లో ఎస్ ఎస్ ఎల్ సి గ్రూపు పరీక్షల్ని తెలుగులోగానీ ఇంగ్లీషులోగానీ రాసే వీలుండేది. అయితే మాది తెలుగు మీడియమే.  

            మిషన్ హైస్కూలులోనే 9, 10, 11 చదివాను. అదే సెక్షను అదే బెంచి. అదే టీమ్. ఎడమ పక్క అమ్మనమంచి కృష్ణశాస్త్రి, కుడి పక్క పిట్టా కాల్విన్ విక్టర్ బాబ్. మధ్యలో నేను. మూడు మతాల సామరస్యం.  అదొక మినీ ఇండియా. మాది ఎస్.ఎస్‍.ఎల్.సి. 1966-67 బ్యాచి.

            మా కుటుంబం అల్పాదాయ వర్గం గాబట్టి నాకు హైస్కూలులో హాఫ్ ఫీ వుండేది. అదిగాక ఎయిత్ స్టాండర్డ్  మార్కుల మీద నాకు 9వ తరగతిలో మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చారు. 9వ తరగతి  మార్కుల మీద 10 వ తరగతిలో మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చారు. 10వ తరగతి  మార్కుల మీద 11వ తరగతిలో మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చారు. ఎస్ ఎస్ ఎల్ సి మార్కుల మీద కాలేజీలో మళ్ళీ మెరిట్ స్కాలర్ షిప్పు ఇచ్చారు. హైస్కూలులో కాంపోజిట్ మేథమెటిక్స్ చదివాను; కాలేజీలో మేథ్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ చదివాను.  నికరంగా జరిగిందేమిటంటే నా చదువు కోసం నా పేరెంట్స్ కట్టిన ఫీజులన్నీ మెరిట్ స్కాలర్ షిప్పుల రూపంలో తిరిగి వచ్చేశాయి.  

            మా టీచర్లకు సబ్జెక్ట్స్ మీద అపారమైన పట్టువుండేది. విద్యార్ధుల మీద అంతులేని వాత్సల్యం వుండేది. విద్వాన్ పేరి రామారావు గారి తెలుగు పాఠాలు, కేఎన్ ఆర్, వి. త్రివేంగళా చార్యుల మేథ్స్ పాఠాలు. జోస్యుల వేంకటేశ్వర రావు గారి సైన్సు పాఠాలు, బెంజిమన్, అబ్రహం, జాన్ మాష్టర్ల సోషల్ స్టడీస్, భౌగోళిక శాస్త్రం, బూల అజరయ్యగారి ఇంగ్లీషు నాన్ డిటైల్స్ పాఠం, సంజీవరావు గారి ఇంగ్లీషు పాఠాలు నాకు ఇప్పటికీ చెవుల్లో వినపడుతూనే వుంటాయి (గురువులందరికీ నమస్కారం).  ఇంగ్లీషు భాష syntax లో జాతీయ స్థాయి గుర్తింపువున్న థియోడర్ (గురువుగారికి నమస్కారం)  మాస్టారు అక్కడే పని చేసేవారు. సంజీవరావు మాస్టారు (గురువుగారికి నమస్కారం)  అయితే “even the dog can bark in English if I teach” అని సగర్వంగా ప్రకటించేవారు.   

            హెడ్మాష్టారు బూల అజరయ్యగారు (గురువుగారికి నమస్కారం) నా ఎస్.ఎస్‍.ఎల్.సి. మార్కుల పుస్తకంలో “He will be a scientist or a social worker” అని రాశారు. అప్పటికి నాకు నిండా పదహారేళ్ళు కూడ లేవు. ఆ వయసులోనే వారికి నా భవిష్యత్తు మీద అలాంటి అంచన ఎలా వచ్చిందన్నది నాకు ఇప్పటికీ అశ్చర్యమే.

            దాదాపు నలభై ఎనిమిదేళ్ళ తరువాత 2015లో అమ్మనమంచి కృష్ణశాస్త్రి పుట్టిన రోజు సందర్భంగా  నరసాపురం వెళ్ళినపుడు పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి నా తరగతి గదికి వెళ్ళాను. మా జమానాలో నరసాపురం పరిసరాల్లోని పెద్ద కుటుంబాల పిల్లలందరూ మా స్కూలులో వుండేవారు. మొగల్తూరు రాజులు సహా, బ్రాహ్మణులు, క్షత్రీయులు,  వైశ్యులు, కాపులు, ముస్లింలు, క్రైస్తవులు, ఈడిగలతో క్లాస్ రూములు ధగధగ్గ లాడిపోయేవి. అన్నట్టు మా ఊరి క్రైస్తవుల్లో కొన్ని కుటుంబాలు చాలా సంపన్నులు. విద్యా, వైద్య రంగాల్ని వాళ్ళే శాసించేవారు.   

            ఇప్పటి మా తరగతి గదిలోని దృశ్యం చూసి తల్లడిల్లిపోయాను సెక్షనులో పట్టుమని పదిహేను మంది పిల్లలు కూడా లేరు. వాళ్ళు కూడ సోమాలియా నుండి దిగి వచ్చినట్టు బక్కచిక్కిపోయి చింపిరి బట్టలతో వున్నారు. ప్రాబల్యం గల కులాలన్నీ ఇంగ్లీషు మీడియం స్కూళ్ళకు  పోగా నిరుపేద ఎస్సీలు ఎస్టీలు కొందరు బిసిలు మాత్రమే ఇప్పుడు మిగిలారు. వాళ్ళు కూడ మధ్యహ్న భోజనం కోసమో ఉడకేసిన  కోడిగుడ్ల కోసమో స్కూలుకు వస్తున్నారని నాకు అనిపించింది. 

            ఇంగ్లీషు మీడియం ప్రైవేటు స్కూళ్ళు మా మిషన్ హైస్కూలును తినేశాయి.  ప్రభుత్వ స్కూలు అన్నా. ఎయిడెడ్ స్కూలు అన్నా ఇప్పుడు నిరుపేద ఎస్సీలు ఎస్టీలు  బిసిల బాల ఆశ్రయాలుగా మారిపోయాయి. అలనాటి విద్యా వైభవం శిధిలమైపోయింది.


తెలుగు మాధ్యమం ద్వార ఇంగ్లీషు నేర్పే పని దశాబ్దాలుగా చేస్తున్నారు. ఫలితాలు రాలేదు. ఇప్పుడు ఇంగ్లీషు మాధ్యమం ద్వార ఒక ప్రయత్నం చేయనియ్యండి.

Tuesday, 19 November 2019

English Medium is the Democratic Right of Underprivileged

English Medium is the Democratic Right of Underprivileged
అభద్రలోకపు ప్రజాస్వామిక హక్కు ఇంగ్లీషు మీడియం

డానీ  

  వర్గ సమాజపు సమీకరణలకన్నా కులవర్గ సమాజపు సమీకరణలు సంక్లిష్టంగా వుంటాయి. ఇప్పటి వరకు సంపన్న, ఎగువ మధ్య, మధ్య తరగతులకు చెందినవారిని పాలకవర్గం అంటున్నాం; దిగువమధ్య, పేద సమూహాలని పాలితవర్గం అంటున్నాం. ఇది ఆర్థిక విశ్లేషణ మాత్రమే. సాంఘీకార్థిక (socio-economic) విశ్లేషణకు సాంస్కృతిక అవగాహన కూడ కావాలి. పెత్తందారీ కులాలు, అణగారిన కులాలు రెండూ ఇటు పాలక వర్గంలోనూ అటు పాలిత వర్గంలోనూ వుంటాయి. అంత మాత్రాన అవి రెండూ ఒకటికానేకావు. పాలకవర్గంలో అత్యధిక శాతం పెత్తందారీ కులాలు, అత్యల్ప శాతం అణగారిన కులాలు వుంటాయి. ఈ సమీకరణని భద్రలోకం అనాలి.  అలాగే, పాలితవర్గంలో అత్యధిక శాతం అణగారిన సమూహాలు, అత్యల్ప శాతం పెత్తందారీ కులాలు వుంటాయి.  ఈ సమీకరణని అభద్రలోకం అనాలి.         

            రెండు వందల సంవత్సరాల బ్రిటీషు పాలనతో పాటూ  అది తెచ్చిన వలస భాషాసంస్కృతులు పోయివుంటే దేశీయ భాషలు వికసించడానికి అవకాశాలు వుండేవి.  కానీ అలా జరగలేదు.  ఆర్థికరంగంలో  విదేశీ పెట్టుబడులు గతంకన్నా పెద్ద వరదలా వస్తున్నాయి. విదేశీ కంపెనీలను తీసుకు రాగలిగినవారే రాజకీయ రంగంలో సమర్థులుగా చెలామణి అవుతున్నారు. రాజకీయార్ధికరంగంలోని విలువలే సాధారణంగా విద్యా సాంస్కృతిక రంగాల్లోనూ కొనసాగుతాయి. ప్రత్యక్ష వలస పాలన కాలంలోనూ లేనన్ని విదేశీ వస్తువులు, సాంప్రదాయాలు మన ఇళ్ళు జీవితాల్లోనికి వచ్చేశాయి. పిల్లలు అభివృధ్ధి చెందిన దేశాల్లో స్థిరపడాలనే జీవితాశయం మనలో బలపడుతోంది. ఐటి ఉద్యోగాలకు విదేశీ ద్వారాలు తెరుచుకున్నాక మన సమాజంలో ఇంగ్లీషు గిరాకి మరీ  పెరిగిపోయింది. గతం నుండే ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు మొదలు పోలీసు స్టేషన్ల వరకు కార్యకలాపాలన్నీ ఇంగ్లీషులోనే సాగుతున్నాయి. అధికారం మొత్తం తన చుట్టూ తిరుగుతుండడంతో మొదట్లో అనుసంధాన భాషగావున్న ఇంగ్లీషు  ఇప్పుడు మనకు అప్రకటిత అధికార భాషగా మారిపోయింది. మాతృభాషలకు ఉపయోగపు విలువలు మాత్రమే మిగలగా,  ఇంగ్లీషుకు మారకపు విలువ కూడా అదనంగా చేరింది. ఈ వాస్తవాన్ని ముందు అందరూ గుర్తించాలి.     

      రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్థ శతాబ్దం క్రితం ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు  అరుదుగా వుండేవి. అందువల్ల భద్రలోకం కూడ అభద్రలోకంతోపాటు తెలుగు మీడియం పాఠశాలల్లోనే ‘కంబైన్డ్ స్టడీస్’ చేసేది. భద్రలోకపు స్థాయి, అవసరాలకు అనుగుణంగా  అప్పటి తెలుగు మీడియం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు వున్నతంగా వుండేవి. 1971లో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏర్పడి, కళాశాల విద్యలోనూ తెలుగు మీడియంను అనుమతించాక విద్యారంగంలో కులవర్గ సమీకరణలు చాలా వేగంగా మారిపోయాయి. తెలుగు మీడియంకన్నా ఇంగ్లీషు మీడియం మెరుగైనదనీ, అందులోనూ స్టేట్ సిలబస్ కన్నా సెంట్రల్ సిలబస్ నాణ్యమైనదనే ఒక కొత్త విలువ బలంగా ముందుకు వచ్చింది. భద్రలోకం మొత్తం ఇంగ్లీషు మీడియం ప్రైవేటు స్కూళ్ళకు మారిపోవడంతో తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో క్లాస్ రూంలు, బ్లాక్ బోర్డులు,  బెంచీలు, గాలి, వెలుతురు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు సహితం లేకుండాపోయాయి. మరోవైపు, ప్రభుత్వ విద్యారంగంలో అధ్యాపక సంఘాల సంఖ్య పెరిగింది. అధ్యాపకుల జీతాలు పెరిగాయి; విద్యా ప్రమాణాలు మాత్రం ఘోరంగా పడిపోయాయి.  అభద్రలోకం మాత్రమే గతిలేక తెలుగు మీడియంలో మిగిలిపోయింది.

         ప్రాధమిక పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల వరకు ఇదే పరిస్థితి వుంది.  అల్పాదాయవర్గాలకు చెందిన  భవన కార్మికులు, ఆటో డ్రైవర్లు సహితం తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూళ్ళకు పంపించడం మొదలెట్టారు. ప్రమాదం ఏ దశకు చేరిందంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు సహితం తమ పిల్లల్ని తెలుగు మీడియం పాఠశాలల్లో చేర్చడానికి భయపడిపోతున్నారు. ఫలితంగా అభద్రలోకానికి నియత విద్య మీదనే నైరాశ్యం ఏర్పడే ముప్పు వచ్చింది.

            ఇంగ్లీషు రాకపోవడాన్ని ఒక భాషా వైకల్యంగా మార్చేసిన యాభై ఏళ్ళ చారిత్రక పరిణామాల్ని సీనియర్ మేధావులు గుర్తించడంలేదు. తాము తెలుగు మీడియంలోనే చదివి గొప్పవాళ్ళయినట్టు ఒక అర్థ సత్యాన్ని  ప్రచారం చేస్తున్నారు.  మరోవైపు, అభద్రలోకం ప్రభుత్వాన్ని చౌక బియ్యం, పక్కా ఇళ్ళు,  వృధ్ధాప్య పెన్షను, కార్ పోరేట్ ఇంగ్లీషు వైద్యం  కావాలని అడిగినట్టు ఇప్పుడు తమ పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్య కావాలని అడుగుతోంది. వైయస్ జగన్ నిర్వహించిన చారిత్రాత్మక పాదయాత్ర సందర్భంగా పేదజనం ఆయనతో చెప్పుకున్న కష్టాల్లో కాన్వెంటు ఫీజుల భారం  ఒకటి. ఆ మేరకు ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకు మూడు నాలుగు విడతల్లో ఇంగ్లీషు మీడియంలోనికి మార్చాలని ముఖ్యమంత్రి  జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుండి ఇది అమల్లోనికి రానుంది. ప్రతి తరగతిలోనూ విద్యార్ధుల ఛాయిస్ ను బట్టి తెలుగు లేదా ఉర్దూ ఒక సబ్జెక్ట్‍ గా తప్పనిసరిగా వుంటుంది.  ఇది అందరూ ఆహ్వానించవలసిన పరిణామం.  

       అభద్రలోకానికి ఇంగ్లీషు మీడియం విద్య అందిస్తారనగానే భద్రలోకం ఉలిక్కి పడింది. పురాతన కాలంలో విద్య నేర్చే శూద్రుల్ని కఠినంగా శిక్షించేవారట. ఇప్పుడు అభద్రలోకానికి ఇంగ్లీషు దకక్కుండచేయడానికి మాతృభాషా మాధ్యమ పరిరక్షణ వేదిక నడుం బిగించింది. ప్రతి మనిషికీ పుట్టడానికి ముందే తల్లిగర్భంలోనే మాతృభాష పరిచయం అవుతుంది. పుట్టాక కూడ ఆ వాతావరణంలోనే పెరుగుతాడు కనుక ఎవరికైనా నేర్చుకోవడానికి మాతృభాష చాలా సౌలభ్యంగా వుంటుంది. మనిషి జీవితంలో మాతృభాష అనేది స్కూళ్లకు ముందూ వుంటుంది, ఆ తరువాతా వుంటుంది. స్కూళ్ళలో మాత్రమే మాతృభాష పుట్టి పెరుగుతుందని అమాయకులు మాత్రమే భావిస్తారు.

     మాతృభాష అనగానే తెలుగు ఉర్దు మాత్రమే గుర్తుకువస్తాయి. తమిళ కన్నడ మళయాళ గుజరాతీ సమూహాలే కాకుండా సవర, జాతాపు తదితర ఆదివాసీ భాషల సమూహాలూ అనేకం వుంటాయి. ఆ యా భాషలు మాట్లాడేవాళ్ళకు వాళ్ళ పరిసరాల్లో వాళ్ళ మాతృభాషలో విద్యా బోధనకు అవకాశాలు లేవు. మాతృభాష పేరు చెప్పుకుంటూ   అధికార భాషలో విద్యాబోధన సాగిస్తున్నారు. ఆ అధికార భాష సంఘం ప్రచురించే పుస్తకాల్లోని కృతక ఆంధ్రము కన్నా ఇంగ్లీషు చదవడమే చాలా సులువుగా వుంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నది భద్రలోకమే అనేది చాలా స్పష్టం. అప్పట్లో ప్రైవేటు విద్యను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ విద్యను బలహీనపరిచిందీ వీళ్ళే. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల ఆధిపత్యాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకిస్తున్నదీ భద్రలోకమే.

    మాతృభాష పరిరక్షణ కోసం పిల్లల్ని చదివించే తల్లిదండ్రులు దాదాపుగా వుండరు. నియత విద్య ప్రయోజనమే ఉపాది. మాతృభాష అవసరాన్ని గుర్తించిన వాళ్ళు ఇంటి దగ్గర వాటికి వేరే ఏర్పాట్లు చేసుకుంటారు. భాషా మైనారిటీలు సాధారణంగా అలా చేస్తుంటారు.

          సమాజంలో అందరూ ఉద్యోగాల కోసమే చదువుతారుగానీ అందరికీ ఉద్యోగాలు రావు. అత్యుల్లాసమైన (Volatile) ఉపాధిరంగంలో ఒక్కోసారి ఒక్కో సబ్జెక్ట్ కు గిరాకీ వుంటుంది. 1970లలో కామర్స్ చదివితే చాలు బ్యాంకు ఉద్యోగం వచ్చేస్తుంది అనేవారు. 1990లలో Y2K సమస్య వచ్చినపుడు బిటెక్ మాత్రమే కాదు ఏదో ఒక్క సాఫ్ట్‍ వేర్ భాష వచ్చినా ఉద్యోగాలు వచ్చాయి. గిరాకీ సరఫరా సూత్రం అన్నింటా వుంటుంది. ఇప్పుడు ఇంగ్లీషు మీడియంకు అలాంటి  క్రేజ్ వుంది. మార్కెట్లో ఉపాధి అవకాశాలే లేనపుడు ఏ మాధ్యమంలో చదివితే ఏమిటనే? వాళ్ళూ వున్నారు. “కూటికీ పేదోణ్ణేకానీ; కులానికి కాదు” అనే మాట మన సాంస్కృతిక రంగంలో వినపడుతూ వుంటుంది. ఉద్యోగం రాకపోయినా ఇంగ్లీషు వచ్చినవాళ్ళు అలాంటి సాంస్కృతిక  గౌరవాన్ని ఆస్వాదించే  వాతావరణం మన సమాజంలో వుంది.

               ఆర్థిక రంగంలో అభద్రలోకానికి భద్రలోకానికి మధ్య సాగే ఘర్షణే ఇప్పుడు విద్యారంగంలో తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియంల  వివాదంగా వ్యక్తం అవుతోంది. నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ సంస్థల్లోలో సామాజికమైనారిటీ విద్యామెజారిటీగా మారుతుండగా, సామాజికమెజారిటీ విద్యామైనారిటీగా మిగిలిపోతోంది. ఈ అసమానత్వం ఇంకెంత కాలం కొనసాగాలీ? ఇంగ్లీషు మీడియంలో చదవాలని ఆశిస్తున్న ప్రతి పేద కుటుంబానికీ ఆ అవకాశం కల్పించాలి. ఇప్పుడు అభద్రలోకపు ప్రజాస్వామిక హక్కు ఇంగ్లీషు మీడియం.

       అభద్రలోకంలో ఇంగ్లీషేతర మాధ్యమాల్లో చదవాలనుకునే వారు కూడ వుంటారు.  వారిది కూడ ప్రజాస్వామిక హక్కే. అంచేత కనీసం ఐదవ తరగతి వరకైనా ఇంగ్లీషేతర మాధ్యమాలకు కూడ ఛాయిస్ వుండాలి. పేరెంట్స్ మీట్స్‍ పెట్టి వాళ్ళు కోరుకునే మీడియం ఇంగ్లీషో, మాతృభాషో తేల్చాలి. ఆ సర్వేఫలితాలను బట్టి పాఠశాలల్ని వర్గీకరించాలి; పునర్ వ్యవస్థీకరించాలి.      

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
మొబైలు  : 9010757776


రచన : 11 నవంబరు 2019
ప్రచురణ : 14 నవంబరు 2019, ‘ఇంగ్లిష్‌ ఓ ప్రజాస్వామిక హక్కు’  శీర్షికతో ప్రచురించారు.

https://www.sakshi.com/news/guest-columns/usha-s-danny-articles-english-medium-education-1241462

https://epaper.sakshi.com/c/45937990?fbclid=IwAR1ejasT-cte9MWxhcvkerBMivkscGLIRqBxYYI5v0XcxlCiAO2CQU_QIOg

నాలోని కథకునికి “పోరాట మిత్రులు’ చాలా అన్యాయం చేశారు.

నాలోని కథకునికి “పోరాట మిత్రులు’ 
చాలా అన్యాయం చేశారు.


డియర్ సురేష్,

గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ ఇంటర్వ్యూ కు నీ అనువాదాన్ని ఇప్పుడే  చదివాను. ఆంధ్రజ్యోతిలో నీ  వ్యాసం లింకు ఎందుకో ఓపెన్ కావడం లేదు. అది కూడ చదవాలని ఎదురు చూస్తున్నాను.

మార్క్వెజ్  ఇంటర్వ్యూ చదువుతున్నప్పుడు  నా జీవితంలోని అనేక అంశాలు గుర్తుకు వచ్చాయి. మొదటిది మా అమ్మమ్మ. ఆమెకు జానపద కథలు అనేకం వచ్చు. రోజూ మాకు నిద్రపోయే ముందు ఒక కథ చెప్పేది. వాటిల్లో దయ్యాలు, భూతాలు మాయలు మంత్రాలు అన్నీ వుండేవి.

అలా మా సమీప బంధువుల్లో ముహమ్మద్ షరీఫ్ అని ఒకడు వుండేవాడు. వాడు ఈ లోకంలో కన్నా ఇతర గ్రహాల్లో ఎక్కువగా వుండేవాడు. “ఎరా నిన్న కనిపించలేదేంటీ?” అని అడిగితే  “చంద్రలోకానికి వెళ్ళానుగా. చంద్రుని కూతుర్ని పెళ్ళిచేసుకున్నాను” అని మొదలెట్టేవాడు. తీరిక వుంటే ఒక గంటకు పైగా ఆ కథను నడిపించేవాడు. అలా రోజుకో ఎపిసోడ్ అల్లేసే వాడు. ఆ కథల్లో మా ఉర్లో వాళ్లందరి పాత్రలూ కేరికేచర్లుగా వుండేవి. అంతటి కల్పన శక్తి  గల  మనుషుల్ని నేను ఇంత వరకు చూడలేదు. 

            నేను 1980లో జప్తు అని ఒక కథ రాశాను. అందులో మా అమ్మమ్మ, ముహమ్మద్ షరీఫ్ ల ప్రభావంతో రాసిన అభూత కల్పన దృశ్యాలు వుంటాయి. గోర్కి ‘దాంకో మండే గుడెలు’ కూడ నాకు ఒక ప్రేరణ. ప్రచురణ కోసం సృజనకు పంపించాను. ఆ కథను సృజన సాహితీ మిత్రులు రెండుసార్లు చదివి అంతిమంగా తిరస్కరించారు. కథా వస్తువు బాగుంది శిల్పం బాగోలేదనో, శిల్పం బాగుంది కథా వస్తువు బాగోలేదనో కారణాలు చెప్పారు. అంతిమంగా వాళ్ళు చెప్పింది ఏమంటే పోరాట కథలు రాయాలని. ఆ రోజుల్లో పోరాట కథలు రాసే ప్రాంతీయ, భౌగోళిక అవకాశం కేవలం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అల్లం రాజయ్యకే వుంది. ఆ పిదప బిఎస్ రాములుకు వుంది. మరి ఇతర ప్రాంతాల వాళ్ళు ఏం రాయాలీ? అనేది సందేహంగానే వుండిపోయింది.  ఆ సమయానికి అది ఒక మంచికథ అని నేను భావించాను. అచ్చుకాకపోవడంతో నేను చాలా నిరుత్సాహ పడ్డాను. కుంగుబాటుకు కూడ గురయ్యాను.

            అప్పటికి నాకు మార్క్వెజ్ తెలీదు. మ్యాజికల్ రియలిజం కూడా తెలీదు. తెలిసుంటే గట్టిగానే వాదించి వుండేవాడిని. అలా నాలోని కథకునికి నా  విరసం “పోరాట ప్రాంత మిత్రులు’ చాలా అన్యాయం చేశారు. దాదాపు 35 యేళ్ల తరువాత కొంచెం శైలి మార్చి ‘మదరసా మేకపిల్ల’ రాశాను. నేను 1980 నుండే మ్యాజికల్ రియలిజం శైలిని కొనసాగించి వుంటే చాలా బాగుండేదని అప్పుడప్పుడు బాధగా వుంటుంది.

ఆంధ్రజ్యోతి వ్యాసం కూడ పంపితే ఆనందిస్తాను.

మిత్రుడు
డానీ